Kunamneni Sambasiva Rao
-
‘అఫిడవిట్’పై మళ్లీ చర్చ..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శాసనసభ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడివిట్లో సరైన వివరాలు అందించలేదనే వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేసి సాంబశివరావుకు రాష్ట్ర హై కోర్టు నోటీసులు పంపింది. దీంతో మరోసారి అఫిడవిట్ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జలగం వర్సెస్ వనమా.. తెలంగాణ అసెంబ్లీకి రెండోసారి 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున జలగం వెంకటరావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జలగంపై వనమా గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్భంగా వనమా సరైన వివరాలు సమర్పించలేదంటూ జలగం వెంకటరావు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత 2023 జూన్‌లో వనమా ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని శాసన సభ కార్యదర్శిని జలగం వెంకటరావు కోరారు. ఇంతలో హై కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అప్పటి నుంచే రగడ.. జలగం వర్సెస్ వనమా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈసారి ఎన్నికల సందర్భంగా నామినేషన్ల అంశంపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. బీఆర్ఎస్ అయితే రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ పత్రాలు నింపేందుకు, సరి చూసుకునేందుకు ప్రత్యేక శిబిరం నిర్వహించింది. ఇక కొత్తగూడెం విషయానికి వస్తే నామినేషన్ దరఖాస్తుల పరిశీలన గరం గరంగా జరిగింది. ఈ స్థానం నుంచి మొత్తం 36 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, బీఎస్పీ అభ్యర్థి వై. కామేశ్‌తో పాటు మరికొందరు అభ్యర్థులు అఫిడవిట్లో సమర్పించిన అంశాలపై మరో అభ్యర్థి జలగం వెంకటరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు హై కోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో మరోసారి అఫిడవిట్ అంశంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. -
Ts Assembly: కూనంనేనికి హరీశ్‌రావు ఛాలెంజ్
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్‌కు ధన్యవాదాలు తెలిపె తీర్మానంపై చర్చ సందర్భంగా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. సీఎం కేసీఆర్ లాంటి అన్నీ తెలిసిన నాయకుడు కూడా అమలు సాధ్యంకానీ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితబంధు హామీలిచ్చారన్నారు. ఈ వ్యాఖ్యలకు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాము ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎక్కడా చెప్పలేదని హరీశ్‌రావు అన్నారు. ‘కూనంనేని సాంబశివరావు సీపీఐ ఎమ్మెల్యే. వారి పార్టీ కాంగగ్రెస్కు మిత్ర పక్షం. ఇద్దరు కలిసి పోటీ చేశారు. మేం ఇంటికి ఒక ఉద్యోగమిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. తాము అలా చెప్పినట్లు నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు. గవర్నర్ స్పీచ్‌పై కూనంనేని మాట్లాడితే బాగుంటుంది’అని హరీశ్‌రావు సూచించారు.అనంతరం కూనంనేని మళ్లీ మాట్లడడం ప్రారంభించిన తర్వాత కూడా బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఇదీచదవండి..కాంగ్రెస్ పార్టీకి ఇంత మిడిసిపాటు వద్దు: కేటీఆర్ -
ప్రజల వాణిని వినిపించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే
-
కూనంనేనికే ఫార్వర్డ్ బ్లాక్ మద్దతు.. : సీపీఐ సభ్యుడు రామరాజు
