రెండో పెళ్లిళ్లకు ప్రసిద్ధి యడ్లపాడు.. | Unique Temple At Edlapadu In Guntur District | Sakshi
Sakshi News home page

ద్వితీయ వివాహాల క్షేత్రం.. 

Published Wed, Sep 30 2020 8:41 AM | Last Updated on Wed, Sep 30 2020 1:43 PM

Unique Temple At Edlapadu In Guntur District - Sakshi

ఎర్రకొండపై రాళ్లతో చెక్కి ఉన్న చల్లగిరి జయలక్ష్మీనరసింహస్వామి ప్రతిమ

సాక్షి, యడ్లపాడు (చిలకలూరిపేట): గుంటూరు జిల్లాలోని మండల కేంద్రమైన యడ్లపాడులో ఓ విశిష్ట ఆలయం ఉంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయంలో జయలక్ష్మి, నరసింహస్వామి కొలువై ఉన్నారు. పూర్వం రెండు తెలుగు రాష్ట్రాల్లో పూజలందుకున్న 16 నరసింహస్వామి ఆలయాల్లో ఇది ఒకటి. గ్రామానికి సమీపానే 16వ నంబర్‌ జాతీయ రహదారి పక్కనే ఎర్రకొండపై ఉన్న ఈ స్వామి వారికి ప్రత్యేకించి ఎలాంటి ఆలయ కట్టడాలు లేవు.

భారీ బండరాయిని తొలచిన గుహలో రాతిపై చెక్కిన ప్రతిమ రూపంలో జయలక్ష్మి, నరసింహస్వామి ప్రకాశిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. కొండపైన స్వామి స్వయంభువుగా వెలిశాడని కొందరు.. రాజులే స్వామి రూపాన్ని చెక్కించారని మరికొందరు.. ఓ మహర్షి క్రతువు నుంచి ఉద్భవించిందని ఇంకొందరు చెబుతుంటారు. ఈ కొండపైకి వెళ్లే మార్గం అంతటా తులసి వనాలతో నిండి, నిత్యం చల్లని ఆహ్లాదకర వాతావరణం నెలకొని ఉండడంతో ఈ స్వామిని చల్లగిరి లక్ష్మీనరసింహ స్వామిగా పిలిచేవారు.
 
కొండ శిఖరంపై ఉన్న భారీ బండరాయిని నాగపడగ ఆకారంలో గుహగా మలిచారు. ఏక కాలంలో సుమారు 400 గొర్రెలు నిలబడేంత విశాలంగా ఈ గుహ ఉండేది. స్వామివారి అభిముఖంగా రాతితో చెక్కిన పాదాలు, ఆంజనేయస్వామి విగ్రహం దర్శనమిచ్చేది. ఈ పాదాలను సీతమ్మ పాదాలుగా చెప్పుకుంటారు. ఓనాడు ఈ కొండపై పిడుగు పడి గుహ   ముందు భాగం ధ్వంసమైంది. ప్రస్తుతం కొద్ది భాగమే గుహ ఆకారంలో ఉంది. గ్రామస్తులు వ్యవసాయ పనులు ప్రారంభించే సమయంలో స్వామిని దర్శించి పూజించేవారు. ఏటా ఏప్రిల్‌ మాసంలో జరిగే ఈ స్వామి ఉత్సవాల్లో భక్తులకు ప్రసాదంగా మామిడికాయలు, వడపప్పు, పానకంతోపాటు విసన కర్రలను పంపిణీ చేయడం విశేషం. ఈ ఉత్సవాలు ఇప్పటికీ ఏటా కొనసాగుతున్నాయి.  

ద్వితీయ వివాహాల క్షేత్రం 
ఎన్నో వందల సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం ద్వితీయ వివాహాలకు నిలయంగా ఉండేది. సంసారంలో అçపశ్రుతులు ఎదురై అందుకు దంపతులు విడిపోయినా.. శాశ్వతంగా దూరమైనా పెళ్లి తప్ప ఏ అచ్చటా ముచ్చటా తీరని వారి పరిస్థితి అగమ్యగోచరంగా అనిపిస్తుంది. ఇలాంటి వారికి పెద్దలు నచ్చజెప్పి లేదా వారే తమకు నచ్చిన వారిగా మరోతోడు వెతుక్కున్న సమయంలో రెండో పెళ్లిని పెద్దలు ఇక్కడే జరిపించేవారు. అలా రెండోసారి పెళ్లి చేసుకునే వారికి వేదికలా మారింది. దీంతో సమీప గ్రామస్తులే కాదు సుదూర ప్రాంతాలకు చెందిన వారు సైతం ఇక్కడే పూజలు నిర్వహించి తమ రెండో వివాహాలను జరిపించుకుంటున్నారు.   రెండో వివాహం చేసుకున్న వారంతా స్వామి వారి ఉత్సవాలకు తప్పనిసరిగా హాజరై మొక్కులు తీర్చుకోవడం విశేషం. 

కొండపైన్న తులసి మొక్కలు.. ఆలయ ప్రాంగణంలో ధ్వంసమైన నాటి నీటిదొన ఉన్న ప్రాంతం  
కొండపై నుంచి ఊరిలోకి సొరంగం 
ఎర్రకొండపై ఉన్న నరసింహస్వామి ఆలయం ఎదురుగా నీటి దొన ఉండేది. ఏడాది కాలం పాటు ఇందులో నిత్యం నీళ్లు ఉండటం దొన ప్రత్యేకత. స్వామిని అర్చకులు ఈ నీటితోనే అభిషేకాలు చేసేవారు. భక్తులు పొంగళ్లు చేసేందుకు ఉపయోగించేవారు. ఓరోజు కొండపై మేకలు కాసుకునే పశుకాపరి నీటిని తాగేందుకు దొనవద్దకు వెళ్లగా పొరపాటున తనచేతిలోని ముల్లుకర్ర జారి దొనలో పడిపోయింది. మరుసటి రోజు యడ్లపాడు గ్రామంలోని బైరాగి బావిలో ఆ కర్ర తేలుతూ కనిపించడంతో కొండపై నుంచి ఊరిమధ్యలోకి సొరంగ మార్గం ఉన్నట్టు గ్రహించారు. మైనింగ్‌ క్వారీల కారణంగా ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయంలో స్వామివారి ప్రతిమ మినహా ఎలాంటి ఆనవాళ్లూ లేకుండా కనుమరుగైపోయాయి.  

రెండో పెళ్లిళ్లకు ప్రసిద్ధి 
ప్రస్తుతం నాకు 76 ఏళ్లు. సుమారు 5 దశాబ్దాలుగా స్వామి జయంతి వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నా. సుబ్రహ్మణ్యం అనే గురువు స్వామి పూజాక్రతులు నిర్వహించేవారు. ఏటా నృసింహ జయంతికి కొండపై కల్యాణ వేడుకల సందడి ఉండేది. మామిడి పళ్లు, విసనకర్రలు, పానకం పంపిణీ చేసేవారు. కందకంలోకి పడుకుని లోపలికి వెళ్లాల్సి వచ్చేది. రెండోసారి వివాహం చేసుకునే దంపతులకు ఈ కోవెల నిలయమైంది.  – నూర్పాల పోలిరెడ్డి, నృసింహ స్వామి భక్తుడు.  
 
తులసి వనాలు.. చల్లని వాతావరణం 

మా తాతల కాలంలో నృసింహుని జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభలు కట్టుకుని అక్కడికి వెళ్లేవాళ్లం. కొండపై తులసి సువాసనలతో ఎంతో చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండపై దొనలో మంచినీళ్లు స్వచ్ఛంగా ఉండేవి. భక్తులు, కొండపైకి గొర్రెలు, పశువులను మేతకు తోలుకు వచ్చే కాపరులు ఇక్కడికి వచ్చి దాహం తీర్చుకునేవారు. 
– చల్లా యజ్ఞేశ్వరరెడ్డి, యడ్లపాడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement