establishment
-
కొత్తగా 85 కేవీలు, 28 ‘నవోదయ’లు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే ఒక కేంద్రీయ విద్యాలయ విస్తరణకు అంగీకారం తెలిపింది. మంత్రివర్గం శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైంది. పలు నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గం నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలియజేశారు. కొత్తగా ఏర్పాటు కానున్న కేంద్రీయ విద్యాసంస్థలతో 82 వేల మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని, వారికి నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,256 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో ఒకటి మాస్కోలో, మరొకటి ఖాట్మాండులో, ఇంకోటి టెహ్రాన్‌లో ఉన్నాయి. ఢిల్లీ మెట్రో నాలుగో దశలో భాగంగా 26.46 కిలోమీటర్ల పొడవైన రిథాలా–కుండ్లీ మార్గానికి సైతం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. -
వైద్యం.. వైవిధ్యం..
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు.. నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్‌కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు. ఒత్తిడిని జయించేందుకు.. ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.సిబ్బందికి ఉపయుక్తం.. ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్‌కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.లాభనష్టాల బేరీజు లేకుండా.. ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్‌ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్‌ను వినియోగించుకుంటున్నారు. – డా.కిషోర్‌రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్ -
Ugadi 2024: నూతన సంవత్సరంలో.. 2024-25 కాల నిర్ణయమిదే..
ఉగాదితో కొత్త తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలుకుతాం. ఇది తెలుగువాళ్ల పండుగ. ఈ తెలుగు సంవత్సరాదిలో మన రాశి ఎలా ఉంది. ఈ ఏడాది కర్తరీలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? ఆ రోజు నవనాయక ఫలితాలు ఎలా ఉంటాయి? వంటివి చూసుకుని గానీ కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెట్టారు. మరీ ఈ ఏడాది డొల్లు కర్తరీ ఎప్పుడు ప్రారంభమయ్యిందంటే..? డొల్లు కర్తరీ ప్రారంభం.. ది.04.05.2024 ప.12:35లకు చైత్ర బహుళ ఏకాదశీ శనివారం రోజు డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. పెద్ద కర్తరీ ప్రారంభం.. ది.05.11.2024, ఉ.10:27లకు వైశాఖ శుద్ధ చవితి శనివారం రోజు నిజకర్తరీ (పెద్ద కర్తరీ) ప్రారంభం. కర్తరీ త్యాగం.. ది.28.05.2024 రా.7:21 వైశాఖ బహుళ పంచమి తత్కాల షష్ఠి మంగళవారం రోజు కర్తరీ త్యాగం. ‘‘మృద్దారు శిలాగహకర్మాణివర్జయేత్’’ మట్టి, కర్ర, రాయి ఉపయోగించి చేయు గృహకర్మలు ప్రారంభించుటకు కర్తరీకాలము సరియగునది కాదు. పై సూత్రం ఆధారంగా వాస్తుకర్మలు నూతనంగా ఈ రోజు నుండి చేయరాదు. దీనికి వాస్తుకర్తరీ అని పేరు. శంకుస్థాపన, ద్వారం ఎత్తుట మరియు పాకలు, షెడ్లు, పెంకుటిళ్ళు, కప్పు విషయమై పని ప్రారంభించడం శ్రేయస్కరం కాదు. రాబోవు విశ్వావసు నామ సంవత్సరం (2025–26) కర్తరీ నిర్ణయము 4 మే 2025 వైశాఖ శుద్ధ సప్తమి సుమారు సా.గం.7:00లకు డొల్లు కర్తరీ ప్రారంభం. 11 మే 2025 వైశాఖ శుద్ధ చతుర్దశీ సుమారు సా.గం.5:00లకు పెద్ద కర్తరీ ప్రారంభం. 28 మే 2025 జ్యేష్ఠ శుద్ధ విదియ రోజు సుమారు రా.గం.2:00లకు కర్తరీ త్యాగం. నవనాయక ఫలితాలు (2024– 2025) రాజు కుజుడు: కుజుడు రాజయిన సంవత్సరం అగ్నిభయం, వాయువు చేత అగ్ని రెచ్చ గొట్టబడడం, గ్రామ పట్టణాలలో తరచు అగ్ని భయములు ఉండును. వర్షములు ఉండవు. ధరలు అధికం అవుతాయి. రాజులకు యుద్ధములుండును. మంత్రి శని: వర్షపాతము తక్కువ. పంటలు తక్కువగా ఉంటాయి. సమాజంలో ఎక్కువ పాపకర్మలు ఇబ్బందులు సృష్టిస్తాయి. అన్ని వ్యవహారములు మందఫలములు ఇస్తాయి. తరచుగా సమాజంలో నిరంతరం ఆపదలు ఉంటాయి. గోవులకు ఇబ్బంది. తక్కువ స్థాయిలో ఉన్నవారు అందరూ అభివృద్ధిలోకి వస్తారు. సేనాధిపతి శని: సేనలకు రాజుకు సయోధ్య ఉండదు. ప్రజలు అధర్మ వర్తనులు అగుదురు. నల్లధాన్యములు ఫలించును. రాజులు అధర్మవర్తనులు అగుదురు. ప్రజలు పాప కర్మలు అధికం చేస్తారు. రవాణా సౌకర్యములలో యిబ్బంది ఉంటుంది. సస్యాధిపతి కుజుడు: కందులు, మిర్చి, వేరుశనగ, ఎర్రధాన్యజాతులు, ఎర్ర భూములు మంచి ఫలితాలనిస్తాయి. మెట్ట ధాన్యములు బాగా ఫలిస్తాయి. మాగాణి పంటలు, మధ్యమ ఫలితాలు యిస్తాయి. ధాన్యాధిపతి చంద్రుడు: గోవులు సమృద్ధిగా పాలు ఇచ్చును. వ్యాధులు ఉండవు. దేశము సువృష్టితో సుభిక్షంగా ఉండును. వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, వెండి, బంగారం, బియ్యం, చెరుకు, పంచదార ధరలు సరసముగా ఉండును అని గ్రంథాంతర వచనము. అర్ఘాధిపతి శని: అర్ఘాధిపతి శని అయినచో మహాభయములు కలుగును. వర్షములు తగ్గును. రోగ, చోర, అగ్ని భయములు కలుగును. ఆహార సౌకర్యములు తగ్గును. ప్రజలలో భయము పెరుగును. పాఠాంతరంలో నల్లభూములు, నల్లధాన్యములు, నువ్వులు, మినుములు, బొగ్గు, సీసం, చర్మవస్తువులు, ఇనుము, తారు, నల్లమందు ధరలు సరసముగా ఉండును. మేఘాధిపతి శని: వర్ష ప్రతిబంధకములు ఎక్కువ. రాజులకు ధనము లోటు ఉండును. చలిబాధలు ప్రజలకు జ్వరములు, ఆహార ధాన్యం కొరత. వ్యాధులు ప్రబలును. నల్ల ధాన్యములు బాగా పండును. రసాధిపతి గురువు: గురువు రసాధిపతి అయినచో చందన, కర్పూర, కంద మూలములు సులభముగా దొరకును. కుంకుమ పువ్వు మొదలగు ఇతర రస వస్తువులు దొరకవు. అన్ని పంటలకు అనుకూల వర్షములు ఉంటుంది. వృక్షజాతులు ఫలించును. ఆరోగ్యములు బాగుంటాయి. పాఠాంతరంలో బంగారం, వెండి, నెయ్యి, పట్టు, పత్తి, బెల్లం, పంచదార, చెరుకు ధరలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. నీరసాధిపతి కుజుడు: పుష్ప వృక్షములు, ఫల వృక్షములు, ఫల పుష్పాదులతో కూడి ఉండును. బంగారం, మణులు, రక్తచందనము, కట్టెలు వీటికి ధరలు హెచ్చు తగ్గులు ఉంటాయి. మిర్చి, పొగాకు, ఇనుము, ఉక్కు, యంత్ర పరికరములు, రాగి, ఇత్తడి, కంచు మొదలగు వాటి ధరలు పెరిగి నిలబడును. దానిమ్మ వంటివి బాగా ఫలించును. ఇవి చదవండి: Ugadi 2024: శుభముహూర్తాలు, శుభ ఘడియల వివరాలివిగో..! -
స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్: విజయవాడ ప్రతిష్ట ఆకాశమంత ఎత్తుకు..
మనం ఎవరిమైనా అమెరికాకు వెళ్లినప్పుడో, ప్రత్యేకంగా న్యూయార్క్ నగరానికి వెళ్లినప్పుడో స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడాలని అనుకుంటాం. మనం ఆ నగరానికి వెళ్లామన్న సంగతి తెలిసిన స్నేహితులు కూడా లిబర్టి విగ్రహాన్ని చూసి వచ్చావా అని ప్రశ్నిస్తారు. ఇప్పుడు అమెరికానే వెళ్లనవసరం లేదు. ఆ స్థాయి విగ్రహాన్ని చూడాలంటే విజయవాడ నగరాన్ని సందర్శిస్తే చాలు. ఇక్కడ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విగ్రహం అంతకన్నా గొప్పగా కనిపిస్తుంంది. కృష్ణానది ఆవల నుంచి సుమారు పది, పదిహేను కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ విగ్రహం దర్శనమిస్తుంది. దేశ రాజ్యాంగ నిర్మాతగా వాసికెక్కిన డాక్టర్ BR అంబేడ్కర్ భారీ విగ్రహం అది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇంత ఎత్తైన ఆయన విగ్రహం మరొకటి లేదని ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. విజయవాడ నగరానికి ఒక శాశ్వత చిరునామాగా, ఒక ప్రఖ్యాత టూరిస్టు కేంద్రంగా రూపుదిద్దుకునే అంబేడ్కర్ విగ్రహ ప్రాంగణం ఉన్న స్వరాజ్ మైదానం, ఇప్పుడు స్వేచ్చకు, సమానత్వానికి, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలవబోతుంది. ఇది వినడానికి ఎంత అద్భుతంగా అనిపిస్తుంది! మూడేళ్ల క్రితం వరకు విజయవాడలో ఇంత పెద్ద టూరిస్ట్ స్పాట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కాని ఒక నేత సమర్ధతకు నిదర్శనంగా ఇది రూపొందింది. ఆయన ఎవరో కాదు.. ఏపీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి అని వేరే చెప్పనవసరం లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రమే కాకుండా మూడు అంతస్థులలో అంబేడ్కర్‌కు చెందిన వివిధ చిత్రపటాలు, డాక్యుమెంటరీలు, ఆయన గురించి తెలియచేసే సినిమాను వేయడానికి వీలుగా ఒక హాలు, ఎన్నో విశేషాలు అందులో కనిపిస్తాయి. 206 అడుగుల ఎత్తున తయారైన ఈ విగ్రహ ప్రాంగణం అంతా రంగు, రంగుల కాంతుల మధ్య అత్యంత ఆకర్షణీయంగా తయారైంది. అక్కడే పలు ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. నగర ప్రజలకే కాకుండా, విజయవాడ సందర్శించే టూరిస్టులకు కూడా అదొక విజ్ఞాన, వినోద కేంద్రంగా భాసిల్లబోతోంది. దేశ ప్రజలకు స్వేచ్చను, ప్రత్యేకించి బలహీనవర్గాలకు ఎంతో స్పూర్తిని ఇచ్చే ఈ విగ్రహ ప్రతిష్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. తెలంగాణలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించినప్పటికీ, దానిని మించిన రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఢిల్లీలో విగ్రహం తయారీతో పాటు హంగులను స్థానికంగా హనుమాన్ జంక్షన్‌కు చెందిన శిల్పిద్వారా చేయించడం కూడా హర్షించదగిన అంశమే. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక సాధికార యాత్రలు నిర్వహిస్తున్నారు. అందులో వివిధ బలహీనవర్గాల ప్రజలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియచెబుతున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ బలహీనవర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని తెలియజేసినట్లయింది. కేవలం విగ్రహంతోనే అభివృద్ది అయిపోతుందని కాదు. కాని ఆ విగ్రహాన్ని చూస్తే వచ్చే చైతన్యం, అనుభూతి చెప్పనలవికానిది. ఏదో కొద్ది మంది అగ్రవర్ణ దురహంకారులకు తప్ప, సమానత్వం కోరుకునే ఎవరికైనా ఈ విగ్రహం చూడగానే ఒక అనుభూతి కలుగుతుంది. ఏపీలోని వివిద జిల్లాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఈ విగ్రహాన్ని వీక్షించనున్నారు. గతంలో అమరావతి రాజధాని పేరుతో ఒక భ్రమరావతిని సృష్టించాలని భావించిన ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడో మారుమూల, ఎవరికి కనిపించని చోట అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని చూశారు. ఇందు కోసం కొన్ని కోట్ల రూపాయల వ్యయం చేశారు. అయినా ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. చంద్రబాబు హయాంలో చాలామంది అంబేడ్కర్ అభిమానులు ఎవరికి కనిపించని చోట విగ్రహం పెట్టడమేమిటని విమర్శించేవారు. అయినా అప్పట్లో చంద్రబాబు పట్టించుకోలేదు. చిత్తశుద్దితో చేసి ఉంటే అక్కడ విగ్రహం తయారై ఉండేదేమో! మొక్కుబడి కార్యక్రమంగా సాగించారన్న భావన ఉంది. తదుపరి వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్ట కన్నా, విజయవాడ నడిబొడ్డున ప్రతిష్టించడం ద్వారా రాష్ట్ర ప్రజలనే కాక, దేశ వ్యాప్తంగా అభిమానులను ఆకర్షించవచ్చని భావించారు. ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా పేరుగాంచిన అంబేడ్కర్ విగ్రహంతో పాటు విజయవాడ నగరవాసులకు ఆహ్లాదంగా ఉండేలా అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టాలని తలపెట్టారు. మూడేళ్ల నుంచి అందుకు సన్నాహాలు సాగించారు. నిజానికి ఆరు నెలల క్రితమే ఈ పనులు పూర్తి చేయాలని అనుకున్నారు కాని, సాధ్యపడలేదు. అయినా పనుల వేగం పెంచి జనవరి 19న ప్రారంభోత్సవానికి రంగం సిద్దం చేశారు. ఇది జగన్ సమర్ద నాయకత్వ లక్షణానికి దర్పణం పడుతుంది. 'చెప్పాడంటే చేస్తాడంతే!' అన్న నమ్మకానికి అనువుగా ఈ విగ్రహం ఏర్పాటు పూర్తి అయింది. సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్మృతివనం ఏర్పాటు అవుతోంది. ఇప్పటికే విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద, కనకదుర్గమ్మ గుడి వద్ద భారీ వంతెనలను పూర్తి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృష్ణలంక ప్రాంతంలో నివసించే వేలాది మంది బీద ప్రజలకు పెద్ద ఊరట కల్పిస్తూ.. నది అంచున రిటైనింగ్ వాల్ నిర్మించింది. కిలోమీటర్ల కొద్ది నిర్మించిన ఈ వాల్ కూడా విజయవాడ అభివృద్ధికి మారుపేరుగా కనిపిస్తుంది. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు చేయలేని విశిష్టమైన పనులను చేపట్టి, పూర్తి చేయడం ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల మన్ననలు పొందగలుగుతున్నారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అందరికి ఆహ్వానం పలుకుతూ జగన్ ఇచ్చిన సందేశం కూడా హృద్యంగా ఉంది. ఆకాశమంతటి వ్యక్తిత్వంతో దేశగతిన మార్చిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేడ్కర్ అని ఆయన ప్రశంసించారు. పెత్తందార్ల భావాలపై తిరుగుబాటుకు స్పూర్తి ఇచ్చేలా అంబరాన్ని తాకేలా ఈ సమాజిక న్యాయ మహాశిల్పం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) ఏర్పాటు అయిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు తన చేతితో ఒక దిశను చూపుతున్నట్లుగా అంబేడ్కర్ విగ్రహం నిజంగానే విజయవాడ ప్రతిష్టను అకాశమంత ఎత్తుకు తీసుకు వెళ్లిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంత బ్రహ్మాండంగా విగ్రహ ప్రారంభోత్సవం జరుగుతుంటే నిత్యం ఏడ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా యధా ప్రకారం పెత్తందారి, అగ్రవర్ణ దురహంకార మనస్తత్వంతో చెత్త కథనాలను ప్రచురించింది. నీచత్వానికి పరాకాష్టగా రామోజీ, రాధాకృష్ణలు వ్యవహరిస్తూ తమ మీడియాను దిగజార్చుతూ ఈ రోజు కూడా ఛండాలపు స్టోరీలు ఇచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తమ విద్వేషాన్ని వెళ్లగక్కారు. సుమారు నాలుగు వందల కోట్ల వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ కీర్తి శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఈ యుగం బాబాసాహెబ్‌దే!
ఇవ్వాళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను భుజానికి ఎత్తుకుంటున్నారు. ఇందులో కొందరు అంబేడ్కర్ చెప్పిన సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించేవారూ ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... బాబాసాహెబ్ ఏం చెప్పారో దానికి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీయ చూస్తున్నవారూ ఉండటం! విభిన్న భౌగోళిక ప్రాంతాలూ, అనేక జాతులూ, మతాలూ, కులాలూ, భాషలూ ఉన్న భారతదేశం సమాఖ్య లౌకిక రాజ్యంగా విలసిల్లాలని అంబేడ్కర్ ఆశించారు. ఆ మేర రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కానీ నేడు కొందరు పాలకులు, ప్రభుత్వాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడిచే విధంగా అడుగులు వేస్తుండడం విషాదకరం. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, సిద్ధాంత అన్వ యం గురించి ముఖ్యంగా భారత రాజ్యాంగ నిర్మాణం గురించి, కుల నిర్మూలనా సిద్ధాంత ప్రతిపాదన గురించి చర్చ జరుగుతోంది. ఆయన తన జీవిత కాలంలో విస్తృతంగా రచనలు చేశారు. ఆయన మేధో సంపన్నత ఆయన గవేషణ పద్ధతిలోనే ఉంది. ముఖ్యంగా వేదాలను పరిశీలించిన పద్ధతి వినూత్నమైనది, విప్లవాత్మకమైనది. ఎందుకంటే అంతకుముందు వేదాల గురించి పరిశోధించిన మాక్స్ ముల్లర్, సురేంద్ర దాస్ గుప్తా, సర్వేపల్లి రాధాకష్ణన్ వంటివారు ఎవరూ కూడా వేదాలు అశాస్త్రీయమైన భావాలతో రూపొందాయని చెప్ప లేకపోయారు. ముఖ్యంగా శంకరాచార్యులు, రామా నుజాచార్యులు, మధ్వాచార్యులు తమ తమ కోణాల్లో వేద సమర్థుకులుగా భాష్యం రాసు కున్నారు. అంబేడ్కర్ ఒక్కరే వేదాలను, భగవద్గీ తను హింసాత్మక గ్రంథాలుగా పేర్కొన్న సాహస వంతుడు. అలాగే ఆయన ‘శాక్రెడ్ ఆఫ్ ఈస్ట్’ పేరుతో వచ్చిన 50 వాల్యూమ్స్ చదివి రాసుకున్న నోట్స్ ఎంతో విలువైనది. దాన్ని ముద్రిస్తే ప్రపంచ మూల తత్త్వ శాస్త్రానికి ఎంతో విలువైన సమా చారం జోడించగల గ్రంథాలు అందుబాటులోకి వస్తాయి. ఆయన తాత్త్విక దర్శనాలు శాస్త్రీయమైన చర్చతో కూడి ఉంటాయి. మార్క్స్, ఎంగెల్స్‌లు రాసిన ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’, ఎంగెల్స్ రాసిన ‘డైలెక్టిక్స్ ఆఫ్ నేచర్’, మోర్గాన్ రాసిన ‘ఏన్షియంట్ సొసైటీ’ వంటి వాటి స్థాయిలో... ఆయన తాత్విక, సామాజిక, రాజకీయ చర్చలు ఉంటాయి. వేదాల గురించి అంబేడ్కర్ ఇలా అన్నారు. ‘వేదాలు హిందువుల మతసాహిత్యంలో అత్యు న్నత స్థానాన్ని ఆక్రమించుకున్నాయని చెప్పడం వాటిని గురించి చాలా తక్కువ చెప్పినట్టే అవుతుంది. వేదాలు హిందువుల పవిత్ర సాహిత్యం అని చెప్పినా సరిపోనిదే అవుతుంది. ఎందుచేతనంటే అవి తప్పు పట్టడానికి వీలు లేనివి. వాటిని అపౌరు షేయాలని నమ్ముతారు కాబట్టి’. అంటే వేదాలు మానవ కల్పితాలు కావు అని అర్థం. మానవ కల్పితాలు కాకపోవడం వల్ల సాధారణంగా ప్రతి మానవుడు చేసే తప్పిదాలకు, దోషాలకు, పొరపాట్లకు అవి అతీతంగా ఉంటాయి. అందుచేతనే అవి అమోఘమైనవిగా భారతీయులు నమ్ముతున్నారు. అయితే అంబేడ్కర్ వేదాలను మానవ మాత్రులైన రుషులే రచించారని చెప్పారు. ఒకరిని ద్వేషించే, అపహాస్యం చేసే, హింసను ప్రోత్సహించే ఏ గ్రంథా లైనా అవి విశ్వజనీనమైనవి కావు అని అంబేడ్కర్ చెప్పారు. అంబేడ్కర్ ప్రతిభ బహుముఖీనం. ప్రధానంగా ఆయన తాత్వికులు. ముందు తన్ను తాను తెలుసుకున్నారు. తర్వాత తన చుట్టూ ఉన్న సమా జాన్ని కూడా తెలుసుకున్నారు. తనకూ సమాజానికీ ఉండే అంతఃసంబంధాలను అధ్యయనం చేశారు. సమాజానికి అంతః ప్రకృతి అయిన రాజ్యాన్నీ, దాని అంగమైన ప్రభుత్వాన్నీ, వాటి పునాదుల్నీ పరిశోధించారు. వాటికీ తనకూ ఉండే వైరుధ్యాలనూ బయటకు తీశారు. ఈ దృష్టితో చూసిన ప్పుడు భారతావనిలో బుద్ధుని తర్వాత అంత లోతైన నైతిక వ్యక్తిత్వం అంబేడ్కర్‌దే అవుతుంది. ఆయన సామాజిక జీవితానికి పునాది బుద్ధుని బోధనా తత్వంలోనే అంతర్లీనంగా ఉంది. ఆయన బోధనలో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ, ఆచరణ, దుఃఖ నివారణ, సంఘ నిర్మాణం, నైతికత, త్యాగం, ప్రధానమైనవి. ఆయన ఎంతో నిబద్ధంగా జీవించారు. రాత్రి పది గంటలకు ఆయన అన్నం తినేటప్పుడు పుస్తకాల జ్వలనంతో పాటు ఆకలి మంట కూడా రగులుతూనే ఉండేది. లండన్ వీధుల్లో అర్ధాకలితో తిరిగారు. ఆయన ధనాన్ని జ్ఞానానికి ఎక్కువ ఖర్చు చేశారు. ఆకలి తీర్చుకోవడానికి తక్కువ డబ్బు వాడేవారు. కాల్చిన రొట్టె ముక్క లను ఒక కప్పు టీలో ముంచి తిని అనంత అధ్యయనం చేసిన త్యాగశీలి ఆయన. ఈరోజు స్కాలర్‌షిప్‌తో చదు వుకుంటున్న కొందరు దళిత విద్యార్థులు తమ ఉపకార వేతనాన్ని విలాసాలకు వాడుతున్న వైనం చూస్తుంటే అంబేడ్కర్ నుంచి వీరు ఎంత నేర్చు కోవాలో అర్థమవుతుంది. అంబేడ్కర్ పరీక్షల కోసం చదవలేదు. విజ్ఞానం కోసం, అవగాహన కోసం సిద్ధాంత నిర్మాణం కోసం, సాక్ష్యాధారాల కోసం చదివారు. రాత్రంతా చదువుతూ కనిపించే అంబేడ్కర్‌తో రూవ్ుమేట్ ఎప్పుడైనా చదువు ఆపు అంటే...‘నా పరిస్థితులు, నా పేదరికం, నేను ఎంత త్వరగా విద్యార్జన పూర్తి చేస్తే అంత మంచిది. నా కాలాన్ని నేను ఎంత విద్యార్జనలో గడిపితే, ఎంత సద్వి నియోగం చేసుకుంటే అంత మంచిది’ అని చెప్పే వారు. ఆయన చదువు పట్ల చూపిన నిబద్ధతని ఈనాటి దళిత విద్యార్థి లోకం అనుసరించినట్లయితే మేధోసంపన్నత వీరి సొంతమై వీరు భారత దేశ పునర్నిర్మాణానికి ముందుకు వస్తారు. నీటి వినియోగం పైన అంబేడ్కర్ పెట్టిన శ్రద్ధ ఏ జాతీయ నాయకుడూ పెట్టలేదు. అంతగా పట్టించుకోలేదు. ఆయన ప్రణాళికలు నిర్దిష్టమై నవి. కార్మి కుల అభివృద్ధి కోసం, వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులకు ఉపాధి కల్పించాలని ఆయన పోరా డారు. గ్రామీణ శ్రామి కులను పారిశ్రామిక పనుల్లో ఉపయోగించుకుంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొలంబియా, హార్వార్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలలో అంబేడ్కర్ మీద జరిగి నంత పరిశోధన భారతదేశంలో జరగడం లేదు. అన్ని కేంద్రీయ, రాష్ట్రీయ, దేశీయ విశ్వ విద్యాలయాల్లోనూ అంబేడ్కర్ పరిశోధనా కేంద్రాలు నిర్మించి... తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించటం ద్వారా ఆయన రచనల లోని ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, విద్యా అంశాలపై పరి శోధనలు జరిగేలా చూడాలి. ఆయన నడిపిన పత్రికలు, ఆయన నిర్మించిన సంస్థలు, పార్టీలు, ఆయన ప్రణాళికలు దేశ భవిష్యత్తుకు మార్గదర్శ కాలు. ముఖ్యంగా భూమినీ, పరిశ్రమలనూ జాతీయం చేయాలనే ఆయన ఆలోచన... దళిత, బహుజన, మైనారిటీలు రాజకీయ అధికార సాధన మీద ఆధారపడి ఉంది. అంబేడ్కర్ ముందటి భారతదేశం వేరు. ఆయన తర్వాతి భారతదేశం వేరు. అందుకే అంబేడ్కర్ యుగ కర్త. ఈ యుగం ఆయనదే. ఆయన మార్గంలో నడుద్దాం. డాక్టర్ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నాయకులు రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాల ప్రకారమే భారత్‌లో సమాఖ్య ప్రభుత్వాలు పూర్తిగా నడవక పోయినా... రాజ్యాంగ మౌలిక సూత్రాలను మాత్రం గత ఆరు దశాబ్దాల్లో అవి అతిక్రమించ లేదనేది వాస్తవం. ఒక వేళ అటువంటి పరిస్థితులు తలెత్తినా న్యాయవ్యవస్థ ఎప్పటికప్పుడు తన న్యాయ సమీక్షాధికారం ద్వారా రాజ్యాంగాన్ని రక్షిస్తూ వచ్చింది. ఆర్ఎస్ఎస్ భావజాలం పుణికిపుచ్చుకున్న బీజేపీ ‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం’ అంటూ నియంతృత్వ భారతాన్ని నిర్మించడానికి వడి వడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. భారత రాజ్యాంగం బోధిస్తున్న బహుళత్వం, పరస్పర సహకారం, రాష్ట్రాల హక్కులు, స్థానిక స్వయం పరిపాలన వంటి వాటిని తుంగలో తొక్కడానికే అఖండ ఏకైక భారత్ ప్రాపగాండా అనేది స్పష్టం. ఈ దేశంలోని వేల కులాలు, విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాల అస్తిత్వాలను కనుమరుగు చేసి మెజారిటీ మతాన్నీ, భాషనూ ఇతరులపై రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలను ఇంతకన్నా ఏవిధంగా అర్థం చేసుకోవాలి? ‘రాష్ట్రాలు మిథ్య, కేంద్రమే నిజం’ అన్న రీతిలో కేంద్రంలోని అధికార పార్టీ విధానాలు సాగుతున్నాయి. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మాత్రం చైతన్యరహితంగా తన పాత పద్ధతుల్లోనే వ్యవహ రిస్తూ అనేక రుగ్మతలతో కునారిల్లుతోంది. దేశ నవ నిర్మాణంపై స్పష్టమైన జాతీయ విధానాలు లేని మిగతా జాతీయ పార్టీలు నామమాత్రంగానే మను గడ సాగిస్తున్నాయి. మరో పక్క చాలా ప్రాంతీయ పార్టీలు అవినీతికి, కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ జాతీయ రాజకీయాల్లో ప్రభావ వంతమైన పాత్రను పోషించే స్థితిలో లేవు. ఈ పరిస్థితులను అనువుగా తీసుకుని బీజేపీ ఈసారి పార్లమెంట్లో అత్యధిక మెజారిటీ సాధించడంతో పాటూ, దేశంలోని సగానికి పైగా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవాలని వ్యూహం పన్నుతోంది. నిజంగా ఈ వ్యూహం ఫలిస్తే రాజ్యాంగానికి భారీ సవరణలు చేపట్టి దాని మౌలిక స్వరూపాన్ని మార్చడం బీజేపీకి సులువవుతుంది. మెజారిటీ మతం దేశ ప్రజలందరి మతం అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ మతానుయాయుల సంస్కృతే మొత్తం దేశ సంస్కృతిగా చలామణీ అవుతుంది. ఇప్పటికే మైనారిటీలు, నిమ్నవర్గాల ఆహార విహారాలపై ఛాందసవాదుల దాడులు, ఆంక్షలను చూస్తూనే ఉన్నాం. బీఫ్‌ను ఆహారంగా తీసుకున్న వారు మత విలువల్ని కించపరచిన వారుగా దాడులకు గురవుతున్నారు. ఎక్కువగా ఉత్తరాదికి పరిమితమైన మూక దాడుల సంస్కృతిని దక్షిణాదికీ, ఈశాన్య భారతానికీ ఛాందస వాదులు విస్తరింపచూస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ మైన భారత్‌లో ఇప్పటి వరకు ఎలాంటి సైనిక, ప్రజా తిరుగుబాటులు జరుగలేదంటే అందుకు రాజ్యాంగం ఇచ్చిన లౌకిక ప్రజాస్వామ్య విలువలే ప్రధాన కారణం. అన్ని కులాలూ, జాతులూ, మతాలూ, భాషలూ, ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, హక్కులు కల్పించడమనే మౌలిక సూత్రం రాజ్యాంగంలో ఉన్నది కాబట్టే తిరుగుబాట్లు తలెత్తలేదు. కానీ ఒకే దేశం, ఒకే జాతి లాంటి నినాదాలను ముందుకు తెచ్చి కేంద్రీకృత నియంతృత్వ విధానాలనూ, ఫాసిజాన్నీ దేశంలో అమలు చేయడానికి నేడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ తన నియంతృత్వ ధోరణిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాలను రాత్రికి రాత్రే తీసుకుని ప్రజలను ఇక్కట్ల పాలు చేసింది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్య దేశ నిర్మాణంలో భాగంగా డాక్టర్ అంబేడ్కర్... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సామాజికంగా వెనుక బడిన కారణంగా వారికి రాజ్యాంగంలో రిజర్వే షన్లు పొందుపరచి... విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించారు. కానీ అంబేడ్కర్ నిర్దేశించిన రిజ ర్వేషన్ల స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ ఆర్థికంగా వెనుకబాటు ఆధారంగా 10 శాతం అగ్ర వర్ణ పేదలకు రిజర్వేషన్లను ఎటువంటి కమిషన్ వేయ కుండా, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మూడు రోజుల్లోనే పార్లమెంట్లో ఆమోదింపచేసుకున్న మోదీ ప్రభుత్వాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సామా జిక న్యాయాన్ని పాటిస్తూ అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి ముఖ్యమ్రంతి జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 135 కోట్ల జనా భాను పాలించే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కనీసం అయిదు ప్రాంతాలకు అయిదు గురు ఉపప్రధానులను చేస్తే తప్పేమిటి? 1955 లోనే మొదటి ‘రాష్ట్రాల విభజన కమిషన్’కు భారత రాజ్యాంగ పిత అంబేడ్కర్ ఓ లేఖ రాస్తూ... ఉత్తరాదిన ఢిల్లీని మొదటి దేశ రాజధానిగానూ, దక్షిణాదిన ఉన్న హైద్రాబాద్‌ను దేశ రెండో రాజ ధానిగానూ చేయాలని ప్రతిపాదించారు. ఇంత వరకు కాంగ్రెస్ కాని, బీజేపీ కానీ ఈ ప్రతిపాదనను పట్టించుకోలేదు. పాలన, అధికార వికేంద్రీకరణ జరిగితేనే కదా అన్ని ప్రాంతాల ప్రజలకూ న్యాయం జరిగేది. స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా... 135 కోట్ల జనాభాకు కేవలం 29 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అన్ని అంశాల్లో అమెరికాను ఆదర్శంగా తీసుకుంటున్న భారత్ రాష్ట్రాల సంఖ్య విషయంలో ఎందుకు తీసుకోదో అర్థం కాదు. 35 కోట్ల జనాభాకన్నా తక్కువే ఉన్న అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. స్వయం నిర్ణ యాధికారాలూ, సొంత సుప్రీంకోర్టు, సొంత రాజ్యాంగం, సొంత జెండా, ఎజెండా కలిగి ఉండే స్వేచ్ఛ అక్కడి రాష్ట్రాలకు ఉంది. అందుకే అక్కడ రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయి. బాబా సాహెబ్ సూచించినట్లు భారత్‌లో 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చొప్పున ఏర్పాటు చేస్తే మేలు జరిగి ఉండేది. జాతీయ వాదం ముసుగులో దళిత, మైనార్టీలపై దాడులు చేస్తే... దేశ జనాభాలో 35 శాతం ఉన్న ఈ వర్గాలు ఎలా నవభారత నిర్మాణంలో భాగస్వాములు అవుతాయి? అందుకే బీజేపీ పాల కులు దుందుడుకు పోకడలకు పోకుండా అంబే డ్కర్ ఆశయాల సాధనకు పాటు పడితే దేశం దానంతట అదే అభివృద్ధి చెందుతుంది. డా. గాలి వినోద్ కుమార్ వ్యాసకర్త ఫౌండర్ చైర్మన్, నవ భారత్ నిర్మాణ్ ఛారిటబుల్ ట్రస్టు (ఈ వ్యాసం Apr 14, 2023 రోజున sakshi.comలో ప్రచురితమైనది) -
సామాజిక విప్లవ చైతన్యమూర్తికి నీరాజనం
విగ్రహాలు జాతి జీవన వికాస చారిత్రక ప్రతిబింబాలు. సమాజాన్ని చైతన్యపరచే విగ్రహాలు మౌన సందేశాలకు ప్రతిరూపాలు. భారతదేశం మినహా ప్రపంచదేశాల్లో ఇప్పటికి లక్షకు పైగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనా. ప్రపంచ దేశాలు అంబేడ్కర్ జ్ఞాన సంపదకూ, సమసమాజ నిర్మాణ రచనా చాతుర్యానికీ, సమయస్ఫూర్తి గల వాగ్ధాటికీ ముగ్ధులై నిత్య నీరాజనాలు పలుకుతున్నాయంటే అది భారతదేశానికి గర్వకారణం. అంబేడ్కర్ సమాజం కోసం జీవించాడు. సమాజ పురోగతి కోసం నిరంతర పోరాటం జరిపిన అసమాన ప్రతిభావంతుడు. తాను నేర్చిన విద్య, విజ్ఞాన సంపద అంతా సమాజం కోసమే వినియోగించాడు. దీన్నే ‘పేబాక్ టు ది సొసైటీ’ అంటారు. అందుకే ఆయన విధానాలను పలు దేశాలు అనుసరిస్తున్నాయి. ‘నా జీవన పోరాటమే నా సందేశం’ (మేరా జీవన్ సంఘర్ష్ హీ మేరా సందేశ్) అని చెప్పిన మాటలే విశ్వ సందేశంగా వినువీధుల్లో వినిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు అంబేడ్కర్ విగ్రహాలు నెలకొల్పి తమకున్న గౌరవాన్ని చాటుకున్నాయి. అమెరికాలో మిచిగన్ విశ్వవిద్యాలయం (1993)లో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. 2023 అక్టోబరు 14న మేరీలాండ్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే పేర 19 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని నిలిపారు. 1996లో టొరంటో విశ్వవిద్యాలయం (కెనడా) కూడా అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొంది. ఇక బ్రిటన్‌లో చాలానే ఉన్నాయి. లండన్, బర్మింగ్ హామ్, మాంచిస్టర్లలో పలు విగ్రహాలను నెలకొల్పారు. అలాగే అంబేడ్కర్ చదివిన ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్’ ముఖద్వారంలో 2000లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జర్మనీలోని బెర్లిన్, మ్యూనిక్, ఫ్రాంక్ ఫర్ట్లలో; జపాన్‌లోని టోక్యో, ఒకాసా, కొయెటోలల్లో; దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, కేప్‌టౌన్, డర్బన్‌లలో; ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బెయిన్ వంటి నగరాల్లో; న్యూజిలాండ్‌లోని ఆక్లండ్ తదితర ప్రాంతాల్లో, మారిషస్ (2018), శ్రీలంక (కొలంబో). నేపాల్ (ఖాట్మండు 2019), బంగ్లాదేశ్ (ఢాకా 2021), దుబాయ్‌తో సహా మరెన్నో దేశాల్లో అంబేడ్కర్ విగ్రహాలు నెల కొన్నాయి. తెలంగాణలో గతేడాది ఏప్రిల్ 14న అంబేడ్కర్ ముని మనుమడు ప్రకాష్ అంబేడ్కర్చే 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడింది. లక్నోలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పార్క్‌కు ‘డాక్టర్ భీమ్రావ్ సామాజిక్ పరిపర్తన్ స్థల్’గా నామకరణం చేసి అక్కడ ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశంలోనే జ్యోతిరావ్ ఫూలే, నారాయణగురు, బిశ్రా ముండా, శాయాజి మహరాజ్, కాన్షీ రామ్ విగ్రహాలున్నాయి. ఇక్కడే 124 ఏనుగుల విగ్రహాలు కొలువుదీరి సందర్శకులకు ఆహ్లాదం కలుగచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో లెక్కకు మించిన అంబేడ్కర్ విగ్రహాలున్నాయి. వీటికి తోడు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 400 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన 206 అడుగుల విగ్రహాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆవిష్కరిస్తున్నారు. ఈ విగ్రహపీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. దానిపై ప్రతిష్ఠించిన 125 అడుగుల ప్రధాన విగ్రహంతో మొత్తం 206 అడుగుల అంబేడ్కర్ శిల్పం విజయవాడ నలుదిక్కులకూ కనిపిస్తూ, చూడగానే ఆకర్షించేలా ఉంది. ఈ విగ్రహ ప్రదేశం ఒక స్మృతివనంగా భాసిస్తుంది. మూడు అంతస్తులున్న విగ్రహం కింది భాగంలో నాలుగు ఏసీ హాల్స్ ఉన్నాయి. నాలుగు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మినీ థియేటర్, మ్యూజియం, మరో రెండు హాల్స్‌లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధంతో కూడిన ఛాయాచిత్రాలు, మరో మ్యూజియం ఉంది. వీటికి తోడు రెండు వేలమంది కూర్చోవడానికి సరిపడే మరో ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు అందమైన పార్కు, మరో అందమైన ఫౌంటెన్ సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. విగ్రహం రంగు మాసిపోకుండా పాల్యూరెథేన్ కోటింగ్ వేయటం మరో ప్రత్యేకత! 15 మంది ఎక్కడానికి సరిపడ రెండు లిఫ్టులను ఏర్పాటుచేశారు. మూడు అంతస్తుల్లో నిర్మిత మైన ఈ ప్రదేశం ఒక పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనటంలో ఎలాంటి అనుమానం లేదు. అంబేడ్కర్ విగ్రహ ప్రతి ష్ఠతో విజయవాడలో నూతన సాంస్కృతిక వికాసం మరింతగా వృద్ధిచెందుతుంది. దీనివల్ల సమాజ వికాసంతోపాటు దళిత అస్తిత్వానికీ, సర్వమత సామరస్యానికీ, సకల మానవ సౌభ్రాతృత్వానికీ మరింత దోహదం చేకూరుతుంది. ఈ విగ్రహ ప్రాంగణం నిత్యమూ విజ్ఞాన మేధామథనంతోపాటు సకల కళలు అభివృద్ధి చెందే సాంస్కృతిక కేంద్రంగా మారుతుంది. ఈ కేంద్రంలో ఏర్పరచే నూతన పుస్తక భాండాగారం పుస్తక ప్రియులకూ, పాఠకులకూ ఒక విజ్ఞాన వికాస కేంద్రంగా నిత్యం అందుబాటులో ఉంటుంది. అంబేడ్కర్ విగ్రహంతో పోరాటాల పురిటిగడ్డ విజయవాడ నగరానికి కొత్త అందాలు పురివిప్పుకుంటాయి. ఆయన జీవిత సందేశం అడుగడుగునా ప్రతిబింబించి ప్రగతిపథంలో పయనించే ప్రజలకు మార్గదర్శి కాగలదు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి, వ్యాసకర్త ప్రముఖ సాహితీవేత్త, 98481 23655 -
వావ్..విశాఖ!
సాక్షి, అమరావతి : పాలనా రాజధానిగా సర్వ హంగులూ సమకూర్చుకుంటున్న విశాఖ ముఖచిత్రం మారుతోంది. ఐటీ రంగంలో ఇప్పటివరకూ బిజినెస్ ప్రాసెసింగ్ ఔట్సోర్సింగ్(బీపీవో) కార్యకలాపాలకు ప్రధాన వేదికగా నిలిచిన ఈ నగరం.. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్స్(డీసీ)ను ఆకర్షిస్తోంది. ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ రాష్ట్రంలో తొలి డెవలప్మెంట్ సెంటర్‌ను విశాఖలో ఏర్పాటుచేయడంతో.. అదే బాటలో మరికొన్ని సంస్థలు ఆసక్తిచూపుతున్నాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాక ఎప్పటి నుంచో విశాఖ కేంద్రంగా బీపీవో సర్వీసులు నడిపిస్తున్న విప్రో కూడా డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. లావండర్ పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ డెవలప్మెంట్ సెంటర్లో విశాఖ కేంద్రంగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఇంతకాలం విశాఖ అనగానే పల్సస్ గ్రూపు, డబ్ల్యూఎన్ఎస్, టెక్ మహీంద్రా, విప్రో వంటి బీపీవో కార్యకలాపాలే కనిపించేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ డెస్టినీ పేరుతో విశాఖకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లను ఆకర్షించేందుకు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్‌తో పాటు మరికొన్ని.. ఇప్పటివరకు బీపీవోల కేంద్రంగా ముద్ర ఉన్న విశాఖకు ఇన్ఫోసిస్ రాకతో ఆ ముద్ర చెరిగి.. డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోందని ఏపీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏజెన్సీ(అపిటా) గ్రూప్ సీఈవో ఎస్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే అమెజాన్, భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థలు డెవలప్మెంట్ సెంటర్లను నెలకొల్పగా, తాజాగా ఇన్ఫోసిస్ 1,000 సీటింగ్ సామర్థ్యంతో క్యాంపస్‌ను ఏర్పాటుచేసింది. రానున్న కాలంలో దీన్ని మరింత విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా విప్రో కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. అలాగే, అదానీ డేటా సెంటర్ కూడా ఏర్పాటుకానుండటం.. సింగపూర్ నుంచి సముద్రమార్గం ద్వారా ఫైబర్‌నెట్ కనెక్షన్ ఏర్పాటవుతుండటం.. పారిశ్రామిక రంగంలో నాలుగో తరం ఆవిష్కరణలను ప్రోత్సహించేలా దేశంలోనే తొలి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ.. కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటుచేయడం.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రొబోటెక్స్, డేటా ఎనలిటిక్స్ వంటి వాటిపై పరిశోధనలను ప్రోత్సహించేలా ఆంధ్రా వర్సిటీలో మరో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ ఏర్పాటుకావడంతో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు ఆసక్తిచూపుతున్నాయి. అతి తక్కువ వ్యయంతో పుష్కలమైన మానవ వనరులున్న నగరాల్లో విశాఖ ముందంజలో ఉందని తాజాగా నాస్కామ్–డెలాయిట్ విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం కూడా విశాఖకు కలిసివస్తోంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉండటంతో విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు పలు సంస్థలు చర్చలు జరుపుతున్నాయని, వీటిలో చాలా సంస్థలు స్టాక్ఎక్సే్ఛంజ్లలో నమోదు కావడం వల్ల వాటి వివరాలను అప్పుడే చెప్పలేమని ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ చెప్పారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం, త్వరలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానుండటం, రహేజా గ్రూపు ఇన్ఆర్బిట్ మాల్‌ను ఏర్పాటుచేస్తుండటంతో విశాఖ త్వరలోనే పూర్తిస్థాయి కాస్మోపాలిటన్ నగరంగా మారనుంది. దీంతో ఐటీ నిపుణులు పనిచేసేందుకు విశాఖను ఎంచుకునే అవకాశాలు పెరుగుతాయని పల్సస్ గ్రూపు సీఈవో గేదెల శ్రీనుబాబు వివరించారు. బీచ్ ఐటీ డెస్టినీగా విశాఖ.. విశాఖను బీచ్ ఐటీ డెస్టినీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో.. ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థ విశాఖ రావడం వలన మరిన్ని ఐటీ పరిశ్రమలు ఇక్కడకు వచ్చే అవకాశముందని పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యాక్సెంచర్, సీడాక్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు రాష్ట్రంలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పలు ఐటీ సంస్థలు రాష్ట్రంలో శాఖల ఏర్పాటుకు ముందుకొచ్చాయని, ఈ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తేవడంతో పాటు, ప్రస్తుత ఐటీ కంపెనీల అవసరాలు తీర్చడంపై దృష్టిసారించినట్టు శశిధర్ వెల్లడించారు. -
వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడింది: సీఎం కేసీఆర్
నిర్మల్: తెలంగాణ అంతటా మెడికల్ కళాశాలల ఏర్పాటుతో వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్యకళాశాలతోపాటు రాష్ట్రంలో మరో ఎనిమిది కళాశాలలను సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం వర్చువల్ విధానంలో ఒకేసారి ప్రారంభించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్ కాలేజీలున్నాయని.. భవిష్యత్‌లో మరో ఎనిమిదింటిని ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఏటా 10వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోందని తెలిపారు. లక్ష జనాభాకో 22 మెడికల్ సీట్లు ఉన్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. 500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని, రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద గర్భిణులకు కేసీఆర్ కిట్లు, న్యూట్రిషన్ కిట్లు ఇస్తున్నామని, గర్భిణులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని, ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు. వైద్యరంగంలో అరుదైన ఘట్టం.. జిల్లా వైద్యరంగంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అరుదైన ఘట్టమని స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ వర్చువల్‌గా వైద్యకళాశాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చొరవతో నిర్మల్ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ చేతుల మీదుగానే నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. పేదలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువైందని తెలిపారు. నిర్మల్‌లో మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. పేదలకు కార్పొరేట్ స్థాయి సేవలు.. జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఇక పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా యువత వైద్యవిద్య కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని తెలిపారు. సంతోషంగా ఉంది.. మా నాన్న జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. డాక్టర్ చదవాలనే నా లక్ష్యానికి అంకురార్పణ ఇక్కడే జరిగింది. సొంత జిల్లాలోనే నాకు సీటు రావడం సంతోషంగా ఉంది. ఈ జిల్లా బిడ్డగా బాగా చదివి మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటా. కళాశాలకు మంచిపేరు తెస్తా. – జారా నవాల్, నిర్మల్ అమ్మ కల నిజం చేస్తా.. డాక్టర్ కావాలని చిన్నప్పటి నుంచి కలగన్న. మా అమ్మ జిల్లా ఆస్పత్రిలో 20 ఏళ్లుగా స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నారు. అమ్మ నన్ను డాక్టర్‌ను చేయాలనే ఆశతో చదివించారు. అమ్మ కల నిజం చేసేరోజు వచ్చింది. సీటు సాధించేందుకు కష్టపడ్డా. సొంత జిల్లాలో చదివే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. – ఎస్.భానుతేజ, నిర్మల్ నేను చదువుకోలేకపోయినా.. నేను ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న. నేను చదువులో అంతగా రాణించలేదు. నాలాగా నా కుమారుడు కావద్దని అతడిని కష్టపడి చదివించిన. ఇప్పుడు పక్క జిల్లాలోనే మెడికల్ కాలేజీలో సీటు రావడం సంతోషంగా ఉంది. నా కుమారుడు మంచి డాక్టర్ కావాలన్నదే నా కోరిక. – విజయ్‌కుమార్, ఆదిలాబాద్, విద్యార్థి తండ్రి మంచి డాక్టర్‌గా ఎదుగుతా.. ఎంతో కష్టపడితేనే నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఈరోజు నుంచి క్లాసులు ప్రారంభం కావడం.. నాన్నతో వచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివి మంచి డాక్టర్‌గా ఎదుగుతా. – సమ్మిత్, ఆదిలాబాద్ సైకియాట్రిస్ట్‌ను అవుతా.. తెలంగాణలో మెడికల్ సీట్లు పెంచడం వల్లే నాకు అవకాశం వ చ్చింది. నేను సైకియాట్రిస్ట్‌ను అవుతా. డాక్టర్ కోర్సు పూర్తిచేశాక పేదలకు సేవ చేస్తా. ఇక్కడి కళాశాలలో సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి. – నందిని, నిజామాబాద్ చాలా దగ్గరగా ఉంది.. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే ఇబ్బందిగా ఉండేది. కాలేజీ నాకు దగ్గరగా ఉంది. ఇక్కడకు వచ్చి వెళ్లడం చాలా సులభం. చదువు పూర్తిచేశాక పేదలకు సేవలందిస్తా. మా నాన్న వైద్యుడే. ఆయన ప్రోత్సాహంతో డాక్టర్ కావాలనుకుంటున్నాను. – మహిన్, ఆర్మూర్ అక్కలాగే కావాలని.. మా అక్కయ్య వికారాబాద్‌లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. నేను కూడా మా అక్క లాగే డాక్టర్ కావాలనుకుని కష్టపడి చదివి సీటు సంపాదించాను. మన జిల్లాలోని మెడికల్ కాలేజీలో సీటు రావడం ఆనందంగా ఉంది. – ఆదుముల్ల శశివర్ధన్, భైంసా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ.. జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ శకటం ముందు నడవగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మాజీ చైర్మన్ అప్పాల గణేశ్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్, నాయకులు అల్లోల గౌతమ్‌రెడ్డి, పాకాల రాంచందర్, అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రామ్‌కిషన్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, రాము, లక్ష్మణాచారి, విద్యార్థులు, ప్రైవేట్ ఆస్పత్రుల డాక్టర్లు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పండుగ వాతావరణంలో మంచిర్యాల చౌరస్తా మీదుగా దివ్యాగార్డెన్స్ వరకు కొనసాగింది. దారి పొడవునా డీజే పాటలతో విద్యార్థులు, యువకులు నృత్యాలు చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, ర్యాలీ సందర్భంగా మంత్రి ఐకేరెడ్డి నృత్యం చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం దివ్యాగార్డెన్స్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. -
ఏటీఎఫ్ రేటు 14 శాతం పెంపు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ధోరణులకు అనుగుణంగా విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు వరుసగా మూడోసారి పెంచాయి. కంపెనీలు శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏటీఎఫ్ రేటు ఏకంగా 14 శాతం పెరిగింది. దీంతో ఢిల్లీలో కిలోలీటరు ధర రూ. 13,911 మేర పెరిగి రూ. 1,12,419కి చేరింది. స్థానిక పన్నులను బట్టి ఈ రేటు ఒకో రాష్ట్రంలో ఒకో రకంగా ఉంటుంది. చమురు కంపెనీలు జులై 1న 1.65 శాతం, ఆగస్టు 1న 8.5 శాతం మేర ధరను పెంచాయి. తాజా పెంపుతో కలిపి మొత్తం మీద ఏటీఎఫ్ రేట్లు ఈ మధ్య కాలంలో కిలోలీటరుకు రూ. 23,116 మేర పెరిగినట్లయింది. మరోవైపు, వాణిజ్యావసరాలకు హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వంట గ్యాస్ సిలిండరు ధర రూ. 157.50 తగ్గింది. దీంతో 19 కేజీల సిలిండరు రేటు ఢిల్లీలో రూ. 1,522.50కి పరిమితమవుతుంది. ఆగస్టు 1నే కమర్షియల్ ఎల్పీజీ సిలిండరు రేటు రూ. 100 మేర తగ్గింది. చమురు కంపెనీలు వరుసగా 17వ నెల కూడా పెట్రోల్, డీజిల్ రేట్ల జోలికి వెళ్లలేదు. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు రిటైల్ సంస్థలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రతి నెలా 1వ తేదీన, క్రితం నెల అంతర్జాతీయ రేట్ల సగటు ప్రకారం దేశీయంగా వంట గ్యాస్, ఏటీఎఫ్ రేట్లను సవరిస్తాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ సవరిస్తాయి. అయితే, గతేడాది మే నుంచి వీటి రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. -
వయోధిక పాత్రికేయులకు అత్యవసర నిధి ఏర్పాటు
పంజగుట్ట: వయోధిక పాత్రికేయుల అత్యవసర నిధి ఏర్పాటుకు తన వంతుగా రూ. లక్ష ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వయోధిక పాత్రికేయ సంఘం ఆధ్వర్యంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ ఆవిష్కరణ, ఇటీవల మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు వి.పాండురంగారావు సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్బంగా సీనియర్ పాత్రికేయులు మధు వాకాటి వయోధిక పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లం నారాయణ మాట్లాడుతూ పాత్రికేయులు వయస్సు పెరుగుతున్నా రచనలు మానకూడదన్నారు. ఏ.బీ.కే లాంటి వారు ఇంకా రాస్తున్నారని ఇప్పటికీ వారి అక్షరాల్లో పదును తగ్గలేదని, ఆయన భావాలు మారలేదన్నారు. పాత్రికేయరంగంలో ఉన్న వారిలో కొందరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అత్యవసర పరిస్థితుల్లో వారిని ఆదుకునేందుకు వయోధిక అత్యవసర నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఆ నిధికి మొదటగా తానే రూ. లక్ష ఇస్తున్నట్లు తెలిపారు. అక్రిడిటేషన్ సమస్య కూడా తమ దృష్టికి తెచ్చారని 60 సంవత్సరాలు దాటిన పాత్రికేయునికి ఎలాంటి పత్రాలు లేకున్నా, గతంలో పనిచేసిన ఆనవాళ్లు ఉంటే తప్పకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఎవరికైనా లేకపోతే తనను సంప్రదిస్తే వెంటనే వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టు హెల్త్ స్కీం ఎంతో అద్భుతమైనదని గతంలో అపోలో, యశోదా ఆసుపత్రుల్లోనూ కొనసాగేదని, కాని ప్రస్తుతం కేవలం నిమ్స్‌లో మాత్రమే నడుస్తుందన్నారు. వయోధిక పాత్రికేయులకు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే, అత్యవసర పరిస్థితుల్లో కార్పోరేట్ ఆసుపత్రికి వెళితే తాను మాట్లాడి హెల్త్‌కార్డుల ద్వారా చికిత్స అందేలా చూస్తానన్నారు. నిమ్స్‌లోనూ వయోధిక పాత్రికేయులకు వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని నిమ్స్ డైరెక్టర్‌కు చెబుతానన్నారు. మీడియా అకాడమీలో యూనియన్ కార్యాలయాలకు గదులు ఇవ్వరని కానీ వయోధిక పాత్రికేయుల కార్యాలయం ఏర్పాటుకు గదిని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వయోధిక పాత్రికేయ సంఘం అధ్యక్షులు దాసు కేషవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వయోధిక పాత్రికేయ ప్యాకెట్ డైరీ రూపకర్త ఎన్.శ్రీనివాస్ రెడ్డి, సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవరులు, సెక్రటరీ లక్ష్మణ్‌రావు, జాయింట్ సెక్రటరీ రాజేశ్వరరావు, రామమూర్తి, సభ్యులు ఎ.జీ.ప్రసాద్, జి.భగీరధ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చార్జింగ్ స్టేషన్లకు రూ.800 కోట్లు
న్యూఢిల్లీ: పబ్లిక్ ఫాస్ట్ చార్జింగ్ ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వ రంగంలోని మూడు చమురు కంపెనీలకు రూ.800 కోట్లు మంజూరు చేసినట్టు భారీ పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఫేమ్ ఇండియా స్కీమ్ ఫేజ్–2 కింద ఈ మొత్తాన్ని సమకూరుస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం కంపెనీలు దేశవ్యాప్తంగా ఫిల్లింగ్ సెంటర్లలో 7,432 చార్జింగ్ కేంద్రాలను 2024 మార్చి నాటికి ఏర్పాటు చేస్తాయి. ఈ స్టేషన్స్‌లో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, చిన్న బస్‌లకు చార్జింగ్ సౌకర్యాలు ఉంటాయి. ఈ మూడు కంపెనీలకు తొలి విడతగా రూ.560 కోట్లు విడుదల చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,586 చార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. కొత్తగా జోడించనున్న కేంద్రాలతో ఎలక్ట్రిక్ వాహన రంగానికి మంచి బూస్ట్‌నిస్తుందని భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. -
వాల్తేరు డివిజన్ ఇక చరిత్రలోనే.. 129 ఏళ్ల అనుబంధం
వాల్తేరు డివిజన్ ఇక చరిత్రలో మిగిలిపోనుందా? రైల్వే జోన్ ఏర్పాటు కోసం డివిజన్ విచ్ఛిన్నం అనివార్యమా?.. అంటే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటనతో అవుననే తేలిపోయింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు పార్లమెంట్లో స్పష్టం చేశారు. అయితే జోన్ వచ్చిందన్న ఆనందం.. 129 సంవత్సరాల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ విభజనతో నీరుగారిపోతోంది. వాల్తేరు డివిజన్‌ని కొనసాగించాలని ప్రజాప్రతినిధుల విన్నపాలను పక్కన పెట్టడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్.. తూర్పు కోస్తా రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు 2019 ఫిబ్రవరి 27న కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రైల్వే జోన్ రాక ఓవైపు ఆనందాన్ని కలిగించినా.. వాల్తేర్ డివిజన్ ప్రధాన కేంద్రంగా రాయగడను ప్రకటించడం అందర్నీ నిరాశకు గురిచేసింది. గతంలో విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్.. ఇప్పుడు రాయగడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుందని కేంద్రం పేర్కొంది. డివిజన్‌ను రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లోనూ.. మరోభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లోనూ కలుపుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనలతోపాటు జోన్ ఏర్పాటుకు సంబంధించిన డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో వెల్లడించారు. చదవండి: లోయలో పడ్డ బస్సు.. ప్రమాదానికి కారణాలివే..! వాల్తేరే డివిజన్ కీలకం తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. భూ సర్వేకు సన్నద్ధం ఇప్పటికే జోన్‌కు సంబంధించిన ఓఎస్డీ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేశారు. ఓఎస్డీ ఆధ్వర్యంలో జోన్ ప్రధాన కార్యాలయ సముదాయానికి సంబంధించిన స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మిగిలిన కార్యాలయాలు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేసేందుకు భూ సర్వే చేపట్టేందుకు రైల్వే బోర్డు సన్నద్ధమవుతోంది. విశాఖలో సమగ్ర వనరులు జోన్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభించినా. విశాఖపట్నం సమగ్ర వనరులతో సిద్ధంగా ఉంది. తాత్కాలిక జోనల్ కార్యాలయంగా వాల్తేరు డీఆర్ఎం ఆఫీస్‌ని వినియోగించనున్నారు. శాశ్వత కార్యాలయం నిర్మించాలంటే సుమారు 20 ఎకరాల స్థలం అవసరమని డీపీఆర్‌లో పొందుపరిచారు. ఇందుకు అవసరమైన స్థలాలు విశాఖ పరిసర ప్రాంతాల్లో మెండుగా ఉన్నాయి. రైల్వే స్టేషన్‌కు అతి సమీపంలో, ముడసర్లోవ పరిసరాల్లోనూ 70 ఎకరాల వరకు ఖాళీ స్థలాలున్నాయి. దీంతో పాటు మర్రిపాలెం, గోపాలపట్నం పరిసరాల్లోనూ స్థలాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికితోడు.. ఇప్పటికే విశాఖలో ఆఫీసర్స్ క్లబ్, రైల్వే సంస్థలు, క్రికెట్ స్టేడియం, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఫంక్షన్ హాళ్లు.. ఇలా ఎన్నో వసతులు ఉన్నాయి. ఉద్యోగులు ఎందరు వచ్చినా వారికి కావల్సిన సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండటంతో.. ఎప్పుడు జోన్ ప్రకటన వచ్చినా ఉద్యోగులు వెంటనే విశాఖకు రావచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్లే.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలందరం నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా.. మొట్టమొదట కోరేది రైల్వే జోన్ గురించే. కేంద్ర మంత్రివర్గం జోన్ ఏర్పాటుకు ఆమోదించడం హర్షణీయం. అయితే వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరి నిమిషం వరకూ వాల్తేరు డివిజన్ కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. – ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ ఎంపీ ఆర్ఆర్బీ ఏర్పాటుకు కృషి చేస్తాం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడం ఆనందంగా ఉంది. రైల్వే జోన్ ఏర్పాటు వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. అదనపు రైళ్లు, రైల్వే లైన్లు వస్తాయి. అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఏర్పాటుకు కావల్సిన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి నివేదిస్తాం. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభించాలని ఒత్తిడి తీసుకొస్తాం. – డా.బీవీ సత్యవతి, అనకాపల్లి ఎంపీ వాల్తేరు డివిజన్ కొనసాగించాల్సిందే.. జోన్ ఏర్పాటు చేసే సమయంలో చారిత్రక నేపథ్యం ఉన్న డివిజన్‌ను విడదీయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. వాల్తేరుని విజయవాడలో విలీనం చెయ్యడం అవగాహన రాహిత్యం. దీని వల్ల వేల మంది ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ డివిజన్‌కు దేశ రైల్వే చరిత్రలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. – డా. పెదిరెడ్ల. రాజశేఖర్, ఆలిండియా ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ -
జ్ఞానాన్ని పంచుతూ.. పఠనాసక్తిని పెంచుతూ..!
రామన్నపేట(నకిరేకల్): జ్ఞానాన్ని పంచడం, శక్తిమేర దానిని పెంచడం ఆయన సంకల్పం. 35 ఏళ్లుగా అదే ఆయన వ్యాపకం. దాని కోసం తన సంపదను ధారాదత్తం చేశారు. జ్ఞానాన్ని నిలబెట్టడానికి తన ఇంటిని సైతం పడగొట్టారు. అక్కడ గ్రంథాలయాన్ని నిర్మించారు. పల్లె పట్టున పెద్దపెట్టున గ్రంథపరిమళం వెదజల్లుతున్నారు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు, దాశరథి పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య. పల్లెనే నమ్ముకొని సాహిత్య పరిమళాలను వెదజల్లుతున్నారు. ఆయన 35 ఏళ్లు ఉపాధ్యాయుడిగా, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. తాను పనిచేసిన చోటల్లా విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచడానికి కృషిచేశారు. పాఠశాలల్లో గ్రంథాలయం కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయించారు. ఉద్యోగ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి ‘కూరెళ్ల గ్రంథాలయం’గా నామకరణం చేశారు. తనకున్న ఆరు ఎకరాల వ్యవసాయ భూమిని బలహీనవర్గాల ఇళ్లస్థలాలుగా పంపిణీ చేయడానికి ప్రభుత్వానికి అందజేశారు. ఆ కాలనీకి తన తల్లి స్మారకార్థం లక్ష్మీనగర్‌గా నామకరణం చేశారు. విఠలాచార్య 2014 ఫిభ్రవరి 13న వెల్లంకి గ్రామంలోని తన ఇంట్లో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని కూరెళ్ల గ్రంథాలయం గ్రంథాలయ నిర్వహణ కోసం ఆచార్య కూరెళ్ల ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. తన పెన్షన్ డబ్బులను కూడా గ్రంథాలయ నిర్వహణకే ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఏళ్లనాటి వార్తాపత్రికలతోపాటు పద్య, గద్య గ్రంథాలు, ప్రత్యేక సంచికలు, వ్యక్తిత్వ వికాసం, ప్రాచీన గ్రంథాలు, బాలసాహిత్యం, విద్య, వైద్యం చరిత్ర, రామాయణం, మహాభారతంతోపాటు పోటీపరీక్షలకు ఉపయోగపడే గ్రంథాలున్నాయి. అధునాతన వసతులతో నూతన భవనం ప్రస్తుతం గ్రంథాలయంలోని పుస్తకాల సంఖ్య రెండు లక్షలకు చేరింది. విఠలాచార్య తన కుటుంబ సభ్యులు, దాతల సహకారం మేరకు సుమారు రూ.50 లక్షల వ్యయంతో అధునాతన గ్రంథాలయ భవనం నిర్మించారు. విశాలమైన హాలు, పుస్తకాలు అమర్చడానికి సెల్ఫ్‌లు, రీడింగ్హాల్, వెయింటింగ్ రూం, డిజిటల్ గదిని ఏర్పాటు చేశారు. పరిశోధక విద్యార్థులు, ఇతర సందర్శకులు బస చేయడానికి వీలుగా ప్రత్యేకగది కూడా నిర్మించారు. ముప్పైకి పైగా రచనలు డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను అభినవ పోతన, మధురకవిగా సాహితీప్రియులు పిలుస్తారు. ఆయన ఇప్పటివరకు ముప్ఫైకిపైగా పుస్తకాలు రాశారు. వాటిలో విఠలేశ్వర శతకం, కాన్ఫిన్షియల్ రిపోర్ట్, గొలుసుకట్టు నవలలు గుర్తింపు తెచ్చాయి. మరికొన్ని గ్రంథాలు అముద్రితాలుగా మిగిలాయి. కూరెళ్ల సాహిత్యప్రతిభకు గుర్తింపుగా అనేక పురస్కారాలు, జీవనసాఫల్య విశిష్ట పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాశరథి పురస్కారం 2019లో ఆయనను వరించింది. ప్రజల్లో పఠనాసక్తి పెంపొందాలి ప్రజల్లో పఠనాసక్తిని పెంచడం ద్వారా వారిలో విజ్ఞానం పెంచాలన్నది నా సంకల్పం. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన చోటల్లా పగలు పిల్లలకు, సాయంకాలం తల్లిదండ్రులకు చదువు నేర్పాను. పల్లెల్లోని కవులు, కళాకారులు, వాగ్గేయకారులను ప్రోత్సహించాను. నాకు ఆస్తుల మీద మమకారం లేదు. వ్యవసాయ భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ఇచ్చాను. ఇంటిని గ్రంథాలయానికి అంకితం చేశాను. నా పెన్షన్ డబ్బులను గ్రంథాలయ నిర్వహణకు ఉపయోగిస్తున్నా. విద్యార్థులు, పరిశోధకులు, ఆధ్యాత్మికులకు అందరికీ ఉపయోగపడేలా కూరెళ్ల గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్నది నా జీవితాశయం. ఈ ఆశయసాధనలో నా కుమార్తెలతోపాటు ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు. – డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గ్రామానికి గర్వకారణం కూరెళ్ల విఠలాచార్య మా గ్రామానికి మార్గదర్శకులు. గ్రామంలో చేపట్టే ప్రతీపనికి ఆయన ఆశీస్సులు తీసుకుంటాం. నిస్వార్థంగా గ్రామానికి చేస్తున్న సేవలు చిరస్మరణీయం. దాశరథి పురస్కారం పొందడం మా గ్రామానికి గర్వకారణం. ఆయన ఇంటిని గ్రంథాలయంగా మార్చడం గొప్ప విషయం. చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయంగా నిలుస్తుంది. భవిష్యత్తులో గ్రంథాలయ నిర్వహణకు మా వంతు సహకారం అందిస్తాం. – ఎడ్ల మహేందర్‌రెడ్డి, సర్పంచ్, వెల్లంకి -
జొన్న కిచిడీ, రాగుల పట్టీ
సాక్షి, హైదరాబాద్: తృణధాన్యాలకు మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) అందిపుచ్చుకుంటోంది. తృణధాన్యాలతో వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేసేందుకు జీసీసీ శ్రీకారం చుడుతోంది. అత్యాధునిక పరిజ్ఞానం, రుచి, పోషక విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తులను త్వరలో మార్కెట్లోకి తేనుంది. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్‌తో అవగాహన కుదుర్చుకుంది. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరులో 3 చోట్ల రూ.1.20 కోట్లు వెచ్చించి తృణధాన్యాల ఉత్పత్తుల తయారీ కేంద్రాలను జీసీసీ ఏర్పాటు చేస్తోంది. ఈ తయారీ కేంద్రాల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. జీసీసీ ద్వారా ప్రస్తుతం గిరి ప్రొడక్ట్స్ పేరిట మార్కెట్లో వివిధ రకాల ఉత్పత్తులున్నాయి. జీసీసీ ద్వారా విక్రయిస్తున్న గిరి హనీ(తేనె)కి మార్కెట్లో అత్యంత ప్రజాదరణ ఉంది. ఏటా సగటున 1,200 క్వింటాళ్ల తేనెను విక్రయిస్తోంది. అదేవిధంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు సబ్బులు, షాంపూలు, కారం, చింతపండు, పసుపు తదితరాలను ప్రాసెస్ చేసి సరఫరా చేస్తోంది. తాజాగా తృణధాన్యాల ఉత్పత్తులను కూడా పెద్దఎత్తున మార్కెట్లోకి తేనుంది. గిరిపోషణ్లో భాగంగా.. ఐటీడీఏలు, గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార లోపాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన గిరిపోషణ్ పథకం కింద ఈ ఉత్పత్తులను సరఫరా చేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు కూడా వీటిని పంపిణీ చేసేలా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖతో అవగాహన కుదుర్చుకోనుంది. ప్రస్తుతం ప్రారంభదశలోనే ఈ తయారీ కేంద్రాలున్నాయి. డిసెంబర్ నెలాఖరులోగా తృణధాన్యాల తయారీ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేందుకు జీసీసీ కసరత్తు చేస్తోంది. ఆదివాసీలకు ఉపాధి.. తయారీ కేంద్రాల్లో పని చేసేందుకు మహిళలకు మాత్రమే జీసీసీ ప్రాధాన్యం ఇస్తోంది. ప్రస్తుతం ఈ యూనిట్లు ఐటీడీఏ కేంద్రాల్లో ఉండటంతో అక్కడున్న ఆదివాసీ కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వారికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇప్పటికే తయారీ యూనిట్లలో పనిచేసేందుకు దాదాపు 120 మంది మహిళలను జీసీసీ ఎంపిక చేసింది. వీరికి ఇక్రిశాట్లో గత నెలలో శిక్షణ తరగతులు సైతం నిర్వహించారు. ఉత్పత్తులకు తగిన విధంగా వారికి పారితోషికాన్ని ఇవ్వనుంది. జీసీసీ బ్రాండ్‌కు మరింత క్రేజ్ పెరగడం, జీసీసీ బిజినెస్‌ను మరింత విస్తృతం చేసేందుకు మిల్లట్ వ్యాపారం దోహదపడుతుందని, ఈ పరిశ్రమతో ప్రత్యక్షంగా 120 కుటుంబాలు, పరోక్షంగా 150 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు వి.సర్వేశ్వర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. వంటల తయారీకి ఇక్రిశాట్ ఫార్ములా.. జొన్న రకంతో చేసిన కిచిడీ, రాగులు, నువ్వులు, కొర్రలతో చేసిన పట్టీలు(చిక్కీలు), రెండు అంతకంటే ఎక్కువ తృణధాన్యాల మిశ్రమంతో (మల్టీమిల్లట్) స్వీట్లు తయారు చేయనుంది. వీటి తయారీకి ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు రూపొందించిన ఫార్ములాను వినియోగించనుంది. ఏటా రూ.1.25 కోట్లు చెల్లించి ఇక్రిశాట్ సహకారం తీసుకుంటోంది. -
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య ( హైదరాబాద్‌లోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల) నియామకమయ్యారు. -
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం
- జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో స్థాపించిన పరిశ్రమలకు సంబంధించి విద్యుత్ రాయితీ, పావలా వడ్డీ, సేల్స్ ట్యాక్స్ రాయితీ, స్టాంప్ డ్యూటీ, పెట్టుబడి రాయితీకి సంబంధించి మొత్తం రూ. 12 కోట్ల మంజూరుకు అనుమతి ఇచ్చామన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, ఇతర అంశాలపై జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖరరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. వీలైనంత మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు అనంద్నాయక్, మదన్మోహన్శెట్టి, శ్రీదేవి, ఆంధ్రప్రదేశ్ చిన్న పరిశ్రమల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జీపీఆర్రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్ఈ భార్గవరాముడు పాల్గొన్నారు. -
మద్యం వ్యాపారుల మీమాంస
జంగారెడ్డిగూడెం : లాటరీలో మద్యం దుకాణాలు దక్కినా ఎక్కడ ఏర్పాటు చేయాలనే సందిగ్ధంలో వ్యాపారులు ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర, జాతీయ ప్రధాన రహదారులకు 500 మీటర్లకు పైబడి మద్యం దుకాణాలు ఏర్పాటుచేయాల్సి ఉంది. అలాగే మద్యం దుకాణాలను సూచి స్తూ బోర్డులు పెట్టకూడదు. ఈ నేపథ్యంలో దుకాణాలు ఎక్కడ పెట్టాలో తెలియక మద్యం వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో దుకాణాలు రాష్ట్ర, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్నాయి. కొత్త నిబంధనలతో జనావాసాల మధ్య లేదా ఒకే ప్రాంతంలో నాలుగైదు దుకాణాలు పెట్టాల్సి ఉంది. ఇది వ్యాపారులకు మింగుడు పడటం లే దు. జనావాసాల మధ్య పెట్టాల్సి వస్తే గుడి, బడికి దూరంగా ఉండాలి. ఆ ప్రాంతంలో మహిళల నుంచి ప్రతిఘటన ఎదురుకాకుండా చూసుకోవాలి. ఒకే ప్రాంతంలో నాలుగైదు దుకాణాలు గతంలో ప్రాంతాల వారీగా షాపులను కేటాయించి లాటరీ నిర్వహించేవారు. అయితే మారిన నిబంధనల నేపథ్యం లో ఓ పట్టణంలో సుమారు 10 దుకా ణాలు ఉంటే వారు పట్టణ పరిధిలో ఎక్కడైనా నిబంధనలు ధిక్కరించకుం డా ఏర్పాటుచేసుకోవచ్చు. దీంతో ఒకే ప్రాంతంలో నాలుగైదు షాపులు పోటీ పడీ మరీ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఏ ప్రాంతంలో వ్యాపారం అధికంగా ఉంటుందో అక్కడ ఎక్కువ దుకాణాలు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. దీంతో ఉన్న వ్యాపారం తగ్గుతుందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఈ నిబంధనలతో గతంలో మద్యం దుకాణాలు నిర్వహించే వారికి తలబొప్పి కడుతుంటే కొత్త వారికి దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నాయి. అత్యుత్సాహంతో టెండర్లు వేసి మద్యం షాపులు లాటరీలో తగిలినా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. లాటరీ లో తగిలినా అమ్మేసుకుందామంటే నిబంధనలు కఠినంగా ఉండటంతో మద్యం సిండికేట్లు సైతం కొనుగోలు కు ముందుకు రావడం లేదు. విధిగా ఎమ్మార్పీకే.. లైసెన్స్ ఫీజులు గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం అదే క్రమంలో మార్జిన్‌ను 8 శాతానికి పరిమితం చేసిం ది. విధిగా ఎమ్మార్పీకే విక్రయించాలనే నిబంధన విధించింది. దీనిని అత్రికవిు స్తే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అపరాధ రుసుం విధించే అవకాశం ఉంది. ఇక మామూళ్ల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారం లాభించేనా అని వ్యాపారులంతా సందిగ్ధంలో ఉన్నారు. ఉదాహరణకు.. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం పట్ట ణాన్ని తీసుకుంటే ఏలూరు రోడ్డు నుంచి బుట్టాయగూడెం బైపాస్ రోడ్డు వరకు, కాకర్ల జంక్షన్ నుంచి బైపాస్ వరకు, పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి వారపు సంత వరకు, రాష్ట్ర రహదారి (బైపాస్)లో షాపులు పెట్టేందుకు అవకాశం లేదు. వాస్తవానికి ఈ ప్రాంతంలోనే సుమారు 5 దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. పట్టణంలో ఏడు షాపులకు అనుమతి ఉంది. దీని ప్రకారం చూస్తే ఒక కొవ్వూరు రోడ్డు, అశ్వారావుపేట రోడ్డు మినహా ఏ ప్రాంతంలోనూ షాపులు పెట్టుకునే అవకాశం లేదు. దీంతో షాపులన్నీ ఈ రెండు రోడ్డుల్లోనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. జనా వాసాల మధ్య పెడదామన్నా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
గ్రామీణ ఉపాధికి పరిశ్రమల స్థాపన
ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ పటేల్ కడియం : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన లక్ష్యంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఏవీ పటేల్ చెప్పారు. ఆయన సారథ్యంలోని పలువురు అధికారుల బృందం మండలంలోని జేగురుపాడు పంచాయతీ పరిధిలోని పాములమెట్ట కాలనీ వద్ద గల స్థలాన్ని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున ది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం జేగురుపాడు పంచాయతీ పరిధిలోని, మండపేట మండలం వేములపల్లిలోని, రాజానగరం మండలం కొండ గుంటూరుల్లోని స్థలాలను పరిశీలించినట్టు వివరించారు. పాములమెట్ట వద్ద గన్న 38.67 ఎకరాల స్థలంఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఈ నెల 15న పార్కు నిర్మాణ చర్యలు ప్రారంభమవుతాయన్నారు. ఈ బృందంలో పటేల్‌తోపాటు ఏపీఐఐసీ జీఎం పి. నాగేశ్వరరావు, మేనేజర్ జ్యోత్సS్న, డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ సుందర్‌కుమార్, రిటైర్డ్ ఏడీ ఆఫ్ సర్వేస్ వి. సోమరాజు తదితరులు ఉన్నారు. కాగా వైస్ ఎంపీపీ వెలుగుబంటి రఘురామ్ ఈ బృందాన్ని కలిసి భూములను గురించి వివరించారు. స్థానిక నాయకులు కూడా ఉన్నారు. -
మోక్షంలేని మోడల్ స్కూళ్లు
మోర్తాడ్ : గ్రామీణ స్థాయిలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీయస్ఈ) సెలబ స్ను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు కొన్ని మండలాలకే పరిమితం అయ్యాయి. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో యూపీఏ సర్కార్ మండలానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటుకు నిధులను కేటాయించింది. అయితే ఇప్పటి ఎన్డీఏ సర్కార్ మోడల్ స్కూళ్ల నిర్వహణ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై మోపడమే కాకుండా కొత్త మోడల్ స్కూ ళ్ల ఏర్పాటుకు నిధులను కేటాయించడం లేదు. దీంతో మోడల్ పాఠశాలల విద్య పరిమితం అయి ఎక్కువ మంది విద్యార్థులు లబ్ధిపొందలేక పోతున్నారు. సీబీయస్ఈ సిలబస్ ద్వారా ప్లస్ టూ వరకు ఉచితంగా మెరుగైన విద్యను అందించడానికి మోడల్ స్కూళ్ల అంకురార్పణ జరిగింది. రెసిడెన్సియల్ విధానంతో పాటు డే స్కాలర్ విధానంలో మోడల్ స్కూళ్లలో విద్యను అందించడానికి ఏర్పాట్లు చేశారు. మోడల్ స్కూ ళ్ల ఏర్పాటుకు ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించింది. సొంత భవనాల నిర్మాణం కోసం 2014 అక్టోబర్24 జీవో నంబర్ యంయస్ 8 ద్వారా ఒక్కో మోడల్ స్కూల్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.4.80 కోట్లను కేటాయింది. అయితే జిల్లాలో మొదట 15 చోట్ల స్థలాల సేకరణ వేగంగా జరగడంతో 15 మోడల్ స్కూళ్ల నిర్మాణం పూర్తయింది. బాల్కొండ మండలంలో మాత్రం స్థల సేకరణ విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మోడల్ స్కూల్ నిర్మాణం మొదలయ్యే సమయంలో పనులు నిలిచిపోయాయి. 21 మండలాల్లో పాఠశాలల కోసం స్థల సేకరణలో జాప్యం ఏర్పడటంతో కేంద్ర ప్రభుత్వం తన నిధులను వెనక్కి తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 21 మండలాలకు అన్యాయం జరిగిందని పలువురు విమర్శస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి, రెండు మండలాల్లో మోడల్ స్కూళ్లు ఉండగా ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ఎక్కడ కూడా మోడల్ స్కూళ్ల నిర్మాణం సాగలేదు. ఐదు మండలాల్లో స్థల సేకరణ పూర్తి అయినా కేంద్రం మనసు మారడంతో ఈ మండలాల్లోని విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పాఠశాలలను సక్సెస్ స్కూళ్లుగా మార్చి వాటిలో ఆంగ్ల మాధ్యమంను అమలు చేస్తోంది. సక్సెస్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో పదో తరగతి చదివిన విద్యార్థులకు ఇంటర్ ఇంగ్లిష్ మీడియంలో సీట్లు లభించడానికి మోడల్ స్కూళ్లు ఒక్కటే మార్గంగా ఉన్నాయి. అయితే మోడల్ స్కూళ్ల సంఖ్య తక్కువగా ఉండటంతో విద్యార్థులకు సరిపడేంత సీట్లు ఉండటం లేదు. మోడల్ స్కూళ్ల సంఖ్య ఎక్కువగా ఉండిఉంటే ఇంటర్ ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులకు అవకాశం లభించేది. మోడల్ స్కూళ్లు లేని మండలాలు ఇవే... జిల్లాలోని మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ, భీమ్‌గల్, వేల్పూర్, కామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, గాంధారి, తాడ్వాయి, లింగంపేట్, బోధన్, ఎడపల్లి, నిజామాబాద్, కోటగిరి, బీర్కూర్, మాక్లూర్, భిక్కునూర్ మండలాల్లో సరైన సమయంలో స్థల సేకరణ జరుగకపోవడంతో మోడల్ స్కూళ్లు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు స్థలాలు ఉన్నా నిధులు కేటాయించకపోవడంతో మోడల్ విద్య విద్యార్థులకు అందడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మోడల్ పాఠశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
కన్నుల పండువగా సరస్వతీ విగ్రహ ప్రతిష్ట
నకిరేకల్ : నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని షిర్డిసాయిబాబా మందిర అష్టమ వార్షికోత్సవాలలో భాగంగా గురువారం జ్ఞాన సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ప్రతిష్ట వేడుకలలో భాగంగా సాయినాధునికి పాలాభిషేకాలు నిర్వహించారు. జగద్గురు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి.. సరస్వతీ దేవి విగ్రహాన్ని షిర్డిసాయిబాబా మందిరంలో భక్తుల కోలాహలం మధ్య ప్రతిష్టాపించారు. అష్టమ వార్షికోత్సవాలు, సరస్వతి విగ్రహ ప్రతిష్ట వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేద మంత్రోత్సరణల మధ్య ఆలయంలో నూతనంగా ప్రతిష్టించిన సరస్వతీ దేవి విగ్రహాన్ని భక్తులు బారులు తీరి దర్శించుకుని, సాయి నాధునికి పూజలు నిర్వహించారు. హాజరైన భక్తులకు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతిస్వామి వారు ప్రవచనాలు, ఆశ్శీర్వచనాలు ఇచ్చారు. ఈ ప్రతిష్ట మహోత్సవ వేడుకలలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి, డాక్టర్ జేఏసీ జిల్లా కన్వీనర్ డాక్టర్ రాపోలు రఘునందన్ పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా హాజరైన భక్తులందరికి అన్నదానం చేశారు. -
భూసమస్యల పరిష్కారానికి శిక్షణ
పీవో వీరపాండియన్ :భద్రాచలం, న్యూస్‌లైన్: వివిధ రకాలైన భూ సమస్యల పరిష్కారం కోసం ఇందిరా క్రాంతి పధం ఏర్పాటు చేసిన ‘మన భూమి, మన హక్కు’ అనే శిక్షణ గిరిజన రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గిరిజన చిన్న, సన్నకారు రైతులకు భూ హక్కులు కల్పించినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని అధిగమించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. భూమిసబ్ కమిటీ సభ్యులుగా మండల సమాఖ్య ఉన్నందున వారికి అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా వారు గిరిజనులను చైతన్యపరుస్తారని పేర్కొన్నారు. పలు సంవత్సరాలుగా చిన్న సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోక ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు న్యాయం చేసేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వారికి సరైన న్యాయం జరగాలంటే సరైన శిక్షణ అవసరమని, అందుకే ఐకేపీ ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నామని అన్నారు. భూమి అనేది నిరుపేదలకు ఒక హోదాను కల్పిస్తుందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఎల్టీఆర్, రిజర్వ్ ఫారెస్టు భూములపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పహాణీలు తమ పేరు మీద ఉన్నా పాస్‌పుస్తకం, టైటిల్ డీడ్ లేని వారు చాలా మంది ఉన్నారని, అటువంటి సమస్యలను పరిష్కరించటానికి కృషి చేయాలని మహిళా సమాఖ్యలకు సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్‌గుప్తా, అధికారులు ఎంవీ రామారావు, జయశ్రీ పాల్గొన్నారు. ‘క్వెస్ట్’ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందిస్తున్న క్వెస్ట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలని ఐటీడీఏ పీఓ వీరపాండియన్ సూచించారు. ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు స్థానిక బీఈడీ కళాశాలలో జరుగుతున్న క్వెస్ట్ రెండో రోజు శిక్షణ కార్యక్రమానికి పీఓ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్ధులకు గుణాత్మకమైన విద్యను అందించటం కోసమే క్వెస్ట్ అని తెలిపారు. కార్పోరేట్ విద్యసంస్థలకు పోటీగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులకు తరచూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందించడం వల్ల వారిలో బోధనా సామర్ధ్యం మెరుగవుతుందని అన్నారు. దీని వల్ల విద్యార్థులకు మేలు జరుగుతుందని అన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అందించే సూచనలు, సలహాలను స్వీకరిస్తారని అన్నారు. శిక్షణ అనంతరం ఉపాధ్యాయులు మెరుగైన తీరుతో భోధనను సాగించాలని పీవో అన్నారు. అనంతరం పీవో ఉపాధ్యాయులతో కలిసి సహపంక్తి భో జనం చేశారు. కార్యక్రమంలో ఏజెన్సీ డీఈవో ఎన్ రాజేష్, ఏటీఓ ఏవీ రామారావు, ప్రిన్సిపాల్ వి రామ్మోహన్, రిసోర్స్‌పర్సన్స్ నాగమణి, వీరభద్రం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.