TS Assembly District Politics
-
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన శ్రీనివాస్‌రెడ్డి.. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మంత్రివర్గ కూర్పు పూర్తయిన కొద్ది రోజులకే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రులను నియమించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌కు ఇన్చార్జ్ మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ, వరంగల్, హనుమకొండ జిల్లాలకు, సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, ములుగు, జేఎస్ భూపాలపల్లి జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రిగా వ్యవహరించారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఉమ్మడి జిల్లాకు ఒకే మంత్రిని.. అది ఇతర జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నియమించింది. గతంలోనూ(రాష్ట్ర విభజనకు ముందు) కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాంరెడ్డి వెంకట్‌రెడ్డిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా కొనసాగించింది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురించి.. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి .. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ నుంచి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. పాలేరు ఎమ్మె ల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి 2016లో మృతి చెందారు. అదే సంవత్సరం పొంగులేటి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాంరెడ్డి వెంకట్‌రెడ్డి మృతితో వచ్చిన ఉపఎన్నికల్లో తుమ్మల నాగేశ్వర్రావు బీఆర్ఎస్ నుంచి గెలుపొందాడు. తుమ్మల గెలుపులో శ్రీనివాస్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే 2019 వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన తనకే తర్వాత ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తిరిగి ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తారని ఆశించగా.. నామా నాగేశ్వర్రావుకు కేటాయించడం పొంగులేటిని అసంతృప్తికి గురిచేసింది. పార్టీ నేతల జోక్యంతో ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేసిన శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీలో ఇమడ లేక పోయారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి జూలై 2న కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖలు నిర్వహిస్తున్న ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. కాగా తాజాగా నియామకమైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏసీడీపీ తదితర నిధుల వినియోగం, ఎమ్మెల్యే, ముఖ్యనేతలను సమన్వయం చేయడంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాల అమలును పర్యవేక్షిస్తారు. ఇవి కూడా చదవండి: ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క! -
ముగ్గురూ ముగ్గురే! ఎమ్మెల్యేలుగా తొలిసారి ఎన్నిక..
కామారెడ్డి: జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్క బాన్సువాడలోనే సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మూడు దశాబ్దాల కాలంలో ఒక్కసారి తప్ప ప్రతి ఎన్నికలో విజయం సాధించారు. మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్‌గానూ పనిచేశారు. అన్ని వ్యవస్థల మీద ఆయనకు అవగాహన ఉంది. కామారెడ్డి నుంచి తొలిసారి విజయం సాధించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. ఎల్లారెడ్డి నుంచి గెలిచిన కె.మదన్‌మోహన్‌రావుకు ప్రజాప్రతినిధిగా ఇది తొలి అనుభవం. ఆయన గతంలో రెండు పర్యాయాలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉన్నత విద్యావంతుడైన మదన్మోహన్రావు అమెరికాలో సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో రాణించారు. పదేళ్లుగా ఇక్కడే ఉంటూ అనేక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాలపై 20 నిమిషాలపాటు మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలనూ కేస్ స్టడీస్‌గా చూపుతూ రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో లోటుపాట్లను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. జుక్కల్‌లో తోట లక్ష్మీకాంతారావు కూడా తొలిసారి విజయం సాధించారు. ఉన్నత విద్యావంతుడైన లక్ష్మీకాంతారావు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. అలాగే వ్యాపార, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అధికారులతో సమీక్షలు.. జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు తొలిసారి విజయం సాధించినప్పటికీ వ్యవస్థల మీద ఉన్న అవగాహనతో ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అవినీతి రహిత నియోజకవర్గంగా కామారెడ్డిని తీర్చిదిద్దడానికి సహకరించాలని అధికారులను కోరారు. ప్రభుత్వాలు అందించే సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా, అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. మున్సిపల్ సమావేశానికి హాజరై పట్టణాభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని కోరారు. అక్రమాలకు తావులేకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నియోజకవర్గ కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో పాటు జిల్లా అధికారులందరూ హాజరయ్యారు. నియోజకవర్గం అభివృద్ధిలో ముందు స్థానంలో నిలిచేలా కృషి చేయాలని కోరారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు సైతం ఇటీవల కలెక్టరేట్లో అధికారులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ.. అసెంబ్లీ సమావేశాలు జరిగిన సమయంలో తప్ప మిగతా రోజుల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలోనూ పాల్గొంటున్నారు. అలాగే ఎమ్మెల్యే హోదాలో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. ఇవి చదవండి: జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ‘పొంగులేటి’! -
ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా మంత్రి సీతక్క!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు చేశారు. ఇన్చార్జి మంత్రిగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పథకాలు, పాలన తీరుపై సమీక్షలు, సమావేశాల నిర్వహణ, ప్రజాపాలనపై పర్యవేక్షణ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో జరిగే ప్రభుత్వ వ్యవహారాలన్నీ సమన్వయం చేస్తారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ఇన్చార్జి మంత్రిగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఎస్టీ రిజర్వు కావడంతో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ములుగు ఎమ్మెల్యేను సీతక్కను జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వ్యవహరించారు. ఇవి చదవండి: ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుంటాం -
T Congress: సీతక్కకు సవాల్.. ఆయనకేమో సులువు?
సాక్షి, ఆదిలాబాద్: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టింది. జనవరిలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలో పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించింది. ఆదిలాబాద్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను, పెద్దపల్లికి ఐటీ, అసెంబ్లీ వ్యవహా రాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబును నియమించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలిచింది. రెండుచోట్ల బీఆర్ఎస్, ఒకచోట కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇక పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అన్నీ కాంగ్రెస్ కై వసం చేసుకుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడం శ్రీధర్‌బాబు పెద్దకష్టం కాదని ప్రచారం సాగుతోంది. శ్రీధర్‌బాబుకు సులువేనా.. ఇక పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమితులైన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇదే నియోజకవర్గ పరిధిలోని మంథని శాసనసభ్యుడు. గతంలో కాంగ్రెస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. స్థానిక నేతలపై పట్టు ఉంది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ హవాతో అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్‌నేత ఎంపీగా గెలిచారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేసింది. చెన్నూర్, మంచిర్యాల, మంథని, రామగుండం, పెద్దపల్లి, ధర్మపురిలో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఆరు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రెండో స్థానంలో, మంచిర్యాల నియోజకవర్గంలో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపుతుండగా, బీఆర్ఎస్ 2019 ఫలితాలను పునరావృతం చేయాలని చూస్తోంది. అయితే ఇక్కడ పార్టీని గెలిపించడం శ్రీధర్‌బాబుకు సులువే అన్న చర్చ సాగుతోంది. ఈ బాధ్యత ఇన్‌చార్జీలదే.. ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు బాధ్యతలను కూడా ఇన్‌చార్జీలే తీసుకోనున్నారు. అయితే ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఆరుచోట్ల ఎమ్మెల్యేలు లేకపోవడంతో అక్కడ ఆ పథకాల అమలు పరంగా ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారిని పరిగణలోకి తీసుకుని ముందుకెళ్తారా.. లేక ఇతర ముఖ్య నాయకుల కు ప్రాధాన్యతనిస్తారనేది చూడాలి. ఇక పెద్దపల్లిలో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో సంక్షే మ పథకాల అమలులో ఆ పార్టీకి పెద్దగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం లేదు. డిసెంబర్ 28 నుంచి గ్రామసభలు నిర్వహించి పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక చేయనున్నారు. ఈ క్రమంలో ఇన్చార్జీలు కీలకం కానున్నారు. సీతక్కకు సవాలే.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా నియమితులైన సీతక్కకు ఇక్కడ సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ విజయఢంకా మోగించింది. ఎంపీగా సోయం బా పూరావు విజయం సాధించారు. గడిచిన శాస న సభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ పరిధిలోని ఆది లాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు కమలం ఖాతాలో చేరా యి. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీ ఆర్ఎస్ పార్టీ తమ ప్రాబల్యం నిలుపుకుంది. కేవలం ఖానాపూర్ నియోజకవర్గంలో మాత్ర మే కాంగ్రెస్ గెలిచింది. ఇదిలా ఉంటే గతంలో సీతక్క ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరి ధిలో పలుమార్లు పర్యటించారు. నాయకులు, పార్టీ స్థితిగతులపై అవగాహన ఉంది. అ యితే ప్రతికూల పరిస్థితుల నుంచి విజయాన్ని అందుకోవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో లోక్‌సభ సీటును గెలిపించడం సీతక్కకు సవాలే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధరణ! -
'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్ శంకర్‌నాయక్
మహబూబాబాద్: పార్టీ శ్రేణులు కసిగా పనిచేయకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులు కన్నీరు కారుస్తున్నారని, ఓటు వేసే ముందు ఆలోచిస్తే బాగుండేదన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిందని, ఏం పాపం చేశామని ఎన్నికల్లో ప్రజలు మోసం చేశారో తెలియడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది స్వార్థపరులు పార్టీలో లబ్ధిపొంది ఎన్నికల ముందు బయటకు వెళ్లిపోయారని, మరి కొంతమంది పార్టీలో ఉంటూ మోసం చేశారన్నారు. అలాంటి వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇక మీదట పార్టీ శ్రేణులు ఐక్యంగా ఉండి, కసిగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ, నీలం దుర్గేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎండి.నజీర్అహ్మద్, ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గండు సావిత్రమ్మ, జాటోత్ హరీశ్‌నాయక్, ఊకంటి యాకూబ్‌రెడ్డి, సట్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: పురపాలికల్లో మోగుతున్న అవిశ్వాస గంట -
సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం!
జగిత్యాల/పెద్దపల్లి: ప్రస్తుతం సర్కారు ఖజానాలో పైసల్లేవని, క్రమశిక్షణతో ఆదాయం పెంచుకుంటామని ఐటీ, పరిశ్రమలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం పది రోజుల్లో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన శ్రీధర్‌బాబు ఆదివారం జిల్లాలో పర్యటించారు. తొలుత సుల్తానాబాద్ మండలానికి చేరుకున్న ఆయన.. పెద్దపల్లి, కమాన్‌పూర్, సెంటినరీకాలనీ మీదుగా మంథని చేరుకున్నారు. అడుగడగునా ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్‌సింగ్ మంత్రి వెంట ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం! జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లి రూపురేఖలు మార్చుతామని, అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఉన్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరం మేరకు మరిన్ని పరిశ్రమలు స్థాపిస్తామని హామీ ఇచ్చారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ, నియోజకవర్గానికి మంత్రి శ్రీధర్‌బాబు అండదండలు ఉండాలన్నారు. గతంలోనూ తనకెంతో సహకారం అందించారని గుర్తుచేశారు. స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు.. సీఎం రేవంత్‌రెడి ఎమ్మెల్యే విజ్జన్నకు అత్యంత సన్నిహితులన్నారు. తామంతా కలిసే జిల్లా అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. జిల్లాతో తనకెంతో అనుబంధం ఉందని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మంత్రి ఆదేశాలు అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. ఆరు గ్యాంరెటీలు అమలు చేస్తాం! ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, మరో 15 రోజుల్లో ఇంకో రెండు అమలు చేస్తామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ , పెద్దపల్లికి బైపాస్ రోడ్డు, బస్ డిపో, జిల్లా కోర్టు, 50 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరు చేయిస్తామన్నారు. కాగా, సుల్తానాబాద్ ర్యాలీలో పలువురు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తూ నాయకులు, ప్రజాప్రతినిధుల పర్సులు చోరీచేశారు. ప్రజలు శాంతి కోరుకున్నారు.. కమాన్‌పూర్ మండలం గొల్లపల్లె వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు. కమాన్‌పూర్ ఎక్స్ రోడ్డు మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గంలో రౌడీయిజం రాజ్యామేలిందన్నారు. ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుని కాంగ్రెస్‌కు ఓట్లేసి గెలిపించారని అన్నారు. నాయకులు వైనాల రాజు, ఇనగంటి భాస్కర్‌రావు, కోలేటి మారుతి, తొట్ల తిరుపతియాదవ్, ఆకుల ఓదెలు, కట్కం రవీందర్, తొగరి అన్నపూర్ణ పాల్గొన్నారు. ఇవి చదవండి: అడవిబిడ్డకు అపూర్వ స్వాగతం.. మల్లంపల్లిలో మాట్లాడుతున్న సీతక్క! -
గండం గట్టెక్కేనా..? మున్సిపల్ పాలకవర్గాలు సతమతం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపల్ పాలకవర్గాలపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. పాలకవర్గాల్లో నెలకొన్న విభేదాలు, రాజకీయ కారణాలతో పదవీ కాలం పూర్తి కావడం సందేహంగానే కనిపిస్తోంది. ఇల్లెందు, వైరా మున్సిపల్ చైర్మన్లపై గతంలోనే పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందజేశారు. ఇల్లెందుకు సంబంధించి ఫార్మాట్లో లేదని కలెక్టర్ తిరస్కరించగా.. మరోసారి నోటీసు ఇచ్చారు. వైరా చైర్మన్‌పై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అందజేయగా.. చట్టంపై స్పష్టత లేకపోవడంతో నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో పాత మున్సిపల్ చట్టం ఆధారంగా అవిశ్వాస అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వైరా, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్‌లో, ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం మున్సిపల్ పాలకవర్గాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యాన ఎక్కడెక్కడ అవిశ్వాసం పెట్టే అవకాశముంది, తద్వారా పాలకవర్గాలు మారుతాయా అనే చర్చ జరుగుతోంది.' ఇక్కడా సందేహమే.. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు అన్నీ బీఆర్ఎస్సే గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఐదుగురు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 18కి తగ్గింది. ఇక్కడ బీఆర్ఎస్కు చెందిన కూసంపూడి మహేష్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తోట సుజలారాణి ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు చెందిన కాపు సీతాలక్ష్మి చైర్‌పర్సన్‌గా, వేల్పుల దామోదర్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. చైర్‌పర్సన్‌పై వ్యతిరేకతతో బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు గతంలో అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించినా, ఇప్పుడెలాంటి కదలికా లేదు. ఇక్కడ 36 వార్డులకు గాను బీఆర్ఎస్కు 25, సీపీఐకి ఎనిమిది మంది, కాంగ్రెస్‌కు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల ముందు సీపీఐ కౌన్సిలర్లు ఐదుగురు బీఆర్ఎస్లో చేరగా ఆ పార్టీ బలం 30కి పెరిగింది. సీపీఐకి ముగ్గురే మిగిలారు. మధిరలో 22 వార్డులకు బీఆర్ఎస్కు 15 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, టీడీపీ నుంచి ముగ్గురు, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు గెలిచారు. బీఆర్ఎస్కు చెందిన ఎరగ్రుంట లక్ష్మి, మొండితోక నాగరాణి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. స్వతంత్ర కౌన్సిలర్ గద్దల మాధురి ప్రమాణ స్వీకారానికి ముందే బీఆర్ఎస్లో చేరారు. 20వ వార్డు కౌన్సిలర్ ముత్తవరపు రాణి అనారోగ్యంతో మృతి చెందగా ఆ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్లో 13 మంది, కాంగ్రెస్‌కు నలుగురు, టీడీపీ ముగ్గురు, సీపీఎంకు ఒకరు ఉన్నారు. చైర్ పర్సన్ మొండితోక లత, వైస్ చైర్పర్సన్ శీలం విద్యాలత బీఆర్ఎస్లో గెలిచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. పాలకవర్గాల్లో విభేదాలు! ఏడాది కాలంగా పలు మున్సిపల్ పాలకవర్గాల్లో విభేదాలు పొడచూపాయి. పార్టీ తరఫున ఎన్నికై న చైర్మన్లకు, నాయకత్వానికి పొసగకపోవడం, కౌన్సిలర్లు – చైర్మన్‌కు మధ్య విభేదాల వంటి కారణాలతో అవిశ్వాసానికి అడుగులు పడ్డాయి. మరికొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానానికి నిర్ణయించినా సర్దుబాట్లతో ముందుకు సాగలేదు. ఇల్లెందు, వైరాలో మాత్రం అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందాయి. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలని చట్టంలో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని నాలుగేళ్లకు పెంచి గవర్నర్‌కు పంపించగా ఆమోదం లభించలేదు. దీంతో ఇల్లెందు, వైరా తీర్మానాలపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోలేదు. మరోసారి తెరపైకి.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అవిశ్వాస అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన నాలుగేళ్ల చట్టానికి గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో, మూడేళ్లు దాటిన పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గాలు 2020 జనవరిలో కొలువుదీరాయి. ప్రస్తుతం మూడేళ్లు దాటడంతో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది. గతంలో అవిశ్వాసానికి యత్నించిన వైరా, ఇల్లెందు మున్సిపాలిటీల చైర్మన్లు ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడంతో బలాబలాలు మారాయి. మిగతా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నా.. వచ్చే నాలుగు నెలల్లో రాజకీయ సమీకరణలతో తమ బలం పెరుగుతుందన్న అంచనాలో కాంగ్రెస్ ఉంది. తద్వారా అవి శ్వాసం పెట్టి ఆయా మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటామని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మంపై రాజకీయ కాక.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌పై రాజకీయ కాక మొదలైంది. ఈ పాలకవర్గం 2021 మే 7న కొలువుదీరింది. 60 డివిజన్లలో బీఆర్ఎస్, సీపీఐ కలిసి పోటీ చేయగా.. బీఆర్ఎస్ 43, సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 10, సీపీఎం, స్వతంత్రులు రెండేసి స్థానాలు, బీజేపీ ఒక స్థానం దక్కించుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టగా, ఆ తర్వాత ముగ్గురు కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్‌లో చేరగా.. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 18కి చేరగా, బీఆర్ఎస్కు 37 మంది ఉన్నారు. వచ్చే ఏడాది మే 7తో కేఎంసీ పాలకవర్గం మూడేళ్లు పూర్తి చేసుకోనుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్కే బలం ఉన్నా, వచ్చే నాలుగు నెలల్లో మారే సమీకరణలతో తమ బలం పెరిగి కార్పొరేషన్‌ను ‘హస్త’గతం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే తమ కార్పొరేటర్లెవరూ కాంగ్రెస్ వైపు చూడరని బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. వైరా, ఇల్లెందుల్లో ఇలా.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌పై కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్కు 16 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, సీపీఎంకు ఒకరు, స్వతంత్ర కౌన్సిలర్ ఒకరు ఉన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్కు పదేసి మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే మరికొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో ఏడాది కాలంగా చైర్మన్‌కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇక్కడ 24 వార్డులకు గాను చైర్మన్ డి.వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు 21 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచారు. సీపీఐ, న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్ రెబల్‌గా ఒక్కొక్కరు గెలుపొందారు. ఇటీవల బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్‌పై కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చినా ఫార్మాట్ ప్రకారం లేదనడంతో వారం క్రితం మళ్లీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ ప్రోద్బలంతో ఈ ప్రక్రియ సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఎన్నికల ముందు మున్సిపల్ చైర్మన్ సహా నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 17కు తగ్గింది. వైరా, ఇల్లెందులో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారు గెలవడం, ఆ పార్టీకే చెందిన చైర్మన్లు ఉండడంతో ఆ పార్టీ నేతలు ఎలా చక్రం తిప్పుతారో వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం! -
నామినేటెడ్‌పై ఆశలు.. జిల్లావ్యాప్తంగా తీవ్రమైన పోటీ!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నామినేటెడ్ పదవుల జాతర కొనసాగనుంది. ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ ముఖ్యనేతలు ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల పదవులను ప్రభుత్వం రద్దు చేయడంతో నామినేటెడ్ పదవులను పొందేందుకు ఆశావహ నేతలు విస్త్రృతంగా ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున టికెట్ దక్కని నేతలు, ఇతరుల కోసం ఎమ్మెల్యే టికెట్‌ను త్యాగం చేసిన ముఖ్యనేతలు ఆశావహుల్లో ముందు వరుసలో ఉన్నారు. రాష్ట్రస్థాయి కార్పొరేషన్పదవులపై ఆశలు.. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలకు కార్పొరేషన్ పదవులు దక్కాయి. వీరిలో స్టేట్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా గట్టు తిమ్మప్ప, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా వేద సాయిచంద్ సతీమణి రజని, ముడా చైర్మన్‌గా గంజి వెంకన్న ముదిరాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్, మిషన్ భగీరథ చైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తా, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్‌గా రమావత్ వాల్యానాయక్, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్‌గా గోలి శ్రీనివాస్‌రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆంజనేయగౌడ్ పనిచేశారు. ఇటీవల ప్రభుత్వం వీరి పదవులను రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలంతా ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీకి కసిరెడ్డి రాజీనామా.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఖాళీ ఏర్పడింది. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేతలు, పార్టీ టికెట్ ఆశించిన ముఖ్యులకు ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవులను ఆఫర్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ లేదా ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నామినేటెడ్ పదవులపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. ఇవి చదవండి: ప్రభుత్వాల మార్పుతో 'సెర్ప్' పే స్కేల్ అమలుపై అతలాకుతలం! -
మంత్రి యోగమెవరికో? ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో ‘మంత్రి’ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మంత్రివర్గ మొదటి విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ ప్రా తినిధ్యం దక్కలేదు. దీంతో అంతా రెండో విడత విస్తరణపైనే ఆశలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే రెండో విడత కేబినెట్ విస్తరణ జరగనుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం పలు జిల్లాల నుంచి నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్‌లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విప్ పదవుల్లోనూ ఉమ్మడి జిల్లా నుంచి ఎవరూ లేరు. దీంతో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఖానాపూర్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కేబినెట్‌తోపాటు ఇతర కీలక పదవుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జుతోపాటు మరో ముగ్గురు సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. వీరందరిలో ప్రధానంగా ముగ్గురు సీనియర్ల మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. ‘గడ్డం’ సోదరుల పోటీ.. ‘గడ్డం’ సోదరులు ఇద్దరూ మంత్రి పదవిపై నమ్మకం పెట్టుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గెలిచిన గడ్డం వినోద్, చెన్నూరు నుంచి గెలిచిన వివేక్ ఒకరితో ఒకరు పదవి కోసం పోటీ పడుతున్నారు. ఒక దశలో వివేక్‌కు మొదటి కేబినెట్ విస్తరణలోనే బెర్త్ ఖాయమని ఆయన అనుచరులు చెప్పుకొన్నారు. కానీ.. మంత్రివర్గంలో ఆయన పేరు లేదు. అదే సమయంలో తనకే మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ వినోద్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ఢిల్లీకి వెళ్లి కలిసి వచ్చారు. దీంతో ఇద్దరు అన్నదమ్ములు అమాత్య పదవి కోసం పోటీ పడడం కనిపిస్తోంది. ఈ ఇద్దరన్నదమ్ముల్లో ఎవరిని పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటుందోనని కేడర్‌లో చర్చ జరుగుతోంది. ‘పీఎస్సార్’కు ఖర్గే హామీ! ఉమ్మడి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) మంత్రి పదవి రేసులో ప్రముఖంగా ఉన్నారు. గత ఏప్రిల్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర సందర్భంగా మంచిర్యాలలో ఏర్పాటు చేసిన ‘సత్యాగ్రహ’ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పీఎస్సార్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, కీలక హోదాలో ఉంటారని హామీ ఇచ్చారు. అయితే తొలివిడతలో ఆయనకు అవకాశం రాలేదు. మరోవైపు మంత్రి పదవులు వరించిన వారి సామాజిక వర్గాలు చూస్తే, వెలమ కోటలో ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. ఇక ఎస్సీ కోటాలో భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, దామోదర రాజనర్సింహా ఉన్నారు. ఈ క్రమంలో మిగిలిన ఆరు మంత్రి పదవుల్లో భర్తీ చేయాల్సి వస్తే, సామాజిక సమీకరణాలు కీలకంగా మారాయి. పోటీలో ఉన్న వారి సామాజిక కోటా పరిగణనలోకి తీసుకుంటే, ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ స్థాయి పదవులతో సమానంగా ఉండే డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్‌తో పదవి దక్కని వారు నిరాశ పడకుండా సర్దుబాటు చేస్తారనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి తదుపరి టీంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికి చోటు ఉంటుందో, ఎవరికి నిరాశ కలుగుతుందోనని అధికార పార్టీ వర్గాల్లోనూ, ఇటు ఉమ్మడి జిల్లా ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ఎవరికి వారు ఇటు రాష్ట్ర పెద్దలతోపాటు అటు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలుస్తూ మంత్రి పదవి కోసం తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇవి చదవండి: సర్వజన రంజక పాలన.. గవర్నర్ తమిళిసై ప్రసంగం -
'ఎస్ఆర్ఆర్ నుంచే నా రాజకీయ జీవితం' : పొన్నం ప్రభాకర్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలోనే ఉమ్మడి కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల అని, రాజకీయ ఉద్ధండులు వైఎస్ రాజశేఖరరెడ్డి, జువ్వాడి చొక్కారావు, ఎమ్మెస్సార్, జి.వెంకటస్వామి, జైపాల్‌రెడ్డి నుంచి అక్షరాలు నేర్చుకున్నానని చెప్పా రు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బుధవారం పొన్నం ప్రభాకర్ కరీంనగర్ వచ్చారు. నగరంలోని ఇందిరాచౌక్‌లో ఏర్పాటు చేసిన వి జయభేరి సభలో ఆయన మాట్లాడుతూ సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి టి.జీ వన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో ఉమ్మడి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతామన్నారు. గత ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, తమది చేతల ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం మారిందని, అధికారులు కూడా వ్యవస్థను మార్చుకోవాలని సూచించారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకేనని, తాను కరీంనగర్ బిడ్డనన్నారు. ఎస్ఆర్ఆర్ కళాశాల అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభమైందని, ఎన్ఎస్యూఐ జిల్లా, రాష్ట్ర అ ధ్యక్షుడిగా, మార్క్‌ఫెడ్ చైర్మన్‌గా పనిచేశానన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో కరీంనగర్ ఎంపీ అయ్యానన్నారు. తన రాజకీయ గురువు జువ్వాడి చొక్కారావు 1973లో రవాణా శా ఖ మంత్రి అయితే, చొక్కారావు శిష్యుడినైన తాను 2023లో రవాణాశాఖ మంత్రి అయ్యానన్నారు. తా ను 1987లో రాజకీయ జీవితం ప్రారంభించానని, ఈ 36 ఏళ్లలో ఎక్కడా అవినీతికి తావులేదని, ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. కొంతమంది చేతగాక పార్టీలు మారినోళ్లు తనను విమర్శిస్తే, భగవంతుడు ఒక్క అవకాశం ఇస్తాడని చెప్పానంటూ గుర్తు చేసుకున్నారు. తాను పార్టీ మారలేదని కాంగ్రెస్ అంటే పొన్నం, పొన్నం అంటేనే కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. తనకు ప్రజల ఆశీర్వాదమే టానిక్ అ ని, కేసీఆర్ వాడే టానిక్ కాదంటూ చమత్కరించా రు. ఎంపీగా తాను పార్లమెంట్లో తెలంగాణ కో సం కొట్లాడి, మా ఎంపీ పొన్నం అని ప్రజలు గర్వంగా చెప్పుకునేలా చేశానన్నారు. మానకొండూరు ఎ మ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ కోసం ఉద్యమించి ప్రజల ఆశలు నెరవేర్చిన నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో నాలుగు స్థానాలు గెలిపించుకున్నానని తెలిపారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం మాట్లాడుతూ నియంతృత్వ ప్రభుత్వం కూలి పోయి, ప్రజాప్రభుత్వం వచ్చిందన్నారు. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో కరీంనగర్, హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు పురుమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్, నాయకులు వైద్యుల అంజన్‌కుమార్, కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మెనేని రోహిత్‌రావు, మంజులారెడ్డి, కటకం వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. దారిపొడవునా నీరాజనం! మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్, అనుబంధ విభాగాలు, పొన్నం అభిమానులు, కుల, బీసీ సంఘాలు ఘనస్వాగతం పలికా యి. ఎమ్మెల్యేలు క వ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి ఓపెన్‌టాప్ వాహనంలో నగరానికి చేరుకున్న పొన్నం ప్రభాకర్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన స్వాగత వేదికల వద్ద పూలవర్షంతో నీరాజనం పట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోతిరాంపూర్, కమాన్‌చౌరస్తా, సిక్వాడీ, శ్రీపాదచౌక్ మీదుగా ఇందిరాచౌక్ వరకు అడుగడుగునా స్వాగతం పలికారు. కోలాటాలు, నృత్యాలు, డప్పు వాయిద్యాలతో మ హిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. గొల్లకురుమలు గొంగడితో సత్కరించారు. సిక్లు కరవాలం బహుకరించారు. ఆర్టీసీ కార్మికులు గజ మాలతో సన్మానించారు. ఇందిరాచౌక్ వద్ద విజయభేరి సభ ముగిసిన తరువాత పొన్నం ప్రభాకర్ ర్యాలీగా డీసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నాయకులతో సమావేశమయ్యారు. నాయకులు కట్ల సతీశ్, కొడూరి రవీందర్‌గౌడ్, మునిగంటి అనిల్, దన్ను సింగ్, ఖమర్, సిరాజొద్దిన్, మొహమ్మద్ అమీర్, బోనాల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇవి చదవండి: రెగ్యులర్ కమిటీ లేనట్టేనా? ఇంతకీ చైర్మన్ ఎవరు? -
'డిసెంబర్ 31'లోగా అని మాటిచ్చారు.. మరవకండి!
సాక్షి, ఆదిలాబాద్: ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. అధికారలోకి వచ్చిన నెలరోజుల్లోనే అంటే డిసెంబర్ 31లోగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తాం. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తాం. కార్యాలయాలను తిరిగి బోథ్‌లోనే ఏర్పాటు చేస్తాం’ బోథ్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి అన్నమాటలివి. బోథ్‌లో ఎన్నికల ప్రచారం బోథ్ డివిజన్ ఏర్పాటు హామీలపైనే జరిగింది. ప్రముఖ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తాము అధికారంలోకి వస్తే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చాయి. ప్రతి గ్రామంలో నాయకులు తిరుగుతూ ప్రచారంలో భాగంగా తాము అధికారంలోకి వస్తే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని పార్టీలు రెవెన్యూ డివిజన్ హమీ ఇవ్వడంతో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా బోథ్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైనే భారం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చింది. రేవంత్‌రెడ్డి సీఎం కాబోతుండటంతో బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేస్తారని ఇక్కడి ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వస్తే డిసెంబర్ 31లోగా బోథ్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డిపై బోథ్‌ను డివిజన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం.. బోథ్‌ను డిసెంబర్ 31లోగా డివిజన్‌గా చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. బోథ్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు డివిజన్ ఏర్పాటుపై చొరవ చూపాలని కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బోథ్‌లో బీఆర్ఎస్.. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ అధినేతలు రేవంత్‌రెడ్డి, కేసీఆర్‌లు బోథ్‌ను డివిజన్ చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాగా బోథ్‌లో మాత్రం బీఆర్ఎస్ నుంచి అనిల్ జాదవ్ గెలుపొందారు. అయితే ఇరు పార్టీలు డివిజన్ చేస్తామని ప్రకటించాయని, కాబట్టి ఇరు పార్టీలు బోథ్‌ను డివిజన్ చేయడానికి చొరవ చూపాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. మాట ఇచ్చారు.. నెరవేర్చండి! తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బోథ్‌ను డివిజన్ చేస్తామని హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ిపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం డిసెంబర్ 31లోగా బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి. డివిజన్ ఏర్పాటుకు నాయకులు చొరవ చూపాలి. – అల్లం సాయికృష్ణ డివిజన్ చేయాల్సిందే.. బోథ్ అన్ని రంగాల్లో నిరాదారణకు గురైంది. బోథ్‌ను డివిజన్‌గా చేస్తే అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. బోథ్ డివిజన్ కావడానికి అన్ని అర్హతలున్నాయి. అన్ని పార్టీలు డివిజన్ చేస్తామని హామీలు ఇచ్చాయి. ఇచ్చిన హామీల ప్రకారం.. బోథ్‌ను డివిజన్ చేసి అభివృద్ధి చేయాలి. ఇందుకు నాయకులు చొరవ చూపాలి. – గట్ల బలరామకృష్ణ, బోథ్ కేసీఆర్, రేవంత్‌రెడ్డి ఇద్దరూ డివిజన్ హామీ ఇచ్చారు.. పీసీసీ అధ్యక్షుడిగా చెప్తున్నా గెలిచిన వెంటనే డిసెంబర్ 31లోగా రెవెన్యూ డివిజన్ చేస్తామని రేవంత్‌రెడ్డి బోథ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభలో పేర్కొన్నారు. మరుసటి రోజునే ఇచ్చోడ మండల కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇరు పార్టీలు రెవెన్యూ డివిజన్‌పై హామీ ఇవ్వడం, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావ్ సైతం తాను గెలిస్తే బోథ్ రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని ప్రధాన పార్టీలు డివిజన్‌పై హామీ ఇవ్వడంతో ఇప్పుటు డివిజన్ ఏర్పాటు చేయడం అనివార్యంగా మారింది. -
పదేళ్లలో మేడ్చల్‌పై పట్టుసాధించిన మర్రి, మల్లారెడ్డి
మేడ్చల్: తమ వ్యాపారాలతో మేడ్చల్ జిల్లాకు ప్రవేశించిన మామా అల్లుళ్లు పదేళ్ల క్రితం రాజకీయరంగ ప్రవేశం చేసి ప్రతికూల పరిస్థితుల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి మేడ్చల్‌పై పట్టు సాధించారు. మేడ్చల్ మండలం మైసమ్మగూడ, కండ్లకోయ, శివార్లలోని బోయిన్పల్లి, సూరారంలో మల్లారెడ్డి విద్యాసంస్థలు, మెడికల్ కళాశాలలు, ఆస్పత్రులు, ఫంక్షన్‌హాళ్లు, వివిధ రకాల వ్యాపారాలు చేసి పదేళ్ల క్రితం వరకు వ్యాపారవేత్తగా పేరుగాంచారు. ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి మేడ్చల్ పక్కనే ఉన్న దుండిగల్ మండలంలో ఇంజినీరింగ్ కళాశాలలు, మెడికల్ కళాశాల, వివిధ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి మామ చాటు వ్యాపారవేత్తగా ఎదిగారు. 2014లో మల్లారెడ్డి అనూహ్యంగా టీడీపీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచారు. కేవలం వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మల్లారెడ్డి పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ బీఆర్ఎస్లో చేరారు. 2018లో మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ సాధించి అసెంబ్లీకి ఎన్నికై తన బలంతో మంత్రి అయ్యారు. అదే సమయంలో తన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇప్పించి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో అల్లుడు ఓడిపోయినా జిల్లాలో మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సహకరించకపోయినా అల్లుడిని తన వెంట బెట్టుకుని మేడ్చల్ కేంద్రంగా రాజకీయం నడిపాడు. తాను మంత్రిగా ఉంటూ అల్లుడికి లోకల్ రాజకీయాలు అప్పగించి రాజకీయం నుంచి దూరం కాకుండా మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి పదవి ఇప్పించి ఫుల్ టైం రాజకీయ నాయకుడిని చేశారు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. రాజకీయంలో అందివచి్చన ప్రతి అవకాశాన్ని మల్లారెడ్డి, ఆయన కుటుంబం ఎప్పటికప్పుడు సద్వినియోగం చేసుకుంటూ రాజకీయ జీవితంలో సక్సెస్ అయ్యారు. అల్లుడు పార్లమెంట్ ఇన్చార్జిగా, పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జిగా ఉంటూ రాజకీయం తన కుటుంబం దాటకుండా చూసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఖరారైనా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి వ్యవహారంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఆచితూచి అడుగులేసిన మల్లారెడ్డి చాకచక్యంగా తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి బీఆర్ఎస్ టికెట్ సాధించాడు. ఒకవైపు మేడ్చల్‌లో తాను పోటీచేస్తూ మరోవైపు మల్కాజిగిరిలో అల్లుడిని పోటీలోకి దింపి ఇద్దరు ఎమ్మెల్యేలు కావడంతో ఐదు నియోజకవర్గాల్లో రెండింటిలో మామా అల్లుళ్లు గెలిచి జిల్లాపై పూర్తి పట్టుసాధించారు. ఇద్దరు వ్యాపారులు కావడం, ఆర్థిక వనరులకు ఇబ్బంది లేకపోవడం, మంచి పేరు ఉండటం, ఇద్దరికీ కేసీఆర్, కేటీఆర్ దగ్గర నుంచి కార్యకర్త వరకు పూర్తిగా పలుకుబడి ఉండటం, ప్రధానంగా నాయకుల బలం, విద్యార్థుల బలం, మానవవనరులు పుష్కలంగా ఉండటంతో అన్నీ సద్వినియోగం చేసుకుని మేడ్చల్ జిల్లాలో మామా అల్లుళ్లు వ్యాపారం నుంచి మొదలై రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగి ఏ రంగంలోనైనా తమకు ఎదురులేదని నిరూపించుకున్నారు. జిల్లాలో ఉద్దండ రాజకీయ నాయకులు, ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా మామా అల్లుళ్లు మాత్రం వారిని మట్టి కరిపించి తమకు తిరుగులేదని అసెంబ్లీ ఎన్నికల్లో నిరూపించుకున్నారు. తన మార్కు ఉండేలా 2018 వరకు మామచాటు అల్లుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి ఆ తర్వాత జిల్లాలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ మార్కు ఉండేలా తమకు మద్దతు ఇచ్చిన వారికి మేయర్లు, చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పదవులు ఇచ్చుకుని వారిని తమ అనుచరులుగా మార్చుకున్నారు. తన మార్క్ రాజకీయం చేస్తూనే మామకు బంటుగా ఉండిపోయారు. మామ మంత్రిగా ఉన్నా అధికారం పూర్తిగా అల్లుడు తీసుకుని కావాల్సిన పనులన్నీ చేశారు. మొత్తం మీద మేడ్చల్ రాజకీయంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా తమదే ఆధిపత్యం అని మామా అల్లుళ్లు మరోసారి నిరూపించుకున్నారు. -
‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘అన్న చెయ్యేస్తే మాస్.. అన్న లుక్కేస్తే మాస్.. మమ మాస్..’ అన్నట్లుగా ఎన్నికల ఫలితాల్లో పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీరు కనిపించింది. జిల్లాలో తిరుగులేని మాస్ లీడర్‌గా ఉన్న ఆయన మరోసారి తన చరిష్మా చూపించారు. బీఆర్ఎస్పై తిరుగుబాటుతో.. వైఎస్సార్ సీపీ ద్వారా రాజకీయ జీవితం ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అక్కడ సరైన ప్రాధాన్యత లభించక ఈ ఏడాది ఆరంభంలో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ తరఫున ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనివ్వనంటూ ఆయన విసిరిన సవాల్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. బీఆర్ఎస్ను వీడిన తర్వాత పొంగులేటి రాజకీయ ప్రస్థానం ఏ దిశగా వెళ్తుందనేది చర్చనీయాంశంగా మారిన నేపథ్యాన బీజేపీలోకి వెళ్లాలని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ రాజకీయంగా ఓసారి దెబ్బతిన్న ఆయన తొందరపాటు నిర్ణయాలకు పోకుండా ఆచితూచి అన్ని అంశాలు బేరీజు వేసుకుని కాంగ్రెస్‌లో చేరారు. తగ్గేదే లే... కాంగ్రెస్‌లో చేరే సమయంలో పదింట ఎనిమిది సీట్లు పొంగులేటి వర్గీయులకే ఇస్తారనే ప్రచారం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు. కమ్యూనిస్టుల కోసం కొత్తగూడెం సీటు వదులుకోవాల్సి వచ్చింది. పాలేరు, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట సీట్లు పొంగులేటి వర్గానికి దక్కాయి. గత అనుభవాలు నేర్పిన పాఠంతో ఓర్పుగా ఒక్కో ఇటుక పేర్చుకుంటూ పోయారు. ఓవైపు తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే తన అనుయాయుల గెలుపు కోసం అహర్నిశలూ శ్రమించారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థుల గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు పొంగులేటి ఎంట్రీ ఇచ్చేవరకు కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఆశించిన స్థాయిలో సఖ్యత కనిపించలేదు. ఒక్కసారి శ్రీనివాసరెడ్డి రాకతో పరిస్థితి మారిపోయింది. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా ఇరు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేశారు. క్రాస్ ఓటింగ్‌కు అవకాశమే లేకుండా జాగ్రత్త పడ్డారు. వెరసి నాలుగు స్థానాల్లో విజయఢంకా మోగించడమే కాదు మెజార్టీలోనూ దుమ్ము రేపారు. -
గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...ఎవరికి ఆ అవకాశం లభించనుంది అంటే ఇప్పట్లో గ్రేటర్ నుంచి మంత్రి పదవి లేనట్లే అని తెలుస్తోంది. తెలంగాణ అంతటా విజయదుందుభి మోగించినా గ్రేటర్ ఓటర్లు కాంగ్రెస్‌కు మొండిచేయి చూపారు. దీంతో ఇక్కడి నుంచి ఇప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రెండో విడుత కేటాయింపుల్లో భాగంగా ఎమ్మెల్సీ కోటాలో మాత్రమే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు మంత్రి పదవులను కేటాయించవచ్చు. మరోవైపు ఇప్పటికిప్పుడు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే శివార్లలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కానీ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సామాజిక వర్గాల వారిగా పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ కసరత్తును చేపట్టింది. ఈ క్రమంలో ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు కట్టబెట్టారనే చెడ్డపేరు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ రకంగా మల్‌రెడ్డికి ఈ దఫా అవకాశం లభించకపోవచ్చునని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేసేందుకు ప్రస్తుతం అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఎంపికై న తరువాత మాత్రమే నగరం నుంచి మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ వరించేదెవరిని... పదవీకాలం ముగిసిన వారితో పాటు, గవర్నర్ కోటా కింద త్వరలో ఎమ్మెల్సీల ఎంపిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, తాము గెలిచే స్థానాలను త్యాగం చేసి మరో చోట పోటీ చేయడంతో ఓడిన వాళ్లు, ఎంతోకాలంగా కాంగ్రెస్‌కు సేవ చేస్తున్న సీనియర్లకు ఎమ్మెల్సీ పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఈ జాబితాలో అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీగౌడ్, కేఎల్ఆర్, విజయారెడ్డి, వెన్నెల తదితరులు ఉన్నారు. అంజన్‌కుమార్ యాదవ్ సీనియర్ నాయకుడు. అలాగే ఆ సామాజిక వర్గం దృష్టిలో చూసినా ఎంతో ప్రాధాన్యం ఉన్న నేత కావడంతో ఆయనకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. మరోవైపు పోటీచేసి ఓడిపోవడమే కాకుండా, పార్టీలో క్రియాశీల నాయకుడిగా గుర్తింపు కలిగిన మధుయాష్కీ కూడా కీలకమే. ఇక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వదలిస్తే ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డిని ఎంపిక చేయవలసి ఉంటుంది. మరి కొందరు సీనియర్లు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీపడే అవకాశం ఉంది. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీల ఎంపికకు మరికొంత సమయం ఉన్న దృష్ట్యా ఆ ఛాన్స్ ఎవరిని వరించనుందో..వేచి చూడవలసిందే. -
దామోదర రాజనర్సింహకు కీలక పదవి..?
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన దామోదర రాజనర్సింహ ఉపముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయనకు రెండోసారి ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈయనకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయాంలోనూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత ీసీడబ్ల్యూసీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కొత్తగా కొలువు దీరనున్న కాంగ్రెస్ సర్కారులో ఆయనకు మంత్రి పదవి ఖయంగా కనిపిస్తోంది. ఈసారి కూడా ఆయనకు కీలక శాఖలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పట్లోళ్ల సంజీవరెడ్డి, మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ తొలిసారి గెలించారు. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ నేత కావడం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యుడు కావడంతో తప్పనిసరిగా ఆయనకు కీలక శాఖలు దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దామోదర్ గెలిస్తే ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే నినాదంతో కార్యకర్తలు, నాయకులు ప్రచారం కూడా చేశారు. మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం.. దామోదర రాజనర్సింహకు దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1989లో తొలిసారిగా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం 35 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీతోనే సాగింది. 1989 తర్వాత మరో రెండుసార్లు ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి ఇక్కడి నుంచే విజయం సాధించారు. ఈ క్రమంలో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కూడా మూడోసారి విజయం సాధించిన దామోదర వైఎస్ఆర్, కొణిజేటి రోశయ్యల మంత్రివర్గాల్లో స్థానం పొందారు. 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా దామోదరకు చోటు దక్కింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. ఇటీవలె సీడబ్ల్యూసీలోకి.. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వంటి అగ్రనేతలు ఉండే కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో దామోదరకు స్థానం దక్కింది. 2023 ఆగస్టులో ఆయన్ను సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దామోదరకు ఈసారి డిప్యూటీ సీఎం పదవి తప్పనిసరిగా వరిస్తుందని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. -
ఆయా చోట్ల తమకు ఓట్లు తగ్గడానికి అసలు కారణమేంటి?
సాక్షి, ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్కు షాకిస్తూ బీజేపీ విజయం సాధించగా, బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. అయితే ఆయా నియోజకవర్గాల్లో ఓటమి పాలైన ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు చేపట్టాయి. పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల జాబితా ముందేసుకుని తాము ఎక్కడ ఫెయిల్ అయ్యామనే దానిపై నాయకులు పోస్టుమార్టం షురూ చేశారు. ఓట్లను రాబట్టుకోవడంలో అంచనాలు ఎక్కడ తప్పాయో దానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బూత్‌ల వారీగా ఓట్లపై అంతర్మథనం! ఆదిలాబాద్‌లో ఓటమి పాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బోథ్ నియోజకవర్గంలో పరాజయం చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ఫలితాలపై పోస్టుమార్టం చేస్తున్నాయి. పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన ఓట్లను పరిశీలిస్తున్నారు. ఫలానా గ్రామంలో తమకు మెజార్టీ వస్తుందని భావించిన నాయకులకు ఓటర్లు షాకిస్తూ ఇతర పార్టీలకు అండగా నిలువడంపై ఆలోచనలో పడ్డారు. ఆయా చోట్ల తమకు ఓట్లు ఎందుకు తగ్గాయి, ప్రత్యర్థి పార్టీకి ఏ విధంగా పెరిగాయనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఆయా పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు క్షేత్రస్థాయిలో సక్రమంగా పనిచేయకపోవడం, పోల్మేనేజ్మెంట్లో వైఫల్యంతోనే తాము గెలుపునకు దూరమవ్వాల్సి వస్తోందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులన్న చోట కూడా పార్టీ ఓట్లపరంగా వెనుకబడి పోవడటానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మండలాల్లోనూ ఇదే ప్రక్రియ కొనసాగుతుండడం చూస్తుంటే ఓటరు నాడీని అందుకోవడంలో ఆయా పార్టీలు అంతగా సఫలీకృతం కానట్లుగా స్పష్టమవుతోంది. ఓటరు పల్స్ పట్టడంలో విఫలం.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో నాలుగు గ్రామీణ, ఆదిలాబాద్ అర్బన్‌తో కలిపి ఐదు మండలాలున్నాయి. అలాగే బోథ్ నియోజకవర్గంలో తొమ్మిది మండలాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఓటర్లు సైతం ఆయా పార్టీలన్నింటికీ జై కొట్టారు. బీజేపీ తరఫున ఆదిలాబాద్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి అమిత్‌షా, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రచారానికి రాగా, కాంగ్రెస్ తరఫున పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆదిలాబాద్, బోథ్‌లో జరిగిన బహిరంగ సభలకు హాజరయ్యారు. బీఆర్ఎస్ తరఫున మంత్రి హరీశ్‌రావు ఆదిలాబాద్‌లో జరిగిన బహిరంగ సభకు హాజరుకాగా, సీఎం కేసీఆర్ ఆదిలాబాద్, ఇచ్చోడలో జరిగిన బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ సభలన్నింటికీ జనం ఆయా పార్టీల నాయకులు ఆశించినదానికంటే ఎక్కువగానే వచ్చారు. ర్యాలీలకు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆ స్థాయిలో ఓట్లను రాబట్టుకోలేకపోయామనే అభిప్రాయాన్ని నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇవి చదవండి: 6 గ్యారెంటీల అమలుపై అనుమానాలు...? -
ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కొత్తగా ఏర్పడబోయే రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు రెండు మంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి జిల్లాలో తమదైన ముద్రవేసిన కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు సామాజిక సమీకరణల ఆధారంగా జిల్లాకు మరో పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ములుగులో ఆదివాసి గిరిజనురాలైన అయిన సీతక్కకు క్యాబినెట్లో అవకాశం కల్పిస్తే, లంబాడా సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు కూడా చాన్స్ వచ్చే అవకాశం ఉందన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా సీనియర్లే నాగార్జునసాగర్‌లో, అంతకుముందు 2009లో రద్దయిన చలకుర్తి నియోజకవర్గం నుంచి మొత్తంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత కుందూరు జానారెడ్డి ఈసారి పోటీ చేయలేదు. ఆయన గతంలో హోంశాఖ మంత్రిగానే కాకుండా 12 శాఖలకు మంత్రిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం ఆయన పోటీ నుంచి తప్పుకొని తన కుమారుడు కుందూరు జయవీర్‌రెడ్డి అవకాశం ఇచ్చారు. సూర్యాపేట నుంచి ప్రస్తుతం పోటీ చేసి ఓడిపోయిన రాంరెడ్డి దామోదర్‌రెడ్డి గతంలో తుంగతుర్తి నుంచి నాలుగుసార్లు, సూర్యాపేట నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరోవైపు హుజూర్‌నగర్‌లో మూడుసార్లు, కోదాడలో రెండుసార్లు మొత్తంగా ఇప్పటికే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు హూజూర్నగర్నుంచి ఆరోసారి గెలుపొందారు. ఇక నల్లగొండ నియోజకవర్గం నుంచి ఇప్పటికే నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పుడు ఐదోసారి నల్లగొండ నుంచే గొలుపొందారు. వీరంతా ఇన్నాళ్లు జిల్లాలో పార్టీ పట్టు కోల్పోకుండా కాడాడటంలో కీలకంగా వ్యవహరించారు. ఇలా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నలుగురైదుగురు ఉండగా, అందులో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నలమాద ఉత్తమ్‌మార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఐటీ శాఖ మంత్రిగా సేవలందించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఉమ్మడి జిల్లా నుంచి ఈ ఇద్దరికి మంత్రి పదవులు దక్కుతాయన్న నమ్మకంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. రెండోసారి గెలుపొందిన ముగ్గురు ఈ ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతిరెడ్డి, దేవరకొండ నుంచి బాలూనాయక్ కూడా రెండోసారి విజయం సాధించారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లో జూనియర్లే. ఉమ్మడి జిల్లాలో పార్టీ నడిపిన నేతలు ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజక వర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. అయితే, గత పదేళ్లుగా జిల్లాలో పార్టీ ఉనికికి ప్రమాదం రాకుండా సీనియర్ నేతలు కీలకంగా వ్యవహరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కూడా కోల్పోయినా, 2019 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకొని పార్టీని కాపాడుకుంటూ వచ్చారు. సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డితో పాటు భువనగిరి ఎంపీగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణుల్లో ఎప్పటికప్పుడు ధైర్యం నింపుతూ అండగా నిలిచారు. -
కోమటిరెడ్డి బ్రదర్స్ ఏకకాలంలో అసెంబ్లీకి..
సాక్షి, యాదాద్రి: కోమటిరెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 1999 నుంచి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2009లో భువనగిరి ఎంపీగా విజయం సాఽధించిన సమయంలో వెంకట్‌రెడ్డి నల్లగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2014 ఎన్నికల్లో భువనగిరి ఎంపీ స్థానానికి పోటీచేసి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. ఆ వెంటనే వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఆ సమయంలో వెంకట్‌రెడ్డి ఎమ్మెల్యేగా, రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ నుంచి ఓడిపోగా.. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019లో వెంకట్‌రెడ్డి భువనగిరి ఎంపీగా గెలుపొందారు. 2022లో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా ఉపఎన్నిలో ఓడిపోయారు. ఈ ఎన్నికలకు ముందు రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరి మునుగోడు నుంచి గెలుపొందగా, వెంకట్‌రెడ్డి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇద్దరు సోదరులు ఏకకాలంలో అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఉత్తమ్ హుజూర్నగర్: ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించిన నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. గతంలో కోదాడ ఎమ్మెల్యేగా రెండు సార్లు, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచిన ఆయన ప్రస్తుతం 6వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా మూడు సార్లు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వరుసగా మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే నల్లగొండ ఎంపీగా గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతూనే మళ్లీ హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. -
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. ఐదు చోట్ల 50 వేలకుపైగా మెజారిటీ..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధిక మెజారిటీ సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఐదుగురు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. మరో నలుగురు 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఇద్దరు 20 వేలకు పైగానే మెజారిటీ సాధించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ఉమ్మడి జిల్లాలోనే అత్యల్పంగా 4,606 ఓట్ల మెజారిటీ లభించింది. ఉమ్మడి జిల్లాలో సరికొత్త రికార్డు! నకిరేకల్‌నుంచి గెలుపొందిన వేముల వీరేశం 68,839 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు. 1952 నుంచి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఎవరూ ఇంత మెజారిటీ సాధించలేదు. తొలిసారిగా వేముల వీరేశం 68,839 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. 50 వేలకుపైగా మెజారిటీ.. కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి 58,172 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌పై గెలుపొందారు. నాగార్జునసాగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి 55,849 ఓట్ల మెజారిటీ సాధించారు. నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 54,332 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిపై విజయం సాధించారు. తుంగతుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్‌పై కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేల్ 51,094 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక ఆలేరులో బీర్ల ఐలయ్య 49,636, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి 48,782, హుజూర్‌నగర్‌లో నలమాద ఉత్తమ్ కుమార్‌రెడ్డి 44,888, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 40,590, దేవరకొండలో నేనావత్ బాలునాయక్ 30,021, భువనగిరిలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 26,201 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇవి చదవండి: 24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు! -
24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు!
సాక్షి, మహబూబ్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఐదుసార్లు ఓటమి చవిచూసిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కలను ఆయన కొడుకు కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి నెరవేర్చారు. పోటీ చేసిన మొదటిసారే గెలుపొందడం మరో విశేషం. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి 1999లో మొదటిసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేకు పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2004లో అప్పటి టీఆర్ఎస్ తరపున పోటీ చేసినా 1,449 స్వల్ప ఓట్లతో ఓటమిపాలయ్యారు. తర్వాత 2009, 2012 ఎన్నికల్లో సైతం నాగం జనార్దన్‌రెడ్డి చేతిలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2005లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్‌గా, 2016, 2022లో ఎమ్మెల్సీ పదవులు దక్కినా ఎమ్మెల్యే పదవి మాత్రం అందని ద్రాక్షగా మారింది. అయితే తన కోరికను తన కొడుకు నెరవేర్చడంతో కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఇవి చదవండి: 20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు -
20 ఏళ్లలో ఏనాడూ చూడని 'హస్తం' హవా..! మళ్లీ ఇప్పుడు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా అసెంబ్లీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోశాయి. 20 ఏళ్లలో ఏనాడూ చూడని స్పష్టమైన సీట్లు రావడం గమనార్హం. 2004లో వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో టీఆర్ఎస్–సీపీఐ పొత్తులతో కాంగ్రెస్ కూటమి 10 సీట్లు(కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 4, సీపీఐ 1) సాధించింది. ఇప్పుడు 8 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి కాంగ్రెస్–సీపీఐ కూటమి సత్తాచాటుకుంది. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలను గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. పొరుగునే ఉన్న ధర్మపురి, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్‌నూ కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. 2018 ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో సిరిసిల్ల, జగిత్యాల, కోరుట్ల, కరీంనగర్, హుజూరాబాద్‌తో కలిపి ఐదో స్థానాలకు పరిమితమైంది. ఇక హుజూరాబాద్, కరీంనగర్, కోరుట్లలో బీజేపీ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. బండి.. గంగుల నువ్వా–నేనా.. కరీంనగర్లో విజయం చివరి వరకూ దోబూచులాడింది. చివరి రౌండ్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో తొలుత స్వల్ప ఓట్లతో గంగుల కమలాకర్ విజయం సాధించారు. దీనిపై బండి సంజయ్ అభ్యంతరం తెలుపుతూ కౌంటింగ్ కేంద్రానికొచ్చా రు. పోలింగ్ బూత్ 43,289లో ఓట్ల లెక్కింపు చేపట్టలేదని ఆరోపించారు. సంజయ్ వినతిని పరిగణనలోకి తీసుకుని రేకుర్తిలోని లయోల బీఈడీ కాలేజీ రూమ్‌నంబర్ 3లోని 594 ఓట్లు, రాంపూర్‌లోని విద్యార్థి హైస్కూల్లోని పోలింగ్ బూత్‌లలోని 697 ఓట్లను లెక్కించారు. చివరికి 3,169 ఓట్ల మెజార్టీతో గంగుల విజయం సాధించడంతో ఉత్కంఠకు తెరపడింది. ► మానకొండూరు నుంచి కవ్వంపల్లి సత్యనారా యణ విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మె ల్యే రసమయిపై ఏ దశలోనూ వెనకబడలేదు. ► చొప్పదండి– మేడిపల్లి సత్యం కూడా ప్రతీ రౌండ్లోనూ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై ఆధిపత్యం చూపించారు. ► హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి తమ ప్రత్యర్థులపై ఆది నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటల కాంగ్రెస్ అభ్యర్థి ఒడితల ప్రణవ్‌పై స్పష్టమైన ఆధిపత్యంతో గెలిచారు. ► పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మంథని– శ్రీధర్‌బాబు, రామగుండం– మక్కాన్ సింగ్, పెద్దపల్లి– విజయరమణారావు నియోజకవర్గాల్లో విజయం సాధించడంతో క్లీన్‌స్వీప్ చేసింది. మక్కాన్‌సింగ్ మూడోసారి పోటీ చేయడం, రామగుండంలో కాంగ్రెస్‌కు వచ్చిన అనూహ్య ఆదరణ, స్థానికంగా సానుభూతి పనిచేశాయి. ► సిరిసిల్లలో కేటీఆర్(బీఆర్ఎస్) సునాయస విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తన చిరకాల ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిని ఐదోసారి ఓడించారు. 2009 నుంచి వీరిద్దరూ పోటీ పడటం ఐదోసారి కావడం విశేషం. కాంగ్రెస్ హవా, సానుభూతి పనిచేయలేదు. ► వేములవాడలో ఊహించినట్లుగానే ఆది శ్రీనివాస్(కాంగ్రెస్) విజయం సాధించారు. ఆయన అసెంబ్లీకి పోటీ పడటం వరుసగా ఐదోసారి. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వం విషయంలో న్యాయపరంగా పోరాడినా ఫలించలేదు. ఎట్టకేలకు ప్రజల దీవెనతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. వేములవాడ ఆలయ చైర్మన్‌గా పనిచేసిన వారు ఎమ్మెల్యేగా గెలవరంటూ దశాబ్దాలుగా సాగుతున్న సంప్రదాయానికి తెరదించారు. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చెలిమెడ లక్ష్మీనరసింహారావు, బీజేపీ అభ్యర్థి వికాస్రావులపై స్పష్టమైన మెజారిటీ సాధించారు. ► జగిత్యాలలో తొలుత జీవన్‌రెడ్డి పది రౌండ్ల వరకు ఆధిపత్యం కనిపించినా.. తర్వాత పుంజుకున్న సంజయ్ విజయం సాధించారు. కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కె.సంజయ్ అనూహ్యంగా గెలిచారు. సమీప ప్రత్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్‌ను ఢీకొట్టగలరా? అన్న ప్రచారం జరిగింది. ఎగ్జిట్‌పోల్స్ కూడా అరవింద్‌కే మొగ్గుచూపాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావుకు ఉన్న పేరు, అనుభవం సంజయ్ గెలుపులో కీలకపాత్ర పోషించాయి. ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తన చిరకాల ప్రత్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై విజయం సాధించారు. 2009 నుంచి వీరిద్దరూ తలపడటం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ హవా, లక్ష్మణ్‌పై సానుభూతి, అధికార పార్టీపై వ్యతిరేకత కలిసివచ్చాయి. విశేషాలు.. ► కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. వీరిద్దరూ బీజేపీ అగ్రనేతలుగా వెలుగొంది, పార్టీ ఆదేశాలతో అసెంబ్లీ బరిలో దిగారు. ► హుజూరాబాద్ నుంచి పోటీచేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ విజయం సాధించగా, జగిత్యాల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఓడిపోయారు. ► రాష్ట్రంలో వరుసగా ఏడుసార్లు గెలిచి సరికొత్త రికార్డు సృష్టించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎనిమిదోసారి పోటీలో ఓడారు. ఈసారి గెలిస్తే అత్యధికసార్లు శాసనసభకు ఎన్నికై న ఎమ్మెల్యేగా మరో కొత్త రికార్డు సృష్టించేవారు. ఆయన పోటీచేసిన హుజూరాబాద్, గజ్వేల్‌లో రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ► ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరో దఫా పోటీలో తొలిసారి ఓడిపోయారు. ఈయన గెలిచి ఉంటే ఈటల రాజేందర్ ఏడుసార్లు ఎమ్మెల్యే రికార్డు సమం అయ్యేది. ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఇలా.. 8 కాంగ్రెస్.. 5 బీఆర్ఎస్ కైవసం! కరీంనగర్: గంగుల కమలాకర్ (బీఆర్ఎస్), ఓట్లు: 92,174, మెజారిటీ 3,169, రెండోస్థానం: బండి సంజయ్ కుమార్ (బీజేపీ), ఓట్లు: 89,005, మూడో స్థానం: పురమల్ల శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 40,052 పెద్దపల్లి: విజయరమణరావు (కాంగ్రెస్), ఓట్లు: 1,18, 888, మెజారిటీ: 55,108, రెండో స్థానం: దాసరి మనోహర్‌రెడ్డి(బీఆర్ఎస్) ఓట్లు: 63,780, మూడో స్థానం:దాసరి ఉష(బీఎస్పీ), ఓట్లు 10,315 రామగుండం: రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ (కాంగ్రెస్) , ఓట్లు: 92,227 , మెజారిటీ: 56,794, రెండో స్థానం: కోరుకంటి చందర్(బీఆర్ఎస్), ఓట్లు: 35,433, మూడో స్థానం: కందుల సంధ్యారాణి(బీజేపీ), ఓట్లు: 12,966 మంథని: దుద్దిళ్ల శ్రీధర్ బాబు (కాంగ్రెస్), ఓట్లు: 1,03,822 మెజారిటీ: 31,380, రెండో స్థానం: పుట్ట మధు (బీఆర్ఎస్), ఓట్లు: 72,442, మూడో స్థానం: సునీల్ రెడ్డి (బీజేపీ), ఓట్లు: 5,779 మానకొండూరు: సత్యనారాయణ (కాంగ్రెస్ ) పొందిన ఓట్లు: 96,773 మెజారిటీ : 32,365, రెండో స్థానం: రసమయి బాలకిషన్ (బీఆర్ఎస్), ఓట్లు: 64,408, మూడో స్థానం : ఆరెపల్లి మోహన్ (బీజేపీ) ఓట్లు: 14,879 చొప్పదండి: మేడిపల్లి సత్యం, పార్టీ: కాంగ్రెస్ ఓట్లు : 90,395, మెజారిటీ: 37,439, రెండో స్థానం: సుంకే రవిశంకర్ పార్టీ: (బీఆర్ఎస్) ఓట్లు : 52,956, మూడో స్థానం : బొడిగె శోభ గాలన్న, (బీజేపీ) ఓట్లు : 26,669 హుజూరాబాద్: పాడి కౌశిక్ రెడ్డి (బీఆర్ఎస్) ఓట్లు : 80,333 , మెజార్టీ: 16,873, రెండోస్థానం: ఈటల రాజేందర్ (బీజేపీ), ఓట్లు : 63,460, మూడో స్థానం : ఒడితల ప్రణవ్ (కాంగ్రెస్) ఓట్లు :53,164 హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), ఓట్లు: 1,00,955 , మెజార్టీ:19,344, రెండో స్థానం: ఒడితల సతీశ్ కుమార్, ఓట్లు: 81,611, మూడో స్థానం: బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఓట్లు: 8338 సిరిసిల్ల: తారక రామారావు, (బీఆర్ఎస్), ఓట్లు: 89,244, మెజారిటీ: 29,687, రెండో స్థానం: కేకే మహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు: 59,557, మూడో స్థానం: రాణిరుద్రమారెడ్డి(బీజేపీ) 18, 328 వేములవాడ: ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) ఓట్లు: 71451.మెజారిటీ: 14,581, రెండో స్థానం: చెలిమెడ లక్ష్మీనర్సింహారావు (బీఆర్ఎస్). ఓట్లు: 56,870, మూడో స్థానం: చెన్నమనేని వికాస్‌రావు (బీజేపీ), ఓట్లు: 29,710. జగిత్యాల: సంజయ్‌కుమార్ (బీఆర్ఎస్), ఓట్లు: 70,243, మెజారిటీ: 15822, రెండోస్థానం : టి.జీవన్‌రెడ్డి (కాంగ్రెస్), ఓట్లు : 54,421, మూడోస్థానం : బోగ శ్రావణి (బీజేపీ), ఓట్లు : 42,138 కోరుట్ల: సంజయ్ (బీఆర్ఎస్), ఓట్లు : 72,115, మెజారిటీ: 10,305, రెండోస్థానం: ధర్మపురి అర్వింద్ (బీజేపీ), ఓట్లు : 61,810, మూడో స్థానం : జువ్వాడి నర్సింగారావు (కాంగ్రెస్), ఓట్లు : 39,647 ధర్మపురి: అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (కాంగ్రెస్), ఓట్లు: 91,393, మెజారిటీ: 22,039, రెండోస్థానం: కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్), ఓట్లు: 69,354, మూడో స్థానం : ఎస్.కుమార్ (బీజేపీ), ఓట్లు: 7,345 ఇవి చదవండి: కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..! -
కాంగ్రెస్ గెలుపుకి యువతే 'కీ'లకం..!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ గెలుపులో యువత కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువకులు దాదాపు హస్తానికి అండగా నిలిచినట్లు అవగతమవుతోంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల ఓటర్లలో సగం మంది వరకు యువకులు ఉండడం విశేషం. మూడు నియోజకవర్గాల్లో మొత్తం 7,33,454 ఓటర్లుండగా.. వారిలో 18 ఏళ్ల నుంచి 39 ఏళ్ల ఓటర్లు 3,56,964 మంది ఉండడం గమనార్హం. నర్సంపేట నియోజకవర్గంలో మొత్తం 2,26,617 ఓటర్లుండగా.. వారిలో 1,11,446 మంది యువ ఓటర్లు, వరంగల్ తూర్పులో 2,46,282 ఓటర్లుండగా వారిలో 1,17,870 మంది యువ ఓటర్లు, వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,60,55 ఓటర్లుండగా వారిలో 1,27,648 యువ ఓటర్లు ఉన్నారు. ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్‌కు చెందిన దొంతి మాధవరెడ్డి, కొండా సురేఖ, కేఆర్.నాగరాజు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. వెంటాడిన నిరుద్యోగ సమస్య.. అధికార బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగ సమస్య వెంటాడినట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షల నోటిఫికేషన్లు ప్రకటించడం, పేపర్ లీకులు, తర్వాత రద్దు చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఓటర్లు, నిరుద్యోగ యువకులు ఈ సారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థుల విజయంలో యువత ఓట్లు కీలకంగా మారాయనే భావన వ్యక్తమవుతోంది. ఇవి చదవండి: పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు! -
తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్..
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పుతో ఈ ఎన్నికల్లో తమ వైవిధ్యాన్ని చాటారు. తూర్పున కాంగ్రెస్ హవా కొనసాగగా, పశ్చిమ జిల్లాలో కమలం వికసించింది. మధ్యలో కారు ప్రయాణం సాగింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలకు సమన్యాయం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ ఎన్నికల చరిత్రలో బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు గెలిచారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో బీజేపీ పాగా వేయడం గమనార్హం. కలిసొచ్చిన ముక్కోణ పోటీ.. నిర్మల్, ఆదిలాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ముక్కోణ పోటీ నెలకొంది. నిర్మల్‌లో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(బీజేపీ), అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(బీఆర్ఎస్), కూ చాడి శ్రీహరిరావు(కాంగ్రెస్) మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమంగా ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయాయి. చివరికి బీజేపీ బయటపడింది. సిర్పూర్లో బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ బరిలో ఉండడంతో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీతోపాటు బీఎస్పీ ఓట్లు పంచుకున్నాయి. ముథోల్‌లో బీఆర్ఎస్కు మై నార్టీ ఓట్లు కలిసి రాగా, ఇక్కడ కాంగ్రెస్ ఆశించిన ఓట్లు రాబట్టలేకపోవడంతో మిగతా వర్గం ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. ఆదిలాబాద్‌లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 6వేల మెజార్టీతో బయటపడ్డారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ మూడో స్థానంలో నిలిచింది. మొదట బోథ్ స్థానంలోనూ బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నిలిచింది. ఎంపీ సోయం బాపురావు బరిలో ఉండడంతో ఆ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. చివరకు బీఆర్ఎస్ 22వేల మెజార్టీ సాధించింది. ఎస్టీ స్థానాల్లో బీఆర్ఎస్.. పది స్థానాల్లో ఎనిమిది చోట్ల చతికిల పడ్డ బీఆర్ఎస్ మూడు ఎస్టీ స్థానాల్లో బోథ్, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ గెలిచి పరువు నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆసిఫాబాద్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయిన కోవ లక్ష్మీ, సిట్టింగ్ ఎమ్మెల్యే బాపురావు కాదని అనిల్ జాదవ్‌కు అవకాశం ఇస్తే, గెలిచారు. ఈ మూడు స్థానాల్లో ఖానాపూర్ మాత్రం కాంగ్రెస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు అప్పటి టీఆర్ఎస్కు రాగా ఆసిఫాబాద్ ఎస్టీ స్థానం మాత్రమే కాంగ్రెస్‌కు వచ్చింది. ఇక్కడ ఈసారి బీఆర్ఎస్ గెలుచుకుంది. అసెంబ్లీకి కొత్త ముఖాలు.. రెండో ప్రయత్నంలో రామారావు పాటిల్ గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. సిర్పూర్ నుంచి పాల్వాయి హరీశ్‌బాబు, ఆదిలా బాద్ నుంచి పాయల్ శంకర్, బోథ్ నుంచి అనిల్ జాదవ్, ఖానాపూర్ నుంచి వెడ్మ బొజ్జు, మంచిర్యాల నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ ఎంపీ వివేక్ తొలిసారిగా శాసనభకు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి వినోద్, కోవ లక్ష్మీ, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచారు. సిట్టింగ్‌ల ఓటమి! సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా పది మంది ఓటమి పాలయ్యారు. నిర్మల్‌లో సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నాలుగు సార్లు గెలిచిన మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, ముథోల్‌లో విఠల్‌రెడ్డి, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లి చిన్నయ్య, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘోర ఓటమి చవి చూశారు. ఈ ఎన్నికల్లో ఖానాపూర్, బోథ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కుకు బీఆర్ఎస్ నుంచి టికెట్లు రాకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నారు. -
స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులందరూ అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని ఏమీ లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేయడం, మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండడం జరిగేది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈవీఎం బ్యాలెట్లలో నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్) బటన్ తీసుకొచ్చారు. ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థులు ఎవరూ సరైన వారు లేరని భావించిన పక్షంలో నోటాకు ఓటు వేయవచ్చు. అత్యధికంగా నోటాను వినియోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,254 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 17,327 మంది నోటాకు ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు వేశారు. ఇలా ఈవీఎంల్లోకి.. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. దీన్ని భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ రూపొందించింది. బోథ్: బోథ్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2565 మంది నోటాను వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి జంగుబాపుకు 2044 ఓట్లు, బీసీపీ పార్టీ అభ్యర్థి ఆడె సునీల్ నాయక్‌కు 677, ఆర్జేపీ అభ్యర్థి హీరాజీకి 1388, డీఎస్పీ అభ్యర్థి ఉమేష్‌కు 1011, జీజీపీ అభ్యర్థి బాదు నైతంకు 596, స్వతంత్ర అభ్యర్థులు భోజ్యా నాయక్‌కు 878, ధనలక్ష్మికి 1231 ఓట్లు పోల్ అయ్యాయి. ఇవి చదవండి: తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్.. -
పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విద్యావంతులు సైతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3073 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ స్పష్టమైన అధిక్యతను కనబర్చారు. ఆయనకు 1140 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 595 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డికి 961 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలువడం గమనార్హం. కాగా నోటాకు 10మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం 1700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు అత్యధికంగా 718 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 495 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అడే గజేందర్‌కు 371 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది మంది నోటాకు ఓటేయడం గమనార్హం. ఇవి కూడా చదవండి: స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!