అమావాస్య.. ఆగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు | non agricultural land registration Started in telangana | Sakshi
Sakshi News home page

ఒడిదుడుకుల మధ్య వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

Published Tue, Dec 15 2020 2:38 AM | Last Updated on Tue, Dec 15 2020 11:30 AM

non agricultural land registration Started in telangana - Sakshi

నల్లగొండ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లో సన్నివేశమిది. తొలిరోజు ఒకే రిజిస్ట్రేషన్‌ నమోదవగా.. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు గుమిగూడిన దృశ్యం

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అమావాస్య కావడం, ప్రజలకు అవగాహన లేకపోవడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు, అదనపు ధ్రువపత్రాలు అవసరం కావడంతో రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోనూ తక్కువ సంఖ్య లోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు 107 స్లాట్లు బుక్‌ కాగా, అందులో 82 మాత్రమే పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వివిధ కారణాలతో 25 రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని సమాచారం. అయితే వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని 3 నెలల తర్వాత తొలిరోజు ప్రా రంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెల్లడిస్తోంది.

సర్వర్లు సహకరించలేదు..
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో తొలి రోజు చాలా సమస్యలు ఎదురుకావడంతో క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ ద్వారానే ప్రక్రియ పూర్తి చేస్తున్నా.. పూర్తి స్థాయిలో సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా స్లాట్‌ బుకింగ్‌ విషయంలో సర్వర్లు సహకరించలేదు. దీనికి తోడు భవనాలు, ఫ్లాట్లు, మార్ట్‌గేజ్, గిఫ్ట్‌ డీడ్‌లకు మాత్రమే అవకాశం ఇవ్వగా, ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కావట్లేదు. క్రయ, విక్రయదారుల వివరాలు నమోదు చేసుకోవడం వరకే ఆగిపోయింది. స్లాట్‌ అప్రూవల్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గతంలో ఉన్న ఇంటి పన్ను, కరెంటు బిల్లు నిబంధనకు తోడు పీ టిన్‌ పేరుతో స్థానిక సంస్థలు ఇచ్చే నంబర్‌ను నమోదు చేస్తేనే రిజిస్ట్రేషన్‌ ఫీజుకు సంబంధించిన వివరాలు కన్పిస్తున్నాయి. దీంతో చాలా మంది పీ టిన్‌ నంబర్‌ లేక స్లాట్‌ బుక్‌ చేసుకోవడం కుదరలేదు.

మరో సమస్య ఏంటంటే.. ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ జరగకపోయినా.. ఆ పోర్టల్‌లో నమోదైన ఆస్తులు, భూముల వివరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌ సహకరిస్తోంది. ఆ పోర్టల్‌లో నమోదు కాని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు జరగట్లేదని తొలి రోజు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లిన వారు చెబుతున్నారు. ఇక పాత చలాన్ల సమస్య, ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్‌ లాంటి సమస్యలు, సాక్షులను మార్చుకునే అవకాశం లేకపోవడం, వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్‌ చెల్లింపు లాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే డాక్యుమెంట్లు అన్నీ ఉండి, వెబ్‌సైట్‌లో పక్కాగా నమోదు చేసుకుంటే ఈ ప్రక్రియ సులభంగా ఉంటుందని, 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ పూర్తయి ఈ–పాస్‌బుక్‌ కూడా చేతికి వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించి మరింత సరళంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరపాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు.

సమస్యలపై కేబినెట్‌ సబ్‌కమిటీ భేటీ..
వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం తొలి భేటీ కానుంది. రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి చైర్మన్‌గా ఈ కమిటీని ప్రభుత్వం ఆదివారమే నియమించింది. తొలి రోజుతో పాటు మంగళవారం కూడా ఎదురైన సమస్యలను ఈ సబ్‌ కమిటీ పరిశీలించనుంది. వరుసగా నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన విధానాలను సిఫారసు చేస్తూ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది.

డాక్యుమెంట్‌ రైటర్ల పరిస్థితేంటి?
వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్‌ రైటర్లు, స్టాంపు పేపర్ల అవసరం లేకపోవడంతో ఇప్పటివరకు సబ్‌రిజిస్ట్రార్ల కార్యాలయాల వద్ద డాక్యుమెంట్లు రాసుకుని జీవిస్తున్న వేలాది మంది భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. ఏ స్థాయిలోనూ తమ అవసరం లేకపోవడం, వివరాల నమోదు మీ సేవకు అప్పగించడంతో డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని డాక్యుమెంట్‌ రైటర్లు నిర్ణయించినట్లు సమాచారం.

పాత చలాన్‌ చెల్లదంటున్నారు
‘రిజిస్ట్రేషన్లు నిలిచిపోకముందే నేను స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 5న రూ.90 వేల చలాన్‌ తీశాను. సెప్టెంబర్‌ 9 స్లాట్‌ ఇస్తే 8 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు పాత చలాన్‌ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్‌ చేయమంటే అవి చెల్లవంటున్నారు. పాత చలాన్‌లో 10శాతం కట్‌ అయి ఆనుంచి 12 నెలల్లో ఆ సొమ్ము తిరిగి జమ అవుతుందని చెపుతున్నారు. ఇప్పుడు మళ్లీ నేను రూ.90 వేలు పెట్టాలి. ఆ డబ్బులు లేక రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేకపోయాను.’ చొక్కారపు నర్సయ్య, హన్మకొండ

నా సోదరుడి వద్ద ఏడాది కిందట ఇల్లు కొన్నా. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని డాక్యుమెంట్లతో సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లా. కానీ రిజిస్ట్రేషన్‌ జరగాలంటే ఇంటి నంబర్, పీటీఐ నంబర్, నల్లా, కరెంట్‌ బిల్లులు కావాలన్నారు. అవేమీ తీసుకువెళ్లకపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగా.  – చక్కెర విజయ్‌కుమార్, సూర్యాపేట


ప్రధాన సమస్యలివీ..

  • స్లాట్లు పరిమిత సంఖ్యలోనే అనుమతి
  • ఇస్తుండటంతో సర్వర్లు ఇబ్బందులు పెడుతున్నాయి.
  •  ఖాళీ స్థలాలకు పూర్తి పన్ను కడితేనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అనుమతిస్తున్నారు.
  • మార్ట్‌గేజ్‌ రిజిస్ట్రేషన్ల కోసం డీడీ నంబర్‌ ఇస్తే ఎంటర్‌ చేయడానికి అవకాశం లేదు.
  • యజమాని మరణిస్తే వారి వారసుల పేర్లు నమోదు చేసే అవకాశం లేదు.
  • బిల్డింగులు, ఫ్లాట్లు, మార్ట్‌గేజ్, గిఫ్టు రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి.
  • జీపీఏలకు అవకాశం ఇవ్వలేదు. 
  • ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు వివరాలు నమోదవుతున్నా.. రిజిస్ట్రేషన్‌ పూర్తవ్వట్లేదు. 
  • రిజిస్ట్రేషన్‌ జరగకపోతే చలాన్‌ మురిగి పోతోంది. గతంలో 6 నెలలు చాన్స్‌ ఉండేది.
  • ఎన్‌వోసీ, బీఆర్‌ఎస్, బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్, మున్సిపల్, విద్యుత్‌శాఖల బిల్లు చెల్లింపుల ధ్రువ పత్రాలుంటేనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం
  • డాక్యుమెంట్‌లో నిర్మాణానికి సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలు ఇవ్వట్లేదు. 
  • సాక్షుల పేర్లు ముందే ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి వస్తుండటంతో ఎవరైనా రాకపోతే ఇతరులను సాక్షులుగా మార్చుకొనే వీల్లేదు.
  • పాత చలాన్లను అనుమతించట్లేదు.
  • రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్, ఈ–పాస్‌బుక్‌ సిటిజన్‌ లాగిన్‌లో కనిపించట్లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement