
అమరావతి,సాక్షి: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు రాజ్యసభ సీటు దాదాపూ ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.
మంగళవారం సీఎం చంద్రబాబు, కేంద్రహోమంతి అమిత్‌షా భేటీలో ఖరారైనట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేందుకు చంద్రబాబు సుమఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.
అధ్యక్ష పదవికి రాజీనామా చేసి
ఇటీవల, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai) ఆ పదవికి రాజీనామా చేశారు. త్వరలో రాష్ట్ర కొత్త అధ్యక్షుడ్ని బీజేపీ నియమిస్తుందని ఆయన తెలిపారు. అయితే ఆయన రాజీనామాకు వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలేనని తెలుస్తోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తుకు సిద్ధమైంది. అయితే 2023లో అన్నాడీఎంకే నేతలను అన్నామలై తీవ్రంగా విమర్శించారు. తాజా పొత్తు నేపథ్యంలో అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించాలని అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి బీజేపీ అధిష్టానానికి షరతు విధించినట్లు సమాచారం. అన్నాడీఎంకే షరతు మేరు అన్నామలైను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినట్లు సమాచారం.
ఇక ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.ఈ సీటును అన్నామలైకు ఇచ్చేలా కమలం పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.