సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
స్థలానికి పట్టా చేయకపోవడంతో మనస్తాపం
వికారాబాద్ టౌన్: అధికారులు సర్టిఫికెట్ ఇచ్చిన స్థలాన్ని పట్టా చేయాలని ఆయన ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగాడు. కాగా, సదరు స్థలం తమదంటూ మున్సిపల్, మార్కెట్ కమిటీ అధికారులు పేచీ పెట్టారు. జీవనాధారమైన స్థలం కోల్పోతానేమోనని మనస్తాపం చెందిన ఆయన కలెక్టర్‌కు విన్నవించాలనుకున్నాడు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించిన ఈ ఘటన మంగళవారం జరిగింది. పట్టణంలోని ఎడ్ల బజార్ సమీపంలో ఉండే లక్ష్మయ్య(55)కు వికలాంగురాలైన భార్య బాలమణి, ముగ్గురు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఆయన స్థానిక మార్కెట్‌లో ఎద్దుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
వికారాబాద్ సుభాష్‌నగర్ రోడ్డులో 1961 నుంచి సర్వేనంబర్ 20లో ఆయన 260 గజాల స్థలం కబ్జాలో ఉంది. కాగా, తన ఐదుగురు అన్నదమ్ములతో కలిసి అందులో పాక వేసుకొని గేదెలను సాకుతున్నాడు. సదరు స్థలం తనకు కేటారుుంచాలని లక్ష్మయ్య అప్పటి సీఎం చంద్రబాబుతో పాటు పలువురు కలెక్టర్లను వేడుకున్నాడు. దీంతో అధికారులు 1998లో ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చారు. స్థలాన్ని పట్టా చేసుకోవాలని లక్ష్మయ్య మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా మార్కెట్ కమిటీ వాళ్లు స్థలం తమదంటూ పేచీ పెట్టారు. దీంతో వ్యవహారం కోర్టులో నడుస్తోంది. స్థలం పట్టా చేసిస్తామని ఇటీవల లక్ష్మయ్య నుంచి మార్కెట్ కమిటీ అధికారులు రూ.3లక్షలు కట్టించుకొని అనంతరం వేధించసాగారు.
రెండు శాఖల అధికారులు ఇబ్బంది పెట్టడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో మనస్తాపం చెందిన లక్ష్మయ్య సబ్‌కలెక్టర్ కార్యాలయానికి వీడియో కాన్ఫరెన్‌స కోసం వచ్చిన కలెక్టర్ దివ్యను కలిసి విన్నవించుకోవాలని భావించాడు. ఆమె అందుబాటులో లేకపోవడంతో తనతో తెచ్చుకున్న పురుగులమందును కార్యాలయం దగ్గర తాగేశాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని పట్టణంలోని మిషన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. లక్ష్మయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.