Bhu Bharathi Portal
-
భూభారతిలో తప్పు చేస్తే కఠిన చర్యలు
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్/నాగిరెడ్డిపేట/లింగంపేట (ఎల్లారెడ్డి)/ నేలకొండపల్లి: భూభారతి చట్టం అమలులో అధికారులు తప్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. భూభారతి చట్టంపై వరంగల్ నగరం, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్పల్లి, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దే పల్లిలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లా డారు. ‘భూభారతి చట్టం అమలులో భాగంగా నాలుగు పైలట్ మండలాల్లో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులు బుధవారంతో ముగుస్తాయి. మే 5 నుంచి ప్రతీ జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తాం. జూన్ 2వ తేదీ నుంచి ఆగస్టు 15 వరకు రాష్ట్రంలోని ప్రతి రెవెన్యూ గ్రామా నికి అధికారులే వచ్చి సదస్సులు పెట్టి మీ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తారు’అని ప్రకటించారు. 15 రోజుల్లో గ్రామ రెవెన్యూ అధికారులు : మరో 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,986 రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను నియమిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 320 మంది సర్వేయర్లు ఉండగా, వారి సంఖ్యను వేయికి పెంచుతామని చెప్పారు. మరో 6 వేల మంది ప్రైవేట్ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి, లైసెన్స్‌లను అందజేసి రైతులకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ప్రతి నియోజకవర్గానికి 3 వేల నుంచి 4 వేల మంది యువతకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను వచ్చేనెల 5వ తేదీలోపు మంజూరు చేస్తామని ప్రకటించారు. సుర్దేపల్లి సభలో కల్యాణలక్ష్మి లబ్ధిదా రులకు చెక్కులు అందజేసి, గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.విలువైన భూములు కొట్టేసేందుకే ధరణి తెచ్చారు : బీఆర్ఎస్ నాయ కులు రాష్ట్రంలోని విలువైన భూములను కొట్టేసేందుకే ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎక్కడ చూసిన బీఆర్ఎస్ నాయకులు భూములు కబ్జా చేసి అక్రమంగా పట్టాలు చేసుకొని అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సమస్యలను ఒక్క రూపాయి ఖర్చులేకుండా పరిష్కరించేందుకే భూ భారతి చట్టం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఎంపీ సురేశ్ షెట్కార్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, మదన్మోహన్రావు పాల్గొన్నారు.నా మనుమరాలిని చదివించండి సార్‘బడి ఫీజులు చెల్లించలేను సార్.. ఏదైన గురుకుల పాఠశాలలో నా మనుమరాలిని చదివించండి’అని ఓ వృద్ధురాలు పెట్టుకున్న వినతికి మంత్రి పొంగులేటి వెంటనే స్పందించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం రాంచంద్రాపురం గ్రామానికి చెందిన ఊర్మిల వరంగల్ రెవెన్యూ సదస్సులో మంత్రికి ఈ మేరకు వినతిపత్రం అందించింది. మంత్రి సంబంధిత అధికారులను పిలిచి వినతిపత్రం అందజేసి సీటు ఇప్పించే ప్రయత్నం చేయాలని ఆదేశించారు. -
ధరణి కష్టాలు తొలగించేందుకే భూభారతి
నూతనకల్: రాష్ట్రంలో వివాద రహిత భూ విధానం తేవాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దొర పాలనలో రెవెన్యూ చట్టాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ధరణి పోర్టల్‌ను తెచ్చారని ఆరోపించారు. ధరణి వల్ల నిజమైన రైతులకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఎంతో మంది తమ భూములు పట్టా కాకపోవడంతో ఇబ్బందులు పడి కోర్టుల చుట్టూ తిరిగారని చెప్పారు. ధరణి కష్టాలను తొలగించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో 18 రాష్ట్రాల్లోని రెవెన్యూ చట్టాలను అధ్యయనం చేసి భూ భారతి చట్టాన్ని తెచ్చామని వివరించారు. నిషేధిత జాబితాలోని పట్టా భూముల సమస్యలు పరిష్కరిస్తాం ధరణిలో తప్పిదాలు జరిగితే రెవెన్యూ అధికారులు వాటిని సరిచేయడానికి కూడా అధికారం లేకుండా గత పాలకులు చట్టాలు చేశారని పొంగులేటి ఆరోపించారు. అన్నం పెట్టే రైతన్నకు లాభం చేయడమే భూ భారతి ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ధరణిలో పెండింగ్‌లో ఉన్న 2.46 లక్షల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్లు తెలిపారు. కొత్తగా 3.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. కొత్తగా ఇచ్చే పాసు పుస్తకాల్లో సర్వే మ్యాప్ వివరాలు ఉంటాయని తెలిపారు. మండల స్థాయిలో ఏర్పడే సమస్యలను తహసీల్దార్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణలో పరిష్కరించుకోవచ్చని సూచించారు. ధరణి పోర్టల్‌లో నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ప్రైవేట్ పట్టా భూములను పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భూ భారతి చట్టం ద్వారా ప్రభుత్వమే ఉచిత దరఖాస్తు ఫారాలను అందించి రైతుల పక్షపాతిగా నిలుస్తోందని తెలిపారు. భూమికి హద్దులు నిర్ణయించి పూర్తి కొలతలతో ప్రతి రైతుకు భూధార్ కార్డులు అందజేస్తామని తెలిపారు. సదస్సులో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ కె. నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
భూభారతితో అన్నదాత కష్టాలు తీరుస్తాం
కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం కోసం పెట్టినప్పుడు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రైతునని చెప్పుకునే నాయకుడు తెచ్చిన చట్టం ద్వారా ప్రజలు ఎంత గోస పడ్డారో ఇంకా వారికి అర్థం కావడం లేదు.ఖాజీపూర్ నుంచి సాక్షి ప్రతినిధిబీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక కష్టాలు అనుభవించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చేందుకే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ‘నాడు దొరవారు చేసిన ధరణి చట్టం పేద ప్రజలను, రైతులను పాతాళానికి తొక్కింది. ఇప్పుడు మేం తెస్తున్న భూభారతి చట్టం రైతుకు, భూమికి మధ్య ఉండే బంధాన్ని బలోపేతం చేస్తుంది. గ్రామాలు, గూడేలు, తండాల్లో ఉండే పేదలకు భరోసా, వారి భూములకు భద్రత ఉండేలా ఈ చట్టం తీసుకొస్తున్నాం’అని వివరించారు. పింక్ చొక్కాల కష్టాలూ తీరుస్తాం పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను 15 నెలల్లోనే కాంగ్రెస్ చేసిందన్న అక్కసుతోనే ప్రతి పనికి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. ‘వాళ్లు మమ్మల్ని తిట్టినా, ఆడిపోసుకున్నా సరే.. పింక్ చొక్కాలు వేసుకున్నవారి భూ సమస్యలను కూడా భూభారతి ద్వారా పరిష్కరిస్తాం. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నా దగ్గరకు వచ్చి ధరణి పోర్టల్ వల్ల తమ పాసు పుస్తకాల్లో తప్పులు వచ్చాయని తెలిపారు.భారతికి బదులు భరత్‌రెడ్డి అని, 9 ఎకరాలకు బదులు 9 గుంటలు అని పడిందని, వాటిని కొత్త చట్టం ద్వారా సరిచేయాలని కోరారు. దేశానికి భూభారతి చట్టం రోల్‌మోడల్ కాబోతోంది. పింక్ చొక్కాలు వేసుకున్న వారు గతంలో పేదలకు చెందిన లక్షలాది ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ఆ భూములన్నింటిని తీరిగి పేదలకు పంచాలనేది మా ఉద్దేశం. అసైన్డ్ భూములపై కూడా రైతులకు హక్కులు కల్పిస్తాం. కోర్టుల్లో లేని ప్రతి భూ సమస్యకు భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది’అని తెలిపారు. మంచిని మంచి అని చెప్పకపోయినా.. చెడుగా చిత్రీకరించొద్దు.. మా ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తాయనే అక్కసుతోనే మేం ఏం చేసినా అడ్డుకునే ధోరణితో ప్రతిపక్షాలు ముందుకెళుతున్నాయని పొంగులేటి విమర్శించారు. ‘కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం కోసం పెట్టినప్పుడు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రైతునని చెప్పుకునే నాయకుడు తెచ్చిన చట్టం ద్వారా ప్రజలు ఎంత గోస పడ్డారో ఇంకా వారికి అర్థం కావడం లేదు. మంచిని మంచి అని చెప్పకపోయినా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు.ఇప్పుడు కూడా బీఆర్ఎస్ తన విధానం మార్చుకోకపోతే పార్లమెంటు ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయి’అని హెచ్చరించారు. సదస్సులో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌లు భూభారతి చట్టంలోని ముఖ్యాంశాలను రైతులకు వివరించారు. అక్కడే ఏర్పాటు చేసిన కౌంటర్లో రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ధరణి పోర్టల్ వల్ల తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. తన భూమి పాసుపుస్తకంలో వాకిటికి బదులుగా వాకాటి అని వచ్చిందని, దానిని మార్చాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు.తన నియోజకవర్గంలో ఇక నుంచి భూభారతి చట్టంలోని సెక్షన్ల గురించి రైతులకు వివరిస్తానని పేర్కొన్నారు. భూమి సునీల్ మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 1.30 కోట్ల మంది రైతుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టం మార్చామని చెప్పారు. సదస్సులో ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి దరఖాస్తుకు ఒక డెడ్‌లైన్
