రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: ధరణి పేరుతో గత ప్రభుత్వం లక్షల ఎకరాల స్కామ్ చేసిందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వేల కోట్లకు తగ్గకుండా సంపాదించుకుని రాష్ట్రాన్ని లూటీ చేశారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ధరణిని తీసుకురావడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్కామ్‌లు చేసి దోచుకున్నారని మండిపడ్డారు.
ధరణితో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో భూభారతిని తీసుకొచ్చామన్నారు. ప్రతి రైతుకు గుంట భూమి ఉన్నా భూధార్ కార్డు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఇచి్చన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్, రూ.500కు గ్యాస్, ఉచిత కరెంట్‌తో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. సంక్రాంతికి రైతు భరోసాను అందిస్తామని తెలిపారు. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు.
సంక్రాంతికే ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గులు పోయడంతో పాటు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నామని వెల్లడించారు. దివంగత సీఎం వైఎస్సార్ మహిళలను లక్షాధికారులను చేస్తే ప్రస్తుత సీఎం మహిళలను కోటీశ్వరులను చేసే ఉద్దేశంతో ముందుకు పోతున్నారని చెప్పారు.
మంత్రి కోమటిరెడ్డి రక్తదానం
తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నల్లగొండ ఎన్జీ కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో.. రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రక్తదానం చేశారు. శిబిరంలో 200 మంది రక్తదానం చేసినట్లు మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment