రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ
దొడ్డు బియ్యానికి బదులు సన్నాల సరఫరాకు సర్కారు ఏర్పాట్లు
మొత్తంగా నెలకు 2 లక్షల టన్నుల చొప్పున
ఏటా 24 లక్షల టన్నులు అవసరమని అంచనా
89.6 లక్షలు రాష్ట్రంలో రేషన్‌కార్డులు
2.81 కోట్లు లబ్ధిదారులు
ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున పంపిణీ
ప్రస్తుతం బియ్యంపై రాష్ట్రం భరిస్తున్న సబ్సిడీ రూ.3,600 కోట్లు.. సన్నబియ్యంతో మరో రూ.1,500 కోట్లు పెరిగే చాన్స్
ఇప్పటికే సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీలకు మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం
కొత్త రేషన్ కార్డుల కోసం మరో 20 లక్షల మంది ఎదురుచూపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగా సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీని.. ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఖరీఫ్ (వానాకాలం)లో రైతులు పండించిన సన్న ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి సేకరిస్తున్న ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటికే 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే మరోసారి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదనంగా 10 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది.
పేద, దిగువ మధ్య తరగతికి ఊరట
ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుంది. తద్వారా బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రీసైక్లింగ్‌ను పూర్తిగా కట్టడి చేయవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. సాధారణ రకం సన్న బియ్యం ధర కిలో రూ.60–65 వరకు ఉండగా.. ఫైన్ రకాల బియ్యం ధర రూ.70కిపైగానే ఉంది. దీనితో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది.
ప్రభుత్వం రేషన్‌కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపని మధ్య తరగతి వర్గాల వారు ఆ బియ్యాన్ని కిలో రూ.10–20 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్‌మిల్లులకు చేరుతోంది. మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. రేషన్‌పై సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే దానిని వినియోగించుకుంటారని.. బ్లాక్ మార్కెట్ సమస్య తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదనపు ఖర్చేమీ లేకుండానే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు సన్న బియ్యం అన్నం తింటారని, ఇది వారికి భారీ ఊరట అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సర్కార్‌పై మరో రూ.1,500 కోట్ల భారం
రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. అందులో జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి 54.5 లక్షలు ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన పథకం కింద మరో ఐదున్నర లక్షల కార్డులున్నాయి. వీరందరికీ కేంద్ర ప్రభుత్వమే ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేదానికి అదనంగా మరో కిలో అదనంగా కలిపి ఆరు కిలోల చొప్పున లబ్ధిదారులకు అందిస్తోంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మరో 35.66 లక్షల ఆహార భద్రత కార్డులపై రాష్ట్ర ఖర్చుతోనే బియ్యం పంపిణీ చేస్తోంది.
ఇదంతా దొడ్డు బియ్యం మాత్రమే. అయితే కేంద్రం నేరుగా బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.36 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ ద్వారా.. ఈ బియ్యాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 89.6 లక్షల కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేయనుంది. సన్న బియ్యం కోసం కిలోకు రూ.55, ఆపై ఖర్చవుతుందని అంచనా. అంటే కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా సుమారు రూ.3,600 కోట్ల సబ్సిడీని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సన్న బియ్యం పంపిణీతో మరో రూ.1,500 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
బియ్యం బాగుంటాయన్న సూచనలతో..
సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లను కనీసం రెండు మూడు నెలలైనా మాగనిచ్చి మిల్లింగ్ చేస్తేనే బియ్యం బాగుంటాయని నిపుణులు సూచించడంతో.. రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో చర్చించిన అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నాయి. ఉగాది (మార్చి నెలాఖరు) నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment