సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా ధరణి వెబ్‌సైట్ ద్వారా మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ‘నాలా’ (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్‌మెంట్) మార్పిడి అధికారాలను ఆర్డీవో నుంచి తహసీల్దార్‌కు బదలాయించింది. వారికి లాగిన్ ఇచ్చే ప్రక్రియకు గురువారం నుంచి శ్రీకారం చుట్టనుంది. ఇక నుంచి నాలా (వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునే ప్రక్రియ) వ్యవహారం పూర్తిగా తహసీల్దార్ల పరిధిలోకి రానుంది. గతంలో తహసీల్దార్ ఇచ్చే నివేదిక ప్రకారం ఆర్డీవోలు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చేవారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన రెవెన్యూ చట్టంలో ఆ అధికారాలను తహసీల్దార్లకు బదలాయించారు. ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా.. ఆ అధికారాలు ఇంకా తహశీల్దార్లకు బదలాయించలేదు. ఇప్పుడు ధరణిలో తహశీల్దార్లకు నేటి నుంచి లాగిన్ ఇవ్వనుండటంతో వీలున్నంత తక్కువ సమయంలోనే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునే వీలు కలగనుంది.
లక్షల్లో పెండింగ్..
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు కాకముందు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు జరిగి మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నవి లక్షల సంఖ్యలోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ పెండింగ్ మ్యుటేషన్లు 2 లక్షల వరకు ఉంటాయని సమాచారం. అయితే ధరణి పోర్టల్‌లో పెండింగ్ మ్యుటేషన్‌ల పరిష్కారానికి తహశీల్దార్లకు ఆప్షన్ ఇచ్చినా ప్రాసెస్ కావడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో పెండింగ్ మ్యుటేషన్ల సమస్య అలానే ఉండిపోతోంది. ఈ సమస్యను బుధవారం.. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టెస్రా) అధ్యక్ష, కార్యదర్శులు వంగా రవీందర్‌రెడ్డి, గౌతంకుమార్‌లు సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్ సానుకూలంగా స్పందించడంతో ఈ సమస్య కూడా పరిష్కారమవుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు పెద్ద ఎత్తున సమస్యలు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరిస్తేనే ప్రక్రియ సజావుగా సాగుతుందని రెవెన్యూ సంఘాలు అంటున్నాయి.
సీఎస్‌కు ట్రెసా ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలివీ..
– ధరణిలో వ్యవసాయ రిజిస్ట్రేషన్లపై కోర్టులు స్టే విధిస్తే.. ఆ స్టే ఉత్తర్వులను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తహశీల్దార్లు కలెక్టర్లకు పంపే అవకాశం లేదు.
– నిషేధిత జాబితాలోని భూముల వివరాలు పోర్టల్‌లో పూర్తి స్థాయిలో కన్పించట్లేదు. దీంతో అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు పొరపాటున పట్టా భూములుగా నమోదైతే వాటి రిజిస్ట్రేషన్లను నిలువరించే అవకాశం లేకుండాపోతోంది.
– ధరణి కంటే ముందే జరిగి పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, విరాసత్‌లను ధరణిలో నమోదు చేయలేదు.
– గతంలో కొన్ని భూములను అమ్మి రిజిస్ట్రేషన్ చేసినా.. ఆ భూములు కొనుగోలుదారుడి పేరిట మ్యుటేషన్ కావట్లేదు. దీంతో గతంలో అమ్మిన వ్యక్తి మళ్లీ ఇంకొకరికి అమ్ముకునే అవకాశం ఉంది.
– గతంలో జీపీఏ చేసుకున్న వారు మరొకరికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ధరణిలో ఇవ్వలేదు.
– అపరిష్కృతంగా ఉన్న డిజిటల్ సంతకాలు కాని ఖాతాలకు సంబంధించి అన్ని ఆప్షన్స్ తహశీల్దార్లకు ఇవ్వాలి.
– భూ రికార్డుల ప్రక్షాళనలో పరిష్కారం కాని పార్ట్–బి భూముల విషయంలో ప్రజల నుంచి తహశీల్దార్లపై ఒత్తిడి వస్తున్నందున వాటి పరిష్కారానికి తగిన మార్గదర్శకాలివ్వాలి.
– అధికారులు సెలవు పెట్టినప్పుడు ధరణి లాగిన్‌ను కలెక్టర్ నుంచి అదనపు కలెక్టర్లకు, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, ఆపరేటర్ల లాగిన్‌లను ఆర్డీవోలకు ఇవ్వాలి.
– ధరణి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల నకలును మీ–సేవ కేంద్రాల్లో ఇచ్చేలా ఆప్షన్ ఉండాలి.
– కొనుగోలుదార్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువ రిజిస్టర్ చేసే ఆప్షన్ ఇవ్వాలి.
– పార్టీషన్ భూముల విషయంలో మొత్తం భూమికి (పార్ట్‌కు కాకుండా) ఫీజు జనరేట్ అవుతున్నందున ఆ ఆప్షన్ మార్చాలి.
– ధరణిలో నమోదైన డేటాలో క్లరికల్ తప్పుల మార్పునకు అవకాశం ఇవ్వాలి.
ఏ డాక్యుమెంట్ అయినా ఓకే..
ఆన్‌లైన్ స్లాట్ ద్వారానే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు చేయాలని రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందిని రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషాద్రి ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు మార్గదర్శకాలు పంపారు. దీని ప్రకారం ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ కోసం క్రయ, విక్రయదారుల వివరాలు, ఆస్తి లావాదేవీల గురించి వివరాలు నమోదు చేయాలి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు ఆటోమేటిక్‌గానే వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. ఆ మేరకు మొత్తం స్టాంపు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే పార్టీలు వెబ్‌సైట్ ఫార్మాట్‌లో ఉన్న డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదంటే వాళ్లే సొంతంగా డాక్యుమెంట్లు తెచ్చుకోవచ్చు. ఆ డాక్యుమెంట్‌లోని వివరాల బాధ్యతను రిజిస్ట్రేషన్ల శాఖ తీసుకోదు. నిషేధిత ఆస్తులకు స్లాట్ బుకింగ్ కాకుండా ఆటోమేటిక్ లాక్ విధించారు. అయినా రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆ భూమి నిషేధిత జాబితా (22ఏ)లో ఉందో లేదో సబ్ రిజిస్ట్రార్లు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. స్లాట్ బుక్ అయిన తర్వాత నిర్దేశిత సమయంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు క్రయ, విక్రయదారులు, సాక్షులు వచ్చి ప్రక్రియ పూర్తి చేసిన రోజే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనల విషయంలో ఎక్కడ ఉల్లంఘన జరిగినా సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు తీసుకుంటారు. వ్యవసాయేత రిజిస్ట్రేషన్లు సజావుగా జరిగేలా జిల్లా రిజిస్ట్రార్లు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ స్థాయి అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుందని ఐజీ శేషాద్రి పంపిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నాలా రుసుము ఖరారు..
రాష్ట్రంలోని వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చుకునేందుకు చెల్లించా ల్సిన రుసుమును సర్కార్ ఖరారు చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో బేసిక్ విలువలో 2 శాతం, జీహెచ్‌ఎంసీయేతర ప్రాంతాల్లో 3 శాతం ఫీజు చెల్లించి నాలా మార్పిడి చేసుకోవచ్చని బుధవారం సీఎస్ సోమేశ్‌కుమార్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మార్పిడి ప్రక్రియ బుధవారం ప్రారంభమైందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ధరణిలో ప్రక్రియ షురూ.. తహసీల్దార్లకు లాగిన్ ఆప్షన్
Published Thu, Dec 17 2020 1:28 AM | Last Updated on Thu, Dec 17 2020 8:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment