కొద్ది రోజుల క్రితం రెండు వార్తలు గమనించాను. న్యాయవ్యవస్థలోనే అత్యున్నతమైన సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించి తెలుగువారికి విశిష్టత తెచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు మీడియం గురించి మాట్లాడిన విషయం ఒకటి అయితే, ప్రముఖ విద్యావేత్త కంచ ఐలయ్య ఏపీలో జరుగుతున్న విద్యా సంస్కరణలపై చేసిన ప్రసంగం వీడియో మరొకటి. జస్టిస్ రమణ తెలుగు మీడియం పై మాట్లాడితే ఐలయ్య ఆంగ్ల మీడియం గురించి గట్టిగా వక్కాణించారు. ఐలయ్య చాలా స్పష్టంగా ఏపీలో విద్యా సంస్కరణలు కొనసాగవలసిన అవసరం గురించి వివరించారు. ఆంగ్ల మీడియం ద్వారా బలహీనవర్గాలలో ఆత్మ స్తైర్యం పెరుగుతుందని, ప్రపంచంతో పోటీ పడే అవకాశం వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు.
✍️ముఖ్యమంత్రి జగన్‌ను తాను ఇంతవరకు కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవవలసిన అవసరం లేదని అంటూ, ఆయన విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు విప్లవాత్మకమైనవని చెప్పడమే తన ఉద్దేశమని ఐలయ్య తెలిపారు. ఐలయ్య చేసిన ఈ ప్రసంగానికి మీడియాలో పెద్ద ప్రాముఖ్యత లబించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కాస్త విస్తారంగానే ప్రచారం అయింది. మరో వైపు సుప్రింకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆంగ్ల మాద్యమంపై మాట్లాడిన విషయాలు తెలుగుదేశం పార్టీ పత్రికలలో ప్రముఖంగా వచ్చాయి.
✍️ ఆయన అభిప్రాయాన్ని గౌరవించవలసిందే. ఎవరూ మాతృభాషను విస్మరించకూడదు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదురువుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాద్యమంకు ఉన్నప్రాముఖ్యతను ఆయన గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రమణ ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ఆంగ్లంలో మాట్లాడారో, లేక ఎవరినైనా దుబాసి పెట్టుకుని తెలుగులో మాట్లాడారో తెలియదు కాని, ప్రస్తుతం ఆయన చెబుతున్న విషయాలు పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆంగ్ల మాద్యమం మంచిదనే భ్రమలు వద్దు అని ఆయన అన్నారని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఇదేదో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారేమో అన్న భావన కలుగుతుంది. ఆయనకు ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు.కాని ఈనాడు మీడియా ఈ వార్త ఇచ్చిందంటే ఎంతో కొంత జగన్ ప్రభుత్వానికి నష్టం చేస్తుందని నమ్మడమే కావచ్చు.
✍️లేకుంటే ఆ వార్తకు అంత ప్రాధాన్యత ఇవ్వదు కదా! కర్నూలులో కొన్నాళ్ల క్రితం జరిగిన ఎస్టియు అంటే స్టేట్ టీచర్ల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుశా అది సిపిఐ మద్దతుతో నడిచే సంస్థలా ఉంది. అందుకే సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఐ తెలంగాణ మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. వైసిపి ఎమ్మెల్యే హపీజ్ ఖాన్ కూడా ఈ సభలో పాల్గొన్నా ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏపీలో సిపిఐ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పేదలకు వైసిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సైతం తప్పుపడుతున్న సిపిఐ ప్రతిపక్ష తెలుగుదేశంకు కొమ్ముకాస్తోందన్న విమర్శలు ఉన్నాయి. సిపిఐ నారాయణ చెప్పారంటూ ఏపీలో నలభైవేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రమణ నమ్మినట్లు మాట్లాడడం కూడా సముచితంగా అనిపించదు.నారాయణ తన అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతుంటారు.
✍️ఉదాహరణకు తమతో కలిసిఉన్నప్పుడు కేసీఆర్ ను హీరో అని నారాయణ పొగిడేవారు. ఆయనతో చెడగానే కేసీఆర్ అంత నియంత లేరని ద్వజమెత్తారు. ఇది వేరే సంగతి కాని ఛీఫ్ జస్టిస్ గా అత్యున్నతమైన బాధ్యతలు నిర్వహించి రిటైరైన రమణ తన గౌరవం నిలబెట్టుకునే విదంగా మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. అలాకాకుండా నారాయణ వంటివారి చెప్పుడు మాటలు విని ప్రసంగాలు చేస్తే అప్రతిష్ట పాలు అయ్యే ప్రమాదం ఉంది. నిజంగా పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?అన్నిటిని భర్తీ చేయవలసిన అవసరం ఉందా? తదితర అంశాలను తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. రమణ అసలు ఎపీలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను పరిశీలించి ఉండకపోవచ్చు.
✍️కేవలం తన పాతమిత్రులైన టీడీపీ నేతలు చేస్తున్న ప్రచార ప్రభావంలో పడి మాట్లాడి ఉండవచ్చు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో ఎన్నడైనా రమణ పరిశీలించారా? ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విశేష మార్పులనుఎన్నడైనా చూశారా?స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేసి,రంగులు వేసి ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తయారు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం రమణ కనీస బాద్యత కాదా? స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లను ఒకసారి ఆయన చూసి వస్తే బాగుండేది కదా! సిబిఎస్ఇ సిలబస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర విన్నూత్న అంశాలను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్దులకు అందించాలన్న జగన్ తాపత్రయాన్ని అర్దం చేసుకోకుండా రమణ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు మాట్లాడడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని గమనించాలి.ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న అత్యాధునిక టాయిలెట్లు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఉన్న విషయాన్ని అంగీకరించరా? అసలు ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు తీసుకు వస్తే టీచర్లు మరింత శ్రద్దగా, బాద్యతగా పాఠాలు చెప్పాలన్న సంగతిని కూడా రమణ వంటివారు బోదించి ఉండాల్సింది.
✍️ఆ విషయాల జోలికి వెళ్లినట్లు మీడియాలో వచ్చిన వార్తలో కనిపించలేదు. ఒకవేళ ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే మంచిదే. అయితే ఇంగ్లీష్ మీడియం గురించి రమణ మాట్లాడిన తీరు మాత్రం అభ్యంతరకరం అని సోషల్ మీడియాలో విస్తారంగా కామెంట్లు వచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం బోదించాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం గురించి ఎందుకు మాట్లాడలేదు?అంతదాకా ఎందుకు ఆయన గొప్పవారు కదా! ఆయన తన పిల్లలను తెలుగు మీడియంలోనే, అందులోను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించానని చెప్పి ఉన్నట్లయితే చాలా మందికి స్పూర్తి దాయకం అయి ఉండేది కదా! అలాగే తన మనుమలు కూడా తెలుగు మీడియంలోనే చదువుతున్నారని అని ఉంటే ఘనంగా ఉండేది కదా! వారు ఎక్కడ ,ఏ స్కూళ్లలో చదువుతున్నారో తెలియదు కాని, బహుశా ప్రభుత్వ స్కూళ్లలో అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే పలుకుబడి కలిగినవారంతా ఇంటర్నేషనల్ స్కూళ్లలోనే చదివిస్తున్నారు కదా! తప్పు లేదు.
✍️కాని ప్రభుత్వ స్కూళ్లలోనే ఫలానా విధంగా ఉండాలని చెప్పడమే కాస్త ఆక్షేపణీయంగా అనిపిస్తుంది. న్యాయ వ్యవస్థలో ఆంగ్ల భాష ప్రాధాన్యత గురించి రమణ కు తెలియకపోదు. ఇప్పటికీ కోర్టులలో ఆంగ్లంలోనే తీర్పులు వెలువడుతుంటాయి. వాదనలన్నీ ఆంగ్లంలోనే జరుగుతుంటాయి. ఆ విషయాన్ని విస్మరించరాదు కదా? అలాగే మిగిలిన వ్యవస్థలలో కూడా ఆ పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఆంగ్ల మాద్యమమే మంచిదని భ్రమలు వద్దని చెప్పడం ద్వారా ఆంధ్ర సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందనిపిస్తుంది. మాతృభాషలోనే టీచర్లు బోధించాలని మాజీ జస్టిస్ చెప్పడం సహేతుకంగా లేదు. వారు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయాలి కదా! రమణ ఒక విదంగా ఎపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని నీరుకార్చే విధంగా మాట్లాడారనిపిస్తుంది. ఒక్కసారి రమణ ఎపీలో ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించి, పిల్లలతో మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది.
✍️ఈ మధ్య నేను కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలతో మాట్లాడాను. ఇంగ్లీష్ మీడియం కావాలా? వద్దా? అంటే దాదాపు అంతా కావాలని బదులు చెప్పారు. ఏపీ ప్రభుత్వం పిల్లలకు టాబ్ లు ఇవ్వడాన్ని సమర్ధిస్తారా అంటే అవునని జవాబు ఇచ్చారు. ఈనాడు వంటి పత్రికలు పిల్లలకు ఇచ్చే టాబ్ లపై దరిద్రపు వార్తలను రాస్తున్న విషయాన్ని కూడా పిల్లలు గమనిస్తున్నారు. ఆ మీడియా తీరును కూడా కొందరు తప్పుపట్టారు. పరిస్థితి ఇలా ఉంటే జస్టిస్ రమణ పేద పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు కనిపించడం సమంజసంగా కాదు.
✍️తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసిన ఈనాడు అధినేత రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పిల్లలను ఆంగ్ల మీడియంలో అది కూడా కార్పొరేట్ స్కూళ్లలోనే చదివించారు. చంద్రబాబు తన మనుమడిని ఎక్కడ చదివిస్తున్నారో రమణ తెలుసుకుని దానిపై స్పందిస్తే ప్రజలకు బాగా అర్ధం అవుతుంది.టీచర్ల జీతభత్యాల గురించి తన అభిప్రాయాలు చెప్పిన మాజీ ఛీఫ్ జస్టిస్ విద్యార్దులకు ఐదో తరగతి చదివినా రెండంకెల కూడికలు కూడా రావడం లేదని అన్నారు. దీనికి టీచర్లు ఏ విధంగా బాద్యత వహించవలసి ఉందో వివరించారో లేదో తెలియదు. కచ్చితంగా టీచర్లను గౌరవించవలసిందే.
✍️వారికి అన్ని విదాలుగా సదుపాయాలు సమకూర్చవలసిందే. కాని అదే సమయంలో వారు కూడా బాద్యతగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది కదా! రాజకీయ పార్టీలకు అనుబందంగా కాకుండా పేదల కోసం ప్రభుత్వ టీచర్లు పనిచేసిన రోజున వారు ఏ డిమాండ్లు పెట్టినా సమాజం అర్దం చేసుకుంటుంది. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో జస్టిస్ రమణ వంటివారు ఇలాంటి ఉపన్యాసాలు చేయడం వల్ల వారి ఉద్దేశాలను ప్రజలు శంకించే ప్రమాదం ఉందని చెప్పకతప్పదు.అది వారికి శోభ నివ్వదు. విద్యా వేత్త కంచ ఐలయ్య పేద వర్గాలకు, బలహీనవర్గాలకు ప్రతినిదిగా మాట్లాడిన తీరును, జస్టిస్ రమణ వంటి ప్రముఖుడు ప్రసంగించిన వైనాన్ని గమనించిన మీదట ఈ కామెంట్ రాయాలనిపించింది.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment