సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండటంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండగా.. మరోవైపు వారి చేరికకు ముందే చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి.
త్వరలో ఇరువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారు వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్‌లో అంతర్గత పోరు తప్పదన్న సంకేతాలను చూపుతోంది. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో కొల్లాపూర్ వేదికగా నిర్వహించేందుకు తలపెట్టిన ‘పాలమూరు ప్రజాభేరి’ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం ఇరువర్గాలుగా నేతలు తమ బలప్రదర్శనను చాటేందుకు సిద్ధమవుతున్నారు.
కొత్త, పాత నేతలు సర్దుకుంటారా..!
కాంగ్రెస్‌లోకి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పార్టీ టికెట్ కోసం అంతర్గత పోరు తప్పేలా కనిపించడం లేదు. జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతుండగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ నేత చింతలపల్లి జగదీశ్వర్‌రావు భారీ ర్యాలీతో బలప్రదర్శన చేపట్టారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాల ని పిలుపునిచ్చారు.
ఏళ్లుగా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల నిర్వహణ, సభ్యత్వాలను పెంచి పార్టీ బలాన్ని పెంచానని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీలో ఉండటం ఖాయమని ప్రకటించడంతో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న జూపల్లికి పార్టీలో అంతర్గత పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉన్న తరుణంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన కేడర్‌లో నెలకొంది.
సర్వేల చుట్టూ రాజకీయాలు..
నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కాగా.. వచ్చే ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని నాగం చెబుతున్నారు.
పార్టీలో అంతర్గత పోరును కట్టడి చేసేందు కు సర్వేల ద్వారా టికెట్లను ఖరారు చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్వే మొదలైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అ యితే సర్వేలతో పనిలేకుండా ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి అవకాశం ఇవ్వాలని నాగం, జగదీశ్వర్‌రావులు డిమాండ్ చేస్తున్నారు.
సమీకరణాలపై ఉత్కంఠ..
రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోకి నేతల చేరికలతోపాటు పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వారి చేరికకు ముందే కొత్త, పాత నేతల మధ్య వైరం పెరుగుతుండటం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన సమావేశానికి హాజరైన నాగం జనార్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కకుండా చేస్తే వారిని ఓడిస్తామనే సంకేతాలు ఇచ్చారు.
అవసరమైతే ఇందుకోసం వ్యతిరేకులను అంతా ఏకం చేసే యోచనలో సైతం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో టికెట్ కోసం ఇరువర్గాల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు, వారి పట్టింపుల నడుమ చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పార్టీ ఆదేశించిన విధంగా కొత్త, పాత నేతలు నడుచుకుంటారా.. అంతర్గత కుమ్ములాటలు ఎటువైపు దారితీస్తాయోనన్నది ఉత్కంఠగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment