Dharani website
-
స్వతంత్రంగా ధరణి ఫోరెన్సిక్!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ ద్వారా రాష్ట్రంలో జరిగిన భూముల క్రయ, విక్రయాలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ఆడిటింగ్ చేసే ఫోరెన్సిక్ బృందాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని భావిస్తోంది. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా భూ లావాదేవీల్లో జరిగిన అవకతవకలను గుర్తించే ప్రక్రియలో నిపుణులను మాత్రమే భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. జిల్లాలవారీగా భూములను ఆడిటింగ్ చేసేందుకు రెవెన్యూ శాఖలోని ఉన్నతస్థాయి అధికారులతో సంబంధం లేకుండా ఈ నిపుణుల బృందాలను నేరుగా ఆయా జిల్లాల కలెక్టర్లతో అటాచ్ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ బాధ్యతలు అప్పగించేందుకు హైదరాబాద్‌కు చెందిన రెండు, ముంబైకి చెందిన ఒక కంపెనీ సామర్థ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. రెవెన్యూ వ్యవహారాలు, సాఫ్ట్వేర్ అంశాల్లో ఆ కంపెనీల బలమే ప్రాతిపదికగా ఈ మూడింటిలో ఒక దానిని ఎంపిక చేయనుంది. ఇప్పటికే ధరణి పోర్టల్ వివరాల రీవ్యాంప్ ప్రక్రియ జరుగుతోంది. రానున్న 10–15 రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేసి, అనంతరం ఫోరెన్సిక్ ఆడిటింగ్ బాధ్యతలు అప్పగించే కంపెనీని ఎంపిక చేయాలన్న యోచనలో ప్రభుత్వ వర్గాలున్నట్టు సమాచారం. భూముల స్వాదీనమే! ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో భాగంగా తొలుత హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని భూముల లావాదేవీలను మాత్రమే పరిశీలించాలని ప్రభుత్వం భావించింది. తాజాగా సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భూ అక్రమాలు బయటపడటంతో రాష్ట్ర వ్యాప్తంగా అనుమానం ఉన్న ప్రతి లావాదేవీని ఫోరెన్సిక్ ఆడిటింగ్‌లో పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకు 2014 కంటే ముందు ఉన్న నిషేధిత భూముల జాబితాను ప్రాతిపదికగా తీసుకో నుంది. ఈ జాబితాలోని భూముల్లో ఎన్ని పట్టా భూములుగా మారాయి? ఎందుకు మారాయి? కోర్టు ఉత్తర్వుల పరిస్థితి ఏంటి? కోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారా? అసలు కోర్టు ఉత్తర్వులు నిజమైనవేనా? మాజీ సైనికుల పేరిట మార్చిన భూముల్లో ఎన్ని అసలైనవి? మాజీ సైనికులకు ఆవార్డు చేసినట్టు బోగస్ డాక్యుమెంట్లు సృష్టించారా? పనివేళల్లో జరిగిన లావాదేవీలెన్ని? అర్ధరాత్రి తర్వాత ఏయే లావాదేవీలు జరిగాయి? ఏ కంప్యూటర్ నుంచి జరిగాయి? అనుమతి ఇచ్చింది ఎవరు? అనే అంశాలను సాంకేతిక సమాచారంతో సరిపోల్చి ఏం జరిగిందో నిర్ధారించనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం అక్రమాలు జరిగాయని తేలిన పక్షంలో వెంటనే సదరు భూములను స్వాధీనం చేసుకొని.. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. -
నిషేధిత జాబితాలోని భూములే టార్గెట్ గా అక్రమాలు..
-
రైతుల సమాచారం దేశం దాటించారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘ధరణి పోర్టల్ అద్భుతమని, అమృతమని చెప్పారు. కానీ ఆ పోర్టల్ నిర్వహించిన కంపెనీ అరాచకాలు, దుర్మార్గం, దురాగతాలు చెప్పలేని స్థాయిలో ఉన్నాయి. కాంట్రాక్టు అగ్రిమెంట్‌ను ఉల్లంఘించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండి ధరణి పోర్టల్ నిర్వహించాలనే నిబంధనను పట్టించుకోలేదు. యజమానులు మారినప్పుడు ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వాలన్న అంశాన్ని పక్కన పెట్టారు. బెంగళూరు, విజయవాడ, గుర్గావ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండి తెలంగాణ భూముల క్రయ, విక్రయ లావాదేవీలు నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు. రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశం దాటించారు. రైతుల భూమి డాక్యుమెంట్లు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాలు, టెలిఫోన్ నంబర్లు దేశం దాటి వెళ్లిపోయాయి. ఇది తీవ్రమైన నేరం. దీనికి ఏ స్థాయిలో శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నింటినీ చదవాల్సిన పరిస్థితి..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘విదేశాల నుంచి కూడా లావాదేవీలు నిర్వహించారేమో ఇప్పుడు పరిశీలించాలి. భూముల రిజి్రస్టేషన్లు రాత్రి 9 గంటల నుంచి ఉదయం వరకు కూడా చేశారు. ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఖూనీ చేసి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’అని ఆయన వ్యాఖ్యానించారు. శుక్రవారం శాసనసభలో భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడారు. అన్ని పోరాటాలూ భూమి చుట్టూనే.. ‘తెలంగాణలో ప్రతి సమస్య భూమితో ముడిపడి ఉంది. అన్ని పోరాటాలు భూమి చుట్టూనే పరిభ్రమించాయి. పటేల్–పటా్వరీ వ్యవస్థ రద్దుకు కూడా భూసంబంధిత ఫిర్యాదులే కారణం. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మేలు జరిగేలా పాలకులు భూమి చట్టాలను రూపొందించారు. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ధరణి పేరుతో తానో అద్భుత సాంకేతిక నైపుణ్య ఆవిష్కరణ చేశానని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 80 వేల పుస్తకాలు చదివిన అనుభవాన్ని రంగరించి తయారు చేశానని చెప్పడంతో నిజంగానే భూమి సమస్యలు పరిష్కారమవుతాయేమోనని నేను కూడా ఓ సందర్భంలో భ్రమకు లోనయ్యా. కానీ ధరణి కేసీఆర్ సృష్టి కాదు.. 2010లోనే ఒడిశా రాష్ట్రంలో ఈ ధరణి పేరుతో భూ లావాదేవీలను నిర్వహించారు. ఆ పోర్టల్ నిర్వహించింది కూడా ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీనే. తెలంగాణలోనూ ధరణి పోర్టల్ ఆ సంస్థకే ఇచ్చారు. నాలుగేళ్ల తర్వాత కాగ్ ఈ కంపెనీ నిర్వాకం బయటపెట్టింది. ఎన్ఐసీ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను పక్కన పెట్టి, ఆ కంపెనీని తెచ్చి అద్భుతాన్ని, అమృతాన్ని సృష్టించామని కేసీఆర్ చెప్పారు. ఈ లోపభూయిష్ట సాంకేతిక నైపుణాన్ని తెలంగాణ ప్రజలపై ఎందుకు రుద్దారో తెలియాలి’అని రేవంత్ అన్నారు. యువరాజు సన్నిహితుడి సంస్థకు భాగస్వామ్యం ‘ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్‌తోపాటు అప్పటి యువరాజుకు సన్నిహితుడైన గాదె శ్రీధర్‌రాజుకు చెందిన మరో సంస్థ ఈసెంట్రిక్, విజన్ ఇన్ఫోటెక్‌లకు సంయుక్తంగా ఈ కాంట్రాక్టు ఇచ్చారు. అప్పటికే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ దివాళా తీసి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంది. కంపెనీ ప్రతినిధులు జైలుకెళ్లారు. ఆ తర్వాత టెర్రాసిస్ టెక్నాలజీ పేరుతో మరో అనుబంధ కంపెనీని తెచ్చారు. ఆ తర్వాత ఫాల్కన్ ఎస్జీ అనే ఫిలిప్పీన్స్ కంపెనీ, ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే సింగపూర్ కంపెనీ తెచ్చారు. ఆ కంపెనీకి గాదె శ్రీధర్‌రాజు సీఈవో అయ్యాడు. ఆ తర్వాత స్పారో ఇన్వెస్టర్స్, గేటెవే స్కై ప్రైవేట్ లిమిటెడ్ అనే సింగపూర్ కంపెనీలు, హిల్బ్రూక్ ఇన్వెస్ట్మెంట్స్ అనే బ్రిటిష్ వర్జిన్ ఐల్యాండ్ కంపెనీ, గేట్‌వే ఫండ్ 2ఎల్ఎల్పీ అనే కెమెన్ ఐల్యాండ్స్ కంపెనీలను సృష్టించారు. అక్కడి నుంచి పెరడిమ్ ఇన్నోవేషన్స్ ఎల్ఎల్సీ, క్వాంటెల్లా ఐఎన్‌సీ అనే అమెరికా కంపెనీలను తెచ్చారు. ప్రపంచంలో జరిగే ప్రతి ఆర్థిక నేరానికి మూలం కెమెన్, బ్రిటిష్ ఐల్యాండ్స్ దేశాల్లో ఉంటుంది. పై కంపెనీలు నిర్వహిస్తున్న వారెవరూ ఈ రాష్ట్రం కాదు కదా దేశ పౌరులు కూడా కాదు. ఈ విధంగా తెలంగాణ రైతుకు, రెవెన్యూ శాఖకు మధ్య జరిగే లావాదేవీలు, డిజిటల్ వెబ్సైట్ నిర్వహణ పేరుతో రాష్ట్రంలోని అన్ని భూముల వివరాలను విదేశీ కంపెనీల చేతుల్లో పెట్టారు. ప్రజల నమ్మకాన్ని వంచన చేసి, వారి భూముల వివరాలను విదేశీ కంపెనీలకు అప్పజెప్పిన వారిని ఏమనాలి?’అని సీఎం ప్రశ్నించారు. మేం తొందరపడితే రికార్డులన్నీ ట్రాష్ అయ్యేవి.. ‘మీరు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతోంది కదా.. ధరణిని ఏం చేశారని మమ్మల్ని అడిగారు. మేం విచారణకు ఆదేశించకుండా మౌనంగా ఉండడానికి కారణాలున్నాయి. మేము టెరాసిస్ నుంచి భూముల నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసీకి ఇచ్చాం. కానీ ఈ డేటా బదలాయింపునకు గాదె శ్రీధర్‌రాజు సహకరించడం లేదు. మేము తొందరపడి ఆదేశాలిస్తే ఎక్కడో విదేశాల్లో కూర్చుని ఒక్క బటన్ నొక్కితే తెలంగాణ భూ రికార్డులన్నీ క్రాష్ అయిపోయేవి. సర్వర్లు డౌన్ చేస్తే మళ్లీ రిపేర్, రీస్టోర్ చేయడానికి నెలలు పట్టొచ్చు. అందుకే ఆచితూచి వ్యవహరించాం. ధరణి నిజంగా అద్భుతమైతే కేసీఆర్ సభకు వచ్చి మమ్మల్ని అడిగి, కడిగి నిలదీయాలి కదా?’అని ముఖ్యమంత్రి అన్నారు. ధరణి విషయంలో నిద్రలేని రాత్రులు.. ‘అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని మేమంటే, మమ్మల్ని బంగాళాఖాతంలో వేయాలని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సభల్లో ఆయన ఆవేశంగా ఎందుకు ఊగిపోతున్నారో నాకు అర్థం కాలేదు. అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే ఇదంతా తెలిసింది. ధరణిని బంగాళాఖాతంలో వేసేందుకు సంవత్సరమంతా సాంకేతిక నిపుణులు, ప్రజలు, రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరిపాం. వందల సమావేశాలు పెట్టుకున్నాం. రెవెన్యూ మంత్రి పొంగులేటితో పాటు అధికారులు, నిపుణులు, ధరణి పోర్టల్ పునరి్నర్మాణ కమిటీ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారు. అన్నీ ఆలోచించి తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాం. దీన్ని సభ్యులందరూ ఆమోదించాలి.’అని సీఎం కోరారు. -
ధరణి పేరుతో లక్షల ఎకరాల స్కామ్
నల్లగొండ: ధరణి పేరుతో గత ప్రభుత్వం లక్షల ఎకరాల స్కామ్ చేసిందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లకు తగ్గకుండా సంపాదించుకుని రాష్ట్రాన్ని లూటీ చేశారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణిని తీసుకురావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్కామ్‌లు చేసి దోచుకున్నారని మండిపడ్డారు. ధరణితో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో భూభారతిని తీసుకొచ్చామన్నారు. ప్రతి రైతుకు గుంట భూమి ఉన్నా భూధార్ కార్డు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఇచి్చన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కోమటిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్, రూ.500కు గ్యాస్, ఉచిత కరెంట్‌తో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సంక్రాంతికి రైతు భరోసాను అందిస్తామని తెలిపారు. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు. సంక్రాంతికే ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోయడంతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నామని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్సార్ మహిళలను లక్షాధికారులను చేస్తే ప్రస్తుత సీఎం మహిళలను కోటీశ్వరులను చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నారని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి రక్తదానం తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నల్లగొండ ఎన్జీ కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో.. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రక్తదానం చేశారు. శిబిరంలో 200 మంది రక్తదానం చేసినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. -
అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు ‘ధరణి’ పవర్స్
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌కు వచ్చిన వివిధ కేటగిరీల పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా వాటికి తుది ఆమోదం తెలిపే అధికారాలను అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలకు కట్టబెడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ భూపరిపాలన విభాగం చీఫ్ కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిట్టల్ ఈ నెల 26న సర్క్యులర్ జారీచేశారు. ధరణి కమిటీ సిఫారసుల అమల్లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు.అదనపు కలెక్టర్లకు 4 కొత్త అధికారాలు అదనపు కలెక్టర్లు(రెవెన్యూ) కొత్తగా ధరణి సాఫ్ట్‌వేర్‌లోని నాలుగు మాడ్యూల్స్‌కు తుది ఆమోదం తెలిపే అధికారం పొందనున్నారు. మ్యూటేషన్ దరఖాస్తులు(టీఎం3), పీపీబీ–కోర్టు కేసు(టీఎం24), ఇళ్లు/ఇంటి స్థలంగా పేరు ఉన్న సందర్భంలో పీపీబీ/నాలా కన్వర్షన్ జారీ(టీఎం31), పాస్‌బుక్‌లో తప్పుల దిద్దుబాటు/పేరు మార్పు(టీఎం33)కు సంబంధించిన దరఖాస్తులకు ఆయన స్థాయిలోనే పరిష్కరిస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించిన విధివిధానా లను సైతం సీసీఎల్ఏ ప్రకటించింది. తొలుత తహసీల్దార్లు దరఖాస్తుదారులను విచారించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా వారి దరఖాస్తులను ఆర్డీ ఓలకు పంపించాలి. ఆర్డీఓలు దరఖాస్తు లను పరిశీలించి తమ ఆదేశాలను అప్లోడ్ చేయడం ద్వారా అదనపు కలెక్టర్లకు ఫార్వ ర్డ్ చేయాలి. తహసీల్దార్/ఆర్డీఓ సిఫారసుల ఆధారంగా అదనపు కలెక్టర్లు దరఖాస్తులను ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. ఒకవేళ దరఖాస్తులను తిరస్కరిస్తే అదనపు కలెక్టర్లు అందుకు సరైన కారణాలు తెలపాలి. ఆర్డీఓలకు మరిన్ని అధికారాలు..ఆర్డీఓలకు ఇప్పటికే ఉన్న ధరణి మాడ్యూల్ అధికారాలకు అదనంగా మరో నాలుగు మాడ్యూల్స్‌కు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది. అసైన్డ్ భూములతో సహా పట్టా భూముల వారసత్వ బదిలీ దరఖాస్తులు(టీఎం4), పెండింగ్ నాలా దరఖాస్తులు (టీఎం27), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(టీఎం 33), సర్వే నెంబర్ డిజిటల్ సైనింగ్(జీఎల్ఎం) దరఖాస్తులకు తుది ఆమోదం తెలిపే అధికారాన్ని వారికి కల్పించింది. గత ఫిబ్రవరి 28న ప్రకటించిన గడువుల్లోగానే దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకొని ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. -
బీఆర్ఎస్ నేతల చేతుల్లోఅసైన్డ్ భూములు
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించారని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు 26 లక్షల ఎకరాల భూములు పంచాయని, ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన తర్వాత.. వాటి పరిస్థితి ఏమిటో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్లు తేలితే, వాటిని తిరిగి అర్హులైన పేదలకు పంచుతామని వెల్లడించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కులాల లెక్కలు కొందరికి ఇష్టం లేదు రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత ఉందన్న లెక్కలు తీయటం కొందరికి ఇష్టంలేదని, అందుకే ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక సర్వేకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. ‘కులాలను విడగొడుతున్నామని విపక్షాలు మా ప్రభుత్వంపై నిందలేస్తున్నాయి. మేం కులాలను కొత్తగా సృష్టించడం లేదు. అవి శతాబ్దాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏయే కులం జనాభా ఎంత ఉన్నది? రాజ్యాంగం ప్రకారం అందరూ సమానంగా ఎదిగారా? అనేది సర్వే ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంతకాలం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బ్యాచ్ మళ్లీ దోపిడీ చేయాలని చూస్తోంది. అందరి లెక్కలు బయటకు వస్తే వాళ్లకు ఇబ్బంది’అని విమర్శించారు. హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం ఎన్నికల సమయంలో ఇచి్చన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించి, వారి పక్షాన ప్రభుత్వం ప్రతినెలా రూ.400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తోంది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే భూమి పూజ చేయబోతున్నాం. 15 రోజుల్లోనే రైతు రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం. రేషన్‌కార్డు ఉన్న అన్ని రైతుకుటుంబాలకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశాం. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా తప్పకుండా ఇస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం’అని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీ రామారావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనీస సంస్కారం లేకుండా జిల్లా కలెక్టర్‌ను సన్యాసి అంటారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఇమడలేకనే పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు. పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో బీజేపీ పతనం మొదలైందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మంత్రిని కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయని పేర్కొన్నారు. చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పాల్గొన్నారు. -
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే.. ప్రశ్నలు ఇవే..
తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఎన్ని ప్రశ్నలు ఉంటాయి, ఎలాంటి ధ్రువపత్రాలు అవసరమవుతాయనే దాని గురించి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కులగణనకు వేళయింది. బుధవారం (నవంబర్ 6) నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి సర్వేకు సంబంధించిన సమాచారం అందజేశారు. అయితే కులగణనలో ఎలాంటి ప్రశ్నలు ఉంటాయి, ఎన్ని ఉంటాయనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే నమూనా పత్రాన్ని మీడియాకు విడుదల చేసింది.సర్వేలో భాగంగా 75 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సివుంటుంది. సర్వే ప్రశ్నావళిని రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కుటుంబ వివరాలు.. అంటే ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. కాగా, సర్వేలో ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి.సర్వే జరిగేది ఇలా.. ముందుగా జిల్లా, మండలం, పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, ఇంటి నంబర్ వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు.పార్ట్-1లో కుటుంబ యజమాని పేరు, సభ్యుల పేర్లతో పాటు లింగం, మతం, కులం, వయసు, మాతృభాష, ఆధార్‌తో సహా 10 వివరాలు సేకరిస్తారు. కాగా, వీటన్నింటికీ ధ్రువీకరణ పత్రాలు చూపించాల్సి ఉంటుంది.మొబైల్ నంబరు, వైకల్యం, వైవాహిక స్థితి, విద్యార్హతలతో పాటు ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షిక ఆదాయం, ఐటీ ట్యాక్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తర్వాత క్రమంలో నమోదు చేస్తారు.వ్యవసాయ భూములు కలిగివున్నట్టయితే ధరణి పాస్‌బుక్ నంబర్‌తో పాటు భూమి రకం, నీటిపారుదల వనరు, కౌలు సాగుభూమి వివరాలు కూడా సేకరిస్తారు.రిజర్వేషన్ల నుంచి పొందిన విద్యా, ఉద్యోగ ప్రయోజనాలు.. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన పథకాల పేర్లు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈబీసీ సర్టిఫికెట్లు తీసుకున్నారా, సంచార తెగకు చెందివారా అనే వివరాలు కూడా సర్వేలో నమోదు చేస్తారు.రాజకీయ నేపథ్యం, ప్రభుత్వ పదవులు, ఇతర దేశాలు, రాష్ట్రాలకు వలసలు.. వలస వెళ్లడానికి కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది.గత 5 ఏళ్లలో రుణాలు తీసుకుని ఉంటే... ఏ అవసరం కోసం తీసుకున్నారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు వంటి వివరాలు పార్ట్-2లో పొందుపరిచారు. కుటుంబ సభ్యులందరి మొత్తం స్థిర, చరాస్తులతో ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు అడుగుతారు.చివరగా ఎన్యుమరేటర్‌కు అందించిన సమాచారం నిజమని ప్రకటిస్తూ కుటుంబ యజమాని సంతకం చేయాల్సి ఉంటుంది. తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళి pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
ధరణితో భూముల్ని దర్జాగా దోచేశారు : పీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్: ధరణి పోర్టర్ ప్రారంభం నుంచి రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ధరణి పోర్టల్‌పై ఆయన మాట్లాడుతూ.. ఊరు పేరు లేని సంస్థలకు ధరణిని అప్పగించారు. ఆ రెండు సంస్థలు కేటీఆర్,హరీష్ రావుకి లోపాయికారీ ఒప్పందంగా ఉండి దర్జాగా భూములు కొల్లగొట్టారని ఆరోపించారు.అందుకే ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం..కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ ఎన్ఐసీ (National Informatics Centre)కి అప్పగించినట్లు చెప్పారు. మూడేళ్ల నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న ఆయన పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పొందంలో పేర్కొందని తెలిపారు. బీజేపీ నేతలు మాట్లాడే దానికి అర్ధం ఉండాలి. మతాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం మంచిదికాదు. ప్రతి అంశంతో ఓట్లు దండుకోవాలనుకోవడం అవివేకం. వామపక్ష భావజాలంతో ఉండి..బీజేపీకి వెళ్ళింది మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కదా అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్రం ఇచ్చిన వాగ్దానాలు ఎంతమేర నెరవేర్చారు అని ఈటల ప్రధాని మోదీని అడగాలని సూచించారు. -
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఎన్ఐసీ చేతికి ధరణి
-
ఎన్ఐసీ చేతికి ‘ధరణి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రికార్డులను నిర్వహిస్తున్న ధరణి పోర్ట ల్ను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మే టిక్స్ సెంటర్ (ఎన్ఐసీ)కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న టెరాసస్ కంపెనీ గడువు ఈనెల 29తో ముగియనున్న నేపథ్యంలో రానున్న మూడేళ్లపాటు ఈ బాధ్యతను ఎన్ఐసీకి అప్పగిస్తు న్నట్లు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. టెరాసస్ నుంచి పోర్టల్ నిర్వహణ చేపట్టేందుకు నెల రోజుల సమ యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్ 30 నుంచి మూడేళ్లపాటు ధరణి పోర్టల్‌ను ఎన్ఐసీ అధికారికంగా నిర్వహించనుంది. ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబర్ 29 నుంచి ఐఎల్ఎఫ్ఎస్ (ఆ తర్వాత టెరాసస్గా మారింది)కు రికార్డుల నిర్వహణ బాధ్యత అప్పగించగా నాలుగేళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం పరిధిలో పనిచేసే ఎన్ఐసీకి తెలంగాణలోని భూముల రికార్డుల బాధ్యత అప్పగించడం గమనార్హం. ఈ మార్పుపై ఈ నెల 26న జరిగే కేబినెట్ భేటీలోనూ చర్చించనున్నట్లు రెవెన్యూ వర్గాలంటున్నాయి. దీంతోపాటు కొత్త రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టం ముసాయిదాపైనా మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామా నికి రెవెన్యూ సిబ్బంది ఉండేలా మొత్తం 10,954 భూరక్షక్ (పేరు అధికారికంగా నిర్ణయించాల్సి ఉంది) పోస్టులకు కూడా మంత్రివర్గం అనుమతివ్వను ందని రెవెన్యూ వర్గాలు పేర్కొన్నాయి.స్వదేశీ సంస్థ చేతుల్లోకి ‘ధరణి’: పొంగులేటిఇప్పటివరకు విదేశీ çకంపెనీ అయిన టెరాసస్ చేతిలో ఉన్న ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను స్వదేశీ సంస్థ అయిన ఎన్ఐసీకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తొందరపాటు నిర్ణయాలతో తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా తెలంగాణ రైతాంగం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని... తెలంగాణలోని 1.56 కోట్ల ఎకరాల భూమిని విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని పొంగులేటి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు భూరికా ర్డుల నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించామని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోని 71 లక్షల మంది రైతుల ఖాతాల్లోని భూములకు రక్షణ ఏర్పడిందన్నారు. త్వరలోనే ధరణి సమస్యల నుంచి తెలంగాణ రైతాంగానికి విముక్తి కల్పిస్తామన్నారు. -
భూమి లేదు.. ఉన్నా హక్కుల్లేవు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భూముల సమస్యలు పేరుకుపోతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ స్పష్టం చేసింది. ఇందుకోసం కొత్త చట్టాలను, విధానాలను రూపొందించుకోవడంతోపాటు కొన్నిరకాల సంస్కరణలు, మరికొన్ని కొత్త పద్ధతులను అవలంబించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాలతో కూడిన నివేదికను అందజేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలను కూడా వెల్లడించింది.రాష్ట్రంలోని 56శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదని కమిటీ తమ నివేదికలో తెలిపింది. భూములున్న రైతాంగం కూడా హక్కుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొంది. రాష్ట్రంలోని 50శాతం మంది పట్టాదారులకు భూముల విషయంలో పలు సమస్యలు ఉన్నాయని.. వారికి సమగ్ర హక్కుల కల్పన ఇంకా పూర్తికాలేదని వెల్లడించింది. ఎప్పుడో నిజాం కాలంలో చేసిన భూముల సర్వే తర్వాత తెలంగాణలో సర్వేనే జరగలేదని, వెంటనే భూముల డిజిటల్ సర్వేకు పూనుకోవాలని సిఫార్సు చేసింది. కోర్టు కేసుల్లో భూములు నలిగిపోతున్నాయని, దశాబ్దాల తరబడి కోర్టుల చుట్టూ హక్కుల కోసం తిరగాల్సి వస్తోందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో 66శాతం సివిల్ కేసులే ఉన్నాయని.. ఇందులో భూవివాదాలే ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇక రెవెన్యూ కోర్టులను రద్దు చేసే నాటికి వాటిలో 25వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ఇంతవరకు పరిష్కారానికి నోచుకోలేదని తెలిపింది. