ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్‌ | Exchange of records along with land registration, passbook | Sakshi
Sakshi News home page

ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్‌

Published Wed, Apr 16 2025 6:07 AM | Last Updated on Wed, Apr 16 2025 6:07 AM

Exchange of records along with land registration, passbook

భూమి రిజిస్ట్రేషన్‌తోపాటే రికార్డుల మార్పిడి, పాసుపుస్తకం 

తహసీల్దార్లకు సుమోటోగా పాసుపుస్తకాలు జారీచేసే అధికారం 

భూభారతి మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ధరణి స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి పోర్టల్‌లో వచ్చే ప్రతి దరఖాస్తు పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణీత గడువు విధించింది. ఈ పోర్టల్‌లో భూమి రిజిస్ట్రేషన్‌ చేసిన వెంటనే ఆ భూమికి సంబంధించిన పాసుబుక్కు జారీ, భూమి క్రయ విక్రయ వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో మార్చటం వంటి అనేక వివరాలతో భూ భారతి చట్టం మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. 

మార్గదర్శకాలతో పాటు చట్టం అమలును గెజిట్‌ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్‌ జీవో నం: 36, 39లను విడివిడిగా జారీ చేశారు. జీవో 36 ప్రకారం భూభారతి చట్టం ఏప్రిల్‌ 14, 2025 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. జీవో 39 ప్రకారం చట్టం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటిని తెలంగాణ భూభారతి నిబంధనలు (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ ఇన్‌ ల్యాండ్‌)– 2025గా పిలుస్తారు. చట్టం అమల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయి.  
రికార్డుల తయారీ 
ఈ చట్టం కింద ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రకాల భూములకు సంబంధించిన రికార్డుల తయారీ, మార్పు చేర్పులు, నిర్వహణ జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ రికార్డులను భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆబాదీతో పాటు వ్యవసాయేతర భూములను సర్వే చేయడం ద్వారా ఆయా భూముల హద్దులను అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా నిర్ధారించి మ్యాపులు రూపొందించాల్సి ఉంటుంది. వ్యవసాయ, ఆబాదీ, వ్యవసాయేతర భూముల రికార్డుల తయారీ, నిర్వహణ కోసం ప్రభుత్వం ఎప్పుడైనా నోటిఫికేషన్‌ జారీచేసి మార్పులు, చేర్పులు చేయవచ్చు.  

దరఖాస్తు చేసిన 60 రోజుల్లో పరిష్కారం 
తమ భూ రికార్డుల్లో తప్పులు నమోదైనా, హక్కుల రికార్డులో వివరాలు లేకపోయినా సంబంధిత వ్యక్తి ఈ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరంలోపు నిర్దేశిత ఫీజు చెల్లించి భూభారతి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సవరణలు కోరవచ్చు. ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం గతంలో జారీచేసిన పాసు పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్, పహాణీలు లేదా రిజిస్టర్‌ డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లతో పాటు తాను చేసుకున్న దరఖాస్తు సరైనదేనని అఫిడవిట్‌ జత చేయాల్సి ఉంటుంది. 

ఈ దరఖాస్తులను ఆర్డీవోలు, జిల్లా కలెక్టర్లు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు. ఆర్డీవోలు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై అభ్యంతరాలుంటే ట్రిబ్యునల్స్‌కు రీఅప్పీల్‌ (మళ్లీ దరఖాస్తు) చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ వర్గాల నుంచి సంబంధిత వ్యక్తులకు నోటీసు వస్తుంది. ఈ నోటీసులపై సెకండ్‌ పార్టీ (దరఖాస్తుదారులు కాకుండా) వారం రోజుల్లోగా లిఖితపూర్వక అభ్యంతరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో సంబంధిత అధికారి నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. 

లిఖిత పూర్వక అభ్యంతరాలు సమర్పించిన పక్షంలో నోటీసులు అందిన వారం రోజుల తర్వాత సదరు అధికారి ఆ దరఖాస్తుపై విచారణ జరుపుతారు. విచారణ రిపోర్టుతోపాటు ఇరు పక్షాల నుంచి వచ్చిన సాక్ష్యాలను పరిశీలిస్తారు. నేరుగా వారు వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత సదరు అధికారి తగు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులను భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇదంతా నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.  

రిజిస్ట్రేషన్లు ఇలా.. 
ఏదైనా భూమిని రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ చేసుకునేందుకు భూభారతి పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి రిజిస్ట్రేషన్‌ కోసం తహసీల్దార్‌ను సమయం (స్లాట్‌) అడిగితే, ఆ మేరకు తహసీల్దార్‌ స్లాట్‌ కేటాయిస్తారు. స్లాట్‌ ఇచ్చిన సమయంలో ఇరు పక్షాలు సంతకాలు చేసిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ సమర్పించాల్సి ఉంటుంది. 

వీటి ఆధారంగా దరఖాస్తుదారుడు పేర్కొన్న వివరాలు హక్కుల రికార్డుతో సరిపోలాయా.. లేదా? ఆ భూమి నిషేధిత భూముల జాబితాలో ఉందా? అసైన్డ్‌ భూమినా? షెడ్యూల్డు ఏరియాలో ఉందా? అనే వివరాలను పరిశీలించి సదరు అధికారి రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే తహసీల్దార్‌ సంబంధిత రికార్డును కూడా భూభారతిలోమ మార్చాలి. ఈ వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను క్రయవిక్రయదారులిద్దరికీ ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన పాసు పుస్తకం కూడా వెంటనే జారీ చేయాల్సి ఉంటుంది.  

సాదా బైనామాల క్రమబద్ధీకరణ 
ఈ చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు లేకుండా తెల్ల కాగితాలపై భూ యాజమాన్య హక్కులను జూన్‌ 2, 2014 నాటికి మార్చుకున్నవారు.. తమ పేరిట ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేయాలని 2020, అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 10 వరకు చేసుకున్న దరఖాస్తులను ఈ చట్టం ప్రకారం పరిష్కరించవచ్చు. 

ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని ఆర్డీవో నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు దరఖాస్తుదారుడు అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటుంది. ఆర్డీవో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి సాదాబైనామా నిజమా కాదా అనేది నిర్ధారించి తగు నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఆ భూమి సీలింగ్, షెడ్యూల్డు ఏరియా, పీఓటీ (అసైన్డ్‌) చట్టాల పరిధిలోనికి రానిదై ఉండాలి. 

ఒకవేళ సాదాబైనామా కింద దరఖాస్తుదారునికి హక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. దానిని వారం రోజుల్లోగా ఇరుపక్షాలకు పంపుతారు. ఆ తర్వాత ఆర్డీవోనే సదరు భూమిని భూభారతి చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా నోటీసులిచ్చిన 90 రోజుల్లోపు పూర్తి కావాల్సి ఉంటుంది.  

వారసత్వ భూములపై హక్కులు 
వీలునామాల ఆధారంగా లేదా వారసత్వంగా వచ్చే భూములపై హక్కుల కోసం భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారసులందరూ అఫిడవిట్లు జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం వారసులందరికీ తహసీల్దార్‌ నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసును గ్రామపంచాయతీలు, తహసీల్దార్‌ ఆఫీసుల్లోని నోటీసు బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తారు. 

ఈ నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా దరఖాస్తుదారుడు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. తహసీల్దార్‌ వాటిని పరిశీలించి అవసరమైతే వారసులను విచారించి నిర్ణయం తీసుకుంటారు. ఇదంతా నోటీసులు జారీచేసిన 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో ఆ దరఖాస్తు ఆమోదింపబడుతుంది.  

మ్యుటేషన్‌కు 30 రోజులు గడువు..! 
కోర్టు ఆదేశాలు, లోక్‌అదాలత్‌ తీర్పులు, రెవెన్యూ కోర్టుల ఉత్తర్వులు, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్, సీలింగ్, భూదాన్, 1977 అసైన్డ్‌ చట్టం కింద ఇచ్చిన భూములు, ఇనామ్‌ల రద్దు చట్టం కింద ఓఆర్‌సీ, రక్షిత కౌలుదారు చట్టం కింద యాజమాన్య సర్టిఫికెట్లు, ఇండ్ల స్థలాల రూపంలో ఇచ్చిన భూములకు మ్యుటేషన్‌ కోసం భూభారతి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్డీవో నోటీసు ఇస్తారు. ఈ నోటీసు ప్రకారం ప్రత్యక్ష విచారణ లేదంటే రిపోర్టు తెప్పించుకోవడం ద్వారా డాక్యుమెంట్లను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ 30 రోజుల్లో పూర్తి కావాల్సి ఉంటుంది.  

ప్రతి భూ యజమానికి భూదార్‌ కార్డు 
భూభారతి పోర్టల్‌లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు తాత్కాలిక భూదార్‌ కార్డులు జారీ చేస్తారు. పోర్టల్‌లో పేరున్న ప్రతి ఒక్కరికీ ఈ కార్డులు జారీ అవుతాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు భవిష్యత్తులో ప్రతి భూమికి యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ (యూఐఎన్‌) ఇస్తారు. రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసి, ప్రతి భూమికి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా హద్దులు నిర్ణయించి ఈ కార్డులను జారీ చేయాల్సి ఉంటుంది. 

కొత్త పాసు పుస్తకాల జారీ 
కొత్త పాసుపుస్తకాల కోసం కూడా ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను తహసీల్దార్‌ పరిశీలించి హక్కుల రికార్డులోని వివరాల ఆధారంగా పాసుపుస్తకం కమ్‌ టైటిల్‌ డీడ్‌ జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌లో నమోదై భూ యజమానులందరికీ తహసీల్దార్లు సుమోటోగా పాసు పుస్తకాలు ఇవ్వొచ్చు. 

దేనికైనా నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హక్కుల రికార్డులో నమోదైన భూములను ఎప్పుడైనా లైసెన్సుడ్‌ సర్వేయర్‌ ద్వారా సర్వే చేయించుకోవచ్చు. ఈ సర్వే ద్వారా నిర్ధారించిన మ్యాప్‌ను పాసుపుస్తకాల్లో కూడా ముద్రించాల్సి ఉంటుంది. పాసు పుస్తకాల్లో తప్పులుంటే వాటిని సరిచేసుకునేందుకు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు భూభారతి పోర్టల్‌లో కల్పించారు.  

గ్రామ అకౌంట్ల నిర్వహణ 
గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. మ్యుటేషన్, రికార్డుల అప్‌డేషన్‌ జరిగినప్పుడు ఆ వివరాల ఆధారంగా అవసరాన్ని బట్టి గ్రామ పహాణీ, ప్రభుత్వ భూమి రిజిస్టర్, బదిలీ రిజిస్టర్, సాగునీటి సౌకర్యం రిజస్టర్‌లను మార్చాల్సి ఉంటుంది. ఏటా డిసెంబర్‌ 31 ఆర్ధరాత్రిలోపు గ్రామ అకౌంట్‌ వివరాలను సంబంధిత అధికారికి సమర్పించాలి.  

టైటిల్, కబ్జా, లేదంటే ఇతర సివిల్‌ అంశాల్లో ఎవరికి ఏ భూమిపై ఎలాంటి అభ్యంతరం ఉన్నా సంబంధిత సివిల్‌ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది.  

అప్పీళ్లతో పాటు రివిజన్‌ కూడా.. 
భూభారతి పోర్టల్‌ ద్వారా దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ వర్గాలు తీసుకునే నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. తహసీల్దార్ల నిర్ణయాలపై ఆర్డీవోలకు, ఆర్డీవోల నిర్ణయాలపై కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై ట్రిబ్యునల్‌కు అప్పీల్‌ చేసుకోవచ్చు. దరఖాస్తును బట్టి 30 నుంచి 60 రోజుల్లోపు ఈ అప్పీళ్లను పరిష్కరించాలి. 

ఎవరైనా, ఏ భూమిపై అయినా మోసపూరితంగా హక్కులు పొందారని భావిస్తే, ఆ భూమి గురించి భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) సుమోటోగా కూడా అనుమానాస్పద భూములపై విచారణ చేపట్టవచ్చు. రికార్డులు, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను పరిశీలించి అవసరమైతే సదరు భూమిని వెనక్కు తీసుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తోంది.  

ఉచిత న్యాయ సాయం.. 
పేద రైతులకు ఈ చట్టం ద్వారా ఉచిత న్యాయ సాయం కూడా అందుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు మండల, జిల్లా లీగల్‌ అథారిటీల సహకారంతో ఈ సాయాన్ని అందజేస్తారు. భూభారతి పోర్టల్‌ నిర్వహణ సీసీఎల్‌ఏ ఆదీనంలో ఉంటుంది. రికార్డుల తయారీ, నిర్వహణ, అప్‌డేషన్, సమయానుగుణంగా మార్పు చేర్పులు, ప్రభుత్వ అనుమతి మేరకు షెడ్యూళ్ల మార్పు, అవసరాలకు అనుగుణంగా ఆదేశాల జారీ, మార్గదర్శకాల రూపకల్పన అధికారాలన్నీ సీసీఎల్‌ఏ పరిధిలోనే జరుగుతాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement