బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్‌! | Ksr Comments On AP Power Projects | Sakshi
Sakshi News home page

ఏపీ పరిశ్రమలపై బెడిసి కొట్టిన ఈనాడు స్టోరీ.. రామోజీ షాక్స్‌!

Published Tue, May 7 2024 12:07 PM | Last Updated on Tue, May 7 2024 4:33 PM

Ksr Comments On AP Power Projects

ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయా? ఇంత అభివృద్దికి అడుగులు పడుతున్నాయా? నిజంగా ఏపీ ప్రజలకు వీటి గురించి పూర్తి వివరాలు తెలియవంటే ఆశ్చర్యం కాదు. కాని ద్వేష భావంతో, ప్రభుత్వంపై వ్యతిరేకత సృష్టించడం కోసం ఈనాడు మీడియా రాసిన ఒక స్టోరీ అందరూ చదవవలసిందే. బహుశా ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఇంత వివరంగా తన ప్రభుత్వం ఇన్ని కొత్త పరిశ్రమలను  తీసుకు వస్తున్న సంగతి ప్రజలకు చెప్పినట్లు అనిపించదు. శుక్రవారం నాడు ఈనాడు దినపత్రికలో "అంతా.. ఆ ఏడు చేపలకే" అంటూ ఒక స్టోరీ ఇచ్చారు. 

ఈనాడు లక్ష్యం ఏమిటంటే ఏడు పెద్ద కంపెనీలకు జగన్ లబ్ది చేకూర్చే యత్నం చేశారని, ఏపీలో వాటికి పలు భారీ పరిశ్రమలు స్థాపించేందుకు అవకాశం ఇచ్చారని ప్రజలు అనుకోవాలని వారు ఈ కథనాన్ని ఇచ్చారు. అది చదివిన తర్వాత నాకైతే జగన్‌పై మరింత గౌరవం పెరిగింది. ఎందుకంటే ఏపీకి ఇన్ని ముఖ్యమైన పరిశ్రమలు తీసుకు రావడానికి జగన్ చేసిన కృషి ఈ కథనం ద్వారా తెలిసింది. మరి ఇంతకాలం ఇదే ఈనాడు మీడియా ఏమని ప్రచారం చేసింది? ఏపీకి అసలు పరిశ్రమలు రావడం లేదని కదా! పారిశ్రామికవేత్తలు రావడం లేదని కదా? పెట్టుబడులు రావడం లేదని కదా! ఈనాడు తాజాగా ఇచ్చిన కథనం ప్రకారం 2.63 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఏడు కంపెనీలవారు చేపట్టారని. 

ఇది మంచిదే కదా? అసలే పరిశ్రమలే రావడం లేదని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు రావడం, అవన్ని పురోగతిలో ఉండడం స్వాగతించవలసిన విషయం కదా! ఈనాడు మీడియాకు, దాని అధిపతి రామోజీరావుకు ఏపీలో పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టులు రావడం ఇష్టం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కొన్ని ఎస్‌ఈజెడ్‌లు వచ్చాయి. అప్పుడు ఈ మీడియా కాని, తెలుగుదేశం కాని చేయని యాగీ లేదు. విదేశాలకు ఎగుమతులు చేసే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు వీటిని కేంద్రం ప్రతిపాదించింది. అందుకోసం భూములు సేకరిస్తుంటే విపరీతమైన వ్యతిరేక ప్రచారం చేశాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రకరకాలుగా అడ్డంకులు సృష్టించేవారు. సోనియాగాంధీ, చంద్రబాబు, సీబిఐ కుమ్మక్కై వాన్‌పిక్ రాకుండా చేశారు. చీరాల, రేపల్లె ప్రాంతంలో వాన్‌పిక్ పారిశ్రామికవాడను ఏర్పాటు చేయాలని పదమూడు వేల ఎకరాల భూములను ఆ సంస్థ కొనుగోలు చేసింది. అందులో ఎక్కువ భాగం వ్యవసాయానికి పనికిరాని భూములే. కొంత ప్రభుత్వ భూమి. కాని ఆ భూమిని సేకరించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను జగన్‌పై ఉన్న ద్వేషంతో వీరు కేసులలో ఇరికించి జైలులో పెట్టారు. 

ఆ భూములలో కొత్త పరిశ్రమలు పెట్టడానికి అడ్డు పడకుండా ఉంటే ఈపాటికి ఆ ప్రాంతం బ్రహ్మాండంగా తయారై ఉండేదేమో! వైఎస్ హయాంలో సూళ్లూరు పేట సమీపంలో శ్రీసిటీ పేరుతో ఒక పారిశ్రామికవాడ నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో ఇదే ఈనాడు మీడియా భూ సేకరణను దోపిడీ కింద అభివర్ణించి పలు కధనాలు రాసేది. సెజ్‌లలో ఉద్యోగాలు ఏవి అంటూ దిక్కుమాలిన విమర్శలు చేసేది. అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి వెనక్కి తగ్గకుండా శ్రీసిటీ ఏర్పాటుకు సహకరించారు. ఆ సంస్థ యజమానులు స్థానిక రైతుల సహకారంతో పారిశ్రామిక వాడను రూపొందించారు.

ఇప్పుడు అది నిజంగానే శ్రీసిటీ అయింది. అక్కడి ప్రజలకు ఎంతగానో మేలు చేస్తోంది. 2016లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇదే ఈనాడు మీడియా ఏమని రాసిందో తెలుసా?బతుకు చిత్రాన్ని మార్చిన సిరుల సీమ శ్రీసిటీ అని రాశారు. అంటే వైఎస్ అధికారంలో ఉంటే వ్యతిరేకించడం, చంద్రబాబు సీఎంగా ఉంటే భజన చేయడం. ఇదే ఈనాడు నైజం. ఇప్పుడు కూడా ఏపీలో కొత్త పరిశ్రమలు వస్తుంటే ఈ మీడియా ఏడ్చిపోతోంది. షిర్డి సాయి ఎలక్ట్రికల్ సంస్థ సుమారు 18 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను చేపట్టింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మీటర్లు పెట్టడం వీటిలో ఒకటి. 

కేంద్ర ప్రుభుత్వం చేసిన సూచనల ప్రకారం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే, దానివల్ల రైతులకు ఏదో నష్టం జరిగిపోతుందని ఇదే మీడియా ప్రచారం చేసింది. చంద్రబాబు నాయుడు అయితే ఈ మీటర్లు రైతులకు ఉరి అంటూ తప్పుడు ప్రచారం చేశారు. అయినా జగన్ వెనక్కి తగ్గలేదు. దానివల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, ప్రభుత్వం సరపరా చేసే విద్యుత్‌కు లెక్కలు ఉంటాయని, రైతులకు డబ్బు జమ చేస్తామని చెప్పి ముందుకు వెళ్లారు.

ఈ ప్రాజెక్టు పై ఎంత అబద్దపు ప్రచారం చేసినా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విద్యుత్ శాఖ అధికారులు వివరణలు ఇచ్చినా, ఈనాడు ఆరోపణలను ఖండించినా, వీరి పద్దతి మాత్రం మారలేదు. అదే సమయంలో ఈ మీటర్లు బిగించాలని చెప్పిన బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. ఆయన రెండు నాలుకల ధోరణికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనిపిస్తాయి. సీలేరు జల విద్యుత్ ప్రాజెక్టులో 478 కోట్లతో రెండు అదనపు యూనిట్లు స్థాపిస్తున్నారు. ఇది టెండర్ ఆధారంగానే ప్రాజెక్టుల కేటాయింపు జరుగుతుంది.

అయినా ఈనాడుకు ఇష్టం లేదు. అలాగే వైఎస్‌ఆర్ కడప జిల్లా సోమశిల వద్ద 900 మెగావాట్ల, ఎర్రవరం వద్ద 1200 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. కంపెనీ వారే పెట్టుబడి పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇందులో రామోజీకి వచ్చిన బాధ ఏమిటో తెలియదు. రామోజీ ఫిలింసిటీ స్థాపించినప్పుడు వేల ఎకరాలను కొనుగోలు చేశారు. దానికి ఎవరు అనుమతించారు. అసలు ఆ ప్రాజెక్టు స్థాపనకు ఏమైనా టెండర్ పిలిచారా? అయినా స్థాపించలేదా? అందులో తప్పు లేదు.

కాని ఇతర కంపెనీలు ఏవైనా పరిశ్రమలు పెడుతుంటే మాత్రం ఈ మీడియా అడ్డం పడుతుంటుంది. ఈనాడు మీడియా అభివృద్ది నిరోధకంగా మారింది. విచిత్రం ఏమిటంటే షిర్డిసాయి ఎలక్టికల్ కంపెనీ తెలుగుదేశం పార్టీకి నలబై కోట్ల రూపాయల విరాళం ఇచ్చింది. ఈ విషయం మాత్రం గోప్యంగా ఉంచారు. అదే మెఘా కంపెనీ వైఎస్సార్సీపీకి 37 కోట్ల విరాళం ఇచ్చింది. దానిని మాత్రం రాసేశారు. మరి అదే సంస్థ తెలుగుదేశంకు పాతిక కోట్లు ఇచ్చింది. దానిని కప్పిపుచ్చారు. అసలు గుర్తింపేలేని జనసేనకు ఐదు కోట్లు ఇచ్చారు. మరి దీనిని ఏమంటారో రామోజీనే చెప్పాలి. 

జిందాల్ కంపెనీ 42500 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చింది. కడప స్టీల్ ప్లాంట్, రామాయపట్నం వద్ద రెండు కాప్టివ్ బెర్తుల నిర్మాణం, అనంతపురం, వైఎస్‌ఆర్ కడప జిల్లా. నంద్యాల ప్రాంతాలలో 2500 మెగావాట్ల సౌర విద్యుత్ పదివేల మెగావాట్ల పవన విద్యుత్, 1500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులను ఈ సంస్థ చేపడితే దానిపైన విమర్శలు చేశారు. వీరికి మైనింగ్ లీజులు కేటాయించారన్నది ఈనాడు ఏడుపు. ఖనిజం లేకుండా స్టీల్ ప్లాంట్ ఎలా వస్తుందో వీరే చెప్పాలి.

మెఘా కంపెనీ 30445 కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపడుతోంది. సీలేరు వద్ద 12264 కోట్లతో పిఎస్‌పి ప్రాజెక్టును ఈ సంస్థ స్థాపిస్తోంది. అది వీరికి కడుపునొప్పిగా మారింది. జెన్‌కో టెండర్ ద్వారానే దీనిని కేటాయించినా, తప్పే నట. మచిలీపట్నం పోర్టు పనులు కూడా టెండర్ ద్వారానే ఈ సంస్థ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టును, జల విద్యుత్ ప్రాజెక్టును కూడా నిర్మిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఈ కంపెనీ అమలు చేస్తోంది. ఇంత అభివృద్ది జరుగుతుంటే, ఈనాడుకు ఇదంతా మింగుడుపడడం లేదు. 

అందుకే ఇంత బురదచల్లుతూ స్టోరీలు ఇస్తోంది. విశాఖలో అదానికి డేటా సెంటర్ నిర్మాణానికి భూమి ఇవ్వడం కూడా నేరమేనట. అదాని బిజినెస్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే వీరు కుళ్ళుతున్నారు. అదే అమరావతి గ్రామాలలో సింగపూర్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములను చంద్రబాబు ఇస్తే మాత్రం గొప్ప విషయం అని రామోజీ ప్రచారం చేశారు. తీరా చూస్తే ఈ కంపెనీలను పట్టుకువచ్చిన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలతో పదవి పోగొట్టుకున్నారు. అలాగే దుబాయికి చెందిన ఒక సంస్థ పేరుతో వంద ఎకరాలు ఆస్పత్రి నిమిత్తం ఇచ్చారు. ఆస్పత్రి రాలేదు కాని, ఆ కంపెనీ యజమాని అక్కడ చేసిన నేరాలకు జైలుకు వెళ్లారు.

ఇలాంటి వాళ్లు చంద్రబాబుకు స్నేహితులు. దేశంలోనే పెద్ద కంపెనీలకు వివిధ ప్రాజెక్టులను అప్పగిస్తే నేరం చేసినట్లు ఈనాడు రామోజీ రాయించేస్తున్నారు. అంటే ఈ కంపెనీలు ఏవీ రాకుండా ఉంటే, ఏపీలో ఉద్యోగాలు పెరగకుండా ఉంటే వీరికి సంతోషం అన్నమాట. 

ఈ ప్రాజెక్టులను కనుక చంద్రబాబు టైమ్‌లో చేపట్టి ఉంటే అబ్బో అంత గొప్ప, ఇంత గొప్ప అని ప్రచారం చేసేవారు. రామాయపట్నం ఓడరేవు వద్ద ఇండోసోల్ సంస్థ సోలార్‌పానెల్ ప్రాజెక్టును ఆరంభిస్తే, ఎంత దారుణమైన కథనాలు ఈనాడు మీడియా ఇచ్చిందో గమనిస్తే వీళ్లు అసలు మనుషులేనా అన్న అనుమానం వస్తుంది. 43 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ కంపెనీ ఏర్పాటు అవుతుంటే సంతోషించాల్సింది పోయి విషం చిమ్ముతున్నారు. పైగా వారి ఖర్చుతో భూములు కొనుగోలు చేస్తుంటే వీరికి తీటగానే ఉంది.

అక్కడ రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి భూములు అమ్ముతున్నారు. అది వీరికి గిట్టడం లేదన్నమాట. అలాగే అరవిందో సంస్థ పలు ప్రాజెక్టులను నిర్మిస్తోంది. వాటిపై కూడా విషం చిమ్మారు. ఈ ప్రాజెక్టులు అన్నీ ప్రజలకు ఉపయోగపడేవి. ప్రభుత్వం ఖర్చు కాకుండా, ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేవి. అయినా ఈనాడు మీడియా అదేదో ఘోరం జరిగినట్లు దారుణమైన కథనాలు ప్రచురిస్తోంది. ఈ మొత్తం కధనం చదివితే ఇన్ని వివరాలను నెగిటివ్‌గా ఇచ్చినా ఈ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని తనకు తెలియకుండానే ఈనాడు మీడియా అంగీకరించింది. నిజంగా ఇవన్ని ఆచరణలోకి వస్తే ఏపీకి ఎంతో మేలు జరుగుతుంది. అందుకు ముఖ్యమంత్రి జగన్‌ను అభినందించాలి.








– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement