JUPALLY Krishnarao
-
పులకించిన పాలమూరు.. సీఎంగా రేవంత్.. మంత్రిగా జూపల్లి ప్రమాణ స్వీకారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. ఉమ్మడి జిల్లాకు చెందిన టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర అత్యున్నత పదవి చేపట్టారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో అవిభాజ్య మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బూర్గుల రామకృష్ణారావు సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే జిల్లాలో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు.. ఆయన మంత్రివర్గంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకు చోటు దక్కింది. ఆయన సైతం మంత్రిగా ప్రమా ణం చేశారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు పెద్దపీట దక్కడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బ్యాంక్ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండలం పెద్దదగడకు చెందిన జూపల్లి కృష్ణారావు హైదరాబాద్‌లోని ఎస్బీహెచ్లో ఉద్యోగం చేసేవారు. 1999లో కొలువుకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీఆర్ఎస్కు కేటాయిస్తే, జూపల్లి స్వతంత్ర అభ్యర్థిగా విమానం గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబరు 30న కాంగ్రెస్‌ను వీడారు. మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో చేరారు. 2012 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి కేసీఆర్ తొలి కేబినెట్లో తొలుత ఐటీ, భారీ పరిశ్రమల శాఖ, ఆ తర్వాత పంచాయతీ రాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత క్రమంలో బీరం బీఆర్ఎస్లో చేరగా.. జూపల్లికి ప్రాధాన్యం తగ్గింది. దీంతో ఆయన కేసీఆర్‌తో విభేదించారు. ఈ క్రమంలో ఆయనపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేయగా.. ఈ ఏడాది ఆగస్టు మూడో తేదీన కాంగ్రెస్‌లో చేరారు. తాజా ఎన్నికల్లో ఆరో పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచి.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఆయనకు శాఖను కేటాయించే అవకాశం ఉంది. అయితే వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కేబినెట్లో జూపల్లికి మంత్రిగా అవకాశం రావడం విశేషం. ఎన్నో ఆశలు.. ఉమ్మడి పాలమూరుకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఆయనపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా పాలమూరు–రంగారెడ్డి, ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తి చేసి.. చివరి ఆయకట్టు వరకు సాగు నీరందించాలని కోరుతున్నారు. అదేవిధంగా నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల రైతాంగానికి సాగు నీరందించి, ప్రయోజనం చేకూర్చే జీఓ 69 అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీటితో పాటు ఆరు గ్యారంటీలు, రైతు రుణమాఫీని జాప్యం చేయకుండా అమలు చేసి లబ్ధి చేకూర్చాలని విన్నవిస్తున్నారు. మలివిడతలో అవకాశం దక్కేనా? మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌కు రాష్ట్ర అత్యున్నత పదవి లభించింది. అదేవిధంగా తొలివిడతలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లికి మంత్రి వర్గంలో చోటుదక్కింది. ఈ క్రమంలో మలి విడతలో మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో మరొకరికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వీలు కాని పక్షంలో ప్రభుత్వ విప్‌గా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరిలో ఒకరిని తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి ప్రమాణ స్వీకారానికి తరలిన హస్తం శ్రేణులు.. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామమైన అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి వాసులు, రేవంత్ స్నేహితులు, ఆయన అభిమానులు భారీ ఎత్తున తరలివెళ్లారు. అదేవిధంగా రేవంత్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి, మద్దూరు మండలాల నుంచి హస్తం నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో తరలివెళ్లారు. -
కాంగ్రెస్‌లో టికెట్ల పోరు.. నీదా..! నాదా..! ఎవరరిది..?
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండటంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండగా.. మరోవైపు వారి చేరికకు ముందే చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. త్వరలో ఇరువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారు వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్‌లో అంతర్గత పోరు తప్పదన్న సంకేతాలను చూపుతోంది. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో కొల్లాపూర్ వేదికగా నిర్వహించేందుకు తలపెట్టిన ‘పాలమూరు ప్రజాభేరి’ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం ఇరువర్గాలుగా నేతలు తమ బలప్రదర్శనను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త, పాత నేతలు సర్దుకుంటారా..! కాంగ్రెస్‌లోకి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పార్టీ టికెట్ కోసం అంతర్గత పోరు తప్పేలా కనిపించడం లేదు. జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతుండగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ నేత చింతలపల్లి జగదీశ్వర్‌రావు భారీ ర్యాలీతో బలప్రదర్శన చేపట్టారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాల ని పిలుపునిచ్చారు. ఏళ్లుగా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల నిర్వహణ, సభ్యత్వాలను పెంచి పార్టీ బలాన్ని పెంచానని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీలో ఉండటం ఖాయమని ప్రకటించడంతో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న జూపల్లికి పార్టీలో అంతర్గత పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉన్న తరుణంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన కేడర్‌లో నెలకొంది. సర్వేల చుట్టూ రాజకీయాలు.. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కాగా.. వచ్చే ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని నాగం చెబుతున్నారు. పార్టీలో అంతర్గత పోరును కట్టడి చేసేందు కు సర్వేల ద్వారా టికెట్లను ఖరారు చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్వే మొదలైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అ యితే సర్వేలతో పనిలేకుండా ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి అవకాశం ఇవ్వాలని నాగం, జగదీశ్వర్‌రావులు డిమాండ్ చేస్తున్నారు. సమీకరణాలపై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోకి నేతల చేరికలతోపాటు పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వారి చేరికకు ముందే కొత్త, పాత నేతల మధ్య వైరం పెరుగుతుండటం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన సమావేశానికి హాజరైన నాగం జనార్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కకుండా చేస్తే వారిని ఓడిస్తామనే సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే ఇందుకోసం వ్యతిరేకులను అంతా ఏకం చేసే యోచనలో సైతం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో టికెట్ కోసం ఇరువర్గాల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు, వారి పట్టింపుల నడుమ చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పార్టీ ఆదేశించిన విధంగా కొత్త, పాత నేతలు నడుచుకుంటారా.. అంతర్గత కుమ్ములాటలు ఎటువైపు దారితీస్తాయోనన్నది ఉత్కంఠగా మారింది. -
ఢిల్లీ చేరుకున్న పొంగులేటి, జూపల్లి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ అసంతృప్త నేతలైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో వారిద్దరూ తమ ముఖ్య అనుచరులతో కలసి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాందీని కలవనున్నారు. ఇందుకోసం ఆదివారం రాత్రి 9 గంటలకు వారు ఢిల్లీ చేరుకున్నారు. ఈ కార్యక్రమం కోసం నలుగురు ఏఐసీసీ ఇన్‌చార్జీలతోపాటు 22 మంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం అందింది. దీంతో చాలా మంది నాయకులు ఆదివారం రాత్రే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరికొందరు సోమవారం ఉదయం చేరుకో నున్నారు. పొంగులేటి, జూపల్లి బృందంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, వి. హనుమంతరావు, రేణుకాచౌదరి, జీవన్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, బలరాం నాయక్, శ్రీధర్‌బాబు, మధుయాష్కీ గౌడ్, దామోదర రాజనర్సింహ, పోదెం వీరయ్య,జగ్గారెడ్డి, మల్లు రవి, మహేశ్‌కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, రోహిత్ చౌదరి, పీసీ విష్ణునాథ్, మన్సూర్ అలీఖాన్, వంశీచందర్రెడ్డిలను ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానం అందింది. వారిలో 20 మందికిపైగా నేతలు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. పొంగులేటి, జూపల్లి వెంట పాయం వెంకటేశ్వర్లు, మువ్వా విజయ్‌బాబు, బానోతు విజయాబాయి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, మేఘారెడ్డి తదితరులు వెళ్లనున్నట్లు తెలిసింది. వీరంతా ఖర్గే, రాహుల్ గాంధీని కలసి తెలంగాణ రాజకీయాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ మార్గనిర్దేశం చేయనుంది. ఈ సమావేశంలోనే ఖమ్మంలో పొంగులేటి బృందం పార్టీలో చేరిక, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించాల్సిన బహిరంగ సభ తేదీలు కూడా ఖరారు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆట మొదలవుతోంది: పొంగులేటి ఆదివారం రాత్రి ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నామని వ్యాఖ్యానించారు. ఆట మొదలవుతోందని.. ఆటను పర్ఫెక్ట్గా ఆడబోతున్నామంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదని ప్రజలు భావిస్తున్నారని... ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని పొంగులేటి పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సహా 4–5 జిల్లాల నుంచి నేతలం కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలకు వచ్చామని చెప్పారు. ఇతర పార్టీల నేతలు, ఇతర ప్రాంతాల నేతలు సైతం పెద్ద ఎత్తున చేరబోతున్నారన్నారు. ఖర్గే, రాహుల్‌తో భేటీ అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి అన్ని వివరాలు వెల్లడిస్తానని పొంగులేటి తెలిపారు. ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత కోసమే: మల్లు రవి రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న కేసీఆర్‌ను గద్దె దించేందుకే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని, అదేవిధంగా రాష్ట్రంలోనూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని, అందులో భాగంగానే ఈ చేరికలని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పౌర హక్కుల సంఘాలు, కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులు చేయీచేయీ కలిపి బీఆర్ఎస్ నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధం కావాలని మల్లు రవి పిలుపునిచ్చారు. -
కొల్లాపూర్‌లో హై టెన్షన్.. పోలీసుల వార్నింగ్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్ ఉత్కంఠ రేపుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అధికార గులాబీ పార్టీకి చెందిన నేతలిద్దరూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. నియోజకవర్గం అభివృద్ధి, అవినీతి విషయంలో గులాబీ నేతలిద్దరూ ఓపెన్ చాలెంజ్ చేస్తూ బహిరంగ చర్చకు సిద్దమంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆదివారం కొల్లాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. శనివారం రాత్రికే జూపల్లి, ఎమ్మెల్యే హర్షవర్దన్ కొల్లాపూర్ చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. చర్చలకు, ర్యాలీలకు అనుమతిలేదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. జూపల్లి ఇంటి వద్ద ఆదివారం ఉదయం భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇక, ఈరోజు ఉదయం కొల్లాపూర్‌లో జూపల్లి ఇంటి వద్దకు ఆయన అనుచరులు రావడంతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఎమ్మెల్యే హర్షవర్ధన్ ఇంటి వద్ద పోలీసులు బారీకేడ్డు ఏర్పాటు చేశారు. ఇద్దరు నేతలను పోలీసులు.. ఇంటికే పరిమితం చేశారు. ఇది కూడా చదవండి: మోదీ సభతో రాష్ట్రంలో పెనుమార్పులు: తరుణ్‌ఛుగ్ -
ఇంకెన్నాళ్లు...ఎదురుచూపులు!
సాక్షి, పెంట్లవెల్లి(నాగర్‌కర్నూలు) : శ్రీశైలం ప్రాజెక్టు కట్టడంతో ఏటి ఒడ్డున ఉన్న ఎన్నో గ్రామాలు 38ఏళ్ల క్రితం ముంపునకు గురయ్యాయి. అందులో ఎన్నో గ్రామాల్లో ఇళ్లు, పొలాలు, కల్లందొడ్లు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపోయిన వారికి ప్రత్యేక జీఓ ఏర్పాటు చేస్తున్నామని 98 జీఓను గతంలో ఏర్పాటు చేశారు. కానీ అప్పటి నుంచి సవరించిన జీఓను అమలు పర్చలేకపోయారు. కొంతమందికి మాత్రమే అందులో ఉద్యోగాలు వచ్చాయి. మిగిలిన ఎంతోమందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఇటు ఉద్యోగాలు రాక.. సరైన నష్టపరిహారం రాక ముంపు బాధితులు జీవనోపాధి కోసం గోడు వెల్లబోసుకుంటున్నారు. మంత్రి, కలెక్టర్ల చర్యలు నిష్ఫలం వనపర్తి, కొల్లాపూర్, చిన్నంబావి ఏరియాల్లో 2500 వరకు ఉద్యోగాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఏటా ఎన్నికల ముందు వారికి ఉద్యోగాలు ఇస్తామని చెబుతూ హామీలిస్తున్నారు. కానీ ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేకపోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా గతంలో ఉద్యోగాలిస్తామని మాటలు చెప్పారు.. కానీ ఇంతవరకు శ్రద్ధ చూపడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత లేని వారికి రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశామని, ఏ ఒక్కరూ దీనిపై చర్చలు జరపలేదని వాపోతున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, గత కలెక్టర్లు చర్చలు చేసినా.. ఏమీ తేల్చలేకపోయారు. పాదయాత్ర చేపట్టినా ఫలితం శూన్యం జటప్రోల్, మాధవస్వామినగర్, మంచాలకట్ట, మల్లేశ్వరం, ఎంగంపల్లిలో దాదాపుగా 250 మంది 98 జీఓ నిర్వాసితులు ఉన్నారు. వారికి ఉద్యోగాలు లేక, అటు నష్టపరిహారం లేక భూములు కోల్పోయి నిరాశ్రయులయ్యారు. అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు, లేనివారికి రూ.10లక్షలు ఇవ్వాలని గతంలో అలంపూర్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర చేపట్టినా.. ఫలితం లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే హామీ ఫలించేనా? ఈసారి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్నికల ముందు ఖచ్చితంగా 98 జీఓ నిర్వాసితులకు ఉద్యోగాలిప్పిస్తానని హామీ ఇచ్చారని, ఈసారైనా తమ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నామని పేర్కొంటున్నారు. భూములు నష్టపోయిన వారికి పరిహారం అందించాలని కోరుతున్నారు. లేదంటే ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని ఆయా గ్రామాల 98 జీఓ నిర్వాసితులు పేర్కొంటున్నారు. ఏటి ఒడ్డున ఉన్న ప్రాంతాల వారందరూ జీవనోపాధి కోసం ఎదురుచూస్తున్నారని.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారైనా ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు. ఈసారైనా ఉద్యోగాలివ్వండి 38ఏళ్ల నుంచి ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నా ఇంతవరకు మా కల నెరవేరడంలేదు. సర్వం కోల్పోయిన మాకు ఉద్యోగాలే దిక్కని అనుకున్నాం. ఇప్పటికైనా అవకాశం కల్పించాలి. – ఖాజామైనోద్దీన్, 98 జీఓ జిల్లా అధ్యక్షుడు -
గడువులోపు పంచాయతీ ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్ : నిర్ణీత గడువులోగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ నెల 25లోపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై మంత్రి జూపల్లి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మూడు నెలలుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, పూర్తి పారదర్శకంగా, నిర్ణీత గడువులోపు ఎన్నికలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ బీసీ ఓటర్ల గణన పూర్తి కావచ్చిందని, గత ఎన్నికల తరహాలోనే ఈసారీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వివరించారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 1,170 పంచాయతీలను, షెడ్యూల్ ఏరియాలోని 1,300 గ్రామ పంచాయతీలను ఎస్టీలకే రిజర్వు చేసినట్లు తెలిపారు. ప్రతి కేటగిరీలోనూ 50 శాతం పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉంటాయన్నారు. గ్రామం యూనిట్‌గా వార్డ్ మెంబర్‌కు, మండలం యూనిట్‌గా సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు. ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధులకు మూడు నెలలపాటు కొత్త పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన కల్పించేలా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళా సంఘాలకు ట్యాబ్‌లు.. గ్రామ స్థాయిలో మహిళా సంఘాల కార్యకలాపాలు పారదర్శకంగా, వేగంగా నిర్వహించేందుకు వీలుగా ట్యాబ్లెట్ పీసీలను అందజేస్తున్నామని జూపల్లి తెలిపారు. స్త్రీనిధి బ్యాంకు ఆధ్వర్యంలో గ్రామ మహిళా సంఘాలకు మంత్రి గురువారం ట్యాబ్లెట్ పీసీలను అందజేశారు. మహిళలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేస్తున్నామని, ట్యాబ్లెట్ పీసీలతో రుణాల కోసం గ్రామం నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొన్నారు. ఆధార్, ఐరిస్ ధ్రువీకరణ సౌకర్యం సైతం ట్యాబ్లెట్ సీపీల్లో పొందుపరచవచ్చన్నారు. ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీ చెల్లింపులు సైతం విలేజ్ ఆర్గనైజేషన్ల(వీవో) ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవో పౌసమిబసు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నర్సరీలపై సదస్సులు కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దీని కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జూపల్లి తెలిపారు. నర్సరీల ఏర్పాటు, మొక్కలు నాటడం, సంరక్షణ లాంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు జూన్ 25 నుంచి జూలై 10 వరకు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రాథమిక గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో మంత్రి జూపల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లోని జనాభా, విస్తీర్ణం ప్రాతిపదికన కనీసం 20 వేల నుంచి లక్ష మొక్కల సామర్థ్యంతో నర్సరీలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి జూపల్లి సూచించారు. -
జూరాల నుంచి భీమాకు నీటి విడుదల
సాక్షి, హైదరాబాద్: జూరాల నుండి భీమా రెండో దశకు నీరు విడుదల చేయడానికి సాగునీటి పారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 15వేల ఎకరాల పంటకు ఆఖరు తడికోసం నీటిని ఇవ్వాలన్న మంత్రి జూపల్లి సూచన మేరకు అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మూడు రోజులపాటు నీటిని విడుదల చేయనున్నారు. సమావేశంలో జూపల్లితో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఈ ఖదేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చిరకాలం గుర్తుండేలా కృష్ణాపుష్కరాలు
మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ : గోదావరి పుష్కరాలను మరిపించేలా కృష్ణాపుష్కరాలను నిర్వహించి చరిత్రలో గుర్తుండిపోయేలా చేస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు వెల్లడించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కృష్ణానదీ తీరం వెంట నూతనంగా నిర్మిస్తున్న పుష్కరఘాట్ల పనులను వారు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కొల్లాపూర్‌లోని కేఎల్ఐ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. రెండునెలల క్రితం ముఖ్యమంత్రి కే సీఆర్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించాలని సూచించినట్లు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గతంలో గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను చూసి ఏపీ ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి పుణ్యస్నానాలు చేశారని గుర్తుచేశారు. కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయడానికి 86 ఘాట్ల నిర్మాణానికి *212 కోట్లు, ఇతర ఏర్పాట్లకు *825 కోట్లు, కృష్ణాతీరంలోని దేవాలయాల ఆలంకరణ కోసం *4.50కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. జూలై 15 తేదీలోగా ఘాట్ల పనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించామని, పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిపారు. కొల్లాపూర్‌కు కళ తెస్తాం : జూపల్లి నల్లమల అంచున ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గానికి పర్యాటకంగా, ఆహ్లాదభరితంగా, ఆలయాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఇప్పటికే దేవాదాయ శాఖ, ఇతర శాఖల అధికారులకు సూచించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కనీవిని ఎరుగని రీతిలో కృష్ణాపుష్కరాలను నిర్వహిస్తామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుపై పక్కరాష్ట్రం నాయకులు చేస్తున్న విమర్శలకు ఇక్కడి నాయకులు వంత పాడడం సరికాదని, ఉద్యమ స్ఫూర్తితో సీఎం.కేసీఆర్ అభివృద్ధి పనులు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. వచ్చే 3 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో జరగనంత అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీపీలు నిరంజన్‌రావు, వెంకటేశ్వర్రావు, జెడ్పీటీసీ హన్మంతునాయక్, సింగిల్‌విండో చెర్మైన్ జూపల్లి రఘుపతిరావ్, నాయకులు జూపల్లి రామారావు, సిబ్బది నర్సింహారావు పాల్గొన్నారు.