Mahabubnagar District News
-
3,836 పోలింగ్ కేంద్రాలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొన్ని రోజులుగా అధికారులు కేంద్రాలను గుర్తించి వాటి స్థితిగతులను పరిశీలించారు. వాటన్నింటిని క్రోడీకరించి జాబితాను రూపొందించారు. నివేదికలను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు. జిల్లాలో నూతనంగా ఏర్పడిన మండలాలతో కలిపి 16 మండలాలు ఉన్నాయి. ఇందులో 441 గ్రామ పంచాయతీలు, 3,836 వార్డులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వార్డులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా గ్రామ పంచాయతీలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 7న సిద్ధం చేసిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను ఎంపీడీఓలచే ప్రచురణ చేసి, 10న జిల్లాస్థాయిలో ఎన్నికల అధికారులు ముసాయిదా ఓటర్ల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 12న మండల స్థాయిలో అధికారులు రాజకీయ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ముసాయిదా జాబితాపై 7 నుంచి 12 వరకు అభ్యంతరాలను స్వీకరణ, 13న అభ్యంతరాల పరిష్కారం, 16న కలెక్టర్ ఆదేశాల మేరకు 17న జిల్లా అధికారులు తుది జాబితా విడుదల చేశారు. మౌలిక వసతుల కల్పన.. దూరభారం తగ్గింపుపై దృష్టి పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వికలాంగుల కోసం ర్యాంపు, టాయిలెట్, బాత్రూం వంటి వసతులు కల్పిస్తూ కేంద్రాలను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఓటు వేసేందుకు దూరభారం తగ్గించేందుకు గ్రామానికి దగ్గరగా ఉండే భవనాలను ఎంపిక చేశారు. జిల్లా తుది జాబితా విడుదల చేసిన అధికారులు వార్డులు, ఓటర్ల సంఖ్య ఆధారంగా రూపకల్పన -
దక్షిణ భారతదేశ సైన్స్మేళాలో..: గణిత ఉపాధ్యాయురాలు అనిత
మల్దకల్ మండలం అమరవాయి జెడ్పీహెచ్ఎస్ గణిత ఉపాధ్యాయురాలు అనిత బోధనలో మేటిగా నిలుస్తున్నారు. గణితంలోని అంశాలు అమూర్త భావనలు అనగా మూర్త వస్తువులతో బోధించడంతో విద్యార్థులు గణితశాస్త్రంపై భయం లేకుండా విద్యనభ్యసిస్తున్నారు. వస్తువుల రూపంలో ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. వీటితో పాటు గణితంలోని ఆకారాలను సులువుగా నేర్చుకునేందుకు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. 2020 చైన్నెలోని సత్యభామ యూనివర్సిటీలో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌కు ఉపాధ్యాయ విభాగంలో పాల్గొని ప్రతిభచాటారు. దక్షిణ భారతదేశ సైన్స్మేళాలో జిల్లా నుంచి పాల్గొన్న ఏకై క ఉపాధ్యాయురాలిగా నిలిచారు. -
పాలమూరును అగ్రస్థానంలో నిలపాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మహిళా స్వయం సహాయక సంఘాలు వినూత్న ఆలోచనలతో వైవిధ్య కార్యక్రమాలు చేపట్టి పాలమూరును అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం కలెక్టరేట్లో గ్రామ, మండల మహిళా సమాఖ్యలకు నూతన బైలాస్ గురించి డీపీంలు, ఏపీఎంలు, సీసీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా ఆర్థిక స్వావలంబనకు రుణం మంజూరు లక్ష్యం జనవరి 15 నాటికి పూర్తి చేయాలన్నారు. బ్యాంక్ లింకేజీ కింద ఆర్థిక సహాయం అందించడంలో జిల్లా వెనకబడిందని, రూ.381 కోట్లను గాను ఇప్పటి వరకు రూ.280 కోట్లు మాత్రమే అందించారని, జనవరి 15 నాటికి లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ పెట్టుబడి నిధి, సీ్త్రనిధి రుణ రికవరీపై దృష్టిపెట్టాలని సూచించారు. మహిళా శక్తి కార్యక్రమం కింద ప్రభుత్వం మహిళల కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మహిళా శక్తి కింద చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. డీఆర్డీఓ నర్సింహులు మాట్లాడుతూ అజీనికా డిజిటల్ డేటాను అప్లోడ్ చేయాలన్నారు. బైలాస్‌పై గ్రామ సంఘాలు, మండల సమాఖ్యలు సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఏపీడీ జోజప్ప తదితరులు పాల్గొన్నారు. -
అడ్డాకులలో క్లినిక్ సీజ్
పాలమూరు: వైద్య, ఆరోగ్యశాఖ నుంచి అనుమతి లేకపోవడం, కనీస అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న ఓ ఆర్ఎంపీ క్లినిక్‌ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సీజ్ చేశారు. అడ్డాకులలో కేఎంపీ పేరుతో నిర్వహిస్తున్న క్లినిక్‌ను శనివారం డీఎంహెచ్ఓ కృష్ణ ఆధ్వర్యంలో తనిఖీ చేయగా ఆర్ఎంపీ అన్వర్ అర్హతకు మించి వైద్యం చేస్తున్నట్లు గుర్తించారు. ఐవీ గ్లూగోజ్లు, యాంటీబయోటిక్స్ ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్లు, ఇతర మందులను రోగులకు ఇస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. క్లినిక్ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు.. ఎలాంటి రోగులకు చికిత్స అందించారు.. అనే వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఆర్ఎంపీ అన్వర్ అర్హత లేకపోయినా వైద్యం చేస్తున్నట్లు నిర్ధారించి క్లినిక్‌ను సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో మాస్‌మీడియా అధికారి మంజుల పాల్గొన్నారు. వచ్చే నెల 11, 12న సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: వచ్చే నెల 11 నుంచి సర్టిఫికెట్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్‌కుమా ర్ ఓ ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్ లోయ ర్, హయ్యర్ వచ్చే నెల 11, 17 తేదీల్లో నిర్వహిస్తామని, టైలరింగ్, ఎంబ్రాయిడరీ 11న, టైలరింగ్ ఎంబ్రాయిడరీ 12, 16 తేదీల్లో ఉంటాయన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్లు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలి మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఆయా వార్డులకు మంజూరైన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ సూచించారు. శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేపట్టిన పనులకు గాను బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తాము పదవి చేపట్టిన 11 నెలల్లోనే సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.30.35 కోట్లు, టీఎఫ్ఐడీసీ నుంచి రూ.9.46 కోట్లు కేటాయించామన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో పట్టణ అభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ షబ్బీర్ అహ్మద్, కౌన్సిలర్లు సాదతుల్లా, కొల్లె చెన్నవీరయ్య, మునీరుద్దీన్, మహమ్మద్ అబ్దుల్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిన్లాండ్ స్ఫూర్తితో విద్యార్థులకు బోధన..
విద్యార్థులకు ఒత్తిడి లేకుండా, సులువుగా విద్యను అందించడంలో ఫిన్లాండ్ దేశం ముందువరుసలో ఉంది. అక్కడ మాథ్స్, సైన్స్ విద్యాబోధనలో అమలవుతున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి విద్యార్థుల కోసం మాథ్స్ ల్యాబ్ రూపొందించాను. గణితం పట్ల విద్యార్థుల్లో భయం పోగెట్టేలా సులువైన విధానంలో బోధిస్తున్నాను. ఈ విధానంలో విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపుతుండటం ఆనందాన్ని కలిగిస్తోంది. – కూన శ్రీనివాసులు, గణిత ఉపాధ్యాయుడు, మార్చాల కల్వకుర్తి మండలం మార్చాల ప్రభుత్వ పాఠశాలలో ఉమ్మడి జిల్లాలోనే తొలిసారిగా మ్యాథమెటికల్ ల్యాబ్ ఏర్పాటైంది. సైన్స్‌లో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ తరహాలోనే గణితానికి సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ల్యాబ్ ప్రాక్టికల్‌గా విద్యార్థులు అనుభూతి పొందేందుకు వీలు కలుగనుంది. గణితంలో క్లిష్టమైన అంశాలను అతి సులువుగా విద్యార్థులకు బోధించేందుకు వీలుగా ఈ ల్యాబ్‌ను ఉపాధ్యాయుడు కూన శ్రీనివాసులు రూపొందించారు. 85 రకాల క్లిష్టమైన అంశాలను ఈ ల్యాబ్‌లో పొందుపర్చారు. ఒక్కో కాన్సెప్ట్‌ను పది నిమిషాల చొప్పున వివరించడం ద్వారా విద్యార్థులకు ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవడం సులువు అవుతుంది. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు అవసరమైన మ్యాథమెటికల్ కాన్సెప్ట్‌లు ఇందులో ఉంటాయి. టేబుల్స్, అల్గారిథమ్స్, అర్థమెటిక్ అంశాలను అతి సులువుగా విద్యార్థులకు బోధించేలా మ్యాథ్స్ ల్యాబ్‌ను రూపొందించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ పొందిన శ్రీనివాసులు విద్యార్థులకు వినూత్న పద్ధతిలో గణితం బోధిస్తున్నారు. మార్చాలలోమ్యాథ్స్ రూం -
మ్యాథ్స్ పార్క్‌తో సులభంగా..
సులభంగా గణిత ప్రక్రియలు నేర్చుకునేందుకు వీలుగా మహబూబ్‌నగర్‌లోని నాగార్జున పాఠశాల విద్యార్థులు అలేఖ్య, హిమశ్రీలు మ్యాథ్స్ పార్కులు ఆవిష్కరించారు. పార్కులో ఆడుకుంటూ అక్కడ ఉండే ఒక్కో ఆట వస్తువుతో ఒక్కో విధమైన గణిత ప్రక్రియ ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా వివిధ గణిత సూత్రాలు, ప్రక్రియలు, చతుర్విత ప్రక్రియలు, లెక్కలు నేర్చుకునేందుకు అవకాశం ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. దీని ఆధారంగా పార్క్‌లను ఏర్పాటు చేస్తే విద్యార్థులు మర్చిపోకుండా గణితం చేర్చుకుంటారని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో విద్యార్థులు ప్రతిభచాటారు. -
గణిత పాఠ్యపుస్తక రచయితగా..
గణితం అంటే చాలామంది విద్యార్థులకు భయం. కానీ, అందులోని సూత్రాలు తెలిస్తే అన్ని సబ్జెక్టులకంటే ఎంతో సులువైనదని చెబుతున్నారు గణిత బోధకుడు వరద సుందర్‌రెడ్డి. ఉండవెల్లి మండలం తక్కశిల జెడ్పీహెచ్ఎస్లో గణిత బోధకుడిగా పనిచేస్తున్నారు. 22ఏళ్ల సర్వీసులో మొదటి ఏడాది తప్ప మిగిలిన 21 సంవత్సరాల నుంచి గణిత సబ్జెక్టులో ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్ కాలేదు. ప్రస్తుతం వాడుకలో ఉన్న 6, 7, 8, 9వ తరగతి గణిత పాఠ్యపుస్తక రచయితగా సేవలు అందిస్తున్నారు. ఉమ్మడిజిల్లాలో ఉన్న ఏకై క పాఠ్య పుస్తక రచయిత ఈయనే కావడం గర్వకారణం. సృజనాత్మకంగా, ప్రయోగాత్మకంగా, వినూత్న బోధన పద్ధతులతో విద్యార్థులను గణితం వైపు ఆకర్షించేలా బోధన అందిస్తు మేటిగా నిలుస్తున్నారు. -
అబాకస్‌లో ప్రపంచ రికార్డు
నారాయణపేట రూరల్: పెన్ను, పేపర్ లేకుండా కేవలం మెదడుకు పని చెప్పి.. గణితంలో సమాధానాలు చెప్పే విధానమైన అబాకస్‌లో అతివేగంగా అత్యధిక ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ప్రపంచ రికార్డు సాధించారు నారాయణపేట చిన్నారులు. స్థానిక సింగార్‌బేస్ వీధిలో శిక్షకురాలు రీతు ప్రైవేటుగా కొద్దిరోజులుగా అబాకస్‌లో పిల్లలకు శిక్షణ ఇస్తుంది. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం పట్టణానికి చెందిన చరణ్, వైభవ్, ప్రణవి ఐరేంజ్ సంస్థ వారు 2023లో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన పోటీలకు దరఖాస్తు చేసుకోగా పరీక్షలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఆయా విద్యార్థులకు సంబంధించిన వీడియోలను వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయగా, నిర్వాహకులు చూసి ఆన్లైన్లో లైవ్‌గా వీరి ప్రతిభను పరిశీలించారు. అవాకై ్కన వారు హైదరాబాద్ కార్యాలయానికి పిలిపించి పది డిజిట్లకు సంబంధించిన వంద ప్రశ్నలను వేయగా పెన్ను, పేపర్ లేకుండా ఒక్క నిమిషంలోనే సమాధానాలు చెప్పారు. దీంతో వారిని అబాకస్‌లో ఆర్థమేటిక్ క్యాలిక్యులేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డు సాధించినట్లు ప్రకటించి ప్రశంసాపత్రాలు అందించారు. దీనిపై శిక్షకురాలు రీతు మాట్లాడుతూ.. గణితంపై భయాన్ని పోగొట్టేందుకు తాను తర్ఫీదు పొందిన అబాకస్‌ను పట్టణంలోని చిన్నారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికి వందల మంది విద్యార్థులు నేర్చుకున్నారని, మున్ముందు మరింత మందికి అందించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. -
నైపుణ్య శిక్షణ కేంద్రం పరిశీలన
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రం రైల్వేస్టేషన్ సమీపంలోని మున్సిపల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పా టు చేస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని శనివారం స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ పరిశీలించారు. దీనిని తొందరగా అందుబాటులోకి తీసుకునిరావాలని మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డిని ఆదేశించారు. కాగా, ఇక్కడ త్వరలోనే మూడు నెలల షార్ట్‌టర్మ్ వివిధ కోర్సులకు సంబంధించి అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే తనిఖీ స్థానిక 11వ వార్డు పరిధిలోని పాతపాలమూరులో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శనివారం మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి తనిఖీ చేశారు. లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరించి మొబైల్ యాప్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని సిబ్బందికి సూచించారు. ● జనవరిలో ‘ప్రజాపాలన’ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మొత్తం 49 వార్డులకు గాను 35,861 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వేయర్లు ఇంటింటికీ వెళ్లి ఈ పథకానికి అర్హులా? కాదా? అని తేలుస్తున్నారు. అయితే ఈనెల 9 నుంచి ఇప్పటివరకు కేవలం 20 శాతమే ఈ సర్వే పూర్తయినట్లు తెలుస్తోంది. తరచూ సాంకేతిక సమస్యలతో సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. -
విద్యార్థి ప్రాణం తీసిన కరెంటు
వనపర్తి రూరల్: ప్రైవేటు స్కూల్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన వనపర్తి మండలం పెద్దగూడెం శివారులో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. చిన్నంబావి మండలం పెద్దమారూరుకు చెందిన శిరీష – భాస్కర్‌రావుల పెద్దకుమారుడు హరీశ్ (15) 9వ తరగతి, చిన్నకుమారుడు గౌతమ్ 8వ తరగతి పెద్దగూడెం శివారులోని రేడియంట్ స్కూల్లో చదువుకుంటున్నారు. వారిద్దరు అక్కడే పాఠశాల హాస్టల్లో ఉంటున్నారు. శనివారం తెల్లవారుజామున హరీశ్ తన స్నేహితులతో కలిసి బహిర్భూమి కోసం పక్కనే వ్యవసాయ పొలంలోకి వెళ్లారు. అయితే వ్యవసాయ పొలంలో వేరుశనగ పంటకు రక్షణగా ఏర్పాటుచేసిన విద్యుత్ కంచెను గమనించకుండా విద్యార్థి హరీష్ తగలడంతో షాక్‌కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం అక్కడికి చేరుకొని విద్యార్థిని జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మరణవార్తను తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే విద్యార్థి మృతిచెందాడని ఆరోపిస్తూ విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు పాఠశాల వద్దనున్న వనపర్తి – పెబ్బేరు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవడంతో పాటు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐ కృష్ణయ్యలు చేరుకొని వారికి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై భూమి యజమాని, పాఠశాల యజమానిపై బాలుడి తల్లి ఫిర్యాదు చేశారని ఎస్ఐ చెప్పారు. పాఠశాల వద్ద రోడ్డుపై ధర్నా చేస్తున్న సంఘాల నాయకులు ప్రైవేటు స్కూల్ హాస్టల్ నుంచి బహిర్భూమికి వెళ్లగా విద్యుదాఘాతం ఆందోళనకు దిగిన విద్యార్థి, ప్రజా సంఘాలు -
రేపు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు?
● అర్వింద్‌కుమార్, బీఎల్ఎన్రెడ్డిలకు కూడా ఇచ్చే అవకాశం ● ఫార్ములా–ఈ కార్ల రేసు కేసులో చర్యలకు సిద్ధం ● బ్యాంకు అధికారుల నుంచి వివరాలు సేకరించనున్న ఈడీసాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులకు సమన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఏ–2గా ఉన్న పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సోమవారం సమన్లు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఏసీబీ నుంచి ఫార్ములా–ఈ కారు రేసు ఒప్పందాలకు సంబంధించి సేకరించిన పత్రాలు, ఎఫ్ఐఆర్తోపాటు బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. హెచ్ఎండీఏ సాధారణ నిధుల నుంచి యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు రూ.45,71,60,625 సొమ్మును విదేశీ కరెన్సీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. దీంతో సదరు బ్యాంకు అధికారుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకు అధికారులను సైతం ప్రశ్నించనున్నారు. ఓవైపు ఈ కేసులో ఈడీ అధికారులు వేగం పెంచగా మరోవైపు తెలంగాణ ఏసీబీ సైతం కీలకాంశాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని.. కానీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు ఆదేశించడంతో ఆధారాల సేకరణపై ఏసీబీ దృష్టి పెట్టింది. తొలుత హెచ్ఎండీఏ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ వాంగ్మూలం నమోదుతో దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించనుంది. ఈడీ, ఏసీబీ దర్యాప్తులో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ సేకరించే పత్రాలు ఈడీకి ఉపయోగపడినట్లే ఈడీ దర్యాప్తులో మనీలాండరింగ్ కోణంలో ఏవైనా ఆధారాలు లభిస్తే ఈ కేసు మరో మలుపు తిరుగుతుందన్న చర్చ నడుస్తోంది. -
సంగమేశ్వర శిఖరానికి పూజలు
కొల్లాపూర్: సప్తనదీ సంగమ ప్రాంతంలో కొలువైన సంగమేశ్వర ఆలయ శిఖరానికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణానదిలో మునిగి ఉన్న ఈ ఆలయం ప్రధాన గోపురంతో పాటు సుబ్రహ్మణ్యస్వామి, నరసింహ్మస్వామి, మృత్యుంజయస్వామి, వజ్రలింగేశ్వరస్వామి, సత్యనారాయణ, సూర్యనారాయణ, గాయత్రీదేవి ఆలయాల గోపురాలు కొద్దిమేర తేలాయి. ప్రధాన ఆలయ శిఖరం వద్ద అర్చకుడు రఘురామశర్మ దేవతా చిత్రపటాలను ఏర్పాటుచేసి పూజలు చేశారు. సంగమేశ్వర ఆలయ శిఖర దర్శనానికి మరబోట్లలో భక్తులను తీసుకువచ్చే వారు గోపురాలకు దూరంగా బోట్లు తిప్పాలని అర్చకులు సూచించారు. -
ఊరూవాడా సంబరాలు
ఘనంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు మంత్రులు వేస్ట్.. కాదు కాదు పాలన వేస్ట్ఆమాత్యుల పనితీరు మీద ఏపీ సీఎం సర్వేలో వెల్లడిసాక్షి, అమరావతి: అభివృద్ధి, సంక్షేమ సారథి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శనివారం ఏపీ వ్యాప్తంగా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకొన్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 26 జిల్లాల్లో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో కేక్‌లు కట్ చేశారు. వీధులు, కూడళ్లలో వైఎస్ జగన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యువత ర్యాలీలు చేశారు. పేదలు, అనాథలకు వస్త్ర దానాలు చేశారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ వైఎస్సార్సీపీ శ్రేణులు, వైఎస్ జగన్ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 14 దేశాల్లోనూ జగన్ జన్మదిన వేడుకలను అభిమానులు వైభవంగా నిర్వహించారు. కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధం ● ఓయూ కృతజ్ఞత సభలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఉస్మానియా యూనివర్సిటీ: ఈ–కార్ రేసు కుంభకుణంలో మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. ఇక నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏటా ఉద్యోగాల భర్తీ జరుగుతుందన్నారు. శనివారం ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి టీపీసీసీ అధికార ప్రతినిధి, పీహెచ్డీ విద్యార్థి చనగాని దయాకర్ అధ్యక్షత వహించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓయూకు విచ్చేసి ఇక్కడి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డా.రియాజ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు మెడ శ్రీను పాల్గొన్నారు. సాక్షి, అమరావతి: ఆరునెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా చేయించుకున్న సర్వేలోనూ అదే విషయం వెల్లడికావడం అధికార పార్టీ వర్గాలను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. పాలనను ప్రతిబింబించే మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల సర్వే చేయించి వారికి ర్యాంకింగ్ ఇచ్చారు. ఇదే విషయాన్ని సీఎం స్వయంగా కేబినెట్ సమావేశంలో మంత్రులకు వెల్లడించారు. తాజాగా.. మంత్రుల పనితీరు మీద ర్యాంకులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వ పెద్దలు లీక్ చేశారు. కేవలం ఆరుగురు మంత్రుల పనితీరు మాత్రమే సంతృప్తికంగా ఉందని, మిగతా 18 మంది ర్యాంకులు ఆధ్వానంగా ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. సహజంగా.. ప్రభుత్వ పాలన తీరుకు మంత్రివర్గం పనితీరును గీటురాయిగా తీసుకుంటారు. మంత్రివర్గంలో 75 శాతం మంది సభ్యుల తీరు ఏమాత్రం బాగోలేదని, సర్వేలో ర్యాంకులు అధ్వానంగా రావడం మంచి పరిణామం కాదని అధికార పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ర్యాంకులు మరీ అధ్వానంగా ఉన్న మంత్రుల జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, సీఎం కుమారుడు లోకేశ్ కూడా ఉండటం గమనార్హం. ప్రభుత్వానికి అన్నీ తామై వ్యవహరిస్తున్న ఈ ఇద్దరి పనితీరు, ప్రభుత్వ పనితీరును వేరుచేసి చూడలేమని, సీఎం చేయించిన సర్వేలో తేలిన విషయమే ప్రజల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒక్క హామీని కూడా అమలుచేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న తీరును ప్రజలు గుర్తించారు. ప్రజాసంక్షేమం దిశగా ప్రభుత్వం ఏమీచేయలేక చేతులెత్తేసిన విధానమే మంత్రుల పనితీరు మీద ప్రతిబింబించిందనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించకుండా, ‘అధ్వాన్న పనితీరు’ పేరిట తమను నిందించడంలో అర్థంలేదని మంత్రులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్న విషయం అధికార పార్టీ వర్గాలకు తెలుసు. పైపెచ్చు.. లోకేశ్ అన్ని మంత్రిత్వ శాఖల్లో జోక్యం చేసుకుంటే తాము చేయడానికి ఏముంటుందని.. తమ చేతులు కట్టేసి తాము అసమర్థులమని సర్వేల్లో తేల్చి ర్యాంకింగ్ ఇవ్వడం ఏమిటని మంత్రులు ప్రశ్నిస్తున్నారు. పవన్ పనితీరుపైనా అసంతృప్తి.. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పనితీరు అంత బాగోలేదని నివేదిక తేల్చడమంటే.. అన్ని శాఖల కంటే అత్యధిక బడ్జెట్ ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఇచ్చినా ఆయన అందుకు తగ్గ రీతిలో పనిచేయడంలేదని, అంటే ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందనే అర్థమని పరిశీలకులు చెబుతున్నారు. హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే మంత్రుల ర్యాంకింగ్ అద్దంపడుతోందని, అది కేవలం పవన్‌కళ్యాణ్ ఒక్కడి వ్యక్తిగత సామర్థ్యం తక్కువనే భావన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు తనయుడు లోకేశ్ నిర్వహిస్తున్న కీలకమైన మానవవనరుల (విద్యా శాఖలు) శాఖలో అన్నీ సమస్యలే ఉండడంతో ఆయన పనితీరుపైనా పెదవి విరుస్తున్నారు. పెత్తనం లోకేశ్‌ది.. తిట్లు మాకా!? ఈ ర్యాంకింగ్లపై మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చంద్రబాబు ఏ ప్రాతిపదికన తమ పనితీరు అంచనా వేశారో తెలీడంలేదని సీనియర్ మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు వంటి నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. ప్రభుత్వంలోని అన్ని వ్యవహారాల్లో లోకేశ్ తలదూరుస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇక తమకు పనిచేయడానికి అవకాశమెక్కడ ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. పనిచేసేది ఈ ఆరుగురే.. ఇక రాష్ట్ర కేబినెట్లో ఆరుగురు మంత్రులు మాత్రమే బాగా పనిచేస్తున్నట్లు నివేదిక తేల్చింది. అందులో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ ముందున్నారు. అలాగే.. ● విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా బాగా పని చేస్తున్నారని మంచి ర్యాంకింగ్ దక్కింది. ● కూటమిలో జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్, బీజేపీ తరఫున మంత్రిగా ఉన్న సత్యకుమార్ పనితీరు కూడా బాగుందని నివేదిక పేర్కొంది. అభినందన ‘పత్ర’ం రావి ఆకుపై మాజీ సీఎం జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు నారాయణఖేడ్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఖేడ్‌కు చెందిన ప్రముఖ పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకులపై చిత్రాలు మలిచారు. ప్రముఖుల జన్మదినోత్సవాలు, ఆయా పండుగలు, ప్రాధాన్యాలపై లీవ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ చిత్రాలు వేస్తూ విశిష్టతను తెలియపరుస్తుంటారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రాలను కూడా రావి ఆకులపై మలచి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. -
చారిత్రక నిలువురాళ్ల సందర్శన
కృష్ణా: ముడుమాల్ గ్రామ శివారులో గల చారిత్రక ప్రాంతమైన నిలువురాళ్లను శనివారం జిల్లా శిక్షణ కలెక్టర్ గరిమనరుల్లా, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆ ప్రాంతంలోని నిలువురాళ్లను, వాటి ప్రాముఖ్యతను ప్రొఫెసర్ పుల్లారావు ద్వారా తెలుసుకున్నారు. ఆదిమానవులు ఏర్పాటు చేసిన నక్షత్ర మండలితో పాటు రుతువులు తెలుసుకునేందుకు అప్పట్లో వారు ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ దయాకర్‌రెడ్డి తదితరులున్నారు. -
ఆదిశిలాక్షేత్రానికి పోటెత్తిన భక్తులు
మల్దకల్: ఆదిశిలాక్షేత్రం స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి ని దర్శించుకోలేని భక్తులు, నెలపూజ వరకు స్వామివారికి దాసంగాలను పెట్టి మొక్కలను చెల్లించుకోవడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక నుంచి భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.బారీకేడ్లతో భక్తుల క్యూలైన్లకు పోటెత్తారు. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు జెడ్పీ సీఈఓ కాంతమ్మ, ఇంటెలిజెన్సీ అడిషనల్ ఎస్పీతోపాటు వివిధ శాఖల అధికారులు వేర్వేరుగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. అంతకు ముందు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. పూ జల అనంతరం శేషవస్త్రాలతో సత్కరించి.. మె మోంటోలు అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్ల వద్ద పోలీసులు, ఎస్వీఎస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తమ సేవలను అందించారు. ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈఓ సత్యచంద్రారెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. -
గణితంలో ఘనులు
అంకెలతో ఆట.. సూత్రాలతో లెక్కల వేట ● రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు.. గుర్తింపు ● కల్వకుర్తి మండలం మార్చాల ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ రూం ● విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రాజెక్టులు ● నేడు జాతీయ గణిత దినోత్సవం మార్కులు, గ్రేడ్లు, ర్యాంకులే లక్ష్యం కాకుండా, నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు పలువురు ఉపాధ్యాయులు. విద్యార్థులు క్లిష్టమైన సబ్జెక్టుగా భావించే గణితాన్ని సులభంగా అర్థమయ్యేలా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అతి సులభంగాగణితంలో మెళకువలను నేర్పిస్తూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ లెక్కలపై ఉన్న భయాన్ని పోగొడుతున్నారు. ఆదివారం గణిత దినోత్సవం (శ్రీనివాస రామానుజన్ జయంతి) సందర్భంగా ఈ వారం సండే స్పెషల్.. – సాక్షి, నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/ గద్వాల టౌన్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ మార్చాల జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని ఐశ్వర ఇటీవల రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్ పోటీలకు ఎంపికై ంది. అతి క్లిష్టమైన ‘మ్యాథమెటికల్ మోడలింగ్ అర్థమెటిక్ టు అల్గారిథమ్ వయా ఆల్జిబ్రా’ అనే అంశాన్ని ప్రదర్శించింది. క్వార్ర్డాటిక్ ఈక్వేషన్‌ను పరిష్కరించేందుకు ఇప్పటివరకు మూడు మెథడ్లు ఉండగా, ఐశ్వర్య నాలుగో మెథడ్‌ను తయారు చేయడం విశేషం. మ్యాథ్స్ విభాగంలో ప్రతిభ చూపినందుకు మార్చాల పాఠశాలకు చెందిన ఐశ్వర్యతో పాటు మరో ఐదుగురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్(ఎన్‌ఎన్‌ఎంఎస్) నుంచి ఏటా రూ.12,500 చొప్పున స్కాలర్షిప్ను అందుకుంటున్నారు. ఐదేళ్లకాలం పాటు ఈ స్కాలర్షిప్ విద్యార్థులకు అందుతుంది. ఉపకార వేతనాలు పొందేలా.. పాలమూరులోని మోడల్ బేసిక్ పాఠశాల గణిత ఉపాధ్యాయుడు ఫసియొద్దీన్ ఎన్ఎంఎంఎస్కు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. ఫలితంగా గతేడాది ఏకంగా 13 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యారు. ఈ విధంగా ఉపాధ్యాయుడు ఫసియొద్దీన్ అందరి మన్ననలు పొందుతున్నారు. భవిష్యత్‌లో మరిన్ని తరగతులు నిర్వహించి విద్యార్థులు స్కాలర్షిప్కు ఎంపికయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వివరించారు. -
వడ్ల డీసీఎం సీజ్
కొత్తకోట రూరల్: ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసిన వడ్లను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న డీసీఎంను అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తకోట మండలం మిరాసిపల్లి గ్రామ సమీపంలోని ఇషాన్ ట్రేడర్స్ రైస్‌మిల్లు నుంచి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన వడ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారి రైస్‌మిల్లుకు చేరుకొని వరిధాన్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న డీసీఎంను సీజ్‌చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారి ఆదేశాల మేరకు శనివారం స్థానిక తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ కిషోర్ శనివారం ధాన్యం నిల్వలను పరిశీలించి, పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. ఇషాన్ ట్రేడర్స్ మిల్లు వారికి 2022–23లో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వానాకాలం ధాన్యాన్ని కేటాయించగా.. అట్టి ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం వచ్చినట్లు తెలిపారు. అయితే 2022–23 వానాకాలానికి సంబంధించి మిల్లులో దాదాపు 4,672 బస్తాలు, గ్రామ సమీపంలోని గుట్ట వద్ద దాదాపు 13,703 బస్తాలతో కలిపి మొత్తం 18,375 బస్తాల ధాన్యం నిల్వ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ ధాన్యాన్ని తరలించేందుకు ఏర్పాటుచేసిన డీసీఎంను పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. రైస్‌మిల్లు యజమాని మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వ వడ్లను బయటి మార్కెట్లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్టు గుర్తించినట్టు తహసీల్దార్ తెలిపారు. వరిధాన్యం నిల్వను పరిశీలిస్తున్న అధికారులు -
‘ఉమామహేశ్వర’ నిర్మాణ పనులు ఆపాలి
బల్మూర్: భూమినే నమ్ముకొని తరతరాలుగా జీవనం సాగిస్తున్న తమ బతుకుల్లో ఉమామహేశ్వర రిజర్వాయర్ గుదిబండగా మారి రోడ్డున పడేస్తోందని నిర్వాసిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూముల్లో బలవంతంగా సర్వేలు చేసి నిర్మాణ పనులు చేపడితే మరో లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని హెచ్చరించారు. శనివారం బల్మూర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉమామహేశ్వర రిజర్వాయర్ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వాసిత రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోరాట సమితి అధ్యక్షుడు సీతారాంరెడ్డి, నాయకులు తిరుపతయ్య, ఇంద్రారెడ్డి, చంద్రయ్య, జానకిరాములు తదితరులు మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణంతో బల్మూర్, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సన్నకారు రైతుల భూములు సుమారు రెండు వేల ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడును ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం నష్ట పరిహారంతో సరిపెట్టి రోడ్డున పడేయాలని చూస్తోందని మండిపడ్డారు. తమ బతుకులను చిధరం చేసే రిజర్వాయర్ పనులను పోరాటం ద్వారా అడ్డుకుంటామని.. ప్రాణత్యాగానికై నా వెనుకాడమని హెచ్చరించారు. పైపులైన్ ద్వారా గొలుసుకట్టు చెరువులను నీటితో నింపి రైతుల భూములకు నష్టం కలగకుండా చూస్తామని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చి.. నేడు ప్రాజెక్టు నిర్మాణానికి రైతులు సుముఖంగా ఉన్నారని, రైతులతో ముఖాముఖి నిర్వహించానని చెప్పడమే కాకుండా ఎవరు అడ్డొచ్చినా నిర్మించి తీరుతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఇప్పటి వరకు ఎమ్మెల్యే రైతులతో చర్చించిన దాఖలాలు లేవని ఆరోపించారు. భూ సేకరణ చట్టం ప్రకారం రైతుల నుంచి బలవంతగా భూములు లాక్కొనే అధికారం ఎవరికీ లేదని.. నిర్వాసిత రైతులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా రైతుల మేలు కోరి ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని కోరారు. రైతులతో చర్చించకుండా ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ మరో లగచర్ల ఘటన పునరావృతం అవుతుందని హెచ్చరిక ప్రాజెక్టుతో ఎవరికి ప్రయోజనం.. ఉమామహేశ్వర ప్రాజెక్టు నిర్మాణంతో ఇక్కడి రైతులకు ఏ మాత్రం ప్రయోజనం లేదని పోరాట సమితి నాయకులు తెలిపారు. ఇతర మండలాలకు సాగునీరు తరలించేందుకు ఈ ప్రాంత రైతుల భూములు నష్టపోయినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనిపై త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమ డిమాండ్లను అంగీకరించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే కాల్వల సర్వే పనులు నిలిపివేయాలని లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రిజర్వాయర్ వ్యతిరేక పోరాట సమితి నాయకులు రఘుమారెడ్డి, శ్రీను, కాలూరి రాజాబాబు, రామచంద్రారెడ్డి, నీలమ్మ, జానకిరాములు, జైపాల్‌రెడ్డి, బాలస్వామి, బక్కయ్య, రైతులు పాల్గొన్నారు. -
జోరుగా ఇసుక దందా
మాగనూర్: మండలంలోని పలు గ్రామాల్లో ఇసుకదందా యథేచ్ఛగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు వడ్వాట్, అడవిసత్యావార్, మందిపల్లి, గజ్జరందొడ్డి గ్రామాల్లోని వాగుల నుంచి నిత్యం ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. మాగనూర్ మండల పెద్దవాగు పరివాహక గ్రామాల్లో దందా జరుగుతున్నా, అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మాగనూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొందరు పోలీసు సిబ్బంది సహకారంతో వడ్వాట్ గ్రామ శివారులో భారీ మొత్తంలో ఇసుక దందా నడుస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రాత్రి జేసీబీ ట్రాక్టర్లతో గ్రామ శివారులో ఇసుక డంపులు చేసి తెల్లవారుజామున టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి మండలంలోని ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం మోపాలని సమీప పొలాల రైతులు కోరుతున్నారు. వడ్వాట్ గ్రామ శివారులో భారీగా ఇసుక డంపులు చోద్యం చూస్తున్న అధికారులు -
జడ్చర్లలో దొంగల హల్చల్
జడ్చర్ల టౌన్: మున్సిపాలిటీ పరిధిలోని గౌరిశంకర్కాలనీ రోడ్ నెం.3లో శుక్రవారం అర్ధరాత్రి 1గంట నుంచి 2గంటల వరకు ఇద్దరు దొంగలు హల్చల్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ముఖానికి ముసుగు వేసుకున్న దొంగలు రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనానికి యత్నించారు. ఫార్మకంపెనీ ఉద్యోగి ఇంట్లో ఎలాంటి విలువైన వస్తువులు, నగలు, నగదు లేకపోవటంతో దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎదురుగా ఉన్న మరో ఇంట్లోకి చొరబడి అక్కడ ఏం చేశారనేది ఇంటి యజమానులు వస్తేగాని తెలియదు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
షాద్‌నగర్ రూరల్: మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. ఆమైపె అనుమానం పెంచుకున్నాడు.. కన్నకూతురు ముందే తల్లిపై దాడి చేశాడు. దెబ్బలు తాళలేక మహిళ అక్కడే మృతిచెందింది. విషయం బయటకు తెలిస్తే కటకటాల పాలవుతానని గ్రహించి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం రోజుల్లో కేసును ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్ వివరాలను వెల్లడించారు. నారాయణపేట జిల్లా మక్తల్‌కు చెందిన పావని (35) తన కూతురు జ్యోతిశ్రీతో కలిసి కొంతకాలం క్రితం షాద్‌నగర్‌కు వచ్చింది. పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తూ కూతురుతో కలిసి రైల్వేస్టేషన్, జాతీయ రహదారి సమీపంలో నివసిస్తోంది. కర్నూలు జిల్లా ఆలూర్ మండలం జోలాపూర్ గ్రామానికి చెందిన వడ్డె వెంకటేశ్ షాద్‌నగర్‌లో కూలీ పని చేస్తూ పట్టణంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ ప్రాంతాల్లో ఉండేవాడు. ఈ నేపథ్యంలో పావనికి వెంకటేశ్‌తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈనెల 15న రాత్రి సమయంలో బుచ్చిగూడ రోడ్డులోని బైపాస్ బ్రిడ్జి కింద నిద్రిస్తున్న పావనితో వెంకటేశ్ గొడవపడ్డాడు. ఈ నెల 14వ తేదీ ఎక్కడికి వెళ్లావని మృతురాలు పావనితో వాగ్వాదానికి దిగాడు. తన సొంత ఊరులో ఉన్న భర్త వద్దకు వెళ్లానని చెప్పడంతో కోపోద్రిక్తుడైన వెంకటేశ్ కర్రతో అమానుషంగా ఆమైపె దాడి చేశాడు. అప్పటికీ పావని మృతి చెందలేదని తెలుసుకుని ఇనుప సలాకతో తల, నుదుటిపై కొట్టడంతో రక్తస్రావమై చనిపోయింది. తల్లిపై దాడి చేస్తుండగా అడ్డు వచ్చిన జ్యోతిశ్రీపై కూడా దాడి చేశాడు. పోలీసులకు తెలిస్తే నేరం బయట పడుతుందని భావించిన వెంకటేశ్ తెల్లవారిన తర్వాత.. నీకు టీ తెస్తా నువ్వు అమ్మ దగ్గరే ఉండూ అంటూ జ్యోతిశ్రీకి చెప్పి సొంతూరుకు పారిపోయాడు. మహిళ హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. వెంకటేశ్ కర్నూలులో ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో విచారించగాా నేరం అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన కర్ర, ఇనుప సలాక(సీకు)ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంకటేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, డీసీపీ రాజేశ్, అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్ పర్యవేక్షణ, ఏసీపీ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్నారు. కేసును ఛేదించడంలో ప్రధాన పాత్ర పోషించిన పట్టణ సీఐ విజయ్‌కుమార్, డీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శరత్‌కుమార్, పోలీసు సిబ్బంది కరుణాకర్, రఫీ, మహేశ్, రాజును అభినందించారు. మహిళ హత్య కేసును ఛేదించిన షాద్‌నగర్ పోలీసులు నిందితుడికి రిమాండ్ వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ విజయ్ కుమార్ -
చికిత్స పొందుతూ రైతు మృతి
అమరచింత: రైతు బాలస్వామి(42) మూడు రోజుల క్రితం గడ్డిమందు తాగగా.. హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని శ్రీకృష్ణనగర్‌కు చెందిన గొల్ల బాలస్వామి తన పొలం పక్కన ఉన్న చంద్రన్న అనే రైతు పొలంలోని గెట్టును తొలగించాడంటూ నాలుగు రోజుల క్రితం గొడవపడ్డారు. దీంతో తనకు న్యాయం చేయాలని బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా చంద్రన్న సైతం తనపై, భార్యాపిల్లలపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాలస్వామి తన పొలం గెట్టును అక్రమించుకోవడమే కాకుండా తన కుటుంబంపై పోలీసు కేసు పెడతాడా అంటూ మనస్తాపం చెందాడు. మూడు రోజుల క్రితం గడ్డిమందు తాగాడు. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా అక్కడ కోలుకోలేక చికిత్సపొందుతూ మరణించాడు. మృతుడికి భార్య సావిత్రితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి పితృ వియోగం
తిమ్మాజిపేట: నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి తండ్రి మర్రి జంగిరెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందారు. శనివారం మర్రి జనార్దన్‌రెడ్డి స్వగ్రామం నేరళ్లపల్లిలో ఇంటి నుంచి తన వ్యవసాయ పొలం వరకు జంగిరెడ్డి అంతిమయాత్ర నిర్వహించారు. అశ్రునయనాల మధ్య తనయుడు మర్రి జనార్దన్‌రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. అంత్యక్రియలకు మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, డాక్టర్ లక్ష్మారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాల్‌రాజ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, హర్షవర్దన్‌రెడ్డి, అంజయ్య యాదవ్, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, నాగం శశిధర్‌రెడ్డి, జోగు ప్రదీప్, రాందేవ్‌రెడ్డి, జెట్టివెంకటేష్ తదితరులు హాజరయ్యారు. వారు మర్రి జంగిరెడ్డి మృతదేహంపై పూలమాలలు పెట్టి నివాళులర్పించారు. అంత్యక్రియలకు హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
● ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ సత్యనారాయణ ఉండవెల్లి: మండలంలోని భైరాపురం శివారు అలంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. పంచాయతీ కార్యదర్శి దస్తగిరి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ సుబ్బారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏఎస్ఐ వివరాల ప్రకారం.. భైరాపురం శివారు అలంపూర్ రైల్వే స్టేషన్ సమీప రోడ్డుమార్గంలో గుర్తు తెలియని వ్యక్తి(60) మృతదేహం లభ్యమైంది. అతని వంటిపై తెల్ల బనిగిన్, తలబాగంలో గాయాలు, ఎడమ చేతి వేలుకు సిల్వర్ ఉంగరం, తలకు ఎర్రటి, నల్లటి వెంట్రుకలు ఉన్నాయి. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సత్యనారాయణ, అలంపూర్ ఎస్ఐ వెంకటస్వామి, ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్, ఉండవెల్లి ట్రైనింగ్ ఎస్ఐ సతీష్‌రెడ్డి పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శి దస్తగిరి ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మృతదేహం లభ్యం జడ్చర్ల టౌన్: పుర పరిధిలోని క్లబ్‌రోడ్డు బీసీ వసతిగృహం వెనక నీటికుంటలో శనివారం మధ్యాహ్నం బుడగ జంగం బంగారయ్య (16) మృతదేహం లభించినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. తల్లి బంగారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని.. 5 రోజుల కిందట శ్లోక స్కూల్ సమీపంలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లి అందులో పడి మృతిచెంది ఉంటాడని వివరించారు. కుక్కను తప్పించబోయి.. చెట్టును ఢీకొన్న బైక్ ● యువకుడుమృతి.. మరొకరికి తీవ్ర గాయాలు మన్ననూర్: మన్ననూర్ సమీపంలోని లింగమయ్య స్వామి ఆలయం వద్ద శ్రీశైలం– హైద్రాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. సంగారెడ్డి జిల్లాకు చెందిన అరవింద్, మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్‌కు చెందిన ఈశ్వర్ ఇద్దరూ కలిసి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మన్ననూర్ లింగమయ్యస్వామి ఆలయం సమీపంలో అకస్మాత్తుగా కుక్క బైక్‌కు అడ్డంగా రావడంతో దానిని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న అరవింద్(25) అక్కడికక్కడే మృతిచెందగా.. వెనక కూర్చున్న ఈశ్వర్‌కు తీవ్రగాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమ్రాబాద్ పోలీసులు తెలిపారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం నాగర్‌కర్నూల్ క్రైం: అప్పులబాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నాగర్‌కర్నూల్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. జిల్లాకేంద్రానికి చెందిన ముత్యాలుకు కొన్ని రోజులుగా అప్పులు ఎక్కువయ్యాయి. వాటిని తీర్చలేక మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ గోవర్దన్ తెలిపారు. -
బస్సుల్లో డీజిల్ చోరీ.. కేసు నమోదు
ఖిల్లాఘనపురం: పెట్రోల్ బంకులో నిలిపి ఉంచిన రెండు బస్సుల్లో నుంచి డీజిల్ చోరీ జరిగిన ఘటనపై శనివారం కేసునమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్‌గౌడ్ తెలిపారు. ఆయన కథనం మేరకు.. మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్‌బంకులో శుక్రవారం రాత్రి రెండు నైట్‌హాల్ట్ ఆర్టీసీ బస్సులను డ్రైవర్లు కావలి శాంతయ్య, కొత్తకాపు శ్రీనివాస్‌రెడ్డి నిలిపారు. వాటిలోనే డ్రైవర్లతో పాటు కండక్టర్లు సత్యం, వెంకటేశ్ పడుకున్నారు. శనివారం ఉదయం నిద్రలేచి రోజువారీగా టైర్లలో గాలిని పరిశీలిస్తుండగా డీజిల్ ట్యాంకు మూతలు తెరుచుకొని కనిపించాయి. పరిశీలించగా రెండు బస్సుల ట్యాంకుల్లో ఉన్న సుమారు 372 లీటర్ల డీజిల్ చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావలి శాంతయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ వివరించారు.