మక్తల్‌లో రోడ్‌షోకు తరలివచ్చిన గులాబీ శ్రేణులు
మహబూబ్‌నగర్: ఇక్కడి నుంచి కర్ణాటక ఐదు కిలో మీటర్ల దూరమే.. ఎమ్మెల్యే రామన్న నాలుగు బస్సులు ఏర్పాటు చేస్తాడు.. అందరూ వెళ్లి కర్ణాటకలో చూడండి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ పోయిందా లేదా అనేది తెలుసుకోండి.. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే కరెంట్ పోవడం ఖాయమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అసలు కాంగ్రెసోళ్లు కరెంట్ గురించి మాట్లాడొచ్చా? వాళ్ల హయాంలో కరెంట్ ఎట్లా ఉండే తెలవదా? ఎవరైనా గ్రామాల్లో చనిపోతే ఇదే ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అన్నా అంత్యక్రియలు అయిపోయినయ్.. కరెంట్ లేదు.. బోర్లు, బాయికాడ స్నానాలు చేయాలి.
ఒక్క 15 నిమిషాలు కరెంటివ్వన్నా అని అడిగలేదా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నాకై తే మీ జోష్ చూస్తుంటే.. రామన్న గెలిచిపోయినట్లే ఉంది.. గెలిచిపోయిండా.. పక్కానా.. హండ్రెడ్ పర్సెంటా.. టిక్ పెట్టుకోవచ్చా.. కేసీఆర్‌కు చెప్పొచ్చా.. అంటూ మంత్రి కేటీఆర్ అనడంతో జనమంతా కేరింతలు కొట్టారు.
మక్తల్‌కు రాగానే ఎమ్మెల్యే రామన్న నన్ను నాలుగు విషయాలు అడిగిండు.. అన్నా ఇది వరకు మున్సిపాలిటీలు చేసినవ్.. ఇప్పుడు మా మక్తల్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని, ఆత్మకూర్‌లో వంద పడకల ఆస్పత్రి నిర్మించాలని, భూత్పూర్ రిజర్వాయర్ కాల్వలు బాగు చేయాలని, నియోజకవర్గంలోని అన్ని మున్సిపాలిటీల్లో స్టేడియాలు, ఊట్కూర్‌లో నూతన బస్టాండ్, మక్తల్– నారాయణపేట ఫోర్‌లైన్ రోడ్డు, చంద్రగఢ్ కోటను పర్యాటక కేంద్రం చేయాలని, గిరిజన తండాలకు కొత్త పంచాయతీ భవనాలు నిర్మించాలని కోరారని మంత్రి వివరించారు.
టైం ఎక్కువ లేదు.. మా తమ్ముళ్లను కోరుతున్నా రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి. సోషల్ మీడియాను నమ్మకండి.. అందులో వచ్చేవి అంతా గాలి కబుర్లు.. వచ్చేది బీఆర్‌ఎస్ సర్కారే అంటూ కార్యకర్తలు, నాయకులకు భరోసానిచ్చారు. నందిమల్ల నుంచి ధర్మాపూర్‌కు రోడ్డు, ఆర్‌ఎస్‌ఎస్ సెంటర్లు.. ఇవన్నీ చిన్న చిన్న పనులని, రామ్మోహన్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఆ పనులన్నీ చేద్దామని చెప్పారు.
మక్తల్ గులాబీమయంగా మారిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి ఉమ్మడి జిల్లా సభ్యులు చిట్టెం సుచరితరెడ్డి, మక్తల్ ఎన్నికల ఇన్‌చార్జ్ ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది చదవండి: తాళానికి సీల్ లేదని ఆందోళన.. రెండు గంటలపాటు నిలిచిన ఓటింగ్ ప్రక్రియ..!
Comments
Please login to add a commentAdd a comment