సాక్షి, హైదరాబాద్: ధరణి స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి పోర్టల్‌లో వచ్చే ప్రతి దరఖాస్తు పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణీత గడువు విధించింది. ఈ పోర్టల్‌లో భూమి రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఆ భూమికి సంబంధించిన పాసుబుక్కు జారీ, భూమి క్రయ విక్రయ వివరాలను వెంటనే ఆన్లైన్లో మార్చటం వంటి అనేక వివరాలతో భూ భారతి చట్టం మార్గదర్శకాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మార్గదర్శకాలతో పాటు చట్టం అమలును గెజిట్ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌మిత్తల్ జీవో నం: 36, 39లను విడివిడిగా జారీ చేశారు. జీవో 36 ప్రకారం భూభారతి చట్టం ఏప్రిల్ 14, 2025 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. జీవో 39 ప్రకారం చట్టం మార్గదర్శకాలను విడుదల చేశారు. వీటిని తెలంగాణ భూభారతి నిబంధనలు (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్)– 2025గా పిలుస్తారు. చట్టం అమల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఈ నిబంధనలు వర్తిస్తాయి. రికార్డుల తయారీ ఈ చట్టం కింద ప్రతి గ్రామంలో ఉన్న అన్ని రకాల భూములకు సంబంధించిన రికార్డుల తయారీ, మార్పు చేర్పులు, నిర్వహణ జరుగుతుంది. ఎప్పటికప్పుడు ఈ రికార్డులను భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఆబాదీతో పాటు వ్యవసాయేతర భూములను సర్వే చేయడం ద్వారా ఆయా భూముల హద్దులను అక్షాంశాలు, రేఖాంశాలు ఆధారంగా నిర్ధారించి మ్యాపులు రూపొందించాల్సి ఉంటుంది. వ్యవసాయ, ఆబాదీ, వ్యవసాయేతర భూముల రికార్డుల తయారీ, నిర్వహణ కోసం ప్రభుత్వం ఎప్పుడైనా నోటిఫికేషన్ జారీచేసి మార్పులు, చేర్పులు చేయవచ్చు. దరఖాస్తు చేసిన 60 రోజుల్లో పరిష్కారం తమ భూ రికార్డుల్లో తప్పులు నమోదైనా, హక్కుల రికార్డులో వివరాలు లేకపోయినా సంబంధిత వ్యక్తి ఈ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరంలోపు నిర్దేశిత ఫీజు చెల్లించి భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని సవరణలు కోరవచ్చు. ఆ భూమికి సంబంధించి ప్రభుత్వం గతంలో జారీచేసిన పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్స్, పహాణీలు లేదా రిజిస్టర్ డాక్యుమెంట్లు, ఇతర డాక్యుమెంట్లతో పాటు తాను చేసుకున్న దరఖాస్తు సరైనదేనని అఫిడవిట్ జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను ఆర్డీవోలు, జిల్లా కలెక్టర్లు పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారు. ఆర్డీవోలు తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరాలుంటే జిల్లా కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై అభ్యంతరాలుంటే ట్రిబ్యునల్స్‌కు రీఅప్పీల్ (మళ్లీ దరఖాస్తు) చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ వర్గాల నుంచి సంబంధిత వ్యక్తులకు నోటీసు వస్తుంది. ఈ నోటీసులపై సెకండ్ పార్టీ (దరఖాస్తుదారులు కాకుండా) వారం రోజుల్లోగా లిఖితపూర్వక అభ్యంతరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వని పక్షంలో సంబంధిత అధికారి నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. లిఖిత పూర్వక అభ్యంతరాలు సమర్పించిన పక్షంలో నోటీసులు అందిన వారం రోజుల తర్వాత సదరు అధికారి ఆ దరఖాస్తుపై విచారణ జరుపుతారు. విచారణ రిపోర్టుతోపాటు ఇరు పక్షాల నుంచి వచ్చిన సాక్ష్యాలను పరిశీలిస్తారు. నేరుగా వారు వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత సదరు అధికారి తగు ఉత్తర్వులు జారీ చేస్తారు. ఈ ఉత్తర్వులను భూభారతి పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతారు. ఇదంతా నోటీసు జారీ చేసిన 60 రోజుల్లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లు ఇలా.. ఏదైనా భూమిని రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్ చేసుకునేందుకు భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. భూమి రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్‌ను సమయం (స్లాట్) అడిగితే, ఆ మేరకు తహసీల్దార్ స్లాట్ కేటాయిస్తారు. స్లాట్ ఇచ్చిన సమయంలో ఇరు పక్షాలు సంతకాలు చేసిన డాక్యుమెంట్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్స్ సమర్పించాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా దరఖాస్తుదారుడు పేర్కొన్న వివరాలు హక్కుల రికార్డుతో సరిపోలాయా.. లేదా? ఆ భూమి నిషేధిత భూముల జాబితాలో ఉందా? అసైన్డ్ భూమినా? షెడ్యూల్డు ఏరియాలో ఉందా? అనే వివరాలను పరిశీలించి సదరు అధికారి రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే తహసీల్దార్ సంబంధిత రికార్డును కూడా భూభారతిలోమ మార్చాలి. ఈ వివరాలతో కూడిన డాక్యుమెంట్‌ను క్రయవిక్రయదారులిద్దరికీ ఇవ్వాలి. ఇందుకు సంబంధించిన పాసు పుస్తకం కూడా వెంటనే జారీ చేయాల్సి ఉంటుంది. సాదా బైనామాల క్రమబద్ధీకరణ ఈ చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న 9 లక్షలకు పైగా సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండా తెల్ల కాగితాలపై భూ యాజమాన్య హక్కులను జూన్ 2, 2014 నాటికి మార్చుకున్నవారు.. తమ పేరిట ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని 2020, అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు చేసుకున్న దరఖాస్తులను ఈ చట్టం ప్రకారం పరిష్కరించవచ్చు. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం విచారణకు రావాలని ఆర్డీవో నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు దరఖాస్తుదారుడు అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఆర్డీవో క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి సాదాబైనామా నిజమా కాదా అనేది నిర్ధారించి తగు నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఆ భూమి సీలింగ్, షెడ్యూల్డు ఏరియా, పీఓటీ (అసైన్డ్) చట్టాల పరిధిలోనికి రానిదై ఉండాలి. ఒకవేళ సాదాబైనామా కింద దరఖాస్తుదారునికి హక్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే సర్టిఫికెట్ జారీ చేస్తారు. దానిని వారం రోజుల్లోగా ఇరుపక్షాలకు పంపుతారు. ఆ తర్వాత ఆర్డీవోనే సదరు భూమిని భూభారతి చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా నోటీసులిచ్చిన 90 రోజుల్లోపు పూర్తి కావాల్సి ఉంటుంది. వారసత్వ భూములపై హక్కులు వీలునామాల ఆధారంగా లేదా వారసత్వంగా వచ్చే భూములపై హక్కుల కోసం భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే వారసులందరూ అఫిడవిట్లు జత చేయాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం వారసులందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. ఈ నోటీసును గ్రామపంచాయతీలు, తహసీల్దార్ ఆఫీసుల్లోని నోటీసు బోర్డుల్లో కూడా ప్రదర్శిస్తారు. ఈ నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా దరఖాస్తుదారుడు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. తహసీల్దార్ వాటిని పరిశీలించి అవసరమైతే వారసులను విచారించి నిర్ణయం తీసుకుంటారు. ఇదంతా నోటీసులు జారీచేసిన 30 రోజుల్లోగా పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో ఆ దరఖాస్తు ఆమోదింపబడుతుంది. మ్యుటేషన్‌కు 30 రోజులు గడువు..! కోర్టు ఆదేశాలు, లోక్‌అదాలత్ తీర్పులు, రెవెన్యూ కోర్టుల ఉత్తర్వులు, ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్, సీలింగ్, భూదాన్, 1977 అసైన్డ్ చట్టం కింద ఇచ్చిన భూములు, ఇనామ్‌ల రద్దు చట్టం కింద ఓఆర్సీ, రక్షిత కౌలుదారు చట్టం కింద యాజమాన్య సర్టిఫికెట్లు, ఇండ్ల స్థలాల రూపంలో ఇచ్చిన భూములకు మ్యుటేషన్ కోసం భూభారతి ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆర్డీవో నోటీసు ఇస్తారు. ఈ నోటీసు ప్రకారం ప్రత్యక్ష విచారణ లేదంటే రిపోర్టు తెప్పించుకోవడం ద్వారా డాక్యుమెంట్లను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ 30 రోజుల్లో పూర్తి కావాల్సి ఉంటుంది. ప్రతి భూ యజమానికి భూదార్ కార్డు భూభారతి పోర్టల్‌లో ఉన్న హక్కుల రికార్డు ఆధారంగా తహసీల్దార్లు తాత్కాలిక భూదార్ కార్డులు జారీ చేస్తారు. పోర్టల్‌లో పేరున్న ప్రతి ఒక్కరికీ ఈ కార్డులు జారీ అవుతాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు భవిష్యత్తులో ప్రతి భూమికి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యూఐఎన్) ఇస్తారు. రాష్ట్రంలోని భూములన్నింటినీ సర్వే చేసి, ప్రతి భూమికి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా హద్దులు నిర్ణయించి ఈ కార్డులను జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త పాసు పుస్తకాల జారీ కొత్త పాసుపుస్తకాల కోసం కూడా ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలించి హక్కుల రికార్డులోని వివరాల ఆధారంగా పాసుపుస్తకం కమ్ టైటిల్ డీడ్ జారీ చేస్తారు. భూభారతి పోర్టల్‌లో నమోదై భూ యజమానులందరికీ తహసీల్దార్లు సుమోటోగా పాసు పుస్తకాలు ఇవ్వొచ్చు. దేనికైనా నిర్దేశిత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. హక్కుల రికార్డులో నమోదైన భూములను ఎప్పుడైనా లైసెన్సుడ్ సర్వేయర్ ద్వారా సర్వే చేయించుకోవచ్చు. ఈ సర్వే ద్వారా నిర్ధారించిన మ్యాప్‌ను పాసుపుస్తకాల్లో కూడా ముద్రించాల్సి ఉంటుంది. పాసు పుస్తకాల్లో తప్పులుంటే వాటిని సరిచేసుకునేందుకు కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు భూభారతి పోర్టల్‌లో కల్పించారు. గ్రామ అకౌంట్ల నిర్వహణ గ్రామస్థాయిలో రెవెన్యూ రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. మ్యుటేషన్, రికార్డుల అప్డేషన్ జరిగినప్పుడు ఆ వివరాల ఆధారంగా అవసరాన్ని బట్టి గ్రామ పహాణీ, ప్రభుత్వ భూమి రిజిస్టర్, బదిలీ రిజిస్టర్, సాగునీటి సౌకర్యం రిజస్టర్లను మార్చాల్సి ఉంటుంది. ఏటా డిసెంబర్ 31 ఆర్ధరాత్రిలోపు గ్రామ అకౌంట్ వివరాలను సంబంధిత అధికారికి సమర్పించాలి. టైటిల్, కబ్జా, లేదంటే ఇతర సివిల్ అంశాల్లో ఎవరికి ఏ భూమిపై ఎలాంటి అభ్యంతరం ఉన్నా సంబంధిత సివిల్ కోర్టులకు వెళ్లి పరిష్కరించుకునే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తుంది. అప్పీళ్లతో పాటు రివిజన్ కూడా.. భూభారతి పోర్టల్ ద్వారా దరఖాస్తుల పరిష్కారం కోసం రెవెన్యూ వర్గాలు తీసుకునే నిర్ణయాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. తహసీల్దార్ల నిర్ణయాలపై ఆర్డీవోలకు, ఆర్డీవోల నిర్ణయాలపై కలెక్టర్లకు, కలెక్టర్ల నిర్ణయాలపై ట్రిబ్యునల్‌కు అప్పీల్ చేసుకోవచ్చు. దరఖాస్తును బట్టి 30 నుంచి 60 రోజుల్లోపు ఈ అప్పీళ్లను పరిష్కరించాలి. ఎవరైనా, ఏ భూమిపై అయినా మోసపూరితంగా హక్కులు పొందారని భావిస్తే, ఆ భూమి గురించి భూభారతి పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సుమోటోగా కూడా అనుమానాస్పద భూములపై విచారణ చేపట్టవచ్చు. రికార్డులు, డాక్యుమెంట్లు, సాక్ష్యాలను పరిశీలించి అవసరమైతే సదరు భూమిని వెనక్కు తీసుకునే వెసులుబాటును ఈ చట్టం కల్పిస్తోంది. ఉచిత న్యాయ సాయం.. పేద రైతులకు ఈ చట్టం ద్వారా ఉచిత న్యాయ సాయం కూడా అందుతుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగ రైతులకు మండల, జిల్లా లీగల్ అథారిటీల సహకారంతో ఈ సాయాన్ని అందజేస్తారు. భూభారతి పోర్టల్ నిర్వహణ సీసీఎల్ఏ ఆదీనంలో ఉంటుంది. రికార్డుల తయారీ, నిర్వహణ, అప్డేషన్, సమయానుగుణంగా మార్పు చేర్పులు, ప్రభుత్వ అనుమతి మేరకు షెడ్యూళ్ల మార్పు, అవసరాలకు అనుగుణంగా ఆదేశాల జారీ, మార్గదర్శకాల రూపకల్పన అధికారాలన్నీ సీసీఎల్ఏ పరిధిలోనే జరుగుతాయి. -
సామాన్యుడికీ అర్థమయ్యేలా భూభారతి
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడికి సైతం అర్థమయ్యే విధంగా ఎలాంటి మతలబు, ఇబ్బంది లేకుండా తయారు చేసిందే భూ భారతి 2025 చట్టం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శిల్ప కళావేదికలో జరిగిన భూభారతి ప్రారంబోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెన వేసుకున్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తూ గత పాలకులు ధరణి చట్టం తెచ్చారని భట్టి విమర్శించారు.ధరణి రైతుల పాలిట శాపంగా మారిందని, కొంతమంది పెత్తందారుల కాళ్ల వద్ద రైతుల హక్కులను తాకట్టు పెట్టే విధంగా ఉందని.. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఎంత మొత్తుకున్నా గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పేదలకు పంపిణీ చేసిన 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కులను గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కాలరాసిందని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని పాదయాత్రలో రైతులకు భరోసా ఇచ్చామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. జన్మ ధన్యమైంది: పొంగులేటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజల భూములకు పూర్తి భద్రత, భరోసా కల్పించే భూభారతి చట్టాన్ని ప్రజలకు అందించడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. అధికారులే ప్రజల వద్దకు వచ్చి ఫిర్యాదులు స్వీకరించి 15 రోజుల్లో పరిష్కరిస్తారని వివరించారు. ఈనెల 17 నుంచి కలెక్టర్లు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఈ చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తారని మంత్రి తెలిపారు. మే మొదటి వారంలో రాష్ట్రంలో మిగిలిన 29 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి ఫిర్యాదులు స్వీకరించి భూభారతి చట్టాన్ని పటిష్టపరుస్తామన్నారు.జూన్ 2వ తేదీ నాటికి సమగ్ర చట్టాన్ని ఉపయోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. సీఎస్ శాంతికుమారి మాట్లాడుతూ గత చట్టంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది భూ భారతి పోర్టల్‌ను రూపొందించినట్లు చెప్పారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మాట్లాడుతూ దేశంలోనే అత్యంత గొప్ప రెవెన్యూ చట్టంగా భూభారతిని రూపొందించినట్లు చెప్పారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యపై తస్మాత్ జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: వేసవి కాలంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ముఖ్యమంత్రి కోరారు. తాగునీటి సరఫరా విషయంలో నీటి పారుదల శాఖ, తాగునీటి సరఫరా శాఖ, విద్యుత్ శాఖ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీహెచ్ఆర్డీ)లో సోమవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సులో వేసవి తాగునీటి ప్రణాళిక, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.కలెక్టర్లు డ్యాష్ బోర్డు ద్వారా ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు, సరఫరాను పర్యవేక్షించాలని సూచించారు. ఎక్కడైనా సమ స్య తలెత్తితే పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళిక ఉండాలని చెప్పారు. పలు గ్రామాలకు తాగు నీటి సరఫరా పైపులైను వ్యవస్థ లేదని, పలు ఇళ్లకు నల్లాలు లేవని.. ఆయా ప్రాంతాల్లోనూ తాగునీటి సమస్య రాకుండా చూడాలని అన్నారు. కోయగూడేలు, చెంచు పెంటలు, ఇతర గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. భూభారతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా రైతులను న్యాయస్థానాల మెట్లు ఎక్కించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా విస్తృత అధ్యయనం తర్వాత తీసుకువచ్చిన భూభారతి చట్టం అమల్లోకి రావడంతో రెవెన్యూ యంత్రాంగమే ఇకపై ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దీనిపై అప్పీల్ వ్యవస్థ ఉన్న విషయాన్ని రైతులు, ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.ఈ చట్టాన్ని క్షేత్ర స్థాయికి సమర్థంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రతి మండలంలో సదస్సు నిర్వహించాలని, ప్రతి జిల్లా కలెక్టర్ మండల స్థాయి సదస్సులకు హాజరై అక్కడ రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్థమ య్యే భాషలో వివరించి పరిష్కారం చూపాలని చెప్పారు. భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఈ రెండింటినీ క్షేత్ర స్థాయికి తీసుకెళ్లడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.భూభారతి చట్టాన్ని కలెక్టర్లు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. భూభారతి పైలెట్ ప్రాజెక్టు సదస్సులను నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో నిర్వహిస్తారని, ఆయా మండల కేంద్రాల్లో సదస్సులకు కలెక్టర్లు కచ్చితంగా హాజరుకావాలని, ఆ మండలాల్లోని ప్రతి గ్రామంలో రెవెన్యూ సిబ్బందితో సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. వీటికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఇతర మంత్రులు హాజరవుతారని తెలిపారు.ఇళ్ల మంజూరులో ఒత్తిళ్లకు తలొగ్గొద్దు గ్రామ స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఆమోదం పొందిన జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించాలని సీఎం సూచించారు. అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రికి పంపాలని.. ఇన్చార్జి మంత్రి ఆమోదించాకే ఇళ్ల జాబితా ఖరారవుతుందని చెప్పారు. సరైన పర్యవేక్షణకు వీలుగా ప్రతి నియో జకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. ఈప్రత్యేకాధికారి ఇందిరమ్మ కమి టీలు, మండల కమిటీలు, కలెక్టర్లు, ఇన్చార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ఉంటారని రేవంత్ వివరించారు.గతంలో ఉమ్మడి జిల్లాకు నియమించిన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాలని, ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించాలని సూచించారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గ వద్దని, ఎక్కడైనా అనర్హులకు ఇళ్లు కేటాయిస్తే మండల స్థాయి క మిటీ, ప్రత్యేకాధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించా రు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినందున జనాభా ప్రాతిపదికన, ఆయా గ్రామాలకు ఇళ్ల కేటాయింపు ఉండాలని, ఈ విషయంలో హేతుబద్ధత పాటించాలని సూ చించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, జూ పల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, సీఎం సలహాదా రు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, షబ్బీర్ అలీ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆధార్‌లా 'భూధార్'
సాక్షి, హైదరాబాద్: ఆధార్ తరహాలో భూధార్ పేరిట రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఓ ప్రత్యేకమైన నంబర్ కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి వ్యవసాయ భూమికి పక్కా కొలతలతో సరిహద్దులు నిర్ణయించి భూధార్ నంబర్ ఇవ్వడం వల్ల రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు నిర్ణయించి సొంత రాష్ట్రం సాధించుకున్న రెవెన్యూ ఉద్యోగులకు రైతుల భూములకు సరిహద్దులు నిర్ణయించి భూధార్ కార్డులు ఇవ్వడం కష్టమేమీ కాదని అన్నారు. ‘ధరణి’ స్థానంలో రూపొందించిన కొత్త ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం ‘భూ భారతి’ పోర్టల్‌ను సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భూ రికార్డులు ‘రెవెన్యూ’ ఘనతే..: ‘తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య వరకు సాగించిన పోరాటాలు, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి పీవీ నరసింహారావు వరకు ఎందరో భూసంస్కరణలు తెచ్చారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో దేశంలో వచ్చిన భూ సంస్కరణల ద్వారా వివిధ మార్గాల్లో ప్రజలు సొంతం చేసుకున్న భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ రెవెన్యూ శాఖనే రూపొందించింది. పటా్వరీ వ్యవస్థ పోయిన తర్వాత వీఆర్ఓ, వీఆర్ఏలే రైతుల భూముల వివరాలు సేకరించి భద్రపరిచారు. 95 శాతం భూముల వివరాలను ప్రక్షాళన చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు..’ అని సీఎం తెలిపారు. ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న ఫళంగా అప్పటి ప్రభుత్వం చట్టాలను మార్చింది. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి పోర్టల్ ప్రజల పాలిట భూతంగా మారింది. ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెడితే, సిరిసిల్లలో ఓ మహిళ తన భూమి కోసం తహసీల్దార్‌కు తన తాళిబొట్టును లంచంగా ఇవ్వజూపింది. ఈ విధంగా ప్రజల బాధలకు కారణమైన ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి, కొత్త ఆర్ఓఆర్ చట్టం తెస్తామని ఎన్నికలకు ముందు పాదయాత్రల్లో నేను, భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చాం. కొత్త చట్టం పేదలకు చుట్టంగా ఉండాలని ఎంతో శ్రమించి ‘భూ భారతి’ని తీసుకొచ్చాం. తెలంగాణలో వివాద రహిత భూ విధానం తేవాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఈ చట్టం తెచ్చాం. ప్రజలకు అనుకూలమైనదిగా దీన్ని తీర్చిదిద్దాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభిస్తున్నాం. ఈ చట్టాన్ని ఖమ్మంలో లక్ష మంది ప్రజల సమక్షంలో ప్రజలకు అంకితం చేద్దామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెబితే, నేను రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమక్షంలోనే చట్టం అమలు ప్రక్రియను ప్రారంభిద్దామని చెప్పా. ఈ ప్రభుత్వం రెవెన్యూ అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని గౌరవిస్తుంది..’ అని రేవంత్ చెప్పారు. గత ప్రభుత్వం తమ స్వార్ధం కోసం చట్టాన్ని మార్చింది.. ‘గతంలో ధరణిని తీసుకువచ్చిన పాలకులు రెవెన్యూ సిబ్బందిని దోషులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 70 ఏళ్లుగా ప్రజల భూములను కాపాడిన రెవెన్యూ సిబ్బంది ధరణి వచ్చిన తర్వాత మీకు దోపిడీదారులుగా కనిపించారా? చట్టాలను చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? సమాజంలోని ప్రతి వ్యవస్థలో రెవెన్యూ నుంచి రాజకీయ నాయకుల వరకు 5 నుంచి 10 శాతం వరకు చెడ్డవారు ఉంటారు. చెడ్డవాళ్లను శిక్షించుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోవాలి. కానీ గత ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపించి తమ స్వార్థం కోసం చట్టాన్ని మార్చింది. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తుల విషయంలో కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు. గత పాలకుల్లా..మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం..’ అని సీఎం అన్నారు. కలెక్టర్లు గ్రామ గ్రామానికి వెళ్లాలి ‘రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం. మేం తెచ్చిన చట్టాలను మీరు అమలు చేస్తారు. 69 లక్షల మంది రైతులకు ప్రభుత్వం, రెవెన్యూ విభాగం రెండు కళ్లు లాంటివి. కలెక్టర్ల నుంచి సిబ్బంది వరకు గ్రామ గ్రామానికి వెళ్లండి. దోషులుగా చిత్రీకరించిన విధానానికి వ్యతిరేకంగా ఎవరి భూమి వారికి లెక్క కొద్దీ ఇద్దాం. కలెక్టర్లు ప్రతి మండలంలో పర్యటించాలని ఈ వేదిక నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. భూభారతిని పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం . నాలుగు మండలాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకుని లోపాలు ఏమైనా ఉంటే సవరించుకున్న తర్వాత అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించుకుందాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
‘ భూ భారతి’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో పోరాటలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు(సోమవారం) భూ భారతి పోర్టల్ ను ఆవిష్కరించారు సీఎం రేవంత్.. దీనిలోభాగంగా మాట్లాడుతూ.. ‘కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది. తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులను దోపిడీదారులుగా చిత్రీకరించి లబ్ది పొందాలని ఆనాటి పాలకులు ఆలోచన చేశారు. చట్టాలను చట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా?, అందుకే పేదలకు మేలు చేసేందుకు నూతన ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభించుకున్నాం. పైలట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం. వివాద రహిత భూ విధానాలను తీసుకురావాలని మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత రెవెన్యూఅధికారులపైనే ఉంది. రెవెన్యూ అధికారులను ప్రజలకు చేరువ చేయాలనేదే మా ఉద్దేశం. గత పాలకుల్లా మిమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ఆలోచనకు మేం వ్యతిరేకం. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తులపైన కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు.మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం. భవిష్యత్ లో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తాం. రాబోయే రోజుల్లో వ్యవసాయ భూములను సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తిస్తాం. రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం కలెక్టర్లు ప్రతీ మండలంలో పర్యటించాలని ఈ వేదికగా స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి’ అని సీఎం రేవంత్ విజ్క్షప్తి చేశారు.