సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్ / సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటి వరకు ఇంటింటి ప్రచారంలో నిమగ్నమై పని చేయగా, కొన్ని రోజులుగా పార్టీల ముఖ్య నేతలతో బహిరంగసభలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల అగ్రనేతల సుడిగాలి పర్యటనలతో ఎన్నికల వాతావరణం రణరంగంలా మారింది.
ఇప్పటికే ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఆదివారం ఒక్కరోజునే ఉమ్మడి పాలమూరులోని నాలుగు నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలను నిర్వహించారు. అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో సీఎం పర్యటన ఆ పార్టీలో జోష్ నింపగా, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం జాతీయ, రాష్ట్రస్థాయి ముఖ్య నేతలతో సభల నిర్వహణకు సిద్ధమయ్యాయి.
ప్రచారానికి దగ్గరపడుతున్న సమయం
అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ సైతం ఇటీవల ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి బహిరంగసభల్లో పాల్గొన్నారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీల ప్రచారం మరింత ఊపందుకుంది.
సీఎం కేసీఆర్ సభలతో బీఆర్‌ఎస్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్, ఏఐసీసీ కార్యదర్శులు, కర్ణాటక మంత్రులు, స్టార్ క్యాంపెయినర్లతో కాంగ్రెస్ అగ్రనేతలు, బీజేపీ తరఫున కేంద్రమంత్రులు, జాతీయస్థాయి నాయకులు జిల్లాకు వస్తుండడంతో ఎన్నికల వాతావరణం రోజురోజుకీ వేడెక్కుతోంది.
పాలమూరుపై ప్రత్యేక నజర్..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాలపై ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేకంగా దృష్టిని సారించాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. నెలరోజుల వ్యవధిలో జడ్చర్ల, అచ్చంపేట, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, గద్వాల నియోజకవర్గాల్లో పర్యటించగా.. ఆదివారం అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొని మాట్లాడారు.
అలాగే ఈనెల 22న మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంతో పాటు కోస్గికి కేసీఆర్ రానున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మొదటి మోటారు ప్రారంభం, మార్కండేయ ఎత్తిపోతల నీటి పంపింగ్‌ను ప్రారంభించిన అనంతరం సాగునీటి అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ దిశగా భారీ బహిరంగసభల నిర్వహణతో పాటు గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాల్లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల పర్యటనలు ఎక్కువగా కొనసాగుతుండగా, ఉమ్మడి పాలమూరులో గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి.. స్వయంగా ఆయనే పలు నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటిస్తున్నారు.
నేడు నాగర్‌కర్నూల్,అచ్చంపేటకు రేవంత్..
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం ఇప్పటికే హోరెత్తగా, పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో గప్పగుత్తగా ఓటర్లను ఆకర్షించేందుకు భారీ బహిరంగసభలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌లో పర్యటించారు. ప్రచారానికి మిగిలిన కొద్ది రోజుల్లోనూ పెద్ద సంఖ్యలో పార్టీ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది.
మంగళవారం నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని బిజినేపల్లితో పాటు అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించనున్న బహిరంగసభల్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి పాలమూరుపై గంపెడాశలు పెట్టుకున్నారు.
కేంద్ర మంత్రులు, సీఎంలతో బీజేపీ..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భారీ బహిరంగ సభలను నిర్వహించి పెద్ద ఎత్తున ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. గత నెలలో ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొని.. ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు, జాతీయస్థాయి నేతలతో సభలను నిర్వహించగా, మిగిలిన రోజుల్లోనూ ముఖ్య నేతలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వనించి ప్రచారం చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది.
ఇటీవల గద్వాల నియోజకవర్గంలో కేంద్రమంత్రి అమిత్‌షా, ఆదివారం నారాయణపేట నియోజకవర్గంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగసభల్లో పాల్గొన్నారు. సోమవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొల్లాపూర్‌లో, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో పర్యటించారు. అయితే వచ్చే వారం కల్వకుర్తి నియోజకవర్గం పరిధిలో నిర్వహించే బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోదీ లేదా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతారని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment