మనం ఎవరిమైనా అమెరికాకు వెళ్లినప్పుడో, ప్రత్యేకంగా న్యూయార్క్ నగరానికి వెళ్లినప్పుడో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని అనుకుంటాం. మనం ఆ నగరానికి వెళ్లామన్న సంగతి తెలిసిన స్నేహితులు కూడా లిబర్టి విగ్రహాన్ని చూసి వచ్చావా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అమెరికానే వెళ్లనవసరం లేదు. ఆ స్థాయి విగ్రహాన్ని చూడాలంటే విజయవాడ నగరాన్ని సందర్శిస్తే చాలు. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం అంతకన్నా గొప్పగా కనిపిస్తుంంది. కృష్ణానది ఆవల నుంచి సుమారు పది, పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహం దర్శనమిస్తుంది.
దేశ రాజ్యాంగ నిర్మాతగా వాసికెక్కిన డాక్టర్ BR అంబేడ్కర్ భారీ విగ్రహం అది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా, ఒక ప్రఖ్యాత టూరిస్టు కేంద్రంగా రూపుదిద్దుకునే అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుంది. ఇది వినడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది! మూడేళ్ల క్రితం వరకు విజయవాడలో ఇంత పెద్ద టూరిస్ట్ స్పాట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని ఒక నేత సమర్ధతకు నిదర్శనంగా ఇది రూపొందింది. ఆయన ఎవరో కాదు.. ఏపీ ముఖ్యమంత్రి YS జగన్‌మోహన్ రెడ్డి అని వేరే చెప్పనవసరం లేదు.
కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా మూడు అంతస్థులలో అంబేడ్కర్‌కు చెందిన వివిధ చిత్రపటాలు, డాక్యుమెంటరీలు, ఆయన గురించి తెలియచేసే సినిమాను వేయడానికి వీలుగా ఒక హాలు, ఎన్నో విశేషాలు అందులో కనిపిస్తాయి. 206 అడుగుల ఎత్తున తయారైన ఈ విగ్రహ ప్రాంగణం అంతా రంగు, రంగుల కాంతుల మధ్య అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. అక్కడే పలు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. నగర ప్రజలకే కాకుండా, విజయవాడ సందర్శించే టూరిస్టులకు కూడా అదొక విజ్ఞాన, వినోద కేంద్రంగా భాసిల్లబోతోంది. దేశ ప్రజలకు స్వేచ్చను, ప్రత్యేకించి బలహీనవర్గాలకు ఎంతో స్పూర్తిని ఇచ్చే ఈ విగ్రహ ప్రతిష్ట వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.
తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటికీ, దానిని మించిన రీతిలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఢిల్లీలో విగ్రహం తయారీతో పాటు హంగులను స్థానికంగా హనుమాన్ జంక్షన్‌కు చెందిన శిల్పిద్వారా చేయించడం కూడా హర్షించదగిన అంశమే. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నారు. అందులో వివిధ బలహీనవర్గాల ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెబుతున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలియజేసినట్లయింది. కేవలం విగ్రహంతోనే అభివృద్ది అయిపోతుందని కాదు. కాని ఆ విగ్రహాన్ని చూస్తే వచ్చే చైతన్యం, అనుభూతి చెప్పనలవికానిది.
ఏదో కొద్ది మంది అగ్రవర్ణ దురహంకారులకు తప్ప, సమానత్వం కోరుకునే ఎవరికైనా ఈ విగ్రహం చూడగానే ఒక అనుభూతి కలుగుతుంది. ఏపీలోని వివిద జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ విగ్రహాన్ని వీక్షించనున్నారు. గతంలో అమరావతి రాజధాని పేరుతో ఒక భ్రమరావతిని సృష్టించాలని భావించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడో మారుమూల, ఎవరికి కనిపించని చోట అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని చూశారు.
ఇందు కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయం చేశారు. అయినా ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. చంద్రబాబు హయాంలో చాలామంది అంబేడ్కర్ అభిమానులు ఎవరికి కనిపించని చోట విగ్రహం పెట్టడమేమిటని విమర్శించేవారు. అయినా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదు. చిత్తశుద్దితో చేసి ఉంటే అక్కడ విగ్రహం తయారై ఉండేదేమో! మొక్కుబడి కార్యక్రమంగా సాగించారన్న భావన ఉంది.
తదుపరి వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కన్నా, విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలనే కాక, దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకర్షించవచ్చని భావించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరుగాంచిన అంబేడ్కర్ విగ్రహంతో పాటు విజయవాడ నగరవాసులకు ఆహ్లాదంగా ఉండేలా అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తలపెట్టారు. మూడేళ్ల నుంచి అందుకు సన్నాహాలు సాగించారు.
నిజానికి ఆరు నెలల క్రితమే ఈ పనులు పూర్తి చేయాలని అనుకున్నారు కాని, సాధ్యపడలేదు. అయినా పనుల వేగం పెంచి జనవరి 19న ప్రారంభోత్సవానికి రంగం సిద్దం చేశారు. ఇది జగన్ సమర్ద నాయకత్వ లక్షణానికి దర్పణం పడుతుంది. 'చెప్పాడంటే చేస్తాడంతే!' అన్న నమ్మకానికి అనువుగా ఈ విగ్రహం ఏర్పాటు పూర్తి అయింది.
సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఏర్పాటు అవుతోంది. ఇప్పటికే విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద, కనకదుర్గమ్మ గుడి వద్ద భారీ వంతెనలను పూర్తి చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణలంక ప్రాంతంలో నివసించే వేలాది మంది బీద ప్రజలకు పెద్ద ఊరట కల్పిస్తూ.. నది అంచున రిటైనింగ్ వాల్ నిర్మించింది. కిలోమీటర్ల కొద్ది నిర్మించిన ఈ వాల్ కూడా విజయవాడ అభివృద్ధికి మారుపేరుగా కనిపిస్తుంది.
పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేని విశిష్టమైన పనులను చేపట్టి, పూర్తి చేయడం ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల మన్ననలు పొందగలుగుతున్నారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అందరికి ఆహ్వానం పలుకుతూ జగన్ ఇచ్చిన సందేశం కూడా హృద్యంగా ఉంది. ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశగతిన మార్చిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని ఆయన ప్రశంసించారు. పెత్తందార్ల భావాలపై తిరుగుబాటుకు స్పూర్తి ఇచ్చేలా అంబరాన్ని తాకేలా ఈ సమాజిక న్యాయ మహాశిల్పం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) ఏర్పాటు అయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజలకు తన చేతితో ఒక దిశను చూపుతున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం నిజంగానే విజయవాడ ప్రతిష్టను అకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంత బ్రహ్మాండంగా విగ్రహ ప్రారంభోత్సవం జరుగుతుంటే నిత్యం ఏడ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా యధా ప్రకారం పెత్తందారి, అగ్రవర్ణ దురహంకార మనస్తత్వంతో చెత్త కథనాలను ప్రచురించింది.
నీచత్వానికి పరాకాష్టగా రామోజీ, రాధాకృష్ణలు వ్యవహరిస్తూ తమ మీడియాను దిగజార్చుతూ ఈ రోజు కూడా ఛండాలపు స్టోరీలు ఇచ్చి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. సుమారు నాలుగు వందల కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.
-కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment