
భూభారతి లోగోను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా, కోదండరెడ్డి, నవీన్ మిత్తల్
రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఓ ప్రత్యేకమైన నంబర్
భూములకు సరిహద్దులు నిర్ణయించి పూర్తి కొలతలతో భూధార్ ఇస్తాం
భూధార్ నంబర్‌తో రైతుల భూములకు పూర్తి భరోసా
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే కొత్త ఆర్‌ఓఆర్ చట్టం
వివాద రహిత భూ విధానం తేవడమే మా ప్రభుత్వ లక్ష్యం
అపోహలు తొలగిద్దాం..ఎవరి భూమి వారికి లెక్క కొద్దీ ఇద్దామన్న సీఎం
రైతులకు ప్రభుత్వం, రెవెన్యూ విభాగం రెండు కళ్లలాంటివని వ్యాఖ్య
భూభారతి పోర్టల్ ఆవిష్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆధార్ తరహాలో భూధార్ పేరిట రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఓ ప్రత్యేకమైన నంబర్ కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి వ్యవసాయ భూమికి పక్కా కొలతలతో సరిహద్దులు నిర్ణయించి భూధార్ నంబర్ ఇవ్వడం వల్ల రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు నిర్ణయించి సొంత రాష్ట్రం సాధించుకున్న రెవెన్యూ ఉద్యోగులకు రైతుల భూములకు సరిహద్దులు నిర్ణయించి భూధార్ కార్డులు ఇవ్వడం కష్టమేమీ కాదని అన్నారు. ‘ధరణి’ స్థానంలో రూపొందించిన కొత్త ఆర్‌ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) చట్టం ‘భూ భారతి’ పోర్టల్‌ను సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
భూ రికార్డులు ‘రెవెన్యూ’ ఘనతే..: ‘తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. కొమురం భీమ్ జల్ జమీన్ జంగిల్ పోరాటం నుంచి చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య వరకు సాగించిన పోరాటాలు, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి పీవీ నరసింహారావు వరకు ఎందరో భూసంస్కరణలు తెచ్చారు.
ఇందిరాగాంధీ నేతృత్వంలో దేశంలో వచ్చిన భూ సంస్కరణల ద్వారా వివిధ మార్గాల్లో ప్రజలు సొంతం చేసుకున్న భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ రెవెన్యూ శాఖనే రూపొందించింది. పటా్వరీ వ్యవస్థ పోయిన తర్వాత వీఆర్‌ఓ, వీఆర్‌ఏలే రైతుల భూముల వివరాలు సేకరించి భద్రపరిచారు. 95 శాతం భూముల వివరాలను ప్రక్షాళన చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు..’ అని సీఎం తెలిపారు.
ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది
‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న ఫళంగా అప్పటి ప్రభుత్వం చట్టాలను మార్చింది. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి పోర్టల్ ప్రజల పాలిట భూతంగా మారింది. ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ పైనే పెట్రోల్ పోసి తగలబెడితే, సిరిసిల్లలో ఓ మహిళ తన భూమి కోసం తహసీల్దార్‌కు తన తాళిబొట్టును లంచంగా ఇవ్వజూపింది.
ఈ విధంగా ప్రజల బాధలకు కారణమైన ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి, కొత్త ఆర్‌ఓఆర్ చట్టం తెస్తామని ఎన్నికలకు ముందు పాదయాత్రల్లో నేను, భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చాం. కొత్త చట్టం పేదలకు చుట్టంగా ఉండాలని ఎంతో శ్రమించి ‘భూ భారతి’ని తీసుకొచ్చాం. తెలంగాణలో వివాద రహిత భూ విధానం తేవాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఈ చట్టం తెచ్చాం. ప్రజలకు అనుకూలమైనదిగా దీన్ని తీర్చిదిద్దాం.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభిస్తున్నాం. ఈ చట్టాన్ని ఖమ్మంలో లక్ష మంది ప్రజల సమక్షంలో ప్రజలకు అంకితం చేద్దామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెబితే, నేను రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమక్షంలోనే చట్టం అమలు ప్రక్రియను ప్రారంభిద్దామని చెప్పా. ఈ ప్రభుత్వం రెవెన్యూ అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని గౌరవిస్తుంది..’ అని రేవంత్ చెప్పారు.
గత ప్రభుత్వం తమ స్వార్ధం కోసం చట్టాన్ని మార్చింది..
‘గతంలో ధరణిని తీసుకువచ్చిన పాలకులు రెవెన్యూ సిబ్బందిని దోషులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 70 ఏళ్లుగా ప్రజల భూములను కాపాడిన రెవెన్యూ సిబ్బంది ధరణి వచ్చిన తర్వాత మీకు దోపిడీదారులుగా కనిపించారా? చట్టాలను చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? సమాజంలోని ప్రతి వ్యవస్థలో రెవెన్యూ నుంచి రాజకీయ నాయకుల వరకు 5 నుంచి 10 శాతం వరకు చెడ్డవారు ఉంటారు.
చెడ్డవాళ్లను శిక్షించుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోవాలి. కానీ గత ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపించి తమ స్వార్థం కోసం చట్టాన్ని మార్చింది. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తుల విషయంలో కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు. గత పాలకుల్లా..మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం..’ అని సీఎం అన్నారు.
కలెక్టర్లు గ్రామ గ్రామానికి వెళ్లాలి
‘రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం. మేం తెచ్చిన చట్టాలను మీరు అమలు చేస్తారు. 69 లక్షల మంది రైతులకు ప్రభుత్వం, రెవెన్యూ విభాగం రెండు కళ్లు లాంటివి. కలెక్టర్ల నుంచి సిబ్బంది వరకు గ్రామ గ్రామానికి వెళ్లండి. దోషులుగా చిత్రీకరించిన విధానానికి వ్యతిరేకంగా ఎవరి భూమి వారికి లెక్క కొద్దీ ఇద్దాం.
కలెక్టర్లు ప్రతి మండలంలో పర్యటించాలని ఈ వేదిక నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. భూభారతిని పైలెట్ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం . నాలుగు మండలాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకుని లోపాలు ఏమైనా ఉంటే సవరించుకున్న తర్వాత అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించుకుందాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.