అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం తుదిఘట్టానికి చేరుతోంది. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో ప్రధాన రాజకీయపార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. బీజేపీకి సంబంధించి ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలు, అఖిల భారత కాంగ్రెస్ నేతలు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇక రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కలియ తిరుగుతున్నారు. ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత దూషణలు, చేసిన, చేయబోయే అంశాలు వల్లె వేస్తూ ఉధృతంగా ఆయా పార్టీల నేతలందరూ ప్రచారంలో మునిగి తేలుతున్నారు. – సాక్షి, ప్రత్యేక ప్రతినిధి
2 నెలల నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం
రెండుమూడు నెలల నుంచే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. అక్టోబర్ 9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రావడం, నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ వెలువడిన సంగతి విదితమే. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ఘట్టం పూర్తయిన తర్వాత ఈనెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారరం తీవ్రస్థాయికి చేరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా మూడేసి రోజులపాటు రాష్ట్రంలోనే మకాం వేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
బీజేపీకి చెందిన యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ,, దేవేంద్ర ఫడ్నవీస్‌లతోపాటు పార్టీ అగ్రనేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గతనెల 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 92 అసెంబ్లీ స్థానాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక, ఆ పార్టీ సీఎంలు బఘేల్, సిద్ధరామయ్య తదితరులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు.
టీఆర్‌ఎస్ నుంచి సీఎంతోపాటు కల్వకుంట్ల తారక రామారావు, హరీశ్‌రావులు రాష్ట్రం మొత్తం చుట్టి వస్తుంటే.. కవిత నిజామాబాద్ జిల్లాకు మాత్రమే పరిమితమై ప్రచారం సాగిస్తున్నారు. బీఎస్పీ నుంచి మాయావతి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, సీపీఎం నుంచి సీతారాం ఏచూరి, బృందాకారత్, సీపీఐ నేత డి.రాజా తదితరులు ఆయా పార్టీల తరపున ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీలు తమ ఎజెండాను ప్రజల ముందు ఉంచాయి.
ద్విముఖ పోరు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే
గడిచిన ఎన్నికల్లో ఆయా పార్టీల ప్రభావం, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం తీరు తర్వాత మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను దాదాపు 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొంటే.. మరో 70 స్థానాల్లో ద్విముఖ పోరు నెలకొంది. మరో ఏడు స్థానాల్లో బహుముఖ పోటీ ఉంది. త్రిముఖ పోరులో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీఉంటే, 70 స్థానాల్లో ద్విముఖ పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే నెలకొంది.
ఇక ఏడు స్థానాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, సీపీఎంల మధ్య బహుముఖ పోటీ నెలకొంది. త్రిముఖ పోటీలోని 42 స్థానాల్లో ఆర్థిక బలం అదనపు ఆయుధంగా మారింది. అన్ని పార్టీల నేతలూ పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. త్రిముఖ పోటీ దాదాపు అన్ని జిల్లాల్లో రెండు నుంచి నాలుగు చోట్లా నెలకొంది. ఈ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు అధికంగా ఉండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. త్రిముఖ పోటీ ఉన్న స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏ పార్టీ చీల్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
బహుముఖ పోటీ ఎక్కడంటే
బహుముఖ పోటీ ఉన్న వాటిలో ప్రధానంగా సిర్పూర్ కాగజ్‌నగర్, కొత్తగూడెం, పెద్దపల్లి, సూర్యాపేట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, నల్లగొండ స్థానాలు ఉన్నాయి.
ఈ సెగ్మెంట్లలో త్రిముఖ పోటీ
త్రిముఖ పోటీ ఉన్న స్థానాల్లో ప్రధానంగా కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ గురించి చెప్పుకోవాల్సి ఉంది. సీఎం కేసీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి వెంకట రమణారెడ్డి పోటీ పడుతున్నారు. మూడు పార్టీలు ఈ స్థానాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోరాడుతున్నాయి.
► కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ బరిలో ఉన్నారు.
► కోరుట్లలో బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్‌ఎస్ నుంచి డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ నుంచి నర్సింగ్‌రావు బరిలో ఉన్నారు.
► మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ తరపున మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తనయుడు మిథున్‌రెడ్డి రంగంలో ఉన్నారు.
► బోథ్‌లో బీఆర్‌ఎస్ నుంచి అనిల్ జాదవ్, కాంగ్రెస్ నుంచి ఆడె జనార్దన్, బీజేపీ నుంచి ఎంపీ సోయం బాపూరావుల మధ్య గట్టి పోటీ ఉంది.
► సంగారెడ్డిలో బీఆర్‌ఎస్ పక్షాన చింతా ప్రభాకర్, కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి, బీజేపీ నుంచి పులిమామిడి రాజు ఉంటే.. ముథోల్‌లో ప్రస్తుత ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, బీజేపీ నుంచి రామారావు పటేల్ పోటీ పడుతున్నారు.
► పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ నుంచి గూడెం మహిపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాట శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ నుంచి నందీశ్వర్‌గౌడ్ రంగంలో ఉన్నారు.
► ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్ తరపున జాన్సన్ నాయక్, కాంగ్రెస్ నుంచి ఎడ్మ బొజ్జు, బీజేపీ నుంచి రమేష్ రాథోడ్ ఉంటే, జగిత్యాలలో బీఆర్‌ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, బీజేపీ టికెట్‌పై మాజీ మున్సి పల్ చైర్‌పర్సన్ భోగ శ్రావణి, దుబ్బాకలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీ నుంచి, ప్రస్తుత ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి(బీఆర్‌ఎస్), కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
► వర్ధన్నపేటలో బీఆర్‌ఎస్ నుంచి ఆరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి నాగరాజ్, బీజేపీ నుంచి కొండేటి శ్రీధర్, మక్తల్‌లో బీఆర్‌ఎస్ నుంచి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ వాకాటి శ్రీహరి, బీజేపీ నుంచి జలంధర్‌రెడ్డి పోటీ పడుతున్నారు.
► నిజామాబాద్ అర్బన్‌లో బిగాల గణేశ్‌గుప్తా బీఆర్‌ఎస్ , షబ్బీర్ అలీ కాంగ్రెస్, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ నుంచి అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
► వేములవాడలో లక్ష్మీ నర్సింహారావు బీఆర్‌ఎస్, ఆది శ్రీనివాస్ కాంగ్రెస్, సీహెచ్ వికాస్ బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంటకరమణారెడ్డి –బీఆర్‌ఎస్, గండ్ర సత్యనారాయణ– కాంగ్రెస్, చందుపట్ల కీర్తిరెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉన్నారు.
► ఎల్‌బీ నగర్‌లో మధుయాష్కీ– కాంగ్రెస్, సుధీర్‌రెడ్డి –బీఆర్‌ఎస్, సామ రంగారెడ్డి బీజేపీ నుంచి, కుత్బుల్లాపూర్‌లో వివేకానంద –బీఆర్‌ఎస్, కూన శ్రీశైలంగౌడ్– బీజేపీ, కొలను హన్మంతరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే, ఉప్పల్‌లో బండారి లక్ష్మారెడ్డి – బీఆర్‌ఎస్, పరమేశ్వరరెడ్డి – కాంగ్రెస్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ బీజేపీ నుంచి పోటీ పడుతున్నారు.
► మల్కాజిగిరిలో మర్రి రాజశేఖరరెడ్డి –బీఆర్‌ఎస్, మైనంపల్లి హన్మంతరావు –కాంగ్రెస్, రామచంద్రరావు– బీజేపీ, శేరిలింగంపల్లిలో అరికపూడి గాంధీ –బీఆర్‌ఎస్, జగదీశ్వర్‌రెడ్డి –కాంగ్రెస్, రవికుమార్ యాదవ్ బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. చేవెళ్లలో కాలె యాదయ్య –బీఆర్‌ఎస్, భీం భరత్– కాంగ్రెస్, కె ఎస్ రత్నం బీజేపీ నుంచి బరిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment