Guntur District News
-
గత ఏడాది రికార్డు స్థాయి !
ఓవైపు ఆశించిన దిగుబడి లేక, మరోవైపు మార్కెట్లో ధరలేక రైతులు నష్టాలతో కుదేలవుతున్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో క్వింటా మిర్చికి ధరలు పలకగా.. ప్రస్తుతం రూ.15 వేలు మించి పలకడంలేదు. గత ఏడాది తేజ, బాడిగ రకాలు క్వింటాలుకు రూ.21వేల నుంచి రూ.27వేల వరకు ధర లభించింది. దీంతో రైతులు ఉత్సాహంగా ఈ రకాలను సాగుచేశారు. ఎకరా మిరప సాగుకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. కానీ, పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తెగుళ్లతో పంట ఎదుగుదల లేక దిగుబడి సగానికి పడిపోయింది. ఫలితంగా తేజ, బాడిగ, నంబర్–5, 334, 341 రకాలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, ఈ ధరతో కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. కనీసం రూ.20 వేలు పలికితేనే తమకు గిట్టుబాటు అవుతుందంటున్నారు. ఇదిలా ఉంటే.. మిర్చి పౌడర్ కంపెనీల వద్ద ఇప్పటికే రెండు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని మిర్చి వ్యాపారులు చెబుతున్నారు. దీనికితోడు గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు బంగ్లాదేశ్, బర్మా, వంటి దేశాల్లోనూ అత్యధికంగా పంట సాగుచేయడం కూడా ధరలు పతనానికి మరో కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పైగా కోల్డ్‌స్టోరేజీల్లో అధికంగా నిల్వ ఉండటం కూడా మరో కారణమంటున్నారు. -
మిర్చి ధరలిలా..
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు మంగళవారం 87,334 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 84,985 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.7,200 నుంచి రూ.15,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.7,000 నుంచి రూ.15,500 వరకు ధర లభించింది. ఏసీ కామన్ రకం రూ.7,500 నుంచి రూ.13,000 వరకు ధర పలికింది. ఏసీ ప్రత్యేక రకాలకు రూ.7,500 నుంచి రూ.15,000 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.10,500 వరకు ధర పలికింది. మంగళవారం అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 56,872 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు తెలిపారు. -
మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు
గుంటూరు ఎడ్యుకేషన్: యువతరం మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకోరాదని ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ పేర్కొన్నారు. జేకేసీ కళాశాలలో మంగళవారం మత్తు పదార్థాలు, ర్యాగింగ్, ట్రాఫిక్ నియంత్రణపై వారధి పేరుతో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ విద్యార్థి దశలో గురువుల పట్ల గౌరవం, తోటి విద్యార్థుల పట్ల స్నేహపూర్వకంగా ఉంటూ క్రమశిక్షణతో మెలిగిన వారే జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని చెప్పారు. వ్యసనాలు, చెడు స్నేహాలకు బానిసలుగా మారితే ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. ర్యాగింగ్ నేరమని, కేసు నమోదైతే భవిష్యత్తుల్లో ఎక్కడా చదువుకునేందుకే కాకుండా ఉద్యోగం చేసే పరిస్థితులూ ఉండవని చెప్పారు. ఈవ్‌టీజింగ్, మత్తుపదార్థాల వినియోగం తదితర నేరాలకు నమోదు చేసే కేసులు, పడే శిక్షలు, ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ పి.గోపీచంద్ మాట్లాడుతూ తమ కళాశాలలో ర్యాగింగ్‌కు తావులేదని వివరించారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రూపొందించిన పోస్టర్లను ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్, డీఎస్పీ కె.అరవింద్, కళాశాల కరస్పాండెంట్ జాగర్లమూడి మురళీమోహన్, పీజీ కోర్సుల డైరెక్టర్ ఎస్సార్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ పి.గోపీచంద్ ఆవిష్కరించారు. సదస్సులో ర్యాగింగ్, వేధింపుల వ్యతిరేక కమిటీల ఉపాధ్యక్షులు ఆర్. శ్రీనివాసరావు, అనితాకుమారి, ఎక్స్టెన్షన్ యాక్టివిటీస్ వైస్ చైర్మన్ పి.నాగసుశీల, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాగా పనిచేస్తే మహిళా పోలీసులకు అవార్డులు తెనాలి రూరల్: పోలీసులను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తెలిపారు. తెనాలి చెంచుపేటలోని చావాస్ గ్రాండ్ ఫంక్షన్ హాలులో సబ్ డివిజన్ పరిధిలోని మహిళా పోలీసులతో ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం సమావేశమయ్యారు. వారి జాబ్‌చార్ట్ గురించి వివరించారు. ఉద్యోగ బాధ్యతల గురించి అవగాహన కల్పించారు. తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు, దిశ డీఎస్పీ సుబ్బారావుతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఎస్పీ సుమారు గంటన్నరపాటు మహిళా పోలీసులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళా పోలీసుల సేవలను కూడా శాంతిభద్రతల పరిరక్షణకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. బాగా పనిచేసిన మహిళా పోలీసులకు సబ్ డివిజన్ల వారీగా అవార్డులు ఇస్తామని ఎస్పీ ప్రకటించారు. సమావేశంలో డీఎస్పీలతో పాటు సీఐలు మల్లికార్జునరావు, రాములు నాయక్, ఎస్ రమేష్ బాబు, బి.శ్రీనివాసరావు, ట్రాఫిక్ ఎస్ఐ రాజ్యలక్ష్మి, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ సతీష్‌కుమార్ -
చిరునవ్వులు చెలరేగు
ప్రత్తిపాడు: ధర లేక పత్తి పంట తెల్లబోతోంది. ఆశించిన స్థాయి దిగుబడి లేక మిర్చి ఘాటు తగ్గింది. వరిని తెగుళ్ళు వెక్కిరిస్తున్నాయి. లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసే ప్రధాన పంటలు తెగుళ్లు, పురుగుల బారిన పడి పెట్టుబడులు కూడా రాని పరిస్థితుల్లో రైతులు నేల వైపు బేల చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేగు సాగు ఆశాజనకంగా కనిపిస్తోంది. నష్టాల మాట లేకుండా రైతుకు కాసులు కురిపిస్తోంది. ధర కూడా బాగుండటం రైతులకు కలిసొస్తోంది. రేగు పంటకు ప్రత్తిపాడు మండలం ప్రసిద్ధి. రావిపాటివారిపాలెం, చినకోండ్రుపాడు, నడింపాలెం గ్రామాల్లో పలువురు రైతులు సుమారు డైబ్బె ఎకరాల్లో నాటు రకం రేగు తోటలను సాగు చేస్తున్నారు. ఏటా నవంబరులో పూత మొదలై డిసెంబరులో కాపు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి వరకు రేగు దిగుబడులు విస్తారంగా వస్తాయి. ఈ ఏడాది వరుసగా రెండు తుఫా న్లు రావడంతో పూత, పిందె రాలి దిగుబడులు కొంత తగ్గినా పరిస్థితి మెరుగ్గానే ఉంది. పెరుగుతున్న రేగు సాగు దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, ధర కూడా లాభాల బాటలో ఉండటంతో రైతులు రేగు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఆరేడేళ్ల కిందట వరకు పాతిక, 30 ఎకరాల్లో మాత్రమే ఉన్న రేగు సాగు ఈ ఏడాది సుమారు 70 ఎకరాలకు పెరిగింది. డబ్బులు కళ్లపడడంతో ఈ సాగుపై రైతులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. రేగు రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే పండ్లను ఇతర ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. పచ్చి రేగుపండ్ల స్టోరేజీ సౌకర్యం లేకపోవడంతో రైతులు మార్కెటింగ్‌కు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యానశాఖ రాయితీలూ అందడం లేదు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడితే పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసుకుంటామని రైతులు చెబుతున్నారు. ప్రత్తిపాడు మండలంలో సాగులో ఉన్న రేగు పండ్ల తోటలన్నీ నాటు రకమే. నాటు రకాల్లో తీపి, పులుపు ఉన్నా, ఈ ప్రాంతంలో సాగులో ఉన్నది మాత్రం తీపి కాయలే. జిల్లా మొత్తమ్మీద తీపి నాటు కాయను పండించేది ఇక్కడే అంటే అతిశయోక్తి కాదు. కొండలకు సమీపంలో ఉండటంతో ఈ భూములు రేగు పంటకు కలిసొస్తున్నాయి. కాయలు రుచికరంగా ఉంటున్నాయి. దీంతో వ్యాపారులు కూడా ఇక్కడి నుంచే రేగు పండ్లను క్వింటాళ్లు, పెద్ద మానికల లెక్కన కొనుగోలు చేసుకుని తీసుకెళ్లి గిద్దలు, చిన్నమానికల లెక్కన గ్రామాల్లో విక్రయించుకుంటుంటారు. సాధారణ జనమైతే అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశవిదేశాల్లో ఉంటున్న బంధువులకు, హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటకల్లో ఉంటున్న వారికి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా గ్రేడింగ్ చేసిన కాయలను ప్యాకింగ్ చేసి పంపిస్తుంటారు. తోటల యజమానులతో పరిచయస్తులైతే ఏటా ఒకే తీపి చెట్టును ఎంచుకుని ఆ చెట్టు కాయలను తెల్లవారుజామున కోయించుకుని మరీ బంధుమిత్రులకు పంపుతుంటారు. ఆ చెట్లకున్న పచ్చి కాయలూ పంచదారలా ఉండడం విశేషం. ఆశాజనకంగా రేగు సాగు ప్రత్తిపాడు నాటు కాయలకు గిరాకీ ఎకరాకు రెండు వేల మానికలకుపైగా దిగుబడి మానిక రేగు పళ్లు రూ.70 నుంచి రూ. 200పైమాటే ఉద్యాన పంటకు ప్రభుత్వ ప్రోత్సాహం నాస్తి ఎకరాకు రెండు వేల నుంచి మూడు వేల మానికలు.. రేగు పండ్ల దిగుబడి ఆశాజనకంగా ఉంది. ఎకరాకు రెండు వేల నుంచి మూడు వేల మానికల వరకు దిగుబడి వస్తోంది. వాతావరణం అనుకూలిస్తే నాలుగు వేల మానికలపైన కూడా దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో మానిక ధర రిటైల్‌గా రూ.200 వరకు ధర పలుకుతుంది. హోల్‌సేల్‌గా వ్యాపారులకైతే రూ.70 నుంచి రూ.100 వరకు విక్రయిస్తారు. అంటే సగటున ఎకరాకు లక్షన్నర నుంచి రూ.మూడు లక్షల వరకు రాబడి వస్తుందన్న మాట. ఇందులో ఖర్చులు, పెట్టుబడులు, కౌలుకు రూ.లక్ష పైనే ఖర్చు అవుతుంది. దీంతో పంట కాలం రెండు, మూడు నెలల సమయంలో ఖర్చులన్నీ పోను సుమారు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. సీజన్లో సగటున రోజుకు క్వింటాకు పైగా దిగుబడి వస్తుంది. ఈ తీపి నాటు కాయ సాగు ప్రత్యేకం.. -
అదే సరీ!
గుంటూరుబుధవారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2025సాగునీటి సమాచారం తాడేపల్లిరూరల్(దుగ్గిరాల): కృష్ణా పశ్చిమ ప్రధా న కాలువకు సీతానగరం వద్ద మంగళవారం 1818 క్యూసెక్కులు విడుదల చేశారు. కొమ్మమూరు కాలువకు 915 క్యూసెక్కులు వదిలారు.జిల్లాలో మళ్ళీ రీ–సర్వే మొదలు నాడు తప్పు... నేడు ఒప్పు.. సాక్షి ప్రతినిధి, గుంటూరు: నాడు తప్పు జరిగిపోతోందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి నేడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అదే పనిని మళ్లీ మొదలుపెట్టింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిషాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం ద్వారా రీ సర్వే పనులను పూర్తి చేయడానికి సర్కారు నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి జిల్లాలో రీ–సర్వే మొదలైంది. ప్రస్తుతం 14 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు ద్వారా 26,329 ఎకరాల భూమిని సర్వే చేయాలని నిర్ణయించారు. మంగళవారం మూడు గ్రామాల్లో ఈ సర్వే మొదలైంది. 16 గ్రామాల్లో గ్రామ కంఠాలూ రీ–సర్వే చేయనున్నారు. దీన్ని పూర్తి చేయడానికి మూడు నెలల కాల వ్యవధిని నిర్దేశించారు. కొత్తగా మేడికొండూరు మండలం మందపాడు, ప్రత్తిపాడు మండలం మల్లాయపాలెం, తాడికొండ మండలం లచ్చన్నగుడిపాడు, తుళ్లూరు మండలం వడ్డమాను, ఫిరంగిపురం మండలం మెరికపూడి, పెదకాకాని మండలం అనుమర్లపూడి, గుంటూరు పశ్చిమ అనుమర్లపూడి, గుంటూరు తూర్పు జొన్నలగడ్డ, చేబ్రోలు మండలం మంచాల, పొన్నూరు మండలం వల్లభరావుపాలెం, తెనాలి మండలం పెదరావూరు, కాకుమాను మండలం పాండ్రపాడు, కొల్లిపర మండలం కుంచవరం, దుగ్గిరాల మండలం పెరికర్లపూడి గ్రామాల్లో ఈ రీ–సర్వే మొదలు పెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 62 గ్రామాలలో 1,42,450 ఎకరాల భూమిని రీ–సర్వే చేశారు. ఎనిమిది గ్రామాల్లో గ్రామకంఠం భూముల రీ–సర్వే కూడా పూర్తి చేశారు. గతంలో జరిగిన సర్వేను అలానే ఉంచి వాటిల్లో ఏమైనా ఫిర్యాదులు వస్తే వాటిని సరి చేసే యత్నం చేస్తారు. గత ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా.. ఎప్పుడో 1905లో బ్రిటిషర్లు భూ సర్వే చేశారు. ఆ తర్వాత 2020 వరకు మరే నాయకుడు దీని జోలికి వెళ్లే ధైర్యం చేయలేదు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ రీ–సర్వేని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. దీని ద్వారా ప్రతి అంగుళం భూమి మ్యాపింగ్‌లోకి తీసుకురావడంతోపాటు భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చే దిశగా కృషి చేశారు. సర్వే ప్రక్రియ గుంటూరు జిల్లాలో 2020 డిసెంబర్లో ప్రారంభమైంది. తొలుత పైలెట్ ప్రాజెక్ట్‌గా దుగ్గిరాల మండలంలోని దేవరాపల్లి అగ్రహారం, ప్రత్తిపాడు మండలంలోని కొండజాగర్లమూడి, వేమూరు మండలంలోని పులిచింతలపాలెం, యడ్లపాడు మండలంలోని మర్రిపాలెం, దాచేపల్లి మండలంలోని అలుగుమల్లిపాడులను ఎంపిక చేసి విజయవంతంగా పూర్తి చేశారు. సర్వే అనంతరం సంబందిత భూమి, స్థలం యజమానికి ప్రింటెడ్ పాస్‌బుక్ ఉచితంగా ఇచ్చారు. గతంలో పచ్చ పార్టీ, మీడియా దుష్ప్రచారం గుంటూరు జిల్లాలో మొత్తం 223 గ్రామాలు ఉండగా గుంటూరు డివిజన్లో 119, తెనాలి డివిజన్లో 104 గ్రామాలు ఉన్నాయి. గతంలో 47 గ్రామాల్లో సర్వే ఆఫ్ ఇండియాకు, 121 గ్రామాల్లో యుక్రా అనే సంస్థకు సర్వే బాధ్యతలు అప్పగించారు. సర్వే ఆఫ్ ఇండియాకు అప్పగించిన 47 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసింది. యుక్రా సంస్థ 46 గ్రామాల్లో డ్రోన్‌ను తిప్పింది. మొత్తం 93 గ్రామాల్లో డ్రోన్‌ను తిప్పి ఏరియల్ వ్యూ మ్యాపింగ్ పూర్తి చేశారు. 23 గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ(ఆర్ధో రెక్టిఫైడ్ ఇమేజెస్)అను జారీ చేశారు. వీటిని క్షేత్రస్థాయిలో భూమితో పోల్చి నిజనిర్ధారణ(గ్రౌండ్ ట్రూతింగ్) చేసే ప్రక్రియ 22 గ్రామాల్లో పూర్తి అయ్యింది. అయితే రికార్డులలో ఉన్న భూమికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి పొంతన లేకపోవడం వల్ల సర్వే పూర్తి చేయడంలో కొంతమేర ఇబ్బందులు వచ్చాయి. భూ యజమానులు అందుబాటులో లేకపోవడం సర్వేలో ఆలస్యం అయ్యింది. ఇప్పుడు కూడా భూ యజమానుల సమక్షంలోనే సర్వే చేయాలని నిర్ణయించారు. చాలా చోట్ల పొలాలు కొన్న యజమానులు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఉండగా, మరికొన్ని చోట్ల విదేశాలలో ఉండటంతో వారిని రప్పించడం తలకు మించిన భారమైంది. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా అప్పట్లో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశాయి. న్యూస్‌రీల్ 14 మండలాల్లో 14 గ్రామాల్లో నేటి నుంచి ప్రారంభం గత ప్రభుత్వంలో మెజారిటీ గ్రామాల్లో సర్వే పనులు గతంలోనే 62 గ్రామాల్లో సర్వే పూర్తి ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్లు హడావుడి -
హాహాకారం
ధరలు ఢమాల్.. రైతులు దిగాలు క్వింటాకు రూ.20 వేలు వస్తే గిట్టుబాటు నాది కర్నూలు జిల్లా, నందవరం మండలం, చిన్నకొత్తిలి గ్రామం. ఎకరా పొలంలో డీలక్స్ రకం మిర్చి పంట సాగుచేశా. ఇప్పటివరకు ఎకరాకు రూ.లక్ష అయ్యింది. మొదటి కోతగా మూడు క్వింటాళ్లు ఎరుపు కాయలు, మరో క్వింటా తాలు వచ్చింది. మొత్తం గుంటూరు యార్డుకు తీసుకొస్తే రూ.38 వేలే వచ్చాయి. మరో మూడు క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మొత్తం మీద రూ.50 వేలు నష్టం రావొచ్చు. క్వింటా మిర్చికి రూ.20 వేలు లభిస్తేనే గిట్టుబాటవుతుంది. – పులిచింత నరసప్ప, రైతు, చిన్నకొత్తిలి గ్రామం, నందవరం మండలం, కర్నూలు జిల్లా. ఫిబ్రవరి నుంచి మార్కెట్‌కు ఊపుప్రస్తుతం గుంటూరు మార్కెట్ యార్డులో ధరలు నిలకడగా ఉన్నాయి. తేజ, బాడిగ రకాలకు రూ.16 వేలు, 334, 341, నెంబర్–5 రకాలకు రూ.13 వేలు లభిస్తోంది. ప్రస్తుతం యార్డుకు అత్యధికంగా కోల్డ్‌స్టోరేజీల నుంచి వస్తోంది. ఏసీ సరుకు కావడంతో ఆరుదల లేకపోవడం, రంగు మారడంతో సరైన ధరలు రావడంలేదు. ఫిబ్రవరి నుంచి మార్కెట్ ఊపందుకుంటుందని ఆశిస్తున్నాం. – వినుకొండ ఆంజనేయులు, మిర్చి యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి సాక్షి ప్రతినిధి, గుంటూరు/కొరిటెపాడు : మిర్చి రైతులను నష్టాల ఘాటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. పైగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నల్లతామర తెగులు సోకి దిగుబడులు పడిపోవడంతో ధరలు ఊహించని విధంగా పతనమవడం రైతులపాలిట శాపంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్, రబీల్లో కలిపి పల్నాడు జిల్లాలో 1,07,485 ఎకరాల్లో, గుంటూరు జిల్లాలో 25,485 1,32,970 ఎకరాల్లో రైతులు మిర్చి పంట సాగుచేశారు. చీడపీడలు, తెగుళ్లు సోకి ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి మందులు పిచికారీ చేస్తున్నా తెగుళ్లు నాశనం కావడంలేదు. తాజాగా.. పూతలో తామరపురుగు కనిపించడంతో దిక్కుతోచని స్థితిలో రైతులున్నారు. దీని నివారణకు ఎన్ని రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండాపోయిందని రైతులు వాపోతున్నారు. ఆచార్య రంగా యూనివర్శిటీ వారు రైతులకు సూచనలు ఇస్తున్నా ఇవేమీ అంతగా ఫలితం ఇవ్వడంలేదని రైతులు చెబుతున్నారు. దీంతో ఈ ప్రభావం దిగుబడిపై తీవ్రంగా పడుతోంది. మిర్చిని ఆరబెట్టుకుని తీసుకురండి.. ప్రస్తుతం మిర్చి యార్డుకు అత్యధికంగా కోల్డ్‌స్టోరేజీల నుంచి వస్తోందని.. ఏసీ కాయలు కావడంతో ఆరుదల లేకపోవడం, రంగు మారడంతో మెరుగైన ధరలు లభించడంలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొత్త పంట కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, ప్రకాశం జిల్లా మార్కాపురం, యర్రగొండపాలెం ప్రాంతాల నుంచి కొంతమేర వస్తోందని.. మిర్చిని ఆరబెట్టుకుని నాణ్యతతో కూడిన సరుకు యార్డుకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు, నల్లతామర తెగులు ఎఫెక్ట్ పెట్టుబడి ఖర్చులూ రావడంలేదంటూ గగ్గోలు గుజరాత్, ఎంపీ, యూపీతోపాటుబంగ్లాదేశ్, బర్మా దేశాల్లోనూ ఎక్కువ సాగు ధరలు పతనానికి కారణం కనీసం క్వింటా రూ.20 వేలు పలికితేనే గిట్టుబాటు అంటున్న రైతులు మిర్చిని ఆరబెట్టుకుని తీసుకురావాలంటున్న అధికారులు -
అక్రమంగా సాగుచేస్తున్న పంటలు ధ్వంసం
శాఖమూరు(తాడికొండ): సీఆర్డీఏ పరిధిలోని శాఖమూరు గ్రామంలో పూలింగ్‌కు ఇచ్చిన భూముల్లో అక్రమంగా రైతులు సాగుచేస్తున్న పంటలను అధికారులు ఎట్టకేలకు ధ్వంసం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి పత్రికల్లో కథనాలు రాయించి టీడీపీ నాయకులు కక్షతో పంటలను ధ్వంసం చేయించారు. ఈ ప్రాంతంలో పనుల్లేక పశువులను మేపుకుంటూ పశువుల మేతకోసం జొన్నసాగు చేసుకుంటున్న తమను ఇబ్బందులకు గురిచేయడంపై గ్రామస్తులు మాకుమ్మడిగా అధికారులను ప్రశ్నించారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు అక్రమంగా సాగుచేస్తున్న 40 ఎకరాల్లోని పంటలను మంగళవారం దున్నివేయించారు. మిగిలిన గ్రామాల్లో కూడా రైతులు పశుగ్రాసం కోసం పంటలు సాగు చేసుకుంటుండగా రాజధాని అభివృద్ధి పనులు పేరుతో అధికారులు వాటిని తీసేయాలని హుకుం జారీ చేస్తుండటంపై పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల విషయంలో పక్షపాతం వహించకుండా అందరికీ ఒకే న్యాయం జరిగేలా అధికారులు వ్యవహరించాలని కోరుతున్నారు. 40 ఎకరాలను జేసీబీల సాయంతో దున్నేయించిన అధికారులు -
ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలి
గుంటూరు మెడికల్: గుంటూరులోని ఏపీ ఎన్జీఓ హోమ్‌లో మంగళవారం ఏపీ ఎన్జీవో జిల్లా మహిళా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా మహిళా విభాగం చైర్పర్సన్ రాధారాణి మాట్లాడుతూ మెడికల్ డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వాటిని జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళతామన్నారు. కన్వీనర్ లక్ష్మీరమ్య మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు కార్యాలయంలో కనీస సదుపాయాలు లేవని చెప్పారు. కొన్ని కార్యాలయాలలో నేటికీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లు ఏర్పాటు చేయలేదని, వాటన్నిటి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామన్నారు. నూతన సంవత్సర ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉమెన్ వింగ్ గుంటూరు జిల్లా క్యాలెండరును ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉమెన్ వింగ్ కన్వీనర్ ఎం.రాజ్యలక్ష్మి, రాష్ట్ర ఉమెన్ వింగ్ కన్వీనర్ పి.మాధవి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూర్ షరీఫ్, జిల్లా జాయింట్ సెక్రటరీ ఉమెన్ కె.శివ జ్యోతి, గుంటూరు సిటీ అధ్యక్షుడు సూరి, సెక్రటరీ చింతల కళ్యాణ్ కుమార్, ప్రత్తిపాడు ప్రెసిడెంట్ అనిల్, జిల్లా ఉమెన్ వింగ్ కోశాధికారి శ్రీవాణి, కో చైర్ పర్సన్ అంజలి, కో–కన్వీనర్ శైలజ, సిటి ఉమెన్ వింగ్ చైర్పర్సన్ లక్ష్మీ ప్రసన్న, కన్వీనర్ విజయలక్ష్మి, జిల్లా, సిటి ఉమెన్ వింగ్ కార్యవర్గ సభ్యులు, తాలూకా ఉమెన్ వింగ్ చైర్ పర్శన్, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీఓ మహిళా ఉద్యోగుల సమావేశం -
కౌలు రైతులకు బ్యాంకు రుణాలు
గుంటూరు రూరల్: భూ యజమానులు రుణాలు తీసుకోకుండా ఉంటే గుర్తింపు కార్డులున్న కౌలు రైతులకు ఈ రబీలో పంట రుణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో వ్యవసాయశాఖ, బ్యాంక్, రైతు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించగా లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ భూ యజమానులు కౌలు రైతులకు సహకారం అందిస్తే బ్యాంకు రుణాలు అధిక మొత్తంలో ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో 40,000 మంది గుర్తింపు కార్డులు పొందితే అందులో 12 వేల మంది భూ యజమానులు రుణాలు పొందకుండా ఉన్నారని చెప్పారు. ఎటువంటి ష్యూరిటీ లేకుండా భూమి లేని కౌలు రైతులకు గ్రూపుల ద్వారా రూ.రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ మాట్లాడుతూ కౌలు రైతులందరికీ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు కౌలు రైతులు లీడ్ బ్యాంకు మేనేజర్‌కు తమ సమస్యలు విన్నవించారు. అనంతరం లీడ్ బ్యాంకు మేనేజర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో అజయ్, ఏడీఏ శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యుడు ఇమ్మడి రామారావు, సర్పంచ్ మబ్బు శిరీష, ఉపసర్పంచ్ శ్రీనివాసరావు, కౌలు రైతులు, రైతులు పాల్గొన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మహిపాల్‌రెడ్డి -
ఉత్కంఠగా భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ
గుంటూరు ఎడ్యుకేషన్: క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. గోరంట్లలోని భాష్యం రామసేతు క్యాంపస్ సమీపంలోని జేఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహిస్తున్న భాష్యం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ లెవల్ టీ–20 క్రికెట్ టోర్నమెంట్ బీపీఎల్ 2024–25లో భాగంగా రెండో రోజైన మంగళవారం ప్రిలిమినరీ మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగాయి. ఉదయం హైదరాబాద్ హాక్స్ జట్టు–3తో గుంటూరు జెయింట్స్–3 తలపడగా, గుంటూరు జెయింట్స్–3 జట్టు విజయం సాధించింది. అదే విధంగా మధ్యాహ్నం కృష్ణా నైట్స్, వైజాగ్ వెలాసిటీ జట్ట మధ్య జరిగిన మ్యాచ్‌లో వైజాగ్ వెలాసిటీ జట్టు గెలుపొందింది. ఈసందర్భంగా విజేతలుగా నిలిచిన జట్లకు భాష్యం రామకృష్ణ ట్రోఫీలను బహూకరించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్‌రామ్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగ పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సైన్స్ ప్రయోగ పోటీలను నిర్వహిస్తున్నట్లు జేవీవీ గుంటూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.జాన్‌బాబు, బి.ప్రసాద్ తెలిపారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో సైన్స్ ప్రయోగ పోటీల పోస్టర్లను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనలు, సృజనాత్మకతను పెంచేందుకు నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం – సుస్థిరాభివృద్ధి, మూఢ నమ్మకాలు – శాసీ్త్రయ దృక్పథం అనే అంశాలపై 8,9,10 తరగతుల విద్యార్థులు ఐదు నిమిషాల నిడివి గల వీడియోను పంపాలని సూచించారు. వివరాలకు 90004 53600 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో జేవీవీ నాయకులు జి.వెంకట్రావు, టీఆర్ రమేష్, డాక్టర్ ఏ. సత్యనారాయణ ప్రసాద్, ఎస్ఎం సుభానీ, యశ్వంత్, భారవి, వీవీకే సురేఖఖ్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా వాసికి జాతీయ రంగస్థల పురస్కారం బాపట్ల: బాపట్ల జిల్లా ఆదర్శనగర్‌కు చెందిన సంగాని ఏడుకొండలుకు జాతీయ రంగస్థల పురస్కారం దక్కింది. తెలుగు సంస్కృతి–సాహిత్య సేవా ట్రస్టు, ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్‌ుడ్స జాతీయ స్థాయి మొదటి వార్షికోత్సవం విజయవాడలో జరిగింది. వార్షికోత్సవంలో బాలచంద్రుడు ఏకపాత్రను ప్రదర్శించిన సంగాని ఏడుకొండలుకు స్వర్ణకంకణంతోపాటు జాతీయ రంగస్థల పురస్కారం లభించింది. 36ఏళ్లుగా పౌరాణిక, నాటకం ప్రదర్శించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన సంగానికి పురస్కారం రావటంపై పలువురు అభినందనలు తెలిపారు. మరోన్నె పురస్కారాలు సొంతం చేసుకోవాలని బాపట్ల నవ్యనాటక కళాసమితి అధ్యక్షులు సోమరాజు శ్రీను కోరుకున్నారు. ఎకై ్సజ్ చట్టాలను అతిక్రమిస్తే చర్యలు జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు నగరం: ఎకై ్సజ్ చట్టాలను విధిగా పాటించాలని లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. స్థానిక ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎకై ్సజ్ చట్టాలకు అనుగుణంగా మద్యం షాపులు నడపాలన్నారు. ఎమ్మార్పీకే మద్యం విక్రయాలు జరపాలన్నారు. బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ప్రజల వద్దకే మద్యం కథనంపైన ఆయన ఆరా తీశారు. సమావేశంలో సీఐ మారుతి శ్రీరామ్‌ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. రేపల్లె రూరల్: రేపల్లె ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయాన్ని మంగళవారం సాయంత్రం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు సందర్శించారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో బెల్టు షాపుల నిర్వహణ లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మూడవ విడత చలానా వివరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆయన వెంట సీఐ దివాకర్, సిబ్బంది ఉన్నారు. -
జీజీహెచ్‌కు రూ.9 లక్షల విరాళం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో ఇంకుడు గుంతల అభివృద్ధి ద్వారా ఆసుపత్రిలో నీటి కొరతను నివారించేందుకు గుంటూరు వైద్య కళాశాల 1980 బ్యాచ్‌కి చెందిన పూర్వ విద్యార్థులు రూ. 9 లక్షలు విరాళం అందజేశారు. ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉప్పాల శ్రీనివాస్‌కు పూర్వ వైద్య విద్యార్థులు రూ. 9 లక్షల చెక్కును అందజేశారు. ఈసందర్భంగా విరాళం అందజేసిన పూర్వ వైద్య విద్యార్థులు డాక్టర్ సిద్దాబత్తుని నాగేశ్వరమ్మ, డాక్టర్ శారద, డాక్టర్ రామారావులను డెప్యూటీ సూపరింటెండెంట్ అభినందనించారు. ఫార్మసిస్టుల ఫైనల్ మెరిట్ లిస్టు విడుదల గుంటూరు మెడికల్:గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు కారార్యలయం పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పది గ్రేడ్–2 ఫార్మసిస్టు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆర్డీ డాక్టర్ జి.సుచిత్ర తెలిపారు. సదరు నోఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఫైనల్ మెరిట్ లిస్టును మంగళవారం విడుదల చేశామన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టును, సెలక్షన్ లిస్టును సీఎఫ్‌డబ్ల్యూ.ఏపీ.ఎన్ఐసీ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు ఈనెల 27న గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆర్డీ కార్యాలయంలో జరిగే కౌన్సిలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. బిక్కుబిక్కుమంటున్న కేజీబీవీ విద్యార్థినులు ప్రాంగణం వద్ద కొండచిలువ, పాముల సంచారంతో బెంబేలు సత్తెనపల్లి: పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయం (కేజీబీవీ) చుట్టూ బయట వైపు అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో కొండచిలువ, రెండు పాములు మంగళవారం సంచరించాయి. పాఠశాల ప్రహరీ సమీపంలో అవి కనిపించడంతో విద్యార్థినులు బెంబేలెత్తి బయటకు పరుగులు తీశారు. పరిసరాలు అధ్వానంగా ఉన్నప్పటికీ పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికై నా స్పందించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడంతోపాటు ప్రహరీ నిర్మించాలని పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. బంగారు కమ్మలు అపహరించిన మహిళ అద్దంకి రూరల్: జ్యూయలరీ షాపులో బంగారు కమ్మలు అపహరించిన మహిళను గుర్తించిన షాపు యజమాని పోలీస్‌స్టేషన్‌లో అప్పగించిన సంఘటన మంగళవారం అద్దంకిలో చోటుచేసుకుంది. అద్దంకి పట్టణంలోని శ్రీరామ బజారులోని హనుమాన్ జ్యూయలరీ షాపులో గుర్తు తెలియని మహిళ వచ్చి కమ్మల మోడల్స్ చూపించమని అడగటంతో అవి ఉన్న బాక్స్‌ను ఆమెకు ఇచ్చారు. అయితే అందులోని రెండు బంగారు కమ్మలను తీసుకుని వాటి స్థానంలో నకిలీ కమ్మలు పెట్టి ఇచ్చింది. ఇవేమీ వద్దు అని చెప్పి వెళ్లిపోయింది. తరువాత యజమానికి అనుమానం వచ్చి కమ్మల బాక్స్ చూడటంతో అందులో ఒక జత నకిలీవిగా గుర్తించి ఆమెను వెతికిపట్టుకున్నారు. గట్టిగా అడగటంతో తీసుకున్న కమ్మలు ఇచ్చింది. దీంతో షాపు యజమాని ఆమెను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. 24న డీ ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో రెండేళ్ల కాల పరిమితి గల డీ ఫార్మసీ కోర్సులో 2024–25 విద్యాసంవత్సరానికి కౌన్సెలింగ్ తరువాత మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈనెల 24న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాస్తి ఉషారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ బైపీసీ, ఎంపీసీ, ఒకేషనల్ గ్రూపులు పూర్తి చేసిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్ కాపీలతో రూ.6,300 ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని సూచించారు. ఇతర వివరాలకు 92471 20305, 98480 38769, 99593 24563 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కుప్పకూలిన లిఫ్ట్
తెనాలి: సామర్థ్యానికి మించి జనం ఎక్కడంతో అపార్టుమెంటు లిఫ్ట్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక డీఎస్పీ కార్యాలయం వెనుకవైపు వీధిలో అయ్యప్పస్వామి గుడి వద్ద గ్రీన్లీఫ్ మినర్వా అపార్టుమెంటులో 32 వరకు ఫ్లాట్లు ఉన్నాయి. సమీపంలోని కఠెవరం గ్రామపంచాయతీ పరిధిలోకి వస్తుంది. ఐదో ఫ్లోరులోని ఒక ఫ్లాటులో నివసిస్తున్న కుటుంబం సోమవారం రాత్రి పురోహితులను పిలిపించి, తమ ఇంట్లో రుద్రపారాయణం చేయించారు. పూజా కార్యక్రమాలన్నీ పూర్తయి, రాత్రి 10 గంటల ప్రాంతంలో పురోహితులు, వారి సహచరులు అంతా కలిసి కిందకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మొత్తం 11 మంది లిఫ్ట్‌లో ఎక్కారు. ఐదు నుంచి నాలుగు, మూడో ఫ్లోరు వరకు బాగానే వచ్చిన లిఫ్ట్, అక్కణ్ణుంచి ఒక్కసారిగా కుప్పకూలింది. కింద ఉండే స్ప్రింగులపై పడి పైకిలేచి మళ్లీ పడిపోయిందని అక్కడ నివసిస్తున్నవారు తెలిపారు. దీంతో లిఫ్టులోని వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. అందులో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 108 అంబులెన్స్ వాహనంలో వీరిని స్థానికంగా గల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వాస్తవానికి లిఫ్ట్ సామర్థ్యం ఆరుగురేనని చెబుతున్నారు. దాదాపు రెట్టింపు జనాభా ఎక్కడంతో లిఫ్టుకుండే వైరు తెగి ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. దీనిపై బాధితులను వివరాల కోసం సంప్రదించగా, పత్రికలో రాయొద్దని కోరారు. ఐదుగురికి తీవ్రగాయాలు -
గౌడ కులస్తులకు మద్యం షాపులు కేటాయింపు
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): గౌడ కులస్తులకు మద్యం షాపులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో 13, పల్నాడు జిల్లాలో 13 షాపుల చొప్పున 26 షాపులను కేటాయించింది. వీరికి మద్యం దుకాణాలు కేటాయింపునకు సంబంధించి ఎక్కడెక్కడ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలో పూర్తి వివరాలతో గెజిట్ త్వరలో విడుదల కానుంది. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఎకై ్సజ్ అధికారులు షాపులు కేటాయిస్తారు. బీజేపీ జిల్లా అధ్యక్షునిగా చెరుకూరి తిరుపతిరావు గుంటూరు మెడికల్: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా గుంటూరుకు చెందిన చెరుకూరి తిరుపతిరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ జిల్లా ఎన్నికల రిటర్నింగ్ ఇన్చార్జి ఉప్పలపాటి శ్రీనివాసరాజు, ఎన్నికల పరిశీలకులు కుమారస్వామి మంగళవారం ప్రకటించారు. గుంటూరు లాల్పురం రోడ్డులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారు. బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా శశికుమార్ నరసరావుపేట: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిడుగురాళ్లకు చెందిన యేలూరి శశికుమార్ ఎన్నికయ్యారు. మంగళవారం సాయంత్రం సత్తెనపల్లిరోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో జిల్లా పరిశీలకుడు జూపూడి రంగరాజు సమక్షంలో ఎన్నికల కన్వీనర్ పులి కృష్ణారెడ్డి ఈ మేరకు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. శశికుమార్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడు. రెండేళ్లుగా పల్నాడు జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
అక్రమ నిర్మాణంపై దేవదాయ అధికారుల తనిఖీ
కొల్లిపర: కొల్లిపరలో అనుమతుల్లేకుండా జరుగుతున్న భవన నిర్మాణాన్ని దేవదాయ శాఖ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన బొంతు జగదీశ్వరరెడ్డి నిర్మిస్తున్న మూడంతస్తుల భవనం స్థలం శ్రీపోతురాజుస్వామి దేవాలయానికి చెందిందని, అక్కడ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవంటూ కుంచెల వెంకటరామిరెడ్డి ఏపీసీఆర్డీఏ, తెనాలి జోనల్ కార్యాలయానికి, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు దేవదాయశాఖ సహాయ కమిషనరు జి.మాధవి, తెనాలి దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ ఎస్.శారదదేవి, ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి గ్రామానికి వచ్చారు. పంచాయతీ కార్యదర్శి అలకనంద, వీఆర్వో భాస్కర్‌తో కలిసి సంబంధిత ప్రదేశాన్ని, నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఇప్పటికే గ్రామపంచాయతీ, రెవెన్యూ అధికారులు బొంతు జగదీశ్వరరెడ్డికి నోటీసులు ఇచ్చి భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయించినట్టు తెలుసుకున్నారు అనంతరం ఆలయ కమిటీ పెద్దలు, స్థానిక నివేశనదారులతో మాట్లాడారు. దేవాలయ రికార్డులను పరిశీలించారు. సంబంధిత భూమి అంతా గ్రామకంఠంలో ఉందని నిర్ధారించుకున్నారు. అనంతరం దేవాదాయశాఖ సహాయ కమిషనరు జి.మాధవి మాట్లాడుతూ కొల్లిపరలోని శ్రీపోతురాజుస్వామి గుడి దేవదాయశాఖ పరిధిలో లేదన్నారు. ఆలయానికి చెందిన స్థలంగా పేర్కొంటున్న గ్రామకంఠంలో దాదాపు 50 మంది గ్రామస్తులు నివాసగృహాలను నిర్మించుకుని ఏళ్లుగా నివసిస్తున్నారని వివరించారు. వీటికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవన్నారు. ఆలయ కమిటీ పెద్దలు, అక్కడ నివసిస్తున్న గ్రామస్తులు కలసి మాట్లాడుకుని పదిరోజుల్లో తగిన నిర్ణయం తీసుకుని నివేదించాలని సూచించారు. లేకుంటే నివాసాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల వెంట తూములూరు దేవాదాయశాఖ ఈవో ప్రసాద్ , దేవాలయం కమిటీ సభ్యులు ఉన్నారు. -
తమ్ముడిపై కత్తితో దాడిచేసిన అన్న అరెస్ట్
తాడేపల్లిరూరల్: ప్రకాష్‌నగర్‌లో తమ్ముడిపై కత్తితో అన్న దాడిచేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సాక్షిలో వచ్చిన వార్తా కథనానికి తాడేపల్లి పోలీసులు స్పందించి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజు మాట్లాడుతూ ప్రకాష్‌నగర్‌కు చెందిన ఆరిఫ్‌ను అతని అన్నయ్య అయిన షేక్ మీరా అలియాస్ ఆసిఫ్ పాత గొడవల నేపథ్యంలో డిసెంబర్ 12న కూరగాయలు కోసే కత్తితో పొడిచాడని వివరించారు. ఆరిఫ్‌ను బంధువులు 108 వాహనం ద్వారా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారని, జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు వివరించారు. సాక్షి వార్తా కథనంతో స్పందించిన పోలీసులు -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య
నరసరావుపేట రూరల్: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కుందుర్తి గ్రామానికి చెందిన కనుపోలు ఉదయ్‌కిరణ్ (32) రెండు సంవత్సరాలుగా పట్టణంలోని 60 అడుగుల రోడ్డు సమీపంలో నివసిస్తున్నాడు. కార్లు క్రయవిక్రయ వ్యాపారం చేస్తున్నాడు. నష్టాలు రావడంతో మార్కెట్ సెంటర్లో కూరగాయల వ్యాపారం ప్రారంభించాడు. అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుని భార్య జయలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ కిశోర్ తెలిపాడు. అయితే ఉదయ్‌కిరణ్ ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అప్పుల పాలైనట్లు ప్రచారం జరిగింది. ఇలా దాదాపు రూ.10 లక్షలు పొగొట్టుకున్నట్టు చెబుతున్నారు. కానీ ఈ ప్రచారాన్ని అతడి భార్య ఖండించారు. -
ఐదుగురు విశిష్ట మహిళలకు సత్కారాలు
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్): స్థానిక బృందావన్గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై పలు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన విశిష్ట మహిళా మూర్తులకు మంగళవారం సత్కారం జరిగింది. గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ ఆధ్వర్యంలో పెద్ద సాంబశివరావు సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. గుంటు పల్లి ఆరుణజ్యోతి, సత్కారగ్రహీతలు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కుందుర్తి స్వరాజ్య పద్మజ అధ్యక్షత వహించారు. 70 వసంతాల వయస్సుపైబడి పలు రంగాల్లో నిష్ణాతులైన దేవాలయ పాలక మండలి గౌరవాధ్యక్షరాలు ఆధ్యాత్మిక సేవా శిరోమణి గద్దె రామతులశమ్మ (ఆధ్యాత్మిక), వేమూరి రామలక్ష్మి (సంగీతం), డాక్టర్ సి.హెచ్. సుశీలమ్మ (సాహిత్యం), వి.ఎన్.డి.శ్యామసుందరీ దేవి (విద్యా), మాధవపెద్ది మీనాక్షి (సంగీతం)లను సత్కరించారు. ఆధ్యాత్మిక సేవాశిరోమణి, ధార్మిక సేవారత్న గద్దె రామతులశమ్మ జీవనయానం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎన్.విజయలక్ష్మి, గుళ్ళపల్లి స్వాతి, అర్ధలపూడి నేహ, గుళ్ళపల్లి రాఘవరావు పాల్గొన్నారు. అనంతరం శ్రీసాయిమంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమి నాట్యాచార్య డాక్టర్ కాజ వేంకటసుబ్రహ్మణ్యం శిష్య బృందం స్వాగతాంజలి నృత్యం ప్రదర్శించింది. -
హేతువాద కవిరాజు
క్రోసూరు: దేశవ్యాప్తంగా మతతత్వం పెచ్చురిల్లుతున్న నేటి తరుణంలో కలాన్ని ఖడ్గంగా చేసుకుని, తన జీవితాన్నే ఆయుధంగా మలిచి సంఘ సంస్కరణకు పూనుకున్న సాహితీవేత్త, హేతువాది, అభ్యుదయవాది, మహాకవి కొండవీటి వెంకటకవి. ఆయన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల వాస్తవ్యులు. కొండవీటి వెంకటకవి అసలు పేరు కొండవీటి వెంకటయ్య, తల్లిదండ్రులు నారాయణ, శేషమ్మలు. 1918 జనవరి 25న ఆయన జన్మించారు. ఈయన సతీమణి పేరు చిన్నమ్మ, వీరికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వెంకటకవి రచనలు.. వెంకటకవి తన 14వ ఏట నుంచి రచనలు చేయటం ప్రారంభించారు. 1932లో కర్షక శతకాన్ని రాశారు. అనంతరం హితబోధ, చెన్నవ కేశవ శతకం, 1954లో నెహ్రూ చరిత్ర మొదటి భాగం రచించి బెజవాడగోపాలరెడ్డికి, ద్వితీయభాగం గుత్తికొండ నరహరికి అంకితం చేశారు. త్రిశతి పేరుతో బుద్ధుడు, వేమన, గాంధీజీల గురించి మూడు శతకాలు రచించారు. 1984లో పోతులూరి బ్రహ్మం మఠానికి ఆస్థానకవిగా ఊంటూ శ్రీ వీర బ్రహ్మేంద్ర సుప్రభాతాన్ని సంస్కృతంలో రచించారు. 1977లో అగ్రనటుడు నందమూరి తారక రామారావు తీసిన దానవీరశూరకర్ణ సినిమాకు సంభాషణలు రాశారు. అలా చలన చిత్ర రంగానికి పరిచమయ్యారు. ఆ తరువాత శ్రీమద్విరాటపర్వం, శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహేంద్రస్వామి చరిత్ర చిత్రాలకు సంభాషనలు రాశారు. వీరు రచించి గ్రంథాలన్నీ కవిరాజు గ్రంథ మాల పేరుతో స్వయంగా ప్రకటించినవే కావటం విశేషం. అప్పట్లో ఎంఎన్ స్ఫూర్తితో, కమ్యూనిస్టు భావజాలంతో బాబాలను విమర్శిస్తూ ఉపన్యాసాలిచ్చారు. కవిరాజు త్రిపురనేని రామస్వామి భావజాలంతో హేతువాదిగా మారి అనేక రచనలు చేశారు. మంత్రాలు లేకుండా త్రిపురనేని రామస్వామి రాసిన పెళ్లి సూత్రాలు చదివి అనేక వివాహాలు చేయించారు. పురస్కారాలు.. 1953లో గుంటూరు జిల్లా పెదకూరపాడులో వీరికి కవిరాజుగా బిరుదు ప్రధానం చేసి సత్కరించారు. 1971లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ కళాప్రపూర్ణ పురస్కారం. 1979 వెంకటకవి కవితా బ్రహ్మోత్సవాన్ని డాక్టర్ కొడాలి రంగారావు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సత్తెనపలిల్లో నిర్వహించారు. ఎడ్లబండి కట్టి అంగరంగ వైభవంగా సినీనటులు ఎన్టీ రామారావు, కొంగర జగ్గయ్య లతో పాటు వెంకటకవిని సత్తెనపల్లి పురవీధుల్లో ఊరేగించి అశేష జనవాహిని సమక్షంలో పౌరసత్కారం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటకవిని అధికార భాషా సంఘ సభ్యులుగా నియమించింది. వెంకటకవి 1991 ఏప్రిల్ 7న కాలం చేశారు. వెంకట కవి లాంటి గొప్ప రచయిత, హేతువాదిని తెలుగు ప్రజలు, నేటి విద్యార్థులు, యువత జ్ఞప్తికి చేసుకోవాల్సిన అవసరం ఉంది. రచనలతో సమాజాన్ని మేల్కొల్పిన కొండవీటి వెంకటకవి వెంకటకవి క్రోసూరు మండలం విప్పర్ల వాస్తవ్యులు సుప్రసిద్ధ రచయిత, హేతువాది, ఉపన్యాసకుడిగా ప్రఖ్యాతి 25న జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం -
జీఎంసీ కమిషనర్ అవినీతిపై పోరాటం ఆగదు
గుంటూరు వెస్ట్ : జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు వ్యవహార శైలి, అవినీతి విస్మయానికి గురి చేస్తోందని నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మిని మేయర్‌తోపాటు డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబు( డైమండ్ బాబు), కార్పొరేటర్లు కలిశారు. కమిషనర్‌పై ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మేయర్ మాట్లాడుతూ గత ఏడాది బుడమేరు వరదల సహాయార్థం కమిషనర్ కౌన్సిల్‌కు చెప్పకుండా రూ.9.24 కోట్లు అక్రమ చెల్లింపులు చేశారన్నారు. ప్రశ్నించినందుకు తమపై అకారణంగా కక్ష పెంచుకున్నారన్నారు. కమిషనర్ అవినీతిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్న స్టాండింగ్ కమిటీ ఎన్నికలను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించాలని కోరారు. కమిషనర్ అవినీతిపై తమ పోరాటం ఆగదని, కలెక్టర్ నుంచి ప్రధాన మంత్రి వరకు ఫిర్యాదులు చేస్తామన్నారు. టీడీపీ నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారు బుడమేరు వరద సహాయక చెల్లింపులు చేసింది కమిషనర్ పులి శ్రీనివాసులేనని, వాటి చెల్లింపుల వివరాలు, పరిస్థితులు ఆయనే చెప్పాలని డెప్యూటీ మేయర్ వనమా బాలవజ్ర బాబు(డైమండ్ బాబు) డిమాండ్ చేశారు. కేంద్ర గ్రామీణ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తోపాటు ముగ్గురు శాసన సభ్యులను, టీడీపీ నాయకులను, అధికారులను కమిషనర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు ఈచంపాటి ఆచారి, మార్కెట్ బాబు, పడాల సుబ్బారెడ్డి, అచ్చాల వెంకటరెడ్డి, రోషన్, బూసి రాజలత, వేముల జ్యోతి, అడకా పద్మ, గురవయ్య, దూపాటి వంశీ, అంబేడ్కర్, యాట్ల రవి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, యెక్కలూరి కోటి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు గుంటూరు వెస్ట్: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కొందరు అధికారులు అలసత్వం వహిస్తున్నారని, ఇలా అయితే ఇబ్బందులు తప్పవని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి హెచ్చరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ వేదిక ప్రాముఖ్యతను అధికారులు గుర్తించాలన్నారు. చిన్న సమస్యల పరిష్కారానికీ కొందరు అధికారులు అర్జీదారుడిని పదే పదే తిప్పుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ముఖ్యంగా సిబ్బంది అర్జీదారులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. తమ అర్జీలను ప్రజలు స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చన్నారు. అనంతరం వచ్చిన 172 అర్జీలను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు. మేయర్ కావటి, డెప్యూటీ మేయర్ డైమండ్ బాబు నా బిడ్డకు పూర్తి పింఛన్ మంజూరు చేయండి నా బిడ్డకు ఇప్పటికీ 20 ఏళ్ళు వచ్చాయి. నూరు శాతం అంగవైకల్యం ఉంది. ప్రస్తుతం రూ.6 వేలు పింఛన్ వస్తుంది. నూరు శాతం వైకల్యముంటే రూ.15 వేలు ఇవ్వాలి. నా బిడ్డ మందులకు, అనారోగ్య సమస్యలకు కొంత సాయంగా ఉంటాయి. దయచేసి మంజూరు చేయండి. – షేక్ శిలార్, పర్వీన్ దంపతులు, ఓబులనాయుడు పాలెం. అప్పు ఇచ్చి మోసం చేశారు నా బిడ్డకు తీవ్ర అనారోగ్యం. అతని వైద్యం కోసం బంధువుల వద్దే రూ.3 లక్షలు అప్పుచేశా. దీంతో వారు నా 1.33 ఎకరాల భూమిని కాజేశారు. మాకు ఉపాధి కూడా లేదు. ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నారు. న్యాయం చేయండి. – వసుంధర, గుంటూరు -
కలెక్టరేట్ వద్ద న్యాయవాదుల నిరసన
గుంటూరు వెస్ట్: పొన్నూరు పోలీసులు దళిత న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం కలెక్టరేట్లో నిరసన వ్యక్తం చేశారు. సుమారు వంద మందికిపైగా న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది శాంత కుమార్, కేకేలు మాట్లాడుతూ గత నెల 25న పొన్నూరులో న్యాయవాది బి.ప్రకాశరావు తన స్నేహితులకు చికిత్స ఎందుకు చేయడంలేదని వైద్యులను ప్రశ్నించినందుకు సీఐ రవి కిరణ్, ఎస్ఐ రాజ కుమార్, కానిస్టేబుళ్లు పోలీస్ స్టేషన్లో దారుణంగా కొట్టారన్నారు. ప్రకాశరావుకు తీవ్ర గాయాలయ్యాయని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజల క్షేమం కోసం పనిచేయాల్సిన పోలీసులు రక్తం కారేట్లు ఓ న్యాయవాదిని కొట్టడం అన్యాయమన్నారు. ఇలా అయితే ప్రజలకు పోలీసులపై గౌరవం ఏముంటుందని ప్రశ్నించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వేములు ప్రసాద్, దేవరకొండ రోశయ్య, న్యాయవాదులు పొల్గొన్నారు. న్యాయవాదిపై పొన్నూరు పోలీసుల దాడికి ఖండన కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం -
జీజీహెచ్‌లో సర్వీస్ బ్లాక్ నిర్మాణానికి అనుమతి
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో నిర్మాణం ఆగిపోయి ఉన్న సర్వీస్ బ్లాక్‌ను పూర్తి చేసేందుకు గుంటూరుకు చెందిన తులసి సీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నిర్వాహకులు, గుంటూరు జీజీహెచ్ అభివృద్ధి సంఘం సభ్యుడు తులసి రామచంద్ర ప్రభు ముందుకు వచ్చారు. గతంలో ప్రైవేటు కంపెనీ నిర్వాహకులు నిర్మాణం పూర్తి చేయకుండా నిలిపివేశారు. సుమారు రూ. 7.50 కోట్లతో భవన నిర్మాణం పూర్తి చేసేందుకు తులసి రామచంద్ర ప్రభు ముందుకు రావడంతో భవన నిర్మాణం చేపట్టేందుకు ఆయనకు అనుమతి ఇస్తూ సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీస్ బ్లాక్ నిర్మాణం పూర్తయితే సెంట్రల్ కిచెన్, హాస్పటల్ స్టోర్స్, లాండ్రి, ఎంఆర్డీ విభాగం, సీఎస్ఎస్డీ విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. నాలుగు అంతస్తులతో భవన నిర్మాణం జరుగనుంది. ఉత్తర్వుల కార్యారూపణకు కృషి చేసిన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్‌లకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ కృతజ్ఞతలు తెలిపారు. -
వృద్ధుల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలి
ఎస్పీ సతీష్‌కుమార్ నగరంపాలెం(గుంటూరు వెస్ట్): జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఎస్పీ సతీష్‌కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బాధితుల గోడు ఆలకించారు. ఎస్పీ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో సమస్యలు పరిష్కరించాలని అన్నారు. వృద్ధుల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని చెప్పారు. శిక్షణ ఐపీఎస్ శ్రీదీక్ష, ఏఎస్పీ(క్రైం) కె.సుప్రజ, డీఎస్పీలు రమేష్, శివాజీరాజు అర్జీలు స్వీకరించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి మోసం విశాఖపట్నానికి చెందిన ఓ వ్యక్తి ఎక్కువ వడ్డీ ఆశ చూపడంతో విడతల వారీగా రూ.59 లక్షలు చెల్లించాం. కొంతకాలం వడ్డీలు క్రమంగా చెల్లించి ఆ తర్వాత ఆపేశాడు. గతేడాది ఆగస్టులో అడిగితే చెల్లించేస్తానని నమ్మబలికాడు. కానీ చెల్లించలేదు. మోసపోయాం. అతనిపై ఇటీవల నగరంపాలెం పీఎస్‌లో ఫిర్యాదు చేశాం. ఎటువంటి స్పందన లేదు. న్యాయం చేయండి. – ఓ యువతి, రామిరెడ్డినగర్, ఏటీ అగ్రహారం భర్త మోసగించాడని.. నా భర్త మరొక యువతితో కలిసి ఉంటున్నాడు. నన్ను మోసం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. న్యాయం చేయండి – ఓ వివాహిత, ఐపీడీ కాలనీ, సంగడిగుంట రూ.10.40 లక్షలు తీసుకుని.. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి తన కుమార్తె అవసరాల నిమిత్తం రూ.10.40 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్లు గడిచినా డబ్బులు చెల్లించలేదు. అదేమని అడిగితే బెదిరిస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. న్యాయం చేయండి. – ఎన్.వెంకటరావమ్మ, గుంటూరు వారితోట వీఆర్వో మోసగించాడు యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో గతేడాది జూన్‌లో పరిచయమయ్యాడు. వంకాయలపాడు గ్రామంలో పొలం ఉందని చెప్పి నమ్మబలికాడు. అగ్రిమెంట్ రాయిస్తానని చెబితే రూ.3 లక్షలు చెల్లించాను. పొలం ఆన్లైన్ చేయించి ఇస్తానని చెప్పి, మరో రూ.17 లక్షలు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఆన్లైన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేయలేదు. పెదకాకానిలోని వీఆర్వో ఇంటికెళ్లగా ఆయన కుటుంబ సభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడారు. తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం – షేక్.మౌలా బుడే, బొప్పూడి గ్రామం చిలకలూరిపేట నిందితులను అరెస్ట్ చేయాలి శ్రీదేవి ఓ సీడ్స్ కంపెనీ సేల్స్ విభాగంలో పనిచేసేది. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆమెకు బంధువులు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.5 లక్షలు వడ్డీకి ఇప్పించారు. వడ్డీ చెల్లించినా అసలు చెల్లించలేదని వడ్డీకి ఇచ్చిన వ్యక్తి శ్రీదేవి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బంధువులూ అతనికి వత్తాసు పలికారు. ఆమె మనస్తాపం చెంది గతేడాది నవంబర్‌లో పురుగు మందు తాగి మరణించింది. అంతకుముందు వీడియో కాల్లో పురుగు మందు డబ్బా పట్టుకుని, తన చావుకు ఎవరెవరు కారణమనేది తెలిపింది. అయినా పోలీసులు నిందితులను అరెస్టు చేయలేదు. న్యాయం చేయాలి. – శ్రీదేవి భర్త ఆనంద్, తనయులు, పలు సంఘాల నేతలు -
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని పెంచుకుని జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించి, ముందుకు వెళ్లినప్పుడే ఉన్నత శిఖరాలను చేరుకోగలరని సీఐడీ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎస్పీ కేజీవీ సరిత పేర్కొన్నారు. సోమవారం భాష్యం విద్యాసంస్థల ఆధ్వర్యంలో గోరంట్లలోని భాష్యం రామసేతు క్యాంపస్ సమీపంలోని జేఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీలో బీపీఎల్ 2024–25లో భాగంగా భాష్యం ప్రీమియర్ లీగ్ సెంట్రల్ లెవల్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రిలిమినరీ మ్యాచ్‌లను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ సరిత మాట్లాడుతూ అపజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. నేటి యువత క్రికెట్‌ను కేవలం క్రీడగానే పరిగణించాలని, జట్టును స్ఫూర్తివంతమైన నాయకత్వ లక్షణాలతో నడిపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. క్రమశిక్షణ పట్టుదల, పోరాట పటిమ వంటి లక్షణాలను పెంచుకోవడంతోపాటు శారీరక, మానసిక పటిష్టానికి సహకరిస్తుందన్నారు. క్రీడా స్ఫూర్తిని పెంచేందుకే లీగ్ భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు భాష్యం ప్రీమియర్ లీగ్‌ను ప్రారభించామని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న అధికారికంగా 150 క్యాంపస్‌లలో ప్రారంభించిన పోటీలు మూడు వేర్వురు కేటగిరీల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. మొత్తం 720 మ్యాచ్‌లలో బ్రాంచ్ స్థాయిలో 420, జోనల్ స్థాయిలో 281, సెంట్రల్స్థాయిలో 19 మ్యాచ్‌లు జరుగుతాయని వివరించారు. సెంట్రల్ టోర్నమెంట్లో భాగంగా ప్రిలిమినరీలు ఈనెల 20న ప్రారంభం కాగా, ఈనెల 23న క్వార్టర్ ఫైనల్స్, ఈనెల 25న సెమీ ఫైనల్స్, 26న ఫైనల్స్ నిర్వహిస్తామని చెప్పారు. ముందుగా ఎస్పీ సరిత చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి, జెండాలతోపాటు బెలూన్లు ఎగురవేశారు. అనంతరం ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఉదయం గుంటూరు జెయింట్స్–3, వైజాగ్ వికింగ్స్–1 మధ్య జరిగిన మ్యాచ్‌లో గుంటూరు జెయింట్స్ జట్టు, మధ్యాహ్నం గుంటూరు గార్డియన్స్–2, తూర్పు గోదావరి ఎలైట్స్–3 మధ్య జరిగిన మ్యాచ్‌లో గుంటూరు గార్డియన్స్–2 జట్టు విజయం సాధించాయి. విజేతలకు భాష్యం రామకృష్ణ ట్రోఫీలు బహూకరించారు. కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్‌రామ్, ప్రిన్సిపాల్స్, టీచర్లు పాల్గొన్నారు. సీఐడీ ఎస్పీ కేజీవీ సరిత భాష్యం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభోత్సవం -
అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
వేలిముద్ర స్కానర్ ఆధారంగా పట్టుకున్న పోలీసులు లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): ఇళ్ల ముందు పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్రవాహనాలను చోరీ చేసే అంతర్ రాష్ట్ర దొంగను వేలిముద్ర స్కానర్ ఆధారంగా నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక నగరంపాలెం పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎం.నజీర్ కేసు వివరాలను వెల్లడించారు. హనుమయ్యనగర్‌కు చెందిన మాదాల సురేష్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. ఈనెల 15న రాత్రి తన ఇంటి ముందు ద్విచక్రవాహనం పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయం లేచి చూసే సరికి వాహనం కనిపించలేదు. దీంతో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్టేషన్ పరిధిలో ఇదే తరహాలో మరో రెండు ద్విచక్రవాహనాలు చోరీకి గురికావడంతో అదనపు ఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో సీసీఎస్ పోలీసుల సహకారంతో నగరంపాలెం సీఐ నజీర్ ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. నగరంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. పాత నేరస్తులను విచారించారు. థంబ్ ప్రింట్ (వేలిముద్ర) స్కానర్ ద్వారా విచారణ చేపట్టారు. దీని ఆధారంగా వాహనాలు చోరీ చేసింది దేవాపురానికి చెందిన పులి రమేష్‌గా గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రమేష్ నుంచి ఐదు ద్విచక్రవాహనాలను రికవరీ చేశారు. రమేష్‌పై జిల్లాలోనే అనేక పోలీస్ స్టేషన్లలో 52 కేసులు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం రమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రమే ష్‌ను పట్టుకునేందుకు ప్రతిభ కనబరిచిన నగరంపాలెం సీఐ ఎం.నజీర్‌ను ఎస్సై సలాంను సిబ్బందిని ఎస్పీ సతీష్‌కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.