మునుగోడు ఉప ఎన్నిక ఖమ్మం జిల్లా గులాబీ నేతల చావుకొచ్చింది. మునుగోడులో టీఆర్‌ఎస్‌కు వామపక్షాల మద్దతు ఇస్తున్నాయి. ఈ మద్దతు వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగబోతోందని మూడు పార్టీల నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాకే చెందినవారు కావడంతో ఆ ఇద్దరూ కూడా అత్యంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తుతో ఈ జిల్లా నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారని ప్రచారం సాగుతోంది.
మునుగోడుతో ముహూర్తం
టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నాయి. అయితే మునుగోడులో గులాబీకి ఎర్రపార్టీలు మద్దతు ప్రకటించాయి. మూడు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాలో తమకు బలమున్న సీట్లపై ఖర్చీఫ్ వేసేశారట.
ఘన చరిత్ర.. పేలవ వర్తమానం
పాతికేళ్ళ నాడు ఒకసారి ఎంపీగా గెలిచిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 2004లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 2009లో ఒకసారి కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండు పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల రీత్యా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా వామపక్షాలతో కలిసి పోటీ చేస్తుందనేది రాజకీయ వర్గాల్లో గట్టిగా ఉన్న అభిప్రాయం. అందుకు మూడు పార్టీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికే అందుకు ఉదాహరణ అంటున్నారు.
ఈ సారి తగ్గేదేలే
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనరల్ సీట్లు ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మాత్రమే. మిగిలినవన్నీ రిజర్వుడు సీట్లే. అగ్రకులాలకు చెందిన నేతలు ఎంతమంది ఉన్నా అక్కడ ఉన్నది మూడు సీట్లు మాత్రమే. ఇప్పటికే ఆ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి నలుగురు సీనియర్ నేతలు పని చేస్తున్నారు. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పాలేరు, కొత్తగూడెం సీట్లపై ఖర్ఛీఫ్ వేసుకున్నారట. వామపక్షాల అగ్రనేతలు తమ స్థానాల్లో సెటిలైతే తమ పరిస్థితేం కావాలంటూ గులాబీ పార్టీ ఆశావహుల్లో గుబులు మొదలైందట. మునుగోడు ఉప ఎన్నిక తమ సీట్లకు ఎసరు తెచ్చిందని గాబరా పడుతున్నారట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీనియర్ గులాబీ నేతలు.
గెలిచిందే ఒక్కరు, ఆ తర్వాత కారు ఎక్కేశారు
ఒకప్పుడు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలంటే అభిమానించేవారు ఉన్నప్పటికీ...రెండు పార్టీల నేతల తీరుతో కాలక్రమంలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క సీటు మాత్రమే సాధించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అక్కడ బలంగానే ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కారెక్కడంతో జనరల్ సీట్లు మూడు ఇప్పుడు గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. మరోవైపు జిల్లా రాజకీయాల్లో పట్టున్న ఇద్దరు కామ్రేడ్లు కొత్తగూడెం, పాలేరు సీట్లపై ఖర్చీఫ్ వేసుకోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది.
కర్చీఫ్ మిషన్ 2023
టీఆర్ఎస్‌కు వామపక్షాలతో పొత్తు కుదిరితే గనుక మిగిలిన సీట్ల సంగతెలా ఉన్నా తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు తమకు కావాల్సిన సీట్లపై గట్టిగా ఒత్తిడి తెస్తారని జిల్లాలో టాక్. అదే నిజమైతే గులాబీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తాయో చూడాలి. ఇటీవల ఖమ్మం జిల్లాలో సంభవించిన రాజకీయ పరిణామాలు అటు టీఆర్‌ఎస్‌కు, ఇటు సీపీఎంకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఈ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోగలిగితే పొత్తుల వల్ల ఫలితం ఉంటుందని, కమ్యూనిస్టు పార్టీల నాయకులిద్దరికీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు.
చదవండి: పదవి అంటే పరారే.! కాంగ్రెస్‌కు ఎందుకీ పరిస్థితి?
Comments
Please login to add a commentAdd a comment