గ్రేటర్‌ కిరీటం ఎవరికో? | Who will win in Greater Hyderabad | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ కిరీటం ఎవరికో?

Published Tue, Nov 28 2023 8:15 AM | Last Updated on Tue, Nov 28 2023 8:20 AM

Who will win in Greater Hyderabad - Sakshi

అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్‌ ఓటర్లు ఈ ఎన్నికల్లో ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది.  హైదరాబాద్‌ జిల్లా పరిధిలోకొచ్చే కోర్‌సిటీలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలైన మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్, చారి్మనార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురాల్లో  ఎంఐఎం గెలుపును ఇప్పటివరకు నిలువరించిన వారే లేరు. ఇప్పటికీ అదే పరిస్థితి కాగా,  ఈసారి నాంపల్లిలో పాగా వేసేందుకు కాంగ్రెస్‌ గట్టిగా  ప్రయత్నిస్తోంది. ఈసారి యాకుత్‌పురాలో ఎంబీటీ నుంచి ఎంఐఎంకు గట్టి పోటీ ఎదురవుతోంది. గోషామహల్‌లో ఈసారి బీజేపీని ఓడించాలని బీఆర్‌ఎస్‌ పట్టుదలతో ఉంది. నగరంలో జరిగిన అభివృద్ధి పనులు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు కలిసివచ్చేలా ఉండగా.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, గృహలక్ష్మి తదితర ప్రభుత్వ పథకాలు అందని పేద, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు బీఆర్‌ఎస్‌ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అది కాంగ్రెస్‌ అనుకూలంగా మలచుకొని పైచేయి సాధించాలని భావిస్తోంది. ఆ ట్రిక్‌తో కాంగ్రెస్‌ గెలుస్తుందా? లేక బీఆర్‌ఎస్‌ మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొడుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని  ఆరు నియోజకవర్గాలు గ్రేటర్‌లో కలసి ఉన్నాయి.  ఇక్కడ వివిధ రాష్ట్రాలకు చెందిన వారు,  విభిన్నవర్గాలు, మతాల వారు ఉండటం, అభ్యర్థులూ ఆర్థికంగా సంపన్నులు కావడం ఈ నియోజకవర్గాల్లో  విశేషం. వీరిలో ఇద్దరు అభ్యర్థులు బీఆర్‌ఎస్‌లో టికెట్లు రానందున కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తున్నారు. అట్టడుగువర్గాల కూలీల నుంచి ఆకాశహర్మ్యాల సంపన్నుల వరకు ఓటర్లున్న  మినీ దేశంలాంటి  గ్రేటర్‌ హైదరాబాద్‌ పొలిటికల్‌ సీన్‌పై  గ్రౌండ్‌రిపోర్ట్‌. - చెరుపల్లి వెంకటేశ్‌

ముషీరాబాద్‌ ముస్లిం ఓట్లు కీలకం  
ఈ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ఉంది. బీజేపీ అభ్యర్థి ప్రభావం పెద్దగా లేకపోయినా, బీజేపీ జాతీయ నేత డా.లక్ష్మణ్‌ స్థానిక నియోజకవర్గం కావడంతో ప్రాధాన్యం ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ముఠా గోపాల్, బీజేపీ అభ్యర్థి పూస రాజు ఇద్దరిదీ గంగపుత్ర సామాజిక వర్గం అయినందున నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న ఆ వర్గం ఓట్లు చీలిపోవడం గోపాల్‌కు నష్టం కలిగించనుంది.

కాంగ్రెస్‌ అభ్యర్థీగా బరిలో ఉన్న అంజన్‌ కుమార్‌ యాదవ్‌ గతంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోనే ఈ సెగ్మెంట్‌ కూడా ఉండటం, నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న యాదవసామాజిక వర్గం ఓట్లు ఆయనకు ఉపకరించనున్నాయి. బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మికి బీజేపీ టికెట్‌ రాకపోవడంతో వారి సామాజికవర్గం (కురుమ) ఓట్లు అంజన్‌కుమార్‌కు పడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో గోపాల్‌కు భారీ మెజారిటీ రావడానికి కారణమైన ముస్లిం మైనార్టీ ఓట్లు చీలి కాంగ్రెస్‌ వైపు మళ్లే పరిస్థితి కూడా ఉంది.  దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య పోటీ తీవ్రంగా మారింది. 

ఉమ్మడి రంగారెడ్డి పరిధిలో..
ఎల్‌బీనగర్‌: వీరుడెవరో
పెద్ద నియోజకవర్గాల్లో ఒకటైన ఇక్కడ మూడు ప్రధానపారీ్టలూ హోరాహోరీగా పోరాడుతున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డికి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇటీవల పరిష్కారం చూపిన నోటరీ స్థలాల రెగ్యులరైజేషన్, ప్రజలతో కలిసిపోవడం  తదితర అంశాలు సానుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్‌నుంచి పోటీ చేస్తున్న మధుయాష్కీగౌడ్‌కు నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న  బీసీల మద్దతు ఉన్నట్టు చెబుతున్నారు.

వివిధ సంఘాలు, అసోసియేషన్ల  వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయంటున్నారు. సీమాంధ్రుల ఓట్లు సైతం మధుయాష్కీకి పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి రంగంలో ఉన్న సామ రంగారెడ్డి కేంద్రంలోని బీజేపీ విధానాలు, తదితరమైనవాటితో ప్రచారంలో దూసుకుపోతున్నారు.  ప్రభుత్వ వ్యతిరేకత ఉపకరిస్తుందని చెబుతున్నారు.దాంతోపాటు నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న కార్పొరేటర్ల బలం కూడా కలిసి రాగలవని చెబుతున్నారు.

గోషామహల్‌ గతానికి భిన్నంగా..  
ఈ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన బీజేపీకి చెందిన రాజాసింగ్, బీఆర్‌ఎస్‌ అభ్యర్థీగా పోటీ చేస్తున్న నందకిశోర్‌వ్యాస్‌ బిలాల్‌ నడుమ పోటీ ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఒకే ఒక్క సీటు కూడా ఇదే కావడంతో ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఏర్పడింది. స్థానికంగా ఉండేది తక్కువ..ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటిస్తారనే అభియోగంతో ఈసారి రాజాసింగ్‌కు పరిస్థితులు కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి.

నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న మార్వాడీలతో పాటు నార్త్‌ ఇండియన్స్‌లోని కొన్ని వర్గాలు బీఆర్‌ఎస్‌ వైపు  మొగ్గు చూపుతున్నాయి. హిందూ నినాదాన్ని బాహాటంగా తలకెత్తుకున్న  రాజాసింగ్‌కు  హిందూ వర్గ ఓట్లు భారీ స్థాయిలో పడటంతో పాటు  నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆయన సామాజికవర్గమైన లోధి కుటుంబాల ఓట్లూ  పడే అవకాశాలున్నాయి. ఎంఐఎం ఇక్కడ పోటీ చేయడం లేదు. బీఆర్‌ఎస్‌కు ఎంఐఎం మద్దతు ఉన్నందున ముస్లింల ఓట్లు బీఆర్‌ఎస్‌కు ఉపకరిస్తాయనే  అంచనాలున్నాయి. కాంగ్రెస్‌ ప్రభావం ఇక్కడ  నామమాత్రమే. 

కంటోన్మెంట్‌  అంతు చిక్కని సెగ్మెంట్‌  
ఈ నియోజవర్గంలో కాంగ్రెస్‌ నుంచి దివంగత ప్రజాగాయకుడు గద్దర్‌ కుమార్తె  వెన్నెల,  దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత, బీజేపీ నుంచి శ్రీగణేశ్‌ పోటీలో ఉన్నారు. ఇటీవలి వరకు లాస్యనందితకు  సాయన్న కుమార్తెగా ఉన్న సానుభూతి సానుకూలంగా ఉన్నప్పటికీ, ఇటీవల తెరపైకొచి్చన అవినీతి ఆరోపణలతో నష్టం కలిగే ప్రమాదం ఉంది.

గద్దర్‌ అభిమానులు,  వివిధ ప్రజాసంఘాల సభ్యులు  వెన్నెలకు మద్దతుగా పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న పొరుగురాష్ట్రాల ఓటర్లు, నియోజకవర్గంలో నిర్వహిస్తున్న  స్వచ్ఛందసేవా కార్యక్రమాలు వంటివి తమిళుడైన బీజేపీ అభ్యర్థి శ్రీగణేశ్‌కు ఉపకరించగలవంటున్నారు.  ప్రజలు ఎవరిని ఆదరిస్తారనేది ఇప్పటికీ పజిల్‌గానే ఉంది.

సికింద్రాబాద్‌ దక్కేదెవరికో... 
బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మారావు బరిలో ఉన్నారు. గత రెండు పర్యాయాలు వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రజలతో కలివిడిగా ఉండటం కలిసి వచ్చే అంశం. కాంగ్రెస్‌ నుంచి ఆదం సంతోష్‌కుమార్‌ పోటీ చేస్తున్నారు. ఈయన గతంలో రైల్వే శాఖలో పనిచేయడం, ఓ కారి్మక సంఘానికి నేతగా కూడా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సెగ్మెంట్‌లో అధికసంఖ్యలో ఉన్న రైల్వే ఉద్యోగుల ఓట్లు కొంతమేర ఈయనకు పడే అవకాశాలున్నాయి. బీజేపీ అభ్యర్థీగా మేకల సారంగపాణి పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం లేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది.

ఉప్పల్‌  పార్టీ గుర్తులే బలం 
బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌లకు టికెట్‌ ఇవ్వని నియోజకవర్గాల్లో ఇదొకటి. ఎమ్మెల్యేగా ఉన్న  భేతి సుభాష్డ్డికి కాకుండా బండారి లక్ష్మారెడ్డికి టికెట్‌ ఇవ్వడంతో అసంతృప్తి ఏర్పడింది.పార్టీ అధిష్టానం నచ్చజెప్పడంతో సర్దుకున్నట్లే పైకి  కనిపిస్తోంది. ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో గట్టెక్కే పరిస్థితులున్నాయి. కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించిన రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్‌రెడ్డిలకు  కాకుండా పరమేశ్వర్‌రెడ్డికి టికెట్‌ లభించింది.

దాంతో, వారిద్దరూ బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆపారీ్టకి ప్లస్‌గా మారింది. పరమేశ్వర్‌రెడ్డికి  గతంలో కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవముంది. ప్రస్తుతం ఆయన భార్య రజిత కార్పొరేటర్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ గుర్తుతో మాత్రమే గెలవాల్సిన పరిస్థితి. ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు.  బీజేపీ నుంచి పోటీచేస్తున్న ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, కేడర్, కొంతమేర ఓటు బ్యాంకు ఉంది. అవి ఆయనకు ఉపకరించే అంశాలు.ఈ నేపథ్యంలో మూడుపారీ్టల మ«ధ్యే పోటీ ఉంది.

శేరిలింగంపల్లి హేమాహేమీల బరి  
రాష్ట్రంలోనే అత్యధికసంఖ్యలో ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి,  సిట్టింగ్‌ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హ్యాట్రిక్‌ కోసం కృషి  చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న జగదీశ్వర్‌గౌడ్‌ మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌లో ఉన్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధి  పనులు, ప్రజలకు అందుబాటులో ఉండటం, నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న సెటిలర్ల ఓట్లతో గెలుపు ఖాయమనే ధీమాలో గాంధీ ఉన్నారు.

కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న జగదీశ్వర్‌గౌడ్, ఆయన భార్య పూజిత ఇద్దరూ సిట్టింగ్‌ కార్పొరేటర్లుగా ఉండటం వారికి కలిసివచ్చే అంశం. సుదీర్ఘకాలంగా కార్పొరేటర్‌గా ఉన్న తన పనితీరు, వివాదాల్లేకపోవడం, మార్పు కోరుకుంటున్న ప్రజలు .. తదితర అంశాలు కలిసిరాగలవని  భావిస్తున్నారు. బీజేపీ నుంచి బరిలో దిగిన రవికుమార్‌యాదవ్‌ తండ్రి  కాంగ్రెస్‌ నుంచి గతంలో ఓమారు  ఎమ్మెల్యేగా, శేరిలింగంపల్లి మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చైర్మన్‌గానూ వ్యవహరించారు. దాంతో వారి మద్దతుదారులూ  ఉన్నారు. బీజేపీ విధానాలు తనను గెలిపిస్తాయని రవికుమార్‌ విశ్వసిస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ముక్కోణపు పోటీ కనిపిస్తోంది.

అంబర్‌పేట జైకొట్టేదెవరికో ? 
బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీజేపీ అభ్యర్థీగా టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన సి.కృష్ణయాదవ్‌  మధ్య పోటీ ప్రధానంగా ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి  రోహిణ్‌రెడ్డి  కోరుకున్న నియోజకవర్గం ఖైరతాబాద్‌ కాగా ఇక్కడ టికెట్‌ ఇవ్వడంతో  ప్రజల్లోకి వెళ్లేందుకు  తగిన సమయం లభించలేదు.  కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్థానిక నియోజకవర్గం కావడంతో ఆయన ఓటు బ్యాంకు బీజేపీకి లాభం చేకూర్చనుంది.

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, మైనార్టీల ఆదరణ బీఆర్‌ఎస్‌కు ఉపకరించనున్నాయి. రెడ్డి సామాజిక ఓట్లు  రోహిణ్‌రెడ్డికి అధికసంఖ్యలో పడే అవకాశముంది. మైనార్టీలను కూడా తన వైపు మళ్లించుకోగలిగితే పుంజుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో బీజేపీ గెలుపు కిషన్‌రెడ్డికి సవాల్‌గా మారింది. 

ఖైరతాబాద్‌  వరించేదెవరినో ? 
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. సిట్టింగ్‌కు తిరిగి అవకాశం ఇవ్వవద్దని భావిస్తున్న  ఓటర్లు కాంగ్రెస్‌వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతోపాటు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్న విజయారెడ్డికి నియోజకవర్గంలో తన తండ్రి  పీజేఆర్‌ అభిమానుల అండదండలున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న  దానం నాగేందర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కావడంతో మౌలిక సదుపాయాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు.

నాగేందర్‌కు నియోజకవర్గంలో ఉన్న బలం, తదితరమైనవి సానుకూలాంశాలుగా ఉన్నాయి. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి పోటీలో ఉన్నా పెద్దగా ప్రభావం లేదు. పేదలు, సంపన్నులు రెండు వర్గాల ప్రజలూ  అధికంగానే ఉన్న ఈ నియోజకవర్గంలో ఎవరిని గెలిపిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 

జూబ్లీహిల్స్‌ విజేత ఎవరో ?
కాంగ్రెస్‌ నుంచి మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ పోటీ చేస్తుండగా, బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మూడో పర్యాయం పోటీ  చేస్తున్నారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు అధికసంఖ్యలో ఉండటం వల్ల అవి అజారుద్దీన్‌కు పోలవుతాయనే అంచనాలున్నాయి. బీఆర్‌ఎస్‌ చేపట్టిన పలు కార్యక్రమాలతోపాటు  ముస్లింలను  ప్రభావితం చేసే ఎంఐఎం మద్దతు బీఆర్‌ఎస్‌కుండటం కలిసి వచ్చే అంశం. ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉన్నా.. అది కాంగ్రెస్‌ ఓట్లను చీల్చడానికి ఉపకరిస్తుందనే వ్యూహంతో పోటీలో నిలిపారనే అభిప్రాయాలున్నాయి.

బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్‌తోపాటు కొందరు కార్పొరేటర్లకు మాగంటికి మధ్య పొసగకపోవడంలేదు. అది బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించనుంది.  2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా రెండోస్థానంలో, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా మూడోస్థానంలో నిలిచిన నవీన్‌యాదవ్‌ కాంగ్రెస్‌లో చేరడం ఆపారీ్టకి  ఉపకరిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠ రేపుతోంది.  

కూకట్‌పల్లి  ఓటర్లు ఎటువైపో ? 
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, జనసేనలు పోటీలో ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న  కృష్ణారావుకు ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలతో పాటు  ప్రజలకు అందుబాటులో ఉండటం వంటివి కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మొన్నటి వరకూ బీఆర్‌ఎస్‌లో ఉండి శేరిలింగంపల్లి టికెట్‌ ఆశించిన బండి రమేశ్‌ కాంగ్రెస్‌లో చేరి పోటీకి దిగారు. నియోజకవర్గానికి కొత్త.

క్షేత్రస్థాయి రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేదని స్థానికులంటున్నారు.  నియోజకవర్గంలో అధికసంఖ్యలో ఉన్న కమ్మ సామాజిక, సెటిలర్ల ఓట్లపై నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.జనసేన నుంచి పోటీ చేస్తున్న ప్రేమ్‌కుమార్‌ సైతం తన సామాజిక వర్గం కాపుల ఓట్లు, బీజేపీ బలం తనకు ఉపకరిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, జనసేలకు చీలిపోయే పరిస్థితులున్నాయి. అది బీఆర్‌ఎస్‌కు ఉపకరించే పరిస్థితులున్నాయి.  

సనత్‌నగర్‌ మంత్రి హ్యాట్రిక్‌ కొట్టేనా ?
బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఈ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఇక్కడి నుంచి ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచి నియోజకవర్గంపై పట్టు సాధించారు. ఈసారి హ్యాట్రిక్‌  కొట్టే అవకాశం ఉన్నప్పటికీ,  ప్రత్యర్థులు కూడా హోరాహోరీగా పోరాడుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఏఐసీసీ మీడియా సెల్‌  చైర్మన్‌ పవన్‌ఖేరా భార్య కోట నీలిమ పోటీలో ఉండగా, బీజేపీ నుంచి మర్రి శశిధర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

గతంలో ఈ నియోజకవర్గం నుంచి  గెలిచిన శశిధర్‌రెడ్డికి ఉన్న స్థానిక బలం, కేంద్రంలోని బీజేపీ విధానాలు, మోదీ క్రేజ్‌ ఆయనకు ఉపకరించనున్నాయి. కోట నీలిమ.. తలసాని టార్గెట్‌గా మంత్రి చేసింది తక్కువ.. ప్రచారం ఎక్కువంటూ ప్రజల ముందుకెళ్తున్నారు. నెమ్మదిగా ఆమె పుంజుకుంటున్నారు. దీంతో పోటీ పెరిగింది. ఇంటింటికీ ప్రచారానికి వెళ్లడం తదితరమైనవి తలసానికి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. ముగ్గురూ ఎవరి వ్యూహాలతో వారు పోరాడుతున్నారు. 

మల్కాజిగిరి ఇద్దరికీ సవాల్‌  
ఇక్కడ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తుండగా, సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హన్మంతరావు తన కొడుక్కి కూడా టికెట్‌ కావాలనే పంతంతో బీఆర్‌ఎస్‌ను వీడారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరికీ సవాల్‌గా మారిన నియో­జకవర్గంలో బీజేపీ నుంచి ఎన్‌.రామచంద్రరావు బరిలో నిలిచా­రు. మంత్రి మల్లారెడ్డికి సైతం ఈ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా మారింది.

అభ్యర్థీని అధికారికంగా ప్రకటించక ముందునుంచే ప్రచారం చేపట్టడంతో బీఆర్‌ఎస్‌ ముందంజలో ఉంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ను­వ్వా.. నేనా ? అన్నట్టు పోరాడుతున్నాయి.  

కుత్బుల్లాపూర్‌ గెలుపెవరిదో ? 
ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్న  సిట్టింగ్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌గౌడ్‌కు  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఉపకరించనున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కాంగ్రెస్‌  ఆరు గ్యారంటీలు, నియోజకవర్గంలో  రెడ్డి సామాజికవర్గ మద్దతుతో  తాము గెలవగలమ­ని కాంగ్రెస్‌ అభ్యర్థి కొలన్‌ హన్మంతరెడ్డి  వర్గీయులు భావిస్తున్నారు.  

బీజేపీ బీసీ నినాదంతో  కేంద్రంలోని మోదీ విధానాలతో ప్రజలు తమను గెలిపిస్తారని బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌  అనుయాయులు చెబుతున్నారు. మూడు పార్టీలూ వేటికవిగా హో­రాహోరీ ప్రచారం చేస్తున్నాయి.  

ప్రజా సమస్యలు పట్టించుకోవాలి
ధరణి వల్ల ఎన్నో సమస్యలున్నాయి. అసలైన భూయజమానులు  కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకునేవారు లేరు. కోవిడ్‌ తరుణంలో మూడునెలల కరెంట్‌ బిల్లులు ఒకసారి జారీ చేసి  వెంటనే కట్టకపోతే కనెక్షన్‌ కట్‌చేస్తామని బెదిరించారు. ఉచిత నీటి సరఫరా అనేది పేరుకు మాత్రమే. మా అపార్ట్‌మెంట్‌కు అది 
అమలవడం లేదు. –సాయిచందర్‌ రామ్‌కోఠి, నగర వ్యాపారి, ఖైరతాబాద్‌

పనిచేసే వారిని ప్రోత్సహించాలి  
ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయి. సనత్‌నగర్‌ నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి జరిగింది.పనులు చేసే వాళ్లను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా పనులు చేస్తారు. –ధనుంజయ, చిరువ్యాపారి, సనత్‌నగర్‌ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement