బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ..ఇలా పార్టీ ఏదైనా కావొచ్చు. అభ్యర్థులు ఒక పార్టీ నుంచి మరోపార్టీలోకి జంప్ చేయడం మామూలే. ఏ ఎన్నికల్లోనైనా అంతే..ఈ ఎన్నికల్లోనూ ఇంతే. అయితే. ఓ వ్యక్తి ప్రత్యర్థి పార్టీలో ఉన్నప్పుడు ఆ నేత పాములాంటివాడు. అదే వ్యక్తి పార్టీ మారి మనపార్టీలోకి వచ్చాక..అదే పాము మన ఫ్రెండైపోతాడు.
మన పార్టీలోంచి ఒకడు అవతలి పార్టీలోకి వెళ్లినప్పుడు ఎడాపెడా చేసే విమర్శలిలా ఉంటాయి.
1.వాడి కోరల నిండా విషం. పాములాగే బెదిరిస్తూ ఉంటాడు నిత్యం బుస కొడుతూ.
2. పాము కాబట్టే వాడి నడకా, నడతా మెలికలు మెలికలు. స్ట్రెయిట్‌గా ఏనాడైనా నడుస్తాడా వాడు? ముక్కుసూటిగా నిజాయతీగా ఉండలేడు కాబట్టే ఎప్పుడూ ఆ మెలికల నడకలు.
3. డబ్బులెక్కడుండే వాడూ అక్కడే. అచ్చం నిధులకు కాపలా ఉండే పాముల్లాగే!
4. పాములా వాడో కబ్జాకోరు. తన పడగకావరంతో చలిచీమలపై రౌడీయిజం చేసి, బలహీనులైన చీమల పుట్టల్ని కబ్జా చేసే ఆక్రమణదారువాడు.
ఇంతకాలం మనం పాము అన్నవాడే..పొరబాట్న కొన్ని కారణాలతో మళ్లీ మన పార్టీలోకి వచ్చేస్తాడనుకోండి. అప్పుడు ఇంతకాలం మని తిట్టినవాణ్ణే మంచివాడంటూ పొగడాల్సి వస్తుంది. ‘మరి మీరే అప్పుడలా అన్నారుకదా’ అని విలేకరులు అడిగితే వారిచ్చే వివరణలు ఇలా ఉంటాయి.
విలేకరి: మరప్పుడు కోరలనిండా విషం..బుసతో బెదిరింపన్నారు?
నేత: మీకో విషయం తెలుసా? అది బెదిరింపు కాదండి. పిల్లలు రాళ్లతో కొట్టి బాధిస్తున్నప్పుడు ‘బుస కొడుతూ ఆత్మరక్షణ చేసుకో..తప్పులేదం’టూ అప్పట్లో ఓ మహాముని..పాముకు ఉద్బోధ చేసిన కథ మీకు తెలియనిదా? ఇక కోరలనిండా విషమంటారా. మనికి ఉండదానండీ నిలువెల్లా విషం? పైగా పాముది విషం కాదండి. తన ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకు తోడ్పడే ఎంజైమండీ. అన్నింట్నీ అలా అపార్థం చేసుకోకూడదండీ. అన్నం తిని, అరిగించుకోవలి కదండీ పాపం... అదికూడా!
విలేకరి: స్ట్రెయిట్‌గా నడవడూ..వాడిదంతా వంకర నడకా, నడతా అన్నారుగా?
నేత: ఎవరైనా మెలికలెప్పుడు తిరుగుతారో మీకు తెలియనిదా? సిగ్గుతో, బిడియంతోనే కదా మెలికలు తిరిగేదీ!? మనవాడు సిగ్గూ, శెరం, మానం, మర్యాదా..అన్నీ ఉన్నవాడు. తప్పు చెయ్యమని ఎవరైనా అడిగితే, చెయ్యలేక..సిగ్గుతో, బిడియంతో తిరిగేవేనండీ ఆ మెలికలు!
విలేకరి: డబ్బులెక్కడుంటే పాములా వాడూ అక్కడే అన్నారు?
నేత:మాటమార్చే మనిషిని కాదండీ నేను. ఎక్కడ నిధులున్నప్పటికీ..వాటికి కాపలాగా ఉన్నప్పటికీ... అన్ని వజ్రాలూ, రత్నాలూ, మణిమాణిక్యాలూ కుప్పపోసి ఉన్నప్పటికీ..పాము వాటినేమైనా తింటుందా, తాగుతుందానండీ? ఎవరి డబ్బువారికి చేరాలనే ఉద్దేశంతో కాపలాకాస్తుందది. అలాగే రేపు మనం గెలిచాక కూడా..అటు ప్రభుత్వ ఖజానాకైనా, ఇటు అతడికి అప్పగించిన బాధ్యతల తాలూకు నిధులకు అంతే నిస్వార్థంగా కాపలా కాసే చెక్కూర్టీ గార్డులాంటి వాడండీ మనవాడు.
విలేకరి: బలహీనుల ఇళ్లూ, స్థలాలు, పుట్టలు ఆక్రమించే కబ్జాకోరన్నారు?
నేత: అన్ని ఫీల్డుల్లోనూ ఉన్నట్టే..కొందరు కబ్జాదారులు మన రాజకీయాల్లోనూ ఉండవచ్చు. కానీ మనవాడు అలాంటివాడు కాదు. మీకీ సంగతి తెల్సా? పాము అనేది డవిరెట్టుగా ఎవరికైనా పట్టుబడేలా నేరుగా పుట్టల్లో ఉండేవాటికంటే..గుట్టుగా తమ బతుకు తాము బతుకుతూ..ఎవరిజోలికీ వెళ్లకుండా... కొండగుట్టల్లోనా, బండరాళ్ల మధ్యన చీలికల్లోనా బతికేవే ఎక్కువ. మనవాడూ అలాంటి మంచివారిలో ఒకడండీ.
విలేకరి: ఓటరూ..ఓ ఓటరూ. నాడు పామన్నవాడినే నేడు ఫ్రెండంటున్నాడు? మరి నువ్వేమంటావ్?
ఓటరు : అన్నాడా? మన పార్టీవాడయ్యాడా? మన సామెత ప్రకారం చేసేదేముందిక...
మెడకు పడ్డ పాము కరవకమానుతుందా? ఫ్రెండయ్యాక ఓటేయక తప్పుతుందా?
Comments
Please login to add a commentAdd a comment