భూరికార్డులకు సంబంధించి ‘ఆర్‌ఓఆర్–2024’ ముసాయిదానే ఫైనల్ చేయాలని సర్కారు నిర్ణయం
ఒకట్రెండు అంశాల్లోనే మార్పులు.. అది కూడా మార్గదర్శకాల్లోనే సవరణ
భూసమస్యల పరిష్కారానికి ట్రిబ్యునళ్ల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు
రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు,కొత్త చట్టానికి సంబంధం లేదంటున్న రెవెన్యూ వర్గాలు
ముసాయిదాలోని సెక్షన్–4 ప్రకారం కూడా ఏర్పాటు చేయవచ్చంటున్న నిపుణులు
ఆర్డీవో స్థాయిలోనూ అప్పీల్ అవకాశం ఉండాలనే సూచనలపై అస్పష్టత
కొత్త చట్టంపై వెంటనే ఆర్డినెన్స్ జారీ చేయాలా? అసెంబ్లీలో చర్చించి ఆమోదించే దాకా ఆగాలా అన్న దానిపై తర్జనభర్జన
20వ తేదీన జరిగే కేబినెట్ ఎజెండాపై బుధవారం రానున్న స్పష్టత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల రికార్డులకు సంబంధించిన ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 (ఆర్‌వోఆర్)’ చట్టం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయానికి వచ్చింది. ఒకట్రెండు చిన్న చిన్న మార్పులు మినహా ముసాయిదా కింద రూపొందించిన అంశాలనే చట్టం రూపంలో అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి త్వరలోనే దీనిపై ఓ స్పష్టత ఇస్తారని.. సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తారని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.
దాంతోపాటు ఈ చట్టాన్ని వెంటనే అమల్లోకి తెచ్చేందుకు మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేస్తారా? లేక అసెంబ్లీలో పెట్టిన బిల్లుపై విస్తృతంగా చర్చించి చట్టంగా చేస్తారా? అన్న దానిపై మాత్రం తర్జనభర్జన కొనసాగుతున్నట్టు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈనెల 20న జరిగే కేబినెట్ సమావేశం ముందుకు ఆర్డినెన్స్ వచ్చే అవకాశం లేదని అంటున్నాయి. అయితే కేబినెట్ ఎజెండాపై బుధవారం స్పష్టత వస్తుందని, ఎజెండాలో భూముల చట్టం ఆర్డినెన్స్ ఉంటే రూపకల్పన, జారీ ఏర్పాట్లకు సిద్ధంగానే ఉన్నామని రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.
ముసాయిదా బిల్లు ఇదే..
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వం ‘ఆర్‌వోఆర్–2024’ ముసాయిదాను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్‌వోఆర్–2020 చట్టంలో పరిష్కరించలేని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ 20 సెక్షన్లతో ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందించింది. 1936, 1948, 1971, 2020 నాటి ఆర్‌ఓఆర్ చట్టాలను పరిశీలించి, వాటి అమలుతో చేకూరిన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టం ముసాయిదాను తయారు చేసింది.
తెలంగాణలో ఆర్‌వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాల అంచనాల ప్రకారం రూపొందించిన ఈ ముసాయిదాలో పాస్ పుస్తకాలు రాని భూముల సమస్యల పరిష్కారం, కొత్త రికార్డును ఎప్పుడైనా తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ లాంటి వెసులుబాట్లు కల్పిస్తూ అనేక అంశాలను ముసాయిదాలో పొందుపరిచారు.
బిల్లు పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆర్‌వోఆర్ చట్టానికి రెండోసారి మార్పు జరుగుతోంది. 2020లో బీఆర్‌ఎస్ హయాంలో ఆర్‌వోఆర్–2020 చట్టం అమల్లోకి తెచ్చారు. అందులోని అనేక అంశాలకు సవరణలు, మార్పు చేర్పులతో ఆర్‌వోఆర్–2024ను కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ముందు పెట్టింది. ముసాయిదాపై ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి 23 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. మంత్రులు, రెవెన్యూ శాఖ సీనియర్ అధికారులు, భూచట్టాల నిపుణులు, మేధావులు, సామాన్యులు.. ఇలా అన్ని వర్గాలు అభిప్రాయాలు స్వీకరించింది. ఈ వివరాలతో జిల్లాల కలెక్టర్లు నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు.
ఆ మూడు అంశాలే కీలకం
ప్రజలతోపాటు భూచట్టాల నిపుణుల నుంచి వచ్చిన అనేక సూచనలు, సలహాల్లో మూడు అంశాలు కీలకమని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటు ప్రతిపాదన ముసాయిదా చట్టంలో లేదని.. భూసమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని పలువురు సూచించారు. అయితే రెవెన్యూ ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు, ఆర్‌ఓఆర్ చట్టానికి సంబంధం లేదని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి.
అయితే భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా పార్ట్–బీలో పెట్టిన 18లక్షల ఎకరాల భూముల సమస్యలను పరిష్కరించేందుకు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉందని అంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వొచ్చని, లేదా ముసాయిదా చట్టంలోని సెక్షన్–4 ప్రకారం కూడా ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నాయి. ఇక అప్పీల్, రివిజన్లకు సంబంధించిన అంశంలోనూ చాలా సూచనలు వచ్చాయి.
తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్రే‍్టషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్‌ను కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్‌కు చేసుకోవాలని.. సెకండ్ అప్పీల్‌ను సీసీఎల్‌ఏకు, రివిజన్ కోసం ప్రభుత్వానికి లేదంటే సీసీఎల్‌ఏకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చట్టంలో ప్రతిపాదించారు. అయితే ఈ అప్పీల్ అవకాశం ఆర్డీవో స్థాయిలోనూ ఉండాలని పలువురు సూచించారు. రిజిస్రే‍్టషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి అని.. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూఆధార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇస్తామన్న ప్రతిపాదనలపైనా పలు సూచనలు వచ్చాయి. వీటి విషయంలో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో తేలాల్సి ఉంది.
సాదాబైనామాలకు అవకాశం
ఆర్‌వోఆర్–2024 చట్టం అమల్లోకి వస్తే పెండింగ్‌లో ఉన్న 9.4 లక్షల సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది. ఈ సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారాన్ని ప్రత్యేక సెక్షన్‌లో ప్రతిపాదించారు. ఇక అసైన్డ్ భూముల సమస్య పరిష్కారానికి ఈ చట్టంలో ఎలాంటి ప్రస్తావన లేదనే విమర్శలున్నాయి. అయితే అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడానికి, ఆర్‌వోఆర్ చట్టానికి సంబంధం లేదని.. అసైన్డ్ భూములపై హక్కులు రావాలంటే హక్కుల బదలాయింపు నిషేధిత చట్టాన్ని (పీవోటీ) సవరించాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు వివరిస్తున్నాయి. మొత్తమ్మీద ముసాయిదా చట్టంలో ఒకట్రెండు అంశాల్లోనే మార్పు ఉంటుందని.. అది కూడా మార్గదర్శకాలు తయారు చేసినప్పుడు వాటిలో పొందుపరుస్తారని పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment