ఈ మధ్య విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. అయితే వీటి తీరు చూస్తే అవి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సభలు అనిపిస్తుంది. ఒక కులం వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాటు చేశారా? అనిపించకమానదు. అదే సమయంలో తెలుగు భాషోద్దణ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లోని పేద పిల్లలకు విద్యను దూరం చేయడానికి కుట్ర జరుగుతుందా అన్న అనుమానమూ రాకమానదు. ధనిక ఆసాములంతా ఒక చోట చేరి కడుపు నిండిన కబుర్లు చెప్పుకున్నట్లుగా ఉందన్న భావన కలుగుతుంది. వీరి మాటలు ప్రభుత్వ స్కూళ్లను నీరు కార్చి, ప్రైవేటు విద్యా వ్యవస్థను ప్రోత్సహించేలా ఉన్నాయి.
ఈ రచయితల సభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రముఖులు లేదంటే వారికి మద్దతు ఇచ్చే మేధావి వర్గానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారన్న అభిప్రాయం వచ్చింది. వేదికకు రామోజీరావు పేరు పెట్టడం, ఆయన కోడలు శైలజ వచ్చి తెలుగు గురించి ఉపన్యాసం ఇవ్వడం వంటివి ఈ సభల అజెండాను స్పష్టం చేస్తోంది. ఈ సభలలో పాల్గొన్న ప్రముఖులు ఎవరైనా తమ పిల్లలు, లేదా మనుమళ్లు తెలుగు మాధ్యమంలోనే చదువుతున్నారని చెప్పినట్లు కనిపించలేదు. ప్రధాన అతిధిగా పాల్గొన్న సుప్రీంకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈసారి మరింతగా ఓపెన్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియంకు సంబంధించి జగన్ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవోని రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. బహుశా ఇదంతా ముందస్తుగానే ఒక అవగాహనతో జరిగి ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ టైమ్‌లో విద్య, వైద్య రంగాలకు విశేష ప్రాధాన్యత లభించింది.
‘నాడు నేడు’ కార్యక్రమం కింద స్కూళ్లు, ఆసుపత్రుల రూపురేఖలను మార్చివేశారు. ఆంగ్ల మాధ్యమంతోపాటు సీబీఎస్‌ఈ, టోఫెల్, ఐబీ వంటి జాతీయ, అంతర్జాతీయ సిలబస్‌లను ప్రవేశపెట్టి పేద పిల్లలకు అతి ఖరీదైన విద్యను ఉచితంగా అందించడానికి జగన్ కృషి చేశారు. అది సహజంగానే పెత్తందారి వర్గానికి నచ్చదు. ప్రైవేటు స్కూళ్లలో ఖర్చు చేసి చదువుకుంటున్న తమ పిల్లలకు, ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు తేడా లేకుండా పోవడం కూడా అంతగా నచ్చదు. అలాంటి తరుణంలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలు ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లారు.ప్రైవేటు స్కూళ్ల పిల్లలతో పోటీ పడి ఆంగ్లంలో మాట్లాడగలిగే స్థితికి చేరుకుంటున్నారు. అలాగని తెలుగును తక్కువ చేయలేదు. తెలుగును నిర్భంద సబ్జెక్ట్‌గా చేర్చారు. అయినా కొందరు హైకోర్టుకు వెళ్లారు.ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించారు.
జగన్ వెనక్కి తగ్గకుండా ద్విభాష పుస్తకాలు తయారు చేయించారు. దీని తర్వాత కూడా ఈ ఫ్యూడల్ శక్తులకు తృప్తి కలగలేదు. ఇప్పుడు రచయితల సభల పేరుతో ప్రభుత్వ విద్యపై విరుచుకుపడ్డారని అనుకోవాలి. ప్రస్తుత పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోక పోతే దేశ, విదేశాలలో మన పిల్లలు పోటీ పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. చైనాలో ఆ భాషలోనే చదువుతున్నారు కదా అని కొందరు అనవచ్చు. కాని అక్కడి పరిస్థితి వేరు. మన దేశ వాతావరణం వేరు. అయినా చైనాకు చెందిన లక్షల మంది ఇప్పుడు ఆంగ్ల భాషను అభ్యసించి అమెరికా తదితర దేశాల దారి పడుతున్న విషయాన్ని విస్మరించరాదు. ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని పరిశీలించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెడుతూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన ‘జీవో8’ను రద్దు చేయాలని అన్నారు.
ఆ జీవో పై ఒకరు హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారని, దానిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిందని, ఇప్పుడు ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. బహుశా చంద్రబాబు ప్రభుత్వంతో ఉన్న అవగాహన వల్లే ఇలా మాట్లాడి ఉంటారా? అని ప్రముఖ విద్యా వేత్త కంచె ఐలయ్య ప్రశ్నించారు. గత ప్రభుత్వం తెలుగు భాషను అణచివేయడానికో, అభివృద్ది చేయడానికో ఆ జీవో తెచ్చిందని రమణ అన్నారు. నిజంగా అంత పెద్ద స్థాయికి వెళ్లిన వ్యక్తి ఇలా మాట్లాడడం శోచనీయం. ఆంగ్లంలోనే ఉద్యోగాలు వస్తాయని అనుకోవడం భ్రమ అని ఆయన చెబుతున్నారు. ప్రజలు తెలుగు భాషను ఆదరిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయని మాజీ చీఫ్ జస్టిస్ అన్నారు.
సరిగ్గా ఇదే అంశంపై రమణ స్వయంగా కొన్ని గ్రామాలకు, ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటే బాగుంటుంది కదా! తెలుగు భాషకు ఎవరూ వ్యతిరేకం కాదు. దానిని రక్షించుకోవల్సిందే. కాని అదే సమయంలో పేదల బతుకు తెరువు కూడా ముఖ్యమే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. పైరవి చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవడమో, ఉన్నత స్థాయికి చేరుకోవడం అందరికి సాధ్యం కాదు. మంచి విద్య వారికి కీలకంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్లి స్థిరపడిన లక్షలాది మంది తెలుగువారు ఆంగ్లం నేర్చుకున్న తర్వాతే వెళ్లగలిగారన్నది వాస్తవం. అంతెందుకు! ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ రచయిత, మాజీ ఎంపీ యార్గగడ్డ లక్ష్మీప్రసాద్ కుమారుడు అమెరికాలోనే నివసిస్తున్నారు.
ఆయనకు ఆంగ్లంపై పట్టు వచ్చాకే వెళ్లగలిగారా? లేదా? తెలుగు మీడియంలోనే చదువుకుని ఉంటే అది సాధ్యం అయ్యేదా? ఒకవేళ సాధ్యమైనా ఎంత కష్టపడి ఉండాలి? మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండీ శైలజా కిరణ్ కూడా తెలుగు గురించి మాట్లాడారు. మరి వారి ఆధ్వర్యంలో నడిచే పబ్లిక్ స్కూల్ లో తెలుగు మీడియం ఉందో, లేదో చెప్పి ఉండాల్సింది. ఆమె కుంటుంబంలోని పిల్లలంతా ఎక్కడ, ఏ భాషలో చదివారో చెప్పినట్లు లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ఆంగ్ల మీడియంలోనే చదివారు. ఇప్పుడు మనుమడు దేవాన్ష్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అభ్యసిస్తున్నారు కదా? ఇటీవల దేవాన్ష్ చెస్‌లో మెడల్ సాధించారని వార్తలు వచ్చాయి. ఆయన తెలుగు మీడియంలో చదివి ఉంటే ఈ చెస్ లో గెలవగలిగేవారా అని కంచె ఐలయ్య ప్రశ్నించారు.
ప్రైవేటు స్కూళ్లలో అత్యధిక శాతం ఆంగ్ల మీడియమే ఉంది కదా? రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన విద్యా సంస్థలలో ఏ మీడియం ఉందో చెప్పాలి కదా? ఇంకా నయం. ఆయనను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెట్టలేదు. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం ఎందుకు? ప్రైవేటు స్కూళ్లలో కూడా అదే ప్రకారం తెలుగు మీడియం ఉండాలని వీరంతా ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇక్కడే వీరి స్వార్దం కనిపిస్తుంది. రామోజీ జ్ఞాపకార్డం అంతా శుభోదయం అని పలకరించుకోవాలని శైలజా కిరణ్ సూచించారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తమ సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ పేరులో ఆంగ్లం లేకుండా చూసుకోవాలి కదా! చిట్ ఫండ్స్‌ను తెలుగీకరించిన తర్వాత ఆమె సలహాలు ఇస్తే బాగుంటుందని కొందరు వ్యంగ్యంగా అంటున్నారు.
ఈనాడు దినపత్రికలో తెలుగు రచయితల సభల వార్తలను కవర్ చేసిన సందర్భంలో పలు ఆంగ్ల పదాలు ఎందుకు వాడారో తెలియదు. ఉదాహరణకు కేబీఎన్ కళాశాల అని అన్నారే కాని, దానిని తెలుగులో రాయలేదు. సుప్రీంకోర్టు, జస్టిస్ వంటి ఆంగ్ల పదాలనే వినియోగించారు. నెట్ లో పెట్టిన వార్తల కింద ఎడిషన్ నేమ్, ఆంధ్రప్రదేశ్ అని, పేజ్ నెంబర్ అంటూ ఆంగ్ల ఆక్షరాలతోనే రాశారు. అంటే దాని అర్థమేమిటి? తెలుగు భాషను రక్షించుకుంటూనే ఆంగ్ల భాషపై తెలుగు పిల్లలు పట్టు పెంచుకుంటేనే వారికి భవితవ్యం ఉందన్నది వాస్తవం. అందుకే 95 శాతం మంది ప్రజలు తమ పిల్లలను ఆంగ్ల మీడియంలోనే చదివించుకుంటున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలలో అయితే అది నూటికి నూరు శాతం ఉంటోంది.
ప్రభుత్వ విద్యా సంస్థలలోనే ఎందుకు తెలుగు మాధ్యమం అన్నదానికి ఈ పెద్దలు ఎవరూ సమాధానం చెప్పలేరు. ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇక ఇలా ఆంగ్ల మీడియం కూడా పూర్తిగా ఎత్తివేస్తే ఏపీలో పేద పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదివించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అంతిమంగా వారి చదువులకు గండం ఏర్పడుతుంది. తెలుగు రచయితల సభ చివరికి పేదల పాలిట శాపంగా మారితే వారి రచనలకే విలువ లేకుండా పోతుంది.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment