సాక్షి, రంగారెడ్డి జిల్లా: రెవెన్యూ అధికారులు, పూజారి వారసులు కలిసి ఏకంగా ఆంజనేయస్వామి భూములకే ఎసరు పెట్టారు. పహాణీలు, ధరణిలోని నిషేధిత జాబితాను పక్కన పెట్టి ఏకంగా 34 ఎకరాల దేవాదాయ భూమికి ఓఆర్‌సీ జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం అక్కడ ఎకరం రూ.కోటి వరకు పలుకుతుండటంతో ఎలాగైనా ఈ భూములను కొట్టేయాలని పక్కాగా ప్లాన్ చేశారు.
మాడ్గుల మండలం అర్కపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 88లో 9.18 ఎకరాలు, సర్వే నంబర్ 79/ఎ4లో 20 గుంటలు, సర్వే నంబర్ 283లో 11 ఎకరాలు, సర్వే నంబర్ 241లో 11.06 ఎకరాల భూమి ఆంజనేయస్వామి దేవాలయం పేరున ఉంది. ఈ భూమికి అప్పటి ఆలయ పూజారి పప్పు లక్ష్మయ్య దంపతులను రక్షిత కాపలాదారుగా నియమించి, ఆ మేరకు రికార్డుల్లో వారి పేర్లను నమోదు చేశారు.
భూమి కౌలు ద్వారా వచ్చి న డబ్బులతో ధూపదీప నైవేద్యాలు సమకూర్చా ల్సి ఉంది. ఆశించినస్థాయిలో కౌలు రాక, ఆలయ నిర్వహణ భారంగా మారి పూజారి లక్ష్మయ్య దంపతులు సుమారు 40 ఏళ్ల క్రితమే ఊరు విడిచి వెళ్లారు. అప్పటి నుంచి ఆలయ నిర్వహణ బాధ్యతను గ్రామస్తులే చూసుకుంటున్నారు. పహాణీల్లోనే కాదు ధరణి పోర్టల్‌లోనూ ఈ భూములు ఆంజనేయస్వామి దేవాలయం పేరునే రికార్డు అయి ఉన్నాయి.
గుడ్డిగా ఓఆర్‌సీ జారీ చేసిన రెవెన్యూ..
తాజాగా ఈ భూమి తనదేనని, ఆయా భూములను తమ పేరున మార్చాల్సిందిగా కోరుతూ ఆలయ పూజారి కుమారుడు ఫైల్ నంబర్ 6820/2022న రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన అడిగిందే తడవుగా రెవెన్యూ అధికారులు ఓఆర్‌సీ జారీ చేశారు. ఈ విషయం తెలిసి ఆలయ కమిటీ, గ్రామ పంచాయతీ సభ్యులు సహా దేవాదాయశాఖ కమిషనర్ అప్రమత్తమయ్యారు. ఈ భూమిపై లావాదేవీలతో పాటు రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఓఆర్‌సీని సైతం నిలిపి వేయాల్సిందిగా కోరుతూ దేవాదాయశాఖ కమిషనర్ సహా గ్రామ పంచాయతీ సభ్యులు రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
నేడు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఆఫీసులో విచారణ
జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) తిరుపతిరా>వు ఆర్డీఓ జారీ చేసిన ఓఆర్‌సీని నిలిపివేయడంతో పాటు రెవెన్యూ కోర్టుకు ఈ కేసును సిఫార్సు చేశారు. శనివారం ఉదయం ఇబ్రహీంపట్నం రెవెన్యూ కోర్టులో ఈ అంశంపై ఇటు దేవాదాయశాఖ, అటు పూజారి వారసులు, ఆంజనేయస్వామి దేవాలయం కమిటీ సభ్యుల సమక్షంలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు.
పరిశీలించకుండానే మ్యుటేషన్!
అర్కపల్లి రెవెన్యూ గ్రామానికి ఆనుకునే సర్వే నంబర్ 95/2లో సుమారు ఆరు ఎకరాల వ్యవ సాయ భూమి ఉంది. రైతు ఇప్పటికే దీనిలో కొంత భాగాన్ని స్థానికులకు గుంటల్లో విక్రయించాడు. ప్రస్తుతం ఆ భూమిలో నివాసాలు కూడా వెలిశాయి. రెవెన్యూ రికార్డుల్లో గ్రామకంఠం భూమిగా రికార్డు చేశారు.
ఇప్పటికే విక్రయించ గా మిగిలిన పది గుంటల భూమిని తన పేరున మ్యుటేషన్ చేయాల్సిందిగా సదరు రైతు ఇటీవల రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా, కనీస రికార్డులను పరిశీలించకుండా ఏకంగా నివాసాలు వెలిసిన భూమిని సైతం అమ్మిన రైతు పేరున మ్యుటేషన్ చేయడం గమనార్హం. భూ రికార్డుల నిర్వహణలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదో నిదర్శనం.
Comments
Please login to add a commentAdd a comment