తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది.
ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక..
వీఐపీల తాకిడి
వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్‌లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు.
ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.
తెలంగాణలో..
మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment