telangana politics
-
పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు–నిధులు–నియామకాల గురించి పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘పదేళ్లుగా అమరుల ఆత్మ క్షోభిస్తూనే ఉంది. ఉద్యమ ఆకాంక్షలు సాకారం కాలేదనే అశాంతి, ఆగ్రహం ఉద్యమకారులను కలచి వేస్తూనే ఉంది’అని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో తమ బతుకులు పెనం మీద ఉంటే.. కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో జారిపడ్డట్లయిందని రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్నారు.‘గతపదేళ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు పేరుతో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. బీఆర్ఎస్ పాలకులను గద్దె దించి పదేళ్ల పీడ విరగడైందని సంతోషిద్దామంటే.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది’అని సంజయ్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ 6 నెలల పాలనలోనే 6 గ్యారంటీలుసహా ఇతర ఎన్నికల హామీలను తుంగలో తొక్కింది. వేల కోట్ల అవినీతికి పాల్పడుతోంది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, వడ్ల టెండర్లు సహా ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుంది. తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది’అని ధ్వజమెత్తారు. అందుకే ప్రజల పక్షాన, అమరుల ఆశయాల కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమైందన్నారు. -
హామీలు మరిస్తే ఉద్యమిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదివారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర, పార్లమెంట్లో ‘చిన్నమ్మ’సుష్మా స్వరాజ్ చేసిన కృషిని నేతలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సుష్మా స్వరాజ్ చిత్రపటం వద్ద పుష్పగుచ్ఛాలుంచిæ పార్టీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకపోతే తెలంగాణ పోరాటం తరహాలోనే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్‌రెడ్డి గ్యారంటీలను అమలు చేయకపోతే ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని, వచ్చే ఐదేళ్లు ఆయనకు కష్టమేనని వ్యాఖ్యానించారు. ‘సోనియా గాంధీ బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆమెకే భక్తుడు అయ్యాడు. మాజీ సీఎం కేసీఆర్ విధానాలనే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఉచితాలు, గ్యారంటీలు ఓట్లు దండుకోవడం కోసమే. వివాదాలు సృష్టించి కాలం గడపాలని అనుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా కాదు. తెలంగాణ సమాజం తెచ్చుకుంది. గత ప్రభుత్వం చేసిన దురాగతాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. దోచు కోవడం కోసం రాజీపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు’అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అనుభవి స్తోందని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ‘యూపీఏ ప్రభుత్వం కళ్లు తెరవాలని శ్రీకాంతాచారితో మొద లు పెడితే ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నా రు. 1,200 మంది అమరులయ్యారు. వారి బలిదానాల తోనే తెలంగాణ వచ్చింది’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, ఎంపీ బీబీపాటిల్, పార్టీనేతలు కాసం వెంకటేశ్వర్లు, మనోహర్‌రెడ్డి, శిల్పారెడ్డి, ప్రేంసింగ్‌రాథోడ్, ఎన్విసుభాష్, పీఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 1969 ఉద్యమకారులకు బీజేపీ సన్మానం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారిని బీజేపీ నేత డా.కె.లక్ష్మణ్ శాలు వాలతో సన్మానించారు. మాజీ మంత్రులు మేచినేని కిషన్‌రావు, మర్రి శశిధర్ రెడ్డి, అలాగే యాదగిరి గౌడ్ తదితరులు సన్మానం అందుకున్నవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారిని గుర్తించి గౌరవించాలని ఉద్యమ కారులు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి మోదీ నాయకత్వంలో బీజేపీ పనిచేస్తుందని చెప్పారు. మేచినేని కిషన్‌రావు మాట్లాడుతూ.. ‘బీజేపీ చొరవ వల్ల తెలంగాణ సిద్ధించింది. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఉద్యమకారులుగా తీర్మానం చేశాం. ఈ రోజు నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాదు. వంద ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయాలి’అని అన్నారు. -
తెలంగాణలో పోటాపోటీ!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వెలువడుతున్న వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు భిన్నంగా, జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య తెలంగాణలో పోటాపోటీ వాతావరణం ఏర్పడేట్టు కనిపిస్తోంది. ఈ రెండుపార్టీలు నువ్వా, నేనా అన్నంత స్థాయిలో పోటీపడినట్టుగా ఆయా సంస్థల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లకు గాను.. బీజేపీ అధిక ఎంపీ సీట్లలో గెలుస్తుందని కొన్ని సంస్థలు అంచనా వేస్తే.. అదేస్థాయిలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ మరికొన్ని సంస్థలు లెక్క వేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నేసి గెలుస్తాయంటే.. ఇండియాటుడే– యాక్సిస్ మై ఇండియా ఏకంగా బీజేపీ 11–12 సీట్లలో, జన్‌కీబాత్ 9–12 సీట్లలో బీజేపీ గెలుపొందుతుందనిఎగ్జిట్పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. బీజేపీ అధిక సీట్లు సాధిస్తుందని ఆరా(08–09), ఇండియాటీవీ–సీఎన్ఎక్స్ (08–10), న్యూస్ 18 సంస్థ (07–10) అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అవకాశాలపై చాణక్య స్ట్రాటజీ సంస్థ 09–10,, ఏబీసీ–సీ ఓటర్ 07–09, పీపుల్స్ పల్స్ 07–09, ఆరా 07–08 స్థానాలు లెక్కన సర్వే ఫలితాలు వెల్లడించాయి. మొత్తంగా వివిధ సంస్థల అంచనాల్లో...కొంచెం అటూ ఇటుగా బీజేపీ, కాంగ్రెస్‌లకు దాదాపు సగం సీట్ల మేర గెలుచుకోవచ్చనే విధంగా ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఇమేజీ ప్రభావంతో బీజేపీకి మంచి ఫలితాలు సాధిస్తుందనే అంచనాలు వెలువడ్డాయి. ఇక అన్ని సంస్థల ఎగ్జిట్‌పోల్స్ బీఆర్ఎస్కు నిరాశాజనక ఫలితాలే రాబోతున్నట్టుగా అంచనా వేస్తున్నాయి. దాదాపుగా అన్ని మెజారిటీ సర్వే సంస్థలు హైదరాబాద్ ఎంపీ సీటును ఎంఐఎం నిలుపుకుంటుందని పేర్కొనడం గమనార్హం. -
ఏపీ సీఎంగా రెండోసారీ వైఎస్ జగనే
డిచ్పల్లి (నిజామాబాద్ రూరల్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోసారి పదవి చేపట్టడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్దపూర్ శివారులోని హోటల్ కృష్ణలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలోని తన స్నేహితులు, బంధువుల నుంచి అందిన సమాచారం మేరకు జగన్ మళ్లీ సీఎం అవుతారని, ఎగ్జిట్ పోల్స్ కూడా అవే చెబుతున్నాయన్నారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కనివినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ గల్లంతు.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదని, జూన్ 4న ఫలితాల తర్వాత తెలంగాణలో ఆ పార్టీ అడ్రస్ గల్లంతు కానుందని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో నిజామాబాద్‌తో పాటు కాంగ్రెస్ 13 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ ఎంపీగా కవితను గెలిపిస్తే లిక్కర్ దందాతో ఢిల్లీలో తెలంగాణ పరువు తీసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15 నాటికి రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. రాష్ట్ర చిహ్నం, గీతంపై ఎలాంటి వివాదం లేదని, దీనిపై పనిలేని వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారని కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలుకు వెళ్తారనేది త్వరలోనే తెలుస్తుందన్నారు. -
కాంగ్రెస్ పాలనతో మళ్లీ చీకట్లు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2014కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు ధ్వజమెత్తారు. తె లంగాణలో ఇప్పుడు కరెంటు కో తలు, చీకట్లు నిత్యకృత్యమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, విద్యుత్ కోతల సమస్యలను ప్రస్తావిస్తూ ‘ఎక్స్’లో కేటీఆర్‌కు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో కరెంట్ కోతలే లేవంటూ ప్రకటిస్తున్న డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ట్యాగ్ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను కేటీఆర్ శనివారం రీట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని వివరించారు. ‘విద్యుత్ కోతలే లేకుండా పవర్ సెక్టార్లో బీఆర్ఎస్ సృష్టించిన మౌలిక సదుపాయాలను కూడా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్ సర్కార్ ఉంది. 2014కు ముందు తరచూ విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్ మనకు ఉండేవి. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిన ఘనత కేసీఆర్ సర్కార్‌ది. 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేయటం కారణంగా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ పనికిమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పదేళ్ల క్రితం నాటి పాత రోజులను తిరిగి తీసుకొచ్చింది’అని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ కోతలు లేకుండా కేసీఆర్ చేసిందేమిటని కొంతమంది అడుగుతున్నారని...వాళ్లకోసం కొన్ని వివరాలు వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ‘1,110గా ఉన్న తలసరి వినియోగం 2,110 యూనిట్లకు చేరిక. సౌర విద్యుత్ సామర్థ్యం 71 మెగావాట్ల నుంచి 5,000+ మెగావాట్లకు పెంపు. తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్ల నుంచి 18,000 మెగావాట్ల చేరిక. ట్రాన్స్మిషన్ సామర్థ్యం 13,900 మెగావాట్ల నుంచి 37,000 మెగావాట్ల వరకు పెంపు. కేసీఆర్ గారి పాలనలో పవర్ హాలిడేస్ అనే మాటే లేదు’అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెటిజన్లు కాంగ్రెస్ సర్కార్‌ను తిడుతూ పెట్టిన కామెంట్లను కేటీఆర్ రీపోస్ట్ చేశారు. అమరుల స్తూపానికి ఇనుప కంచె..కేటీఆర్ ఎద్దేవా గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద ఇనుప కంచెతో బ్యారికేడ్ ఏర్పాటు చేయడంపై కేటీఆర్ ‘ఎక్స్’వేదికగా స్పందించారు. ‘మార్పు వచ్చింది’అనే శీర్షికతో ‘ఇందిరమ్మ పాలనలోని ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు తెచ్చేలా అమరుల స్థూపానికి కూడా ఇనుప కంచెలు తెచ్చింది’అంటూ కంచె ఏర్పాటు చేసిన ఫొటోను ట్యాగ్ చేశారు. ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధంలేకుండా ఫలితాలు: కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేకుండా ఫలితాల్లో ఎగ్జాక్ట్ పోల్స్ వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. అమరజ్యోతి వద్ద నివా ళులు అర్పించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. జీవితంలో ఒక్కసారి కూడా జై తెలంగాణ అనని, అమరులకు నివాళులు అర్పించని వ్యక్తి తెలంగాణకు సీఎంగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోరాటాలను, అమరుల త్యాగాన్ని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులను చంపినది, బలిదానాలకు కారణమైనదే కాంగ్రెస్ అని మండిపడ్డారు. -
అమరులకు కేసీఆర్ నివాళి
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చేపట్టిన తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో.. తొలిరోజున సాయంత్రం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కొవ్వొత్తితో అమరజ్యోతిని వెలిగించి అమరులకు నివాళి అర్పించారు. అనంతరం అమర జ్యోతుల (కొవ్వొత్తుల) ర్యాలీని కేసీఆర్ ప్రారంభించారు. వెయ్యి మందికిపైగా తెలంగాణ కవులు, కళాకారులు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందినవారితోపాటు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో సుమారు రెండు గంటల పాటు ర్యాలీ కొనసాగింది. అమరులకు నివాళి అర్పిస్తూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు. రవీంద్రభారతి, ఆర్బీఐ మీదుగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు ర్యాలీ కొనసాగింది. అక్కడ ‘జోహారులు.. జోహారులు.. అమరులకు జోహారులు.. వీరులకు జోహారులు’అంటూ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి అందరూ అమరులకు నివాళి అర్పించారు. నేడు తెలంగాణ భవన్లో వేడుకలు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వేడుకలు జరగనున్నాయి. ఉదయం 9.30కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ జెండాతోపాటు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ‘తెలంగాణ యాది’పేరిట ఉద్యమ జ్ఞాపకాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. తర్వాత తెలంగాణ భవన్ పక్కనే ఉన్న కళింగ భవన్లో పార్టీ నేతలతో కలిసి భోజనం చేస్తారు. ప్రజల భాగస్వామ్యంతోనే తెలంగాణ: కేసీఆర్ ప్రజాస్వామిక వాతావరణంలో, పార్లమెంటరీ పంథాలో బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వ రాజకీయ వేదికగా ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ సాధించుకున్నామని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో పటిష్ట పర్చుకుంటూ సమర్థవంతంగా పాలన అందించిన గత పదేళ్లలో.. అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. అమరుల త్యాగాలను వృధాపోనీయకుండా.. గత పదేళ్ల ప్రగతిని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని ఆకాంక్షించారు. -
‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. మిల్లుల్లో నిల్వ ఉన్న 35 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం సేకరణ పేరుతో రూ.700 కోట్ల నుంచి రూ.750 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో రూ.300 కోట్లు..మొత్తం రూ.1,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో బి–టాక్స్, యు–ట్యాక్స్, ఆర్ఆర్– ట్యాక్స్ రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పార్టీ నేతలు శంభీపూర్ రాజు, పెద్ది సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మాట్లాడారు. 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022–23 యాసంగిలో రైతుల నుంచి సేకరించి మిల్లర్ల దగ్గర నిల్వ ఉంచిన 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని విక్రయించేందుకు మూడు నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ల కహానీకి తెరలేపింది. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25న కమిటీ వేసి, మార్గదర్శకాలు జారీ చేశారు. క్వింటాలుకు రూ.2,100 చొప్పున కొనుగోలు చేయానికి రైస్ మిల్లర్లు ముందుకు వచ్చినప్పటికీ తిరస్కరించి గ్లోబల్ టెండర్లు పిలిచారు. ప్రత్యేక నిబంధనలతో కేవలం 4 కంపెనీలకే టెండర్లు వచ్చేలా చేశారు. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందూస్తాన్ కంపెనీ, నాకాఫ్ అనే నాలుగు సంస్థలు బిడ్లను దక్కించుకున్నాయి. గురుకులాల్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత సరిగ్గా పనిచేయనందుకు కేంద్రీయ భండార్ అనే సంస్థను 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ కోసం నిబంధనలు సడలించింది..’అని కేటీఆర్ విమర్శించారు. టెండర్ మొత్తానికంటే అదనంగా వసూళ్లు ‘మిల్లర్లు క్వింటాలు రూ.2,100కు కొంటామన్నప్పటికీ సగటున రూ.200 తగ్గించి రూ.1,885– రూ.2,007 మధ్య ఆ 4 సంస్థలు కొనేలా ఒప్పందం చేశారు. టెండర్ మార్గదర్శకాల ప్రకారం 90 రోజుల్లో 35 ఎల్ఎంటీల ధాన్యాన్ని తీసుకుని ప్రభుత్వానికి రూ.7,500 కోట్లు చెల్లించాలి. మిల్లర్లతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకూడదు. కానీ మిల్లర్లతో ఆయా సంస్థలు నేరుగా ఆర్థిక లావాదేవీలు చేస్తూ మనీలాండరింగ్‌కు పాల్పడ్డాయి. గోదాముల్లోని ధాన్యాన్ని తీసుకుపోకుండా రైస్ మిల్లర్లపై బెదిరింపులకు పాల్పడ్డాయి. టెండర్లు వేసిన మొత్తానికి కాకుండా అదనంగా చెల్లించాలంటూ రాష్ట్రంలోని 4 వేల మంది రైస్ మిల్లర్లను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ‘సీఎం పేషీకి ఖర్చయ్యింది.. ఢిల్లీకి పోవాలి.. పార్లమెంటు ఎన్నికలు’అంటూ క్వింటాలుకు రూ.150 నుంచి రూ.236 అదనంగా చెల్లించి తీరాలని ఒత్తిడి చేస్తున్నారు. క్వింటాలుకు రూ.236 ఎక్కువగా ఇస్తే ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు క్లియరెన్స్ ఇస్తామంటూ బంపరాఫర్ కూడా ఇచ్చారు. ఈ మేరకు జలసౌధలో అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దాదాపు 35 ఎల్ఎంటీలకు గాను కింటాలుకు రూ.200 చొప్పున రూ.700 కోట్ల అదనపు డబ్బు మనీలాండరింగ్ ద్వారా మిల్లర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. మరోవైపు ధాన్యం లిఫ్ట్ చేసేందుకు గడువు ఈ నెల 23తో అయిపోయింది. ఇప్పటికీ 20 శాతం కూడా లిఫ్ట్ చేయలేదు. నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి.. బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. కానీ తమకు రావాల్సిన రూ.700 కోట్లు మొత్తం వాళ్ల చేతికి రాలేదు కాబట్టి ఈ డెడ్‌లైన్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు..’అని కేటీఆర్ ఆరోపించారు. సన్న బియ్యం పేరిట మరో స్కాం ‘రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకానికి 2.20 ఎల్ఎంటీల సన్న బియ్యం కావాలి. వీటి కోసం కూడా పౌరసరఫరాల శాఖ గ్లోబల్ టెండర్ పిలిచింది. ఇందులో కూడా అవే నాలుగు కంపెనీలు పాల్గొన్నాయి. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధర కిలో రూ.42–45 ఉంది. కానీ బహిరంగ మార్కెట్, మిల్లర్లను పక్కనబెట్టి టెండర్ల పిలిచారు. కిలోకు రూ.15 అదనంగా అంటే రూ.57కు టెండర్ ఖరారు చేశారు. 2.20 ఎల్ఎంటీలకు కిలోకు అదనంగా రూ.15 చొప్పున రూ.300 కోట్ల స్కామ్ జరిగింది. ఇలా మొత్తంగా రూ.1,000–1,100 కోట్ల స్కామ్ జరిగింది..’అపి కేటీఆర్ వివరించారు. ‘మా ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన దాంట్లో 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం ఉంది. దాన్ని మిల్లింగ్ చేసి విద్యాశాఖకు ఇస్తే.. కేవలం 60 వేల టన్నులే కొనాల్సి వచ్చేది. కానీ 1.6 ఎల్ఎంటీల సన్న ధాన్యం కిలో రూ.22.59 పైసలకు అమ్మేశారు..’అని విమర్శించారు. -
పట్టభద్రుల పట్టమెవరికి ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో 52 మంది ఉన్నా, ప్రధానపోటీ మాత్రం ముగ్గురి మధ్యే నెలకొంది. ఈ ఎన్నికలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పారీ్టలతోపాటు కొందరు స్వతంత్రులు పెద్దఎత్తున ప్రచారం చేశారు.సోమవారం పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్ కాల్స్ ద్వారా ఆయా పారీ్టల అధినేతలతోపాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు. మిగతా గుర్తింపు పొందిన పారీ్టలతోపాటు స్వతంత్రులు పోటీలో ఉన్నా, ప్రధాన పారీ్టలకు పోటీగా ప్రచారం చేయలేకపోయారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందంటూ కాంగ్రెస్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్ అధికారంలోకి వచి్చనా, నియామకాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని, నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని, ఉద్యోగులది అదే పరిస్థితి అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆరు గ్యారంటీలు అమలు చేయడంతోపాటు ఎన్నికల తర్వాత పాలనలో పారదర్శకత, ఉద్యోగ కల్పన, జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతోంది. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, తమ పార్టీ అభ్యరి్థని గెలిపించడం ద్వారా ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతూ ప్రజల్లోకి వెళ్లింది. కాంగ్రెస్ మోసం చేసిందంటున్న బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జాబ్ క్యాలెండర్ లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చేయలేదని, తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఉద్యోగాలను తాము భర్తీ చేశామని కాంగ్రెస్ చెబుతూ మోసం చేస్తోందని ఆరోపిస్తోంది.ఉద్యోగాలకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందో ఎప్పుడు పరీక్షలు పెట్టిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఎన్నికలో పట్టుభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అభ్యరి్థని గెలిపిస్తే పెద్దలసభలో ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల కల్పనకు జాబ్‌క్యాలెండర్ ప్రకటించేలా ఒత్తిడి తెస్తామని, పోరాడే పారీ్టకి పట్టం కట్టాలంటూ పట్టభద్రులకు బీఆర్ఎస్ విజ్ఞప్తి చేస్తోంది.రెండూ మోసకారి పార్టీలే అంటున్న బీజేపీకాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసకారి పారీ్టలేనని, వాటి వల్ల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని విస్మరించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని, ఆరు గ్యారంటీలతోపాటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే అధికంగా అబద్ధాలు చెబుతూ మోసం చేస్తోందని బీజేపీ అంటోంది.నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాల నియామకంలో బీఆర్ఎస్ విఫలం కాగా, కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్ ఇవ్వకుండా, పరీక్షలు నిర్వహించకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధపు మాటలతో ప్రజలు, పట్టభద్రులను మోసం చేస్తోందని ప్రచారంలో ఆరోపణలు గుప్పిచింది. ఇలాంటి పారీ్టలకు బుద్ధిచెప్పి బీజేపీకి మద్దతు ఇస్తే నిరుద్యోగుల తరఫున పోరాడుతామని పట్టభద్రులకు బీజేపీ విజ్ఞప్తి చేసింది. మొత్తానికి త్రిముఖ పోటీలో పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారో మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగంలో గత పదేళ్లలో 2.36 లక్షల ఉద్యోగాలు తెలంగాణ మినహా దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ రుజువు చేస్తే తెల్లారే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తమ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 26.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి వేయి చొప్పున కేవలం 10 వేల పోస్టులు భర్తీ చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కంటే 19 రెట్లు ఉద్యోగాలిచి్చనా ప్రజలకు చెప్పుకోలేకపోవడం తనతో సహా తమ పార్టీ నేతల వైఫల్యం అని చెప్పారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సోషల్ మీడియా ద్వారా తెలంగాణ యువత మెదడు నిండా అబద్ధాలను నింపి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 వేల ఉద్యోగాలు ఇచి్చనట్లు ఊదరగొడుతూ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతోంది. ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా? సీఎం స్థాయిలో రేవంత్ ప్రజలకు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు చూస్తే బాధ అనిపిస్తోంది’అని కేటీఆర్ అన్నారు. 95 శాతం రిజర్వేషన్ల ఘనత కేసీఆర్‌దే.. ‘రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన, నాన్ లోకల్ కేటగిరీ పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంతో అటెండర్ నుంచి గ్రూప్–1 దాకా స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్‌దే. పదేళ్లలో 2.32 లక్షల ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చాం. అందులో 2.02 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1.60 లక్షల పోస్టులు భర్తీ చేశాం. మరో 42,652 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి.విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు ఇది అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన 32,517 ఉద్యోగాలను రేవంత్ దుర్మార్గంగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గ్రూప్–1, డీఎస్సీ నోటిఫికేషన్లు రద్దు చేసి పోస్టులు పెంచకుండానే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. సీఎం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌కు అతీగతి లేదు. నిరుద్యోగ భృతి అంటూ ప్రియాంక గాంధీ నోట కూడా అబద్ధాలు చెప్పించారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ‘బ్రూ’ట్యాక్స్ మొదలైంది ‘రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. భట్టి, రేవంత్, ఉత్తమ్ ఎవరి దుకాణం వాళ్లదే అన్నట్లు మొత్తంగా ‘బ్రూ (బీఆర్‌యూ)’ట్యాక్స్ మొదలైంది. బిల్డర్ల పైనా కూడా ట్యాక్స్ వేస్తూ దోచుకుంటున్నారు. త్వరలో జూపల్లి కృష్ణారావు కూడా కొత్త దుకాణం స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు సామంత రాజులు ట్యాక్స్‌లు వసూలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి మూర్ఖుడు, జోకర్లా తయారయ్యాడు. ప్రైవేటు సెక్టార్లో కష్టపడి తెచ్చిన పరిశ్రమలకు కూడా రేవంత్ పాతర వేస్తున్నారు.5 లక్షల ఉద్యోగాలు వచ్చే ఫార్మాసిటీని రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తారట. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో 15 వేల ఉద్యోగాల కల్పనకు ముందుకు వచి్చన కేన్స్ టెక్నాలజీ వెళ్లిపోయింది. రూ.వేయి కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపిన కేన్స్ గుజరాత్‌కు వెళ్లింది. వరంగల్ నుంచి టెక్ మహీంద్రా అనే సంస్థ వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది’అని కేటీఆర్ అన్నారు. వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడే పార్టీ బీఆర్ఎస్ సాక్షి, హైదరాబాద్: కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే పార్టీ బీఆర్ఎస్ అని, మీరంతా కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు శనివారం తెలంగాణ భవన్లో ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ మదిలో నుంచి పుట్టిందని చెప్పారు.బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని, ప్రమాదంలో మృతి చెందిన వారి కుంటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా మొత్తాన్ని అందిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 5,522 మందికి రూ.118 కోట్లకుపైగా బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం వెచి్చంచామన్నారు. అధికారంలో లేనంత మాత్రన పార్టీ చేసే కార్యక్రమాలేవీ ఆగవని, భవిష్యత్‌లో కూడా కొనసాగుతాయని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని కేటీఆర్ సూచించారు. -
హైదరాబాద్‌పై బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్, బీజేపీలది రాజకీయం.. కానీ కేసీఆర్‌ది తెలంగాణతో పేగుబంధం. పోరాటాలు చేసి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. ఇవ్వాళ బీజేపీ కొత్త కుట్ర చేస్తోంది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తరట.. హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటదా.. తల లేని మొండెం అయిపోతాం మనం. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కలిసి హైదరాబాద్‌ను యూటీ చేయాలని లేదా మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలని కుట్రలకు తెరతీస్తున్నారు.తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ను కాపాడుకునే బాధ్యత మీపై ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించండి’అని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బోనకల్లో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన మాట్లా డారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతుండగా, ఇప్ప టి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను మరో పదేళ్లు కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.రైతులను ఆ మంత్రి కుక్కలతో పోలుస్తారా? సత్తుపల్లిలో సమావేశం అనంతరం తల్లాడ మండలం నూతనకల్‌లో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులతో హరీశ్‌రావు మాట్లాడారు. వర్షాలు పడినా జీలుగు విత్తనాలు ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మి చెక్కులు రాలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సన్న ధాన్యంతోపాటు దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ‘వడ్లకు బోనస్ ఇవ్వమంటే ఇవన్నీ వ్యవసాయం తెలియని వారి మాటలని.. రైతులు మొరుగుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి అనడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయ శాఖ మంత్రి కుక్కలతో పోలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఓటు వృథా చేసుకోవద్దు జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆలోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా విత్తనాలు అందడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో మండల వ్యవసాయ శాఖా« దికారులతో మాట్లాడారు. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ మాట్లాడు తూ పట్టభద్రులు తమ ఓటును వృథా చేసుకోవద్దని కోరారు.సమావేశంలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిమ్స్ ఆసుపత్రులపై కాంగ్రెస్‌ది రాజకీయం: హరీశ్ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఐదు నెలలుగా నిర్మాణ పనుల పర్యవేక్షణను గాలికి వదిలిన మంత్రి కోమటిరెడ్డి.. గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. -
కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా!: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘రాష్ట్రంలో ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు..మోటార్లు, ఆస్పత్రుల్లో గంటల తరబడి కరెంటు కోతలు, ఎండుతున్న చెరువులు.. ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు? ఒక్కసారి ఆలోచించి వారికి ఇప్పటికైనా తగిన బుద్ధి చెప్పాలి..’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్‌తో సహా అందరం ప్రతి నియోజకవర్గంలో పర్యటించాం. మోసపోతే గోసపడుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపితే నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారు. డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. కేసీఆర్ లక్ష మాఫీ చేసిన వారికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేస్తారో వేయాలి..’అని అన్నారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఓ మెజీషియన్.. పచ్చి అబద్ధాలకోరు. తెలంగాణ ప్రజలను ఇంకా నమ్మించాలని చూస్తున్నాడు..’అని ధ్వజమెత్తారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నర్సంపేట, వరంగల్, హనుమకొండలలో నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్ ప్రసంగించారు. రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈస్ట్‌మన్ కలర్ సినిమా చూపించారు. కానీ రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం నాటి ఘటనే ఉదాహరణ. ఎంజీఎం లాంటి పెద్ద ఆస్పత్రిలో 5 గంటలు కరెంట్ పోవడం దారుణం కాదా? ఆరు నెలల క్రితం వ్యవసాయం ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? రుణమాఫీ జరిగిందా? కౌలు రైతులకు, రైతు కూలీలకు సాయం అందిందా? వంద రోజుల్లోనే చేసేస్తామన్న హామీలు ఏమయ్యాయి? రూ.2500 వచ్చినయా? ఏడాదిలో రూ.2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏదీ చేయలేదు. నాట్లు వేసే నాడు వేయాల్సిన రైతుబంధు..ఓట్లు వేసే నాడు రేవంత్‌రెడ్డికి గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశానని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో అన్ని హామీలు ఆమలు చేస్తున్నట్లు రాహుల్‌గాం«దీ, ప్రియాంక గాం«దీలు కూడా ఇతర రాష్ట్రాల్లో అబద్ధాలు చెబుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్ల ప్రగతి చెప్పుకోవడంలో విఫలమయ్యాం ‘గత పదేళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. కానీ మనం చేసిన మంచి పనులను చెప్పుకోవటంలో విఫలమయ్యాం. యూట్యూబ్‌లలో మనపై తప్పుడు ప్రచారాలు చేశారు. దీని కారణంగానే 1.8 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో మనం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు అవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని గెలిపించి కాంగ్రెస్‌కు తగ్గిన బుద్ధి చెప్పాలి..’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమావేశాల్లో రాకేశ్‌రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీలు డా.బండా ప్రకా‹Ù, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనచారి, ఎమ్మెల్యేలు డా.సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మానవత్వాన్ని చాటిన కేటీఆర్ గీసుకొండ: రోడ్డు పక్కన పడిపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, మాజీ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటారు. బుధవారం హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళుతుండగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు సమీపంలో అంజయ్య అనే వ్యక్తి మోపెడ్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనపడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. విషయం గమనించిన కేటీఆర్ కారు ఆపి అతన్ని పరిశీలించారు. వెంటనే గన్మెన్ల సాయంతో తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నర్సంపేటకు వెళ్లారు. ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు – పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు – కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు – ‘ఎక్స్’లో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టళ్లు ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. ‘కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లతో పాటు మళ్లీ ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నాం. బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులతో క్యూలు కడుతున్నారు. అయినా కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..’అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
నల్లగొండ టూటౌన్/ మిర్యాలగూడ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ రేవంత్‌రెడ్డి సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలను ప్రజలు నమ్మారని, కానీ ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల అపఖ్యాతిని మూటగట్టుకుందని విమర్శించారు. మంగళవారం నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియాల లో నిర్వహించిన వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సన్నాహక సమా వేశాల్లో కేటీఆర్ మాట్లాడారు.‘‘కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీ, రైతుభరోసా, నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాలు, మహిళలకు నెలకు రూ.2,500, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అని అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేసింది. డిసెంబర్ 9 నాటికి రైతుబంధు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి.. మే వచి్చనా సొమ్ము వేయలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు ఎండిపోతే కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదు. అన్నదాతలు ఆగమవుతున్నారు. సాగర్ ప్రాజెక్టును కేఆర్ఎంబీకి అప్పజెప్పిన దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్లు. రేవంత్ పాలనలో అంతా మోసమే..’’అని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపిస్తే నమ్మి కాంగ్రెస్‌ను గెలిపించారని.. ఇప్పుడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ మోసపోవద్దని పేర్కొన్నారు. మొదటిసారి మోసపోతే కాంగ్రెస్ మాయ అనుకుందామని.. అదే రెండోసారి మోసపోతే మన తప్పే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మెయిలర్.. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం వచి్చన గోల్డ్ మెడ లిస్ట్ కావాలో.. బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజే గోల్డ్ స్నాచర్ కావాలో పట్టభద్రులు తేల్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. దీనిపై మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆలోచన చేయాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలిస్తే.. మండలిలో పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. -
‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’పట్టభద్రుల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్లలో పట్టు సాధించేందుకు విస్తృతంగా ప్రచారం సాగిస్తోంది. ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక వ్యూహాన్ని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు.అందుకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇప్పటికే పట్టభద్రుల నియోజకవర్గం విస్తరించి ఉన్న జిల్లాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ప్రచారం చేసిన కేటీఆర్ బుధవారం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఈ నెల 25న ముగియనుండటంతో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనే ఆయన ప్రచారం కొనసాగుతోంది. మరోవైపు మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ నెల 23 నుంచి రెండు రోజుల పాటు పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక నాగర్‌కర్నూలు నుంచి బీఆర్ఎస్ తరపున లోక్‌సభ అభ్యరి్థగా పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఓటరునూ కలిసి.. శాసన మండలి ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ స్థానం నుంచి బీఆర్ఎస్ వరుసగా నాలుగు పర్యాయాలు గెలవడంతో ప్రస్తుత ఉప ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల ప్రచార గడువు, పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయానికి బీఆర్ఎస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలకు సమన్వయ బాధ్యతలు అప్పగించింది.మండలాల వారీగా పట్టభద్రులు నియోజకవర్గం ఓటరు జాబితాను సమన్వయకర్తలకు అందజేసి, క్షేత్ర స్థాయిలో ప్రతీ ఓటరును పార్టీ కేడర్ కలిసేవిధంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలు, ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల జారీలో వైఫల్యం, పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి విద్యార్హతలు, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి తదితరాలను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతీ ఓటును ఒడిసి పట్టేందుకు మండల స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఓటరును ప్రత్యక్షంగా కలవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అసంతృప్త నేతలకు బుజ్జగింపు ఏనుగుల రాకేశ్‌రెడ్డి అభ్యరి్థత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలతో కేటీఆర్ స్వయంగా మాట్లాడి బుజ్జగిస్తున్నారు. ఈ ఉప ఎన్నికను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో విభేదాలు వీడి కలిసి పనిచేయాలని కోరుతున్నారు. త్వరలో ఏర్పాటయ్యే పార్టీ రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల్లో ప్రాధాన్యతను ఇస్తామని హామీ ఇస్తున్నారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యరి్థత్వం ఆశించిన వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మంగళవారం కేటీఆర్‌ను కలిశారు. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ సూచించారు. కేటీఆర్, హరీశ్ ప్రచార షెడ్యూలు ఇదే కేటీఆర్ ఈ నెల 22న ములుగు, నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశి్చమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. హరీశ్‌రావు ఈ నెల 23న భూపాలపల్లి, వర్దన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, 24న సత్తుపల్లి, వైరా, మధుర, పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. -
కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్
సాక్షి, హైదరాబాద్ /దేవరకొండ: ఎన్నికల హామీ లను వరుసగా తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లకు బోనస్ ఇవ్వడంలోనూ మాట తప్పిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిందన్నారు. అదే తరహాలో వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలోనూ కాంగ్రెస్ పచ్చి అబద్ధాలతో రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో భాగంగా హామీ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బోనస్ కోసం ఎదురుచూస్తుండగా కేవలం సన్న వడ్లకు మాత్రమే వచ్చే సీజన్ నుంచి బోనస్ ఇస్తామని మంత్రులు ప్రకటించడం బాధాకరం. రాష్ట్రంలో 90% మంది రైతులు దొడ్డు రకం వడ్లనే పండిస్తారు. పదిశాతం పండే సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. సన్న వడ్లకు ప్రభుత్వ మద్దతు ధర కంటే బహిరంగ మార్కెట్లో మంచి ధర వస్తుంది. కానీ దొడ్డు రకం ధాన్యానికే గిట్టుబాటు ధర రాదు. కేవలం సన్న రకాలకే బోనస్ ఇస్తాం.. అదీ వచ్చే సీజన్ నుంచి ఇస్తామనడం రైతులను దగా చేయడమే’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. 5నెలల్లోనే కుప్పకూలిన డయాగ్నొస్టిక్ వ్యవస్థతెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ల వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చిందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాల నిర్వహణ, సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంపై ‘ఎక్స్’లో హరీశ్ స్పందించారు. నాణ్యమైన వైద్య పరీక్ష లను అందించిన డయాగ్నస్టిక్ కేంద్రాలు ప్రస్తు తం నిర్వహణలోపంతో కొట్టుమిట్టాడుతున్నా యని చెప్పారు. బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవులకు ఝూటా హామీలు‘రాష్ట్రంలో బడి పంతుళ్లపై లాఠీలు.. బడుగు జీవు లకు ఝూటా హామీలు.. ఇది రేవంత్ పాలన’ అని హరీశ్‌రావు అన్నారు. మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి కనీలాల్ ఇటీవల మరణించారు. ఆయనకు నివాళి అర్పించడానికి హరీశ్ రావు దేవరకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, నిరుద్యోగులు ఆలోచించి త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. -
ప్రశ్నించే గొంతు మండలిలో ఉండాలి
ఖమ్మం సహకారనగర్/ఇల్లెందు/సూపర్‌బజార్ (కొత్తగూడెం): ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జాబ్ కేలండర్ ఇవ్వలేదు. రూ.400 ఉన్న టెట్ ఫీజు రూ.2 వేలు చేసింది. వీటిపై మండలిలో గళం విప్పి గర్జించాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డిని గెలిపించాలి’’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం, కొత్తగూడెం, ఇల్లెందులో వరంగల్, ఖమ్మం, నల్లగొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారసభలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనుగుల రాకేష్‌రెడ్డి గోల్డ్‌మెడలిస్ట్ అయితే కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్‌మెయిలర్ అని, 74 రోజులు జైలులో గడిపారని, అలాంటి వ్యక్తి పట్టభద్రుల ప్రతినిధి అవుతాడా అని ప్రశ్నించారు. విద్యావంతులు ఎన్నుకునే వ్యక్తి వారి తరఫున వకాల్తా పుచ్చుకుని వాదించాలన్నారు. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని కేటీఆర్ వివరించారు. రాష్ట్రంలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించా మని, 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని దేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చిఉంటే తాను ఎమ్మెల్యే పద వికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో వెనకబడి.. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవటంతో గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ మాయలో పడ్డారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో విజ్ఞులైన పట్టభద్రులు కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాల న్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోతే సింగరేణిని బీజేపీ, కాంగ్రెస్‌లు అదానీకి అమ్మేస్తాయని ఆరో పించారు. ఆయా సభల్లో ఎమ్మెల్సీ అభ్యర్థి ఏను గుల రాకేష్ రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు.. మంత్రివర్గ భేటీ నిర్వహణ కోసం పలు షరతులతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్ ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.అత్యవసరమైన అంశాలు మాత్రమే..లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు.. అత్యవసరమైన, నిర్ణీత గడువులోగా అమలు చేయాల్సిన అంశాలను మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించాలని ఈ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్న నేపథ్యంలో.. అప్పటి వరకు నిరీక్షించడం సాధ్యం కాని, అత్యవసరమైన అంశాలను మాత్రమే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చాలని పేర్కొంది. మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ప్రతిపాదించిన రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేసుకోవాలని సూచించింది. ఇక ఎన్నికల నిర్వహణలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారులెవరినీ సమావేశానికి హాజరుకావాలని కోరరాదని ఆదేశించింది.కాళేశ్వరం బ్యారేజీలకు రిపేర్లు, పంటల సాగుపై నిర్ణయాలు!వాస్తవానికి గత శనివారమే కేబినెట్ భేటీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈసీ అనుమతి కోరింది. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసుకుంది. సోమవారంలోగా ఈసీ అనుమతించకుంటే మంత్రులతో కలసి ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు కూడా. కానీ తాజాగా ఈసీ అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం అత్యవసర అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి అడ్డంకి తొలగిపోయింది. ఈ భేటీలో కాళేశ్వరం బ్యారేజీలకు అత్యవసర మరమ్మతులు, ధాన్యం కొనుగోళ్లు, వర్షాకాలం పంటల సాగు, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే
హనుమకొండ/భువనగిరి: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు ఒక్క తాను ముక్కలేనని, జెండాలే వేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబ ట్టారు. శనివారం హనుమకొండ, భువనగిరిలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హనుమకొండలో కేజీ టు పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపించగా, బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని విమర్శించారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి రింగ్‌రోడ్డును అమ్మిందని, ఐదు నెలల ముందు మద్యం టెండర్లు నిర్వహించిందని, హైదరాబాద్‌లో స్థలాలు అమ్మిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జీతాలు ఇవ్వడానికి తంటాలు పడుతోందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిపై ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌ను ప్రజలు అదరించారు తప్ప.. అభిమానంతో ఆ పార్టీకి ఓట్లు వేయలే దన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో జరిగిన నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశానికి కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాడతామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలను గెలుపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు ప్రస్తుతం కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని, అధికార గొంతులు, ధిక్కార స్వరాలు కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. ‘వరంగల్–ఖమ్మం–నల్లగొండ’ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నిక స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాల్సిందిగా ‘ఎక్స్’లో కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన ఏనుగుల రాకేశ్‌రెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఉన్నత విద్యను చదివాడన్నారు. ప్రజా సేవ లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాకేశ్‌రెడ్డి.. వాగ్ధాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని కలిగిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆర్థిక సంబంధమైన అంశాలపై రాకేశ్‌రెడ్డి పలు పుస్తకాలు కూడా రాశాడని కేటీఆర్ చెప్పారు. పోటీ పరీక్షలకు సన్నద్ధులయ్యే విద్యార్థులు, సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ, హనుమకొండలో మెగా జాబ్ మేళాలు నిర్వహించారన్నారు. విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యలు, హక్కులపై రాకేశ్‌రెడ్డి గళం విప్పారని తెలిపారు. ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్నందునే రాకేశ్‌రెడ్డిని శాసనమండలి పట్టభద్రుల కోటా ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దించినట్లు కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి..వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు భువనగిరి నియోజకవర్గంలోని సాయి ఫంక్షన్ హాల్లో జరిగే సమావేశంలో పాల్గొని అక్కడి ఓటర్లతో మాట్లాడనున్నారు. అలాగే మధ్యా హ్నం 12 గంటలకు ఆలేరు నియోజవర్గంలోని ఎమ్మడి నరసింహారెడ్డి గార్డెన్స్‌లో జరిగే సమావేశంలో పాల్గొని ఓటర్లు, నాయకులతో కేటీఆర్ సమావేశం అవుతారు. -
రేపే లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్.. అంతా రెడీ
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నాలుగో విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. 1717 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రతి పార్లమెంటులో సగటున 18 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 1.92 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 17.7 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు12.49 లక్షలు ఉండగా, 19.99 లక్షల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, ఒడిశాలో 25 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ప్రక్రియలో 19 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియలో 364 మంది అబ్జర్వర్లను నియమించారు. 1016 అంతర్రాష్ట్ర సరిహద్దులు, 121 అంతర్జాతీయ సరిహద్దులలో ఈసీ నిఘా ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాల వద్ద నీళ్లు, షెడ్, టాయిలెట్స్, ర్యాంప్స్ ఏర్పాటు చేశారు. -
నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్‌నగర్ వరకు భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్‌కర్నూల్‌కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత.. రాజీనామా లేఖతో హరీశ్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్‌రావు, సీఎం రేవంత్ మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్ల మాటల యుద్ధం సాగుతోంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రాజీనామా లేఖతో గన్‌పార్క్‌కు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. హరీష్‌రావు సవాల్‌తో పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్క్ వద్ద అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.దమ్ముంటే సీఎం రేవంత్ తన సవాల్ స్వీకరించాలి..గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన హరీష్ రావు.. మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఆయనకు రావడానికి మొహమాటంగా ఉంటే పీఏతోనైనా స్టాఫ్తోనైనా రాజీనామా లేఖను పంపించాలన్నారు. జర్నలిస్టుల సాక్షిగా.. మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానన్నారు.‘‘ఆగస్టు 15th లోగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు. రైతుల కోసం నా రాజీనామా నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు’’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గన్ పార్కు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హరీశ్‌రావుకు మద్దతు పలికారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ, రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. ఇప్పుడు ఆగస్టు 15 అంటూ మరోసారి ఎన్నికల స్టంట్ వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే హరీష్ రావు సవాల్‌ను స్వీకరించి ఇక్కడికి రావాలి. ఇవాళ కాకున్నా రేపైనా హరీష్ రావు సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని తలసాని డిమాండ్ చేశారు. -
నేడు బీజేపీ కీలక నేతల నామినేషన్లు.. అక్కడి అభ్యర్థిపై ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నేటితో నామినేషన్ట ఘట్టం ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి నలుగురు అభ్యర్థులు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి విషయంలో ఇంకా ట్విస్ట్ కొనసాగుతోంది. బీజేపీ హైకమాండ్ ప్రకటించిన అభ్యర్థికి ఇంకా బీఫామ్ ఇవ్వకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. కాగా, నేడు నిజామాబాద్, కరీంనగర్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి స్థానాలకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ధర్మపురి అరవింద్ నామినేషన్ వేయనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు. ఇక, కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బండి సంజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ పార్లమెంట్‌కు పోతుగంటి భరత్ నామినేషన్ వేయనున్నారు. ఈ రెండు కార్యక్రమాలకు గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ పెద్దపల్లి అభ్యర్థి విషయంలో సస్పెన్స్ నెలకొంది. అయితే ఇప్పటికే బీజేపీ గోమా శ్రీనివాస్‌ను తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఆయనకు బీఫాం ఇవ్వలేదు. మరోవైపు.. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత తాజాగా కిషన్‌రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా పెద్దపల్లి టికెట్ ఇస్తే పార్టీలో చేరతానని కిషన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అయితే పార్టీ హైకమాండ్‌తో మాట్లాడి చెప్తానని కిషన్ రెడ్డి అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిన వెంకటేష్.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. అయితే, కాంగ్రెస్ ఆయనకు కాకుండా గడ్డం వివేక్ కొడుకు వంశీకి టికెట్ ప్రకటించడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్‌లో ప్లాన్ మార్చిన మధు యాష్కీ.. వారిద్దరే కారణమా?
తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల డిమాండ్ బాగా కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల అభ్యర్థులే కనిపించడంలేదట. ఎంపీ సీట్ల విషయంలో ఈ అయోమయం కొనసాగుతోందనే టాక్ వినిపిస్తోంది. ఓ సెగ్మెంట్లో నాలుగు సార్లు పోటీ చేసిన నేత ఇప్పుడు సైలెంట్ అయ్యారట. రెండుసార్లు గెలిచి, రెండు సార్లు ఓడిన ఆ నేత వలస వెళ్ళాలని అనుకుంటున్నట్లు టాక్. ఇంతకీ ఆ నేత ఎవరు? ఎక్కడకు వెళ్లబోతున్నారు.. నిజామాబాద్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు? 2004 నుంచి 2019 వరకు వరుసగా నాలుగు సార్లు పోటీ చేసి.. రెండు సార్లు లోక్‌సభలో అడుగుపెట్టిన మధుయాష్కీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా?. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు ఎవరూ కనిపించడంలేదట నిజామాబాద్ కాంగ్రెస్‌లో. అయితే, యాష్కీ పోటీ చేయాలని అక్కడి కేడర్ భావిస్తున్నా.. ఆయన చాలాకాలం నుంచి నిజామాబాద్‌లో పర్యటించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మధుయాష్కీ ఈసారి పోటీ చేస్తారా? లేక వేరే మరెక్కడైనా పోటీ చేయాలనుకుంటున్నారా? కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఏదైనా హామీ లభించిందా? అనే ప్రశ్నలు పార్టీ కేడర్ నుంచి వినిపిస్తున్నాయి. కవిత, అర్వింద్ చేతిలో ఓటమి.. ఇక, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గాలిలో రెండుసార్లు వరుసగా నిజామాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన మధుయాష్కీ 2014 ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత చేతిలో ఓటమి చెందారు. అలాగే 2019 ఎన్నికల్లో మరోసారి కాషాయ పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఒకనాడు కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తనయుడైన అరవింద్ విజయం కోసం కాంగ్రెస్ శ్రేణులు కూడా అంతర్గతంగా పనిచేశాయని అప్పుడు ప్రచారం జరిగింది. రెండుసార్లు ఓటమి చెందడంతో కొంతకాలంగా మధు యాష్కీ నిజామాబాద్ జిల్లా వైపు కన్నెత్తి చూడడం లేదు. ఆయనకు నిజామాబాద్ పార్లమెంటు సీటుపై ఆసక్తి తగ్గిందనే ప్రచారం కాంగ్రెస్‌లోనే జరుగుతోంది. రాహుల్ గాంధీకి సన్నిహితుడి పేరున్న మధు యాష్కీకి మరోచోట సీటు హామీ వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్గొండ లేదా రంగారెడ్డి జిల్లాల నుంచి పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. తెరపైకి ఎన్ఆర్ఐ!.. నిజామాబాద్ పార్లమెంటరీ స్థానం మహారాష్ట్ర బోర్డర్ బోధన్‌లో మొదలై.. జగిత్యాల నియోజక వర్గం వరకూ విస్తరించి ఉంది. మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం అంతా అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీజేపీ ఎంపీ అరవింద్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ నుంచి ఎవరూ ఈ పార్లమెంట్ సీటు గురించి పట్టించుకున్నవారు కనిపించడంలేదు. మధుయాష్కీ పోటీ చేయకపోతే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి లేదా ఎవరైనా ఎన్ఆర్ఐతో పోటీ చేయిస్తారనే టాక్ కాంగ్రెస్ పార్టీలో నడుస్తోంది. మొత్తానికి రెండుసార్లు ఓటమితో మధుయాష్కీ నిజామాబాద్‌ను వదిలేశారనే ప్రచారం అయితే జిల్లాలో జరుగుతోంది. ఇది కూడా చదవండి: ప్లాన్ మార్చిన కేసీఆర్.. కొత్త నేతకు లైన్ క్లియర్! -
బీజేపీ విజయానికి కృషి చేయాలి..! పాయల్ శంకర్
పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆదిలాబాద్: వచ్చే ఎన్నికల్లో విజయం సాఽధించేలా కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం మండలంలోని దేవపూర్, కుచులపూర్ గ్రామాల్లో బీజేపీ మహాజన్ సంపర్క్‌లో భాగంగా టిఫిన్ బాక్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త త్వరలో జరిగే ఎన్నికల్లో బీజేపీ విజయం సాఽధించేలా గ్రామాల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. అధికార పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పేద ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న పథకాలను వివరించాలన్నారు. సమయం తక్కువగా ఉందని, ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్, లోక ప్రవీణ్‌రెడ్డి, రఘుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆడే మానాజీ, జిల్లా ఉపాధ్యక్షులు భీంరెడ్డి, బాబారవ్ పటేల్, జిల్లా కార్యదర్శి కొల్లూరి చంద్రశేఖర్, బోథ్ అసెంబ్లీ కన్వీనర్ సూర్యకాంత్ గిత్తే, తలమడుగు మండల అధ్యక్షులు బోనగిరి స్వామి, ఇచ్చోడ మండల అధ్యక్షుడు కేంద్ర నారాయణ పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లో టికెట్ల పోరు.. నీదా..! నాదా..! ఎవరరిది..?
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనుండటంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండగా.. మరోవైపు వారి చేరికకు ముందే చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. త్వరలో ఇరువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారు వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్‌లో అంతర్గత పోరు తప్పదన్న సంకేతాలను చూపుతోంది. జిల్లాలోని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో కొల్లాపూర్ వేదికగా నిర్వహించేందుకు తలపెట్టిన ‘పాలమూరు ప్రజాభేరి’ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం ఇరువర్గాలుగా నేతలు తమ బలప్రదర్శనను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త, పాత నేతలు సర్దుకుంటారా..! కాంగ్రెస్‌లోకి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పార్టీ టికెట్ కోసం అంతర్గత పోరు తప్పేలా కనిపించడం లేదు. జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతుండగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ నేత చింతలపల్లి జగదీశ్వర్‌రావు భారీ ర్యాలీతో బలప్రదర్శన చేపట్టారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాల ని పిలుపునిచ్చారు. ఏళ్లుగా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల నిర్వహణ, సభ్యత్వాలను పెంచి పార్టీ బలాన్ని పెంచానని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీలో ఉండటం ఖాయమని ప్రకటించడంతో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న జూపల్లికి పార్టీలో అంతర్గత పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉన్న తరుణంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన కేడర్‌లో నెలకొంది. సర్వేల చుట్టూ రాజకీయాలు.. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధం కాగా.. వచ్చే ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని నాగం చెబుతున్నారు. పార్టీలో అంతర్గత పోరును కట్టడి చేసేందు కు సర్వేల ద్వారా టికెట్లను ఖరారు చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్వే మొదలైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అ యితే సర్వేలతో పనిలేకుండా ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి అవకాశం ఇవ్వాలని నాగం, జగదీశ్వర్‌రావులు డిమాండ్ చేస్తున్నారు. సమీకరణాలపై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోకి నేతల చేరికలతోపాటు పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వారి చేరికకు ముందే కొత్త, పాత నేతల మధ్య వైరం పెరుగుతుండటం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఆదివారం కొల్లాపూర్‌లో నిర్వహించిన సమావేశానికి హాజరైన నాగం జనార్దన్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కకుండా చేస్తే వారిని ఓడిస్తామనే సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే ఇందుకోసం వ్యతిరేకులను అంతా ఏకం చేసే యోచనలో సైతం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో టికెట్ కోసం ఇరువర్గాల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు, వారి పట్టింపుల నడుమ చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పార్టీ ఆదేశించిన విధంగా కొత్త, పాత నేతలు నడుచుకుంటారా.. అంతర్గత కుమ్ములాటలు ఎటువైపు దారితీస్తాయోనన్నది ఉత్కంఠగా మారింది.