lakshmi narasimha swamy temple
-
లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న రేవంత్
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి యాదగిరిగుట్టకు వచ్చిన ఆయన.. సోమవారం నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో సతీమణి గీతారెడ్డితో కలసి తొలిపూజలో పాల్గొన్నా రు. తొలుత తూర్పు త్రితల రాజగోపురం వద్ద సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దీపజ్యోతి వద్ద సీఎం జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువ్రస్తాలను సమర్పించారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీఎం వెంట పూజల్లో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనిల్, వేముల వీరేశం, మందుల సామెలు తదితరులు పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం.. 12 గంటలకు భద్రాచలం వెళ్లారు. స్వర్ణ తాపడం పూర్తి చేయించండి యాదగిరిగుట్టకు వచ్చిన సీఎం రేవంత్‌ను ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు పూర్తి చేయించాలని ఆలయ ఈవో రామకృష్ణారావు కోరారు. కొంత బంగారంతో ధ్వజస్తంభం బంగారు తాపడం చేయించామని తెలిపారు. నారసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం యాదగిరిగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు సోమ వారం పంచరాత్ర ఆగమం ప్రకారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున ఉదయం నిత్యారాధనల అనంతరం శ్రీవిష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలను మొదలుపెట్టారు. స్వస్తి వచనం, రక్షాబంధన కార్యక్రమాలు, పారాయణలు నిర్వహించారు. ప్రొటోకాల్ వివాదం సీఎం పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ వివాదం తలెత్తింది. దేవస్థానం అధికారులు సీఎంకు ఆశీర్వచనం ఇచ్చే సమయంలో డిప్యూటీ సీఎంకు.. మంత్రులకు వేసిన పీటల కంటే చిన్నపీట వేయడం వివాదాస్పదమైంది. సీఎం పక్కన ఆయన సతీమణి గీతారెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ సమానమైన ఎత్తు పీటలపై కూర్చున్నారు. దేవాదాయ మంత్రి కొండా సురేఖను ఆశీర్వచనం ఇస్తున్న అర్చకుల వెనుక కూర్చోబెట్టారు. దీనిపై ఆలయ ఈవో రామకృష్ణారావు స్పందిస్తూ, సీఎంతో పాటు మంత్రులందరికీ పీటలు వేశామని, ఇందులో ప్రొటోకాల్ వివాదమేమీ లేదన్నారు. -
వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
తిరుపతి/హైదరాబాద్, సాక్షి: వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి నేడు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.తిరుమలలో నేటి నుంచి పది రోజులపాటు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువ ఝామునే భక్తులు క్యూ కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవిందా నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక.. వీఐపీల తాకిడి వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో.. తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర బాబు, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ ఎస్.ఎల్. భట్టి, జస్టిస్ శ్యామ్ సుందర్, జస్టిస్ తారాల రాజశేఖర్, కర్ణాటక గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్‌లు విచ్చేశారు. అలాగే.. ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, చెల్లబోయిన, అంబటి రాంబాబు, కారుమూరి, గుడివాడ అమర్నాథ్, రోజా, ఎంపీలు ప్రభాకర్‌రెడ్డి, రఘురామ కృష్ణంరాజు, సీఎం రమేశ్, డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు. ఇవాళ ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి శ్రీమహా విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం. తెలంగాణలో.. మరోవైపు తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. -
యాదాద్రిలో నిబంధనలకు తిలోదకాలు
నల్గొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిబంధనలకు అధికారులే తిలోదకాలు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాదాద్రి కొండపై ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటల వరకు ఆలయంలో ఏర్పాటు చేసిన బ్రేక్ దర్శనాలు ఉత్తర రాజగోపురం నుంచి ప్రధానాలయంలోకి భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు. టికెట్ ఉన్న వారినే ర్యాంప్ పైనుంచి బ్రేక్ దర్శనానికి అనుమతిస్తారు. కానీ, ఆలయంలో విధులు నిర్వహించే ఓ అధికారి తనకు తెలిసిన వ్యక్తులు బుధవారం బ్రేక్ దర్శనం సమయంలో వచ్చారు. దీంతో అధికారి వద్ద పని చేసే సిబ్బంది వారిని నేరుగా లిఫ్టు మార్గంలో ప్రధానాలయానికి చేరుకొని, పశ్చిమ రాజగోపురం నుంచి నేరుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. దీనిని చూసిన భక్తులు కొందరు అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్రేక్ దర్శనం కొనుగోలు చేసే భక్తులు ఉత్తర రాజగోపురం నుంచి పోలీసులు తనిఖీలు చేసిన తరువాతనే ఆలయంలోకి పంపిస్తున్నారు. కానీ, అధికారికి తెలిసిన వారు వస్తే నేరుగా ఎగ్జిట్ నుంచి దారి నుంచి పంపించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులను అడిగితే.. ఓ ఏఈవో అధికారికి తెలిసిన వ్యక్తులు కాబట్టి, ఆయన దగ్గర పని చేసే సిబ్బంది పశ్చిమ గోపురం నుంచి తీసుకెళ్లారని సమాధానం ఇచ్చారు. దీనిని చూసిన ఇతర సిబ్బంది భక్తులను బ్రేక్ దర్శనం సమయంలో పశ్చిమ రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్లారు. -
గుంటూరు: మంగళగిరి పట్టణంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
కోరుకొండ ఆలయ విశిష్టత
-
మంగళగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం : మంత్రి రోజా
-
యాదాద్రి ఆలయానికి పెరుగుతున్న భక్తుల తాకిడి
-
కళ్లారా చూసుకోవద్దా..
సాక్షి, యాదాద్రి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భక్తులకు యాదగిరీశుని కనులారా దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. అంగరంగ వైభవంగా జరిగిన ఉద్ఘాటన అనంతరం యాదాద్రీశుని సంపూర్ణ దర్శనం లభించడం లేదు. తిరుమల తరహాలో బంగారు వాకిలి నుంచే శ్రీ స్వామివారి దర్శనానికి అధికారులు అవకాశం ఇస్తున్నారు. దీంతో ఆరేళ్ల తర్వాత గర్భాలయంలోని స్తంభోద్భవుని దర్శనం కోసం తపిస్తున్న భక్తులు ఇక్కడికి రాగానే నిరాశగా వెనుదిరుగుతున్నారు. గతంలో భక్తులను గర్భాలయంలోకి అనుమతించి దగ్గర నుంచి స్వామి దర్శనం కల్పించే సంప్రదాయం ఉండేది. ఇప్పుడు కూడా గతంలో మాదిరిగానే గర్భాలయంలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. ఆనవాయితీకి విరుద్ధంగా..: యాదగిరిగుట్టలో స్వయంభూ దర్శనం గర్భాలయంలోనే కల్పించడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. ఆలయ పునర్నిర్మాణం నేపథ్యంలో ఆరేళ్ల నుంచి బాలాలయంలోనే భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఈనెల 28న మహాకుంభ సంప్రోక్షణతో గర్భాలయం తెరిచిన విషయం తెలిసిందే. ఆలయ పునరుద్ధరణలో భాగంగా భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వీలుగా గర్భాలయం ద్వారాలను కూడా వెడల్పు చేశారు. దీంతో మరింత సులువుగా స్వామివారి దర్శనం లభించే అవకాశం ఉన్నా భక్తులను వాకిలి (గర్భాలయం గడప వద్ద ) నుంచే పంపేస్తున్నారు. భక్తులు ఆలయ నిర్మాణ శైలిని చూసి ఆనందపడుతున్నా.. స్వామి దర్శనం విషయంలో మాత్రం సంతృప్తి చెందడం లేదు. బుధవారం నుంచి ప్రారంభించిన సువర్ణ పుష్పార్చన ముఖ మండపంలోనే ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులు ప్రధానాలయంలోకి వచ్చే వృద్ధులు, వికలాంగులు, గర్భిణులు, బాలింతలు మెట్లు ఎక్కలేక ఇబ్బందులు పడుతున్నారు. తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి మెట్లమార్గాన దిగి దర్శనం అనంతరం పడమర రాజగోపురం వైపు మళ్లీ మెట్లెక్కి వెళ్లడం ఇబ్బందిగా మారింది. అలాగే క్యూలైన్లలో నిలబడేందుకు వసతి లేక ఇబ్బంది పడుతున్నారు. గర్భగుడిలోకి అనుమతించాలి స్వామివారిని దర్శించుకోవడానికి 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్నా. అలాగే కొత్త గుడి కట్టిన తర్వాత దర్శనానికి వచ్చా. కానీ అధికారులు బయటి నుంచే పంపించారు. భక్తులను గర్భాలయంలోకి పంపించి స్వామి నిజ దర్శనం కల్పించాలి. ఈ విషయంలో సీఎం మరోసారి ఆలోచించాలి. – మహాలక్ష్మి భక్తురాలు, హైదరాబాద్ త్వరలో అనుమతిస్తాం వేలాదిగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం బంగారు వాకిలి నుంచే దర్శనం కల్పిస్తున్నాం. వీలైనంత త్వరలో గర్భగుడిలోకి భక్తులను అనుమతిస్తాం. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తాం. – గజ్వెల్లి రమేష్ బాబు, ఆలయ ఏఈఓ -
Yadagirigutta Temple: అదిగదిగో యాదాద్రి
సాక్షి, హైదరాబాద్: యాదగిరి లక్ష్మీ నారసింహుడు.. తెలంగాణ ఇలవేల్పు.. ఏడాదికోసారైనా ఇంటిల్లిపాదీ ‘గుట్ట’కు వెళ్లి దర్శించుకోవటం ఆనవాయితీ. ఇప్పుడా నారసింహుడి ఆలయం అద్భుతమైన ‘యాదాద్రి’గా మారి వెలుగులు విరజిమ్ముతోంది. పూర్తి కృష్ణశిలల నిర్మాణం, అబ్బురపడే శిల్పాలతో సరికొత్త రూపాన్ని సంతరించుకుని.. భక్తజన కోటిని ఆనంద పారవశ్యంలో ముంచెత్తేందుకు సిద్ధమైంది. ఆరేళ్ల తర్వాత భక్తులకు స్వయంభూ లక్ష్మీనరసింహుడు తనివితీరా దర్శనమివ్వనున్నాడు. సోమవారం (28వ తేదీన) మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ముగిసిన తర్వాత సాధారణ భక్తులకు దర్శనం మొదలుకానుంది. మరో తిరుమలగా..! ఏపీలోని తిరుమల వెంకన్న సన్నిధి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ, ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. సాధారణ రోజుల్లోనే 40 వేల మంది వరకు.. సెలవులు, ప్రత్యేక పర్వదినాల్లో దాదాపు 70– 80 వేల మంది దాకా వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధి తెలుగు రాష్ట్రాల్లో తిరుమల తర్వాత అంతగా భక్తుల తాకిడి ఉండే ఆలయంగా నిలుస్తుందని అంచనా. గత ఆరేళ్లలో బాలాలయంలో నరసింహస్వామిని.. సాధారణ రోజుల్లో 8 వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 30, 40 వేల వరకు దర్శించుకున్నారు. ఇప్పుడు ప్రధానాలయం, స్వయంభూ మూర్తి దర్శనం మొదలైతే.. భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. సాధారణ రోజుల్లో 20వేల మంది వరకు.. సెలవు రోజులు, ప్రత్యేక సందర్భాల్లో 40, 50వేల మంది వరకు వస్తారని పేర్కొంటున్నారు. ‘‘ఆలయ పునర్నిర్మాణ పనులు మొదలవకముందటితో పోలిస్తే.. పనులు మొదలై బాలాలయంలో స్వామి దర్శనాలు మొదలుపెట్టాక అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగింది. 5 వేల మంది దర్శించుకునే రోజుల్లో 10 వేల మంది రావడం మొదలైంది. ప్రత్యేక సందర్భాల్లో 30వేల మంది వరకు వచ్చారు. కొత్త ఆలయ నిర్మాణంతో దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. భక్తులు, సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నాం. రోజుకు 50వేల మంది వచ్చినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం’’ అని యాదాద్రి ప్రాంత అభివృద్ధి సంస్థ వైస్‌చైర్మన్ కిషన్‌రావు చెప్పారు. వెయ్యేళ్లకుపైగా నిలిచేలా.. యాదాద్రి ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలలతో నిర్మించారు. నిజానికి 17వ శతాబ్దం తర్వాత రాతి నిర్మాణాలు చాలావరకు నిలిచిపోయాయి. ఇటుకలు, ఆ తర్వాత సిమెంటు వాడకం పెరిగి రాతిని వాడటం ఇబ్బందిగా భావిస్తూ వచ్చారు. జటప్రోలు సంస్థానాధీశులు నిర్మించినవే తెలుగు నేలపై చివరి పూర్తి రాతి మందిరాలు. ఇన్ని వందల ఏళ్ల తర్వాత మళ్లీ తొలిసారి పూర్తి రాతి నిర్మాణానికి యాదాద్రి వేదికైంది. ఆలయం కోసం ఏకంగా రెండున్నర లక్షల టన్నుల కృష్ణ శిలలను వినియోగించారు. 1,200 మంది శిల్పులు రాత్రింబవళ్లు పనిచేసి అద్భుతంగా తీర్చిదిద్దారు. వెయ్యేళ్ల పాటు నిలిచేలా ఇంటర్‌లాకింగ్ పరిజ్ఞానం, బరువు సమతూకం అయ్యేలా డిజైన్ చేసి ఆలయాన్ని నిర్మించారు. పిడుగుపాటుతో నష్టం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయ విమానగోపురంపై సీఎం కేసీఆర్ సంప్రోక్షణ చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకాలంకరణలో ఏర్పాటు చేసిన రంగురంగుల ధ్వజాలు అద్భుత శైలి.. ఆకట్టుకునే విగ్రహాలతో.. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో దాదాపు రూ.1,200 కోట్ల భారీ వ్యయంతో యాదాద్రి పునర్నిర్మాణాన్ని చేపట్టారు. 2015లో మొదలైన నిర్మాణం ఇటీవలే పూర్తయింది. అబ్బురపడే రీతిలో ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఓ రకంగా చెప్పాలంటే గుడి కాదు ఏకంగా గుట్టనే మారిపోయింది. ► యాదాద్రి ఆలయ నిర్మాణంలో కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణ శైలులను వినియోగించారు. ► వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ఆళ్వార్లు ఇక్కడ రాతి స్తంభాల రూపంలో ముఖ మండపంలో కొలువుదీరారు. 12 మంది ఆళ్వార్లు 11 అడుగుల ఎత్తుతో 38 అడుగుల ఎత్తున్న ముఖ మండపానికి ఆధారభూతంగా నిలిచారు. ► మరెక్కడా లేనట్టుగా 1,700 అడుగుల పొడవునా.. దాదాపు 80 నుంచి 100 అడుగుల ఎత్తుతో ప్రాకారాలను నిర్మించారు. ► 84 అడుగుల ఎత్తుతో ఏడు అంతస్తుల మహారాజగోపురం.. ఐదు, నాలుగు, మూడు, రెండు అంతస్తులతో మరో ఐదు గోపురాలు, విమాన గోపురం ఇక్కడి మరో ప్రత్యేకత. ► మహారాజగోపురం ఒక్కదానికే ఏకంగా 13 వేల టన్నుల రాయిని వాడారు. ఇది పూర్తవటానికి రెండేళ్లు పట్టింది. ► ఏ దేవాలయంలోనూ లేనట్టు ప్రాకారానికి వెలుపల అష్టభుజి మండపాలను ఏర్పాటు చేశారు. రథయాత్ర సాగినా భక్తులు హాయిగా ఆ మండపాల్లో కూర్చుని చూడొచ్చు. ► సింహం తల, గుర్రం తరహా శరీరం, దిగువ ఏనుగు.. వెరసి యాలీ జంతు రూపం. ఇలాంటి భారీ రాతి శిల్పాలు ఏకంగా 58 కొలువుదీరాయి. నోరు తెరిచి ఉన్నట్టుగా ఉండే ఆ విగ్రహాల నోటిలో అతిపెద్ద రాతి బంతులు ఉండటం విశేషం. ► ఏడు చోట్ల ఐరావతాలు, ప్రవేశం నుంచి ఆలయంలోకి వెళ్లేప్పుడు స్తంభాల రూపంలో ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, యాద మహర్షి, రామానుజుల రూపాలు, గర్భాలయ ద్వారంపైన రాతి ప్యానెల్‌పై గర్భాలయ ఉత్సవ మూర్తి రూపం, ప్రహ్లాదచరిత్ర, పంచ నారసింహుల రూపాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ► సాయంత్రం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించినట్టుగా అదేతరహా కాంతితో ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ ఆకట్టుకుంటోంది. ఇది ఓ తంజావూరు.. ఓ శ్రీరంగం గొప్ప రాతినిర్మాణ దేవాలయం అనగానే మనకు తంజావూరు గోపురం గుర్తుకొస్తుంది. శ్రీరంగం మదిలో మెదులుతుంది. ఇప్పుడా రెండు దేవాలయాలు మనకు యాదాద్రిలో కనిపిస్తాయి. ఇది అసాధారణ నిర్మాణం. సీఎం కేసీఆర్ శ్రీకృష్ణదేవరాయలులాగా నిలిచి, ఆలోచనలు పంచి, ఆర్థిక వనరులు కల్పించి కట్టించారు. రాతి దేవాలయాల నిర్మాణ చరిత్రలో యాదాద్రి చిరకాలం నిలిచిపోతుంది. భక్తులకు ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు గొప్ప నిర్మాణంలో గడిపిన అనుభూతిని పంచుతుంది. – ఆనంద సాయి, ఆలయ ఆర్కిటెక్ట్ -
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మ రథోత్సవం
కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవం బుధవారం అశేష భక్తజనం నడుమ అత్యంత వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం 8.56 గంటలకు రథం ముందుకు కదిలింది. స్వామివారు తిరువీధుల గుండా విహరించి సాయంత్రం 3.45 గంటలకు యథాస్థానం చేరుకున్నారు. రథం తిరువీధుల్లోని గండి మడుగు ఆంజనేయస్వామి గుడి వద్దకు చేరుకోగానే ఎడమ వైపు ఉన్న తేరు మోకు రెండు సార్లు తెగిపోయి అంతరాయం కలిగింది. చివర్లో రథం గోడకు ఆనుకోవడంతో అక్కడ కూడా గంటకు పైగా ఆలస్యమైంది. కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆనవాయితీగా మూర్తిపల్లి, బేరిపల్లి, కుటాగుళ్ల, నాగిరెడ్డిపల్లి, గంగిరెడ్డిపల్లి గ్రామస్తులు రథానికి వెనుకవైపు నుంచి సండ్ర మొద్దులు, తెడ్లు వేస్తూ రథ గమనాన్ని నియంత్రిస్తూ వచ్చారు. మూడు లక్షల మందికి పైగా భక్తులు రథోత్సవానికి విచ్చేసినట్లు ఆలయ, పోలీసు అధికారుల అంచనా. ఎండలు మండిపోతున్నా భక్తులు ఏమాత్రం లెక్కచేయక స్వామివారి సేవలో తరించారు. -
ఆ ఆలయంలో మొక్కులు ప్రత్యేకం.. అరటిగెలలు వేలాడదీసి
సాక్షి, సంతబొమ్మాళి (శ్రీకాకుళం): కోరిన కోర్కెలు నెరవేర్చే దైవానికి వస్తు రూపేణ, ధన రూపేణ భక్తులు మొక్కులు చెల్లించటం మామూలే. అయితే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్రలో వెలసిన లక్ష్మీనరసింహస్వామికి భక్తులు మొక్కులు చెల్లించే విధానం కాస్త ప్రత్యేకం. స్వామివారికి ప్రతి ఏటా అరటిగెలల ఉత్సవం నిర్వహించి, ఆలయ ప్రాంగణంలో అరటిగెలలు వేలాడదీసి మొక్కులు చెల్లించటం ఇక్కడ ఆనవాయితీ. శనివారం జరిగిన ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు గెలలు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. సమారు 5 వేలకుపైగా గెలలతో ఆలయ ప్రాంగణం అంతా అరటిమయం అయ్యింది. ఆలయంలో అరటి గెల కట్టిన భక్తులకు రశీదు అందజేస్తారు. రెండు రోజుల తర్వాత తిరిగి ఎవరి గెలను వారికి ఇచ్చేస్తారు. ఆ గెలను ఇంటిల్లిపాదీ ప్రసాదంగా స్వీకరిస్తారు. కొందరు పానకంగా తయారు చేసి పంపిణీ చేస్తారని స్థానికులు తెలిపారు. -
యాదాద్రీశుడి దర్శనానికి 3 గంటలు
యాదగిరిగుట్ట: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో రెండు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం, ఆదివారం సెలవు రోజులు కలసి రావడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ వీధులు, క్యూలైన్లు, బాలాలయం, ఉత్సవ, మహా మండపాలు, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, ప్రసాద విక్ర య కేంద్రం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. రద్దీ ఎక్కువగా ఉండడంతో ధర్మ దర్శనానికి సుమారు మూడు గంటలు, అతి శీఘ్ర దర్శనానికి సుమారు గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. ఆదివారం 30 వేలకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో కొండపైకి భక్తుల వాహనాలు వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పాతగుట్టపై కూడా భక్తుల రద్దీ కొనసాగింది. -
యాదాద్రీశుడిని దర్శించుకున్న సీఎస్
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. బాలాలయం వద్ద సోమేశ్కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రతిష్టా బంగారు కవచమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం పూజలు చేశారు. సీఎస్‌కు ఆలయ ఈవో గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సోమేశ్ ప్రధానాలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలంతా క్షేమంగా ఉండాలని స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ప్రధానాలయం దాదాపు పూర్తయిందని, కొండ కింద రోడ్లు, తదితర పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 28న జరిగే ప్రధానాలయ ఉద్ఘాటన సమయానికి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. -
లక్ష్మీనృసింహుని సన్నిధిలో శర్వానంద్, రష్మిక
సాక్షి, సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ చిత్రం హీరో హీరోయిన్లు శర్వానంద్, రష్మికా మంధన్న గురువారం సందడి చేశారు. స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. వారికి ప్రధానార్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి ఆశీర్వచనాలు తెలిపారు. క్షేత్ర మహాత్మ్యం గురించి వారు అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఆలయంలో చిత్ర యూనిట్ సభ్యులు సందడి చేశారు. లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సారథ్యంలో తిరుమల కిశోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సందర్భంగా శర్వానంద్, రష్మిక మాట్లాడుతూ, గోదావరి తీరం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నారు. చక్కటి వాతావరణం, కొబ్బరి తోటలు, పంట పొలాలు కనువిందు చేస్తున్నాయని అన్నారు. చదవండి: (అభిమానులకు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ అజయ్‌భూపతి) -
రెండో పెళ్లి చేసుకోవాలంటే ఆ గుడికే వెళ్తారు.. ఎందుకంటే..!
సాక్షి,యడ్లపాడు(గుంటూరు): ఈతిబాధలు..వివాహ సమస్య, సంతానలేమీ.. చికాకులు ఇలా ఒక్కొక్క సమస్య పరిష్కారానికి ఒక్కొక్క ఆలయానికి వెళ్తుంటారు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలను దర్శిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. మరికొన్ని చోట్ల సుదీర్ఘకాలంగా జరగని వివాహాలు తక్షణమే ముహుర్తాలు వస్తాయి. ఇంకొన్ని ఆలయాలకు వెళితే సంతానలేమీ సాఫల్యమవుతుందని భక్తుల నమ్మకం. గుంటూరు జిల్లాలోని ఆలయం ఒకటి వీటన్నింటికి ఎంతో భిన్నమైనది. మరెంతో విశిష్టమైనది. ఇక్కడి స్వామి వారు కొండబండరాయిపై ప్రతిమలా చెక్కబడి దర్శనమిస్తారు. సమీప ప్రాంతాల వారు రెండోవివాహాలు చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ ఆలయమే కళ్యాణ వేదిక. అందులోని స్వామివారే ఆ దంపతులకు శ్రీరామరక్ష. ఎర్రకొండపై గుహలా ఉన్న పురాతన లక్ష్మినర్సింహస్వామి గుడి కొండబండ తొర్రలో గుడి... జయలక్ష్మి నరసింహస్వామి ఆలయం రాష్ట్రంలోనే విశిష్టమైనదిగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన యడ్లపాడులో ఈ ఆలయం ఉంది. పూర్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 16 నరసింహస్వామి పూజలందుకున్న దేవాలయాల్లో ఇది ఒకటిగా ప్రాచుర్యం పొందింది. గ్రామానికి సమీపానే 16వ నంబర్ జాతీయ రహదారి పక్కనే ఎర్రకొండపై ఈ స్వామివారి గుడి ఉంది. ఆలయ గోపురాలు, భారీ మండపాలు చుట్టూ ప్రాకారాలు ఏమీ లేకుండా సాదాసీదాగా కనిపిస్తుంది. భారీ బండారాయిని తొలచిన చిన్నపాటి గుహ గుడిగా నిర్మితమైంది. బండరాతిపై చెక్కబడిన ప్రతిమయే దైవంగా దర్శనమిస్తుంది. కొండపై స్వయంభుగా స్వామివారు వెలిశారని, రాజవంశీయులు ప్రతిమను చెక్కించి పూజలు చేశారని, ఓ మహర్షి క్రతువు నుంచి ఉద్భవించిందని, ఇలా రకరకాల కథలు స్థానిక పెద్దల నుంచి వినవస్తాయి. అయితే వీటికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏవీ అందుబాటులో లేవని చెప్పాలి. కొండకింద నుంచి పైవరకు తోటలా పెరిగిన భారీసైజు తులసీ మొక్కలు కోవెల ఇలా.. కొండ శిఖరంపై ఉన్న భారీ బండరాయిని నాగపడిగ ఆకారంలో చెక్కబడి గుహగా మలిచారు. ఏకకాలంలో సుమారు 400 గొర్రెలు నిలబడేంత విశాలంగా గుహ ప్రదేశం ఆకర్షణీయంగా ఉండేది. స్వామివారి అభిముఖంగా రాతితో చెక్కబడిన పాదాలు, ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిస్తాయి. ఈ పాదాలను సీతమ్మ పాదాలుగా చెప్పుకుంటారు. గ్రామస్తులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయంలో స్వామిని దర్శించి పూజించేవారు. ఏటా ఏప్రిల్ మాసంలో జరిగే ఈ స్వామి ఉత్సవాల్లో భక్తులకు ప్రసాదంగా మామిడికాయలు, వడపప్పు, పానకం, విసనకర్రలు బ్రాహ్మణులు, భక్తులు పంపిణీ చేయడం విశేషం. ఓనాడు ఈ కొండపై పిడుగు పడి గుహ ముందు భాగం ధ్వంసమైంది. ప్రస్తుతం కొద్ది భాగమే గుహ ఆకారంలో ఉంది. సీతమ్మపాదాలు, ఆంజనేయస్వామి విగ్రహాలు కూడా ప్రస్తుతం లేవు. నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ధ్వంసమైన నాటి నీటిదొన ఉన్న ప్రాంతం ద్వితీయ వివాహాలు జరిపించే దివ్యక్షేత్రం... ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం ద్వితీయ వివాహాలు నిలయంగా ఉండేది. సంసారంలో అపశ్రుతులు ఎదురై అందుకు దంపతులు విడిపోయినా.. శాశ్వతంగా దూరమైనా పెళ్లి తప్పా ఏ అచ్చటా ముచ్చట తీరని వారి పరిస్థితి అగమ్యగోచరంగా అనిపిస్తుంది. ఇలాంటి వారికి పెద్దలు నచ్చజెప్పొలేదా వారే తమకు నచ్చిన వారిగా మరోతోడు వెతుక్కున్న సమయంలో రెండోపెళ్లిని పెద్దలు ఇక్కడే జరిపించేవారు. అలా రెండోసారి పెళ్లి చేసుకునే వారికి వేదికలా మారింది. దీంతో సమీప గ్రామస్తులే కాదు సుదూర ప్రాంతాలకు చెందిన వారుసైతం ఇక్కడే పూజలు నిర్వహించి తమ రెండో వివాహాలను జరిపించుకునేవారు. స్వామి చెంత రెండోపెళ్లి చేసుకున్న జంటలు శాంతిసౌఖ్యాలతో వర్థిల్లుతారని అంతా విశ్వసించేవారట. ఒంటరి జీవితాలను జంటగా చేసిందే ఆ స్వామి వారేనని భావించి ఇక్కడ వివాహాలు చేసుకుంటారని పెద్దలు చెబుతుంటారు. రెండోవివాహం చేసుకున్న వారంతా స్వామి వారి ఉత్సవాలకు తప్పని సరిగా హాజరై మొక్కులు తీర్చుకోవడం విశేషం. రెండో పెళ్లిళ్లకు ప్రసిద్ధి...నూర్పాల పోలిరెడ్డి, నృసింహస్వాముని భక్తుడు. ప్రస్తుతం నాకు 76 ఏళ్లు. సుమారు 5 దశాబ్దాలుగా స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నాను. సుబ్రమణ్యం అనే గురువు ఈ స్వామివారి పూజాక్రతులు నిర్వహించేవారు. ఏటా నృసింహ జయంతి నాడు కొండపై కళ్యాణ వేడుకలతో పాటు మామిడి పళ్లు, విసనకర్రలు, పానకం పంపిణీ చేసేవారు. కందకంలోకి పడుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చేది. రెండోసారి వివాహం చేసుకునే దంపతులకు ఈ కోవెల నిలయమైంది. తులసీవనాలు, చల్లని వాతావరణం...చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, యడ్లపాడు మా తాతల కాలంలో నృసింహుని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభలు కట్టుకుని అక్కడికి వెళ్లేవాళ్లం. కొండపై తులసి సువాసనలతో ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండపై దొనలో మంచినీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. భక్తులు కొండపై గొర్రెలు, పశుకాపరులు ఇక్కడికి వచ్చి దాహం తీర్చుకునేవారు. చదవండి: బాగ్దాద్ నుంచి భారత్‌కు వచ్చిన ఫకీరు, ఒక్క రూపాయికే అత్తరు -
యాదాద్రి ఆలయ పునఃప్రారంభ తేదీని ప్రకటించిన సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ముహూర్త తేదీని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. యాదాద్రిలో 2022 మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభమవుతుందని కేసీఆర్ తెలిపారు. తొమ్మిది రోజుల ముందు మహా సుదర్శన యాగంతో అంకురార్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ సభ ఈ తేదీలను నిర్ణయించిందన్నారు. ఆ సమయాల్లో లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారని అన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనలో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మహా సుదర్శన యాగం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ యాదాద్రిలో 10 వేల మంది రుత్వికులతో మహా తెలంగాణలో గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని విశిష్ట పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఒకటని కొనియాడారు. జోగులాంబ ఆలయం గొప్ప శక్తిపీఠమని, కృష్ణా పుష్కారాలను జోగులాంబ ఆలయం వద్ద ప్రారంభించానని తెలిపారు. స్వామి వారి విమాన గోపురాన్ని స్వర్ణతాపడం చేయించబోతున్నామని, ఇందుకు 125 కిలోల బంగారం అవసరమన్నారు. ప్రతి గ్రామాన్ని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామన్నారు. తెలంగాణలో 12 వేల 769 గ్రామ పంచాయితీలు ఉన్నాయని, ఆ గ్రామాల్లో పూజలు చేసి డబ్బు ఇస్తే రిజర్వ్ బ్యాంక్ నుంంచి బంగారం కొంటామని అన్నారు. గ్రామం నుంచి 16 రుపాయలు ఇచ్చినా సరిపోతుందన్నారు. తమ కుటుంబం నుంచి తొలి విరాళంగా కిలో 16 తులాల బంగారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. మంత్రి మాల్లారెడ్డి కుటుంబం నుంచి కేజీ, మేడ్చల్ నియోజకవర్గం నుంచి కేజీ ఇస్తామన్నట్లు సీఎం పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి రెండు కేజీల బంగారం ఇస్తామన్నారని తెలిపారు. భాస్కరరావు కావేరి సీడ్స్ తరపున కేజీ బంగారం, జీయర్ పీఠం నుంచి కూడా కేజీ బంగారం ఇస్తామన్నారని పేర్కొన్నారు. ‘సమైఖ్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురైంది. సామాజిక వివక్షే కాకుండా.. ఆధ్యాత్మిక వివక్షకు గురైంది. ఒకప్పుడు పుష్కరాలు కూడా నిర్వహించేవారు కారు. ఉద్యమ సమయంలో నేను ప్రశ్నిస్తే పుష్కరఘాట్లు నిర్మించారు. 50 ఏళ్ల కిందటే యాదాద్రి వచ్చాను. 1969లో తిరుమల వెళ్లాను. యాదాద్రి ఆలయం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. వసతి సదుపాయం కోసం టెంపుల్ సిటీని అభివృద్ధి చేశాం. టెంపుల్ సిటీలో అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలు చేపట్టాం. 100 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చక్కగా జరిగింది.’ అని తెలిపారు. -
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న కిషన్ రెడ్డి
-
దసరా నాటికి ‘యాదాద్రి’
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేసి ఈ దసరా నాటికి ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చిన్నచిన్న పనులు మినహా ఇప్పటికే గుట్టపై నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చాయి. గుట్ట దిగువన కొన్ని ప్రధాన పనులు తుదిదశలో ఉన్నా యి. వీటిని అక్టోబర్ చివరి నాటికి పూర్తిచేసేలా చర్యలు చేపట్టారు. దసరాకు ప్రారంభించే విషయంలో సీఎం స్పష్టత కోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. సీఎం కేసీఆర్ చినజీయర్ స్వామితో చర్చించి ప్రారంభ ముహూర్తాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ దసరాకు ప్రారంభించడం కుదరకపోతే.. వచ్చే ఫిబ్రవరిలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో ప్రారంభోత్సవాన్ని చేపట్టే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. దాదాపు పనులన్నీ పూర్తి.. ►యాదగిరిగుట్టపై ఆలయ పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. క్యూ కాంప్లెక్స్ వెలుపలి భాగానికి సంబంధించిన కొన్ని పనులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ వాటిని పూర్తి చేయను న్నారు. గుట్టపైన ఉన్న పుష్కరిణి పనులు రెండు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. దిగువన పుష్కరిణి నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రధాన ఆలయం పక్కనే ఉన్న శివాలయంలో ఒక ప్రాకారం నిర్మించాల్సి ఉంది. ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్న విద్యుద్దీపాల ఏర్పాటు కూడా పదిరోజుల్లో పూర్తి కానున్నట్టు అధికారులు చెప్తున్నారు. దిగువన కల్యాణకట్ట రెండు నెలల్లో సిద్ధమవుతుందని అంచనా. ►నిత్యాన్నదాన భవనం పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. పనులు చేపట్టేందుకు ఓ దాత ముందుకొచ్చారు. పూర్తవటానికి కొంత సమ యం పట్టనుంది. ఊ గండిచెరువు వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ విల్లాతోపాటు వీఐపీ కాటేజీలు సిద్ధమయ్యాయి. ►గుట్ట దిగువన వ్రత మండపం సిద్ధమయ్యేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే గుట్టపై ప్రత్యామ్నాయ మండపం ఉన్నందున భక్తులకు పెద్దగా ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఊ ఆలయాన్ని పూర్తిగా నల్లరాతితో నిర్మిస్తున్నందున చాలా జాగ్రత్తగా పనులు జరపాల్సి ఉంటుందని, అదే జాప్యానికి కారణమని పేర్కొంటున్నారు. -
లక్షల్లో వచ్చినా ఇబ్బంది ఉండొద్దు: యాదాద్రిపై సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: ‘‘లక్షల మంది భక్తులు ఒకేసారి వచ్చినా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సరిపోవాలి. కరోనా అదుపులోకి వచ్చినందున రెండున్నర నెలల్లో యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పూర్తి చేయాలి..’’ అని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరంగల్ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ సోమవారం సాయంత్రం 6.20 గంటలకు యాదాద్రికి చేరుకున్నారు. ఆలయంతోపాటు రింగ్‌రోడ్డు పక్కన జరుగుతున్న గండి చెరువు, కల్యాణకట్ట, దీక్షాపరుల మండపం, లక్ష్మి పుష్కరిణి పనులను పరిశీలించారు. యాదగిరిగుట్ట పట్టణంలో చేపట్టిన రింగ్‌రోడ్డుతో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో మాట్లాడి, న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పనులను పరిశీలించి.. తొలుత గుట్ట కింద పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్.. తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఆలయ క్యూలైన్లలో నడుస్తూ చూశారు. తూర్పు రాజగోపురం, సుదర్శన గోపురాలతోపాటు మేలిమి వర్ణంతో ధగధగలాడుతున్న ప్రధానాలయ గోపురాలను, విద్యుత్ దీప కాంతులను ప్రత్యేకంగా పరిశీలించారు. ఆ విద్యుత్ దీపాల సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రధానాలయం లోపల యాలీ పిల్లర్లు, ఆళ్వార్ మండపాలను పరిశీలించారు. గర్భాలయంలో స్వామివారికి మొక్కి హారతి తీసుకుని పడమర రాజగోపురం నుంచి బయటికి వచ్చారు. కొండపై ఉన్న గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, సుమారు రెండు గంటల పాటు అధికారులతో సమీక్షించారు. రింగ్‌రోడ్డు లోపల ఆలయ నిర్మాణాలే.. రింగ్ రోడ్ పరిధిలో ఉన్న భూములపై వెంటనే డీజీపీఎస్ సర్వే నిర్వహించాలని సీఎస్ సోమేశ్‌కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. రింగ్ రోడ్ పరిధి లోపల కేవలం ఆలయానికి సంబంధించిన నిర్మాణాలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. పనుల్లో అలసత్వం పనికిరాదని, ఆలయం లోపల, ఆలయానికి అనుబంధంగా జరుగుతున్న ఇతర నిర్మాణ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్ బిల్డింగ్, ఎస్కలేటర్లు, ఆర్నమెంటల్ ఎలివేషన్, లాండ్ స్కేపింగ్, బీటీ రోడ్, పుష్కరిణి, కల్యాణ కట్ట, పార్కింగ్, ఇతర నిర్మాణాల పనులపై వివరంగా చర్చించారు. మొత్తంగా రెండున్నర నెలల్లో ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. పనులు వేగంగా జరగని చోట వర్కింగ్ ఏజెన్సీలను మార్చాలన్నారు. టెంపుల్ టౌన్లో చేపట్టే కాటేజీల నిర్మాణానికి వైటీడీఏ ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి, అద్భుతంగా నిర్మించే వర్కింగ్ ఏజెన్సీలకు పనులను అప్పగిస్తామని తెలిపారు. ఒకసారి ఆలయం ప్రారంభమైతే భక్తులు భారీగా వస్తారని.. అందుకు అనుగుణంగా నిర్మాణాలు, ఇతర ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బస్‌డిపో, బస్టాండ్ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి విడుదల చేస్తామని, వారంలోగా నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ పర్యటనలో సీఎం వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే గొంగిడి సునీత, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు.. గిరి ప్రదక్షిణ గుట్టపై బాలాలయంలో లక్ష్మీనర్సింహస్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సోమవారం స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం, ఏకాదశి కలసి రావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంకు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. స్వాతి నక్షత్రం సందర్భంగా సీఎం కేసీఆర్ గిరి ప్రదక్షిణ మాదిరిగా యాదాద్రి చుట్టూ ప్రత్యేక కాన్వాయ్‌లో రెండుసార్లు తిరిగారు. -
‘యాదాద్రి అద్భుతం.. అద్వితీయం’ సీజేఐ ప్రశంసలు
సాక్షి, యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని, కృష్ణ శిలలతో నిర్మితమైన ఈ ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. క్షేత్రంలోని పచ్చదనం, కట్టడాలు అద్వితీయంగా ఉన్నాయని ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయితోపాటు శిల్పుల పనితీరును ప్రశంసించారు. యాదాద్రికి మరోసారి సైతం తప్పక వస్తానని పేర్కొన్నారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా మంగళవారం యాదాద్రి జిల్లాలోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వర్ణ కలశంతో కూడిన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువును, బాలాలయంలోని పంచ నారసింహుని దర్శించుకుంటూ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వామి, అమ్మవార్లకు స్వర్ణ పుష్పార్చన పూజలు జరిపించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ గడప బయట నుంచి పూజలు జరిపి దర్శించుకుని స్వర్ణ శటారి పొందారు. సుమారు గంటపాటు బాలాలయంలో గడిపి పూజలు నిర్వహించిన అనంతరం వేద ఆశీర్వచనం పొందారు. ఆలయ విశేషాలను పూజారులను సీజేఐ అడిగి తెలుసుకున్నారు. సీజేఐ దంపతులకు ఆలయ పక్షాన స్వామి అమ్మవార్ల జ్ఞాపికను రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి అందజేశారు. దేవాలయ ఈఓ గీతారెడ్డి వారికి పట్టు వస్త్రాలను అందించగా దేవుడి ప్రసాదాన్ని అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందించారు. పునర్నిర్మాణంలో ఎంత మంది పనిచేశారు? సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఆలయ నిర్మాణ ప్రత్యేకతల గురించి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయిని అడిగి తెలుసుకున్నారు. హొయ సాల, ద్రవిడ, పల్లవ, కాకతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చేపట్టిన ఆలయ నిర్మాణంలో ఎంత మంది పనిచేశారని సీజేఐ అడగ్గా సుమారు వెయ్యి మంది వరకు కళాకారులు పనిచేసినట్లు ఆనంద్‌సాయి వివరించారు. అష్టభుజి ప్రాకారం, వాలి పిల్లర్లు, అద్దాల మండపం, కాకతీయ పిల్లర్లు, గర్భాలయ గోడలపై ప్రహ్లాద చరిత్ర, మహారాజ గోపురం, ముఖ మండపం, తంజావూర్ పెయింటింగ్స్, గండబేరుండ దేవాలయం, ఆలయంలోని శిల్పాలు, విద్యుత్ దీపాలు, తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి వస్తుండగా ఉన్న ఏనుగుల విగ్రహాల వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహారాజగోపురం వద్ద జస్టిస్ దంపతులు ఫొటోలు దిగారు. ప్రెసిడెన్షియల్ సూట్స్‌తోపాటు పెద్దగుట్టపై నిర్మితమవుతున్న టెంపుల్ సిటీని సైతం సీజేఐ దంపతులు సందర్శించారు. కాటేజీలను పరిశీలించి, పనితీరును మెచ్చుకున్నారు. పట్టువస్త్రాలు ధరించి సంప్రదాయ రీతిలో స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న అనంతరం అతిథి గృహం చేరుకొని అల్పాహారం తీసుకున్నారు. -
పూర్తి కృష్ణ శిలలతో నిర్మించిన ఆలయం
-
మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు..
సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. అంతర్వేదిలో 2021 ఉత్సవాలు, రథోత్సవం కొత్త రథంతోనే నిర్వహిస్తామని భక్తులకు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. అంతర్వేదిలో రథం దగ్థౖమైన తర్వాత ఐదు నెలల్లో అన్ని హంగులతో కొత్త రథం నిర్మాణం పూర్తయ్యింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలకు కొత్త రథాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సర్వాంగ సుందరంగా సిద్ధం చేశారు. కల్యాణోత్సవాలు, కొత్త రథాన్ని ప్రారంభించేందుకు సీఎం శుక్రవారం అంతర్వేదికి వస్తున్నారు. వైఎస్ జగన్ సుమారు గంట పాటు స్వామి సేవలో గడపనున్నారు.. భక్తుల మనోభావాలకే సర్కారు పెద్దపీట రథం దగ్ధం అయిన నాటి నుంచి కొత్త రథం రూపు దాల్చేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం భక్తుల మనోభావాలకే పెద్ద పీట వేసింది. గతేడాది సెప్టెంబర్ 5న అర్థరాత్రి దాటాక అంతర్వేదిలో రథం దగ్ధం అయ్యింది. దీన్ని సాకుగా తీసుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతి పక్షాలు, కొన్ని సంస్థలు ప్రయత్నించాయి. కుట్రలకు తెరలేపాయి. కొత్త రథం లేకుండా ఫిబ్రవరిలో ఉత్సవాలు నిర్వహించడం అరిష్టమనే ప్రచారాన్ని కూడా చేశాయి. ఉద్యమాలు, నిరసన పేరుతో రాద్ధాతం చేసి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నించాయి. అయితే సంఘటన జరిగిన మరుక్షణమే సీఎం స్పందించారు. కొత్త రథం తోనే ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరడంతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయి. ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంలో సైతం వైఎస్సార్సీపీ ఎంపీలు రథం దగ్థంపై సీబీఐ దర్యాప్తు విషయం ఏమైందని కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. రూ.95 లక్షలతో కొత్త రథం అంతర్వేదిలో ఫిబ్రవరిలోగా కొత్త రథం తయారు చేయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఈ కార్యక్రమం వెంటనే కార్యరూపం దాల్చేలా సెప్టెంబర్ 8న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. రూ.95 లక్షల నిధులు మంజూరు చేశారు. స్వామి కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో పనులు వేగవంతం చేశారు. రథం నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం అధికారులతో మరో కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ రథం నిర్మాణాన్ని, పనుల్లో నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించింది. మొత్తం 1,330 ఘనపటడుగుల బస్తర్ టేకును రథం కోసం వినియోగించారు. విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి, పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యాశంకర భారతీస్వామి కొత్త రథం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్వేదిలో సీఎం పర్యటన ఇలా.. సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్ హార్బర్ వద్ద హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకుంటారు. 11.35 నుంచి 11.45 మధ్య స్వామి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలను సీఎం నిర్వహిస్తారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 1.30కి తాడేపల్లికి చేరుకుంటారు. చదవండి: (యోధులారా వందనం : సీఎం జగన్) -
సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి బొమ్మ ధ్వంసం అవాస్తవం
ఒంగోలు: ప్రకాశం జిల్లా సింగరాయకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ముఖద్వారంపై ఉన్న స్వామి, అమ్మవారి బొమ్మలు ధ్వంసం చేశారనేది అవాస్తవమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మీడియా ప్రతినిధులు సహా ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ బి.రవిచంద్ర బుధవారం మీడియాకు వెల్లడించారు. ఈ బొమ్మలను ఎవరో ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కుట్ర పూరితంగా ప్రచారం జరిగింది. కొన్ని టీవీ చానళ్లలో కూడా ఈ మేరకు వార్త ప్రసారమైంది. అయితే వాస్తవం ఇందుకు విరుద్దంగా ఉంది. 20 ఏళ్ల క్రితం నిర్మించిన సిమెంట్ ఆర్చిపై లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారి బొమ్మలను సిమెంట్‌తో ఏర్పాటు చేశారు. అవి పాతబడటంతో అప్పుడప్పుడు పెచ్చులూడిపోతుండేవి. ఏటా మరమ్మతులు చేసి రంగులు వేసేవారు. రెండేళ్లుగా ఈ ఆర్చి మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో అమ్మవారి బొమ్మ కుడి చేయి విరిగిపోయింది. స్వామి వారి బొమ్మకు పెచ్చులూడాయి. నవంబర్ 10న టీవీ9లో ప్రసారమైన డాక్యుమెంటరీలో సిమెంట్‌తో చేసిన దేవుని విగ్రహాలకు పెచ్చులు ఊడి ఉన్నాయని ప్రసారమైంది. అయితే ఈ విషయం ఇతర మీడియా ప్రతినిధులందరికీ తెలిసి కూడా తప్పుడు ప్రసారం చేసి, తప్పుడు వార్తలు రాసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని పోలీసులు నిగ్గు తేల్చారు. ఆలయ ఈవో భైరాగి కూడా తన ఫిర్యాదులో ఇదే విషయం చెప్పారు. నిందితుల అరెస్ట్ ► అంబటి శివకుమార్ (బహుజన మీడియా), సాగి శ్రీనివాసరావు (ధర్మవ్యూహం న్యూస్ పేపర్), పోకూరి కిరణ్ (ఏబీఎన్ ఆంధ్రజ్యోతి), షేక్ భాషా (ఎన్టీవి రిపోర్టర్), కాట్రగడ్డ రామమోహన్ (హెచ్ఎం టీవీ రిపోర్టర్), మద్దసాని మౌలాలి (లారీ డ్రైవర్)లను అరెస్ట్ చేశారు. ► ఏబీఎన్, టీవీ 5, ఈటీవీ ప్రతినిధులు, యూట్యూబ్ చానల్స్‌కు సంబంధించిన మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి. వీరందరిపై 120బి (కుట్రపూరితంగా నేరానికి పాల్పడడం), 153ఎ (రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నడం), 295ఎ (మత విద్వేషాలను రెచ్చ గొట్టేల వ్యవహరించడం), 504 (ప్రజాశాంతికి భంగం కలిగించడం) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
నిజం నిగ్గు తేలాల్సిందే
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం కె. పెంటపాడు గ్రామంలో చారిత్రక శ్రీగోపాలస్వామి ఆలయ రథం దగ్ధమైంది. 2018 జనవరిలో విజయవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయి. అమ్మవారి గర్భాలయంలో అర్ధరాత్రి ఒక అపరిచిత వ్యక్తి కదలికలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ రెండు ఘటనల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం స్పందించనే లేదు. అయితే నిన్నటి అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెనువెంటనే పలు నిర్ణయాలు తీసుకుంది. కానీ, కొన్ని రాజకీయ పక్షాలు ఈ ఘటనకు రాజకీయ రంగు పూసి లబ్ధి పొందాలని చూస్తున్నాయా? అన్న ప్రశ్నకు పలువురి నుంచి ‘అవును’ అనే సమాధానమే వస్తోంది. సాక్షి, అమరావతి: అంతర్వేది ఆలయ రథం దగ్ధం ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి, వేగంగా దర్యాప్తు చేయించడంతో పాటు కొత్త రథం తయారీకి నిధులు కేటాయించినప్పటికీ కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్న రాజకీయంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ఈ ఘటనను ఉపయోగించుకుంటున్నాయని అధికార వర్గాలు, భక్తుల్లో సైతం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలి రోజు నుంచి ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక రాజకీయ కుట్ర ఏమైనా దాగి ఉందా అన్నది నిగ్గు తేల్చాలని భావిస్తున్నట్లు తెలిసింది. అప్పటి ఘటనలపై వివరాల సేకరణ ► 2017 అక్టోబర్ 19న కె.పెంటపాడు గ్రామంలో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆలయ రథం దగ్ధమైనప్పుడు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పని చేయలేదు. పగటి పూట ఘటన జరిగినా.. తాడేపల్లి గూడెం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా ఆ రథం పూర్తిగా దగ్ధమైంది. ఈ మేరకు అప్పడు అక్కడ చోటు చేసుకున్న పరిణామాలపై పశ్చిమ గోదావరి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కె.ఎన్.వీ.డీ.వీ ప్రసాద్ శుక్రవారం దేవదాయ శాఖ కమిషనర్‌కు నివేదికను అందజేశారు. ► ఈ ఘటనపై అప్పటి ప్రభుత్వం సరైన విచారణ జరపలేదు. కొత్త రథం నిర్మాణానికీ చర్యలు తీసుకోలేదు. స్థానికంగా ఉండే భక్తులే రూ.24 లక్షలు చందాలు వసూలు చేసి, కొత్త రథం తయారు చేయించారు. ► విజయవాడ దుర్గ గుడిలో, శ్రీకాళహస్తి ఆలయంలో తాంత్రిక పూజలతో పాటు 2014–19 మధ్య దేవదాయ శాఖ పరిధిలో ఉండే అన్ని ఆలయాల్లో చోటు చేసుకున్న వివిధ రకాల ఘటనలపై ఈవోల ద్వారా దేవదాయ శాఖ కమిషనర్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆయా ఘటనలన్నింటిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. ఎవరిది అవకాశవాదం? ► టీడీపీ ప్రభుత్వంలో పగటి పూట ఆలయ రథం దగ్ధమైతే ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అర్ధరాత్రి సమయంలో జరిగిన ఘటనపై ఈ ప్రభుత్వం ఆలయ ఈవో సస్పెన్షన్‌తో పాటు ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించింది. ► గత ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా కొనసాగిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ 2017లో జరిగిన కె.పెంటపాడు ఆలయ రథం దగ్ధం ఘటన, 2018లో దుర్గ గుడిలో తాంత్రిక పూజలు, ఇతరత్రా ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఏ ఒక్కదానిపై ఒక్క మాటా మాట్లాడలేదు. ► పైగా ఎన్నికల ముందు బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మతాల మధ్య చిచ్చు రేపి ఓట్లు చీల్చాలని కుట్రలు చేస్తున్నది హిందూ నాయకులే అన్నారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ► 2017లో అప్పటి దేవదాయ శాఖ మంత్రి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఘటన చోటు చేసుకుంది. ఆ మంత్రి బీజేపీ నేత. అప్పట్లో ఆ ఘటనపై అప్పటి బీజేపీ పెద్దలు కూడా నోరు విప్పలేదు. నాడు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల తీరు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తున్న తీరును ప్రజలకు వివరించి చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. -
‘అంతర్వేది’పై సీబీఐ..
సాక్షి, అమరావతి: అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీఎం వైఎస్ జగన్ గురువారం నిర్ణయించారు. ఈ ఘటనను సీఎం సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తరువాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆపోహలను ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. పలు రాజకీయ పార్టీల సంఘాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీఓ శుక్రవారం వెలువడనుంది. సీబీఐతో విచారణ జరిపించండి : డీజీపీ లేఖ కాగా, రథం దగ్థం కేసును సీబీఐతో విచారణ జరపించాల్సిందిగా కేంద్ర హోంశాఖకు రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ గురువారం లేఖ రాశారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ ఈ లేఖ రాశారు. ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే.. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తూ ఇప్పటికే పలు రకాల చర్యలు చేపట్టింది. ఘటనపై విచారణకు ఆదేశించింది. మంత్రులూ క్షేత్రస్థాయిలో పర్యటించి రథం దగ్థం సంఘటనపై సమీక్షించారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. స్థానిక అధికారులూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతేకాక.. ఆలయ ఈవో చక్రధరరావును సస్పెండ్ కూడా చేసింది. పాత రథం స్థానంలో కొత్త రథం తయారీకి ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగా రూ.95లక్షలను మంజూరు కూడా చేసింది. ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపట్టే ఇన్ని చర్యలు స్పష్టంగా ఉన్నా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మత విద్వేషాల ముసుగులో రాజకీయంగా లబ్ధిపొందేందుకు, సర్కారుకు వ్యతిరేకంగా రాద్ధాంతం చేసే కుట్రలకు తెరలేపాయి. ‘సంక్షేమం’ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. నిజానికి అంతర్వేది రథం దగ్థం ఘటనలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ చర్యలను తప్పుబట్టాల్సిన అవసరం ఏమీ లేకపోయినప్పటికీ ప్రతిపక్షాలు అనవసరంగా నానాయాగీ చేస్తున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరోవైపు.. అన్ని రకాలుగా రాష్ట్రంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్ సర్కారు ఇటీవలే టీటీడీ లెక్కల్నీ కాగ్ ఆడిట్ పరిధిలోకి తీసుకువచ్చేలా నిర్ణయం తీసుకుంది. అలాగే, దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొన్ని దుష్టశక్తులు ఎప్పటికప్పుడు తమ వక్రబుద్ధిని ప్రదర్శించుకుంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతర్వేది దుర్ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయించడం రాజకీయ పరిశీలకులు, మేధావులు, తటస్థులు తదితర అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.