జడ్చర్ల టౌన్: ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరు గెలిచినా రికార్డు నమోదవుతుంది. 1962లో జడ్చర్ల నియోజకవర్గం ఏర్పడగా.. మొత్తం 15సార్లు ఎన్నికలు జరిగాయి. 1996, 2008లో రెండు ఉపఎన్నికలు వచ్చాయి. ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా వరుసగా మూడు సార్లు గెలవలేదు. 1972, 1978 ఎన్నికల్లో నర్సప్ప వరుసగా రెండు పర్యాయాలు విజయం సాధించగా, మూడవ సారి ఓటమిపాలయ్యారు.
1983, 1985 ఎన్నికల్లో కృష్ణారెడ్డి వరుసగా గెలిచి మూడవ పర్యాయం ఓడిపోయారు. ఆ తర్వాత 1996, 1999 ఎన్నికల్లో ఎర్రశేఖర్ వరుసగా విజయం సాధించి, 2004లో మూడవసారి ఓటమిపాలయ్యారు. 2014, 2018 ఎన్నికల్లో లక్ష్మారెడ్డి వరుసగా గెలుపొందగా.. ప్రస్తుతం ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ పర్యాయం గెలిస్తే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పడంతో పాటు నియోజకవర్గంలో నాలుగో సారి ఎమ్మెల్యే అయిన ఘనత దక్కుతుంది.
ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జనంపల్లి అనిరుధ్‌రెడ్డి విషయానికొస్తే.. ఎన్నికల బరిలో తొలిసారిగా నిలిచారు. ఆయన విజయం సాధిస్తే పోటీ చేసిన తొలిసారే విజయం సాధించినట్లవుతుంది. అదేవిధంగా బీజేపీ అభ్యర్థి చిత్తరంజన్‌దాస్ పోటీలో ఉన్నారు. ఆయన కల్వకుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, ఓ పర్యాయం మంత్రిగా పనిచేశారు. 1985 ఎన్నికల్లో దివంగత ఎన్‌టీ రామారావును ఓడించి రాష్ట్రంలోనే పేరుగాంచారు.
అదే స్ఫూర్తితో జడ్చర్లలోనూ విజయం సాధిస్తానన్న ధీమాలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే బీజేపీకి తొలి విజయంగా నిలుస్తుంది. ఆయన సుదీర్ఘకాలం తర్వాత గెలుపొందినట్లు అవుతుంది. జడ్చర్ల అసెంబ్లీ స్థానానికి 16వ సారి నిర్వహిస్తున్న సాధారణ ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిచినా ఓ రికార్డుగానే చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment