Telangana News: వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడింది: సీఎం కేసీఆర్‌
Sakshi News home page

వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడింది: సీఎం కేసీఆర్‌

Published Sat, Sep 16 2023 12:58 AM | Last Updated on Sat, Sep 16 2023 8:17 AM

- - Sakshi

నిర్మల్‌: తెలంగాణ అంతటా మెడికల్‌ కళాశాలల ఏర్పాటుతో వైద్య విద్యార్థుల భవిష్యత్‌కు బంగారుబాట పడిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్యకళాశాలతోపాటు రాష్ట్రంలో మరో ఎనిమిది కళాశాలలను సీఎం కేసీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం వర్చువల్‌ విధానంలో ఒకేసారి ప్రారంభించారు.

అనంతరం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 26 మెడికల్‌ కాలేజీలున్నాయని.. భవిష్యత్‌లో మరో ఎనిమిదింటిని ప్రారంభిస్తామని చెప్పారు. తెలంగాణ ఏటా 10వేల మంది వైద్యులను దేశానికి అందించబోతోందని తెలిపారు. లక్ష జనాభాకో 22 మెడికల్‌ సీట్లు ఉన్న ఏకై క రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.

500 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని, రాష్ట్రంలో 10 వేల సూపర్‌ స్పెషాలిటీ బెడ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పేద గర్భిణులకు కేసీఆర్‌ కిట్లు, న్యూట్రిషన్‌ కిట్లు ఇస్తున్నామని, గర్భిణులకు ఇబ్బంది లేకుండా అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు చర్యలు చేపట్టామని, ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 76 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు.

వైద్యరంగంలో అరుదైన ఘట్టం..
జిల్లా వైద్యరంగంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు అరుదైన ఘట్టమని స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ వర్చువల్‌గా వైద్యకళాశాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ చొరవతో నిర్మల్‌ జిల్లా కేంద్రంగా ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం కేసీఆర్‌ చేతుల మీదుగానే నిర్మల్‌లో మెడికల్‌ కాలేజీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. పేదలకు ప్రభుత్వ వైద్యం మరింత చేరువైందని తెలిపారు. నిర్మల్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.

పేదలకు కార్పొరేట్‌ స్థాయి సేవలు..
జిల్లాలో మెడికల్‌ కాలేజీ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని, ఇక పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా యువత వైద్యవిద్య కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదని తెలిపారు.

సంతోషంగా ఉంది..
మా నాన్న జిల్లా ప్రసూతి ఆస్పత్రిలో ఫార్మసిస్ట్‌గా కాంట్రాక్ట్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. డాక్టర్‌ చదవాలనే నా లక్ష్యానికి అంకురార్పణ ఇక్కడే జరిగింది. సొంత జిల్లాలోనే నాకు సీటు రావడం సంతోషంగా ఉంది. ఈ జిల్లా బిడ్డగా బాగా చదివి మంచి డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటా. కళాశాలకు మంచిపేరు తెస్తా. – జారా నవాల్‌, నిర్మల్‌

అమ్మ కల నిజం చేస్తా..
డాక్టర్‌ కావాలని చిన్నప్పటి నుంచి కలగన్న. మా అమ్మ జిల్లా ఆస్పత్రిలో 20 ఏళ్లుగా స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్నారు. అమ్మ నన్ను డాక్టర్‌ను చేయాలనే ఆశతో చదివించారు. అమ్మ కల నిజం చేసేరోజు వచ్చింది. సీటు సాధించేందుకు కష్టపడ్డా. సొంత జిల్లాలో చదివే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. – ఎస్‌.భానుతేజ, నిర్మల్‌

నేను చదువుకోలేకపోయినా..
నేను ఆటో నడుపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న. నేను చదువులో అంతగా రాణించలేదు. నాలాగా నా కుమారుడు కావద్దని అతడిని కష్టపడి చదివించిన. ఇప్పుడు పక్క జిల్లాలోనే మెడికల్‌ కాలేజీలో సీటు రావడం సంతోషంగా ఉంది. నా కుమారుడు మంచి డాక్టర్‌ కావాలన్నదే నా కోరిక. – విజయ్‌కుమార్‌, ఆదిలాబాద్‌, విద్యార్థి తండ్రి

మంచి డాక్టర్‌గా ఎదుగుతా..
ఎంతో కష్టపడితేనే నిర్మల్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు వచ్చింది. ఈరోజు నుంచి క్లాసులు ప్రారంభం కావడం.. నాన్నతో వచ్చి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివి మంచి డాక్టర్‌గా ఎదుగుతా. – సమ్మిత్‌, ఆదిలాబాద్‌

సైకియాట్రిస్ట్‌ను అవుతా..
తెలంగాణలో మెడికల్‌ సీట్లు పెంచడం వల్లే నాకు అవకాశం వ చ్చింది. నేను సైకియాట్రిస్ట్‌ను అవుతా. డాక్టర్‌ కోర్సు పూర్తిచేశాక పేదలకు సేవ చేస్తా. ఇక్కడి కళాశాలలో సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి. – నందిని, నిజామాబాద్‌

చాలా దగ్గరగా ఉంది..
గతంలో ఎంబీబీఎస్‌ చదవాలంటే ఇబ్బందిగా ఉండేది. కాలేజీ నాకు దగ్గరగా ఉంది. ఇక్కడకు వచ్చి వెళ్లడం చాలా సులభం. చదువు పూర్తిచేశాక పేదలకు సేవలందిస్తా. మా నాన్న వైద్యుడే. ఆయన ప్రోత్సాహంతో డాక్టర్‌ కావాలనుకుంటున్నాను. – మహిన్‌, ఆర్మూర్‌

అక్కలాగే కావాలని..
మా అక్కయ్య వికారాబాద్‌లో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతోంది. నేను కూడా మా అక్క లాగే డాక్టర్‌ కావాలనుకుని కష్టపడి చదివి సీటు సంపాదించాను. మన జిల్లాలోని మెడికల్‌ కాలేజీలో సీటు రావడం ఆనందంగా ఉంది. – ఆదుముల్ల శశివర్ధన్‌, భైంసా

జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ..
జిల్లా కేంద్రంలో నూతన మెడికల్‌ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైద్యారోగ్యశాఖ శకటం ముందు నడవగా రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌, ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, మాజీ చైర్మన్‌ అప్పాల గణేశ్‌, ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్‌ నాయక్‌, నాయకులు అల్లోల గౌతమ్‌రెడ్డి, పాకాల రాంచందర్‌, అల్లోల మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, రామ్‌కిషన్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, రాము, లక్ష్మణాచారి, విద్యార్థులు, ప్రైవేట్‌ ఆస్పత్రుల డాక్టర్లు, వైద్యసిబ్బంది, ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పండుగ వాతావరణంలో మంచిర్యాల చౌరస్తా మీదుగా దివ్యాగార్డెన్స్‌ వరకు కొనసాగింది. దారి పొడవునా డీజే పాటలతో విద్యార్థులు, యువకులు నృత్యాలు చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, ర్యాలీ సందర్భంగా మంత్రి ఐకేరెడ్డి నృత్యం చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అనంతరం దివ్యాగార్డెన్స్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement