పిడుగురాళ్ల (గుంటూరు జిల్లా): తనను మోసం చేసి, తన భర్త వేరే వివాహం చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ పిడుగురాళ్ల పోలీస్‌స్టేషన్ ఎదుట శుక్రవారం నిరసన వ్యక్తం చేసింది. బాధితురాలి కథనం మేరకు.. పిడుగురాళ్ల పిల్లలగడ్డకు చెందిన ముజావర్ షాహీనాకు సత్తెనపల్లి మండలం తొండపి గ్రామానికి చెందిన ముజావర్ సైదాతో 2000 సంవత్సరం జూలై 23వ తేదీ వివాహం జరిగింది.
చదవండి: దుస్తులు సరిగా కుట్టలేదని హత్య
కొంతకాలం తొండపిలో వీరి కాపురం సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు మగ పిల్లలు. భర్త సైదా తన వద్ద డబ్బులు లేవని చెప్పి భార్య షాహీనా పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మి వ్యాపారం ప్రారంభిస్తానని నమ్మబలికాడు. దీంతో షాహీనా 20 సవర్ల బంగారం, తన పేరు మీద ఉన్న ఎకరం పొలం, ఇల్లు మొత్తం భర్త సైదాకు రాసి ఇచ్చింది. కొంతకాలం తర్వాత భార్యాపిల్లలను ఆమె పుట్టింట్లో వదిలి వ్యాపారం నిమిత్తం వెళ్తున్నానని, మళ్లీవచ్చి తీసుకెళ్తానని చెప్పి సైదా వెళ్లిపోయాడు. అలా రెండేళ్లు గడిచిపోయాయి.
చివరకు భర్త ఎక్కడున్నాడో తెలుసుకుందామని తొండపి వెళ్లగా సైదా వేరే పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి 2021 అక్టోబర్ 17వ తేదీ ఆ వివాహం ఆపివేయించానని భార్య షాహీనా తెలిపింది. అయితే గత నెలలో హైదరాబాద్‌లో మళ్లీ రహస్యంగా వేరే మహిళతో వివాహం చేసుకున్నాడని తెలిసింది. దీంతో తన బంధువులతో కలిసి హైదరాబాద్‌లో తన భర్త, వేరే మహిళ ఉన్నచోటుకు వెళ్లి ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని తెలిపింది. శుక్రవారం తన భర్త రెండో పెళ్లి ఆధారాలతో పట్టణ పోలీస్‌స్టేషన్ వద్ద న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేసింది. సైదాను షాహీనా బంధువులు పోలీసులకు అప్పగించారు. సీఐ మధుసూదన్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment