సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: అందోల్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన దామోదర రాజనర్సింహ ఉపముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఆయనకు రెండోసారి ఉపముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈయనకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయాంలోనూ కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత ీసీడబ్ల్యూసీ సభ్యుడిగా కూడా కొనసాగుతున్నారు. కొత్తగా కొలువు దీరనున్న కాంగ్రెస్ సర్కారులో ఆయనకు మంత్రి పదవి ఖయంగా కనిపిస్తోంది. ఈసారి కూడా ఆయనకు కీలక శాఖలు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో నారాయణఖేడ్ ఎమ్మెల్యేగా పట్లోళ్ల సంజీవరెడ్డి, మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ తొలిసారి గెలించారు. దీంతో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ నేత కావడం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత సభ్యుడు కావడంతో తప్పనిసరిగా ఆయనకు కీలక శాఖలు దక్కడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దామోదర్ గెలిస్తే ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే నినాదంతో కార్యకర్తలు, నాయకులు ప్రచారం కూడా చేశారు.
మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం..
దామోదర రాజనర్సింహకు దాదాపు మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1989లో తొలిసారిగా అందోల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి రాజకీయ ప్రస్థానం 35 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీతోనే సాగింది. 1989 తర్వాత మరో రెండుసార్లు ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి ఇక్కడి నుంచే విజయం సాధించారు.
ఈ క్రమంలో వైఎస్సార్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో కూడా మూడోసారి విజయం సాధించిన దామోదర వైఎస్‌ఆర్, కొణిజేటి రోశయ్యల మంత్రివర్గాల్లో స్థానం పొందారు. 2010 డిసెంబరులో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా దామోదరకు చోటు దక్కింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిని ఉప ముఖ్యమంత్రిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో 2011, జూన్ 10న దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది.
ఇటీవలె సీడబ్ల్యూసీలోకి..
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వంటి అగ్రనేతలు ఉండే కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)లో దామోదరకు స్థానం దక్కింది. 2023 ఆగస్టులో ఆయన్ను సీడబ్ల్యూసీకి శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో దామోదరకు ఈసారి డిప్యూటీ సీఎం పదవి తప్పనిసరిగా వరిస్తుందని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment