సాక్షి, యాదాద్రి: యాదాద్రి పుణ్యక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని, కృష్ణ శిలలతో నిర్మితమైన ఈ ఆలయం చరిత్రలో నిలిచిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. క్షేత్రంలోని పచ్చదనం, కట్టడాలు అద్వితీయంగా ఉన్నాయని ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయితోపాటు శిల్పుల పనితీరును ప్రశంసించారు. యాదాద్రికి మరోసారి సైతం తప్పక వస్తానని పేర్కొన్నారు.
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా మంగళవారం యాదాద్రి జిల్లాలోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వర్ణ కలశంతో కూడిన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువును, బాలాలయంలోని పంచ నారసింహుని దర్శించుకుంటూ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వామి, అమ్మవార్లకు స్వర్ణ పుష్పార్చన పూజలు జరిపించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ గడప బయట నుంచి పూజలు జరిపి దర్శించుకుని స్వర్ణ శటారి పొందారు. సుమారు గంటపాటు బాలాలయంలో గడిపి పూజలు నిర్వహించిన అనంతరం వేద ఆశీర్వచనం పొందారు. ఆలయ విశేషాలను పూజారులను సీజేఐ అడిగి తెలుసుకున్నారు. సీజేఐ దంపతులకు ఆలయ పక్షాన స్వామి అమ్మవార్ల జ్ఞాపికను రాష్ట్ర దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మంత్రి జగదీశ్‌రెడ్డి అందజేశారు. దేవాలయ ఈఓ గీతారెడ్డి వారికి పట్టు వస్త్రాలను అందించగా దేవుడి ప్రసాదాన్ని అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అందించారు.
పునర్నిర్మాణంలో ఎంత మంది పనిచేశారు?
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఆలయ నిర్మాణ ప్రత్యేకతల గురించి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయిని అడిగి తెలుసుకున్నారు. హొయ సాల, ద్రవిడ, పల్లవ, కాకతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చేపట్టిన ఆలయ నిర్మాణంలో ఎంత మంది పనిచేశారని సీజేఐ అడగ్గా సుమారు వెయ్యి మంది వరకు కళాకారులు పనిచేసినట్లు ఆనంద్‌సాయి వివరించారు. అష్టభుజి ప్రాకారం, వాలి పిల్లర్లు, అద్దాల మండపం, కాకతీయ పిల్లర్లు, గర్భాలయ గోడలపై ప్రహ్లాద చరిత్ర, మహారాజ గోపురం, ముఖ మండపం, తంజావూర్ పెయింటింగ్స్, గండబేరుండ దేవాలయం, ఆలయంలోని శిల్పాలు, విద్యుత్ దీపాలు, తూర్పు రాజగోపురం నుంచి ఆలయంలోకి వస్తుండగా ఉన్న ఏనుగుల విగ్రహాల వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. మహారాజగోపురం వద్ద జస్టిస్ దంపతులు ఫొటోలు దిగారు. ప్రెసిడెన్షియల్ సూట్స్‌తోపాటు పెద్దగుట్టపై నిర్మితమవుతున్న టెంపుల్ సిటీని సైతం సీజేఐ దంపతులు సందర్శించారు. కాటేజీలను పరిశీలించి, పనితీరును మెచ్చుకున్నారు. పట్టువస్త్రాలు ధరించి సంప్రదాయ రీతిలో స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్న అనంతరం అతిథి గృహం చేరుకొని అల్పాహారం తీసుకున్నారు.
చరిత్రలో నిలిచిపోయేలా యాదాద్రి పునర్నిర్మాణం
Published Wed, Jun 16 2021 2:16 AM | Last Updated on Wed, Jun 16 2021 5:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment