రెండో పెళ్లి చేసుకోవాలంటే ఆ గుడికే వెళ్తారు.. ఎందుకంటే..! | Do You Know Jayalakshmi Narasimha Swamy Temple Famous Second Marriage Guntur | Sakshi
Sakshi News home page

సెకండ్‌ మ్యారేజెస్‌కి... ఆ గుడి వెరీ స్పెషల్‌.. ఎందుకంటే..!

Published Fri, Oct 22 2021 8:13 PM | Last Updated on Sat, Oct 23 2021 2:51 PM

Do You Know Jayalakshmi Narasimha Swamy Temple Famous Second Marriage Guntur - Sakshi

సాక్షి,యడ్లపాడు(గుంటూరు): ఈతిబాధలు..వివాహ సమస్య, సంతానలేమీ.. చికాకులు ఇలా ఒక్కొక్క సమస్య పరిష్కారానికి ఒక్కొక్క ఆలయానికి వెళ్తుంటారు. ఒక్కొక్క ఆలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. కొన్ని ఆలయాలను దర్శిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. మరికొన్ని చోట్ల సుదీర్ఘకాలంగా జరగని వివాహాలు తక్షణమే ముహుర్తాలు వస్తాయి.

ఇంకొన్ని ఆలయాలకు వెళితే సంతానలేమీ సాఫల్యమవుతుందని భక్తుల నమ్మకం. గుంటూరు జిల్లాలోని ఆలయం ఒకటి వీటన్నింటికి ఎంతో భిన్నమైనది. మరెంతో విశిష్టమైనది. ఇక్కడి స్వామి వారు కొండబండరాయిపై ప్రతిమలా చెక్కబడి దర్శనమిస్తారు. సమీప ప్రాంతాల వారు రెండోవివాహాలు చేసుకోవాలనుకునే వారికి మాత్రం ఈ ఆలయమే కళ్యాణ వేదిక. అందులోని స్వామివారే ఆ దంపతులకు శ్రీరామరక్ష. 

ఎర్రకొండపై గుహలా ఉన్న పురాతన లక్ష్మినర్సింహస్వామి గుడి

కొండబండ తొర్రలో గుడి...
జయలక్ష్మి నరసింహస్వామి ఆలయం రాష్ట్రంలోనే విశిష్టమైనదిగా చెప్పవచ్చు. గుంటూరు జిల్లా మండల కేంద్రమైన యడ్లపాడులో ఈ ఆలయం ఉంది. పూర్వం రెండు తెలుగు రాష్ట్రాల్లోని 16 నరసింహస్వామి పూజలందుకున్న దేవాలయాల్లో ఇది ఒకటిగా ప్రాచుర్యం పొందింది. గ్రామానికి సమీపానే 16వ నంబర్‌ జాతీయ రహదారి పక్కనే ఎర్రకొండపై ఈ స్వామివారి గుడి ఉంది.

ఆలయ గోపురాలు, భారీ మండపాలు చుట్టూ ప్రాకారాలు ఏమీ లేకుండా సాదాసీదాగా కనిపిస్తుంది. భారీ బండారాయిని తొలచిన చిన్నపాటి గుహ గుడిగా నిర్మితమైంది. బండరాతిపై చెక్కబడిన ప్రతిమయే దైవంగా దర్శనమిస్తుంది. కొండపై స్వయంభుగా స్వామివారు వెలిశారని, రాజవంశీయులు ప్రతిమను చెక్కించి పూజలు చేశారని, ఓ మహర్షి క్రతువు నుంచి ఉద్భవించిందని, ఇలా రకరకాల కథలు స్థానిక పెద్దల నుంచి వినవస్తాయి. అయితే వీటికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏవీ అందుబాటులో లేవని చెప్పాలి.

కొండకింద నుంచి పైవరకు తోటలా పెరిగిన భారీసైజు తులసీ మొక్కలు

కోవెల ఇలా..
కొండ శిఖరంపై ఉన్న భారీ బండరాయిని నాగపడిగ ఆకారంలో చెక్కబడి గుహగా మలిచారు. ఏకకాలంలో సుమారు 400 గొర్రెలు నిలబడేంత విశాలంగా గుహ ప్రదేశం ఆకర్షణీయంగా ఉండేది. స్వామివారి అభిముఖంగా రాతితో చెక్కబడిన పాదాలు, ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిస్తాయి. ఈ పాదాలను సీతమ్మ పాదాలుగా చెప్పుకుంటారు. గ్రామస్తులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయంలో స్వామిని దర్శించి పూజించేవారు.

ఏటా ఏప్రిల్‌ మాసంలో జరిగే ఈ స్వామి ఉత్సవాల్లో భక్తులకు ప్రసాదంగా మామిడికాయలు, వడపప్పు, పానకం, విసనకర్రలు బ్రాహ్మణులు, భక్తులు పంపిణీ చేయడం విశేషం. ఓనాడు ఈ కొండపై పిడుగు పడి గుహ ముందు భాగం ధ్వంసమైంది. ప్రస్తుతం కొద్ది భాగమే గుహ ఆకారంలో ఉంది.  సీతమ్మపాదాలు, ఆంజనేయస్వామి విగ్రహాలు కూడా ప్రస్తుతం లేవు.

నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ధ్వంసమైన నాటి నీటిదొన ఉన్న ప్రాంతం

ద్వితీయ వివాహాలు జరిపించే దివ్యక్షేత్రం...
ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం ద్వితీయ వివాహాలు నిలయంగా ఉండేది. సంసారంలో అపశ్రుతులు ఎదురై అందుకు దంపతులు విడిపోయినా.. శాశ్వతంగా దూరమైనా పెళ్లి తప్పా ఏ అచ్చటా ముచ్చట తీరని వారి పరిస్థితి అగమ్యగోచరంగా అనిపిస్తుంది. ఇలాంటి వారికి పెద్దలు నచ్చజెప్పొలేదా వారే తమకు నచ్చిన వారిగా మరోతోడు వెతుక్కున్న సమయంలో రెండోపెళ్లిని పెద్దలు ఇక్కడే జరిపించేవారు.

అలా రెండోసారి పెళ్లి చేసుకునే వారికి వేదికలా మారింది. దీంతో సమీప గ్రామస్తులే కాదు సుదూర ప్రాంతాలకు చెందిన వారుసైతం ఇక్కడే పూజలు నిర్వహించి తమ రెండో వివాహాలను జరిపించుకునేవారు. స్వామి చెంత రెండోపెళ్లి చేసుకున్న జంటలు శాంతిసౌఖ్యాలతో వర్థిల్లుతారని అంతా విశ్వసించేవారట. ఒంటరి జీవితాలను జంటగా చేసిందే ఆ స్వామి వారేనని భావించి ఇక్కడ వివాహాలు చేసుకుంటారని పెద్దలు చెబుతుంటారు. రెండోవివాహం చేసుకున్న వారంతా స్వామి వారి ఉత్సవాలకు తప్పని సరిగా హాజరై మొక్కులు తీర్చుకోవడం విశేషం. 

రెండో పెళ్లిళ్లకు ప్రసిద్ధి...నూర్పాల పోలిరెడ్డి, నృసింహస్వాముని భక్తుడు. 
ప్రస్తుతం నాకు 76 ఏళ్లు. సుమారు 5 దశాబ్దాలుగా స్వామివారి జయంతి వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నాను. సుబ్రమణ్యం అనే గురువు ఈ స్వామివారి పూజాక్రతులు నిర్వహించేవారు. ఏటా నృసింహ జయంతి నాడు కొండపై కళ్యాణ వేడుకలతో పాటు మామిడి పళ్లు, విసనకర్రలు, పానకం పంపిణీ చేసేవారు. కందకంలోకి పడుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చేది. రెండోసారి వివాహం చేసుకునే దంపతులకు ఈ కోవెల నిలయమైంది. 

తులసీవనాలు, చల్లని వాతావరణం...చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, యడ్లపాడు
మా తాతల కాలంలో నృసింహుని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభలు కట్టుకుని అక్కడికి వెళ్లేవాళ్లం. కొండపై తులసి సువాసనలతో ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండపై దొనలో మంచినీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. భక్తులు కొండపై గొర్రెలు, పశుకాపరులు ఇక్కడికి వచ్చి దాహం తీర్చుకునేవారు. 

చదవండి: బాగ్దాద్‌ నుంచి భారత్‌కు వచ్చిన ఫకీరు, ఒక్క రూపాయికే అత్తరు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement