Mahabubnagar District Latest News
-
No Headline
● త్వరలో అందుబాటులోకి రానున్న అత్యాధునికవైద్యసేవలు ● రూ.200 కోట్లతో ఐదు బ్లాక్‌ల నిర్మాణం ● నాలుగు విభాగాల పనులు దాదాపు పూర్తి, పెండింగ్‌లో ఈ–బ్లాక్ పనులు ● ప్రస్తుతం నిర్మిస్తున్న ఆస్పత్రి ప్రధాన ముఖద్వారం నిర్మించే స్థలంలో ఫోరం భవనం ఉంది. ఫోరం కార్యకలాపాలు ప్రస్తుతం అక్కడే కొనసాగుతున్నాయి. ఫోరం కోసం పాత డీఈఓ కార్యాలయం లేదా పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. -
నిఘా నీడలో ఇంటర్ పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు బుధవారం నుంచి నిఘా నీడలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఇంటర్మీడియట్ అఽధికారులు సోమవారం ఉదయం నుంచి పలు పరీక్ష కేంద్రాలను తనిఖీలు చేసి, వసతులు, విద్యుత్, తాగునీరు, బెంచీలు, సీసీ కెమెరాలు, ఇతర వసతులపై పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. కొన్ని కేంద్రాల్లో తక్కువ బెంచీలు ఉండడంతో వెంటనే ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారిని కౌసర్ జహాన్ ఆయా ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. ఇటీవల జిల్లాకు చేరుకున్న పలు సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నపత్రాలను జిల్లాకేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలోని స్ట్రాంగ్ పాయింట్లో పోలీసు బందోబస్తు మధ్య భద్రపరిచారు. ఆదివారం సాయంత్రం మండలస్థాయి స్ట్రాంగ్ పాయింట్లకు ప్రశ్నపత్రాలను పంపించారు. వీటిని సబ్జెక్టుల వారీగా బుధవారం ఉదయం సంబంధిత పరీక్ష కేంద్రాలను తరలించనున్నారు. ప్రతి కేంద్రంలో మూడు నుంచి ఐదు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని నేరుగా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూంతో అనుసంధానం చేసి అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. ఆన్లైన్లో హాల్‌టికెట్లు గతంలో హాల్‌టికెట్లు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల లాగిన్‌లో అందుబాటులో ఉంచేవారు. వీటిని ప్రిన్సిపాల్ సంతకం చేసి ఇచ్చేవారు. హాల్‌టికెట్లు ఇచ్చే క్రమంలో యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం హాట్‌టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ప్రతి విద్యార్థి tgbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా పుట్టిన తేదీ, ఫోన్ నంబర్ తదితర వివరాలు పొందుపరిస్తే నేరుగా హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ అవుతుంది. హాల్‌టికెట్‌పై ప్రిన్సిపాల్, ఏ అధికారి సంతకం లేకుండా నేరుగా పరీక్ష కేంద్రంలోనికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించారు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయాలి. డబ్బులు ఇస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని పలువురు యాజమాన్యాలు అడిగినట్లు కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. హాల్‌టికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా నేరుగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు ఎవరి సంతకం అవసరం ఉండదు. ఏవైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురావాలి. – కౌసర్ జహాన్, డీఐఈఓ ప్రతి కేంద్రంలో 3 నుంచి 5 సీసీ కెమెరాల ఏర్పాటు వసతులను పరిశీలించిన అధికారులు హాల్‌టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం -
రూ.5 లక్షలతో నాణ్యమైన ఇల్లు నిర్మించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద ఐదు లక్షల రూపాయల్లో నాణ్యమైన ఇంటిని నిర్మించాలని హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్ అన్నారు. ఇందిరమ్మ గృహ నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నాక్ శిక్షణ కేంద్రంలో మేసీ్త్రలకు నిర్మాణ రంగంపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్(నాక్)సెంటర్లో హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో ఆరు రోజుల శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొత్త టెక్నాలజీతో రూ.5 లక్షల బడ్జెట్లో ఇళ్లను నాణ్యతగా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాక్ ఏడీ శివశంకర్, గృహ నిర్మాణ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు. -
No Headline
పాలమూరు: ఇకపై ప్రతి చిన్న రోగానికి హైదరా బాద్‌కు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండదు. కార్పొరేట్ ఆస్పత్రులకే పరిమితమైన అత్యాధునిక వైద్యసేవలు త్వరలో పాలమూరులోనే అందుబాటులోకి రానున్నాయి. అన్ని హంగులతో నిర్మించనున్న నూతన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉమ్మడి జిల్లా పేదలకు ఆరోగ్య ప్రదాయినిగా మారనుంది. ప్రతి విభాగానికి చెందిన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా కార్డియాలజీ, న్యూరా లజీ వంటి ప్రధాన సమస్య తీరనుంది. పాత కలెక్టరేట్ ఆవరణలో ఉన్న స్థలంలో 2022 జూన్‌లో రూ.200 కోట్ల వ్యయంతో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ఐదు బ్లాక్‌లుగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఏ, బీ, సీ, డీ బ్లాక్‌లు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వీటిలో పెయిటింగ్, కరెంట్ వైరింగ్ పనులు కొనసాగుతున్నాయి. అక్కడక్క డ వాటర్ సంపు, పోస్టుమార్టం విభాగం, ఆక్సిజన్ పైప్‌లైన్, విద్యుత్ పనులు, ఎస్టీపీ, డ్రెయినేజీ, గ్లాస్ వర్క్, గ్రిల్స్ ఏర్పాటు చేసే పనులు చేస్తున్నా రు. ప్రధాన వైద్యసేవలు సీ–బ్లాక్‌లో నిర్మించనున్నా రు. జూన్ చివరి నాటికి సివిల్ పనులతో పాటు మైనర్ పనులను సైతం పూర్తి చేసి అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. ఆస్పత్రి ప్రధాన ముఖ ద్వారం ఎల్లమ్మ గుడి వెనుక భాగంలో రావడంతో అక్కడి నుంచి రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఆస్పత్రి చుట్టూ డివైడర్‌తో రెండు లైన్ల రహదారి నిర్మిస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే వాహనాల పార్కింగ్ కోసం జెడ్పీ గ్రౌండ్ స్థలంలో నిర్మిస్తున్నారు. -
ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణి కార్య క్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోనీ మీటింగ్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 86 ఫిర్యాదులు అందాయి. జిల్లాలో ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావులకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ. విద్యుత్ , తాగునీటి సరఫరాపై దృష్టి సారించాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. మండలంలో గ్రామాలు, హ్యాబిటేషన్లలో విద్యుత్ సరఫరా, తాగునీటి సమస్య లేకుండా వేసవి ముగిసే వరకు పర్యవేక్షించాలని, గ్రామాల్లో ఎలాంటి సమస్య తలెత్తిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. చిన్నచిన్న మరమ్మతులు, అత్యవసర పనులకు నిధులు అవసరం ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వేసవిలో అప్రమత్తంగా ఉండాలి ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ద్రావణంతో పాటు తాగు నీటి వసతి, టెంట్ ఏర్పాటు చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే ఐసీడీఎస్, ఇతర శాఖలలో ఎండలో ఎక్కువగా పని చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బకు గురైన వారు తక్షణమే దగ్గరలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ను సంప్రదించి సరైన సలహాలు తీసుకోవాలని సూచించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ వడ దెబ్బ కారణాలు, నివారణ చర్యలు, ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, ఆర్డీఓ నవీన్, డీపీఓ పార్థసారథి, జిల్లా సంక్షేమ అధికారిణి, జరీనా బేగం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. విద్యుత్, తాగునీటి సమస్య లేకుండా చూడాలి కలెక్టర్ విజయేందిర బోయి -
కొనసాగుతున్న అన్వేషణ
అచ్చంపేట/మన్ననూర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టి న సహాయక చర్యలు సోమవారం పదోరోజు కూడా కొనసాగాయి. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే భారీస్థాయిలో పేరుకుపోయిన బురద, ఉబికి వస్తున్న నీటి ఊటతో వీరి అన్వేషణకు అవరోధాలు కలిగిస్తున్నా యి. దాదాపు 10– 20 వేల లీటర్ల మేర నీటి ఊట ఉబికి వస్తుంది. మరోవైపు తమవారి రాక కోసం కుటుంబసభ్యులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎస్ఎల్బీసీ సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి కన్వేయర్ బెల్టు మరమ్మతు సోమవారం సాయంత్రానికి పూర్తవుతాయని చెప్పారు. కానీ, ఇక్కడి పరిస్థితి చూస్తే మరో రెండు రోజులైనా కన్వేయర్ బెల్టు మరమ్మతు జరిగే అవకాశం కనిపించడం లేదు. దీనికోసం సింగరేణి, రాబిట్ బృందాలు కష్టపడుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన శిథిలాలను సింగరేణి బృందాలు మాన్యువల్ పద్ధతిలో తవ్వకాలు చేపడుతున్నారు. ఆ మట్టిని లోకో ట్రైన్ ద్వారా బయటికి పంపిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ కూడా ఒకింత ఆటంకం సృష్టిస్తుంది. దీనిని బట్టి 15 అడుగుల ఎత్తులో పేరుకుపోయిన బురద, మట్టి బయటికి తేవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుందో కూడా అధికారులు చెప్పలేకపోతున్నారు. రాడార్ (జీపీఆర్) స్కానింగ్ గుర్తించిన మూడు, నాలుగు ప్రదేశాల్లో శిథిలాలు తొలగించినా ఆనవాళ్లు దొరకలేదు. ఎంత తవ్వితే అంత ఊట బయటికి వస్తుండటంతో ఎప్పటిప్పుడు డీవాటరింగ్ చేస్తున్న పనులకు అడ్డంకులు కలిగిస్తుంది. బురద, ఊట నీరే ప్రధాన సమస్య నిమిషానికి 10– 20 వేల లీటర్ల నీటి ఊట సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తేవడంలో అవరోధాలు పదోరోజు కొనసాగిన సహాయక చర్యలు రెస్క్యూ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం -
తుది దశలో నిర్మాణ పనులు
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ–బ్లాక్ మాత్రం ఈవీఎం భవనం ఉండటం వల్ల పూర్తి కాలేదు. ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. కోర్టు ఆ సమస్యను త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం. ఈవీఎం భవనంపై స్పష్టత వస్తే ఈ–బ్లాక్ కూడా పనులు ప్రారంభం అవుతాయి. ప్రభుత్వ నూతన ఆస్పత్రిని ఎప్పుడూ ప్రారంభం చేస్తుందనే అంశంపై స్పష్టత రాలేదు. – డాక్టర్ సంపత్‌కుమార్ సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సు
స్టేషన్ మహబూబ్‌నగర్: అరుణాచలం గిరి ప్రదక్షిణకు భక్తుల సౌకర్యార్థం మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు ఈ నెల 12న రాత్రి 7 గంటలకు మహబూబ్‌నగర్ బస్టాండ్ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ కాణిపాకం విఘ్నేశ్వరుడు, వేలూర్‌లోని శ్రీమహాలక్ష్మి అమ్మవారి దేవాలయం దర్శనాంతరం 13న సాయంత్రం 6 గంటలకు అరుణాచలంకు చేరుకుంటుందని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 14వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి 15న ఉదయం మహబూబ్‌నగర్‌కు చేరుకుంటుందని వివరించారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఈ టూర్ ప్యాకేజీని సంస్థ అధికారిక వెబ్సైట్ tsrtconline.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మిగతా సమాచారం కోసం 99592 26286, 94411 62588 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
చెంచుగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎంపై వేటు
బల్మూర్: మండలంలోని చెంచుగూడెం ఆశ్రమ పాఠశాల హెచ్ఎం తిరుపతయ్య ఓ విద్యార్థిపై అసభ్యంగా ప్రవర్తించాడని బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం ఏటీడీఓ యాదమ్మ విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించి ఏటీడీఓ వివరాల మేరకు.. పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని 20 రోజుల క్రితం హాజరు రిజిస్టర్ కోసం ఆఫీస్ రూంలోకి వెళ్లగా.. అక్కడే ఉన్న హెచ్ఎం తిరుపతయ్య అసభ్యంగా ప్రవర్తించాడని తల్లిదండ్రులకు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లారు. ఈ విషయంపై ఆదివారం డీటీడీఓకు ఫోన్ ద్వారా హెచ్ఎంపై ఫిర్యాదు చేశారు. డీటీడీఓ ఆదేశాల మేరకు ఏటీడీఓ విచారణ చేపట్టారు. అయితే సదరు బాలిక పాఠశాలలో లేకపోవడంతో కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. పాఠశాలకు రావాలని కోరగా.. వస్తామని రాలేదు. దీంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులను ఏటీడీఓ విచారించారు. అయితే హెచ్ఎంపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని తేలిందన్నారు. సదరు బాలిక రాత్రివేళ వింత చేష్టలతో భయపెడుతూ జాతకాలు చెబుతానంటూ భయపెడుతుందని తోటి బాలికలు తెలిపినట్లు ఏటీడీఓ తెలిపారు. ఇదిలా ఉంటే, హెచ్ఎం విధులకు సక్రమంగా రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా అతడిపై వచ్చిన ఇతర ఆరోపణలతో అచ్చంపేటలోని ఆశ్రమ పాఠశాలకు బదిలీ చేస్తూ డీటీడీఓ ఆదేశాలు జారీ చేసినట్లు ఏటీడీఓ తెలిపారు. ఆశ్రమ పాఠశాల ఇన్చార్జి హెచ్ఎంగా ఐటీడీఏ డిప్యూటీ ఈఓ శంకర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. విచారణపై పూర్తి నివేదికను డీటీడీఓకు అందజేయనున్నట్లు తెలిపారు. ● ఈ విషయమై హెచ్ఎం తిరుపతయ్యను వివరణ కోరగా.. తన మనవరాండ్రు వయసు ఉన్న బాలిక తనపై ఇలాంటి ఆరోపణ చేయడం బాధాకరమన్నారు. 20 రోజుల క్రితం జరిగినట్లు ఇప్పుడు అధికారులకు చెప్పడంలోనే అసత్యం ఉందన్నారు. కాగా, బాలిక తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించగా.. తాము ఎవరికీ చెప్పలేదని సరైన సమాధానం చెప్పకుండా ఫోన్ కట్ చేశారు. విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు డీటీడీఓ ఆదేశాల మేరకు ఏటీడీఓ విచారణ విధుల్లో నిర్లక్ష్యంపై చర్యలు -
రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
బిజినేపల్లి: ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఓ యువకుడు మృతిచెందాడు. మండలంలోని లట్టుపల్లి శివారు భీమునితండాకు చెందిన జాటోతు జాను(33) సోమవారం సాయంత్రం బిజినేపల్లి నుంచి తండాకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. అయితే వెల్గొండ గేటు సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందున్న మరో బైక్‌ను ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన జాను బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జానును స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలిలా.. బైకులు ఢీకొని మరొకరు.. పెద్దకొత్తపల్లి: మండలంలోని సాతాపూర్ వద్ద ఆదివారం అర్ధరాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడని ఎస్ఐ సతీష్ తెలిపారు. మొలకుంట సాంబశివుడు(25) తన స్నేహితుడు జగదీష్‌తో కలిసి బైక్‌పై ముష్టిపల్లి నుంచి కుడికిళ్లకు వెళ్తుండగా సాతాపూర్ వద్ద సంగమోని శ్రీకాంత్ బైక్‌పై వస్తూ సాంబశివుడు వాహనాన్ని ఢీకొట్టడంతో సాంబశివుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సాంబశివుడు మాచ్పల్లిలో ఆర్ఎంపీగా పనిచేస్తుండగా వివాహం కాలేదు. ఈ ఘటనపై తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. అదుపుతప్పి.. నాగర్‌కర్నూల్ క్రైం: ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనంపై నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడని ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌కాలనీకి చెందిన శ్రీనివాసులు(40) ఆదివారం రాత్రి మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ నుంచి జిల్లాకేంద్రానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై శ్రీనివాసులు భార్య యాదమ్మ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
మహబూబ్‌నగర్ క్రీడలు: హైదరాబాద్ కొల్లూరులో ఆదివారం జరిగిన రాష్ట్రస్థాయి అండర్–10, అండర్–13, అండర్–15 విభాగాల ఆర్చరీ పోటీల్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ చాటారు. ఈ పోటీల్లో రాణించిన 18 మంది క్రీడాకారులు గుంటూర్లో ఈ నెల 22 నుంచి 27 వరకు జరిగే జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికయ్యారు. వీరిలో అండర్–10 కంపౌండ్ బాలికల్లో 20 మీటర్ల శ్రీహిత రాథోడ్, సిద్దిక్షా, ఐషా ఫాతిమా, బాలురలో రోషన్ ఏకలవ్య, హిమనిష్, అండర్–10 ఇండియన్ రౌండ్ 15 మీటర్లలో రోహన్, అండర్–13 బాలికల కంపౌండ్ 30 మీటర్లలో సాయి సమీక్ష, ఐషా ఫాతిమా, షేర్వాణి, సన్నిభా, బాలురలో క్రుతిక్శ్రీ వాస్తవ్, సాయి మనీశ్వర్, అండర్–15 కంపౌండ్ 40 మీటర్లలో సాయి సిదిక్షా, సన్నిభా, శేర్వాణి, బాలురలో క్రుతిక్ శ్రీవాస్తవ్, రికర్వు విభాగంలో కౌషిక్ యాదవ్ ఉన్నారు. ఆర్చరీ క్రీడాకారులను సోమవారం జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి, జిల్లా కోర్టు మొదటి అదనపు న్యాయమూర్తి కల్యాణ్ చక్రవర్తి అభినందించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు విజయ్‌కుమార్, ఉదయ్ నాయక్, ఏఓ సీనియర్ సూపరింటెండెంట్ మూర్తి, సీనియర్ సూపరింటెండెంట్ జగన్, జిల్లా ఆర్చరీ సంఘం కార్యదర్శి రాంచందర్, కోచ్ జ్ఞానేశ్వర్, డాక్టర్ వివేక్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ పోటీలకు 18 మంది క్రీడాకారులు -
హింసకు మనువాద విధానాలే కారణం
మహబూబ్‌నగర్ రూరల్: దేశంలో హింస పెరగడానికి మనువాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలే ప్రధాన కారణమని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. మహబూబ్‌నగర్‌లోని అరుంధతి భవన్లో సోమవారం కేవీపీఎస్ రాష్ట్రస్థాయి సమావేశాలు రెండో రోజు కొనసాగగా ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగార్జున అధ్యక్షత వహించారు. ఈ ముగింపు సమావేశానికి స్కైలాబ్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై సీఎం రేవంత్‌రెడ్డి మౌనం వీడాలని, తక్షణమే అంబేడ్కర్ అభయహస్తానికి మార్గదర్శకాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంటరానితనాన్ని నేటి ఆధునిక యువతరం ప్రతిఘటించాలన్నారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనువాదం, దళిత మహిళా హక్కులు అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సెమినార్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగం ఎంతో పురోభివృద్ధి చెందినా నేటికీ కుల వివక్ష, అంటరానితనం కొనసాగడం దేశం సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ను బలోపేతం చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలన్నారు. దళితులకు అసైన్డ్ చేయబడిన భూములకు సత్వరమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మతోన్మాద మూక దాడులు, కుల దురహంకార హత్యలు పెట్రేగిపోతున్నాయని, వాటిని అరికట్టడానికి కులాంతర వివాహితుల రక్షణ చట్టం చేయాలలని కోరారు. కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం.అడివయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.కుర్మయ్య, మనోహర్, ఆరూరి కుమార్, డి.రాధాకృష్ణ, ఎం.ప్రకాష్ కారత్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు టి.సురేష్, మంద సంపత్, డి.దినాకర్రెడ్డి, డి.రామ్మూర్తి, పరశురాములు, బాలపీరు. బాలకిషన్, దేవేందర్, మల్కయ్య పాల్గొన్నారు. ‘చేవెళ్ల డిక్లరేషన్’ పై సీఎం మౌనం వీడాలి అంటరానితనాన్ని నేటి యువత ప్రతిఘటించాలి కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు -
పశుగ్రాసం దగ్ధం
అలంపూర్: పట్టణంలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన రైతు బుచ్చాలు నిల్వచేసిన పశుగ్రాసం సోమవారం తెల్లవారుజామున దగ్ధమైంది. స్థానికుల వివరాల మేరకు.. రైతు బిచ్చాలు తన పశువుల పాక వద్ద వరిగడ్డి, వేరుశనగ పొట్టు, ఇతర పశుగ్రాసం నిల్వ చేయగా.. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే మూడు గడ్డివాములు పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ. 3లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు. విషయం తెలుసుకున్న ఆర్ఐ మాసుం బాషా, జూనియర్ అసిస్టెంట్ మహేందర్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. ప్రభుత్వపరంగా బాధిత రైతును ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
గోపాల్పేట: పొలానికి నీరు పెట్టేందుకు మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. రేవల్లి మండలంలోని పాత బండరావిపాకులలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. పాత బండరావిపాకుల గ్రామానికి చెందిన తలారి నాగయ్య(59) వ్యవసాయ పొలం కేఎల్ఐ డీ–5 కాల్వ సమీపంలో ఉంది. అయితే సోమవారం ఉదయం మోటారు పనిచేయకపోవడంతో పరిశీలించగా మోటారు చుట్టూ నాచు చేరింది. దీంతో అది తీసేందుకు కాల్వలోకి దిగి సరిచేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన స్థానిక రైతులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై నాగయ్య భార్య తలారి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాము చెప్పారు. వివాహిత బలవన్మరణం రాజాపూర్(బాలానగర్): అదనపు కట్నం వేఽ దింపులు భరించలేక ఓ వివాహిత దుందుభీ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ ఎస్ఐ లెనిన్‌గౌడ్ కథనం ప్రకారం.. బాలానగర్ మండలం గుండేడ్కి చెందిన చారకొండ లక్ష్మి(38)కి 17 ఏళ్ల క్రితం గంట్లవెల్లికి చెందిన చారకొండ లింగమయ్య తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.1.50లక్షలతో పాటు 4తులాల బంగారం, బైక్ కట్నంగా ఇచ్చారు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆతర్వాత అ దనపు కట్నం కోసం భర్త వేధించసాగాడు. దీంతో మూడేళ్ల కిత్రం లక్ష్మి తల్లి రాములమ్మ రూ.లక్ష ఇచ్చి అల్లుడికి ఇచ్చారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో లక్ష్మి పుట్టింటించి వచ్చింది. ఆదివారం సాయంత్రం పెద్దమనుషులతో పంచాయితీ పెట్టి సర్దిచెప్పే ప్ర యత్నం చేయగా లింగమయ్య దాడికి పాల్పడటంతో లక్ష్మి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అందరూ కలిసి వెతకగా బాలానగర్ పాత బ్రిడ్జి కింద నీటిలో మృదేహం ఉందని సమాచారం అందగా అక్కడికెళ్లి చూస్తే లక్ష్మి విగత జీవిగా పడి ఉంది. మృతురాలి తల్లి రాము లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ కలహాలతో వివాహిత... మల్దకల్: కుటుంబ కలహాలతో వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మల్దకల్ మండలం అమరవాయి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమరవాయికి చెందిన కుర్వ బుచ్చమ్మ (42), జమ్మన్న భా ర్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. వారికి ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పొలాన్ని సాగు చేసుకోవడంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఇటీవల కుమారుడి వివాహం చేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనికి తోడు కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన బుచ్చమ్మ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగింది. గమనించిన భర్త జమ్మన్న చికిత్స నిమిత్తం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. అమరవాయి గ్రామంలో మరో వ్యక్తి కుటుంబ కలహాలతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాల్లోకి వెళ్తే.. అమరవాయికి చెందిన నాగరాజు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపారంలో కొంత ఇబ్బందులు తలెత్తడంతో పాటు ఇంట్లో ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురైన అతడు.. సోమవారం పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
దివ్యాంగుల కోసం చట్టం చేయాలి
మహబూబ్‌నగర్ రూరల్: స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ప్రాతినిథ్యం కోసం అసెంబ్లీలో చట్టం చేయాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎం.అడివయ్య డిమాండ్ చేశారు. సోమవారం దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక మహబూబ్‌నగర్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు టి.మధుబాబు అధ్యక్షతన సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడివయ్య, జిల్లా గౌరవాధ్యక్షుడు కురుమూర్తి మాట్లాడారు. 2012 నుండి పెన్షన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా కేవలం రూ. 300 మాత్రమే చెల్లిస్తుందని, దీంతో దివ్యాంగులు ఎట్లా బతుకుతారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లో 5శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులకు ప్రాతినిథ్యం చట్ట సాధనకోసం రాష్ట్రవ్యాప్తంగా లక్ష సంతకాల సేకరణ ఉద్యమం కొనసాగుతుందని, ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు టి.మధుబాబు మాట్లాడుతూ జిల్లాలో దివ్యాంగుల సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని న్నారు. అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని కోరారు.జిల్లా కార్యదర్శి రామకృష్ణ, నాయకులు పారిజాత, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ క్రీడాకారుడికి అభినందన మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ క్రికెట్ పురుషుల జట్టు తరఫున పలు పోటీల్లో పాల్గొని ఇటీవల విజయ్ (వీజీ) ట్రోఫీకి ఎంపికై న విద్యార్థి డేవిడ్ క్రిపాల్‌ను సోమవారం పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీయూ విద్యార్థి వీజీ ట్రోఫీకి ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. రంజీ ట్రోఫీ, ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ పోటీల్లో రాణించి పీయూకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పీయూలో క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ చెన్నప్ప, పీడీలు సత్యభాస్కర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ● ‘లక్ష సంతకాల సేకరణ’లో భాగస్వాములు కావాలి ● ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అడివయ్య -
అది భూదాన్ భూమే..
●● ధరణిలో సరిదిద్దాలని సీసీఎల్ఏ కోర్టు ఆదేశం ముమ్మాటికి అసైన్డ్ భూమి.. జడ్చర్ల శివారులోని సర్వే నంబర్ 138లో గల భూమి ముమ్మాటికి అసైన్డ్ భూమి. దీన్ని కొందరు తమ పేర్లపై పట్టా మార్పిడి చేసుకుని స్వాహా చేసే ప్రయత్నం చేశారు. దీనిపై తాము సీసీఎల్ఏ కోర్టును ఆవ్రయించాం. ఎట్టకేలకు న్యాయమే గెలిచింది. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజోపయోగ పనులకు ఉపయోగించాలి. – ప్రణీల్ చందర్, ఫిర్యాదుదారుడు స్వాధీనం చేసుకుంటాం.. అసైన్డ్ భూమికి సంబంధించి సీసీఎల్ కోర్టు నుండి వచ్చిన ఆదేశాలను పాటిస్తాం. త్వరలోనే సదరు భూమిని స్వాధీనం చేసుకుంటాం. తదుపరి కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుకెళ్తాం. – నర్సింగరావు, తహసీల్దార్, జడ్చర్ల జడ్చర్ల: భూదాన్ యజ్ఞ బోర్డుకు దానం చేసిన భూమిని అసైన్డ్గా మార్చడం.. ఆ భూమిని పీఓబీ(ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్)లో పొందుపర్చడం.. తదుపరి ఇదే అసైన్డ్ భూమిని పట్టాగా పేర్కొంటూ పీఓబీ నుంచి తొలగించడం వంటి పరిణామాలతో వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. జడ్చర్ల పట్టణ శివారులోని సర్వే నంబర్ 138లో మొత్తం 16.32 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి యజమాని మాజీ ఎమ్మెల్యే కొత్త కేశవులు 1957–58 సంవత్సరంలో 2.10 ఎకరాల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకు అప్పగించి.. మిగతా 14.22 ఎకరాల భూమిని తన పేరున ఉంచుకున్నారు. తదుపరి భూదాన్ యజ్ఞ బోర్డుకు అప్పగించిన 2.10 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్డ్ భూమిగా పేర్కొంటూ ఇతరులకు కేటాయించింది.అంతేగాక ఈ భూమికి సంబంధించి ఇతరులకు రిజిస్ట్రేషన్ కాకుండా పీఓబీలో కూడా చేర్చింది.అయితే ఈ భూమికి ఎన్ఓసీ తీసుకువచ్చి తదుపరి చేతులు మారడం వివాదాస్పదంగా మారింది. ఎన్ఓసీ తీసుకువచ్చిన వారు తదుపరి నాలా (నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)గా కూడా మార్చారు. దీంతో కొందరు సీసీఎల్ఏ కోర్టును ఆశ్రయించారు. విచారించిన సీసీఎల్ఏ కోర్టు భూదాన్ భూమిగా గుర్తించి.. వారి హక్కులను రద్దుచేసి, ధరణిలో భూదాన్ భూమిగా సరిదిద్దాలని పేర్కొంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. జడ్చర్ల శివారులోని అసైన్డ్ భూమి వినియోగిస్తే మేలు.. జడ్చర్ల వంద పడకల ఆస్పత్రికి చేరువలో ఉన్న అతి విలువైన ఈ భూమిని ఇప్పటికై నా అధికారులు, పాలకులు సద్వినియోగం చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, తదితర వాటికి భూములు అందుబాటులో లేని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అసైన్డ్ భూమిని త్వరితగతిన స్వాధీన పర్చుకుని అభివృద్ది పనులకు కేటాయించాలని కోరుతున్నారు. కోర్డుకు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, తదితర వాటి ఏర్పాటుకు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
ప్రభుత్వాల కుట్రలను దళితులు తిప్పికొట్టాలి
మహబూబ్‌నగర్ రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు చేస్తున్నాయని, ఆ కుట్రలు దళితులు ఏకమై తిప్పికొట్టాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర కో–ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక ఎస్సీ కమ్యూనిటీహాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డికి దళితుల అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చేవేళ్ల డిక్లరేషన్ ప్రకారం పెరిగిన దళితుల జనాభా దామాషా ప్రకారం 20 శాతానికి రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు ఉమ్మడి జిల్లా విస్తృతస్థాయి సమావేశం మంగళవారం అలంపూర్‌లో నిర్వహిస్తున్నామని, ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాల ఉపకులాల ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లాఅధ్యక్షుడు జి.చిన్న, ప్రధానకార్యదర్శి మహేందర్, నాయకులు ఆనంద్, రవికుమార్, ఆంజనేయులు, తిరుపతయ్య, రామచంద్రయ్య, వెంకట్రాములు, శ్రీనివాసులు, కె.ఆంజనేయులు, శివకుమార్ పాల్గొన్నారు. జాతీయ మాలమహానాడు రాష్ట్ర కో–ఆర్డినేటర్ బ్యాగరి వెంకటస్వామి -
బొప్పాయి తోట ధ్వంసం
బల్మూర్: బొప్పాయి తోటను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని కొండనాగుల శివారులో సోమవారం వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన రైతు గుండాల అనీల్ కొండనాగుల శివారులోని తన ఐదెకరాల పొలంలో ఏడాది క్రితం బొప్పాయి తోట సాగుచేశాడు. ప్రస్తుతం కోత దశలో ఉన్న తోటలోని కాయలను ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు రేగి ముళ్లతో పొడిచి నాశనం చేయడంతో రూ. 2లక్షల నష్టం వాటిల్లింది. అంతే కాకుండా తోటలో ఉన్న వ్యవసాయ బోరు స్టార్టర్ వద్ద విద్యుత్ షాక్ పెట్టి యాజమానిపై హత్యాయత్నం చేశారు. తనకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని సోమవారం బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రమాదేవి తెలిపారు. -
కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య
హన్వాడ: కట్టుకున్న ఇల్లాలే భర్తను కడతేర్చిన ఘటన మండలంలోని ఇబ్రహీంబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. ఇబ్రహీంబాద్‌కు చెందిన శ్రీనివాస్‌గౌడ్(47) సెంట్రింగ్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగించే వాడు. ఆదివారం ఎప్పటిలాగే కూలీ పనులను ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చాడు. అయితే కూలి డబ్బుల్లో రూ. 5వేలు తగ్గడంతో అతడి భార్య లక్ష్మి గొడవకు దిగింది. డబ్బులు ఎందుకు తగ్గా యని భార్య నిలదీయడంతో తన తమ్ముడికి ఇవ్వాల్సిన డబ్బును చెల్లించినట్లు శ్రీనివాస్‌గౌడ్ తెలపడంతో ఇరువురి మధ్య గొడవ మరింత పెరిగింది. తమ సంబంధీకులు వచ్చి ఇద్దరికీ సర్దిచెప్పారు. ఈ క్రమంలో రాత్రి అందరూ నిద్రించిన తర్వాత కుమారుడు రాముతో కలిసి లక్ష్మి శ్రీనివాస్‌గౌడ్ గొంతు నులిమి హత్యచేశారు. ఇదిలా ఉంటే, అతడి పేరుపై వ్యవసాయ భూమి, గృహరుణం ఉన్నాయి. అయితే భర్త శ్రీనివాస్‌గౌడ్ మరణిస్తే ఇన్సూరెన్స్ వర్తించడంతో ఇంటి అప్పుతీరి, ఇన్సూరెన్స్ కింద డబ్బులు వస్తాయనే కోణంలో హత్య జరిగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అతడి భార్య లక్ష్మిని స్టేషన్‌కు తరలించి తమదైన శైలిలో విచారించడంతో కుమారుడు రాముతో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు. -
సరిహద్దులు దాటుతున్న బియ్యం
కృష్ణా: మండల సరిహద్దులోని చెక్‌పోస్టులో సోమవారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు ఽబియ్యం లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఏస్పీ వెంకటేష్ మాట్లాడుతూ.. కొంతకాలంగా మన బియ్యం రాష్ట్ర సరిహద్దులను దాటి వెళ్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కమిషనర్ ఆదేశాల మేరకు తాము ఆకస్మికంగా సరిహద్దు చెక్‌పోస్టులో తనిఖీ చేశామన్నారు. ఈ తనిఖీలో వివిధ ప్రాంతాలకు చెందిన ఆరు లారీలు, ఒక డీసీఎం వ్యాన్‌లో కర్ణాటకకు వెళ్తున్న బియ్యం వాహనాలను పట్టుకున్నట్లు తెలిపారు. వాటికి సంబంధించిన సరైన పత్రాలు డ్రైవర్ల వద్ద లేకపోవడంతో లారీని సీజ్ చేసి కృష్ణా పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వాహనాల్లోని బియ్యం రైస్ మిల్లర్లవా.. అక్రమంగా తరలిస్తున్నారా అనే విషయం విచారణ అనంతరం వెల్లడిస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. లారీలను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు -
అంగన్వాడీల్లో కొలువులు
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులు(ఉద్యోగాలను) భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయ(టీచర్), సహాయకుల(ఆయా) పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. జిల్లాలో దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్‌నగర్ అర్బన్, మహబూబ్‌నగర్ రూరల్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 1185 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 1,130 మంది టీచర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. టీచర్ పోస్టులు 55, ఆయా పోస్టులు 314 ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఖాళీల నివేదికలను ఉన్నతాధికారులకు అందించారు. జిల్లాలో పలు కారణాలతో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయలేదు. కొన్నేళ్లుగా వాటి నిర్వహణకు కూడా ఇబ్బందిగా మారింది. మరికొన్ని చోట్ల కొందరు టీచర్లకు అదనపు కేంద్రాలను అప్పగించగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఖాళీ ఉన్న కేంద్రాల నిర్వహణ సూపర్వైజర్లకు, సీడీపీఓలకు ఇబ్బందిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడం, కేంద్రాల నిర్వహణ సరిగా లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖాళీలను భర్తీ చేస్తే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మెరుగుపడుతుందని తెలుస్తుంది. అంగన్వాడీ టీచర్ పోస్టుకు గతంలో పదో తరగతి ఉత్తీర్ణత కావాలన్న నిబంధన ఉండేది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ టీచర్‌తో పాటు ఆయా పోస్టుకు కనీసం ఇంటర్ పాసై ఉండాలని నిబంధన ఉంది. ఖాళీల వివరాలను గుర్తించాం అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల వివరాలను గుర్తించాం. ఆ కేంద్రాలను నిర్వహించే అంగన్వాడీ టీచర్లు, మాతా శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నాం. ఖాళీగా ఉన్న కేంద్రాలకు సమీపంలో ఉన్న కేంద్రాల నుంచి టీచర్లను, ఆయాలను సర్దుబాటు చేశాం. సూపర్వైజర్లతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నాం. – జరీనాబేగం, జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి, మహబూబ్‌నగర్ జిల్లాలో 55 టీచర్, 314 ఆయా పోస్టుల భర్తీకి కసరత్తు త్వరలో నోటిఫికేషన్ మారిన విద్యార్హత నిబంధన -
మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులివ్వండి
దేవరకద్ర: నియోజకవర్గంలోని దేవరకద్ర, కొత్తకోట, భూత్పూర్ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 200 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వినతిప త్రం ఇచ్చారు. ఆదివారం వనపర్తిలో జరిగిన కార్యక్రమాలకు హాజరైన సీఎంని ఎమ్మెల్యే కలిశారు. మూడు మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలను అందజేశారు. మదనాపురంలో జూనియర్ కళాశాల, కొత్తకోటలో డిగ్రీ కళాశాల, ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరా రు. ఈ విషయంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తెలిపారు. సీఎంకు దేవరకద్ర ఎమ్మెల్యే వినతి -
చెస్‌లో ప్రతిభచాటి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: క్రీడాకారులు చెస్‌లో ప్రతిభ చాటి అంతర్జాతీయస్థాయికి ఎదగాలని జిల్లా యువజన, క్రీడల అధికారి (డీవైఎస్ఓ) ఎస్.శ్రీనివాస్ అన్నారు. జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో విద్యార్థులకు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి డీవైఎస్ఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చెస్ క్రీడకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నారు. చెస్‌లో రాణించే విద్యార్థులు చదువులో కూడా ముందుంటారని అన్నారు. ఈపోటీల్లో 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, సంఘం ప్రతినిధి శ్రీనివాసులు, చెస్ కోచ్ ఆనంద్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. డీవైఎస్ఓ ఎస్.శ్రీనివాస్ -
నేటి నుంచి మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలు
నవాబుపేట: పర్వతాపూర్ మైసమ్మ తల్లికి మరోసారి భక్తిశోభ సంతరించుకోనుంది. మైసమ్మ ఆలయ వార్షికోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, దేవాలయాధికారి నర్సింహులు తెలిపారు. 16వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ధ్వజారోహణం, గణపతి పూజ, కలశాభిషేకం, 4వ తేదీ మంగళవారం సాముహిక కుంకుమార్చన, ప్రత్యేక అలంకరణ, మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాలకు ఎంపీ డీకే ఆరుణ, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నట్లు వారు వివరిచారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. కాగా ఆదివారం అమ్మవారి దేవాలయంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. -
పాలమూరు రుణం తీర్చుకుంటా
వనపర్తి: ‘నల్లమల ప్రాంతంలో పుట్టి.. చైతన్యవంతమైన వనపర్తిలో పెరిగి విద్యాభ్యాసం చేశాను. స్వస్థలమైన పాలమూరు ప్రాంత రుణం తీర్చుకుంటాను.’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగసభలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు అభివృద్ధిని విస్మరించారని, కృష్ణా జలాల నీటి కేటాయింపుల్లో తెలంగాణకు, పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరుతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ప్రకటించారు. 50 లక్షల పైచిలుకు కుటుంబాలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ఆడ బిడ్డలను విస్మరించిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు సరైన గుణపాఠం చెప్పాలంటే సలాకి కాల్చి వాత పెట్టాలన్నారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రజాపాలన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకే అప్పగించి కొనసాగిస్తున్నామని గుర్తు చేశారు. పదేళ్ల పాలనలో పాలమూరులోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఇప్పటికింకా వలసలు ఎందుకు కొనసాగుతున్నాయో చెప్పాలన్నారు. ● నాలుగు దశాబ్దాలుగా వనపర్తి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వారు కక్షపూరిత డబ్బుతో కూడిన రాజకీయాలను ఏనాడు చేయలేదని.. ఐదేళ్ల క్రితం వనపర్తిలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగిన వ్యక్తి వల్ల నియోజకవర్గ రాజకీయాలు కలుషితమయ్యాయని సీఎం అన్నారు. గతంలో వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఆదర్శవంతమైన పరిపాలన అందించిన వారి పేర్లను ప్రభుత్వ ఆస్పత్రులు, తాగునీటి ఎత్తిపోతల పథకాలకు పెడతామని... వేదికపైనే ఈ విషయం గురించి సీఎస్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్వర్‌రెడ్డి, శంకర్, వాకిటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ● ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సాధికారత పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్నారని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. వంటింటికి పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లోనూ రాణించే విధంగా ప్రజాపాలన ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ పంపులు, ఆర్టీసీకి బస్సులు అద్దెకిచ్చే స్థాయికి మహిళలు ఎదిగారని పేర్కొన్నారు. ● మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో తాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగానే పదేళ్లలో తాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగానే నిలిచాయన్నారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా 50 రోజుల్లో కులగణన చేపట్టి పూర్తి చేసిందన్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని జాబ్‌మేళాలు నిర్వహించి 295 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ వనపర్తి ప్రాంతంలో విద్యను అభ్యసించిన సీఎం ఈ ప్రాంతంపై అభిమానంతో పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, ఇప్పటికే రూ.375 కోట్ల అభివద్ధి పనులను చేపట్టామని, మరో రూ.వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను చేసేందుకు శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 133 గ్రామపంచాయతీల అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధులు విడుదల చేయాలని కోరారు. పాలమూరు వాసులుఅమాయకులేం కాదు.. దేశానికి పేరెన్నిక గల నేతలను అందించిన ఉద్యమాల గడ్డ పాలమూరు అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుతో పాటు పటేల్ సుధాకర్, పండగ సాయన్న, మహేంద్రనాథ్ లాంటి గొప్ప నాయకులను పాలమూరు అందించిందని.. వారి స్ఫూర్తితోనే విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ సీఎం దాకా ఎదిగానని చెప్పారు. ఉమ్మడి పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తానన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అడ్డుపడితే సహించేది లేదని స్పష్టం చేశారు. పాలమూరు వాసులు.. అమాయకులేం కాదని.. డొక్క చీల్చి డోలు కట్టడానికి వెనుకాడబోరని హెచ్చరించారు. తెలంగాణ మలి దశ ఉద్యమానికి ఊపిరిపోసింది వనపర్తి గడ్డ అని.. నాడు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి 41 మంది ఎమ్మెల్యేలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారని గుర్తు చేశారు. కేసీఆర్ వల్లే కృష్ణా జలాలకేటాయింపుల్లో అన్యాయం పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదు మహిళల పేరుతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం పాలమూరు అభివృద్ధికి అడ్డుపడితే సహించను వనపర్తి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి -
మనువాదుల కుట్రలను తిప్పికొట్టాలి
మహబూబ్‌నగర్ రూరల్: దేశంలోని కులాల, మతాల మధ్య అసమానతలు సృష్టిస్తూ పరిపాలన కొనసాగిస్తున్న మనువాదుల కుట్రలను తిప్పికొట్టాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అరుంధతి భవన్లో కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగార్జున అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాన్‌వెస్లీ హాజరై మాట్లాడారు. భారతదేశానికి దిశానిర్దేశం చేసే విధంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగానికి పొంచి ఉన్న మనువాద, మతోన్మాద ప్రమాదాన్ని ప్రతిఘటించడానికి ఒక విశాల ఐక్య మహోద్యమాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. దేశంలో మతోన్మాద పాలకులు పూలే–అంబేడ్కర్‌ను మొక్కుతూ వారి ఆశయాలను అణగదొక్కేలా పాలన చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మైనార్టీలపై దాడులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నా రన్నారు. అట్టడుగు వర్గాలైన దళితులు ఆత్మగౌరవం కాపాడాలన్న స్థానికంగా క్షేత్ర స్థాయిలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ ఎం.కుర్మయ్య, మనోహర్, కుమార్, సురేష్‌కుమార్, గోపి, రాధాకృష్ణ, సంపత్, దినాకర్, రాంమ్మూర్తి, ప్రకాష్ కారత్, జిల్లా అధ్యక్షుడు మాణిక్యం రాజు, నాయకులు వెంకట్రాములు, బాలరాజు, శంకర్, రాములు, లక్ష్మిదేవి, రాధిక, నాగరాజు పాల్గొన్నారు. పూలే–అంబేడ్కర్ ఆశయాలను అణగదొక్కేలా పాలన కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ -
బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలి
● మహబూబ్‌నగర్‌లో ఈనెల 9న బీసీల రాజకీయ సదస్సు ● బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త జానయ్య యాదవ్ జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీసీలు తమ న్యాయమైన హక్కులను సాధించుకునేందుకు పోరాటానికి సిద్ధం కావాలని బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీఎన్జీఎస్ భవన్లో బీసీ సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 9న మహబూబ్‌నగర్‌లో జరిగే బీసీ రాజకీయ సదస్సును విజయవంతం చేస్తామని అన్నారు. ఈసదస్సుకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరవుతారని, ఉమ్మడి జిల్లా నుంచి పెద్దఎత్తున బీసీలు హాజరు కావాలన్నారు. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో 2028లో బీసీలు ఎమ్మెల్యేలు అవుతారని, ‘మన ఓటు మనకే వేసుకుందాం’ అనే నినాదంతో బీసీల రాజ్యాధికారాన్ని సాధించుకుందామని అన్నారు. బీసీ నాయకులు తమ్మడ బోయిన అర్జున్, ఎల్లబోయిన ఓదెలు యాదయ్య మాట్లాడారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాస్ సాగర్, బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మైత్రి యాదయ్య, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, వివిధ కుల సంఘ ప్రతినిధులు మెట్టుకాడి ప్రభాకర్, మహేందర్, శేఖరాచారి, శివన్న, అశ్విని సత్యం, బీసీ మేధావులు తదితరులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలి..
వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి సీఎం చేరుకోవడంతో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి శ్రీవెంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎం రేవంత్‌రెడ్డి గోత్రనామములతో అర్చన చేసి స్వామివారి శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాలను అందజేసి వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆశీర్వచనం చేశారు. సీఎంతో పాటుగా రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీహరి స్వామివారి సేవలో గడిపారు. ఈ మేరకు మంగళహారతి దర్శనం అనంతరం ఆలయ అభివృద్ధికి రూ. కోటి నిధులతో సీఎం రేవంత్‌రెడ్డి భూమి పూజచేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అభివృద్ధికి రూ. కోటి కేటాయించామని, ఇంకా ఏమైన నిధులు అవసరమైతే అధికారులు తన దృష్టికి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆలయ ధర్మకర్త అయ్యలూరి రఘునాథచార్యులు సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఆలయ అభివృద్ధి, ఆలయంలో జరుగుతున్న పలు క్రతువులను సీఎంకి వివరించారు. -
జూరాలకు మళ్లీ స్వల్ప ఇన్‌ఫ్లో
ధరూరు : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లోలు కొంత పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఎగువ నుంచి 2,400 క్యూసెక్కుల వరద రాగా.. తిరిగి తగ్గిన విషయం తెలిసిందే. మళ్లీ పెరిగి ఆదివారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2, 672 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. ఆవిరి రూపంలో ప్రాజెక్టు నుంచి కేవలం 79 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 4.997టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. చిరుత కలకలం ● ఆవు దూడపై దాడి చేసి చంపిన వైనం దామరగిద్ద: మండలంలోని బాపన్‌పల్లి శివారులో శనివారం రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. రైతు రమేష్ పొలం వద్ద పశువుల పాకలో కట్టేసి ఉంచిన లేగ దూడపై దాడి చేసి చంపేసింది. అదివారం ఉదయం పొలానికి వెళ్లిన రైతు విగతజీవిగా పడి ఉన్న దూడను చేసి గుండెలు బాదుకున్నారు. ఆరు నెలల కిత్రం ఇదే గ్రామ శివారులో ఓ మేకపై, దామరగిద్దతండా శివారులో ఓ లేగదూడపై దాడి చేసి చంపింది. వరుస ఘటనలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన మొక్కుబడి చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిరుతను బంధించి పశువులను సంరక్షించి రైతులకు భరోసా కల్పించాలని వేడుకుంటున్నారు. చిరుత దాడిలో లేగ దూడను కోల్పోయిన రైతుకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జూరాల ప్రాజెక్టు -
లారీ ఢీకొని మహిళ మృతి
మరికల్: లారీ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం మరికల్లో చోటుచేసుకున్నట్లు ఎస్ఐ రాము తెలిపారు. వివరాలు.. బూడ్యాగానితండాకు చెందిన అనూష(40) కొంతకాలంగా మరికల్లో నివాసం ఉంటుంది. తెల్లవారుజామున హైవేని దాటుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గా యపడిన ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాము తెలిపారు. చెరువులో మునిగి వ్యక్తి.. నారాయణపేట టౌన్: పట్టణ శివారులోని కొండారెడ్డిపల్లి శివారు చెరువులో పడి ఆదివారం ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు.. దామరగిద్ద మండలం బాపన్‌పల్లికి చెందిన గంగారాం( 22) అనే వ్యక్తి చెరువులో విగ్రహల నిమజ్జనం సమయంలో వదిలిన ఇనుప రాడ్లు తీసుకునే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య కిష్టమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జారిపడి యువకుడు.. కల్వకుర్తి టౌన్: నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తు నుంచి జారిపడి ఓ యువ కుడు మృతిచెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా ముజ్జనూర్కు చెందిన ఏసు పాదం(23) ఇంటి మేసీ్త్రగా పనిచేస్తూ కల్వకుర్తిలో నివాసం ఉంటున్నాడు. విద్యానగర్ కాలనీలో ఇంటి మూడో అంతస్థులో నిర్మాణ పనులు చేస్తుండగా జారిపడ్డాడు. అక్కడ ఉన్న వారు గమనించి వెంటనే పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. -
ఆరు‘గురి’ ఎటు..?
గద్వాల క్రైం: పట్టణంలో అర్ధరాత్రి వేళ ఓ కాలనీలో యువకుల సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల్లో రెండుసార్లు అదే కాలనీలో ఓ రోజు ఇద్దరు, మరో రోజు ఆరుగురు రావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. అసలు వారి ఉద్దేశం ఏమిటోనని మదనపడుతున్నారు. ఇటీవలి జిల్లా కేంద్రంలో గుర్తుతెలియని దుండగులు పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నారు. అలాగే యువతులతో వ్యభిచార గృహాలు నిర్వహిస్తూ సంఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని యువకులు రోడ్డుపై కారు పార్క్‌చేసి ఓకాలనీలో అనుమానాస్పదంగా సంచారించారు. శనివారం ఇద్దరు యువకులు చీకటి ప్రదేశంలో ఓ ఇంటి ప్రహరీని దుక్కేందుకు ప్రయత్నించగా ఆ కాలనీవాసులు పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నామని, తెలిసిన వ్యక్తుల ఇంటికి వచ్చామని కాలనీవాసులకు అనుమానం కలగటంతో ఇంకోసారి ఇటువైపు తిరగొద్దని మందలించడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఆరుగురు యువకులు కారులో వచ్చి అదే కాలనీలో అద్దెకు ఉంటున్న ఇద్దరు యువతులతో కనిపించారు. కాలనీవాసులకు అనుమానం రావడంతో యువకులను, యువతులను పట్టుకొని ప్రశ్నించారు. ఈక్రమంలో ఇదే కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నామని, ఓ కళాశాలలో చదువుతున్నట్లు ఇద్దరు యువతులు కాలనీ వాసులకు చెప్పారు. ఆ యువకులు తమగా బంధువులుగా వారు పేర్కొన్నారు. కాగా అనుమానం వచ్చిన కాలనీవాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. పొంతన లేని సమాధానం జిల్లా కేంద్రంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. రెండు రోజుల వ్యవధిలో వివిధ సమయాల్లో వారిని కలిసేందుకు యువకులు వస్తున్నారని కాలనీవాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో యువకులను పోలీసులు పట్టుకొని విచారించగా వారు ఏమాత్రం పొంతన లేక సమాధానాలు చెబుతున్నారు. దీంతో అనుమానాలకు దారి తీసింది. మరో వైపు అర్ధరాత్రి వేళ రాత్రి రావడం.. కారును రోడ్డుపై పార్క్ చేయడం వంటి సంఘటనలపై పోలీసులు వాకబుచేసిన క్రమంలో ఎలాంటి సమాధానం లేకపోయింది. అయితే సంఘటన స్థలానికొచ్చిన మహిళా శిక్షణ ఎస్ఐ తారక ఆయువతులతో మాట్లాడారు. ఆ యువకుల పూర్తి వివరాలపై ఆరా తీశారు. యువకులకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకొని అక్కడి నుంచి పంపించి ఉదయం పట్టణ పోలీసు స్టేషన్‌కు రావల్సిందిగా ఎస్ఐ హెచ్చరించారు. అయిజకు చెందినవారిగా.. అదే కాలనీ శివారులో ఇటివల 40 రోజుల క్రితం వ్యభిచార దందాపై పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు యువకులు అయిజకు చెందిన వారమని చెప్పారు. తెలిసిన వారి కోసం వస్తే అర్ధరాత్రి వేళల్లో రావడం ఏమిటి? యువతులను అపహరించడానికి వచ్చారా..? పుట్టిన రోజు శుభకాంక్షలు చెప్పడానికి వస్తే అర్ధరాత్రి రావడమేమిటి? వంటి అనుమానాలు కాలనీవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ యువకులను పోలీసులు రెండు గంటల పాటు విచారించారు. అర్ధరాత్రి యువకుల సంచారం రెండు రోజుల వ్యవధిలో రెండు సార్లు గుర్తించిన కాలనీవాసులు ఆరా తీసిన పోలీసులు -
అధికారులు సమన్వయంతో పనిచేయండి
వనపర్తిటౌన్: అధికారులు సమన్వయంతో ట్రాన్స్ఫార్మర్ నిర్మాణపనులు చేసి త్వరగా పూర్తిచేయాలని ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి అన్నారు. ఆదివారం కేంద్రంలోని 220/132/33 కేవీ ఉపకేంద్రం వద్ద జరుగుతున్న 3వ, 160 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2ఎక్స్ 160 ఎంవీఏ ఓవర్‌లోడ్‌తో విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు కలిగే ఇబ్బందులు తొలగించేందుకు 3వ, 160 ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. పెరిగిన విద్యుత్ అవసరాలను తీర్చడానికి నిరంతరాయంగా వ్యవసాయ గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులకు విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామన్నారు. మహబూబ్‌నగర్ ఎస్ఈ, ఈఈ వాసుదేవ్, ప్రకాష్, వనపర్తి డీఈ ఓఅండ్ఎం సైదయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫార్మర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలి ట్రాన్స్‌కో డైరెక్టర్ జగత్‌రెడ్డి 3వ 16ం ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ పనుల పరిశీలన -
వరి రైతులు తగు సూచనలు పాటించాలి
అలంపూర్ : రబీలో రైతులు వరి పంట సాగు చేశారు. పంట సాగు జాప్యం చేసిన రైతులు తగిన సూచనలు పాటించాలని జోగుళాంబ గద్వాల జిల్లా వ్యవసాయాధికారి సక్రియనాయక్ సూచించారు. అందుకు అనుగుణంగా పంట సాగుచేస్తే దిగుబడి సాధించొచ్చని పేర్కొంటున్నారు. పొలం తయారీ : నాట్లు వేయడానికి 2–3 సార్లు దమ్ము చేయాలి. ఆఖరి దమ్ములో ఎకరాకు 40 కిలోల వేప పూత యూరియా, 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 35 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. చదరపు మీటర్‌కు 44 కుదుళ్లు ఉండేలా నాటాలి. నాట్ల తర్వాత ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ కాలిబాటలు ఉండేలా చూసుకోవాలి. పైరుకు గాలి, వెలుతురు సమంగా అంది చీడపీడల ఉధృతి తగ్గుతుంది. ఎరువుల యాజమాన్యం నాట్లు వేసిన 30 నుంచి 60 రోజుల దశలో బురద పదును ఉన్న సమయంలో ఎకరాకు 30 కిలోల వేప పూత యూరియా వేయాలి. దీంతో పిలకలు ఎక్కువగా వచ్చి దుబ్బు బాగా కడుతోంది. తేలిక నేలల్లో అంకుర దశలో (నాటిన 60 రోజుల్లో) ఎకరాకు 35 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. నీటి యాజమాన్య పద్ధతులు పొలంలో వరి నాటే సమయంలో 2 సెం.మీ మేరకు నీటి నిల్వలు ఉండేలా చూసుకోవాలి. నాట్ల అనంతరం 4–5 రోజుల వరకు 5 సెం.మీ మేరకు నీరు ఉండేలా చూసుకోవాలి. మొక్కలు త్వరగా వేరు తొడుగుతాయి. తర్వాత 2 సెం.మీ మాత్రమే నీరు ఉంచాలి. ఆ సమయంలో నీరు ఎక్కువైతే పిలకలు తక్కువగా వస్తాయి. పంట పొట్ట దశ నుంచి గింజలు పాలుపోసుకోని గట్టిపడే వరకు 5 సెం.మీ నీరు పెట్టాలి. పంట మధ్యకాలంలో అప్పుడప్పుడు నీరు తీసి పొలాన్ని ఆరబెట్టి తిరిగి నీరుపెట్టాలి. ఇలా చేయడంతో పైరు ఆరోగ్యంగా ఉండి చీడపీడల బెడద తగ్గుతుంది. కలుపు నివారణ : నాట్లు వేసిన 3–5 రోజుల్లో ఎకరానికి 40 గ్రాముల ఆక్సాడయార్జిల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సల్ఫైడ్ దుష్ప్రభావం : పంట మధ్యకాలంలో పైరుకు అక్కడక్కడ కుదుళ్లు పసుపు రంగులోకి మారుతాయి. దీనినే సల్ఫైడ్ దుష్ప్రబావంగా పేర్కొంటారు. ఈ సమస్య ఉన్న పొలంలో నేల మొత్తబడి కాలు దిగబడిపోతుంది. పొలంలో నడుస్తుంటే బుడగల రూపంలో గాలి బయటికి వస్తోంది. నేల నుంచి దురువాసన వస్తోంది. పంటకు ఆశించే పురుగులు నారుమడి నుంచి అంకురం వరకు కాండం తొలిచే పురుగు ఆశిస్తుంది. పిలక దశలో ఈ పురుగు ఆశిస్తే మొవ్వలు ఎండి చనిపోతాయి. పంట చిరు పొట్టదశలో ఆశిస్తే తెల్ల కంకులు వస్తాయి. నివారణకు లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3జీ గులికలు 4 కిలో చొప్పున చల్లి నివారించాలి. నివారణ మొక్కల వేర్లకు తగినంత గాలి అందేలా చూడాలి. మురుగు నీటిని బయటికి పంపి కొత్త నీటిని పెట్టాలి. అమోనియం సల్ఫైట్ (21 శాతం నత్రజని 25 శాతం గంధకం ఉన్న ఎరువు) ఎరువులను పంటకు వాడకూడదు. -
వనపర్తి సంస్కారంతోనే సీఎం అయ్యా
వనపర్తిటౌన్: వనపర్తిలో విద్యార్థి దశ రాజకీయ చైతన్యంతోనే, ఈ ప్రాంత సంస్కారంతోనే తాను సీఎం స్థాయికి ఎదిగినట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 40ఏళ్ల క్రితం కలిసి చదువుకున్న స్నేహితులను, విద్యాబుద్ధులు నేర్పిన గురువులను కలుసుకునేందుకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. తమ వెంట కలిసిమెలిసి తిరిగిన స్నేహితుడు సీఎం హోదాలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడంతో అలనాటి మిత్రులు, గురువులు భావోద్వేగానికి లోనయ్యారు. 1983–85 ఇంటర్ బ్యాచ్, పాఠశాలలో చదివిన విద్యార్థులను ఒక్కొక్కరిని సీఎం రేవంత్‌రెడ్డి పేరుపెట్టి పిలుస్తూ తరగతి గదిలోని చేదు, తీపి జ్ఞాపకాలను స్నేహితులతో పంచుకున్నారు. కొన్ని విషయాలను ఆయన గుర్తుపెట్టుకొని చెబుతుండటంతో మిత్రులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ప్రస్తుతం తన మిత్రులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. సమావేశానికి రాలేని మరి కొంతమంది మిత్రులను త్వరలోనే కలుసుకుంటానని చెప్పారు. నాడు చదువు చెప్పిన గురువులకు వినమ్రంగా నమస్కరించడంతో గురువులు మాశిష్యుడు సీఎం అయ్యాడని మురిసిపోతూ రేవంత్‌రెడ్డి భుజంపై చేయి వేసుకొని ముందుకు సాగారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని కొందరు మిత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. నిధుల కొరత ఉందని, త్వరలోనే పరిస్థితులు అన్ని చక్కదిద్దుకుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం. స్నేహితులతో నాటి జ్ఞాపకాలను పంచుకున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు స్వాగతం పలికిన పార్వతమ్మ కుటుంబ సభ్యులు వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి ఇంటి యజమానిని కలిసిన సీఎం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వనపర్తిలో చిన్నారెడ్డి ఇంటి సమీపంలో అద్దెకు ఉన్న పార్వతమ్మ కుటుంబాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కలిశారు. ఆయన ఆకుటుంబ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు. అలనాటి జ్ఞాపకాలను సీఎం వారితో నెమరేసుకోవడంతో వారి మధ్య నవ్వులు విరబూశాయి. 40ఏళ్ల కిందట తమ ఇంట్లో అద్దెకు ఉన్న విషయాన్ని గుర్తించుకొని సీఎం రేవంత్‌రెడ్డి మమ్మల్ని కలవడం ఆయన సంస్కారానికి, గౌరవ మర్యాదలకు నిదర్శనమని చెప్పగానే పునాదిని మర్చిపోకూడదనే తాను గుర్తించుకున్నట్లు సీఎం వెల్లడించారు. -
బీసీల గురించి మాట్లాడే హక్కు కవితకు లేదు
స్టేషన్ మహబూబ్‌నగర్: బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్సీ కవితకు లేదని బీసీ సమా జ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌సాగర్ అ న్నారు. స్థానిక బీసీ సమాజ్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడూ గుర్తుకు రాని బీసీలు ఈ రోజు గుర్తుకు వస్తున్నారని అన్నారు. అధికారానికి దూరమై ఏడాది గడిచిందని, మళ్లీ అధికారంలోకి రావడానికి బీసీల బాట పట్టడం సిగ్గుచేటన్నారు. బీసీల రాజ్యాధికారం, రిజర్వేషన్ల గురించి పోరాడేందుకు రాష్ట్రంలో చాలా మంది బీసీ మేధావులు, బీసీ రాజకీయ, విద్యార్థి, ప్రజాసంఘాల నాయ కులు ఉన్నారని, మీరు అధికారం కోసం బీసీ వా దాన్ని ఉపయోగించుకోవాలని చూడడాన్ని బీసీ సమాజ్ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. వివిధ సంఘాల నాయకులు సారంగి లక్ష్మికాంత్, అశ్వి ని సత్యం, సత్యనారాయణ సాగర్, బి.శేఖర్, విశ్వనాథం పాల్గొన్నారు. తీన్మార్ మల్లన్న సస్పెన్షన్‌పై.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ సస్పెండ్ చేయడాన్ని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌సాగర్ ఒక ప్రకటనలో ఖండించారు. బీసీ భావజాల వ్యాప్తికి అహర్నిశలు శ్రమిస్తున్న బీసీ గొంతుకై న తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ తన గోతిని తీసుకున్నట్లయిందన్నారు. భవిష్యత్తులో తీన్మార్ మల్లన్న తీసుకునే నిర్ణయానికి బీసీ సమాజం మొత్తం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. అసైన్డ్ భూమిని స్వాధీనపర్చుకోవాలి జడ్చర్ల: పట్టణ శివారులోని సర్వేనంబర్ 138లో గల అసైన్డ్ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీన పర్చుకోవాలని రాష్ట్ర సర్పంచ్ల సంఘం మాజీ కార్యదర్శి ప్రణీల్‌చందర్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సర్వేనంబర్ 138లో గల తన పట్టా భూమిని 1965లో అప్ప టి ఎమ్మెల్యే కొత్తకేశవులు భూదాన్యజ్ఞ బోర్డుకు స్వాధీనపర్చగా అప్పటి ప్రభుత్వం సదరుఅసైన్డ్ భూమిని కావేరమ్మపేటకు చెందిన భూమి లేని నిరుపేదలకు కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. సదరు అసైన్డ్ భూమిని రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకొని ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మాదిగ అమరులకు నివాళి
జడ్చర్ల టౌన్: ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. గాంధీభవన్, అసెంబ్లీ ముట్టడి, చలో కలెక్టరేట్ వంటి నిరసన కార్యక్రమాల్లో మృతిచెందిన వారి చిత్రపటాలను ఏర్పాటుచేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అ ధ్యక్షుడు జంగయ్య మాదిగ, నాయకులు డి.కృష్ణయ్య, కొంగళినాగరాజు పాల్గొన్నారు. ఉద్యమాలతోనే ఏబీసీ వర్గీకరణ మహబూబ్‌నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్లుగా మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజలు అనేక ఉద్యమాలతో ఏబీసీ వర్గీకరణ అమలైందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నర్సింహులు అన్నారు. తెలంగాణ చౌరస్తాలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు టీఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం వేర్వేరుగా ఘనంగా నివాళులర్పించారు. నాయకులు వెంకటస్వామి, గండి బాలరాజు, వెంకటయ్య, చెన్నకేశవులు, రమేష్, నర్సిములు, కృష్ణ పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కావలి కృష్ణయ్య ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు ఘన నివాళులర్పించగా నాయకులు పాల్గొన్నారు. త్యాగాలు మరువలేనివి.. దేవరకద్ర: ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు దొబ్బలి ఆంజనేయులు అన్నారు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌లో మాదిగ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా పోరాడి అదే మార్గంలో అమరులైన మాదిగ సోదరులను గుర్తు చేసుకుందామన్నారు. నాయకులు చెన్నప్ప, రామస్వామి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అమరుల త్యాగం వృథా కాదు మిడ్జిల్: మాదిగ దండోరా అమరుల త్యాగం వృథా కాదని, వారి లక్ష్యం నెరవేరే రోజులు దగ్గరలో ఉన్నాయని దండోరా జిల్లా నాయకుడు, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య సూచించారు. శనివారం మండల కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ మాదిగ అధ్యక్షతన జరిగిన అమరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలయ్య, గణేష్, బుచ్చయ్య, రవీంద్ర, చందు, మహేష్, రాజు పాల్గొన్నారు. భూత్పూర్ చౌరస్తాలో.. భూత్పూర్: ఎమ్మార్పీఎస్ ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి భూత్పూర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. నాయకులు గడ్డం యాదయ్య, రాములు, మండి అంజి, జగన్ యాదయ వీరస్వామి, పవన్ కళ్యాణ్ ఉన్నారు. -
ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రం శివారులోని మౌంట్ బాసిల్ హైస్కూల్ (ఎంబీహెచ్‌ఎస్)లో విద్యార్థులు విభిన్న అంశాలపై మొత్తం 354 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇవి ముఖ్యంగా ఆధునిక సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా, విపత్కర పరిస్థితులలో ప్రమాదం నుంచి ఎలా బయట పడాలి, ప్రకృతి వనరులను ఎలా కాపాడుకోవాలి వంటి ఎన్నో విషయాలు అందరికీ అవగాహన కలిగించేలా ఉన్నందున ఆహూతులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు గణిత శాస్త్రవేత్త సీవీ రామన్ చిత్రపటానికి మహబూబ్‌నగర్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఎంవీఐ) వాసుదేవమూర్తి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ ప్రాజెక్టులను తిలకించి ఎంతో బాగున్నాయని ఆయన కితాబునిచ్చారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చంద్రకళావెంకటయ్య, కరెస్పాండెంట్ పూజితామోహన్రెడ్డి, డైరెక్టర్లు శిరీష ప్రవీణ్‌కుమార్, సుశాంత్ కృష్ణ, ప్రిన్సిపాల్ సోమశేఖర్‌తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రకరకాల ప్రదర్శనలు అడ్డాకుల: మండల కేంద్రంలోని అడ్డాకుల గ్రామర్ స్కూల్లో శనివారం ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంది. రకరకాల ప్రదర్శనలను విద్యార్థులు నిర్వహించారు. ఎంఈఓ వి.కురుమూర్తి, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం జ్యోతి సైన్స్ ఫెయిర్‌ను సందర్శించారు. కరస్పాండెంట్ గోవర్ధన్‌చారి ఉన్నారు. విద్యార్థులకు అభినందనలు నవాబుపేట: స్థానిక ప్రాథమిక, సిద్ధార్థ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఆకట్టుకుంది. చిన్నారు లు ఏర్పాటుచేసిన సోలార్ సిస్టం, రోడ్డు సేఫ్టీ వాటిని చూసి పలువురు విద్యార్థులను అభినందించారు. -
ఉపాధి పనులపై బహిరంగ విచారణ
మహబూబ్‌నగర్ రూరల్: మండలంలోని 26 గ్రామాలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై బహిరంగ విచారణ నిర్వహించారు. శనివారం మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీడీఓ కరుణశ్రీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికలో వివిధ గ్రామాల్లో జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులపై డీఆర్ఆర్పీలు, ఎస్ఆర్పీలు చదివి వినిపించారు. సామాజిక తనిఖీ 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు జరిగిన పనులకు రూ. 6.70 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులకు గాను సామాజిక తనిఖీలో రూ. 23,927 మాత్రమే రికవరీకి అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా జెడ్పీ డిప్యూటీ సీఈఓ ముసాయిదా బేగం మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు ఉపాధిహామీ పనులు పకడ్బందీగా గ్రామాలలో నిర్వహించబడేలా చూడాలని ఆదేశించారు. గ్రామపంచాయతీలలో చేపట్టే ఏ పనులు అయినా పంచాయతీలకే సంబంధం అని, అందువల్ల తప్పనిసరిగా బాధ్యత తీసుకొని పనులు సక్రమంగా నిర్వహించబడేలా చూడాలని అన్నారు. ఈజీఎస్ పనుల నిర్వహణ పట్ల పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ప్రతీ గ్రామంలో కూలీలకు పనులు కల్పించే దిశగా కూలీ డబ్బులు అందించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజావేదికలో జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ ప్రేమలత, అంబుడ్స్‌మెన్ సంతోష్, ఎంపీఓ శంకర్‌నాయక్, ఈజీఎస్ ఏపీఓ రాజశేఖర్‌రెడ్డి, ఈసీ అమ్జద్, ఎస్ఆర్పీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలతో అప్రమత్తంగా ఉండాలి
మహమ్మదాబాద్: సైబర్ నేరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కంచన్‌పల్లిలో సైబర్‌నేరాలపై తగిన అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్‌ఫోన్‌ను తగిన జాగ్రత్తలతో వినియోగించుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు రాజాపూర్: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ శివానందంగౌడ్ అన్నారు. శనివారం మండలంలోని కుచ్చర్కల్రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. కారులో సీటుబెల్టు తప్ప నిసరి అని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ కచ్చితంగా పెట్టుకోవాలన్నారు. లేదంటే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. సామర్థ్యాల పరిశీలన జడ్చర్ల టౌన్: మండలంలోని ఉదండాపూర్ యూపీఎస్‌ను శనివారం ఎంఈఓ మంజులాదేవి తనిఖీచేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. 2వతరగతి విద్యార్థిని సాయిపల్లవి గణితంలో చతుర్విద ప్రక్రియలను చక్కగా చేసినందుకు అభినందించారు. పాఠశాలలో అపార్ ఐడీలు 100శాతం జనరేషన్ చేయించాలని హెచ్ఎం సుధాకర్‌రెడ్డికి సూచించారు. ఎఫ్ఎల్ఎన్ నిర్వహణ, సీసీఈ, ఎండీఎం పనుల నిర్వహణపై చర్చించారు. పాఠశాలలో బాలికల మరుగుదొడ్ల సమస్యగా ఉందని హెచ్ఎం ఆమె దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎంఈఓ అధి కారుల దృష్టికి తీసుకువెళ్తానని భరోసానిచ్చారు. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా
దేవరకద్ర: కొత్తగా ఏర్పడిన దేవరకద్రను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలోని బలుసుపల్లి, పెద్దగోప్లాపూర్, మీనుగోనిపల్లి, చౌదర్పల్లి గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై నివేదికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. మున్సిపాలిటీ సుందరీకరణకు, తాగునీటి ఎద్దడి నివారణకు, డివైడర్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం తనవంతు కృషిచేస్తానని, దీనికిగానూ కనీసం రూ.100 కోట్లు కావాలని సీఎంను కోరుతామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సీత్యానాయక్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు ఫారూఖ్, నాయకులు జవహర్, నర్సింహారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, వర్మ, రాంపాండు పాల్గొన్నారు. మన్యంకొండలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామిని శనివారం దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు జి.మధుసూదన్‌రెడ్డి దంపతులు దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ అళహ రి మధుసూదన్‌కుమార్ ఎమ్మెల్యే దంపతులకు స్వా మివారి శేషవస్రంతో సన్మానించి ఆలయ విశిష్టతను వివరించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి ఉన్నారు. సమస్యలు పరిష్కరించాలని వినతి దేవరకద్ర: పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంఈఓ బలరాం శనివారం ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. డోకూర్ పాఠశాలలో విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మించాలని, దేవరకద్ర జెడ్పీహెచ్‌ఎస్‌కు ప్రహరీని నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. త్వరలో నిధులు మంజూర్ చేసి పనులు చేపడుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి రామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండి అడ్డాకుల: కందూర్ సమీపంలో స్వయంభూగా వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారంబ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను ఆయన ఆవిష్కరించారు. ఈనెల 12 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఎమ్మెల్యే సతీమణి కవిత, ఈఓ రాజేశ్వరశర్మ, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కారెడ్డి నాగిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోట శ్రీహరి, రవీందర్‌శర్మ తదితరులు ఉన్నారు. -
బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జోగుళాంబ డీఐజీ..
సభాస్థలిని పరిశీలిస్తున్న డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ రావుల గిరిధర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా శనివారం జోగుళాంబ జోన్–7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ముందుగా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ నుంచి జెడ్పీహెచ్ఎస్ బాలుర ఉన్నత పాఠశాల వరకు రూట్ బందోబస్తును పరిశీలించారు. సభాస్థలి, సీఎం పర్యటించనున్న ప్రదేశాలు, పైలెట్ వాహనాల ట్రయల్‌రన్ నిర్వహించారు. వీఐపీ కాన్వాయ్ వెళ్లే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ ఓపెనింగ్ పార్టీ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో రోడ్లపై చిరు వ్యాపారులు, వాహనాలు నిలుపరాదని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ సభకు వచ్చే వాహనాలకు ఆర్టీసీబస్డిపోలో పార్కింగ్ సౌక ర్యం కల్పించామని.. కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని సూచించారు. బందోబస్తును మొత్తం ఏడు సెక్టార్లుగా విభజించామని.. నలుగురు ఎస్పీలు, నలుగురు అడిషనల్ ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, 21 మంది సీఐలు, 28 మంది ఎస్ఐలు, 140 మంది ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 420 మంది కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్, 250 మంది హోంగార్డులు విధులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలన్నారు. -
ఆశలు వదులుకున్నా..
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు దాదాపు వదులుకున్నట్లేనని ప్రజాప్రతినిధులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోంది. చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వ అధికార యంత్రాంగం నిష్ణాతులైన రెస్క్యూ టీంలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద, నీటి ఊటలు సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని అధికారులు చెబుతున్నా.. ప్రమాదం జరిగిన సందర్భంలోనే చిక్కుకున్న వారి ప్రాణాలు పోయాయని పలువురు చర్చించుకుంటున్నారు. -
ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలి
మహబూబ్‌నగర్ క్రైం: బాలికలు జీవితంలో ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని ఎస్పీ డి.జానకి అన్నారు. మండలపరిధిలోని రాంరెడ్డిగూడెంలో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల(బాలికల)లో శనివారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట కళాశాల ఆవరణలో మొక్క నాటిన ఆమె, అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొన్ని బలహీనతలు జీవితాన్ని, లక్ష్యాన్ని తారుమారు చేస్తాయని అలాంటి వాటికి ఆకర్షితులు కావొద్దన్నారు. సమాజంలో మహిళ పాత్ర చాలా గొప్పగా ఉంటుందని, ప్రతి రంగంలో రాణించడానికి కష్టపడాలన్నారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ అప్పయ్య పాల్గొన్నారు. -
పరీక్షలకు అన్ని ఏర్పాట్లు
నవాబుపేట: ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ జయరాంనాయక్, యన్మన్గండ్ల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. శనివారం వారు కళాశాలలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విద్యుత్ సరఫరా, తాగునీరు తదితరు వసతులు ఏర్పాటుచేసినట్లు వివరించారు. ఈనెల 5వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారన్నారు. నేడు ఆర్యసమాజ వార్షికోత్సవం జడ్చర్ల టౌన్: పట్టణంలోని ఆర్యసమాజ 71వ వార్షికోత్సవాన్ని ఆదివారం నిర్వహిస్తున్నట్లు సభ అధ్యక్షుడు గుబ్బ నర్సింహులు తెలిపారు. వేడుకల్లో భాగంగా దయానంద సరస్వతి 201వ జయంతిని నిర్వహిస్తారన్నారు. ఉద యం ఆర్ఎస్ఎస్ కార్యాలయం మాధవీయం నుంచి ఆర్యసమాజం వరకు శోభాయాత్ర, 11గంటలకు దేవయజ్ఙం ఉంటుందన్నారు. ఆర్యప్రతినిధి సభ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రావు ఆర్య, ఉపాధ్యక్షుడు శివకుమార్, వైదిక ఉప న్యాసకులు వేదసింధు హాజరవుతారన్నారు. బీసీ జేఏసీ సమావేశం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): బీసీ రాజ్యాధి కార సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఉదయం 11గంటలకు రౌండ్ టేబుల్ సమవేశం నిర్వహించనున్నట్లు బీసీ రాజ్యాధికార సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మైత్రి యాదయ్య శనివారం ఒక ప్రకనటలో తెలిపారు. ఈ సమావేశానికి బీసీ సంఘాలతో పాటు వివిద కుల సంఘాల నాయకులు హాజరు కావాలని కోరారు. వేస్టేజీ వస్తువులు కొనొద్దు మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని స్క్రాప్ దుకాణదారులు ఎట్టి పరిస్థితులలోనూ స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్ల నిర్వాహకుల నుంచి వేస్టేజీ వస్తువులు (వాడిన పాత ప్లాస్టిక్, ఇను ము, పుస్తకాలు, అట్టలు) కొనవద్దని మున్సిపల్ అధికారులు సూచించారు. సుమారు 15 మందికి శనివారం నోటీసులు అందజేశారు. ఒకవేళ ఎక్కడైనా ఇలాంటి వాటిని కొనుగోలు చేసినట్లు తమదృష్టికి వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తికి గాయాలు దేవరకద్ర: మండల కేంద్రంలోని అమ్మాపూర్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడ్డాడు. మండలంలోని గోపన్‌పల్లికి చెందిన వేణుసాగర్ బైక్‌పై దేవరకద్రకు వస్తుండగా అమ్మాపూర్ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఈఘటనలో గాయపడ్డ వేణుసాగర్ను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ.. రాజాపూర్: మండలంలోని మోత్కులకుంటతండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. హెచ్ఎం శ్రీనివాస్‌రావ్, ఉదయ్‌కుమార్, భాస్కర్, తిమ్మారెడ్డి, రేణుక, సతీష్‌రాథోడ్ పాల్గొన్నారు. చిన్నచింతకుంట: స్థానిక జెడ్పీహెచ్ఎస్లో స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌గా హర్షిక,డీఈఓగా శ్రావణ్‌తేజ, మండల విద్యాధికారిగా మాదియ తబాసుం, ప్రధానోపాధ్యాయులుగా ఖమేష్ తబసుంలతో పాటు 30 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. రుణాలను సకాలంలో చెల్లించండి మహమ్మదాబాద్: డ్వాక్రా సంఘాల్లో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని బీఎల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. మండలంలోని కంచన్‌పల్లి డ్వాక్రా సంఘాల్లో రుణాలు తీసుకుని చెల్లించని వ్యక్తిపై గ్రామస్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు శనివారం పీఎం నర్సింహస్వామి, పీడీ వెంకట్ ఆధ్వర్యంలో మహిళాసంఘాలతో కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మహిళలను మోసం చేసే విధంగా రుణం తీసుకొని చెల్లించక ఇబ్బందులు పెట్టడంతో ఎలాౖగైనా తీసుకున్న రుణాన్ని వసూలు చేయాలని ఆదేశించారు. శ్రీనిధి తీసుకున్న మహిళలు కూడా క్రమం తప్పకుండా చెల్లించాలని, అధికారులు మళ్లీ రుణాలు ఇస్తారని తెలిపారు. ఏపీడీ జోజన్న, ఏపీఎంలు బాలకృష్ణ, సునిత సీసీలు తదితరులు పాల్గొన్నారు. -
‘ఉపాధి‘లో నీడ కరువాయె
నవాబుపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. ‘ఉపాధిశ్రీలో పని చేసే కూలీకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఎండాకాలంలో వారు సేద తీరేందుకు పని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంది. కానీ ఎక్కడా కూడా ‘ఉపాధి‘ కూలీలకు నీడ కోసం ఏర్పాట్లు చేసిన దాఖలు లేవు. అలాగే తాగునీరు, మెడికల్ కిట్లు సైతం అందుబాటులో ఉంచాల్సి వాటి ఊసే లేదు. పని ప్రాంతంలో ఏదైనా జరిగితే ఊర్లోకి కానీ, మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి. ముఖ్యంగా గ్రామాల్లో కందకాల తవ్వకం కొనసాగుతున్న తరుణంలో పనిచేసే స్థలం గ్రామాలకు చాలా దూరంగా ఉంది. దీంతో కూలీలకు సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మండుటెండలో పనిచేస్తున్నాం మండుటెండలో పనిచేస్తున్నాం. కాస్త సేద తీరేందుకు నీడ కరువైంది. మూడేళ్ల క్రితం టెంట్ కవర్లు ఇచ్చారు. కానీ వాటి జాడలేదు. తాజాగా ఫాంఫండ్ పనులు చేస్తున్నాం. పనికి దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం వస్తాం. ఎండలో తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాం. – బాబునాయక్, హాజిలాపూర్ పంచాయతీలే సమకూర్చాలి మూడేళ్ల నుంచి కొత్త పనిముట్లు రాలే. వాటికి సంబంధించి కూలీలకే డబ్బులు అదనంగా వస్తాయి. వేసవిలో కూలీలకు ఎండ నుంచి ఉపశమనం కల్పించాలని కవర్లు, తాగునీరు తదితర సదుపాయాలను గ్రామ పంచాయతీలే సమకూర్చాలి. ఉపాధి హామీ పనుల విషయంలో చాలా బాధ్యతలు పంచాయతీలవే. –జయరాంనాయక్, ఎంపీడీఓ, నవాబుపేట కానరాని కనీస సౌకర్యాలు కూలీలకు తప్పని తిప్పలు -
సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: స్థానిక భాగ్యనగర్ కాలనీలోని రోడ్ నం.9లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు కోరారు. ఈ మేరకు వారు శనివారం కలెక్టరేట్లో మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేకాధిరి శివేంద్రప్రతాప్, కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ సంక్షేమ కమిటీ మాజీ అధ్యక్షుడు ఆశన్న, మాజీ ప్రధాన కార్యదర్శి చికిరాల పట్టాభి మాట్లాడారు. సుమారు 20 ఏళ్లుగా నివసిస్తున్నా తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కోయిల్‌కొండ: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు చర్యలు చేపడుతుందని ఎంపీడీఓ హరిశ్చంద్రారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామం ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటి నిర్మాణంలో పాటించవలసిన నాణ్యతను లబ్ధిదారులకు వివరించారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వైద్యం భాస్కర్, ఎండీ పుష్పలత, మోహన్‌రెడ్డి, సంధ్యరాజేందర్, రాజన్న, చంద్రనాయక్, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘యూపీఎస్’తో ఉద్యోగులను మభ్యపెట్టే ప్రయత్నం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ పేరుతో ఉద్యోగులను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుందని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోనీ సీపీఎస్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.50లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఏళ్లతరబడి పోరాటం చేస్తున్నారన్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి అమలుచేయనున్న యూపీఎస్ విధానంతో ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారుతాయని ఆవేదన వ్యక్తంచేశారు. యూపీఎస్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈనెల 2న హైదరాబాద్‌లో ‘యుద్ధభేరి’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టరేట్లో విడుదల చేశారు. ఆదివారం ఉదయం జెడ్పీ గ్రౌండ్ నుంచి ‘యుద్ధభేరి’కి బయలు దేరనున్నట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు రాజేష్ కుమార్, సీపీఎస్ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డి, నర్సింహారెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్ -
సమస్యల పరిష్కారమే మజ్లిస్ లక్ష్యం
స్టేషన్ మహబూబ్‌నగర్: కుల, మతాలకతీతంగా పేదల సమస్యలను పరిష్కరించడమే (ఆలిండియా మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమిన్) ఏఐఎంఐఎం లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ హాదీ అన్నారు. శనివారం ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఎస్బీహెచ్ మెయిన్ బ్రాంచ్ ఎదుట గల పార్టీ కార్యాలయ ఆవరణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎంఐఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జాకీర్ అడ్వకేట్, పట్టణ అధ్యక్షుడు సాధతుల్లా హుస్సేని, నాయకులు ముజంబిల్, జహంగీర్, మహెబూబ్, ముస్తాక్ రషీ ద్, ఇమ్రాన్ షరీఫ్, తాహెర్, మాబూద్, ఫారుఖ్‌అలీ, వహీద్సనా, ఇలియాజ్ ముజాహిద్ పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేస్తాం జడ్చర్ల టౌన్: నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని పార్టిని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నామని ఆపార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు జాకీర్ అలి అన్నారు. ఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జడ్చర్లలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. నాయకులు యాసిర్, జామిద్, ముబీన్, షకీల్, సాబేర్, మౌలానా పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ సీజ్
నవాబుపేట: కారూర్ శివారులో అక్రమంగా ఇసుకను తరిస్తున్న ట్రాక్టర్‌ను శనివారం పోలీసులు ప ట్టుకొని సీజ్‌చేసినట్లు ఎస్ఐ విక్రమ్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న కృత్రిమ ఇసుక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని డ్రైవర్‌పై కేసు నమోదుచేశారు. తిరుమలకు పాదయాత్ర ధన్వాడ: మండలంలోని గున్ముక్ల గ్రామం నుంచి పలువురు భక్తులు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర చేపట్టారు. తమ గ్రామం పాడిపంటలు, సిరి సంపదలతో తులతూగాలని కాంక్షిస్తూ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. -
సమగ్ర శిక్ష నిధులను వినియోగించుకోవాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సమగ్ర శిక్ష ప్రాజెక్టు, పీఎంశ్రీ ద్వారా జిల్లాలోని పాఠశాలలకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోనీ వీసీ హాల్లో సమగ్ర శిక్ష ప్రాజెక్టు, పీఎంశ్రీ ద్వారా మంజూరైన నిధుల వినియోగం, ఎస్ఎస్సీ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం, తదితర విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్, పీఎంశ్రీ ద్వారా 2024–25 సంవత్సరానికి పాఠశాల నిర్వహణ, భద్రత, ఆత్మ రక్షణ, యువ, పర్యావరణ క్లబ్‌లు, నిర్మాణ పనుల కోసం మంజూరైన నిధులను వినియోగించుకోవాలన్నారు. టెన్త్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించాలని సూచించారు. పాఠశాలల కిచెన్ షెడ్లు, పరిసరాలు పరిశుభ్రతగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవికాలంలో తాగునీటి కొరత లేకుండా, టాయిలెట్స్ ఉపయోగం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఈఓ ప్రవీణ్‌కుమార్, కేజీబీవీ ఏఎంఓ శ్రీనివాస్, పరీక్ష విభాగం అసిస్టెంట్ కమిషనర్ కరుణాకర్ పాల్గొన్నారు. -
చివరి అంకానికి..
ఎస్ఎల్బీసీలో చిక్కుకున్న 8 మంది కార్మికుల అవశేషాల గుర్తింపు సాక్షి, నాగర్‌కర్నూల్/అచ్చంపేట రూరల్: ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికులను వెలికితీసేందుకు చేపడుతున్న సహాయక చర్యలు చివరి అంకానికి చేరుకున్నట్టు కనిపిస్తోంది. నేడో, రేపో సొరంగం నుంచి కార్మికులను బయటకు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. మొదట గుర్తించిన ఒక స్పాట్ నుంచి నలుగురు, ఆ తర్వాత మరో స్పాట్ నుంచి నలుగురు కార్మికులను వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి ఊట పెరుగుతుండటం, మట్టి తొలగింపునకు కన్వేయర్ బెల్టు అందుబాటులోకి రాకపోవడంతో ఆలస్యం అవుతోంది. శనివారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి సంఘటన స్థలానికి చేరుకుని, పనులను పర్యవేక్షించారు. నీటి ఊట, మట్టి తొలగింపుతో పనులు ఆలస్యం.. మొత్తం 13.85 కి.మీ. సొరంగ మార్గంలో 13.61 పాయింట్ వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. మిగతా చోటును గాలించేందుకు అక్కడ సుమారు 18 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, శిథిలాలు ఆటంకంగా మారాయి. జీపీఆర్ గుర్తించిన చోట తవ్వకాలు జరిపేందుకు సింగరేణి, ర్యాట్ మైనింగ్ టీం రంగంలోకి దిగింది. ఎలాంటి మిషనరీ లేకుండా వారు మ్యానువల్‌గా తవ్వకాలు చేపడుతున్నారు. టీబీఎం సంబంధిన విడిభాగాలు, శిథిలాలను కట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. సహా యక బృందాల రాకపోకలకు, మట్టి, శిథిలాల తరలింపునకు దారిని ఏర్పాటు చేస్తున్నారు. కట్టర్ చివరి భాగంలో కార్మికులు ఉన్నట్టుగా భావిస్తున్న చోట తవ్వకాలు చేపడుతుండగా, పెద్ద ఎత్తున వస్తున్న నీటి ఊటతో అవరోధాలు ఏర్పడుతున్నాయి. నీటిని తోడేందుకు డీవాటరింగ్, మట్టిని తొలగించేందుకు చేపడుతున్న చర్యలతో ఆలస్యం అవుతోంది. కుటుంబీకుల ఎదురుచూపులు.. పొట్టకూటి కోసం వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు, సిబ్బంది ఎస్ఎల్బీసీ సొరంగంలో పనులు చేస్తూ చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎస్ఎల్బీసీలో జేపీ కంపెనీలో పనులు చేస్తున్నారు. కాగా ఏడు రోజుల నుంచి సొరంగంలో తమ వారు క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నా.. సోషల్ మీడియా, ఇతర ప్రసార మాధ్యమాల్లో వస్తున్న కథనాలను చూసి సొరంగంలో చిక్కుకున్న వారి బంధువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. క్షేమంగా బయటపడతారని ఇన్ని రోజులు ఎదురు చూశామని, అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు భిన్నంగా ఉన్నాయని వాపోతున్నారు. జేపీ కంపెనీ సమీపంలోకి పెద్దఎత్తున పార్థివ అంబులెన్సులు రావడంతో తమవారి ప్రాణాలపై ఆశలు లేవని అర్థమైందని అక్కడికి వచ్చిన బంధువులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మంత్రులు, సీఎస్ సమీక్ష.. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్, ఎమ్మెల్యే వంశీకృష్ణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం ప్రత్యేక హెలికాప్టర్లో దోమలపెంటకు వచ్చిన మంత్రులు 11.50 గంటలకు టన్నెల్ వద్దకు చేరుకున్నారు. టన్నెల్ లోపల పరిస్థితులను వివిధ శాఖల విపత్తుల అధికారులు వివరించారు. టీబీఎం విడి భాగాలను గ్యాస్ కట్టర్‌తో కట్ చేస్తూనే.. ఊట నీరు, మట్టిని తొలగించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. టీబీఎంకు ఇరువైపులా ఉన్నట్లు గుర్తించిన జీపీఆర్ స్కానింగ్ నేడు నలుగురు, 2 రోజుల తర్వాత మరో నలుగురు కార్మికులను వెలికి తీస్తారని అంచనా సహాయక చర్యలను పరిశీలించిన మంత్రులు ఉత్తమ్, జూపల్లి, సీఎస్ శాంతికుమారి -
నేడు వనపర్తికి సీఎం రాక
వనపర్తి: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకుగాను అధికార, పాలకవర్గం భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4:35 వరకు వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. హెలికాప్టర్లో హైదరాబాద్ నుంచి 11.30కి జిల్లాకేంద్రంలోని కేడీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వేంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకొని స్వామి వారి దర్శనానంతరం ఆలయ అభివృద్ధికి రూ.కోటి ప్రొసీడింగ్ పత్రాలను ఆలయ కమిటీ చైర్మన్ అయ్యలూరి రఘునాథశర్మకు అందజేస్తారు. అటు నుంచి తను విద్యనభ్యసించిన జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానానికి చేరుకొని అక్కడే పాఠశాల, కళాశాల భవన నిర్మాణాలు, జీజీహెచ్ భవనం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, ఐటీ టవర్, శ్రీరంగాపురం ఆలయ అభివృద్ధి పనులు, పెబ్బేరులో 30 పడకల ఆస్పత్రి భవనం, జిల్లాకేంద్రంలోని రాజనగరం శివారు నుంచి పెద్దమందడి వరకు బీటీరోడ్డు నిర్మాణం, ఎస్టీ హాబిటేషన్ వర్కింగ్ బిల్డింగ్, నియోజకవర్గంలోని సీఆర్ఆర్ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని తన పాఠశాల, కళాశాల మిత్రులు, గురువులతో కాసేపు గడిపి వారితో కలిసి భోజనం చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2.20కి బయలుదేరి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభాస్థలికి చేరుకుంటారు. అక్కడే రేవంతన్న కా భరోసా అనే కొత్త పథకాన్ని ప్రారంభిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెక్కులు, కుట్టుమిషన్లు, నియామక పత్రాలు అందజేసిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు హాజరుకానున్నారు. రూ.721 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి ‘రేవంతన్న కా భరోసా’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం -
వసతి గృహంలో అన్నం వండలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తా
బల్మూర్: నాగర్‌కర్నూల్ జిల్లా కొండనాగుల ఎస్టీ బాలుర వసతి గృహంలో శివరాత్రి రోజు అన్నం వండలేదని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. నిరూపించకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా.. అని మాజీమంత్రి కేటీఆర్‌కు అచ్చంపేట ఎమ్మెలే వంశీకృష్ణ సవాల్ విసిరారు. బల్మూరు మండలంలోని కొండనాగుల ఎస్టీ బాలుర వసతి గృహంలో శివరాత్రి రోజు విద్యార్థులకు అన్నం వండకుండా పస్తులుంచారని మాజీమంత్రి కేటీఆర్ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే ఎస్టీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వసతి గృహాల వైపు చూడకుండా పేద విద్యార్థులను పట్టించుకోని కేటీఆర్ ఇక్కడి నుంచి ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ట్విట్టర్(ఎక్స్)లో మాట్లాడటం వారి రేటింగ్లకేనని విమర్శించారు. ఇక్కడికి వచ్చి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల పాఠశాలలను మూసివేశారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని వసతి గృహాల్లో మెనూ పెంచి నాణ్యమైన భోజనం, విద్య అందిస్తున్నారని, దీనిని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే తప్పుడు సమాచారంతో దిగజారుడు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్‌కు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ సవాల్ -
పురుగుమందు తాగి వ్యక్తి బలవన్మరణం
మల్దకల్ : నెల రోజుల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందగా ఆర్థిక ఇబ్బందులతో పురుగుమందు తాగి భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో తల్లిదండ్రులను కోల్పోయి ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారిన ఘటన శుక్రవారం చర్లగార్లపాడులో చోటుచేసుకుంది. ఎస్ఐ నందికర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కుమ్మరి వీరేష్(32) భార్య భారతి జనవరిలో అనారోగ్యంతో మృతి చెందింది. ఆర్థిక సమస్యలతో మనస్తాపం చెందిన వీరేష్ గురువారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రించిన అనంతరం ఇంట్లో పొలాలకు పిచికారీ చేసే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో ఉండగా వీరేష్‌ను చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. నెల రోజుల వ్యవధిలోనే తల్లి అనారోగ్యంతో, తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో భార్య మృతి అనాథలైన ముగ్గురు చిన్నారులు -
కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలు
అలంపూర్: అలంపూర్ క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నాలుగోరోజు స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో నిత్యపూజ, హోమాలు, బలిహరణం, రుద్రహోమాలు చేశారు. అనవాయితీగా ఉదయం స్వామి, అమ్మవారికి రావణ వాహన సేవ నిర్వహించారు. అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను రావణ వాహనంపై ఉంచి పూజలు చేసి హారతులిచ్చారు. ఈఓ పురేందర్‌కుమార్ సేవ ప్రారంభించి పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం అశ్వవాహన సేవ, పార్వేట సేవలు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులు తమ ముంగిటకు వచ్చిన ఆది దంపతులకు స్వాగతం పలికి మొక్కులు తీర్చుకున్నారు. నేటితో ముగియనున్న ఉత్సవాలు.. ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఉత్సవాలు శనివారంతో ముగియనున్నట్లు ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ముగింపు రోజున ఉదయం 7.30 నుంచి నిత్య పూజలు, హోమాలు, బలిహరణం, 9 గంటలకు శేషవాహనసేవ, 10 గంటలకు రుద్రహోమాలు, 11 గంటలకు పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అవభృత స్నానం, మూకబలి, ధ్వజావరోహణం కార్యక్రమాలు జరగనున్నట్లు వివరించారు. కనులపండువగా ఆదిదంపతుల రావణ, అశ్వవాహన, పార్వేట సేవలు -
హైవేపై రోడ్డు ప్రమాదం
ఒకరి దుర్మరణం.. కొత్తకోట: పెబ్బేరు సమీపంలోని రంగాపూర్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో 30 మందికి గాయాలైనట్లు ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. పెబ్బేరుకు చెందిన ముష్టి విష్ణు (35) భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి శుక్రవారం కారులో ఎర్రవల్లికి వెళ్లాడు. అక్కడ ఓ స్నేహితుడిని ఎక్కించుకొని తిరిగి హైదరాబాద్ బయలుదేరాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం కర్నూలు జిల్లా ఆత్మకూరులో బంధువులు మృతిచెందడంతో అక్కడికి వెళ్లి అంత్యక్రియలు ముగించుకొని తిరిగి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. రెండు కార్లు పెబ్బేరు సమీపంలోని రంగాపూర్ బైపాస్ వద్దకు రాగానే ఒకదానిని ఒకటి దాటబోయి డివైడర్‌ను ఢీకొని రహదారి అవతలికి వెళ్లాయి. ఈ ప్రమాదంలో విష్ణు అక్కడికక్కడే మృతిచెందగా కుమారుడి కాలు విరిగింది. భార్యకు తీవ్ర గాయాలుకాగా, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. మరో కారులో ఉన్న ముస్లిం కుటుంబంలో నలుగురికి తీవ్ర గాయాలు, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో హైదరాబాద్ వనస్థలిపురం నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సులో ఉన్న 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి. బస్సులోని వారు ఆదివారం తిరుపతిలో జరిగే వివాహానికి హాజరుకావాల్సి ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న హైవే సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో వనపర్తి ఏరియా ఆస్పత్రికి అటు నుంచి పలువురిని మహబూబ్‌నగర్, మరికొందరిని హైదరాబాద్‌కు తరలించారు. మృతదేహాన్ని వనపర్తి మార్చురీకి తరలించారు. ప్రమాద ఘటనతో జాతీయ రహదారిపై గంటల తరబడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎస్ఐ రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలు పునరుద్ధరించారు. -
అనుమానాస్పదంగా చిన్నారి మృతి
మల్దకల్ : అనుమానాస్పదంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలోని మద్దెలబండలో చోటుచేసుకుంది. ఎస్ఐ నందికర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పవిత్ర, నరేష్ దంపతుల 13నెలల కుమార్తె దర్శినిని ఈనెల 27న ఇంట్లోని ఉయ్యాలలో పడుకోబెట్టి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. ఇంటి దగ్గర ఉన్న నాయనమ్మ చిన్నారికి ఆహారం అందించి నిద్రపుచ్చింది. మధ్యాహ్నం 2గంటల సమయంలో ఇంటికొచ్చిన తల్లి పవిత్ర చిన్నారిని చూడగా అచేతన స్థితిలో కనిపించింది. కుటుంబ సభ్యులు దర్శినిని చికిత్స నిమిత్తం గద్వాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చిన్నారి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. తండ్రి నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వ్యక్తి బలవన్మరణం గోపాల్పేట: అప్పులు, కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతిచెందిన ఘటన మండల కేంద్రంలోని హనుమాండ్లగడ్డ కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ దామోదర్‌రెడ్డి కథనం మేరకు.. హనుమాండ్లగడ్డకాలనీకి చెందిన మల్లయ్య (40)కు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు ఉండగా.. అప్పులు, కుటుంబ కలహాలతో కొంతకాలంగా మలయ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నా డు. కాసేపటి తర్వాత తమ్ముడు శివ గుర్తించి తలుపులు బద్దలుగొట్టి చూడగా అప్పటికే మృతిచెందాడు. భార్య కొంకలి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఏఎస్ఐ వివరించారు. నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష దేవరకద్ర: హత్యాయత్నం కేసులో నిందితుడికి మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ శుక్రవారం మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ సబ్ కోర్టు న్యాయమూర్తి గాండ్ల రాధిక తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. 2017లో ముత్యాలంపల్లిలో శ్రీనివాస్‌పై మురళీధర్‌రావు కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లో దేవరకద్ర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కోర్టులో జరిగిన వాదోపవాదాల్లో నేరం రుజువు కావడంతో మురళీధర్‌రావుకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య ఉప్పునుంతల: మండలంలోని పెనిమిళ్లకు చెందిన మేర కృష్ణయ్య (48) చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ఉదయం తాడూరు శివారులో చోటు చేసుకుంది. అందుకు సంబంధించి ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు.. కృష్ణయ్య భార్య అంజనమ్మ, పిల్లలతో విడిపోయి 20 ఏళ్లుగా తన చెల్లెలు తాడూరుకు చెందిన సాకేవల చంద్రకళ వద్ద ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని బొడ్డుపల్లి చంద్రయ్య వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా కన్పించాడు. గమనించిన పరిసర పొలాల రైతులు మృతుడి చెల్లెలికి సమాచారం అందించారు. తన అన్న తరచుగా కడుపునొప్పితో ఇబ్బందులు పడేవాడని, ఆ బాధ తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. అప్పులు కట్టలేక.. జడ్చర్ల: అప్పులు కట్టలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన జడ్చర్లలో చోటు చేసుకుంది. సీఐ కమలాకర్ కథనం మేరకు.. స్థానిక ఎర్రగుట్టలోని డబుల్‌బెడ్ రూం కాలనీలో నివాసం ఉంటున్న వడ్డె సంజీవ (30) లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. గురువారం పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం భార్య శ్రీలత తన ముగ్గురు పిల్లలను తీసుకొని తల్లి గారింటికి వెళ్లింది. తిరిగి అదే రోజు సాయంత్రం భార్య ఇంటికి వచ్చే సరికి బెడ్రూంలో భర్త వడ్డె సంజీవ ఫ్యాన్ కొండికి తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కుటుంబ అవసరాల నిమిత్తం సంజీవ స్థానికంగా పలువురితో డబ్బులు అప్పుగా తీసుకుని వాడుకొన్నాడు. అప్పులు తీర్చలేక మానసికంగా కుంగిపోయాడని, ఈ కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భార్య శ్రీలత చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రైలు ఢీకొని యువకుడికి గాయాలు దేవరకద్ర: మండల కేంద్రంలో శుక్రవారం రైలు ఢీకొని ఓ యువకుడు గాయపడ్డాడు. ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది. పేరు తెలియని యువకుడిది మహబూబ్‌నగర్ మండలం ఓబ్లాయిపల్లితండాగా తెలిసింది. కుటుంబ సభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. గాయపడ్డ యువకుడిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
ఇసుక మాఫియాపై ఉక్కుపాదం
కఠిన చర్యలు తప్పవు మండలంలో ఎక్కడైనా కృత్రిమంగా ఇసుకను తయారు చేస్తున్నా అక్రమంగా ఇసుకను తరలించినా కఠినచర్యలు తప్పవు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. గ్రామాల శివారుల్లోని రైతులు, గ్రామస్తులు సైతం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సమాచారం ఉంటే తమకు తెలపాలి. – శివానందం, ఎస్ఐ రాజాపూర్ ఇసుక డంప్‌లను సీజ్ చేస్తున్నాం ఇసుక రవాణా జరుగుతున్నదని తమ దృష్టికి వస్తే వెంటనే దాడులు చేసి ఇసుక డంప్‌లను సీజ్ చేస్తున్నాం. పట్టుబడిన వాహనాల స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానాలు విధిస్తున్నాం. దుందుభీ వాగులో కృత్రిమ ఇసుక తయారుచేస్తున్నట్లు సమాచారం రాగానే వెళ్లి ఇసుక ఫిల్టర్‌ను ధ్వంసం చేశాం. – విద్యాసాగర్‌రెడ్డి, తహసీల్దార్, రాజాపూర్రాజాపూర్: ఇసుక మాఫియాపై రెవెన్యూ, పోలీసు శాఖలు ఉక్కుపాదం మోపాయి. ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం మండలంలోని కుచ్చర్కల్ గ్రామ శివారులో దుందుభీ వాగులో కాంక్రీట్‌తో ఏర్పాటుచేసిన ఇసుక ఫిల్టర్‌ను అధికారులు ధ్వంసం చేశారు. రాజాపూర్ పరిసర ప్రాంతాల జేసీబీలను అధికారులు పిలిచినా రాకపోవడంతో హైదరాబాద్ నుంచి ఇటాచీ తెప్పించి అక్కడున్న ఫిల్టర్ ధ్వంసం చేశారు. వాగులోకి కిలోమీటర్‌కు పైగా దూరం వరకు తయారుచేసిన కృత్రిమ ఇసుకను తయారుచేస్తారు. వీటిని తరలించేందుకు వీలుగా ఇసుక మాఫియా వాగులో రోడ్డు వేసుకున్నది. అధికారులు వస్తున్నారన్న సమాచారం అందడంతో వారి వాహనాలు రాకుండా ఉండేందుకు రోడ్డుకు అడ్డంగా పెద్దపెద్ద మట్టికుప్పలను అడ్డుగా పోశారు. అయితే అధికారులు తెచ్చిన ఇటాచీతో పెద్దపెద్ద మట్టికుప్పలను తొలగించి ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, రాజాపూర్, బాలానగర్ ఎస్ఐలు శివానందం, లెనిన్, రాజాపూర్ తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి పర్యవేక్షణలో ఫిల్టర్‌ను ధ్వంసం చేయించారు. ఫిల్టర్లకు వాడుతున్న జనరేటర్లు, మోటార్లను సీజ్‌చేసి రాజాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనుమతుల్లేకుండా అక్రమంగా విద్యుత్‌ను వాడుతుండటంతో విద్యుత్ శాఖాధికారులు కరెంట్ కనెక్షన్‌ను తొలగించారు. ఎఫ్టీఎల్ పరిధిలో అనుమతులు లేకుండానే ఇంటిని సైతం నిర్మించారు. కుచచర్కల్ శివారులో ఇసుక ఫిల్టర్ ధ్వంసం వాగులో కిలోమీటర్ మేర కృత్రిమ ఇసుక తరలించేందుకు రోడ్డు వేసిన మాఫియా అధికారుల రాకను అడ్డుకునేందుకు రోడ్డుపై మట్టికుప్పలు -
ఎండు మిరపకు నిప్పు పెట్టిన దుండగులు
● రూ. ఐదు లక్షల నష్టం అయిజ: రైతులు పండించిన ఎండు మిరుప పంటకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటన గురువారం రాత్రి అయిజ మండలంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. తూంకుంట గ్రామానికి చెందిన రైతు అలిపీర 2.30ఎకరాల పొలంలో మిరుప సాగుచేశాడు. సుమారు 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పండించిన మిరుపను పొలంలోనే ఎండబెట్టి రాశిగా కుప్ప పేర్చాడు. గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎండుమిరుప కుప్పకు నిప్పంటించారు. దీంతో సుమారు రూ. ఐదు లక్షల నష్టం వాటిల్లింది. శుక్రవారం బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శ్రీనివాసరావు ఘటనాస్థలికి చేరుకొని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు. -
విద్యార్థి మృతదేహం లభ్యం
వెల్దండ: మండలంలోని గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి ఓమేష్(17) మృతదేహం లభ్యమైంది. రెండో కోనేరులో శుక్రవారం ఎన్డీఆర్ఎఫ్ బృందం మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. ఈనెల 26న స్నేహితులతో కలిసి దైవదర్శనానికి వచ్చిన ఓమేష్ కోనేరులో గల్లంతయ్యాడు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ సహకారంతో గురువారం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గుండాలకు చేరుకున్నాయి. ప్రధాన కోనేరులో విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం పక్కనే మరో కోనేరులో ఎన్డీఆర్ఎఫ్ కమాండో కృష్ణాతర్జీ ఆదేశాల మేరకు సిబ్బంది పృథ్వి, మల్లికార్జున్ గాలింపు చేపట్టారు. క్రేన్ సహయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోనేరులోకి వెళ్లి దాదాపుగా 120ఫీట్లతోతులో మృతదేహం ఆచూకీ గుర్తించారు. కోనేరు లోతు ఎక్కువగా ఉండడంతో క్రేన్ సామర్థ్యం సరిపోవడం లేదు. కోనేరులో నుంచి మళ్లీ బయటికొచ్చిన సిబ్బంది అక్కడి పరిస్థితిని వివరించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మరో భారీ క్రేన్ తెచ్చి కోనేరులోకి వెళ్లి గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు. సహాయక చర్యలను పరిశీలించిన ఎమ్మెల్యే.. గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి ఓమేష్ను గుర్తించడానికి ఎన్ఆర్ఎఫ్ బృందం, పోలీసులు, ఫైర్ సిబ్బంది చేపట్టిన సహాయక చర్యలను శుక్రవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. కేంద్ర బలగాల కమాండర్ కృష్ణాతార్జీను వివరాలను అడిగి తెలుసుకున్నారు.నాయకులు భూపతిరెడ్డి, సంజీవ్‌కుమార్, వెంకటయ్యగౌడ్తో కలసి గాలింపు చర్యలను తెలుసుకున్నారు. రెండో కోనేరులో మృతదేహాన్ని గుర్తించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నిరసన లోతు తెలియకనే జాప్యం గుండాల కోనేరులో గల్లంతైన విద్యార్థి మృతదేహం గుర్తించడంలో జాప్యానికి కారణం కోనేరు తెలియకపోవడమే. ప్రధాన కోనేరులో గురువారం వెళ్లి పరిశీలించాం. అక్కడ విద్యార్థి ఆచూకీ లభించలేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశాం. శుక్రవారం ఉదయాన్నే పక్కనే ఉన్న మరో కోనేరులోకి వెళ్లి చూడగా మృతదేహం లభ్యమైంది. దాదాపుగా 120ఫీట్ల లోతులో మృతదేహం ఉండడంతో భారీక్రేన్ అవసరమైంది. మరో క్రేన్ సహయంతో రెండో కోనేరులోకి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశాం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన కోనేరు కావడంతో పరిస్థితిని అంచనా వేయలేకపోయాం. – పృథ్వి, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యుడు -
బీసీ కులగణన సర్వే తప్పుల తడక
నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్: ఎస్ఎల్బీసీ ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించలేదని ఓ పక్క అందరూ గగ్గోలు పెడుతుంటే.. ఉన్న మంత్రులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా సింగోటం లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే జిల్లాకేంద్రంలో బీసీ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 8 మంది ప్రాణాలు ఎస్ఎల్బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే ఢిల్లీ నుంచి కాంగ్రెస్ దూత వచ్చారని మంత్రులు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారని తెలిపారు. ఒక్క మంత్రి కూడా సంఘటనా స్థలం వద్ద లేరంటే ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేనితనమో అర్థమవుతోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన సర్వే అంతా తప్పుల తడకగా ఉందన్నారు. 2014లో కేసీఆర్ జరిపిన సర్వేలో 52 శాతం బీసీలు ఉంటే కాంగ్రెస్ సర్వేలో 46 శాతానికి తగ్గిందన్నారు. తప్పుడు లెక్కలతో బీసీల జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ చూపిస్తోందని విమర్శించారు. రెండోసారి బీసీ కులగణన చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం దీనిపై ఎక్కడా ప్రచారం నిర్వహించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వమళ్లీ అదే సర్వే రిపోర్ట్‌ను చూపించి బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. బీసీలు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 46 శాతం రిజర్వేషన్లు కల్పించేలా వేర్వేరు బిల్లులు పెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. బీఆర్ఎస్ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న నాయకులను, అధికారులను ఎవరినీ వదిలిపెట్టమన్నారు. ‘ముఖ్యమంత్రి గారు మీ మహబూబ్‌నగర్ నుంచే చెబుతున్నా.. కచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మాకు కూడా టైం వస్తది. అప్పుడు అందరి సంగతి చెబుతాం.’ అని కవిత హెచ్చరించారు. బోనస్ పేరుతో బోగస్ హామీ.. రైతులకు సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బోగస్ చేసిందని, రైతు భరోసా, రుణమాఫీ గ్రామాల్లో సగం మందికి కూడా రాలేదని కవిత అన్నారు. కేఎల్ఐ పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించిన ఘనత కేసీఆర్‌దే అని, పాలమూరు– రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు కేసీఆర్ హయాంలో 60 శాతానికి పైగా పూర్తయ్యాయని గుర్తుచేశారు. కేసీఆర్ ప్రభుత్వం నార్లాపూర్ వద్ద పంప్‌హౌజ్‌ను కూడా ప్రారంభించిందని, ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా నీళ్లు ఇవ్వాలనుకుంటే 8 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి వ్యవస్థ సిద్ధంగా ఉందన్నారు. గత 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల్లో ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని దుయ్యబట్టారు. తక్షణమే మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బీసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు బీసీ గణనపై వెల్లిడించిన అభిప్రాయాలను, సలహాలను ఆమె నోట్ చేసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బైకాని శ్రీనివాస్‌యాదవ్, అభిలాష్‌రావు, రఘువర్ధన్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం రాలేదని గగ్గోలు పెడుతుంటే ఉన్న మంత్రులూ వెళ్లిపోయారు పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం.. మాకూ టైం వస్తది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
మృతదేహంతో నిరసన..
కోనేరులో మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో పాటు వివిధ సంఘాల నాయకులు మృతదేహంతో మూడు గంటలపాటు నిరసన తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఇవ్వాలని, ఒకరికి ఉద్యోగం, మూడెకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ యాదగిరి సంఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎంతకీ వారు వినకపోవడంతో ఎమ్మెల్యే కసిరెడ్డితో ఫోన్ ద్వారా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇప్పించినట్లు సమాచారం. తక్షణసాయం కింద రూ.60వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. -
కిటకిటలాడిన కురుమతి కొండలు
● అమావాస్య సందర్భంగా భారీగాతరలివచ్చిన భక్తులు చిన్నచింతకుంట: అమావాస్యను పురస్కరించుకొని అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయానికి శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు తెల్లవారుజామునే ఆలయాన్ని శుద్ధిచేసి సుప్రభాత సేవ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లో నిల్చుని స్వామివారిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు మెట్లపై దీపాలు వెలిగిస్తూ, కొబ్బరికాయలు కొడుతూ గోవింద నామస్మరణతో స్వామివారి చెంతకు చేరుకోగా.. మరికొందరు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పలువురు కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు, అన్నం వండి నైవేద్యంగా స్వామివారికి సమర్పించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, భాస్కరాచారి, భారతి తగిన ఏర్పాట్లు చేశారు. ఘనంగా గిరి ప్రదక్షిణ.. కురుమూర్తిస్వామి ఆలయం వద్ద శుక్రవారం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి రాజగోపురం ప్రధాన మెట్ల నుంచి స్వామివారి ప్రధాన ఆలయం పక్కన ఉన్న కలశ పూజ మండపం మట్టి రోడ్డు, అమ్మాపురం మీదుగా ఐదు కిలోమీటర్ల మేర ఆలయం వరకు ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
కాలం చెల్లిన వాహనం.. కాలుష్య కారకం
● 15 ఏళ్లుపై బడిన వెహికిల్స్‌తో తీవ్రమైన కాలుష్యం ● రోగాల విజృంభణ నేపథ్యంలో కట్టడికి చర్యలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 32,181 వాహనాలు ● గ్రీన్ ట్యాక్స్ భారీగా పెంచిన ప్రభుత్వాలు పాలమూరు: భారీగా పెరిగిపోతున్న వాహన కాలుష్యంతో వాతావరణంలో సమతుల్యత లోపించి కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలకు గ్రీన్ టాక్స్ భారీగా విధిస్తోంది. 15 ఏళ్లు దాటిన ద్విచక్రవాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవడానికి రూ.2 వేలు, 20 ఏళ్లు దాటిన బైక్‌లకు రూ.5 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. ఇక 15 ఏళ్లు దాటిన కార్లకు రూ.5 వేలు, 20 ఏళ్లు దాటిన వాటికి రూ.10 వేల పన్నులు వసూలు చేయాలని ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో చాలా వరకు కార్లు, ద్విచక్రవాహనాలు 20 ఏళ్లు పైబడినా అలాగే రోడ్లపై నడుపుతున్నారు. అలా కాలం చెల్లిన వాహనాల నుంచి భారీస్థాయిలో పొగ విడుదల కావడంతో మిగిలిన వాహనదారులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
పోలీస్ శాఖలో ఏఆర్ సిబ్బంది అత్యంత కీలకం
మహబూబ్‌నగర్ క్రైం: పోలీస్ శాఖలో ఏఆర్ పోలీసుల విధులు అత్యంత కీలకమని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 24 గంటలు పనిచేస్తారని ఎస్పీ జానకి అన్నారు. జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ (ఏఆర్) మొబిలైజేషన్ ముగింపు కార్యాక్రమం శుక్రవారం జిల్లా పరేడ్ మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీకి ప్రత్యేక కవాతు నిర్వహించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కుటుంబాలను వదిలి, ప్రజల భద్రత కోసం ఎంతో కష్టపడుతారని తెలిపారు. అన్ని సవాళ్లను అధిగమించి పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించడం అభినందనీయన్నారు. శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి నిత్యం వ్యాయామం, యోగా, మెడిటేషన్ చేయాలని, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి కుటుంబ సభ్యులతో సమయం గడపాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రాములు, సురేష్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు కృష్ణయ్య, నగేష్, రవి తదితరులు పాల్గొన్నారు. ● ఏఆర్ ఎస్ఐగా పనిచేసి పదవి వీరమణ పొందిన అసదుల్లాను ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకి పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. అలాగే ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ వెంకటేష్ కుటుంబానికి అతని బ్యాచ్ మిత్రులు ఆర్థిక సహాయం అందించారు. వెంకటేష్ బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు అందరూ కలిసి రూ.లక్ష ఎస్పీ చేతులమీదుగా ఏఆర్ కానిస్టేబుల్ భార్య వనితకు చెక్కు అందించారు. -
ఆదేశాలు ఇచ్చాం..
ఉమ్మడి జిల్లాలో ఉన్న అందరూ ఎంవీఐలు, ఆర్టీఓలకు 15 ఏళ్లు పైబడిన వాహనాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేసి అలాంటి వాహనాలు గుర్తించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 15, 20 ఏళ్లు పైబడిన వాహనదారులు ప్రతిఒక్కరూ వారి వాహనాల రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువన్ లేని వాహనాలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలో పట్టుబడితే సీజ్ చేస్తాం. ప్రధానంగా రోడ్లపై వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ సీటు బెల్ట్, హెల్మెట్ తప్పక ధరించాలి. – కిషన్, డీటీసీ ఉమ్మడి జిల్లా -
రేషన్ బియ్యం పట్టివేత
అమరచింత: అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. పట్టణంలోని శ్రీకృష్ణానగర్‌లో గల కాళికాలయం సమీపంలో అక్రమంగా ఓ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో శుక్రవారం రేషన్ బియ్యం కలిగిన వాహనంను అదుపులోకి తీసుకున్నామన్నారు. పట్టణానికి చెందిన సాకలి కోరి కృష్ణ అనే వ్యక్తి కొన్నేళ్లుగా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నాడన్నారు. ఇదే తరహాలో ఐదు టన్నుల రేషన్ బియ్యాన్ని డంప్ చేసి వాహనంలో తరలిస్తూ పట్టుబడినట్లు వెల్లడించారు. వాహనంలోని 101 బియ్యం బస్తాలను సీజ్ చేసి డీఎస్ఓకు సమాచారం అందించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని తెలిపారు. -
ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. దోమలపెంట జేపీ బేస్ క్యాంప్ కార్యాలయంలో సహాయక బృందాల అధికారులతో కలెక్టర్, ఎస్పీ వైభవ్, ఇరిగేషన్ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి సుఖేండు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ, ఆర్మీ అధికారులు కల్నల్ పరీక్షిత్ మెహ్రా, కల్నల్ అమిత్ కుమార్ గుప్తా, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారి బలరాం, హైడ్రా అధికారులు, జేపీ కంపెనీ ప్రతినిధులతో టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఆక్సిజన్ అందుబాటులో ఉంచారని, సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని కోరారు. -
ఎంఈఓకు నోటీసులు జారీ
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహమ్మదాబాద్ ఎంఈఓ రాజునాయక్‌కు డీఈఓ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. విద్యాశాఖలో ప్రైవేటు పాఠశాలలకు అనుమతులివ్వడంపై ‘సాక్షి’లో ఈనెల 20న ‘ఏం జరుగుతుంది’ అనే కథనం ప్రచురితమైంది. జిల్లాలోని ఓ మండలంలో ఎంఈఓ ప్రైవేటు స్కూల్‌కు అనుమతులు ఇచ్చేందుకు డబ్బులు వసూలు చేశారని, ఆన్లైన్ చేసేందుకు మరిన్ని డబ్బులు అడిగినట్లు అందులో పేర్కొంది. పద్ధతి మార్చుకోని ఎంఈఓ మహమ్మదాబాద్ మండలంలో ఓ పాఠశాల యాజమాన్యాన్ని డబ్బులు ఇస్తే మరోసారి ప్రక్రియ పూర్తి చేస్తామని ఒత్తిడి తేవడంతో సదరు పాఠశాల యాజమాన్యం ఇటీవలి డీఈఓకు విద్యార్థి సంఘాలతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా ఎంఈఓ రాజునాయక్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనకు నోటీసులు జారీ చేశామన్నారు. నిర్ణీ త గడువులోగా సమాధానం చెప్పాలని, ఆరోపణలపై సరైన వివరణ ఇవ్వకపోతే ఉన్నతాధికారులకు చర్యలపై సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. మీసేవ కేంద్రాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు పాలమూరు: జిల్లాలో ఉన్న మీసేవ కేంద్రాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో శుక్రవారం హైదరాబాద్ విజిలెన్స్ బృందాలు వేర్వేరుగా పలు మీసేవ కాంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఎస్పీ ర్యాంకు అధికారుల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగాయి. ప్రధానంగా ఫిర్యాదులు వచ్చిన వాటిపై ప్రత్యేక దృష్టి సారించి దాడులు చేసి వివరాలు సేకరించారు. ఆదాయం, కులం, బర్త్ సర్టిఫికెట్ల కోసం రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని ఫిర్యాదుల వచ్చాయి. దీనిపై విచారణ చేసి అధిక ఫీజులు వసూలు చేసే మీసేవ కేంద్రాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా ఇటీవల డీఎస్సీ ద్వారా కొత్తగా నియామకమైన 130 ఎస్జీటీ ఉపాధ్యాయులకు, 8 మంది 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు జిల్లాకేంద్రంలోని బాలికల పాఠశాలలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంరీసోర్సుపర్సన్లు అంశాలపై అవగాహన కల్పించారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ కొత్త ఉపాధ్యాయులు జిల్లాలో అక్షరాస్యతను పెంచి మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు అక్షర పరిజ్ఞానం, చతుర్విద ప్రక్రియలను పూర్తిస్థాయిలో పెంచాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్, కాంప్లెక్సు హెచ్ఎం బాసిత్ పాల్గొన్నారు. -
అడ్డంకులు దాటుతూ..
అచ్చంపేట: దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయకచర్యలు ముమ్మరం చేశారు. అత్యాధునిక పరికరాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. గ్యాస్ కటింగ్ పరికరంతో టీబీ మిషన్ కట్ చేసే పనులు వేగవంతమయ్యాయి. కటింగ్ చేసిన విడి భాగాలను ఎప్పటికప్పుడు బయటకు తీసుకొచ్చారు. శుక్రవారం ఏడోరోజు లోకో ట్రైన్ ద్వారా సింగిరేణి బొగ్గు గనుల నుంచి తెప్పించిన పెద్ద సైజు ట్రేలలో సొరంగం బయటికి బురద, గ్యాస్, ఫాస్మ కటర్ల ద్వారా టీబీఎం విడి భాగాలు, ఇతర ఇనుప రాడ్లు, పైపులను రెస్క్యూ టీం సభ్యులు మోయగలిగిన సైజులో కట్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కన్వేయర్ బెల్ట్‌ను పునరుద్ధరించలేదు. సొరంగం లోపల 14.85 కిలోమీటర్ల వద్ద టీబీఎం మిషన్ ఉండగా పైకప్పు కూలింది. ఇక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించేందుకు లోకో ట్రైన్‌ను 13.500 కిలోమీటరు వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళిక బద్ధగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గట్టి పడిన మట్టిని తీయడానికి మినీ జేసీబీలను వినియోగిస్తున్నారు. జేసీబీలు, బృందాలు లోపల బురదను పక్కకు తొలగిస్తూ బయటికి పంపిస్తున్నారు. మూడు బోగీలు (ట్రేలు) ద్వారా బురద బయటికి తరలించారు. సొరంగంలోకి చేరిన నీటిని బయటకు పంపింగ్ చేయడానికి అదనపు మోటార్లను తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో మట్టిని తరలించకపోయినా లోపల ఓ పక్కకు వేస్తూ కార్మికుల ఆచూకీ కనుకొనేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బాధితుల కోసం సొరంగంలో టెషర్స్ అందుబాటులో ఉంచారు. రక్షణ కోసం.. టన్నెల్లోకి వెళ్లే సహాయక బృందాల రక్షణ కోసం కృత్రిమ ఏర్పాట్లు చేస్తున్నారు. లోపల ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఐరన్ షీట్లు, పైపులను రౌండ్‌గా బెండ్ చేసి వెల్డింగ్ చేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తున్నారు. దీని ద్వారా లోపలికి ప్రవేశించేలా చర్యలు చేపట్టారు. సొరంగం కూలిన, రాళ్లు, రప్పలు ఊడిపడినా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా వీటిని తయారు చేసున్నారు. దీంతో ఏమైనా ప్రమాదం జరిగినా తప్పించుకునే అవకాశం ఉంటుందని సహాయక బృందాలు పేర్కొంటున్నాయి. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ టన్నెల్ వద్దకు ఇతరులు వెళ్లకుండా నివారిస్తున్నారు.సొంతూళ్లకు కార్మికులు.. టన్నెల్లో జరిగిన ప్రమాదంతో భయాందోళనకు గురైన కార్మికులు ఒక్కొక్కరుగా సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. కుటుంబసభ్యులు ఫోన్ చేసి తిరిగి రావాలని వేడుకుంటున్నారని, గత్యంతరం లేక మూడు నెలల జీతాలు రావాల్సి ఉన్నా వదిలి వెళ్తున్నామని కార్మికులు వాపోయారు. సొరంగం వద్ద పనులు సాగుతాయో లేదో అని.. తమ సొంత రాష్ట్రంలోనే ఏదో ఒక పని చేసుకుంటామని పేర్కొంటున్నారు. జీతాలు లేకున్నా సరే మా ప్రాణాలే ముఖ్యం అంటున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఏడోరోజు కొనసాగిన సహాయక చర్యలు ముమ్మరంగా బురద, మట్టి, శిథిలాల తరలింపు అత్యాధునిక పరికరాలతో గాలింపు -
పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈ నెల 5వ తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కౌసర్‌జహాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలలలో సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాల్లో జనరల్ 8,916, ఒకేషనల్ 2,006 మొత్తం 10,922 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణకు జిల్లా పరీక్షల కమిటీ, రెండు ఫ్లైయింగ్ స్క్వాడ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్, 36 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 36 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారన్నారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 92402 05555 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. డీసీఈ సభ్యులు ఉమామహేశ్వర్, రవీందర్, గోపాల్, సందీప్‌కుమార్, సాధిక్ పాల్గొన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కౌసర్‌జహాన్ -
క్రమబద్ధీకరణ చేసుకుంటే 25% రాయితీ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31 లోగా క్రమబద్ధీకరణ చేసుకుంటే 25 శాతం రాయితీ వర్తిస్తుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పెండింగ్‌లను క్షేత్రస్థాయి వెరిఫికేషన్, క్రమబద్ధీకరణ రుసుం చెల్లింపునకు అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం తరఫున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం నగర, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ మేళాలు నిర్వహించాలని, పట్టణాల్లో ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ ఆటోల ద్వారా, ఆడియో రికార్డు ద్వారా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు రుసం మార్చి 31లోగా చెల్లించేలా అవగాహన కల్పించాలన్నారు. వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
శిథిలాల తొలగింపు షురూ
లోకో ట్రైన్ మూడు కోచ్‌ల ద్వారా మట్టి వెలుపలికి.. అచ్చంపేట/ అచ్చంపేట రూరల్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ఇంకా బయటికి రాలే దు. టన్నెల్ నుంచి వారిని క్షేమంగా బయటికి తెచ్చే ఆపరేషన్ గురువారం మొదలైంది. సహాయక చర్య ల్లో అధికారులు వేగం పెంచారు. లోకో ట్రైన్ మూడు కోచ్ ద్వారా మట్టి శిథిలాలను తీసుకొ చ్చారు. టీబీఎం మిషన్ ఉన్న ప్రాంతానికి లోకో ట్రైన్ పూర్తిగా చేరుకోలేకపోతోంది. 13.95 కి.మీ., వద్ద టీబీఎం మిషన్ ఉండగా చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లేందుకు పట్టాలు ఉన్నాయి. అయితే భారీగా పేరుకుపోయిన మట్టి, బురద, సెగ్మెంట్లు, టీబీఎం శిథిలాల వల్ల టన్నెల్ చివరి వరకు లోకో ట్రైన్ వెళ్లలేకపోతోంది. ఈ రెండింటి మధ్య 300 మీటర్ల దూరం ఉంది. దీంతో టీబీఎం వరకు చేరుకునేందు కు లోకో ట్రైన్ పట్టాలు, సొరంగంలోని మట్టి, రాళ్లు, బురద తొలగించేందుకు కార్యాచరణను రెస్క్యూ బృందాలు చేపట్టాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే లోకో ట్రైన్ టీబీఎం చివరి వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత టీబీఎం ఉన్న ప్రాంతంలోని శిథిలాలు తీసే పని మొదలవుతుంది. అప్పటివరకు టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల జాడ కనిపించే అవకాశం లేదు. ఈ ఆపరేషన్‌లో సింగరేణి బృందాలు కీలకంగా పని చేస్తున్నాయి. సొరంగం పైకప్పు కూలకుండా ప్రతిష్టమైన పునఃనిర్మాణం చేస్తున్నారు.అయితే దెబ్బతిన్న కన్వేయర్ బెల్టు మరమ్మతు మాత్రం చేపట్టలేకపోతున్నారు. సొరంగం లోపలికి వెళ్లేందుకు లోకో ట్రైన్ ఒక్కటే ఉండటం వల్ల అందులోనే సిబ్బంది వెళ్తూ.. దానిలోనే మట్టి తీసుకురావడం వల్ల కొంత కష్టంగా మారింది. ● టన్నెల్లో ప్రతి నిమిషానికి 5 వేల లీటర్ల నీళ్లు ఊరుతోంది. కూలిన రెండోరోజు నుంచే డీవాటరింగ్ చేస్తున్నా అదుపులోకి రాలేదు. రెండు రోజుల క్రితం నుంచి 100 హెచ్‌పీ మోటార్లతో ముమ్మరంగా డీవాటరింగ్ చేయడంతో పూడిక ఉన్న ప్రాంతం వరకు వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే సొరంగంలో చిక్కుకున్న వారి క్షేమంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. కఠిన ఆంక్షలు.. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రాంతానికి వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. కనీసం మీడియాకు కూడా అనుమతి ఇవ్వలేదు. రాజకీయ నాయకుల సందర్శనను తిరస్కరిస్తున్నారు. కేవలం రెస్క్యూ ఆపరేషన్ బృందాలు, అధికారులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. టన్నెల్ చుట్టూ ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, భద్రతా పరమైన సమస్యలు తలెత్తకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం.. సొరంగంలో శిథిలాల కింద చిక్కుకున్న మానవ శరీరాలు గుర్తించేందుకు ప్రత్యేకంగా ఎన్జీఆర్ఐ ప్రత్యేక బృందం గురువారం ఉదయం సహాయ చర్యలు చేపట్టింది. సొరంగంలో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేకంగా గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ ఆంటీనాను ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా వారి ఆచూకీ లభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. టెన్షన్.. టెన్షన్ మాజీమంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ఎస్ఎల్బీసీ వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను టన్నెల్ లోపలికి అనుమతించకపోవడంతో జేపీ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. టన్నెల్ సందర్శనకు వచ్చిన బృందాన్ని పోలీసులు ముందుగా దోమలపెంట ఫారెస్టు చెక్‌పోస్టు, జేపీ కార్యాలయానికి వెళ్లే గేటు వద్ద, సొరంగం మార్గం రహదారిలో మూడు చోట్ల అడ్డుకుని తనిఖీలు చేశారు. పదుల సంఖ్యలో వచ్చిన వాహనాలను లోపలికి పంపించకుండా ఫారెస్టు చెక్‌పోస్టు వద్దే అడ్డుకున్నారు. పోలీసులు చివరికి హరీశ్‌రావుతోపాటు ముఖ్య నాయకులు 10 మంది మాత్రమే లోపలికి పంపించారు. సొరంగం వద్దకు వెళ్లేందుకు ముందు పోలీసులు మరిన్ని ఆంక్షలు విధించడంతో హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టన్నెల్ లోపలికి అనుమతించడంతో బీఆర్ఎస్ బృందం సొరంగం వద్దకు చేరుకుని రెస్క్యూ టీం సభ్యులు, ప్రతినిధులతో మాట్లాడారు. అనంతరం జేపీ కార్యాలయం ఎదుట విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడాలని, జేపీ కంపెనీ ప్రతినిధులు, కలెక్టర్‌తో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలని పోలీసుల ద్వారా సమాచారం పంపించారు. కానీ, వారెవరనూ రాకపోవడంతో జేపీ కార్యాలయం గేటు వద్ద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బయటికి రావాలని, అధికారులు వచ్చి తమతో మాట్లాడాలని నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్బీసీ టన్నెల్‌తో పాటు మరో మూడు ప్రాజెక్టులు కూలిపోయాయని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. 14 నెలల కాంగ్రెస్ పాలనలో ఎస్ఎల్బీసీకి చేసింది ఏమిటని ప్రశ్నించారు. ప్రాజెక్టులలో నీళ్లను కూడా కాపాడలేకపోతున్నారని, శ్రీశైలం అడుగంటిందని ఎద్దేవా చేశారు. శ్రీశైలం మీద పాలమూరు జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల ప్రాజెక్టుల ద్వారా 2.50 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాల్సి ఉండగా.. ఇప్పటికే శ్రీశైలం ఖాళీ అవుతుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 మంది చొప్పున మూడు షిఫ్ట్లోపనిచేస్తున్న రెస్క్యూ బృందాలు ఈ ప్రక్రియ పూర్తయితేనే కార్మికుల జాడ ఆరు రోజులైనా మరమ్మతుకు నోచుకోని కన్వేయర్ బెల్ట్ -
పని ఒత్తిడి తట్టుకోలేక..
జనరల్ ఆస్పత్రిగా మార్పు చెందిన తర్వాత 350 నుంచి 550 పడకలకు, ఆ తర్వాత 650 పడకల సామర్థ్యం పెరిగింది. దీంతో రోజువారి ఓపీతోపాటు ప్రసవాలు, అడ్మిట్ అవుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరిగింది. అయితే జిల్లా వైద్య కళాశాల అనుమతి వచ్చిన తర్వాత ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పారామెడికల్ సిబ్బంది ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఆస్పత్రిలో ఉండే ప్రధాన విభాగాలకు మూడు షిఫ్టుల వైద్యులు ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు. దీనికితోడు జిల్లా జనరల్ ఆస్పత్రికి వైద్య సిబ్బంది 459 మంది అవసరం ఉంటే.. ఇప్పటికీ 200లోపు మాత్రమే ఉన్నారు. ఇలా పని ఒత్తిడి తట్టుకోలేక వైద్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విభాగాల్లో ఎస్‌ఆర్‌లు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. -
మరికొన్ని వివరాలు..
● మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎస్ఎల్బీసీ జేపీ కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 12.30 గంటలకు కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందే కార్యాలయం ముందున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి గేటు బయటకు పోలీసులు పంపించారు. ● 2.16 గంటలకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావుతో పాటు పలువురు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాంతానికి వెళ్లారు. కొందరికే అనుమతి ఇవ్వడంతో రెండు కార్లలో ఉన్నవారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. 5 నిమిషాల తర్వాత సొరంగానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చి ప్రెస్మీట్లో మాట్లాడారు. -
మరికొన్ని వివరాలు..
● మధ్యాహ్నం 12.16 గంటలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎస్ఎల్బీసీ జేపీ కార్యాలయం వద్ద ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ● 12.30 గంటలకు కార్యాలయానికి వచ్చారు. అంతకు ముందే కార్యాలయం ముందున్న మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి గేటు బయటకు పోలీసులు పంపించారు. ● 2.16 గంటలకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్‌రావుతో పాటు పలువురు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రాంతానికి వెళ్లారు. కొందరికే అనుమతి ఇవ్వడంతో రెండు కార్లలో ఉన్నవారు కొద్దిసేపు రోడ్డుపై బైఠాయించారు. 5 నిమిషాల తర్వాత సొరంగానికి పంపించారు. అక్కడి నుంచి వచ్చి ప్రెస్మీట్లో మాట్లాడారు. -
వదంతులు సృష్టించొద్దు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: అన్ని పండగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని, మతపరమైన వదంతులు, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకు పోలీసులు, మత పెద్దలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ డి.జానకి అన్నారు. యువత మత విద్వేషాలకు గురి కాకుండా ఉండడానికి సరైన మార్గనిర్దేశం చేయడం అవసరమన్నారు. జిల్లాలో శాంతియుత వాతావరణం కోసం ప్రతి మత పెద్దలు, వారివారి అనుచరులను సహనంతో ప్రవర్తించే విధంగా మార్గదర్శనం చేయాలన్నారు. జిల్లాకేంద్రంలోని సుదర్శన్ గార్డెన్లో గురువారం రాత్రి నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల ద్వారా అశాంతిని రెచ్చగొట్టే వదంతులపై కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలు వస్తే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు ఇజాజుద్దీన్, గాంధీనాయక్, అప్పయ్య, ట్రాఫిక్ సీఐ భగవంతురెడ్డి, ఎస్బీ సీఐ వెంకటేష్, వివిధ మతాల పెద్దలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆదేశాలు వచ్చాయి..
జనరల్ ఆస్పత్రి పడకల స్థాయి 650 నుంచి 900కు పెంచడానికి అన్ని రకాలుగా సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే ఎన్ఎంసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం, డీఎంఈతో నుంచి అధికారికంగా రావాల్సి ఉంది. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. పడకలు పెరగడం వల్ల రోగులకు మరింత వైద్య సేవలు పెరుగుతాయి. – సంపత్‌కుమార్‌సింగ్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్, మహబూబ్‌నగర్ పీజీలో కూడా సీట్లు మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో 250 పడకలు అదనంగా పెంచుకోవడానికి అనుమతి రావడంతో పకడలు 900 చేరాయి. ప్రస్తుతం మెడికల్ కళాశాలలో 175 ఎంబీబీఎస్ సీట్లకు సరిపడా పడకలు ఆస్పత్రిలో అవసరం ఉన్నాయి. పీజీలో కూడా సీట్లు మరిన్ని పెరుగుతాయి. మార్చిలో ఈ అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. – రమేష్, మెడికల్ కళాశాల డైరెక్టర్, పాలమూరు ● -
పని ఒత్తిడి తట్టుకోలేక..
జనరల్ ఆస్పత్రిగా మార్పు చెందిన తర్వాత 350 నుంచి 550 పడకలకు, ఆ తర్వాత 650 పడకల సామర్థ్యం పెరిగింది. దీంతో రోజువారి ఓపీతోపాటు ప్రసవాలు, అడ్మిట్ అవుతున్న రోగుల సంఖ్య క్రమంగా పెరిగింది. అయితే జిల్లా వైద్య కళాశాల అనుమతి వచ్చిన తర్వాత ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన పారామెడికల్ సిబ్బంది ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. ఆస్పత్రిలో ఉండే ప్రధాన విభాగాలకు మూడు షిఫ్టుల వైద్యులు ఉండాలి. ప్రస్తుతం పనిచేస్తున్న వైద్య సిబ్బంది సరిపోవడం లేదు. దీనికితోడు జిల్లా జనరల్ ఆస్పత్రికి వైద్య సిబ్బంది 459 మంది అవసరం ఉంటే.. ఇప్పటికీ 200లోపు మాత్రమే ఉన్నారు. ఇలా పని ఒత్తిడి తట్టుకోలేక వైద్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని విభాగాల్లో ఎస్‌ఆర్‌లు లేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. -
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోనీ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని విద్యా శాఖాధికారులు తెలిపారు. జిల్లాలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు 22, 483 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు వివరించారు. 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని, గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు నిర్వహించే మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖాధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, లైటింగ్, ఫర్నిచర్, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలను సవ్యంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్లు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, అదనపు ఎస్పీ రాములు, ఆర్డీఓ నవీన్, నగర కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి పార్థసారథి, డీఈఓ ప్రవీణ్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కౌసర్ జహాన్, వైద్య, విద్యుత్, ఆర్టీసీ, సమాచార, పోస్టల్ శాఖల అధికారులు హాజరయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంలేకుండా చూడాలి కలెక్టర్ విజయేందిర బోయి