తిరుమల తరహాలో.. | Rice Distribution Building Construction in Yadadri | Sakshi
Sakshi News home page

తిరుమల తరహాలో..

Published Fri, Feb 21 2020 11:38 AM | Last Updated on Fri, Feb 21 2020 11:38 AM

Rice Distribution Building Construction in Yadadri - Sakshi

గండి చెరువు సమీపంలో అన్నదాన సత్రం నిర్మించనున్న స్థలం

యాదగిరిగుట్ట(ఆలేరు) : అంతర్జాతీయ దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం సకల వసతులు అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుమల తరహాలో క్యూలైన్లు, ప్రెసిడెన్షియల్‌ సూట్‌లు, పెద్దగుట్టపై కాటేజీలు, వాహనాలు నిలిపేందుకు కొండ కింద విశాలమైన పార్కింగ్‌ తదితర చర్యలు చేపట్టారు. వీటితో పాటు అధునాతన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని నిర్మించేందుకు వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో యాదాద్రి కొండపై ఉన్న శ్రీచక్ర భవనంలో భక్తులకు అన్నదానం నిర్వహించేవారు. యాదాద్రి ప్రధానాలయ పునర్నిర్మాణం, విస్తరణలో భాగంగా ఇటీవల ఆ భవన సముదాయాన్ని కూల్చివేశారు. అప్పటినుంచి  రెండవ ఘాట్‌రోడ్డులోని జీయర్‌ కుటీర్‌లో భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. గండి చెరువు కిందిభాగంలో రెండు ఎకరాల స్థలంలో రూ.15కోట్ల వ్యయంతో నూతన నిత్యాన్నదాన సత్ర భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకు వెగెష్న ఫౌండేషన్‌ ఎండీ ఆనంద్‌రాజు ముందుకు వచ్చారు.

మూడు అంతస్తుల్లో నిర్మాణం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం పది తరాల పాటు భవిష్యత్‌లో నిలిచిపోవాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించిన విషయం తెలిసిందే. ఆలయం నిర్మాణం పూర్తయితే భవిష్యత్‌లో భక్తుల సంఖ్య భారీగాపెరిగే అవకాశం ఉంది. రోజూ లక్ష మంది వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా వారందరికీ అన్నదానం చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగానే  తిరుమల తరహాలో ఆధునిక హంగులతో నిత్యాన్నదాన సత్రాన్ని నిర్మించతలపెట్టారు. ఈ సత్రాన్ని మూడు అంతస్తుల్లో నిర్మించనున్నారు. తొలుత మొదటి అంతస్తు నిర్మించి అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధించి ఈఓ గీతారెడ్డితో వైటీడీఏ ఆర్కెటెక్ట్, ఇతర అధికారులతో కలిసి దాత ఆనంద్‌రాజు గురువారం సమావేశం అయ్యారు. తిరుమల, ద్వారక తిరుమలలో అన్నదాన భవనాలు నిర్మించిన విధంగానే గండిచెరువు సమీపంలో నిర్మాణం చేపట్టనున్నట్లు ఈఓ తెలిపారు. మొదటి అంతస్తులో ఒకేసారి 350 మంది కూర్చోని భోజనం చేసేందుకు వీలుగా నిర్మాణం జరుగుతుందని తెలిపారు. వైటీడీఏ డిజైన్‌ ప్రకారం అన్నదాన సత్ర భవనాన్ని నిర్మించనున్నట్లు ఆమె వెల్లడించారు. మరో రెండు రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement