ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని అలింగనం చేసుకుంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. ఉమ్మడి జిల్లాకు చెందిన టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర అత్యున్నత పదవి చేపట్టారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో అవిభాజ్య మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారావు సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే జిల్లాలో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
అంతేకాదు.. ఆయన మంత్రివర్గంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. ఆయన సైతం మంత్రిగా ప్రమా ణం చేశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు పెద్దపీట దక్కడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.
బ్యాంక్ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి..
కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌లోని ఎస్‌బీహెచ్‌లో ఉద్యోగం చేసేవారు. 1999లో కొలువుకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్‌కు కేటాయిస్తే, జూపల్లి స్వతంత్ర అభ్యర్థిగా విమానం గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు.
ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబరు 30న కాంగ్రెస్‌ను వీడారు. మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్)లో చేరారు.
2012 ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ తొలి కేబినెట్‌లో తొలుత ఐటీ, భారీ పరిశ్రమల శాఖ, ఆ తర్వాత పంచాయతీ రాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత క్రమంలో బీరం బీఆర్‌ఎస్‌లో చేరగా.. జూపల్లికి ప్రాధాన్యం తగ్గింది. దీంతో ఆయన కేసీఆర్‌తో విభేదించారు. ఈ క్రమంలో ఆయనపై బీఆర్‌ఎస్ సస్పెన్షన్ వేటు వేయగా.. ఈ ఏడాది ఆగస్టు మూడో తేదీన కాంగ్రెస్‌లో చేరారు. తాజా ఎన్నికల్లో ఆరో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఆయనకు శాఖను కేటాయించే అవకాశం ఉంది. అయితే వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కేబినెట్‌లో జూపల్లికి మంత్రిగా అవకాశం రావడం విశేషం.
ఎన్నో ఆశలు..
ఉమ్మడి పాలమూరుకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయనపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి, ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తి చేసి.. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని కోరుతున్నారు.
అదేవిధంగా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల రైతాంగానికి సాగు నీరందించి, ప్రయోజనం చేకూర్చే జీఓ 69 అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీటితో పాటు ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీని జాప్యం చేయకుండా అమలు చేసి లబ్ధి చేకూర్చాలని విన్నవిస్తున్నారు.
మలివిడతలో అవకాశం దక్కేనా?
మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌కు రాష్ట్ర అత్యున్నత పదవి లభించింది. అదేవిధంగా తొలివిడతలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లికి మంత్రి వర్గంలో చోటుదక్కింది.
ఈ క్రమంలో మలి విడతలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో మరొకరికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వీలు కాని పక్షంలో ప్రభుత్వ విప్‌గా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరిలో ఒకరిని తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లా నుంచి ప్రమాణ స్వీకారానికి తరలిన హస్తం శ్రేణులు..
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి వాసులు, రేవంత్ స్నేహితులు, ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లారు. అదేవిధంగా రేవంత్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు మండలాల నుంచి హస్తం నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment