
దొరగారి ధరణితో పాతాళానికి రైతులు
భూభారతి అవగాహన సదస్సులో పొంగులేటి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ధరణి కష్టాల గురించి చెప్పారు
మేం ఏం చేసినా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి
ఇప్పటికైనా మారకుంటే లోక్‌సభ ఫలితాలే పునరావృతమవుతాయి
కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం కోసం పెట్టినప్పుడు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రైతునని చెప్పుకునే నాయకుడు తెచ్చిన చట్టం ద్వారా ప్రజలు ఎంత గోస పడ్డారో ఇంకా వారికి అర్థం కావడం లేదు.
ఖాజీపూర్ నుంచి సాక్షి ప్రతినిధి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి చట్టంతో రైతులు అనేక కష్టాలు అనుభవించారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. రైతుల కష్టాలు తీర్చేందుకే ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమలుచేస్తున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం అమలులో భాగంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం ఖాజీపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుకు పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ‘నాడు దొరవారు చేసిన ధరణి చట్టం పేద ప్రజలను, రైతులను పాతాళానికి తొక్కింది. ఇప్పుడు మేం తెస్తున్న భూభారతి చట్టం రైతుకు, భూమికి మధ్య ఉండే బంధాన్ని బలోపేతం చేస్తుంది. గ్రామాలు, గూడేలు, తండాల్లో ఉండే పేదలకు భరోసా, వారి భూములకు భద్రత ఉండేలా ఈ చట్టం తీసుకొస్తున్నాం’అని వివరించారు.
పింక్ చొక్కాల కష్టాలూ తీరుస్తాం
పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేని పనులను 15 నెలల్లోనే కాంగ్రెస్ చేసిందన్న అక్కసుతోనే ప్రతి పనికి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని మంత్రి పొంగులేటి విమర్శించారు. ‘వాళ్లు మమ్మల్ని తిట్టినా, ఆడిపోసుకున్నా సరే.. పింక్ చొక్కాలు వేసుకున్నవారి భూ సమస్యలను కూడా భూభారతి ద్వారా పరిష్కరిస్తాం. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే నా దగ్గరకు వచ్చి ధరణి పోర్టల్ వల్ల తమ పాసు పుస్తకాల్లో తప్పులు వచ్చాయని తెలిపారు.
భారతికి బదులు భరత్‌రెడ్డి అని, 9 ఎకరాలకు బదులు 9 గుంటలు అని పడిందని, వాటిని కొత్త చట్టం ద్వారా సరిచేయాలని కోరారు. దేశానికి భూభారతి చట్టం రోల్‌మోడల్ కాబోతోంది. పింక్ చొక్కాలు వేసుకున్న వారు గతంలో పేదలకు చెందిన లక్షలాది ఎకరాల భూమిని కొల్లగొట్టారు. ఆ భూములన్నింటిని తీరిగి పేదలకు పంచాలనేది మా ఉద్దేశం. అసైన్డ్ భూములపై కూడా రైతులకు హక్కులు కల్పిస్తాం. కోర్టుల్లో లేని ప్రతి భూ సమస్యకు భూభారతి ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది’అని తెలిపారు.
మంచిని మంచి అని చెప్పకపోయినా.. చెడుగా చిత్రీకరించొద్దు..
మా ప్రభుత్వానికి మంచి మార్కులు వస్తాయనే అక్కసుతోనే మేం ఏం చేసినా అడ్డుకునే ధోరణితో ప్రతిపక్షాలు ముందుకెళుతున్నాయని పొంగులేటి విమర్శించారు. ‘కళ్లుండి చూడలేని ప్రతిపక్షాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాయి. అసెంబ్లీలో ఈ చట్టం ఆమోదం కోసం పెట్టినప్పుడు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాయి. రైతునని చెప్పుకునే నాయకుడు తెచ్చిన చట్టం ద్వారా ప్రజలు ఎంత గోస పడ్డారో ఇంకా వారికి అర్థం కావడం లేదు. మంచిని మంచి అని చెప్పకపోయినా చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయవద్దు.
ఇప్పుడు కూడా బీఆర్‌ఎస్ తన విధానం మార్చుకోకపోతే పార్లమెంటు ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయి’అని హెచ్చరించారు. సదస్సులో నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్‌లు భూభారతి చట్టంలోని ముఖ్యాంశాలను రైతులకు వివరించారు. అక్కడే ఏర్పాటు చేసిన కౌంటర్‌లో రైతుల నుంచి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ధరణి పోర్టల్ వల్ల తాను కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. తన భూమి పాసుపుస్తకంలో వాకిటికి బదులుగా వాకాటి అని వచ్చిందని, దానిని మార్చాలని అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకపోయిందని చెప్పారు.
తన నియోజకవర్గంలో ఇక నుంచి భూభారతి చట్టంలోని సెక్షన్ల గురించి రైతులకు వివరిస్తానని పేర్కొన్నారు. భూమి సునీల్ మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 1.30 కోట్ల మంది రైతుల శ్రేయస్సే లక్ష్యంగా చట్టం మార్చామని చెప్పారు. సదస్సులో ఎమ్మెల్యేలు పరి్ణకారెడ్డి, టి.రామ్మోహన్‌రెడ్డి, బాలల హక్కుల కమిషన్ చైర్మన్ సీతా దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.