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య 4 లక్షల ఎకరాల భూముల విషయంలో వివాదాలు ఉన్నాయని.. అటవీ శాఖ చెప్తున్న దానికి, ధరణిలో నమోదు చేసిన భూములకు 23.72 లక్షల ఎకరాల తేడా ఉందని వెల్లడించింది. వక్ఫ్, దేవాదాయ భూముల వివరాల్లో కూడా పొంతన లేదని తెలిపింది. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. క్షేత్రస్థాయిలో గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలని.. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రెవెన్యూ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలని సూచించింది. పహాణీలను డిజిటలైజ్ చేయాలని, గ్రామానికో రెవెన్యూ నిర్వాహకుడిని ఏర్పాటు చేయాలని కోరింది. అయితే, తమ సిఫారసులన్నీ ఏకకాలంలో అమలు చేయడం సాధ్యం కాదని.. అందుకే మూడు విభాగాల్లో ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. అందులో కొన్ని తక్షణమే చేపట్టాల్సి ఉండగా, మరికొన్ని స్వల్పకాలిక, ఇంకొన్ని దీర్ఘకాలిక వ్యూహాలు, ప్రణాళికలతో పరిష్కరించుకోవాల్సి ఉంటుందని నివేదికలో ధరణి కమిటీ స్పష్టం చేసింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలోని ముఖ్య సిఫారసులివీ.. గ్రామస్థాయిలోనే ల్యాండ్ గ్రీవెన్స్ వ్యవస్థ ఉండాలి. కమ్యూనిటీ పారాలీగల్ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి. రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. కలెక్టరేట్లు, ఐటీడీఏలు, సీసీఎల్ఏలో లీగల్ సెల్స్ ఏర్పాటు చేయాలి. ఆర్వోఆర్ కొత్త చట్టం తీసుకురావాలి. సాదాబైనామాల సమస్యను పరిష్కరించాలి. గ్రామీణ నివాస ప్రాంతాల (ఆబాదీ)ను సర్వే చేయాలి. – రాష్ట్రంలోని అన్ని భూములను రీసర్వే చేసి శాశ్వత భూఆధార్ ఇవ్వాలి. టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమల్లోకి తేవాలి. – అసైన్డ్ భూములన్నింటికీ పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ మంజూరు చేసి యాజమాన్య హక్కులు కల్పించాలి. సీలింగ్ భూములకు కూడా హక్కులివ్వాలి. – ఇనాం భూములకు ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికెట్ (ఓఆర్సీ) ఇవ్వాలి. ఆ ఓఆర్ఎసీ వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. – అటవీ, రెవెన్యూ శాఖల మధ్య ఉన్న భూముల సమస్యల పరిష్కారానికి జాయింట్ సర్వే చేపట్టాలి. అటవీ భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో మరోమారు నమోదు చేయాలి. – భూదాన బోర్డును ఏర్పాటు చేయాలి. భూదాన భూముల వివరాలను ధరణి పోర్టల్‌లో నమోదు చేయాలి. దేవాదాయ, వక్ఫ్ భూములను కూడా ధరణిలో పొందుపర్చాలి. – నిషేధిత భూముల జాబితా (22ఏ)ను సవరించాలి. అప్డేట్ చేయాలి. భూసేకరణ జరిగిన భూములను పట్టాదారు ఖాతాల నుంచి తొలగించాలి. – రాష్ట్రంలోని అన్ని భూచట్టాల స్థానంలో రెవెన్యూ కోడ్ (ఒకే చట్టం) అమల్లోకి తేవాలి. నల్సార్ న్యాయ వర్సిటీలోని ల్యాండ్ రైట్స్ సెంటర్‌ను అభివృద్ధి చేయాలి. – భూసంస్కరణల విషయంలో ప్రభుత్వానికి సహాయకారిగా ఉండేందుకు ‘ఇన్నోవేషన్స్ అండ్ లీగల్ సపోర్ట్ సెల్’ను ఏర్పాటు చేయాలి. – తహసీల్దార్ స్థాయిలో ల్యాండ్ సపోర్ట్ సెల్స్ ఏర్పాటు చేయాలి. గ్రామానికో భూమి నిర్వహణ అధికారిని నియమించాలి. – రెవెన్యూ సిబ్బంది సామర్థ్యాలు, పనితీరును మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వడం కోసం ల్యాండ్ అకాడమీని ఏర్పాటు చేయాలి. కొత్త ల్యాండ్ పాలసీ రూపొందించాలి. – కోనేరు రంగారావు, గిర్గ్లానీ కమిటీలతోపాటు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కేంద్ర ప్రభుత్వ’ సలహాలను పరిగణనలోకి తీసుకోవాలి. ల్యాండ్ గవర్నెన్స్ అసెస్మెంట్ రిపోర్టు తయారు చేయాలి. – ధరణి పోర్టల్‌ను ప్రభుత్వ ఏజెన్సీకి అప్పగించాలి. గతంలో జరిగిన ధరణి లావాదేవీలపై థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలి. – ధరణి పోర్టల్‌లో ఉన్న అన్ని మాడ్యూళ్ల స్థానంలో ఒక్కటే మాడ్యూల్ ఉంచాలి. పార్ట్–బీ భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. సేత్వార్, ఖాస్రా, సెస్లా, పాత పహాణీలను డిజిటలైజ్ చేయాలి. -
‘పార్ట్–బీ’పై ప్రత్యేక సదస్సులు!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను చిన్నచిన్న కారణాలు, కోర్టు కేసులు, ఆధార్‌కార్డు రికార్డుల ఆధారంగా పార్ట్–బీలో పెట్టారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో పార్ట్–బీలో చేరిన ఈ భూములకు ఇప్పటివరకు మోక్షం కలగలేదు. తమ పట్టా భూములను అకారణంగా పార్ట్–బీలో చేర్చారని, ఆ కేటగిరీ నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ సదరు భూముల యజమానులు కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అసలు ధరణి పోర్టల్‌లోని ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలో చాలామందికి తెలియదు, తెలిసి కొందరు దరఖాస్తు చేసుకున్నా, సమస్య పరిష్కారం కాక, కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో పార్ట్–బీ భూములు రెవెన్యూ వర్గాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షలకు పైగా ఎకరాలు పార్ట్–బీలో ఉన్నాయని, వెంటనే సమస్యలను పరిష్కరించాలని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ఇచ్చిన నివేదికలో సిఫారసు చేసింది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ ఇచ్చిన ఈ నివేదికలో ప్రత్యేక కార్యాచరణను ప్రతిపాదించింది. ధరణి కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పార్ట్–బీ భూముల గురించి గణాంకాలతో సహా వివరించింది. ఏ కారణంతో ఎన్ని ఎకరాల భూమిని పార్ట్–బీలో చేర్చారో లెక్కలు వెల్లడించిన ధరణి కమిటీ ఎలాంటి కారణాలు లేకుండానే 5,07,091 ఎకరాల భూములను పార్ట్–బీలో పెట్టారని, ఈ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేసింది. కమిటీ చేసిన సిఫారసులివే » పార్ట్–బీ భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధరణి పోర్టల్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించేందుకు తహసీల్దార్ లేదా డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ప్రతి మండలానికి 2–3 బృందాలు ఏర్పాటు చేయాలి. ళీ ఈ బృందాల్లో రెవెన్యూ సిబ్బందితో పాటు డీఆర్డీఏల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లు, పారా లీగల్ కార్యకర్తలు, వ్యవసాయ విస్తరణాధికారులు, పంచాయతీ కార్యదర్శులను నియమించి శిక్షణ ఇవ్వాలి. » అవసరమైనప్పుడు అటవీ, దేవాదాయ, వక్ఫ్ శాఖల అధికారులను కూడా చేర్చాలి. ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి అన్ని వివరాలను పరిశీలించి నివేదికలు తయారు చేయాలి. ళీ ఈ నివేదికల ప్రకారం సర్వే నంబర్ లేదా ఖాతానంబర్ వారీగా రైతులకు నోటీసులివ్వాలి. సేత్వార్, ఖాస్రా పహాణీ, సెస్లా పహాణీ, పాత పహాణీలు, 1బీ రిజిస్టర్, ధరణి పోర్టల్‌లోని వివరాలను పరిశీలించాలి. ఆ భూములు అసైన్డ్, ఇనాం, భూ బదలాయింపు నిషేధ పట్టిక, భూదాన్, వక్ఫ్, దేవాదాయ, అటవీ భూముల జాబితాలో ఉన్నాయో లేవో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ళీ గ్రామాల వారీగా పార్ట్–బీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహించి, అక్కడే తుది నిర్ణయం తీసుకోవాలి. -
‘ధరణి’ని ప్రక్షాళన చేస్తాం
నేలకొండపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించారు. సీసీ రోడ్లు, పల్లె దవాఖానా ప్రారంభించి బీపీ పరీక్ష చేయించుకున్నారు. సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా మారిందన్నారు. త్వరలో రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, నీటిపారుదల సంçస్థ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్‌బాబు, డీఎంహెచ్ఓ మాలతి, ఆర్డీఓ గణేష్ తదితరులు ఉన్నారు. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ధరణిపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై చర్చించారు.ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్న సీఎం.. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలన్నారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని సీఎం రేవంత్ చెప్పారు. -
ధరణికి ‘యాచారం’ దారి!
మేకల కల్యాణ్ చక్రవర్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామానికి చెందిన రమావత్ జగ్నాకు మూడెకరాల 26 గుంటల భూమి ఉంది. భూరికార్డుల ప్రక్షాళన తర్వాత వచ్చిన కొత్త పాస్‌బుక్‌లో రెండెకరాల 29 గుంటల విస్తీర్ణమే నమోదైంది. అంటే నికరంగా 37 గుంటలు తగ్గింది. కరెంటోతు జకాలి అనే మహిళకు ఎకరం 23 గుంటల భూమి ఉంటే.. కొత్త పాస్‌బుక్‌లో 20 గుంటలే నమోదైంది. ఇదే గ్రామానికి చెందిన నేనావత్ రాముకు చెందిన రెండెకరాల 3 గుంటల పొలాన్ని వివాదాస్పద భూమి అంటూ పార్ట్–బీలో పెట్టారు. కొత్త పాస్‌బుక్ ఇవ్వలేదు. ఇక గనమోని మల్లయ్యకు ఉన్న రెండెకరాల 14 గుంటల పట్టా భూమికి ఎమ్మార్వో ప్రొసీడింగ్స్ నంబర్ కూడా ఇచ్చారు. కానీ కొత్త పాస్‌బుక్ రాలేదు...‘లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్ (లీఫ్స్)’ స్వచ్ఛంద సంస్థ మంథన్ గౌరెల్లి గ్రామంలో నిర్వహించిన భూన్యాయ శిబిరానికి వచ్చిన రైతుల్లో ఓ నలుగురి సమస్యలివి. వారు తమ భూములకు సంబంధించిన ఆధారాలతో సహా వచ్చి మరీ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ నలుగురనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది రైతులు ధరణి పోర్టల్‌తో తిప్పలు పడుతున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ఎప్పుడూ లక్షన్నర నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా డ్రైవ్‌లు చేపట్టినా, అధికార వికేంద్రీకరణ జరిగినా ఈ దరఖాస్తులకు సంతృప్తస్థాయిలో పరిష్కారం లభించే అవకాశం కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే ‘లీఫ్స్’ అనే స్వచ్ఛంద సంస్థ యాచారం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన భూన్యాయ శిబిరాలు.. ధరణి సమస్యల గుర్తింపు, పరిష్కారానికి మార్గం చూపిస్తున్నాయి. సమస్యలెలా తెలుసుకున్నారంటే..? ఆయా గ్రామాల్లో భూన్యాయ శిబిరం ఏర్పాటుకు ముందే ప్రజలకు చాటింపు వేయించారు. శిబిరానికి వచ్చి భూసంబంధిత సమస్యలపై దరఖాస్తులు ఇవ్వా లని సూచించారు. శిబిరం జరిగిన రోజు న ‘భూమి సమస్యల వివరాలు’ పేరిట ప్రత్యేక ఫార్మాట్లో రూపొందించిన దరఖాస్తుల ద్వారా వివరాలు తీసుకున్నారు. భూయజమాని వ్యక్తిగత వివరాలు, భూమి ఖాతా నంబర్, పాసుపుస్తకం ఉందా లేదా? సర్వే నంబర్, సబ్ డివిజన్ నంబర్, విస్తీర్ణం, భూమి స్వభావం, భూమి సంక్రమించిన విధానం, ఏ విధమైన భూసమస్య ఉందనే వివరాలు అందులో ఉన్నాయి. ప్రతి సమస్యకు ఒక కోడ్ ఇచ్చి ఆ కోడ్ ప్రకారం దరఖాస్తులను పూర్తి చేయించి.. సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్‌లు తీసుకుని ఫైల్ చేశారు. రెండో దశలో.. ఆ దరఖాస్తులను పరిశీలించి, ఏ సమస్యలు ఎన్ని వచ్చాయి? పరిష్కారానికి అవసరమైన ఇతర డాక్యుమెంట్లు ఏవి అనే స్పష్టతకు వచ్చారు. ఈ వివరాలను రైతులకు చెప్పి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 14న యాచారం మండలంలోని మంథన్ గౌరెల్లి గ్రామంలో ప్రారంభమైన భూన్యాయ శిబిరాలు.. ఈ నెల 8న అదే గ్రామంలో ముగిశాయి. మొత్తం 10 గ్రామాల్లో కలిపి 2,200 దరఖాస్తులు వచ్చాయి. ఎక్కువగా ఏ సమస్యలు వచ్చాయంటే! భూన్యాయ శిబిరాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి చూస్తే.. యాచారం మండలంలోని 10 గ్రామాల్లో ఎక్కువగా అసైన్డ్ భూముల సమస్యలు ఉన్నాయి. అసైన్డ్ భూములు మ్యుటేషన్ కావడం లేదని, కొత్త పాస్‌పుస్తకాలు రాలేదని, వచ్చిన పుస్తకాల్లో విస్తీర్ణం తగ్గిందని దరఖాస్తులు వచ్చాయి. తర్వాత అత్యధికంగా నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చిన సమస్య కనిపించింది. ఇక సర్వే నంబర్లు మిస్సింగ్, సేత్వార్ సరిపోలకపోవడం వంటివాటితోపాటు పార్ట్–బీ కింద (కొత్త పాస్‌పుస్తకాలు రాని పట్టా భూములు) సమస్యల దరఖాస్తులు వచ్చాయి. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా పార్ట్–బీలో చేర్చిన 18 లక్షల ఎకరాల భూముల్లో.. సుమారు 5 లక్షల ఎకరాలను ఎందుకు చేర్చారో కూడా తెలియదని రెవెన్యూ నిపుణులు చెప్తున్నారు. ఆధార్ నంబర్ ఇవ్వలేదని 4 లక్షల ఎకరాలను ఈ జాబితాలో చర్చగా.. మొత్తంగా ఆధార్ సంబంధిత అంశాల ప్రాతిపదికన 6 లక్షల ఎకరాల విషయంలో ఇబ్బందులు వచ్చాయి. తర్వాతి దశలో ఏం చేస్తారు? ‘లీఫ్స్’ సంస్థ ఆధ్వర్యంలో రెండు దశల్లో దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన పూర్తయిన నేపథ్యంలో.. మిగతా పని అంతా రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంటుంది. అధికారులు గ్రామాల వారీగా భూరికార్డులను (సేత్వార్, పహాణీ, 1–బీ, ఇతర రికార్డులు) పరిశీలించి ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయాన్ని ప్రస్తావిస్తూ రిపోర్టు తయారు చేయాలి. తహసీల్దార్ స్థాయిలో జరిగే ఈ మూడో దశ పూర్తయ్యాక.. చివరిగా నాలుగో దశలో సమస్యకు పరిష్కారం చూపాల్సి ఉంటుందని లీఫ్స్ ప్రతినిధి ఎం.సునీల్‌కుమార్ వెల్లడించారు. ఈ పద్ధతిని రాష్ట్రమంతటా అమలు చేయడం ద్వారా భూసమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. రెవెన్యూ మంత్రికి నివేదిక! ఈ యాచారం పైలట్ ప్రాజెక్టు అధ్యయనం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా యాచారం మండలంలో జరిగిన భూన్యాయ శిబిరాల వివరాలను తెలుసుకున్నారని తెలిసింది. లీఫ్స్ సంస్థ ఈ అధ్యయనానికి సంబంధించిన నివేదికను త్వరలోనే రెవెన్యూ మంత్రికి అందజేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వం ఏం చేయాలి? వాస్తవానికి, రాష్ట్రంలోని వ్యవసాయ భూసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్‌కు గత నాలుగేళ్లలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 16 లక్షలు. అందులో 8లక్షలకు పైగా దరఖాస్తులను రెవెన్యూ వర్గాలు తిరస్కరించి ఉంటాయని అంచనా. ఇప్పుడు యాచారం మండలంలోని 10 గ్రామాల్లో వచ్చిన దరఖాస్తులను బట్టి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో సగటున 200 భూసమస్యలు ఉన్నాయని.. 11 వేల రెవెన్యూ గ్రామాల్లో కలిపి 22 లక్షల సమస్యలు ఉంటాయని అంచనా వేశారు. ఇప్పుడీ సమస్యలన్నింటినీ ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించడం ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. పరిష్కరించడమంటే దరఖాస్తులను తిరస్కరించడం కాదని.. కచ్చితమైన రికార్డు, వివరణలతో తగిన పరిష్కారం చూపాలని రెవెన్యూ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ సదస్సులను నిర్వహించినప్పుడు భూసమస్యలపై 21 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. అందులో 8లక్షలు పరిష్కారం అయ్యాయని చెప్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్లినప్పుడే భూసమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని.. ఇందుకు యాచారం మండలంలో చేపట్టిన అధ్యయనం దోహదపడుతుందని అంటున్నారు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వాలు చేసిందేమిటి? భూసమస్యల పరిష్కారం కోసం గత 20 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. 2006లో ఉమ్మడి రాష్ట్రంలోని వ్యవసాయ భూముల పాస్‌బుక్‌లకు యూనిక్ కోడ్ ఇచ్చారు. ఇందుకోసం ఏడాది వరకు సమయం పట్టింది. 2007–2011 మధ్య మండలానికి మూడు గ్రామాల చొప్పున దత్తత తీసుకుని... పారాలీగల్ కార్యకర్తల ద్వారా ప్రతి గ్రామంలో 15 రోజుల పాటు భూసమస్యల గుర్తింపు, పరిష్కరం ప్రక్రియ చేపట్టారు. 2009–10లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు ఉన్న భూముల పరిశీలన జరిగింది. అప్పుడే 5 లక్షల వరకు భూసమస్యలు ఉన్నట్టు గుర్తించారు. 2011–12 మధ్య రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆ సదస్సుల్లో మొత్తం 21 లక్షల దరఖాస్తులురాగా.. 8 లక్షల సమస్యలను పరిష్కరించారు. ఇక తెలంగాణ ఏర్పాటయ్యాక 2017 డిసెంబర్లో రాష్ట్రవ్యాప్తంగా భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. రైతులకు తెలంగాణ ప్రభుత్వం పేరుతో కొత్త పాస్‌పుస్తకాలు ఇచ్చారు. అనంతరం ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఆ పోర్టల్ ద్వారానే భూసమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం జరుగుతోంది. -
మీరు సస్పెండ్ చేస్తారా... నేను చేయాల్నా?
సాక్షి, హైదరాబాద్: ‘ఒక జిల్లాలో పెండింగ్ మ్యుటేషన్ దరఖాస్తులు 800 వరకు ఉన్నాయి. కానీ, గత నెల రోజుల నుంచి 30 అప్లికేషన్లు కూడా ప్రాసెస్ చేయలేదు. క్షేత్రస్థాయి అధికారులు ఏం చేస్తున్నట్టు? ధరణి పోర్టల్ కింద వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెబుతున్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. సరిగా పనిచేయని అలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి... లేదంటే నేనే సస్పెండ్ చేస్తా’అని శనివారం జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారుల వైఖరిలో మార్పు రావాలని, 10 రోజుల్లో సరైన పద్ధతిలో ధరణి దరఖాస్తులు పరిష్కరించకపోతే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. అదేవిధంగా దరఖాస్తు పరిష్కారానికి, మాన్యువల్ రికార్డుకు లింకు పెట్టవద్దని, వీలున్నంత మేర ఆన్లైన్లోనే దరఖాస్తులు డిస్పోజ్ చేయాలని, మాన్యువల్ రికార్డు లేదంటూ ధరణి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. జిల్లా కలెక్టర్లతో రెండు విడతల్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లో ఎన్ఆర్ఐ పాసు పుస్తకాలు, కోర్టు కేసులు, డేటా కరెక్షన్లు, నిషేధిత జాబితాలోని భూములు, కొత్త పాసు పుస్తకాల జారీ, నాలా, ఖాతాల విలీనం తదితర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన పరిష్కార మార్గాలపై మిత్తల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. గత 15 రోజుల్లో... ధరణి దరఖాస్తుల పురోగతిపై ఈనెల 14న నవీన్ మిత్తల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మళ్లీ వీడియో కాన్ఫరెన్స్ నాటికి గత 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25వేల దరఖాస్తులు పరిష్కారయ్యాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 3,779 దరఖాస్తులు, నల్లగొండలో 2,120, సిద్ధిపేటలో 1,880, నాగర్‌కర్నూల్‌లో 1,800 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. అయితే, అత్యల్పంగా భూపాలపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో 100 దరఖాస్తులు కూడా క్లియర్ కాలేదు. భూపాలపల్లిలో 65, సిరిసిల్లలో 97, కొత్తగూడెం జిల్లాలో 144 దరఖాస్తులు మాత్రమే గత 15 రోజుల వ్యవధిలో పరిష్కారమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. 1.50 లక్షలు తహశీల్దార్ల వద్దనే.. 15 రోజుల క్రితం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ధరణి దరఖాస్తుల పరిష్కార పురోగతి ప్రక్రియను పరిశీలిస్తే మొత్తం 2,59,404 దరఖాస్తులకుగాను 24,778 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. మిగిలిన 2.34 లక్షల దరఖాస్తుల్లో మెజార్టీ దరఖాస్తులు తహశీల్దార్ల వద్దనే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. మొత్తం దరఖాస్తుల్లో సుమారు 60 శాతం అంటే 1.48 లక్షల దరఖాస్తులు క్షేత్రస్థాయిలోనే పెండింగ్‌లో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇక, ఆర్డీవోల వద్ద మరో 20 శాతం అంటే 50 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతోనే మిత్తల్ కలెక్టర్ల సమావేశంలో తహశీల్దార్లు, ఆర్డీవోలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మొత్తంమీద అదనపు కలెక్టర్ల వద్ద 20వేల పైచిలుకు, కలెక్టర్ల స్థాయిలో 12 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ దరఖాస్తులు అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 36,463 ఉండగా, ఆ తర్వాత నల్లగొండలో 21,693 ఉన్నాయి. అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 1,410, భూపాలపల్లిలో 1,826 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉండటం గమనార్హం. పెండింగ్ దరఖాస్తులు ఏ స్థాయిలో ఎన్ని? తహశీల్దార్ల వద్ద: 1,48,182 ఆర్డీవోల వద్ద: 53,478 అదనపు కలెక్టర్ల వద్ద: 20,461 కలెక్టర్ల వద్ద: 12,505 మొత్తం పెండింగ్ దరఖాస్తులు: 2,34,626 -
విలువలే కాదు.. తప్పులూ సవరణ..!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సర్వే నంబర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో రిజిస్ట్రేటేషన్ విలువను సవరించినప్పుడు ఈ సర్వే నంబర్లోని ఎకరం వ్యవసాయ భూమిని ఎకరాల్లో కాకుండా పొరపాటున గజాల్లో నమోదు చేశారు. దీంతో ఈ సర్వే నంబర్లోని మొత్తం వ్యవసాయ భూమి విలువ గజాల్లోనే కనిపిస్తోంది. వ్యవసాయ భూమి కాబట్టి ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేటేషన్ జరుగుతుంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం గజాల లెక్కన చెల్లించాల్సి వస్తోంది. ఇది ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాదు.. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 50 వరకు దరఖా స్తులు వచ్చాయని సమాచారం. తాజాగా స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూములు, ఆస్తుల విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ సమస్యకు చెక్ పడనుంది. ఇలాంటి పొరపాట్లను సవరించే పనిలో ఇప్పుడు విలువల సవరణ కమిటీలు బిజీగా ఉన్నాయి. నాలుగింటిలో మూడు క్లియర్ రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణ జరిగినప్పుడు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నాలుగు రూపాల్లో ఈ విలువలను నమోదు చేస్తుంది. ఇందులో ఫామ్–1, 2ల కింద రాష్ట్రంలోని వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను నమోదు చేస్తుంది. ఫామ్–3 కింద గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, ఫామ్–4 కింద జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేస్తుంది. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమైన విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఫామ్–1,2,3ల నమోదు పూర్తయిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెపుతున్నాయి. ప్రస్తుతం ఫామ్–4 కింద హైవేల పక్కన ఉన్న వ్యవసాయ భూముల విలువలను నమోదు చేసే పని జరుగుతోంది. ఇందుకోసం రెవెన్యూ వర్గాల నుంచి సర్వే నంబర్ల వారీ వివరాలు తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రేటార్లు పనిలో పనిగా తప్పులు సవరించే పనిని కూడా ప్రారంభించారు. వ్యవసాయ భూమి గజాలుగా నమోదైన సర్వే నంబర్లను మళ్లీ ఎకరాల్లోకి మారుస్తున్నారు.29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. 29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం రిజిస్ట్రేటేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతోందని తెలుస్తోంది. స్టాంపులు, రిజిస్ట్రేటేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతోందని, ఈనెల 29 నాటికి అర్బన్, రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు తేవాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని చెపుతున్నాయి. -
3 నెలల్లో లక్ష దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: తమ భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధరణి పోర్టల్‌కు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వస్తున్నాయి. గత మూడు నెలల్లోనే లక్ష దరఖాస్తులు అందాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి లక్షల సంఖ్యలో దరఖాస్తులు పరిష్కరించినా, మళ్లీ ధరణి పోర్టల్‌లో దరఖాస్తుల సంఖ్య మొత్తం 2 లక్షలకు చేరినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి మూడో వారంలో ఎన్నికల కోడ్ అడ్డంకితో డ్రైవ్ ఆగిపోయినప్పటి నుంచి ఇటీవలి వరకు కొత్తగా లక్ష దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో ధరణి దరఖాస్తుల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ పురోగతిని పరిశీలించడంతో పాటు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం తహసీల్దార్లు, ఆర్డీవోలు, కలెక్టర్లకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనుంది. ధరణి కమిటీ చొరవతో.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2.45 లక్షల ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కలెక్టర్ల పని ఒత్తిడికి తోడు పోర్టల్‌లోని సాంకేతిక కారణాలతో చాలా దరఖాస్తులు ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉండిపోయాయి. దీంతో ధరణి పోర్టల్‌ను సంస్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ చొరవతో ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి ఈ ఏడాది మార్చినెల మొదటి వారంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందుకోసం ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే అదే నెలలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో స్పెషల్ డ్రైవ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. సాధారణ ప్రక్రియలో భాగంగా అడపాదడపా పరిష్కరించిన కొన్ని దరఖాస్తులు కలిపి మొత్తం 1.5 లక్షల దరఖాస్తులను పరిష్కరించారు. ఇంకా మిగిలిన దాదాపు లక్ష దరఖాస్తులకు తోడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ధరణి పోర్టల్‌కు వచ్చిన మరో లక్ష కలిపి ఇప్పుడు పెండింగ్ దరఖాస్తుల సంఖ్య మొత్తం 2 లక్షలకు చేరింది. ఈ నేపథ్యంలో సీసీఎల్ఏ మిత్తల్ శుక్రవారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విడతల వారీగా ఒక్కోసారి ఐదారు జిల్లాల కలెక్టర్లతో గంట పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్‌తో పాటు ప్రజావాణి, గ్రీవెన్స్ కార్యక్రమాల సందర్భంగా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయానికి నేరుగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విషయమై కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. -
ధరణి.. ఫుల్ చేంజ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో కీలకమైన ‘ధరణి’పోర్టల్‌ను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా పలు కీలక సిఫారసులు రూపొందుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం–2020ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ధరణి పునర్నిర్మాణ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చట్టంలో 12 సెక్షన్లు పొందుపరచగా దాదాపు అన్ని సెక్షన్లలో పెద్ద ఎత్తున సవరణలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ మార్పులను ప్రస్తుత చట్టంలోనే చేస్తారా? లేక చట్టాన్నే మారుస్తారా? అనే దానిపై నిర్ణయాధికారం ప్రభుత్వానికే వదిలేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.కోదండరెడ్డి, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్ల నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు నివేదికను రూపొందించే పనిలో నిమగ్నమైంది. వాస్తవానికి క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేసుకుని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే భాగస్వామ్య పక్షాలతో చర్చలు ముగిసేలోపే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మధ్యంతర నివేదికను ఇవ్వాలని కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోడ్ ముగిసిన వెంటనే ఈ నివేదికలోని సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం తాత్కాలిక చర్యలకు పూనుకుంటుందని, అనంతరం ధరణి కమిటీ ఇచ్చే పూర్తి స్థాయి నివేదికలోని సిఫారసుల మేరకు ధరణి పునర్నిర్మాణానికి అడుగులు పడతాయనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. సవరణ లేదా కొత్త చట్టం అనివార్యం!ధరణి పోర్టల్ పేరు మారాలన్నా, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో అధికార వికేంద్రీకరణ జరగాలన్నా చట్ట సవరణలు చేయడం లేదా కొత్త చట్టం అమల్లోకి తేవడం అనివార్యమని కమిటీ సిఫారసు చేయనుంది. అదే విధంగా ప్రస్తుతానికి ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియ ఎక్కువగా కలెక్టర్ల చేతిలో ఉంది. తాజాగా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ అధికారాలు కొన్ని అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు కట్టబెట్టినా వీటికి చట్టబద్ధత కలగాలంటే మాత్రం ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తప్పనిసరిగా చేయాలని కమిటీ భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో భూరికార్డుల నిర్వహణ ఎవరు చేపట్టాలి? రిజిస్ట్రేషన్లను ధరణి చట్టం ప్రకారం చేయాలా? స్టాంపుల చట్టం ప్రకారం చేయాలా? ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అధికారం ఎమ్మార్వోలకే ఉంచాలా? మళ్లీ సబ్ రిజి్రస్టార్లకు అప్పగించాలా? లేదా డిప్యూటీ తహసీల్దార్లకు కట్టబెట్టాలా? అన్న దానిపై కమిటీ నిశితంగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. కాగా తహసీల్దార్ల నుంచి ఈ అధికారాలను తప్పించాలనే యోచనలో కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక భూ రికార్డుల నిర్వహణ (ధరణి పోర్టల్) బాధ్యతలను ప్రైవేట్ కంపెనీకి కాకుండా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) లేదా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లకు అప్పగించాలని కూడా కమిటీ సిఫారసు చేయనున్నట్టు సమాచారం. పార్ట్–బీపై ప్రత్యేకంగా.. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను పార్ట్–బీ (నిషేధిత జాబితా)లో చేర్చారు. వీటికి సంబంధించి ఇప్పటివరకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదు. ఈ పాసు పుస్తకాల కోసం రైతులు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఇందులో 5 లక్షల ఎకరాలకు కనీసం ఎటువంటి కారణాలు చూపెట్టకుండానే పార్ట్–బీ ఆపాదించినట్టు తెలుస్తోంది. మిగిలిన వాటిలో కొన్నిటికి కోర్టు కేసులుండగా, కొన్నింటిని చిన్నచిన్న ఫిర్యాదుల ఆధారంగా పార్ట్–బీలో చేర్చారు. ఈ నేపథ్యంలో పార్ట్–బీ భూముల పరిష్కారానికి సంబంధించి కూడా మధ్యంతర నివేదికలో పలు సిఫారసులు పొందుపర్చనున్నారు. దరఖాస్తుల పరిష్కారం ఆగిందా?ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం ఓ నిరంతర ప్రక్రియ. అయితే అధికార వికేంద్రీకరణ లేని కారణంగా రాష్ట్రంలో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి. వీటిని పరిష్కరించేందుకు పునరి్నర్మాణ కమిటీ చొరవతో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గడువు ముగిసినా మరోమారు పొడిగించింది. కానీ ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో స్పెషల్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సాకుతో ధరణి సాధారణ కార్యకలాపాలను కూడా నిలిపివేశారని, తహసీల్దార్ల స్థాయిలో తప్ప మిగిలిన ఏ స్థాయిలోనూ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా టీఎం–33 కింద పెండింగ్‌లో ఉన్న లక్షకు పైగా దరఖాస్తుల్లో స్పెషల్ డ్రైవ్‌లో 20 వేల వరకు పరిష్కరించినా మిగిలిన వాటి జోలికి వెళ్లడం లేదని సమాచారం. ఇక జిల్లాల కలెక్టర్లు, సీసీఎల్ఏ స్థాయిలో ఏ దరఖాస్తును పరిష్కరించడం లేదని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పి తప్పించుకుంటున్నారని, వాస్తవానికి ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తులు పరిష్కరించడానికి కోడ్ అడ్డంకి కాదని, స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు మాత్రమే కోడ్ అడ్డంకి అని చెపుతున్నా ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విని్పస్తున్నాయి. మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ చేపట్టే నాటికి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులతో పాటు కొత్తగా వచి్చన మరో 50 వేలకు పైగా దరఖాస్తులు కలిపి మొత్తం 3 లక్షల దరఖాస్తులకు గాను ఇప్పటివరకు లక్షకు పైగా దరఖాస్తులు మాత్రమే పరిష్కారమైనట్లు సమాచారం. -
518 ఎకరాలు.. హాంఫట్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 11 గ్రామాల పరిధిలో.. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది. అత్య ధికంగా బ్యాతోల్‌లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్కల్లో 57 కాశీపూర్‌లో 41 ఎకరాలు, ఉత్తర్‌పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్‌లో మార్చేసి.. అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్భూములను ధరణి పోర్టల్‌లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్. -
కేంద్ర గుర్తింపు కలిగిన సంస్థతో ధరణి నిర్వహణ
శామీర్‌పేట్: కేంద్ర గుర్తింపు కలిగిన సంస్థతో ధరణి పోర్టల్‌ను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కమిటీ ధరణి ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా గురువారం మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల పరిధిలోని బొమ్మరాశిపేట గ్రామంలో ధరణి కమిటీ సభ్యులు పర్యటించారు. అనంతరం బొమ్మరాశిపేట రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కోదండరెడ్డి, ధరణి కమిటీ న్యాయ సలహాదారు సునీల్‌లు మాట్లాడుతూ.. బొమ్మరాశిపేట గ్రామంలో ధరణిలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని కొందరు అధికారులు, బడా బాబులు కుమ్మక్కై భూ సమస్యలను సృష్టించినట్లు గుర్తించామని తెలిపారు. ధరణిలో ఉన్న లోపాలను గుర్తించేందుకు బొమ్మరాశిపేట గ్రామంలో నెలకొన్న భూ సమస్యను ఓ కేస్ స్టడీగా పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేస్తామన్నారు. ధరణి వెబ్సైట్లో మార్పులు చేపట్టి, సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేస్తామని అన్నారు. రైతులెవరూ అధైర్య పడవద్దని, త్వరలోనే ప్రభుత్వం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని వారు భరోసా ఇచ్చారు. లొసుగులను వాడుకొని.. ధరణిలో ఉన్న లొసుగులను వాడుకొని కొందరు బడాబాబులు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బొమ్మరాశిపేట రైతులు ధరణి కమిటీ సభ్యుల ముందు వాపోయారు. 50 ఏళ్ల క్రితం 1,050 ఎకరాల భూమి కొనుగోలు చేసి సాగుచేస్తున్నామని, ఇటీవల కొందరు వ్యక్తులు వచ్చి ఆ భూమి తమదంటూ.. అధికారులతో కుమ్మక్కై భూములను బ్లాక్ లిస్ట్‌లో చేర్పించారని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. తమ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరుపుకోకుండా అడ్డుపడుతున్నారని, కొంత స్థలం అమ్మి కూతుళ్ల పెళ్లిచేయాలని ప్రయత్నించినా ధరణి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. -
17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు డ్రైవ్‌ను కొనసాగించాలంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, ఇంకా మిగిలిపోయిన దరఖాస్తులను క్లియర్ చేయడమే లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీసీఎల్ఏ సూచించారు. ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే: కోదండరెడ్డి, సునీల్ ధరణి పోర్టల్ విషయంలో తాము ఇప్పటివరకు ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక చికిత్స) మాత్రమే ఇస్తున్నామని, అసలు ట్రీట్మెంట్ను ఇంకా ప్రారంభించలేదని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, భూమి సునీల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్లో వారు విలేకరులతో మాట్లాడారు. గతంలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారం కోసమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్‌ను ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించిందని చెప్పారు. అయితే ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం నిరంతరం జరగాల్సిందేనన్నారు. గతంలో కలెక్టర్లు మాత్రమే ఈ దరఖాస్తులను పరిష్కరించేవారని, ఇప్పుడు తహశీల్దార్, ఆర్డీవోల స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరపడమే కాకుండా, పరిష్కారానికి నిర్దేశిత టైంలైన్ విధించామని తెలిపారు. ధరణి పోర్టల్ విషయంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, చట్టాలు, వ్యవస్థ, సాంకేతికతలో మార్పులు తీసుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాల పరిధిలో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదికలిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నా రు. ప్రస్తుతం చేపడుతున్నవి తాత్కాలిక చర్య లు మాత్రమేనని, 2, 3 నెలల్లో శాశ్వత పరిష్కారాలు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మాజీ ఎంపీ సంతోశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, నిషేధిత జాబితాలోని భూములను కూడా రాత్రికి రాత్రి బదలాయించుకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. -
‘ధరణి’ పరిష్కారం 'పేపర్‌పైనే'!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ భూముల సమస్యలకు పరిష్కారం కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్‌లో 76 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. ఆ వివరాలేవీ పోర్టల్‌లో అప్డేట్ కాలేదు. అంతేకాదు పోర్టల్‌లోని సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ పెట్టుకున్న గడువు కూడా ముగిసింది. అయినా ఇంకా పెద్ద సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు మిగిలిపోయాయి. దీనితో డ్రైవ్‌ను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల్లో మాత్రం గందరగోళం కనిపిస్తోంది. ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కంపెనీ అవసరమైన లాగిన్లు ఇవ్వకపోవడంతోనే దరఖాస్తుల పరిష్కార వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేకపోతున్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం నెరవేరలేదన్న భావనలో రెవెన్యూ వర్గాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గందరగోళం రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో పరిష్కారం కోసం వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 76,382 దరఖాస్తులను రెవెన్యూ యంత్రాంగం వివిధ స్థాయిల్లో పరిష్కరించింది. తహసీల్దార్, ఆర్డీవో, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో ఆయా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. కానీ ఆన్లైన్లో అప్డేట్ కాలేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి కేవలం కలెక్టర్లు, సీసీఎల్ఏ వద్ద మాత్రమే డిజిటల్‌తోపాటు అధీకృత లాగిన్లు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు లాగిన్లు లేవు. గతంలో తహసీల్దార్లకు డిజిటల్ లాగిన్లు ఇచ్చినా.. దరఖాస్తులను పరిష్కరించినట్టుగా పేర్కొని అప్డేట్ చేసే అదీకృత లాగిన్లు లేవు. అ«దీకృత లాగిన్లు ఇచ్చేందుకు మరో 10–20 రోజుల సమయం పడుతుందని ‘ధరణి’ నిర్వహణ కంపెనీ చెప్తున్నట్టు తెలిసింది. గడువు ముగిసిపోయినా.. స్పెషల్ డ్రైవ్ ప్రారంభానికి ముందే.. అన్నిస్థాయిల్లో అదీకృత లాగిన్లు ఇవ్వాలని పోర్టల్ నిర్వహణ కంపెనీని కోరినట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. కానీ కంపెనీ ఇప్పటివరకు ఆ లాగిన్లు ఇవ్వలేదని.. పరిష్కారమైన దరఖాస్తుల్లోని భూముల వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసే వీలు లేకుండా పోయిందని అంటున్నాయి. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం పెట్టిన గడువు కూడా ముగిసింది. దరఖాస్తులు ఇంకా భారీగా పెండింగ్‌లో ఉండటంతో డ్రైవ్‌ను పొడగించాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నిస్థాయిల్లో లాగిన్లు వచ్చేదాకా పరిష్కారమైన దరఖాస్తుల వివరాలన్నీ కలెక్టర్ల లాగిన్లకు పంపి అక్కడి నుంచి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడి మధ్య ఉన్న కలెక్టర్ల పరిధిలో ఈ ప్రక్రియ కష్టమని స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్‌కు అభ్యంతరం చెప్పినా..? వాస్తవానికి ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టవద్దనే చర్చ ఉన్నతస్థాయిలో జరిగినట్టు తెలిసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్ద జరిగిన చర్చల సందర్భంగా.. రెవెన్యూ శాఖలోని ముఖ్య అధికారి ఒకరు స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు అభ్యంతరం చెప్పారని, ఎన్నికల కోడ్ వస్తే ఆపేయాల్సి వస్తుందని సూచించారని సమాచారం. ఎన్నికల కోడ్‌కు, ధరణి సమస్యల పరిష్కారానికి ఎలాంటి సంబంధం ఉండదని.. 2017లో ప్రారంభమైన ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్‌తో ముడిపెట్టాల్సిన అవసరం లేదని ధరణి కమిటీలోని ఓ సభ్యుడు చెప్పడంతో స్పెషల్‌డ్రైవ్ ప్రకటన జరిగిందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించే సమయంలోనూ ఇలాంటి సమస్య వచ్చిందని తెలిసింది. రాష్ట్రంలో రెగ్యులర్ సీసీఎల్ఏను నియమిస్తేనే ధరణి సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం సాధ్యమవుతుందని సీఎంతో జరిగిన చర్చల సందర్భంగా ధరణి కమిటీలోని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నట్టు రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘ధరణి’పై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్నిస్థాయిల్లో లాగిన్లను ధరణి పోర్టల్ నిర్వహణ కంపెనీ ఎప్పటికి సమకూరుస్తుంది? స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏ మేరకు నెరవేరుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ధరణి పోర్టల్ సమస్యలపై తెలంగాణ సర్కార్ ఫోకస్
-
‘ధరణి’ అధికారాల బదలాయింపు!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలెక్టర్లకు మాత్రమే ‘ధరణి’దరఖాస్తుల పరిష్కార అధికారాలుండగా, వికేంద్రీకరణ ద్వారా తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ)కు కొన్ని అధికారాలు కట్టబెట్టనున్నారు. ధరణి పోర్టల్ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు రైతు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపు కసరత్తు చురుగ్గా సాగుతోంది. ఏ అధికారికి ఏ దరఖాస్తు పరిష్కరించే అధికారం ఇవ్వాలన్న దానిపై రెవెన్యూశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ♦ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 35 మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. ♦ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెండు మాడ్యూళ్లలో మాత్రమే 1.5 లక్షల దరఖాస్తులున్నాయని ధరణి కమిటీ గుర్తించింది. ♦ టీఎం 14 (గ్రీవెన్సెస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్) మాడ్యూల్లో 40,435 దరఖాస్తులు, టీఎం 33 (మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్) మాడ్యూల్లో 1.05 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ♦ మిగిలిన 33 మాడ్యూళ్లలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపునకు కసరత్తు జరుగుతుండగా, ముఖ్యమైన టీఎం 14, 33 మాడ్యూళ్లలో ఏ దరఖాస్తులు ఎవరు పరిష్కరించాలన్న దానిపై ధరణి కమిటీతో పాటు రెవెన్యూశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అవసరమైతేనే సీసీఎల్ఏకు ♦ ధరణి మాడ్యూళ్ల (టీఎం14, టీఎం33)లోని దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్‌తో పాటు సీసీఎల్ఏలకు అధికారాలు కల్పిస్తూ వికేంద్రీకరణ కసరత్తు జరుగుతోంది. ♦ టీఎం14లో ఆధార్ తప్పులు, ఆధార్ అందుబాటులో లేకపోవడం, తండ్రి, భర్త పేరులో తప్పులు, ఫొటో మిస్ కావడం, జెండర్, కులం తప్పుగా నమోదు కావడం, సర్వే నంబర్ మిస్సింగ్, తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు లేకపోవడంలాంటి సమస్యలున్నాయి. వీటిలో సర్వేనంబరు మిస్సింగ్ మినహా ఇతర సమస్యల పరిష్కార అధికారాలు తహసీల్దార్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ♦ సర్వేనంబరు మిస్సింగ్ దరఖాస్తుల పరి ష్కారం ఆర్డీఓలకు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక, టీఎం 33లో భాగమైన పాసుపుస్తకాల్లోని తప్పుల సవరణ, నోషనల్ ఖాతా (ప్రభుత్వ భూమి ఉండే ఖాతా) నుంచి పట్టాభూమిగా మార్పు, పాసు పుస్తకంలోని పేరుమార్పు, మిస్సింగ్ సర్వేనంబరు, భూమి వర్గీకరణ, భూమి స్వభావం, భూమి రకం, భూమి అనుభవదారుని పేరు లాంటి సమస్యలను పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లు, ఆర్డీఓల సి ఫారసులతో కలెక్టర్లకు అప్పగించనున్నారు. ♦ నోషనల్ ఖాతామార్పు అధికారం విషయంలో అవసరమైతే సీసీఎల్ఏ అనుమతి తీసు కునేలా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన మాడ్యూళ్లలో కొన్నింటిని అద నపు కలెక్టర్లు (రెవెన్యూ)కు అప్పగించనున్నారు. ఈ మేరకు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించే ప్రక్రియ త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి.