rice distribution
-
ఉగాదికి సన్నబియ్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పేదలందరికీ రేషన్‌కార్డులపై ఉచితంగా సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబంలో ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీని.. ఉగాది నుంచి ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఖరీఫ్ (వానాకాలం)లో రైతులు పండించిన సన్న ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి సేకరిస్తున్న ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటికే 20 లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. అయితే మరోసారి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు కోరుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదనంగా 10 లక్షల కొత్త కార్డులు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. పేద, దిగువ మధ్య తరగతికి ఊరట ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ప్రతి లబ్ధిదారుకు నెలకు 6 కిలోల చొప్పున దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. దీనికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయనుంది. తద్వారా బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రీసైక్లింగ్‌ను పూర్తిగా కట్టడి చేయవచ్చని భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యం ధరలు బాగా పెరిగిపోయాయి. సాధారణ రకం సన్న బియ్యం ధర కిలో రూ.60–65 వరకు ఉండగా.. ఫైన్ రకాల బియ్యం ధర రూ.70కిపైగానే ఉంది. దీనితో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై భారం పడుతోంది. ప్రభుత్వం రేషన్‌కార్డులపై ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని తినేందుకు ఆసక్తి చూపని మధ్య తరగతి వర్గాల వారు ఆ బియ్యాన్ని కిలో రూ.10–20 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. ఈ బియ్యం తిరిగి రైస్‌మిల్లులకు చేరుతోంది. మిల్లులు ఈ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. రేషన్‌పై సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తే దానిని వినియోగించుకుంటారని.. బ్లాక్ మార్కెట్ సమస్య తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదనపు ఖర్చేమీ లేకుండానే పేద, మధ్యతరగతి కుటుంబాల వారు సన్న బియ్యం అన్నం తింటారని, ఇది వారికి భారీ ఊరట అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కార్‌పై మరో రూ.1,500 కోట్ల భారం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్‌కార్డులు ఉండగా.. అందులో జాతీయ ఆహార భద్రత పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినవి 54.5 లక్షలు ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన పథకం కింద మరో ఐదున్నర లక్షల కార్డులున్నాయి. వీరందరికీ కేంద్ర ప్రభుత్వమే ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చేదానికి అదనంగా మరో కిలో అదనంగా కలిపి ఆరు కిలోల చొప్పున లబ్ధిదారులకు అందిస్తోంది. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మరో 35.66 లక్షల ఆహార భద్రత కార్డులపై రాష్ట్ర ఖర్చుతోనే బియ్యం పంపిణీ చేస్తోంది. ఇదంతా దొడ్డు బియ్యం మాత్రమే. అయితే కేంద్రం నేరుగా బియ్యం ఇవ్వకుండా కిలోకు రూ.36 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ, కస్టమ్ మిల్లింగ్ ద్వారా.. ఈ బియ్యాన్ని సమకూర్చుకుంటుంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 89.6 లక్షల కార్డుదారులకు సన్న బియ్యం సరఫరా చేయనుంది. సన్న బియ్యం కోసం కిలోకు రూ.55, ఆపై ఖర్చవుతుందని అంచనా. అంటే కేంద్రం ఇచ్చే నిధులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వమే వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏటా సుమారు రూ.3,600 కోట్ల సబ్సిడీని భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై సన్న బియ్యం పంపిణీతో మరో రూ.1,500 కోట్ల వరకు భారం పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బియ్యం బాగుంటాయన్న సూచనలతో..సంక్రాంతి నుంచే సన్నబియ్యం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కానీ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నవడ్లను కనీసం రెండు మూడు నెలలైనా మాగనిచ్చి మిల్లింగ్ చేస్తేనే బియ్యం బాగుంటాయని నిపుణులు సూచించడంతో.. రెండు నెలల తర్వాతే సన్న వడ్లను మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించడానికి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో చర్చించిన అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నాయి. ఉగాది (మార్చి నెలాఖరు) నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. -
టీడీపీ శ్రేణుల దౌర్జన్యం
మచిలీపట్నంటౌన్: ఎన్నికల ఫలితాల్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించడంతో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ఆ పార్టీ శ్రేణులు దౌర్జన్యాలకు దిగుతున్నాయి. ఓ పక్క కౌంటింగ్‌లో టీడీపీకి అనుకూల పవనాలు వీస్తున్న సమయంలో పేర్ని వెంకట్రామయ్య (నాని) ఇంటి సమీపంలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడిన టీడీపీ, జనసేన కార్యకర్తలు బుధవారం మళ్లీ దాడులకు యత్నించారు. నగరంలోని పలు కాలనీల్లో ఆయా ప్రాంతాల్లోని టీడీపీ కార్యకర్తలు బైక్‌ల సైలెన్సర్లు తీసి పెద్ద శబ్ధాలతో హడావుడి చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల నివాసప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచాను కాలుస్తూ నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. బుధవారం నగరంలోని 28వ డివిజన్ ఓగీస్పేట ప్రాంతంలో మొబైల్ డిస్ట్రిబ్యూçÙన్ యూనిట్ (ఎండీయు) వాహనం ద్వారా నిర్వాçßæకుడు పిండి శ్యాంబాబు కార్డుదారులకు సరుకులు అందజేస్తున్నాడు. ఈ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా అక్కడకు చేరుకుని ముందు వాహనం నుంచి దిగాలని శ్యాంబాబును దౌర్జన్యంగా దింపి దాడి చేయబోయారు.దీంతో అక్కడే ఉన్న ప్రజలు అడ్డుకున్నారు. వాహనానికి టీడీపీ జెండాలను కట్టి జగన్స్టిక్కర్లను చించివేశారు. దీంతో శ్యాంబాబు విషయాన్ని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో పాటు డీఎస్వో, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. బుధవారం వరకు ఎన్నికల కోడ్ ఉన్నందున గురువారం ఆ ప్రాంతానికి వెళ్లి సరుకులు పంపిణీ చేయాలని, మళ్లీ వారు ఏమైనా ఇబ్బంది పెడితే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. -
పేదలందరికీ అన్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ప్రతి ఆరు నెలలకోసారి నూతన బియ్యం కార్డుల మంజూరుకు శ్రీకారం చుట్టింది. తొలి అర్ధ సంవత్సరం జూన్‌లో, చివరి అర్ధ సంవత్సరం డిసెంబర్లో.. అప్పటి వరకు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కొత్త కార్డులను అందిస్తోంది. తాజాగా 26 జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 70,807 రైస్ కార్డులను మంజూరు చేసింది. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి వీటిని పంపిణీ చేయనుంది. ఈ మేరకు కార్డుల ముద్రణను దాదాపు పూర్తి చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1.39 కోట్ల కార్డులు మాత్రమే ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కార్డుల సంఖ్యను 1,45,43,996కు పెంచింది. వీటి కింద 4.24 కోట్ల మందికి 2.31 టన్నుల బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఇచ్చేవాటితో కలిపితే మొత్తం కార్డుల సంఖ్య 1,46,14,803 అవుతుంది. అదనంగా 1.66 లక్షల మందికి ప్రతి నెలా 8.30 లక్షల టన్నుల రేషన్‌ను పంపిణీ చేయనుంది. ఇందుకుగాను ప్రభుత్వంపై నెలకు రూ.3.40 కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీతో పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన(సార్టెక్స్) బియ్యం ఇస్తోంది. అందువల్ల ప్రతి నెలా 90 శాతానికి పైగా ప్రజలు రేషన్ తీసుకుంటున్నారు. ఆరు దశల ధ్రువీకరణ ముఖ్యం రాష్ట్రంలో బియ్యం కార్డుల మంజూరులో ప్రభుత్వం ఆరు దశల ధ్రువీకరణ(సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్) విధానాన్ని అవలంబిస్తోంది. ఇందులో అర్హులైతేనే కొత్త కార్డులిస్తోంది. ఈ క్రమంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో వెసులుబాటు కల్పించాం. వీటిపై వచ్చే దరఖాస్తులను సచివాలయ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పునఃపరిశీలన జరిపి అర్హులని తేలితే.. ఆ మేరకు సరిచేసి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
మళ్లీ రేషన్ కార్డుపై ఉచిత బియ్యం.. యూనిట్‌కు 10 కిలోల పంపిణీ
సాక్షి, సిటీబ్యూరో: ఆహార భద్రత (రేషన్) కార్డు కలిగిన కుటుంబాలకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా యూనిట్‌కు పది కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ కానుంది. ఈ నెల ఐదు నుంచి ఉచిత బియ్యం కోటా పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెల్లడించారు. కోవిడ్ నేపథ్యంలో పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం పంపిణీ మధ్యలో రెండు నెలలు నిలిచిపోగా, గత నెల చివర్లో నెల సరి కోటాతో సంబంధం లేకుండా యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున ఉచితంగా అదించారు. ఈ నెలలో మాత్రం పాత పద్ధతిలోనే యూనిట్‌కు పది కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. కార్డులో ఎన్ని యూనిట్లుంటే అన్ని పదికిలోల చొప్పన పంపిణీ చేస్తారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా నెలసరి ఉచిత కోటా ఈ నెల 29 వరకు డ్రా చేసుకోవచ్చు. గత రెండేళ్ల నుంచి.. కేంద్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఉచిత కోటా కేటాయిస్తూ అమలు చేస్తోంది. ఆహార భద్రత కార్డులోని ప్రతి లబ్ధిదారుడికి ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యం కోటా కేటాయించగా రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు కిలోలు కలిపి పది కిలోల చొప్పున అందిస్తూ వస్తోంది. ఉచితం బియ్యం పథకం కాలపరిమితి మార్చి కోటాతో ముగియడంతో కేంద్రం మరోసారి సెప్టెంబర్ వరకు పథకాన్ని పొడగించింది. అయితే ప్రభుత్వ చౌకధరల దుకణాల ద్వారా ఏప్రిల్, మే, జూన్‌న్ నెలల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ సాధ్యం కాలేదు. రూపాయి కిలో చొప్పున అందించారు. అయితే గత నెల చివర్లో మాత్రం నెలసరి కోటా పంపిణి గడువు ముగియగానే యూనిట్‌కు ఐదు కిలోల చొప్పున అందించింది. ఈ నెలలో మాత్రం పది కిలోల చొప్పున పంపిణీ చేయనుంది. చదవండి: పట్టు బిగించండి.. రాష్ట్ర నేతలకు బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశం -
పంజాబ్‌లోనూ ఇంటి వద్దకే రేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి ప్రవేశపెట్టిన ‘ఇంటి వద్దకే రేషన్’ విధానం, నాణ్యమైన బియ్యం పంపిణీని పలు రాష్ట్రాలు ప్రశంసించడంతో పాటు వాటి అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల పంజాబ్‌లో కొలువుదీరిన ఆప్ ప్రభుత్వం ‘ఘర్ ఘర్ రేషన్ యోజన’ పేరుతో లబ్ధిదారుల ఇంటికే బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు రేషన్ కోసం గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేదని ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. ‘తరచుగా రేషన్ పొందడానికి ఒక రోజు వెచ్చించాల్సి వస్తోంది. రేషన్ కోసం వృద్ధులు కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్తున్నారు. ప్రజలకు చేరే రేషన్‌లోనూ నాణ్యత కొరవడింది. ఇకపై పంజాబ్‌లో ఇది కొనసాగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది’ అని చెప్పారు. నాణ్యమైన రేషన్‌ను శుభ్రమైన సంచులలో ప్యాక్ చేసి ఇంటికే పంపిణీ చేసేందుకు త్వరలోనే విధానాలను రూపొందించనున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం పంజాబ్ కంటే ముందుగానే ఢిల్లీలో ఇంటింటికీ రేషన్‌ను పంపిణీ చేయాలనుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ అడ్డంకుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లా పర్యటనలో కేంద్ర బృందం, విజయవాడ పర్యటనలో కేరళ పౌర సరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్.. రాష్ట్రంలో రేషన్ పంపిణీ విధానంపై ప్రశంసలు కురిపించారు. దేశంలో దాదాపు 8 రాష్ట్రాలకు పైగా రేషన్ డోర్ డెలివరీపై ఆసక్తి కనబరుస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజల కోసం అదనపు భారం భరిస్తున్న ఏపీ వాస్తవానికి ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏడాది కిందటే రాష్ట్రంలో ఇంటి వద్దకే నాణ్యమైన రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. గంటల పాటు క్యూలో నిల్చుని రేషన్ సరుకులు తెచ్చుకునేందుకు ప్రజలు ఇబ్బందులు çపడుతుండటంతో పాటు ఒక రోజు పనిని వదులుకుని, కూలి పోగొట్టుకోవాల్సి వచ్చేది. ఇటువంటి వారి కోసం రూ.530 కోట్లకు పైగా వ్యయంతో 2021 ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మొబైల్ వాహనాలతో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మొత్తంగా 1.45 కోట్ల కార్డుదారులు ఉండగా, నెలలో 18 రోజుల పాటు వీరందరికీ ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఒక్కో వాహనం విలువ రూ.5.81 లక్షలు కాగా, ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ వాహనాలను వాడుకున్నందుకు పౌర సరఫరాల శాఖ నెలకు సుమారు రూ.16.67 కోట్లకు పైగా చెల్లిస్తోంది. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా వాహనదారుడితో పాటు హెల్పర్ల కింద సుమారు 17 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఇలా ఏటా నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సుమారు రూ.830 కోట్లకు పైగా ప్రజల కోసం అదనపు భారం భరిస్తోంది. -
మళ్లీ ఉచిత బియ్యం
సాక్షి, అమరావతి: కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో పేద కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ముందుకొచ్చింది. దారిద్యరేఖకు దిగువన ఉన్న 1.47 కోట్ల బియ్యం కార్డుదారుల కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి మే, జూన్లలో 10 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. అదికూడా వారు ఎలాంటి ఇబ్బంది లేకుండా తినగలిగేలా సార్టెక్స్ చేసి నాణ్యత పెంచిన స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం గమనార్హం. కరోనా గడ్డు పరిస్థితుల్లో పేదలు పస్తులుండగా ఆదుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల్లో దాదాపు రూ.800 కోట్లు వెచ్చించనుంది. కేంద్రం ఇస్తామన్న దానికి రెండింతలు పేదలను ఆదుకునేందుకు ఉచిత బియ్యం పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం చెప్పినదాని కంటే రెండింతలు ప్రయోజనం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. బియ్యంకార్డులున్న కుటుంబాల్లో ప్రతి సభ్యుడికి నెలకు 5 కిలోల చొప్పున మాత్రమే మే, జూన్‌లో ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 1.47 కోట్ల బియ్యంకార్డులు ఉండగా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 88 లక్షల బియ్యంకార్డులను మాత్రమే గుర్తించింది. ఈ కుటుంబాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో పేదలు అందరికీ ఉచితంగా బియ్యం పంపిణీ చేయలని నిర్ణయించారు. అంతేకాకుండా ఒక్కో లబ్ధిదారుడికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కేజీలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరో 5 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించడం విశేషం. తద్వారా 88 లక్షల బియ్యం కార్డులకు కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా రాష్ట్రం మరో 5 కిలోలతో కలిపి మొత్తం పది కిలోలు కార్డుదారుల్లో ఒక్కో సభ్యుడికి ఉచితంగా ఇవ్వనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం గుర్తించని మిగిలిన 59 లక్షల బియ్యంకార్డుదారుల కుటుంబాలకు సంబంధించి ఒక్కో సభ్యుడికి నెలకు 10 కిలోల చొప్పున మే, జూన్‌లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భారాన్ని భరించి ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు దాదాపు రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. నాణ్యమైన సార్టెక్స్ స్వర్ణ బియ్యం దేశవ్యాప్తంగా పేదలకు సాధారణ బియ్యాన్నే పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పేదలకు సార్టెక్స్ చేసి నాణ్యత పెంచిన స్వర్ణ రకం మధ్యస్త సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నెలకు ఒకే విడతలో పంపిణీ... గత ఏడాది కూడా కరోనా తీవ్రత ఉన్న ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రెండు విడతల్లో ఉచితంగా బియ్యం పంపిణీ చేయడం తెలిసిందే. ఈసారి ప్రజల సౌకర్యార్థం నెలకు ఒకే విడతలో బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. బియ్యంకార్డుదారుల కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి నెలకు 10 కేజీల చొప్పున బియ్యాన్ని మేలో ఒకసారి, జూన్‌లో మరోసారి ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇంటింటికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న వాహనాల ద్వారానే బియ్యం అందచేస్తారు. -
ఇంటింటికీ 'ఆనందం'
సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పంపిణీ విధానం అమల్లోకి రావడంతో పేదలకు శ్రమ తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుండటంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలు వెచ్చించి బియ్యాన్ని కొనుక్కోవాల్సిన అవసరం తప్పింది. దీనివల్ల కుటుంబ ఖర్చులు ఎంతో ఆదా అవుతున్నాయని లబ్ధిదారులు ఆనందంగా చెబుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం గతంలో రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సర్వర్ సక్రమంగా పని చేయకపోయినా.. ఏదైనా సమస్య తలెత్తినా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక్కోసారి పనులకు వెళ్లకుండా రెండు, మూడు రోజులపాటు రేషన్ షాపులకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. రోజూ కూలి పనులకు వెళితే గాని కడుపు నిండని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారంతా రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చినప్పుడు ఆదాయం కోల్పోయేవారు. అలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కించే సంకల్పంతో మొబైల్ వాహనాల పేదల ఇంటికే వెళ్లి రేషన్ సరుకుల్ని పంపించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తప్పిన ఇబ్బందులు ఇంటింటికీ రేషన్ విధానం అమలు చేయడం వల్ల లబ్ధిదారులకు సరుకులు అందేవరకు మొబైల్ వాహనం అక్కడి నుంచి వెళ్లే అవకాశం లేదు. రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందనే సమాచారం కూడా ముందుగానే ఇస్తుండటం వల్ల ఎంతో ప్రయోజనం కల్గుతోంది. గతంలో పంపిణీ చేసిన బియ్యంలో రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండేవి. ఆ బియ్యం ముక్కిపోయిన వాసన రావడంతో చాలామంది వండుకుని తినేందుకు ఉపయోగించేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో కిలో రూ.45 చొప్పున మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం రాళ్లు, నూకలు, ముక్కిపోయినవి కాకుండా ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తుండటంతో పేదలు వాటినే వండుకుని తింటున్నారు. దీంతో ప్రతి నెలా బియ్యం కోసం ఖర్చు చేసే మొత్తం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా ఉపాధి నిమిత్తం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన లబి్ధదారులు నాణ్యమైన బియ్యం పంపిణీని వరంగా భావిస్తున్నారు. పట్టణాల్లో రోజుకు రెండు లక్షల కుటుంబాలకు.. పట్టణాల్లో మార్చి నెల కోటా సరుకులు ఈ నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా రోజుకు 2 లక్షల కుటుంబాలకు సరుకులు అందుతున్నాయి. మూడు రోజుల్లో దాదాపు 6 లక్షల కుటుంబాలకు 95.24 లక్షల కిలోల బియ్యం అందాయి. గురువారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఖర్చు బాగా తగ్గింది ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడంతో మా కుటుంబానికి బియ్యం ఖర్చు బాగా తగ్గింది. గతంలో ఇచ్చే బియ్యం నాసిరకంగా ఉండటంతో బయట మార్కెట్లో కొనేవాళ్లం. ఇప్పుడ ఆ బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్నే వండుకుని తింటున్నాం. – ఎస్.షేక్ షావలి, ఇందిరా నగర్, కర్నూలు బిర్యానీకీ రేషన్ బియ్యాన్నే వాడుతున్నాం బిర్యానీ చేసినప్పుడు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాణ్యమైన బియ్యాన్నే వాడుతున్నాం. గతంలో రేషన్ బియ్యం వండుకునే వీలులేక తప్పని పరిస్థితుల్లో విక్రయించేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. – బచ్చు దాలమ్మ, ముడియా వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా క్యూలో నిలబడే బాధ తప్పింది గతంలో మూడు వీధులు దాటుకుని వెళ్లి రేషన్ షాపు వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడే వాళ్లం. ఇప్పుడు ఏమాత్రం శ్రమ పడకుండానే సరుకులు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. – నేరెడుమిల్లి జయలక్ష్మి, జగన్నాథపురం, కాకినాడ పిలిచి మరీ ఇస్తున్నారు ఇంటి గుమ్మం వద్దకే వచ్చి అక్కా.. రేషన్ సరుకులు వచ్చాయని మరీ చెప్పి ఇస్తున్నారు. రేషన్ షాపు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకునే బాధ తప్పింది. నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – ఎన్.సువేద, కల్లూరు, కర్నూలు -
ఎల్లుండి బియ్యం పంపిణీ వాహనాల ప్రారంభం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇంటింటికీ రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలను ఈనెల 21వ తేదీన సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడలోని బెంజి సర్కిల్లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జెండా ఊపి వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత చెప్పారు. సోమవారం విజయవాడలో వాహనాల డ్రైవర్లు, వీఆర్వోలకు అవగాహనా సదస్సు నిర్వహించారు. మాధవీలత మాట్లాడుతూ.. కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాలకు చెందిన 2,503 డోర్ డెలివరీ వాహనాలను సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. 20వ తేదీ రాత్రి 9 గంటలకు విజయవాడలోని బందర్ రోడ్డుపై ఒకొక్క వరుసలో 625 వాహనాల చొప్పున నాలుగు వరుసల్లో వాహనాలను నిలపాలని డ్రైవర్లకు సూచించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వీఆర్వోలను ఆదేశించారు. -
జనవరి 1 నుంచి ఇళ్ల వద్దకే నాణ్యమైన బియ్యం
సాక్షి, అమరావతి: పేదలకు జనవరి 1 నుంచి ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం పౌరసరఫరాల సంస్థ 9,260 మొబైల్ వాహనాలు (మినీ ట్రక్కులు) కొనుగోలు చేసేందుకు టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఈ నెలాఖరులోగా వాహనాలు సిద్ధం కానున్నాయి. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా.. అధికారంలోకి వస్తే పేదలకు నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని వైఎస్ జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడుతున్నా ఇచ్చిన హామీ అమలుకు సీఎం గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని కొంతమంది లబ్ధిదారులు దళారులకు విక్రయిస్తున్నారు. వీరు ఆ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి తిరిగి మార్కెట్లోకి తెస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నెరవేరడం లేదు. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రజాపంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనుంది. ఏజెన్సీ ప్రాంతాలకు ఎంతో లబ్ధి ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. సరుకుల కోసం రేషన్ షాపుల వరకు వెళ్లకుండా లబ్ధిదారులు తమ ఇళ్ల వద్దే తీసుకుంటున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, కొండ గుట్టల్లో నివాసం ఉంటున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతోంది. గతంలో వీరు సరైన రవాణా సౌకర్యం లేక సబ్సిడీ బియ్యం తీసుకోలేకపోయేవారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిగా శ్రీకాకుళం జిల్లాలో ఇంటింటికీ బియ్యం పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన బియ్యం పేదలకు వరం నాణ్యమైన బియ్యం పేదల ఇంటికే డోర్ డెలివరీ చేయడం వారికి ఒక వరం. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా పేదల ఇబ్బందుల దృష్ట్యా సరుకుల పంపిణీ కోసం 9,260 మొబైల్ వాహనాలను కొనుగోలు చేస్తున్నాం. జనవరి 1 నుంచి ప్రతి బియ్యం కార్డుదారుడికి ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేస్తాం. ప్రతినెలా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యం అవసరమవుతాయని అంచనా వేశాం. – కోన శశిధర్, ఎక్స్ అఫీషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ జిల్లాల వారీగా మొబైల్ వాహనాలు ఇలా.. జిల్లా మొబైల్ వాహనాలు శ్రీకాకుళం 526 విజయనగరం 456 విశాఖపట్నం 766 తూర్పుగోదావరి 1,040 పశ్చిమ గోదావరి 795 కృష్ణా 805 గుంటూరు 920 ప్రకాశం 634 నెల్లూరు 566 వైఎస్సార్ 515 కర్నూలు 754 అనంతపురం 761 చిత్తూరు 722 మొత్తం 9,260 -
ధాన్యం సేకరణకు 50 లక్షల ఓవెన్ బ్యాగ్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గోనె సంచుల కొరత ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ నుంచి సరఫరా కావాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఆరు నెలలుగా సరఫరా ఆగిపోవడంతో ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. దీంతో ఇబ్బందులు తలెత్తకుండా 50 లక్షల సంచులను (ఓవెన్ బ్యాగులు) కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నిర్ణయించింది. ఇందుకు టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో 62 లక్షల మెట్రిక్ టన్నుల ఖరీఫ్ ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రణాళిక రూపొందించగా.. అందుకు అవసరమైన సంచులను సిద్ధం చేస్తున్నారు. రేషన్ డీలర్ల నుంచి సేకరిస్తున్నా.. సంచుల కొరత నుంచి గట్టెక్కేందుకు బియ్యం పంపిణీ కోసం వినియోగించిన గోనె సంచులను రేషన్ డీలర్ల నుంచి పౌర సరఫరాల సంస్థ కొనుగోలు చేస్తోంది. రైస్ మిల్లర్ల నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన సేకరిస్తున్నారు. అయినప్పటికీ ఆ సంచులు ఏమాత్రం సరిపోయే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో తాత్కాలిక ఉపశమనం పొందేందుకు 50 లక్షల సంచులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. -
20 నుంచి ఉచిత బియ్యం
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు ఈ నెల 20 నుంచి ఉచిత సరుకులను పంపిణీ చేయనున్నారు. పౌర సరఫరాల సంస్థ ఏపీలోని అన్ని రేషన్ షాపులకు సరుకులను సరఫరా చేసింది. నెలకు 2 విడతలు చొప్పున ఏప్రిల్ కోటా నుంచి ప్రారంభించి.. ఇప్పటికి 13 సార్లు పంపిణీని పూర్తిచేశారు. ఈ విడతలో లబ్ధిదారులకు బియ్యం, శనగలు ఇస్తారు. 70 వేల మందికి కొత్త కార్డులు.. ఇప్పటికే కార్డులుండి వివిధ కారణాలతో అనర్హులుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. అనర్హులుగా పరిగణించిన కార్డుదారుల్లో ఎక్కువ మంది తాము అర్హులమేనని, ఒక కుటుంబ సభ్యుడు ఆదాయపు పన్ను చెల్లిస్తే మొత్తం కార్డునే రద్దు చేశారంటూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం సీఎం వైఎస్ జగన్ దృష్టికి వెళ్లడంతో సమస్యను వెంటనే పరిష్కరించారు. దీంతో 70 వేల కుటుంబాలకు కొత్తగా కార్డులు మంజూరయ్యాయి. -
రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఆహార ఇబ్బందులు తప్పాయి. రబీలో ఆశించిన మేరకు ధాన్యం దిగుబడి రావడంతో ప్రజా పంపిణీ వ్యవస్థ సవ్యంగా సాగింది. రబీలో రికార్డు స్థాయిలో 31.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం రైతుల నుంచి సేకరించింది. కరోనా కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం నెలకు రెండు విడతలుగా బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ► రాష్ట్రంలో ప్రస్తుతం 1,49,20,706 కార్డులు ఉన్నాయి. వీటిలో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోనివి 89 లక్షలకు పైగా, ఆ చట్టం పరిధిలోకి రానివి 60 లక్షల వరకు ఉన్నాయి. ► ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే కార్డుదారులకే కేంద్రం బియ్యం ఇస్తోంది. మిగిలిన కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోంది. ► ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని కార్డుదారులకు పంపిణీతో రాష్ట్రంపై రూ.800 కోట్లు అదనపు భారం పడింది. ► జూలై నుంచి నవంబర్ వరకు ఉచితంగా బియ్యం ఇస్తామని కేంద్రం ప్రకటనతో రాష్ట్రంపై మరో రూ.1,663 కోట్ల అదనపు భారం పడనుంది. ► ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉండాల్సిన బఫర్ స్టాకూ వాడేశారు. కనీసం 15.05 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అదనంగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించనేలేదు. రబీ ధాన్యమే ఆదుకుంది... నెలకు రెండు సార్లు పంపిణీతో ఆఖరు బఫర్ స్టాకునూ వాడుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అదనంగా కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశాం. రైతుల నుంచి రబీలో కొనుగోలు చేసిన ధాన్యమే ప్రస్తుతం ఆదుకుంటోంది. – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ -
పేదలందరికీ నాణ్యమైన బియ్యం
సాక్షి, అమరావతి: వివిధ సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో బియ్యం కేటాయిస్తోంది. 1982–83లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ప్రభుత్వం 2.55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే కేటాయించగా ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఏడాది 28.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించింది. రాష్ట్రంలో ఎవరూ ఆకలి, పోషకాహార లోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ బియ్యం కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. గతంలో కార్డు కావాలంటే పేదలు ఎంతో ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికింది. బియ్యం కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతలు ఉంటే గ్రామ వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ ఇస్తున్నారు. ► రాష్ట్రంలో 1.49 కోట్ల కుటుంబాలకు పైగా బియ్యం కార్డులు ఉన్నాయి. ► కార్డుదారులతోపాటు మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాలు, ఇతర పాఠశాలల్లో చదివే విద్యార్థుల భోజనం కోసం ప్రభుత్వం బియ్యం కేటాయిస్తోంది. ► దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా అక్టోబర్ నుంచి లబ్ధిదారుల ఇళ్లకే నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద గతేడాది సెప్టెంబర్ నుంచి శ్రీకాకుళం జిల్లాలో అమలు చేస్తోంది. ► ఈ ఏడాది రాష్ట్రం అంతటా నాణ్యమైన బియ్యాన్ని ఇళ్లకే పంపిణీ చేయడం వల్ల ముఖ్యంగా మారుమూల ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో వారికి కష్టాలు పూర్తిగా తప్పనున్నాయి. ► నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.1,500 కోట్లు భారం పడుతుందని అంచనా. ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. -
రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లు
సాక్షి, అమరావతి: నాణ్యమైన బియ్యాన్ని పేదల ఇళ్లకే డెలివరీ చేసేందుకు రాష్ట్రంలో 2.60 లక్షల క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 1,93,488 క్లస్టర్లున్నాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో 50 నుంచి 75 కుటుంబాలుండేలా చర్యలు తీసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టవంతం చేసేందుకు, అవినీతికి తావులేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో క్లస్టర్లో ఒక్కో గ్రామ వలంటీర్ సేవలందిస్తారు. వలంటీర్లు బియ్యం కార్డుల మ్యాపింగ్‌ను దాదాపుగా పూర్తిచేశారు. నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన శ్రీకాకుళం జిల్లాలో లబ్ధిదారులు గడప దాటకుండానే సరుకులు సకాలంలో వారి ఇంటికే చేరుతున్నాయి. ఈ విధానం మరో మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేలా పౌరసరఫరాల శాఖాధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ► క్లస్టర్ పరిధిలో ఉన్న కార్డుదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వారి ఎదుటే నాణ్యమైన బియ్యం తూకం వేసి పంపిణీ చేస్తారు. ► ఇందుకోసం పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 13,370 మొబైల్ యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి. ► ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అయ్యే అదనపు ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ► ఈ విధానం అందుబాటులోకొస్తే 1.49 కోట్ల కార్డుదారులందరికీ రెండు మూడు రోజుల్లోనే సరుకులందుతాయి. ► రవాణాలో బియ్యం కల్తీ చేయకుండా గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపైనా ప్రత్యేకంగా స్ట్రిప్ సీల్, బార్ కోడ్ ఉంటాయి. ► క్లస్టర్ల వివరాలను గ్రామ సచివాలయాల నుంచి తీసుకుని, వాటి ఆధారంగా బియ్యం కార్డులను కేటాయిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు. -
నేటి నుంచి 12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యా ప్తంగా సోమవారం నుంచి ప్ర భుత్వం అందిస్తున్న 12 కిలోల ఉ చిత రేషన్ బియ్యం పంపిణీ మొదలు కానుంది. రాష్ట్రంలోని 2.81కోట్ల మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 12 కిలోల వంతున బియ్యం ఉచితంగా పంపిణీ చేసే లా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తం గా 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇప్పటికే రేషన్ దుకాణాలకు సరఫరా చేసింది. పంపిణీ కోసం రేషన్ దుకాణాలు ఉదయం, సాయంత్రం అన్ని వేళలు పనిచేసేలా చర్యలు చేపట్టింది. లబ్ధిదారులు రేషన్ దుకాణాల మధ్య గుమికూడకుండా, విడతల వారీగా వారికి బియ్యం ఇచ్చే కూపన్లు ఇవ్వనున్నారు. కూపన్లు తీసుకొని చెప్పిన సమయానికే లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్దకు వచ్చి తీసుకోవాలి. ప్రతి రేషన్ దుకాణం వద్ద శానిటైజర్లు, స బ్బు, నీటిని అందుబాటులో ఉంచాలని పౌరసరఫ రాల శాఖ రేషన్ డీలర్లను ఆదేశించింది. ఇక కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కందిపప్పు పంపిణీపై మా త్రం సందిగ్ధత నెలకొంది. ఏప్రిల్, మే, జూన్ నెల ల్లో 8,800 టన్నులు కేటాయించాల్సి ఉండగా, ఆ స్థాయిలో కేటాయింపులు లేవు. మరి ఈ నెలలో కేంద్రం ఏం చేస్తుందన్న దానిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
నాలుగో విడత రేషన్ పంపిణీ ప్రారంభం
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ వేళ పేదల ఆకలిని తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నాలుగో విడత రేషన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పీడీఎఫ్ బియ్యం, కేజీ శనగలు అందజేసున్నారు. రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలు బియ్యంకార్డులు కలిగి ఉన్నాయి. కొత్తగా 81,862 పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కార్డుదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ అందజేస్తున్నారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద డీలర్లు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. (ఆ గ్రామస్తులకు ఏ కష్టం రాకూడదు) నేటి నుంచి 27వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కో కుటుంబసభ్యుని ఐదు కేజీల ఉచిత బియ్యం, అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చెస్తున్నారు. అన్నపూర్ణ కార్డుదారులకు పదికిలోల ఉచిత బియ్యం అందజేస్తున్నారు. ప్రతీ కార్డుకూ కిలో శనగపప్పు ఉచితంగా ఇస్తున్నారు. వేలిముద్ర తప్పనిసరి కావటంతో రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో రేషన్ కార్డు లేని పేదలకు కూడా సరుకులు పంపిణీ చేస్తున్నారు. సబ్సి డీ ధరపై అర కేజీ పంచదార అందజేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 12, 59,936 రేషన్ కార్డు దారులు లబ్ది పొందనున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడే సరుకులు తీసుకొనేలా పోర్టబిలిటీ అవకాశం కల్పించారు. కరోనా కారణంగా కూపన్ల పద్ధతి అమలు చేస్తున్నారు. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా టైం స్లాట్ కూపన్లను అధికారులు అందజేస్తున్నారు. కూపన్లో సూచించిన తేదీలో నిర్ధేశించిన సమయానికే లబ్ధిదారులు రేషన్‌కి రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లబ్ధిదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. మాస్కులు ధరించి క్యూలైన్లో దూరం పాటించాలని అధికారులు లబ్ధిదారులకు సూచనలు ఇస్తున్నారు. -
అనాథ ఆకలి తీర్చిన పోలీస్
విజయనగరం ,కొత్తవలస: విధులు అందరూ నిర్వర్తిస్తుంటారు. కాని సేవలు మాత్రం కొందరే అందిస్తారు. పోలీసులంటే సమాజంలో ఓ రకమైన భావం ఉన్న ఈ రోజుల్లో వారిలోనూ కారుణ్యం ఉంటుందని వారి గుండెల్లోనూ మానవత్వం ఉంటుందని కొత్తవలస పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ వై.సురేష్ కుమార్ నిరూపిస్తూ పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. విశాఖ–అరకు జాతీయరహదారిలో ఓ ప్రైవేటు ఆస్పత్రి సమీపంలో ఓ అనాథ వారం రోజులుగా చెత్తలోనే కాపురముంటూ ఆకలి వేస్తే అన్నం కావాలని కూడా ఎవరినీ అడగకుండానే జీవనం సాగిస్తున్నాడు. ఈ విషయం గమనించిన సురేష్ వెంటనే స్పందించి ఆహారం సమకూర్చటంతో పాటు తనచేతితో ముద్దలు తినిపించి మరీ ఆ జీవి ఆకలితీర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. -
లబ్ధిదారుల ఇంటికే నాణ్యమైన బియ్యం
సాక్షి, అమరావతి: ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్ డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదేరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని స్పష్టం చేశారు. కోవిడ్–19 నివారణ చర్యలపై సమీక్షలో భాగంగా శుక్రవారం ఆయన పౌరసరఫరాల శాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ చేయడానికి పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతోంది. పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. అర్హులందరికీ లబ్ధి కలిగేలా చర్యలు ► అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రేషన్ పంపిణీలో ఉన్న లోటు పాట్లను సరిదిద్ది అవినీతిని రూపుమాపడంతో పాటు పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బియ్యం కార్డులను తీసుకు వచ్చింది. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులైన వారందరికీ కార్డులు మంజూరు చేసే వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ బియ్యం కార్డు అందించడానికి సామాజిక తనిఖీలో భాగంగా సచివాల యాల్లో లబ్ధిదారుల జాబితాను ఉంచా రు. అందులో పేరులేని వారు ఎవరికి దరఖాస్తు చేయాలన్న వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. ► వాటి ఆధారంగా దర ఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి అధికా రులు బియ్యం కార్డులను మంజూరు చేశారు. ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నాణ్యతపై దృష్టి ► నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే తాజా ఆదేశాలు జారీ చేశారు. ► రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేసే కార్యక్రమంలో భాగంగా నాణ్యమైన బియ్యాన్ని సేకరించడం, ఆ బియ్యాన్ని ప్యాక్ చేయడం, ఇంటికే డోర్ డెలివరీ చేయడాన్ని శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. నాణ్యమైన బియ్యాన్ని అందుకుంటున్న వారి నుంచి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం స్వీకరించింది. ప్రతి బ్యాగ్‌పై స్ట్రిప్ సీల్, బార్ కోడ్ – కోన శశిధర్, ఎక్స్ అఫిషియో కార్యదర్శి, పౌరసరఫరాల శాఖ. గోడౌన్ల నుంచి వచ్చే ప్రతి గన్నీ బ్యాగుపై స్ట్రిప్ సీల్, బార్ కోడ్ ఉంటుంది. కల్తీ లేకుండా, రవాణాలో అక్రమాలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉండేలా 13,370 మొబైల్ యూనిట్లను పెడుతున్నాం. ఇందులోనే ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషీన్ ఉంటుంది. ఈ మొబైల్ యూనిట్ల ద్వారా ప్రతి లబ్ధిదారుని ఇంటికి వెళ్లి బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తాం. లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్‌ను ఓపెన్ చేసి వారికి నిర్దేశించిన కోటా ప్రకారం బియ్యాన్ని అందిస్తాం. బియ్యాన్ని తీసుకోవడం కోసం లబ్ధిదారునికి నాణ్యమైన సంచులను ఉచితంగా అందిస్తున్నాం. ప్రతినెలా 2.30 లక్షల మెట్రిక్ టన్నుల నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తాం. -
ఆకలి ఓడగా.. ఆమె నవ్వగా!
సాక్షి, సిటీబ్యూరో: లాక్డౌన్ వేళ పట్టెడన్నం కోసం ఎందరో ఆరాటపడుతున్నారు. వలస కూలీలు, రోడ్ల వెంట నివసిస్తున్న వారు, యాచకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. శేరిలింగంపల్లిలో శుక్రవారం కొందరు దాతలు ఆహారం పొట్లాలు, నీళ్ల బాటిళ్లు పంపిణీ చేయగా..అది తీసుకున్న ఆనందంలో ఓ యువతి ఇలా... (ఆపరేషన్ మార్కెట్) ఆశయమే శ్వాసగా.. కోవిడ్ విజృంభిస్తున్న వేళ రెడ్జోన్లు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఆశ వర్కర్లు క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పలువురు నర్సులు, ఆశ వర్కర్లు మలక్‌పేట పరిధిలో రెడ్‌జోన్ ప్రకటించిన కాలనీల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. -
రైట్ పర్సన్‌కు రాంగ్ నంబర్
ఏప్రిల్ ఒకటో తేదీ, చెన్నైలో ఉన్న ఆర్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిందెవరో తెలియదు. తన కాంటాక్ట్స్‌లో ఉన్న నంబరు కాదు. ట్రూ కాలర్ చూపిస్తున్న పేరు కూడా తనకు తెలిసినది కాదు. అయినా ఆ ఫోన్ కాల్ ఆన్సర్ చేసిందామె. ‘అవసరం లేకపోతే ఎవరైనా ఎందుకు ఫోన్ చేస్తారు? తెలియని వారి నుంచి వచ్చిన ఫోన్ కాల్ అయినా సరే... వారు తెలియని కారణంగా ఫోన్ తీయకపోవడమేంటి’ అనే ఆమె తత్వమే ఆ ఫోన్ కాల్‌ను కూడా ఆన్సర్ చేసేలా చేసింది. ఆమె ఫోన్ ఆన్సర్ బటన్ తాకిందో లేదో... ‘హలో’ అనే లోపే ఆవేదన నిండిన ఒక గొంతు ఆక్రోశమంతా వెళ్లగక్కింది. ‘‘అన్నం తిని మూడు రోజులైంది. మీరు వెంటనే ఏదైనా చేయండి’’ అది అర్థింపో, వేడికోలో కూడా అర్థం కావడం లేదు ఆర్తికి. అంతకంటే మరేదో ఉందా గొంతులో. ‘అమ్మా! నాకు ఆకలవుతోంది. అన్నం పెట్టు. ఇంతసేపు అన్నం పెట్టకుండా ఏం చేస్తున్నావ్, త్వరగా పెట్టు’ అంటూ పిల్లవాడు తల్లి కొంగును గుంజుతుంటాడు. మరేమీ పాలుపోక వెంటనే అన్నం కలిపి పెట్టేంతగా ప్రభావితం చేస్తుంది పిల్లల హఠం. ఫోన్లో వినిపిస్తున్న వ్యక్తి మాటలు కూడా అలాగే ఉన్నాయి. సొంత తల్లిని అడుగుతున్నట్లే హక్కులాంటిదేదో ధ్వనిస్తుందా గొంతులో. ఎవరో తెలియదు, ఆకలితో ఉన్నారని మాత్రం తెలుస్తోంది. అతడు ఎక్కడున్నాడో తెలుసుకుంది ఆర్తి. అతడు మాట్లాడుతున్నది హోసూర్ నుంచి. అతడు హోసూరుకు వచ్చింది జార్ఖండ్ నుంచి. జార్ఖండ్ నుంచి హోసూరుకు వచ్చిన వలస కూలీ అతడు. కోవిడ్ కోరల్లో చిక్కుకున్న ఒక అభాగ్య జీవి. పని లేదని మానుకోదు ఆకలి. తన టైమ్‌కి తాను దాడి చేసి తీరుతుంది. పట్టెడన్నం పెట్టి ఆ దాడికి అడ్డుకట్ట వేయమంటోందా ఫోన్. చెన్నై నుంచి హోసూరుకు మూడు వందల కిలోమీటర్లు. ఐదు గంటల ప్రయాణం. ఆర్తి వెంటనే హోసూరులో తనకు తెలిసిన వారికి సమాచారం ఇచ్చి జార్ఖండ్ వ్యక్తికి నిత్యావసర సరుకులు అందే ఏర్పాటు చేసింది. ‘ఆ వ్యక్తి తనకే ఎందుకు ఫోన్ చేశాడు? తన నంబర్ ఎలా తెలిసింది’ అని కొన్ని క్షణాల పాటు ఆలోచించింది ఆర్తి. ఆ తర్వాత మర్చిపోయింది. రెండో రోజు కూడా ఏప్రిల్ రెండో తేదీ కూడా మళ్లీ ఫోన్. ఈసారి జార్ఖండ్ వ్యక్తి కాదు, మరొకరు. ఈసారి వచ్చిన ఫోన్ కాల్ ఒకరి ఆకలి గురించి కాదు. ఏకంగా నూటా తొంబయ్ ఎనిమిది మంది ఆకలి. దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి భవన నిర్మాణరంగంలో దినసరి కూలీలుగా పని చేస్తున్న వాళ్ల నుంచి. లాక్డౌన్ ప్రకటించిన వెంటనే కాంట్రాక్టర్లు పనులు మానేసి తమ కార్లలో సొంతూళ్లకు వెళ్లిపోయారు. కార్మికులు మాత్రం తాత్కాలిక గుడారాల్లో మిగిలిపోయారు. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది. అన్నం పెట్టే వాళ్ల కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి. ఆర్తికి వచ్చిన రెండో ఫోన్ అదే. ఆ తర్వాత మంగుళూరు నుంచి అలాంటిదే మరో ఫోన్. ఐదు రోజుల్లోనే ఆమెకు పదికి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. రెండు వందల పదిహేడు మంది ఆకలి పిలుపులవి. అన్నం పెట్టమనే వేదనలవి. ఆమె స్వయంగా కొందరికి, సోషల్ మీడియా ద్వారా మరికొందరికి సహాయం చేసింది. అంకె మారింది అంతమంది అన్నం పెట్టమని తనను అడగడంలోని ఆంతర్యం ఆర్తికి వారిని స్వయంగా కలిసినప్పుడు తెలిసింది. తమిళనాడు ప్రభుత్వం కోవిడ్ లాక్డౌన్లో చిక్కుకుపోయి, పనుల్లేక ఆకలితో అలమటిస్తున్న వాళ్లకు సహాయం చేయడానికి ఒక హెల్ప్‌లైన్ నంబరు ఇచ్చింది. ప్రభుత్వం విడుదల చేసిన ఫోన్ నంబరులో పొరపాటున ఒక అంకె మారిపోయింది. ఆ అంకె మారగా వచ్చిన నంబరు ఆర్తి మధుసూదన్ది. అందుకే ‘అమ్మా! ఆకలి’ అంటూ ఆమెకు ఫోన్ కాల్స్ వచ్చాయి. ప్రభుత్వం పొరపాటుగా నంబరు తప్పుగా విడుదల చేయడం కొత్తేమీ కాదు. కానీ అలా వచ్చిన ఫోన్ కాల్స్‌కు స్పందించి అడిగిన వారి ఆకలి తీర్చడమే కొత్త. అన్నం పెట్టే అన్నపూర్ణ వంటి మనసున్న ఆర్తికే అలాంటి ఫోన్లు రావడం ఓ విచిత్రం. ఆర్తి మధుసూదన్ ఏప్రిల్ ఒకటి నుంచి ప్రతి డెవలప్‌మెంట్‌నీ ఫేస్బుక్లో షేర్ చేసింది. సమాచారం సంబంధిత అధికారులకు చేరింది. ఆరవ తేదీ నుంచి ఆమెకు ‘అకలమ్మా’ అనే ఫోన్లు రావడం లేదు. ‘‘బహుశా ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబరును సరి చేసి ఉండవచ్చు’’ అంటోంది ఆర్తి. – మంజీర -
ఇంటింటికి 5 కిలోల బియ్యం పంపిణి
-
అన్నం పంచే అబ్బాయి
కరోనా కారణంగా ప్రస్తుతం జనతా కర్ఫ్యూ, లాక్డౌన్ నడుస్తోంది. అనాథలు, బిచ్చగాళ్లు, వీధి బాలలకు, రోడ్డు మీద నివసించేవారికి ఇది ఒక గడ్డుకాలంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు. ఇదే సమయంలో స్వచ్ఛంగా సేవ చేసేవారు కూడా ముందుకు వచ్చి, చేతనైనంత సహాయం చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తి చాలాకాలంగా హోటల్స్‌లోను, పెద్ద పెద్ద ఇళ్లలోనూ మిగిలిన ఆహారాన్ని సేకరించి, ఫుట్‌పాత్‌ల మీద నివసిస్తున్న అనాధలకు ఆ ఆహారాన్ని సుమారు నాలుగు సంవత్సరాలుగా అందిస్తున్నారు. తన స్నేహితులతో కలిసి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారు. ఇందుకుగాను అనేక అవార్డులు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో అడుగు ముందుకు వేసి, ఫేస్బుక్ మిత్రుల ద్వారా ఆహార పొట్లాలు, సబ్బులు వంటవి సేకరించి, కష్టాలలో ఉన్నవారికి అందచేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కరోనా సోకుతుందనే భయం కూడా లేకుండా సేవలు అందిస్తున్న మల్లేశ్వరరావుని సాక్షి పలకరించింది. అతను తన అనుభవాలను సాక్షితో పంచుకున్నారు... ‘నేను నా జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక అనాథ ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులూ పడ్డాను. ఎన్నో రోజులు ఆకలితో అలమటించాను. నాలాగ ఎవ్వరూ బాధపడకూడదు అనుకున్నాను. నాకు ఎప్పుడు అవకాశం వచ్చినా, వీలైనంత వరకు ఇతరులకు సహాయపడాలనుకున్నాను. మనసుంటే మార్గం ఉంటుంది అని భావించాను. నా మిత్రుల సహకారంతో ఫేస్బుక్లో నా పేరున పేజీ ఓపెన్ చేసి, నా ఆలోచనను అందరితో పంచుకున్నాను. ఈ విపత్కాలంలో అందరూ సహకరిస్తున్నారు. ఐదు వందల ఆహార పొట్లాలు తయారుచేసి నాకు ఇస్తున్నారు. నేను నా మిత్రుడు అంకూర్ శ్రీవాత్సవ్ కలిసి ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఈ ఆహారం పొట్లాలు అందచేస్తున్నాం. వీథులలో ఉండేవారినందరినీ ఒక షెల్టర్‌లో ఉంచారు. మాకు చేతనైనంత వరకు ఎవ్వరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రాంతం నుంచి హైటెక్ సిటీ వరకు మేం మా సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. అందరికీ స్నానానికి అవసరమైన సబ్బులు కూడా అందచేస్తున్నాం. ఇంతటి విపత్కర సమయంలో మేం ప్రాణాలకు తెగించి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటానికి ప్రయత్నిస్తుంటే, కొందరు ఆకతాయిలు మాకు ఇబ్బంది కలిగిస్తున్నారు. కొందరు సంపన్నులు కార్లలో దిగి, మా దగ్గరకు వచ్చి, వారంతా తిండి లేక బాధపడుతున్నామని, వారికి కూడా ఆహారం పొట్లాలు ఇవ్వమని దౌర్జన్యంగా తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. వారందరికీ మేం చేతులెత్తి ప్రార్థిస్తున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో అల్లరిచిల్లరి పనులు చేయొద్దని మొక్కుతున్నాం. ఈ సమయంలో నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసులకు కూడా మేం ఆహారం అందిస్తుంటే వారు, ‘మేం ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరు మా కోసం పనిచేస్తున్నారు’ అంటూ మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. రెండు నెలల క్రితం triporey అనే ఒక ట్రావెల్ స్టార్టప్ కంపెనీ ప్రారంభించాను. కరోనా వల్ల వచ్చిన బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. మా కంపెనీ ప్రారంభదశలోనే ఆగిపోయింది. నేను గతంలో జోష్ టాక్‌లో ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో ప్రస్తుతం నా జీవనం సాగిస్తున్నాను. త్వరలోనే అందరికీ మంచి రోజులు రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.– మల్లేశ్వరరావు,సోషల్ వర్కర్, హైదరాబాద్ ఇక మేం వ్యక్తిగత శుభ్రత పాటిస్తున్నాం. ఇంటికి వెళ్లేసరికి, ఓ మిత్రుడు మా కోసం నీళ్లు, దుస్తులు సిద్ధం చేసి ఉంచుతున్నాడు. శుభ్రంగా స్నానం చేసిన తరవాత ఇంట్లోకి అడుగు పెడుతున్నాం. దయచేసి మాకు ఈ విషయంలో అందరూ సహకరించండి’ అంటూ ఎంతో బాధ్యతగా అర్థిస్తున్నాడు 28 సంవత్సరాల మల్లేశ్వరరావు.– సంభాషణ: వైజయంతి పురాణపండ -
అన్నం పెట్టే సాయికుమారి ఇకలేరు
అమరావతి, వినుకొండ(నూజెండ్ల): ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి ఆదరించే మహిళగా డొక్కా సీతమ్మ పేరు అందరికీ సుపరిచయమే. ఈ కోవాకి చెందిన వినుకొండ పట్టణంలోని భవనాశి సాయికుమారి (66) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందింది. పట్టణంలోని వివేకానంద పాఠశాల సమీపంలో నివాసం ఉంటున్న భవనాశి సాంబశివరావు భర్య సాయి కుమారి గత 20 ఏళ్ల నుంచి ఆకలితో ఉన్నవారిని ఇంటికి పిలిచి అన్నం పెడుతుంది. ఆకలితో ఉన్నవారు ఈమె ఇంటిని వెతుక్కుంటూ వచ్చేవారు. ఏ సమయంలో ఆకలితో వెళ్లినా లేదు అనకుండా భోజనం పెడుతూ యాచకులు, నిరుపేదల ఆకలి తీర్చే మహిళగా మంచి పేరు సంపాదించుకున్న సాయి కుమారి మృతితో వారు ఆందోళన చెందుతున్నారు. నువ్వు లేకపోతే మాకు అన్నం పెట్టే దిక్కెవరమ్మా అని అన్నార్తులు రోదిస్తున్న తీరు పలువురిని కంట తడి పెట్టించింది. ఆమె చేతి అన్నం తిన్న వారు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆమె మృతికి పట్టణంలోని ప్రముఖులు సంతాపం తెలియజేశారు. -
అభాగ్యుల పాలిట అన్నదాత తులసీరామ్
పశ్చిమగోదావరి ,భీమవరం: కన్నబిడ్డలే తల్లిదండ్రులను భారంగా భావిస్తున్న రోజులువి. అటువంటిది క్రమం తప్పకుండా ఏ ఆదరవు లేని వృద్ధులకు ప్రతి రోజు భోజనం పంపిస్తున్నారు. అదీ వృద్ధులున్నచోటకే క్యారేజీలు పంపించడం విశేషం. ఇలా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన మళ్ల తులసీరామ్(రాంబాబు). రైస్‌మిల్లర్‌గా, రొయ్యల రైతుగా తాను సంపాదించేదానిలో కొంతమొత్తాన్ని వృద్ధుల సేవకు వినియోగిస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు యండగండి గ్రామంలో వృద్ధులకు భోజనం పెడుతున్న వైనాన్ని తెలుసుకుని తాను స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాంబాబు చెప్పారు. వీరవాసరం గ్రామంలోని తులసీ కన్వెన్షన్ హాలులో భోజనం తయారు చేయించి ప్రతి రోజూ పంజావేమవరం, వీరవాసరం గ్రామంలోని వృద్ధులకు పంపిస్తున్నారు. బుధ, ఆదివారాల్లో గుడ్డు, చేప, చికెన్ వంటి మాంసాహారం కూడా పెడుతుండటం విశేషం. అంతేకాదు ఒక్కోసారి రాంబాబు స్వయంగా ఆహారం వండుతారు. 2019 నవంబర్‌లో కేవలం 30 క్యారేజీలతో ప్రారంభమైన భోజనం పంపిణీ ప్రస్తుతం 180కి చేరుకుంది. జీవితకాలం కొనసాగించాలన్నదేలక్ష్యం కుటుంబసభ్యుల సహకారంతో వృద్ధులకు, అనాథలకు ప్రతి రోజూ ఉచితంగా భోజనం పంపిస్తున్నాను. అనేకమంది దాతలు సహకరిస్తామని ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరించాను. అయితే కిరణా, కూరగాయల వ్యాపారులు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నందుకు సంతోషం. నా సంపాదనతోనే జీవితకాలం ఈ పథకాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాను. –మళ్ల తులసీరామ్(రాంబాబు),అన్నదాత, పంజా వేమవరం తృప్తిగా భోజనం చేస్తున్నాను వృద్ధాప్యంలో వంట చేసుకోలేని దుస్థితిలో ఉన్న నాకు ప్రతి రోజు క్యారేజీ రావడంతో తృష్తిగా భోజనం చేయగలుగుతున్నాను. వంటలు కూడా రుచికరంగా ఉండటంతో ఎటువంటి ఇబ్బంది ఉండటం లేదు. –వంకాయల మహాలక్ష్మి, వేమవరం రాంబాబు ఆశయం గొప్పది చిన్న వయస్సులోనే వృద్ధులకు భోజనం పంపించాలనే రాంబాబు ఆశయం పదిమందికి ఆదర్శం. రోజూ క్రమం తప్పకుండా వేడి వేడి పదార్థాలతో ఉదయం 10.30 గంటలకే భోజనం క్యారేజీ మా ఇంటి ముందు సిద్ధంగా ఉంటుంది. –పంజా రాఘవమ్మ -
తిరుమల తరహాలో..
యాదగిరిగుట్ట(ఆలేరు) : అంతర్జాతీయ దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం సకల వసతులు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుమల తరహాలో క్యూలైన్లు, ప్రెసిడెన్షియల్ సూట్లు, పెద్దగుట్టపై కాటేజీలు, వాహనాలు నిలిపేందుకు కొండ కింద విశాలమైన పార్కింగ్ తదితర చర్యలు చేపట్టారు. వీటితో పాటు అధునాతన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని నిర్మించేందుకు వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో యాదాద్రి కొండపై ఉన్న శ్రీచక్ర భవనంలో భక్తులకు అన్నదానం నిర్వహించేవారు. యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణం, విస్తరణలో భాగంగా ఇటీవల ఆ భవన సముదాయాన్ని కూల్చివేశారు. అప్పటినుంచి రెండవ ఘాట్‌రోడ్డులోని జీయర్ కుటీర్‌లో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. గండి చెరువు కిందిభాగంలో రెండు ఎకరాల స్థలంలో రూ.15కోట్ల వ్యయంతో నూతన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకు వెగెష్న ఫౌండేషన్ ఎండీ ఆనంద్‌రాజు ముందుకు వచ్చారు. మూడు అంతస్తుల్లో నిర్మాణం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పది తరాల పాటు భవిష్యత్‌లో నిలిచిపోవాలని సీఎం కేసీఆర్ సంకల్పించిన విషయం తెలిసిందే. ఆలయం నిర్మాణం పూర్తయితే భవిష్యత్‌లో భక్తుల సంఖ్య భారీగాపెరిగే అవకాశం ఉంది. రోజూ లక్ష మంది వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా వారందరికీ అన్నదానం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే తిరుమల తరహాలో ఆధునిక హంగులతో నిత్యాన్నదాన సత్రాన్ని నిర్మించతలపెట్టారు. ఈ సత్రాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. తొలుత మొదటి అంతస్తు నిర్మించి అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధించి ఈఓ గీతారెడ్డితో వైటీడీఏ ఆర్కెటెక్ట్, ఇతర అధికారులతో కలిసి దాత ఆనంద్‌రాజు గురువారం సమావేశం అయ్యారు. తిరుమల, ద్వారక తిరుమలలో అన్నదాన భవనాలు నిర్మించిన విధంగానే గండిచెరువు సమీపంలో నిర్మాణం చేపట్టనున్నట్లు ఈఓ తెలిపారు. మొదటి అంతస్తులో ఒకేసారి 350 మంది కూర్చోని భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వైటీడీఏ డిజైన్ ప్రకారం అన్నదాన సత్ర భవనాన్ని నిర్మించనున్నట్లు ఆమె వెల్లడించారు. మరో రెండు రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. -
నాణ్యమైన బియ్యం కోసం రూ.7,425 కోట్ల ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: బియ్యం కార్డులున్న పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోంది. ఇందులో భాగంగా పౌర సరఫరాల సంస్థ ఇప్పటికే రూ.7,425 కోట్ల విలువ చేసే 40.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఒకవైపు రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడం, మరోవైపు అదే ధాన్యాన్ని మర ఆడించి పేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా దశల వారీగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నాణ్యమైన రకం బియ్యానికి సంబంధించిన ధాన్యాన్ని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 1,710 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపి మర ఆడించాక 5, 10, 15, 20 కిలోల్లో ప్రత్యేక బ్యాగుల ద్వారా లబ్ధిదారులకు ఇంటింటా పంపిణీ చేయనున్నారు. వీటి కోసం 30 చోట్ల 99 నాణ్యమైన బియ్యం ప్యాకింగ్ యూనిట్లను కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని సేకరిస్తే 28.74 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేశారు. పలు జిల్లాల్లో ఇప్పటికే సిద్ధం రాష్ట్రంలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఇప్పటికే నాణ్యమైన బియ్యం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో సేకరించిన బియ్యం నమూనాలను పరిశీలన కోసం అధికారులు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుంచిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న బియ్యం కార్డుల సంఖ్యను బట్టి 26.63 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతుందని అంచనా వేశారు. ఏప్రిల్ నుంచి జిల్లాకు ఒక నియోజకవర్గం చొప్పున ప్యాకింగ్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ కింద శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ నాటికి 22 నియోజకవర్గాలు, మేలో 46, జూన్‌లో 70, జూలైలో 106, ఆగస్టు నాటికి మొత్తం రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. -
ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ
-
నాణ్యమైన బియ్యం పంపిణీకి పకడ్బందీ చర్యలు
సాక్షి, అమరావతి : ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యాన్ని ఏప్రిల్ నుంచి దశల వారీగా అన్ని జిల్లాల్లో పకడ్బందీగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో సేకరించిన నాణ్యమైన బియ్యం నమూనాలను ఆయన పరిశీలించారు. తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తదితర అధికారులతో సమీక్షించారు. పేదలకు పంపిణీ చేసేందుకు 26.63 లక్షల టన్నుల నాణ్యమైన బియ్యం అవసరమని, ఇందులో భాగంగా ఖరీఫ్, రబీ సీజన్లో వచ్చే ధాన్యం దిగుబడి ద్వారా 28.74 లక్షల టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం 30 చోట్ల 99 బియ్యం ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 41, పీపీపీ పద్ధతిలో 58 ప్యాకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. గోడౌన్ల నుండి రేషన్ దుకాణాలకు సకాలంలో చేరవేసేలా ప్రతి 30 నుండి 40 కిలోమీటర్ల పరిధిలో ఒక ప్యాకేజీ యూనిట్ అందుబాటులోకి తెస్తున్నారు. పంపిణీ కోసం క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అందుకు తగ్గట్టుగా అవసరమైన సిబ్బంది, వాహనాలు ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. పర్యావరణానికి హాని జరగకుండా బియ్యం ప్యాకింగ్ కోసం వాడే సంచులను తిరిగి సేకరించేలా చూడాలని చెప్పారు. నాణ్యమైన బియ్యం పంపిణీ ఇలా.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీని దశల వారీగా ప్రారంభిస్తారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాను ఎంపిక చేసి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. మిగిలిన జిల్లాల్లో ఏప్రిల్ నుంచి జిల్లాకో నియోజకవర్గం చొప్పున ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ చేసేలా పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. -
నాణ్యత విషయంలో రాజీ పడొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ప్రతి లబ్ధిదారుడి ఇంటికి నాణ్యమైన బియాన్ని ప్యాక్ చేసి అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ అంశంపై సోమవారం సీఎం జగన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్ యూనిట్ల ఏర్పాటు, గోదాముల్లో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. శ్రీకాకుళంలో అమలవుతున్న పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. నాణ్యమైన, ప్యాకేజ్డ్ బియ్యంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. అలాగే ఏప్రిల్ నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లో పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు. ప్రతి దశలోనూ నాణ్యతను పరిశీలించే అవకాశం ఉండాలని, ఎక్కడా కూడా అలసత్వానికి దారితీయకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ప్లాస్టిక్ బ్యాగులను తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, లేకుంటే పర్యావరణం దెబ్బతింటుందని సీఎం జగన్ అధికారులకు సూచించారు. -
టీడీపీ కార్యకర్తలపై అట్రాసిటీ కేసు
సాక్షి, భామిని(శ్రీకాకుళం) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన బియ్యం పంపిణీలో టీడీపీ నాయకులు ఆటంకాలు సృష్టించి, గ్రామ వలంటీర్‌తో వివాదానికి దిగిన ఘటన ఆదివారం భామిని మండలంలోని తాలాడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ విషయంలో అట్రాసిటీ కేసు నమోదైంది. సోమవారం పాలకొండ డీఎస్పీ రామ్‌రాజు కొత్తూరు సీఐ ఎల్.సన్యాసినాయుడు, బత్తిలి ఎస్ఐ అజార్ అహ్మద్ ఆధ్వర్యంలో అట్రాసిటీ కేసుపై దర్యాప్తు చేపట్టారు. బియ్యం నాణ్యంగా లేవని వివాదం రేపిన టీడీపీ కార్యకర్తలు వలరౌతు అచ్చుతరావు, వలరౌతు శివలపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బియ్యం పంపిణీ విషయంలో గ్రామ వలంటీర్‌పై దుర్భాషలాడి వివాదానికి దిగారని, అడ్డుకున్న తనను కులం పేరుతో దూషించారని గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సుంకు అప్పలనర్సి ఫిర్యాదు అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాదం రేగిన సంఘటనపై డీఎస్పీ గ్రామ వలంటీర్ నుంచి వివరాలు సేకరించారు. వీఆర్ఓ హరిహరరావు, కార్యదర్శి ప్రమీలారాణి, మాజీ సర్పంచ్ బంటు శ్రీనివాస్ గ్రామస్తులున్నారు. అనంతరం బత్తిలి పోలీస్ స్టేషన్‌కు గ్రామానికి చెందిన ముగ్గురు వలంటీర్లను పిలిపించి పూర్తి వివరాలు నమోదు చేశారు.వలంటీర్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి టెక్కలి: పాతనౌపడ గ్రామ వలంటీర్‌పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టెక్కలి ఆర్డీఓ ఐ.కిషోర్‌కు స్పందన కార్యక్రమంలో సోమవారం ఆ గ్రామానికి చెందిన వ్యక్తలు ఫిర్యాదు చేశారు. వలంటీర్‌పై దాడి చేయడంతోపాటు సమాచార హక్కు చట్టం పేరుతో అధికారులపై బెదిరింపులకు పాల్పడిన మర్ధల సురేష్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన లోకేశ్వర్‌రావు, యోగి, ఉమాశంకర్ తదితరులు ఆర్డీవోను కోరారు. -
వాలంటీర్ల నాణ్యమైన బియ్యం పంపిణీ
-
‘గంటలోపే పచ్చ దొంగల క్షుద్ర దాడి’
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. పేద వాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన బియ్యం అందించాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తే.. బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇచ్చారంటూ ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన గంటలోపలే పచ్చ పార్టీ దొంగలు క్షుద్ర దాడి మొదలెట్టారని విమర్శించారు. ‘మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు. పచ్చపార్టీ దొంగలు ఆ బియ్యం బస్తాలలో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంటలోపలే క్షుద్రదాడి మొదలు పెట్టారు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాగా పేదలకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను వినియోగించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 100శాతం నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. -
ఇంటి వద్దకే బియ్యం
సాక్షి, అమరావతి : కొండ ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి రేషన్ బియ్యం సక్రమంగా అందేవి కావు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులందరి ఇళ్లకు నాణ్యమైన బియ్యాన్ని గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం నుంచి ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఆ జిల్లాలో 8,60,727 తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. గ్రామ, వార్డు వలంటీర్లు శనివారం నాటికి 70 శాతానికి పైగా బియ్యం బ్యాగ్‌లను ఇంటింటికీ తీసుకెళ్లి పంపిణీ చేశారు. ఇందుకు 6 వేలకు పైగా వాహనాలను వినియోగించారు. వర్షం కారణంగా తడిసిన 30 బ్యాగ్‌లు నాలుగు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 30 బియ్యం బ్యాగ్‌లు తడిసిపోయాయి. వాటిలోని బియ్యం ఉండలు కట్టినట్టు గుర్తించకపోవడంతో వాటిని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆ బ్యాగ్‌లను అందుకున్న లబ్ధిదారులు బియ్యం ఉండకట్టిన విషయాన్ని వలంటీర్లకు తెలియజేయడంతో వాటి స్థానంలో కొత్త బ్యాగ్‌లను తిరిగి పంపిణీ చేశారు. బియ్యం పంపిణీ ఎలా ఉందన్న దానిపై లబ్ధిదారుల అభిప్రాయాల్ని వలంటీర్లు తీసుకుంటున్నారు. బియ్యం చాలా బాగున్నాయని పేదల నుంచి అభినందనలు వస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఆ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. పేద వాళ్లు తినగలిగే బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి నాని విమర్శించారు. చీపురుపల్లి వాసుల ఆనందం ఎత్తైన కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తమ ఇళ్లకే నేరుగా బియ్యం తెచ్చి ఇస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టిపల్లి పంచాయతీ పరిధిలోని చీపురుపల్లి గ్రామానికి చెందిన పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేశారు. బియ్యం కోసం 4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదని.. ఈ–పాస్ మెషిన్లు సరిగా పనిచేయక ఒక్కోసారి రెండు మూడు రోజులు తిరగాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పారు. గిరిజన గూడేల్లోనూ ఇంటికే బియ్యం అందుతుండటంతో పేదల ఆనందం అవధులు దాటింది. -
పేదలకు సంతృప్తిగా భోజనం
సాక్షి, శ్రీకాకుళం/అమరావతి: ‘రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న బియ్యం ప్రజలు తినే పరిస్థితి లేదు. ఏ బియ్యం అయితే మనం తినగలుతామో వాటినే పేదలకు పంపిణీ చేస్తాం. పూర్తిగా ఫిల్టరింగ్ చేసి.. 5, 10, 15, 20 కేజీలుగా ప్యాక్ చేసి సెప్టెంబర్ నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే సరఫరా చేస్తాం’ అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. అందుకు అనుగుణంగానే తొలుత శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద వలంటీర్ల ద్వారా పేదల ఇంటికే పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కాశీబుగ్గలో ప్రారంభించనున్నారు. అనంతరం ఈ నెల 7, 8 తేదీల్లో జిల్లావ్యాప్తంగా బియ్యం పంపిణీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమం రెండో విడతలో విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేపడతారు. పంపిణీ ఏర్పాట్లు ఇలా.. జిల్లాను 15,344 క్లస్టర్లుగా విభజించారు. జిల్లాలో ఒక నగరపాలక సంస్థ, ఐదు పురపాలక సంఘాలు, 1,141 గ్రామ పంచాయితీల పరిధిలో 1,865 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటికి మొత్తం 11,924 మంది వలంటీర్లను నియమించారు. ఒక్కొక్క క్లస్టర్లో 50 నుంచి 60 వరకు కుటుంబాలను చేర్చారు. వలంటీర్ల ద్వారా పేదలకు పంపిణీ చేసేందుకు ఇప్పటికే 9,48,105 బియ్యం బ్యాగ్‌లను 2,015 రేషన్ డిపోల్లో సిద్ధంగా ఉంచారు. వీటిలో 5 కిలోల బ్యాగ్‌లు 1,24,049, 10 కిలోల బ్యాగ్‌లు 2,42,035, 15 కిలోల బ్యాగ్‌లు 2,73,764, 20 కిలోల బ్యాగులు 3,08,257 ఉన్నాయి. పంపిణీ కార్యక్రమంలో ఏవైనా లోటుపాట్లు తలెత్తితే తెలుసుకుని పరిష్కరించేందుకు వీలుగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కార్డుదారుల మ్యాపింగ్‌లో సమస్యలు, పోర్టబులిటీ, డీలర్ లేదా వలంటీర్ అందుబాటు, యూనిట్లో తేడాలు రావడం వంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తితే లబ్ధిదారులు నేరుగా కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా తెలియజేస్తే అక్కడికక్కడే పరిష్కరిస్తారు. మరోవైపు నూతన విధానం వల్ల పీడీఎస్ బియ్యం రీసైక్లింగ్ దందాకు, తూకంలో మోసాలకు అడ్డుకట్ట పడనుంది. 20 ఏళ్లుగా పరిశోధనలకే పరిమితం ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ఆనవాళ్లు 1990 దశకంలోనే కనిపించాయి. 2000లో సోంపేటకు చెందిన ఐఎంఏ వైద్యులు వై.కృష్ణమూర్తి, పి.శివాజీ బృందం కవిటి ప్రాంతంలో ఈ కేసులను అధికారికంగా గుర్తించారు. 2004లో కేజీహెచ్ వైద్యులు 2005లో పరిశోధన వైద్య శిబిరాలు చేపట్టగా.. 2008 మే 24న నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ నిమ్స్ ఆర్ఎంఓ శేషాద్రి పర్యటించారు. అదే ఏడాది రాష్ట్ర నీటి విశ్లేషణ పరిశోధనా సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం.కృష్ణమూర్తి , చీఫ్ కెమిస్ట్ ఎ.సతీష్, 2009లో న్యూయార్క్‌కు చెందిన కిడ్నీ వ్యాధుల నిపుణుడు డాక్టర్ శివప్రసాద్ ఇక్కడ పర్యటించారు. 2011లో డాక్టర్ రవిరాజ్, డాక్టర్ వెలగల శ్రీనివాస్, డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, ఎ.వేణుగోపాల్ బృందం, న్యూయార్క్‌కు చెందిన స్టోనీబ్రూక్స్ యూనివర్సిటీ బృందం, హైదరాబాద్‌కు చెందిన పరిశోధకురాలు సీఐఎస్ఆర్ సుజాత, 2012లో జపాన్, అమెరికన్ బృందాలతోపాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికల్ డిసీజెస్ బృందం అధ్యయనం జరిపాయి. 2013లో హార్వర్డ్ విశ్వవిద్యాలయం, బాబా అటామిక్ రీసెర్చ్ బృందాలు పరిశోధనలు చేశాయి. 2017 నుంచి భారతీయ వైద్యపరిశోధనా మండలి పరిశోధన సాగుతోంది. కిడ్నీ బాధితులకు కొండంత అండ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. పాదయాత్రలోనూ.. అంతకుముందు ఉద్దాన ప్రాంత పర్యటనలో కిడ్నీ బాధితుల కష్టాలను కళ్లారా చూసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే చర్యలకు ఉపక్రమించారు. ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనిని 100 రోజుల పాలనలో చేసి చూపించారు. కిడ్నీ రోగులకు నెలకు రూ.10 వేల పింఛను అందజేస్తున్నారు. వైద్య సేవలందించేందుకు వీలుగా 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుగుణంగా రీసెర్చ్ సెంటర్, అతి పెద్ద డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేశారు. దీంతో సరిపెట్టకుండా వ్యాధికి మూలమైన తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఇంటింటికీ కుళాయిల ద్వారా శుద్ధ జలాలను సరఫరా చేసేందుకు ఉపక్రమించారు. ఇందుకోసం రూ.600 కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. వీటన్నిటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. -
ఎన్నికల్లో సత్తా చూపుతాం
జనగామ: ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో తమ ప్రతాపం చూపుతామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు హెచ్చరించారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి రేషన్ డీలర్ల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవ వేతనంపై స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో వచ్చే పంచాయతీ ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ పాస్ ద్వారా బియ్యం పంపిణీ చేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. నెలకు రూ.30 వేల గౌరవ వేతనంతోపాటు హెల్త్ కార్డులు, ప్రభుత్వ పథకాలు వర్తింపజేసే విధంగా ప్రకటన చేయాలని కోరారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్లు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రూ.20.19 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. వే బ్రిడ్జిపై కాంటా వేసిన తర్వాతనే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డీలర్‌కు బియ్యాన్ని పంపించాలని సూచించారు. త్వరలో హైదరాబాద్ లేదా వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై ఒకటి నుంచి నిరవధిక బంద్ పాటిస్తూ, తిరుగుబాటు చేయాలని తీర్మానం చేశారు. -
బోనాల అన్నదానంలో అకాతాయి ఉమ్మడంతో..
లంగర్‌హౌస్: బోనాల సందర్భంగా లంగర్‌హౌస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఓ పార్టీకి చెందిన నాయకుడు, అతడి కుమారుడు వెకిలి చేష్టలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. బోనాల సందర్భంగా అన్నదానం నిర్వహిస్తుండగా వారి చేతిలోని భోజనాల్లో ఉమ్మి వేయడంతో ఈ పరిస్థితులకు దారి తీసింది. ఎందుకు ఇలా చేస్తున్నారని అడగడంతో వారు వచ్చి సురేందర్, సంజయ్, సుభాష్‌లపై దాడి చేసి గాయపర్చారు. దీంతో పలువురు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కోర్టు ఆదేశించినా బియ్యం పంపిణీ చేయరా?
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీరియస్ లింగాల : లింగాల మండలం మురారిచింతలలో చౌక దుకాణ బియ్యం బహిరంగ స్థలంలో పంపిణీ చేయాలని గత సోమవారం హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అధికారులు తుంగలో తొక్కారు. దీంతో మురారిచింతల, దిగువపల్లె గ్రామాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జూన్ నెల 5వ తేదీన గ్రామంలో నిర్వహించిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలందరూ తాము టీడీపీ కార్యకర్త ఇంటికి వెళ్లలేం.. బహిరంగ స్థలంలో పంపిణీ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో పేదలను దృష్టిలో ఉంచుకొని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సొంత డబ్బుతో బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోకపోవడంపై ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం ఉదయం గ్రామ ప్రజలు ఆయనను కలిసి బియ్యం పంపిణీ చేయలేదని మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన తహశీల్దార్ ఎస్.ఎం.ఖాసీంకు ఫోన్‌చేసి హైకోర్టు ఆదేశాలు అమలుపరచకపోతే తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించాల్సి వస్తుందని హెచ్చరించారు. -
దండం పెట్టే రోజులు పోయాయి
ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బిచ్కుంద: తెలంగాణ ఆవిర్భావంతో దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టే రోజులు పోయాయని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ బీబీపాటిల్‌తో కలిసి మండలంలో గురువారం ఆయన పర్యటించారు. మండల పరిధిలోని మిసన్కల్లాలి గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తెచ్చుకున్నది మంత్రి పదవులు అనుభవించడానికి కాదన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. ఒక్క జుక్కల్ నియోజకవర్గానికే రూ.170 కోట్లు మంజూరు చేశారన్నారు. మార్చి నుంచి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. మంచినీటి సమస్యను అధిగమించేందుకు రూ.35వేల కోట్లతో వాట ర్‌గ్రిడ్, కరెంట్ సమస్యకు రూ.45 వేల కోట్లు వెచ్చించి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. మూడేళ్ల తర్వాత గృహా లకు, పరిశ్రమలకు 24 గంటల పాటు, రైతులకు 7గంటల కరెంట్ ఇస్తామన్నా రు. అనంతరం గుండెనెమ్లీ గ్రామంలో విద్యుత్‌సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన, పుల్కల్లో ప్రాథమిక ఆరోగ్య కేం ద్రం, మిషన్ కల్లాలిలో పంచాయతీ భవ నం, అంగన్వాడీ భవనాలను ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని సర్పంచులు కోరగా మంత్రులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ సిందే, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జేసీ రవీందర్ రెడ్డి, బోధన్ ఆర్డీఓ శ్యాం ప్రసాద్ లాల్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అద్యక్షుడు గంగారెడ్డి, ప్రజా ప్రతినిధు లు, అధికారులు పాల్గొన్నారు. సీమాంధ్రుల పాలనలో అడుక్కోవాల్సి వచ్చింది నిజాంసాగర్: సీమాంధ్రుల పాలనలో అభివృద్ధి పనుల నిధుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడుక్కోవాల్సి వచ్చిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నా రు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాలనలో ఎమ్మెల్యే లు, ప్రజాప్రతినిధులకు ఆ పరిస్థితి లేద ని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పిట్లం, బిచ్కుంద మండలాలలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రా రంభించారు. అనంతరం మాట్లాడుతూ అమరుల ప్రాణత్యాగాలు, ఉద్యమాల తో పాటు, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో పురోగమింపజేయటానికి కృషి చేస్తున్నామని చె ప్పారు. ఇందుకోసం నిధులకు కొదువ లేదని స్పష్టం చేశారు. మూడేళ్లలో ఇం టింటికీ నల్లా నీరు అందజేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ సన్న బియ్యం బాన్సువాడ : అంగన్వాడీ కేంద్రాల్లో నూ త్వరలో సన్నరకం బియ్యం పంపి ణీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయ న స్వగృహంలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. టీఆర్ఎస్కు ఎన్నికల మ్యానిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖు రాన్ వంటిదని, ఎన్నిక హామీలన్నీ తప్పక అమలు చేస్తామని పేర్కొన్నారు. సమైక్య రాష్ర్టంలో తెలంగాణలోని 29లక్షల మందికి పింఛన్లు ఇవ్వగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్లు 35లక్షల దాటాయని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన నిజామాబాద్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. తొలు త మంత్రులు, ఎంపీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలకు స్వాగతం పలికారు. -
పేదలకు ఆహార భద్రత..
కోటా పెంపు నేటి నుంచి నగరంలో బియ్యం పంపిణీ 15 తర్వాత కొత్త వారికి సిటీబ్యూరో: ఆహార భద్రత పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద బియ్యం కోటాను పెంచడంతో మహానగరంలోని నిరుపేదల కష్టాలు దూరం కానున్నాయి. శనివారం నుంచి ఈ పథకం కింద నిరుపేద కుటుంబాలకు బియ్యం అందనున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా చేయనున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ (పీడీఎస్) బియ్యం పంపిణీ పరిమితులను ఎత్తివేసిన విషయం విదితమే. ఇప్పటివరకు ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున.. కుటుం బానికి గరిష్టంగా 20 కిలోల వరకు పంపిణీ జరిగిదే. తాజాగా అమలు చేస్తున్న ఆహార భద్రత పథకం కింద కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా... ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం రేషన్ కార్డులున్న వారికి కోటా పెంచి పంపిణీ చేయనున్నారు. కొత్త దరఖాస్తుదారులకు మాత్రం పరిశీలన పూర్తయిన తరువాత అర్హులకు 15 నుంచి సరఫరా చేస్తారు. ఫలితంగా జనవరి నెల బియ్యం కోటా గతం కంటే 35 శాతం అదనంగా పెరిగినట్లయింది. ఇదీ పరిస్థితి.. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 23.13 లక్షల కుటుంబాల వారు ఆహార భద్రత కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 14.20లక్షల వరకు పాతవారున్నారు. దరఖాస్తుల పరిశీలన ఇప్పటివరకు 16 లక్షలు కూడా దాటలేదని సంబంధిత అధికార గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి గత నెల 25 నాటికే అర్హుల జాబితాను ప్రకటించాల్సి ఉంది. నగరంలో దరఖాస్తుల పరిశీలన ఆల స్యంగా ప్రారంభమైన కారణంగా ఈనెల 15లోగా పూర్తి చేసి అర్హులైన వారికి బియ్యం పంపినీ చేయాలని అధికారులు నిర్ణయించారు. అర్హులందరికీ కార్డులు.. అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు అందుతాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అర్హులైన లబ్ధిదారులు చౌకధరల దుకాణాల్లోని కీ రిజిస్టర్లో తమ కుటుంబ వివరాలను సరిచూసుకోవాలి. పేర్లు, అక్షరాలు, చిరునామా, ఇతర వివరాల్లో తప్పులుంటే వెంటనే సరిచేయించుకోవాలి. పాత వారు శనివారం నుంచి, కొత్త వారు 15వ తేదీ తరువాత చౌకధర ల దుకాణాలకు వెళ్లి వివరాలను సరి చేసుకోవాలి. - డాక్టర్ పద్మ, సీఆర్వో, హైదరాబాద్ -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
వర్ని: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. వర్ని మండలం శంకోరా గ్రామ పంచాయతీ పరిధిలోని ఆఫంది ఫారంలో ఆయన గురువారం ఆహారభద్రత పథకాన్ని ప్రారంభిం చారు. ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కొత్త సంవత్సరం తొలి రోజున నాలుగు పథకాలను ప్రభుత్వం అమలులోకి తెస్తోందని అన్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున కుటుంబంలో ఉన్నవారందరికీ పరిమితి లేకుండా బియ్యం అందజేయడం, పాఠశాలలు, హాస్టళ్లలో సన్నరకం బియ్యం పంపిణీ, అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు, బాలింతలకు వన్ ఫుల్‌మీల్ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయన్నారు. జిల్లాలో ఆహారభద్రత పథకం కింద నెలకు 10,500 మెట్రిక్ టన్నులు, వసతి గృహాలకు 1,400 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నట్టు వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి రూ. రెండు వేల కోట్ల అదనపు భారం పడుతున్నా, పేదలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు. జిల్లాలో 18 లక్షల మందికి ఈ పథకాన్నివర్తింప చేసినట్టు పేర్కొన్నారు. రేషన్ డీలర్లు ఎలాంటి ఫిర్యాదు లేకుండా, తరుగు చేయకుండా లబ్ధిదారులకు బియ్యం అందజేయాలని సూచిం చారు. వృద్ధులు, వితం తువులకు రూ. 1000, విక లాంగులకు రూ. 1500 చొప్పున 2.13 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఏడాదికి రూ. నాలుగు వేల కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నందున అర్హులు ఫించన్ రాకుండా, ఆహర భద్రత కార్డు రాకుండా ఉండకూడదన్నారు. త్వ రలోనే అర్హులకు రూ. మూడున్నర లక్షలతో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. వీటికి పూర్తి సబ్సిడి ఉంటుందన్నారు. కొత్త కాలనీలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించండి రైతుల రసాయనిక ఎరువుల వాడాకాన్ని తగ్గించాలని మంత్రి కోరారు. వీటిని ఎక్కువగా వాడడంతో భూసారం దెబ్బతింటోందన్నారు. సేంద్రియ ఎరువులపై దృష్టి సారించాలని కోరారు. దీంతో పెట్టుబడులు తగ్గుతాయని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఇటీవల పర్యటించినపుడు ఓ యువరైతు వంద ఎకరాలలో సేంద్రియ ఎరువులతో పండించడం గుర్తించామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఆర్డీఓ శ్యాంప్రసాద్‌లాల్, డీఎస్ఓ కొండల్రావు ఎంపీపీ చింగ్లీ బజ్యానాయక్, జడ్పీటీసీ సభ్యుడు విజయ భాస్కర్‌రెడ్డి, తహశీల్దార్ సోమేశ్వర్, ఎంపీడీఓ చందర్‌నాయక్, సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆరు కిలోల రేషన్ బియ్యం
పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరం కానుకగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీపై పరిమితులను ఎత్తివేసింది. జనవరి 1 నుంచి రేషన్ కార్డులున్న కుటుంబంలో ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఒక్కొక్కరికి నాలుగు కిలోల చొప్పున.. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 20 కిలోల బియ్యం ఇవ్వాలన్న నిబంధనల ప్రస్తు తం అమల్లో ఉందన్నారు. ఇప్పట్నుంచీ కుటుం బంలో ఎంత మంది సభ్యులున్నా.. వారందరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తామన్నారు. అంత్యోదయ కార్డులున్న పేద కుటుం బాలకు 35 కిలోల బియ్యం అందుతోందని.. ఆ కుటుంబంలో సభ్యులు ఎక్కువగా ఉంటే తెల్లకార్డుగా మార్చుకొని సరిపడేంత బియ్యం తీసుకునే వీలు కల్పించామన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. దీంతోపాటు జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలతోపాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం సరఫరా చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహార పంపిణీని రాష్ట్రమంతటికి విస్తరిస్తున్నట్లు ఈటెల ప్రకటించారు. రాష్ట్రంలో 35 వేల అంగన్వాడీ కేంద్రాలుంటే 19 వేల కేంద్రాలకే గుడ్లు, పాలు, పౌష్టికాహారం పంపిణీ జరుగుతోందన్నారు. ఇకపై అన్ని కేంద్రాలకు పౌష్టికాహారం అందిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు, పౌష్టికాహారం పంపిణీకి రూ.70 కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.220 కోట్ల ఖర్చుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడిందని మంత్రి తెలిపారు. -
కొత్త సంవత్సరం కానుక
జనవరి నుంచి ఆహార భద్రత బియ్యం పంపిణీ కార్డుకు 30 కిలోల వరకు పరిమితి నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలన పూర్తి పాత కార్డులపై సైతం బియ్యం సరఫరా సిటీబ్యూరో: మహానగరంలో అర్హులైన నిరుపేదలందరికీ వచ్చే జనవరి మాసం నుంచి ఆహార భద్రత పథకం బియ్యం పంపిణీ చేయనున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున మొత్తం 30 కిలోల వరకు బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఆహార భద్రత కార్డుల జారీతో సంబంధం లేకుండా అర్హులైన కుటుంబాలతో పాటు పాత రేషన్ కార్డుదారులకు సైతం బియ్యం అందించనున్నారు. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో సిబ్బంది కొరతతో అలస్యంగా ప్రారంభమైనప్పటికీ దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ఈనెలాఖరులోగా పూర్తి చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 23.13 లక్షల కుటుంబాలు ఆహార భద్రత కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయి. కాగా ఆహార భద్రత దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ఇప్పటి వరకు 15 లక్షలు దాటలేదని అధికార గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అందులో హైదరాబాద్ నగరం మరింత వెనుకబడి పోయింది. ఇక్కడ సుమారు 9.44 లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటి వరకు 4 లక్షల దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. రంగారెడ్డి జిల్లాలో 13.69 లక్షల దరఖాస్తులకుగాను గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన 80 శాతం పరిశీలన పూర్తి కాగా, అర్భన్ ప్రాంతంలో కనీసం 40 శాతం కూడా పరిశీలన పూర్తి కానట్లు తెలుస్తోంది. జనవరి నుంచి ఆహార భద్రత కోటా.. హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల్లో జనవరి నుంచి ఆహార భద్రత పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. జనవరి మాసానికి సంబంధించిన బియ్యం కోటా తయారు చేసి ప్రతిపాదనలు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా కార్డుల జారీతో సంబంధం లేకుండా ఆహార భద్రత పథకం కింద బియ్యం పంపిణీకి రంగం సిద్ధ చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్హులందరికీ ఆహార భద్రత బియ్యం ఆహార భద్రత దరఖాస్తుల పరిశీలన ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తాం. కార్డు జారీతో సంబంధం లేకుండా అర్హులందరికీ జనవరి నుంచి బియ్యం పంపిణీ చేస్తాం. - డాక్టర్ పద్మ, చీఫ్ రేషనింగ్ అధికారిణి, సివిల్ సప్లై, హైదరాబాద్ -
పండుగ పూటా పస్తులే..
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మోకాలికి, బోడిగుండుకూ ముడేయడమంటే ఇదే..! ఆధార్ కార్డు లేదనే సాకు చూపి 1.35 లక్షల రేషన్‌కార్డులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ కార్డులకు ఈనెల నుంచే రేషన్ కట్ చేసింది. దీపావళి పండుగ పూట నిరుపేదలను పస్తులు ఉండేలా చేసింది. జిల్లాలో జూన్ 8, 2014 నాటికి 11,20,532 రేషన్‌కార్డులు చలామణిలో ఉన్నాయి. ఇందులో తెల్లకార్డులు 9,85,036.. గులాబీకార్డులు 1,35,546. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం పేరుతో రాష్ట్రంలో ఈ-పీడీఎఫ్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ-పీడీఎఫ్ విధానం అమలుకు మన జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ విధానంలో రేషన్ దుకాణాలను కంప్యూటరీకరిస్తారు. రేషన్‌కార్డులను.. ఆధార్‌కార్డులనూ అనుసంధానం చేస్తారు. ఆధార్ నంబరుతో సరిపోని కార్డులను తొలగిస్తారు. రేషన్‌కార్డులూ.. ఆధార్‌కార్డుల సీడింగ్ పూర్తయిన తర్వాత.. వాటిని కంప్యూటరీకరిస్తారు. ఇవే రికార్డుల ఆధారంగా ఆన్లైన్ విధానంలో రేషన్‌ను పంపిణీ చేస్తారు. ఈ-పీడీఎఫ్ విధానం అమల్లో భాగంగా జిల్లాలో ఆధార్ సీడింగ్ ప్రక్రియను ఇటీవల పూర్తిచేశారు. 8,50,036 తెల్ల రేషన్ కార్డుల లబ్ధిదారులు ఆధార్‌కార్డులను అందజేశారు. ఆ కార్డుల సీడింగ్ పూర్తయింది. 1.35 లక్షల మంది లబ్ధిదారులు ఆధార్‌కార్డులు ఇవ్వలేదనే సాకు చూపి.. ఆ కార్డులను బోగస్‌గా గుర్తించి తొలగించినట్లు అధికారులు ప్రకటించారు. కానీ.. ఇదే అధికారులు ఇప్పటికీ పది శాతం కుటుంబాలకు ఆధార్‌కార్డులు జారీచేయనట్లు అంగీకరిస్తుండడం గమనార్హం. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 11.25 లక్షల కుటుంబాలు ఉన్నట్లు తేలింది. ఆధార్ కార్డుల జారీలో సేకరించిన లెక్కల ప్రకారం జిల్లాలో 11.87 లక్షల కుటుంబాలు ఉన్నట్లు వెల్లడైంది. 2011 నాటితో పోలిస్తే.. ఆధార్ కార్డుల జారీ సమయానికి జనాభా, కుటుంబాలు పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఇవేవీ పట్టని అధికారులు.. ఆధార్ సీడింగ్‌ను పూర్తిచేశామని ప్రకటించి 1.35 లక్షల కార్డులను తొలగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ- పీడీఎఫ్ విధానంలో సరుకులను పంపిణీ చేయడానికి ఇప్పటికీ రేషన్ దుకాణాలను కంప్యూటకీరించలేదు. ప్రభుత్వం ఈ విధానం ఎప్పటి నుంచి అమలుచేస్తామన్నది ప్రకటించనే లేదు. కానీ.. అధికారులు మాత్రం ఈ-పీడీఎఫ్ విధానం అమల్లోకి వచ్చినట్లు ప్రకటించేశారు. ఈనెల బియ్యాన్ని 1.35 లక్షల కార్డుల లబ్ధిదారులకు అందించలేదు. ఆధార్ లేదనే సాకు చూపి వారందరికీ రేషన్‌ను కట్ చేశారు. బోగస్‌కార్డులను రద్దు చేయడం వల్ల నెలకు 27 వేల క్వింటాళ్ల బియ్యం ఆదా అవుతున్నాయని ప్రభుత్వానికి లెక్కలు పం పడం గమనార్హం. ఉన్నట్టుండి రేషన్‌కార్డులను రద్దు చేసి బియ్యం పంపిణీ చేయకపోవడంతో నిరుపేదలు తల్లడిల్లుతున్నారు. దీపావళి పండుగ పూట కూడా నిరుపేదలు పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొంది. -
గోదాముల్లో తగ్గిన ‘చౌక’ సరుకులు
ఒంగోలు: చౌకదుకాణాలపై ఆధారపడిన పేదలకు ఇక కష్టాలే ఆహ్వానం పలకనున్నాయి. జిల్లాలోని పౌర సరఫరాల శాఖ వద్ద సరుకుల నిల్వలు గణనీయంగా తగ్గడం.. కొత్త స్టాకు ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోవడంతో చౌక దుకణాల వద్ద కార్డుదారులు పడిగాపులు కాయాల్సిందే. దీనికి తోడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులకు ఆధార్ జత చేయడంతో లబ్ధిదారుల్లో టెన్షన్ మొదలైంది. కొత్త పథకాలతో పాలన గాడిలో పెడతామన్న టీడీపీ ఇప్పుడు యూ టర్న్ తీసుకుంది. అధికారులు మంగళవారం నిర్వహించిన సమీక్ష అనంతరం డీలర్లకు ఈ విషయం స్పష్టమైంది. వణికిస్తున్న ఆధార్ సీడింగ్ జిల్లాలో ఇప్పటివరకు రేషన్ కార్డులకు సంబంధించి 75 శాతమే ఆధార్ ప్రక్రియ పూర్తయింది. వాస్తవానికి కార్డుదారులో కొంతమంది ఆధార్ నమోదు చేయించుకోలేదు.. మరికొంతమంది తీయించుకున్నా తప్పులు నమోదవ్వడం.. కార్డులు ఇంకా చేతికి రాకపోవడం వంటి కారణాలతో చాలామందికి బ్రేక్ పడింది. జిల్లాలో మొత్తం 8,87,636 కార్డులుండగా 30,23,263 మంది పేర్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆధార్ సీడింగ్ జరుగుతుండటంతో ఒకటికంటే ఎక్కువ ప్రాంతాల్లో కార్డులుంటే తొలగిస్తున్నారు. కొంతమంది తమకు అవసరంలేని కార్డులను ముందుగానే రెవెన్యూ శాఖకు అందజేయలేదు. దీంతో సీడింగ్ సమయంలో ఒకే కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువచోట్ల ఉన్న కార్డులు తొలగించక తప్పడంలేదు. దీంతో జనాలకు పచ్చి వెలక్కాయ నోట్లో పడినట్లవుతోంది. ఆధార్ ఉంటేనే రేషన్ ఇవ్వాలని.. దీనికి ఈ నెల 5వ తేదీ తుది గడువని అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల 60 శాతం మాత్రమే నమోదు ప్రక్రియ పూర్తవ్వడంతో.. దాదాపు నాలిగింట ఒక వంతు బియ్యం పంపిణీకి కోత పడక తప్పేలా లేదు. అన్నీ అరకొరగా.. జిల్లాలోని 8.87 లక్షల కార్డులకుగాను గతంలో 12463 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈ నెల నుంచి పద్ధతి మార్చడంతో బియ్యం పంపిణీ పూర్తిగా జరిగేలా కనిపించడంలేదు. కార్డుకు కిలో లెక్కన మొత్తం 887 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. కానీ ప్రస్తుతం జిల్లాలోని గోదాముల్లో 90 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. ప్రతి రేషన్ షాపునకు సగం స్టాకు మాత్రమే ఇస్తున్నందున సగం మందికి కందిపప్పు లభించదు. మరికొన్ని చోట్ల దాదాపు పదోవంతు మందికి కూడా అందే అవకాశం లేదు. ప్రతి కార్డుదారునికి అరకిలో పంచదార ఇస్తారు. పండగ సందర్భాల్లో మరో అరకిలో ఇస్తారు. అంటే దసరా సరుకు కింద సెప్టెంబర్‌లో కిలో పంచదార ఇవ్వాలి. దీని కోసం మొత్తం 887 మెట్రిక్ టన్నుల పంచదార అవసరం. కానీ ప్రస్తుతం 322 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నాయి. సాల్ట్ 63 టన్నులు ఉన్నాయి. వాస్తవానికి 824 మెట్రిక్ టన్నులు అవసరం. దీనిపై పౌరసరఫరాల శాఖ డీఎం కొండయ్య మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న స్టాక్‌ను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కొత్త స్టాక్‌కు టెండర్లు ఖరారు కావాల్సి ఉందని, త్వరలోనే ప్రక్రియ చేపట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి అదనంగా స్టాకు వచ్చే పరిస్థితి లేదన్నారు. -
పురుగుల బియ్యంతో భోజనంబు..!
మధ్యాహ్న భోజన పథకం దుస్థితి వంట ఏజెన్సీలకు ఇబ్బందులు పందిళ్ల కిందే వంటలు పురుగుల బియ్యం పంపిణీ హనుమాన్‌జంక్షన్‌రూరల్ : విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలో అధికారులకు చిత్తశుద్ధి లోపించడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల లో వంట షెడ్లు లేక తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పందిర్ల కింద వంటలు వండలేక నిర్వాహకులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే ప్రాథమిక పాఠశాలలకు కొంతమంది నిర్వాహకులు ఇళ్లవద్దనే ఆహారపదార్థాలను తయారీ చేసి తీసుకువస్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సుమారు 300కు పైగా విద్యార్థులు ఉండటంతో పాఠశాల ఆవరణ లోనే వంటలు తయారు చేయాల్సి వస్తోంది. దీంతో పొగ వెదజల్లి విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ పొయ్యి పైనే వంటవండాలని నిబందనలు విధించినప్పటికి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయకపోవడంతో పుల్లల పొయ్యి వెలిగించక తప్పడంలేదు. బాపులపాడు మండలంలో ఆరుగొలను, కానుమోలు, రామన్నగూడెం, బాపులపాడు, వీరవల్లి, వేలేరు, రేమల్లె గ్రామాల్లోని జిల్లా పరిషత్ పాఠశాల ల్లో మధ్యాహ్న బోజన పథకం అమలు... ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వీరవల్లి, వేలేరు పాఠశాలల్లో మాత్రమే వంట షెడ్డులు వున్నాయి. గ్యాస్ సిలిండర్లు ఇవ్వకపోవడంతో పుల్లల పొయ్యిలపైనే వంటలు తయారు చేస్తున్నారు. వంట ఏజెన్సీలకు 9,10 తరగతులకు సంబందించి రెండు నెలలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానుమోలు జిల్లా పరిషత్ పాఠ శాలకు సరఫరా చేసిన బియ్యంలో రాళ్లు, ఎర్రటి పెంకు పురుగు, తెల్లటి రంగులో ఉండే పురుగులు కనిపిస్తున్నారు. వీటినే మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్నారు. పాఠశాల ప్రధానోపాద్యాయురాలిని ఈ విషయమై వివరణ కోరగా బియ్యం మార్చినా మళ్లీ అలాంటి బియ్యం వచ్చాయని చెప్పారు. దీంతో బియ్యం జల్లించి, పురుగులు చెరిగి, నీటితో కడిగి వంటకు ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. నిత్యం 30కేజీలు బియ్యం నుంచి రాళ్లు, పురుగులు ఏరడం ఎలా సాధ్యమవుతుందని వంట ఏజెన్సీ నిర్వహకులు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లలు చివరకు పురుగుల అన్నం తినాల్సి వస్తోందని విద్యార్థుల తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పం దించి, మధ్యాహ్న భోజనపథకం సక్రమంగా అమ్చయ్యేలా చూడాలని కోరుతున్నారు.