సాక్షి, భద్రాద్రి/కొత్తగూడెం: కొత్తగూడెంలో మిత్రపక్షాలు బలపరుస్తున్న సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ సంపూర్ణ మద్దతునిస్తోందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామరాజు తెలిపారు. సోమవారం శేషగిరిభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీలు పోటీ చేసే చోట పోటీ చేయకూడదని నిర్ణయించిందని, ఇందుకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రరెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించారని, పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు బీఫాం ఎలా కేటాయించారని ప్రశ్నించారు. నేతాజీ ఆశయాలతో పనిచేస్తున్న ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీ ఫామ్ వామపక్ష వ్యతిరేకికి ఇవ్వడం సరికాదన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు కూనంనేని విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పాల్గొన్నారు. ఇవి కూడా చదవండి: పొత్తులో కత్తులు! బీజేపీ, జనసేనల మధ్య వాగ్వాదం.. -
అవసరం తీరగానే వదిలేస్తారా?.. కేసీఆర్‌పై కూనంనేని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్తో లెఫ్ట్ పార్టీల పొత్తు బ్రేకప్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ వైఖరి దొంగే దొంగ అన్నట్లు ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ద్రోహం చేశారని మండిపడ్డారు. పొత్తు వీగినందుకు కేసీఆర్‌పై లెఫ్ట్ పార్టీల రాష్ట్ర నాయకులు పోటీ చేయాలని డిమాండ్ వచ్చిందన్న కూనంనేని.. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లిలో బలపైన పోటీ కచ్చితంగా ఉంటుందన్నారు. అది తెలిసీ ఎందుకు ప్రపోజల్ పెట్టారు? కంటివెలుగు, మునుగోడు సభకు పిలిచి మిత్రధర్మం పాటించారట.. లెఫ్ట్ పార్టీలు ఇండియా కూటమిలో ఉండి మిత్రధర్మం తప్పామట అంటూ బీఆర్ఎస్పై కూనంనేని మండిపడ్డారు. దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామని కేసీఆర్‌కు ముందే తెలుసన్నారు. కూటమిలో ఉన్న విషయం తెలిసి కూడా ఒక సీటు ఇస్తామని, రెండు ఎమ్మెల్సీ ఇస్తామని ఎందుకు ప్రపోజల్ పెట్టారని ప్రశ్నించారు. ఏ రాజకీయం అయినా కొంతకాలమే నడుస్తుందన్నారు. కేసీఆర్ మిత్రధర్మం తప్పింది వాస్తవా కాదా? 2004లో కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) ఎందుకు కూటమి కట్టారని నిలదీశారు. ఆ సమయంలో కూటమిలో ఉంటూనే చాడ పోటీ చేసే స్థానంలో మరో వ్యక్తిని కేసీఆర్ పోటీలో పెట్టారని గుర్తు చేసిన కూనంనేని.. అప్పుడు మిత్రధర్మం తప్పినట్లు కాదా? అని ప్రశ్నించారు. 2009లో టీడీపీతో పొత్తులో ఉంటూ మిత్రధర్మం మళ్ళీ తప్పి సీపీఐ పోటీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను కేసీఆర్ పెట్టారని ప్రస్తావించారు. 2004, 2009లో కేసీఆర్ ఉమ్మడి పోత్తులో ఉండి మిత్రధర్మం తప్పింది వాస్తవం కాదా ప్రశ్నించారు. చదవండి: కేసీఆర్ నేర్పించిన విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నా.. రాజకీయాలు కావాలి.. రాజకీయ విలువలు కాదు ‘అవసరం వస్తే మా దగ్గరికి వస్తారు.. అవసరం తీరిపోగానే వదిలేస్తారా?. కేసీఆర్‌కు రాజకీయాలు మాత్రమే కావాలి.. రాజకీయ విలువలు కాదు. రాజకీయ శవాలపై రాజసౌధం నిర్మించుకున్న నాయకుడు కేసీఆర్. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లాంటి జిల్లాలో లెఫ్ట్ ప్రభావం ఉంటుందని, రాష్ట్రంలో 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో సీపీఐ బలంగా ఉంది. భవిష్యత్తులో కమ్యూనిస్టుల సత్తా ఏంటో చూపిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సవాల్ చేస్తున్నాం. మరింత బలంగా మేము తయారు అవుతాం. సమరశిల పోరాటానికి శంఖారావం పూరిస్తాం. గ్రామగ్రామన ప్రభుత్వ వైఫల్యాలను ఖండిస్తాం సాయుధ పోరాటానికి పిలుపు సెప్టెంబర్ 11న సాయుధ పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఆగస్ట్ 15, 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు రాలేదు. తెలంగాణకు స్వాతంత్రం కోసం సెప్టెంబర్ 11న పోరాటానికి పిలుపునిస్తే 17న హైదరాబాద్‌ను ఇండియాలో కలిపారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని సువర్ణ అక్షరాలతో లికించాల్సినది పోయి...తప్పుగా చిత్రీకరించారు. తెలంగాణ పోరాటం అనేది సాయుధ పోరాటంతో నాంది పలికి హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో కలిపారు. సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభ కాంగ్రెస్ ద్రోహులు అని కేసీఆర్ ఎన్నో మాటలు చెప్పారు. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని కేసీఆర్ అన్నారు. సెప్టెంబర్ 17పై కేసీఆర్ తన వైఖరి ఏంటో చెప్పాలి. సాయుధ పోరాటం వల్ల లక్షల ఎకరాల భూమి పేదలకు దక్కింది. పోరాటంలో మరణించిన వాళ్ళు ముస్లింలు, హిందువులు ఉన్నారు. అసలు తెలంగాణ పోరాటం ఆనాడే పురుడుపోసుకొంది.సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపకపోతే అమరుల ఆశయాలను నిర్లక్ష్యం చేసినట్లే. సెప్టెంబర్ 11 నుంచి 16వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు జరుపుతున్నాం. సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సభ’ నిర్వహించనున్నట్లు కూనంనేని పేర్కొన్నారు. చదవండి: అలకబూనిన మోత్కుపల్లి.. నేడు అనుచరులతో సమావేశం.. -
‘పొత్తుల కోసం వెంపర్లాడం.. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్తాం’
సాక్షి, హైదరాబాద్: సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ భేటీ ముగిసింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. బీఆర్ఎస్తో కమ్యూనిస్టులు దూరంగా ఉన్నారని, కాంగ్రెస్‌తో జత కడుతారనే తప్పుడు వార్తలు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఖండిస్తున్నామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా లౌకి శక్తులను ఏకం చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్తో మైత్రి కొనసాగుతుందని తమ్మినేని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. సీపీఎం, సీపీఐ కలిసి వెళ్ళినప్పుడే లబ్ధి పొందామని, విడివిడిగా పోయినప్పుడు నష్టపోయామని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించామని కూనంనేని చెప్పారు. పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు ‘బీఆర్ఎస్ తనకు తానుగా చొరవ చూసి మునుగోడులో కలిసి పని చేద్దామని కోరింది. మునుగోడే కాదు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యునిస్టులతో పొత్తు ఉంటుందని కేసీఆరే చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సీట్ల అంశంపై మైండ్ గేమ్ ఆడుతున్నారు. కేసీఆర్ సీట్ల అంశంపై మాతో చర్చించలేదు, వ్యతిరేకంగా మాట్లాడలేదు. కమ్యూనిస్టులు ఎన్నికలకు సమాయత్తం అవ్వడం లేదని అనుకుంటున్నారు. మాకు బలంగా ఉన్న చోట ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాం’ అని తమ్మినేని పేర్కొన్నారు. చదవండి: టికెట్ ప్లీజ్..! ఎమ్మెల్యే అయ్యేందుకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తహతహ.. కమ్యూనిస్టులు ఉంటేనే కుంభకోణాలు బయటకు.. మునుగోడులో వచ్చిన విపత్తును సీపీఎం, సీపీఐ అడ్డుకున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్మి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మునుగోడులో బీజేపీ గెలిస్తే ప్రభుత్వాన్ని అస్థిర పరిచేదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశారని ఆరోపించారు. కమ్యూనిస్టులు లేని అసెంబ్లీ, పార్లమెంట్లను ప్రజలు ఊహించుకోవడం లేదని.. కమ్యూనిస్టులు ఉంటేనే అనేక కుంభకోణాలు బయటకు తీసుకు వస్తారని చెప్పారు. ఓట్లు సీట్ల కోసం దిగజారం ‘కమ్యూనిస్టుల పద్దతుల్లో మా పోరాటం చేస్తున్నాం. బీజేపీకి ప్రజల సమస్యలు పట్టవు. వ్యక్తిగత దూషణలకే పరిమితం. ఓట్లు సీట్ల కోసం మేము దిగజారం. రోజుకో పార్టీ మారే వాళ్లు మమ్మల్ని విమర్శిస్తున్నారు. పొత్తులపైన వెంపర్లాడడం లేదు. కేసీఆర్ ఎప్పుడూ పిలిస్తే అప్పుడే వెళ్తాం. కేసీఆర్ బీజేపీని తక్కువ అంచనా వేయవద్దని విజ్ఞప్తి. రాష్ట్రాల స్థాయిలో, జాతీయ స్థాయిలో పొందిక ఉంటుంది. జాతీయ స్థాయిలో లౌకిక శక్తులతో కేసీఆర్ కలిసి పని చేయాలని కోరుకుంటున్నాం’ అని కూనంనేని తెలిపారు. -
కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకెన్నాళ్లు?
కొడవళ్ళకు గులాబీ చిక్కడం లేదా? గులాబీ పార్టీ మీద ఎర్రన్నల ప్రేమ వన్ సైడేనా? మునుగోడు విజయంతో ఎర్ర పార్టీలను పొగిడిన గులాబీ దళపతి... ఇప్పుడు పట్టించుకోవడంలేదా? మిత్రపక్షాలుగా మారిన ఎర్ర గులాబీలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నాయి ఎందుకు? లెఫ్ట్ పార్టీల వన్ సైడ్ లవ్ ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది? తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ గులాబీ పార్టీ విషయంలో చెరో దారిలో ప్రయాణించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఏకతాటిపైకి వచ్చాయి. బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కు బేషరతు మద్దతు ప్రకటించాయి. ప్రచారంలో కలిసి ముందుకు సాగాయి. మునుగోడులో గులాబీ పార్టీ విజయంలో లెఫ్ట్ పార్టీల సహకారం గురించి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. దీంతో సాధారణ ఎన్నికల్లో కూడా కమ్యూనిస్టు పార్టీలతో బీఆర్ఎస్ పొత్తు కొనసాగుతుందనే ప్రచారం జరిగింది. ఉనికి కోసం ఆరాటపడుతున్న ఉభయ కమ్యూనిస్టులకు మునుగోడు ఉప ఎన్నిక ఎంతో కలిసొచ్చింది. గులాబీ పార్టీతో పొత్తు కుదిరితే ఎన్నో కొన్ని సీట్లు తీసుకుని.. అసెంబ్లీలో ప్రవేశించవచ్చని భావిస్తున్నాయి. ముఖ్యంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఖమ్మం జిల్లాలో తమ నియోజకవర్గాల్లో ఖర్చీఫ్‌లు కూడా వేసుకుని గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్తో కుదిరిన స్నేహం కారణంగా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శల్లో తీవ్రత తగ్గించారు కమ్యూనిస్టు పార్టీల నాయకులు. బీఆర్ఎస్ పై లెఫ్ట్ పార్టీలు ఎంత ప్రేమ చూపిస్తున్నా... పైకి ప్రేమగా మాట్లాడుతున్నా లోపల కత్తులు దూస్తున్నారట జిల్లాల్లోని గులాబీ పార్టీ నేతలు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా ఉన్నప్పటికీ జిల్లాల్లో స్థానిక నేతలు కమ్యూనిస్టులను కలుపుకుపోవడం లేదనే చర్చ సాగుతోంది. ఖమ్మం జిల్లాలోని పాలేరులో పోటీ చేస్తానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రకటించగా.. సిటింగ్ ఎమ్మెల్యేను తానుండగా ఇంకెవరు పోటీ చేస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపెందర్ రెడ్డి రచ్చకు దిగారు. ఆ తర్వాత తమ్మినేని వీరభద్రం కొంత వెనక్కి తగ్గి సీపీఎం పోటీ చేస్తే బీఆర్ఎస్ సహాకరిస్తుంది.. బీఆర్ఎస్ పోటీ చేస్తే సీపీఎం సహకరిస్తుందని ప్రకటించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కరరావుకు మధ్య అసలు పొసగడం లేదట. అన్ని రకాలుగా ప్రభుత్వానికి సహాకరిస్తున్న తమను పట్టించుకోకపోగా ఇబ్బంది పెడుతున్నారని జూలకంటి రంగారెడ్డి వాపోతున్నారట. మరోవైపు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు కూడా తన సొంత నియోజకవర్గం కొత్తగూడెంలో పలు సార్లు పరాభవం ఎదురైందట. కేసీఆర్ తనకు సన్నిహితంగా ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కూనంనేని. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న తనకే ఈ పరిస్థితి ఉంటే జిల్లాలో తమ పార్టీ నేతల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారట కూనంనేని. రాష్ట్ర స్థాయిలో పార్టీ అగ్రనాయకుల మధ్య అవగాహన ఉన్నా.. స్థానిక నాయకత్వం మధ్య స్నేహం లేకపోవడంతో సీపీఐ, సీపీఎం పార్టీలతో బీఆర్ఎస్కు అవగాహన కుదరడం లేదట. తాము వన్ సైడ్ లవ్‌తో ప్రభుత్వానికి సహకరిస్తున్నా స్పందించకపోవడంతో అసంతృప్తికి లోనవుతున్నారట కమ్యూనిస్టు పార్టీల నేతలు. చూడాలి మరి ఎర్ర పార్టీలకు, గులాబీ పార్టీతో పొత్తు కుదురుతుందా లేక గతంలో మాదిరిగా ఎవరి దారి వారు చూసుకుంటారా అనేది తెలియాలంటే కొద్దికాలం ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే తమ సీటు పోతుందనుకుంటున్న గులాబీ పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేలు మాత్రం లెఫ్ట్ నాయకులంటే కస్సుమంటున్నారనే టాక్ నడుస్తోంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ చదవండి: రేవంత్ ఒక్కడే ఎందుకిలా?.. ఆ జిల్లాకు వెళ్లాలంటే భయమా? -
విజయం సాధించే వరకు పోరాడతాం
సాక్షి, హైదరాబాద్: ‘మా దేశం పాలు, పాలపొడి సహా ఇతర వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా అమెరికా ఆంక్షలు విధించింది. క్యూబాను ఆర్థికంగా దిగ్బంధిస్తోంది. అన్ని రంగాల్లోనూ అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటునే ఉన్నాం. కానీ ఈ ఆర్థిక దిగ్బంధం మమ్మల్ని ఎప్పటికీ ఓడించలేదు. చేగువేరా స్ఫూర్తితో, ఫిడేల్ క్యాస్ట్రో చూపిన మార్గంలో విజయం సాధించి తీరుతాం. గెలిచే వరకు పోరాడాలన్న చేగువేరా పిలుపు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది’ అని చేగువేరా తనయ డాక్టర్ అలైదా గువేరా అన్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా, ఐప్సో సంస్థలు ఆదివారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన క్యూబా సంఘీభావ సభలో ఆమె ప్రసంగించారు. క్యూబా సార్వభౌమ, స్వతంత్ర దేశమని... ప్రపంచ దేశాల అండ, సంఘీభావంతో తప్పకుండా అమెరికా దుర్నీతిపై విజయం సాధించి తీరుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నేను క్యూబన్ మహిళను... ‘వేలాదిగా తరలివచ్చి ఇలా మీ సంఘీభావాన్ని తెలియజేయడంతో ఎంతో సంతోషంగా ఉంది. రంగు, రూపం వల్ల కాకుండా మనుషులను మనుషులుగా గౌరవించే సమాజం కోసం అందరం సంఘటితం కావాల్సి ఉంది. చేగువేరా కూతురుగా నన్ను ప్రత్యేకంగా చూడొద్దు. నేను క్యూబన్ మహిళగా ఈ సభల్లో పాల్గొంటున్నాను. చేగువేరా ఒక పరిపూర్ణమైన కమ్యూనిస్టు. సామాజిక సేవను ఆయన నుంచే నేర్చుకున్నాం. ప్రతి మనిషిలో సామాజిక దృక్పథాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సేవ దోహదంచేస్తుంది. చేసే పని మనిషి గౌరవాన్ని పెంచుతుంది. క్యూబా సామ్యవాద దేశంగా అభివృద్ధి చెందుతోంది. మా వనరులకు, సంపదకు మేమే యజమానులం. మా సామ్యవాద విధానాల వల్లే అమెరికా భయపడుతోంది. రకరకాల ఆంక్షలు విధిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ క్యూబా ప్రపంచ దేశాలకు ఆదర్శంకాకూడదనేదే దాని ఉద్దేశం. కానీ కచ్చితంగా క్యూబా గెలుస్తుంది’ అని అలైదా అన్నారు. ఈ సందర్భంగా క్యూబాకు మద్దతుగా చేసిన తీర్మానాన్ని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ గోరటి వెంకన్న పాడిన పాటతో సభ హోరెత్తింది. చేగువేరాపై సుద్దాల ఆంగ్లంలో పాడిన పాట ఆకట్టుకుంది. ఈ సభలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి, ఐప్సో ప్రతినిధి యాదవరెడ్డి, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, ఆప్ నేత సుధాకర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రజాగాయకుడు గద్దర్, ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, అరుణోదయ విమల, పీఓడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొని క్యూబాకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. -
ఇదేమైనా బాహుబలి సినిమానా?
హైదరాబాద్: ఈ బారు నుంచి ఆ బారుకు దూకడానికి ఇది బాహుబలి సినిమా కాదని, ఈ అభ్యర్థులేమీ సినిమా షూటింగ్లో పాల్గొనడం లేదంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. తప్పులతడకగా ఇచ్చిన ప్రశ్నలకు మార్కులను కలిపి కోర్టు తీర్పును గౌరవించాలంటూ ప్రభుత్వం, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్(టీఎస్ఎల్పీఆర్బీ)కు కూనంనేని సూచించారు. శనివారం ఏఐవైఎఫ్ పిలుపుమేరకు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల డీజీపీ కార్యాలయం ముట్టడి భగ్నమయ్యింది. అభ్యర్థులు ప్లకార్డులు చేతబూని బోర్డు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ర్యాలీగా ముట్టడికి ప్రయత్నిస్తున్న సమయంలో వీరందరినీ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి నారాయణగూడ, అబిడ్స్, బేగంబజార్ పీఎస్‌లకు తరలించారు. మద్దతు తెలిపేందుకు వచ్చిన కూనంనేని మాట్లాడుతూ..గత 15 రోజులుగా న్యాయంకోసం ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు, ఇతర ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణం అభ్యర్థులకు న్యాయం చేయకపోతే మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. -
రేవంత్‌పై నిర్మల వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: భాషపై నిండు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డిని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అవమానించడం ఏంటని, వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని విచారం వ్యక్తం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఒక సభ్యుని పట్ల అనుచితంగా మాట్లాడటం సమంజసం కాదని మంగళవారం ఒక ప్రకటనలో హితవు పలికారు. సభ కస్టోడియన్‌గా సభ్యుల హక్కులు, మర్యాదను కాపాడాల్సిన లోక్‌సభ స్పీకర్ కూడా రేవంత్‌రెడ్డి రక్షణకు రాకపోగా.. నిర్మలా సీతారామన్‌ను సమర్థించేలా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులకున్న చులకన భావాన్ని ఈ ఘటన తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి హిందీలో మాట్లాడటాన్ని హేళన చేయడం సమర్థనీయం కాదన్నారు. అయినా రేవంత్‌రెడ్డి తన భావాన్ని హిందీలో అర్థమయ్యే రీతిలోనే స్పష్టంగా వ్యక్తీకరించారని, ఆయన లేవనెత్తిన అంశాలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా నిర్మలా సీతారామన్ కించపరిచేలా మాట్లాడటం ఏంటని కూనంనేని ప్రశ్నించారు. -
గవర్నర్ వ్యవస్థకు వ్యతిరేకంగా రాజ్ భవన్ వద్ద సీపీఐ నినాదాలు
-
అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా?
దేశంలో గవర్నర్ల వ్యవస్థ రాను రానూ వివాదాస్పదంగా మారుతోంది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందుల పాలు చేస్తూ ఫెడరల్ స్ఫూర్తికే భంగం కలిగిస్తున్నారు గవర్న ర్లు. వారి బాధ్యత రాజ్యాంగ పరిరక్షణతో పాటూ, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలూ, సూచనలూ ఇవ్వడం. శాసనసభలో ఎవరికీ మెజారిటీ రాని సందర్భంలో ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరిని తొలుత ఆహ్వానించాలనే అంశంలో, రాజ్యాంగ సంక్షోభం తలెత్తినప్పుడు గవర్నర్ పాత్ర కీలకం. రాష్ట్ర శాసన సభ, మండలిలో ఆమోదించిన బిల్లు లను లాంఛనంగా ఆమోదించడం గవర్నర్ విధి. కొన్ని ప్రత్యేక, అసాధారణ సందర్భాలలో బిల్లులను రాష్ట్రపతికి పంపవచ్చు. లేదంటే గవర్నరే బిల్లులపై తన అభిప్రాయంతో సహా తిరిగి చట్ట సభలకు పంపవచ్చు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్ నుండి తిరిగి వచ్చిన బిల్లులను, గవర్నర్ అభిప్రాయానికి అనుగుణంగా సవరించినా, లేదా యధావిధిగా మరోసారి ఆమోదించి పంపినా గవర్నర్‌కు వాటిపై ఆమోద ముద్ర వేయడం తప్ప వేరే మార్గం లేదు. బీజేపీయేతర పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్న తీరు అసలు గవర్నర్ వ్యవస్థ అవసరమా? అనే చర్చను తెరపైకి తీసుకువచ్చింది. తెలంగాణలో గవర్నర్ వద్ద శాసనమండలి, శాసనసభ ఆమోదించి పంపిన ఏడు బిల్లులు రెండు నెలలకు పైగా.. కేరళ శాసననసభ ఆమోదించిన ఆరు బిల్లులు నెలలు తరబడీ, తమిళనాడు శాసనసభ ఆమోదించిన 20 బిల్లులను అనేక మాసాలుగా ఆయా రాష్ట్రాల గవర్నర్లు పెండింగ్‌లో పెట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు తమ ప్రభుత్వాలు లేని రాష్ట్రాలలో గవర్నర్లను ఉపయోగించు కొని రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టడం కొత్తేమీ కాదు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ... గవర్నర్ల నుండి రప్పించిన తప్పుడు నివేదికల ఆధారంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను డిస్మస్ చేసి రాష్ట్రపతి పాలనను విధించి, గవర్నర్ల ఆధ్వర్యంలో కేంద్రం పాలన సాగించడం చూశాం. కేరళలో ఎన్నికైన కమ్యూ నిస్టు ప్రభుత్వమే మొదటిసారిగా ఆర్టికల్ 356 బారిన పడింది. ఇప్పటి వరకు 41 ప్రభుత్వాలు అలా డిస్మిస్ కాబడ్డాయి. 1977లో జనతాపార్టీ అప్పటివరకు ఉన్న గవర్నర్లను డిస్మిస్ చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకొంది. కాంగ్రెస్ హయాంలో కూడా ఈ విధంగానే గవర్నర్ల మార్పు కొనసాగింది. 1984లో ముఖ్యమంత్రి పదవి నుండి ఎన్టీ ఆర్‌ను నాటి గవర్నర్ రాంలాల్ పదవీచ్యుతుణ్ణి చేసిన ఉదంతాన్నీ, కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసిన ఎస్ఆర్ బొమ్మై చారిత్రాత్మక కేసునూ ఎలా మరవగలం? బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. గతంలో గోవా, మణిపూర్, ఉత్తరాఖంఢ్ వంటి రాష్ట్రా లలో అత్యధిక శాసనసభ్యులు ఎన్నికైన పార్టీని విస్మరించి, బీజేపీ ప్రభుత్వాల ఏర్పాటుకు గవర్నర్లు సహ కరించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోనైతే 2016లో గవర్నర్ ఆజ్ఞ మేరకు శాసనసభ సమావేశాలను ముందుకు జరిపి, ముఖ్యమంత్రి లేకుండానే ఏకంగా ఒక హోటల్లో అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. 2019లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ మెజారిటీ లేనప్పటికీ తెల్లవారు జామున బీజేపీకి చెందిన ఫడ్నవీస్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తరువాత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు, వారి పార్టీ ఎమ్మెల్యేల రిసార్ట్ రాజకీయాలనూ, ఆ సందర్భంగా గవర్నర్ వ్యవహరించిన తీరునూ ప్రజలంతా గమనించారు. సర్కారియా కమిషన్‌తో పాటు, అనేక కమిషన్లు గవర్నర్ వ్యవస్థ తీరును తప్పు పట్టాయి. దాని ప్రక్షాళనకు అనేక సిఫార్సులు చేశాయి. కానీ అవన్నీ బుట్ట దాఖలే అయ్యాయి. గవర్నర్ వ్యవస్థను లోతుగా పరిశీలిస్తే... అది ఆరవ వేలు లేదా అపెండిక్స్ లాంటిదని అర్థమవుతోంది. దాన్ని రద్దు చేయడమే ఏకైక మార్గం. ఈ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ తీర్మానం కూడా చేసింది. గవర్నర్ వ్యవస్థ రద్దయితే... అది నిర్వహించే బాధ్యతలను న్యాయ వ్యవస్థకూ, శాసన సభలోని సెలెక్ట్ కమిటీ లేదా స్టాండింగ్ కమిటీకి అప్పగించవచ్చు. ఉదాహరణకు మెజారిటీ లేని సందర్భంలో సీఎంగా ఎవరిని ఆహ్వానించాలి, ప్రమాణ స్వీకారం, బలాబలాలు లాంటి వివాదాస్పద అంశాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలి. సంక్లిష్ట సమస్యలపై బిల్లులను కూలంకషంగా చర్చించేందుకు సెలెక్ట్ కమిటీకి నివేదించవచ్చు. లేదా స్టాండింగ్ కమిటీలకు అందించవచ్చు. ఆ కమిటీలు సూచించిన ప్రతి పాదనలతో బిల్లులపై చర్చించి చట్టసభలు ఆమోదిస్తే, గవర్నర్ జోక్యం ఇక అవసరం ఉండదు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష) - కూనంనేని సాంబశివరావు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి -
ఆర్టీసీని రక్షించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌దే
హస్తినాపురం: ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి సంస్థను రక్షించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్‌పై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి, ఎంప్లాయీస్ యూనియన్ పోరుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. సంస్థలో యూనియన్లను పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ హస్తినాపురంలోని కేకే గార్డెన్స్‌లో మంగళవారం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించాలని, కార్మికులకు బకాయి ఉన్న పేస్కేలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విదానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న సీఎం కేసీఆర్‌కు.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నిక సమయంలో తమ మద్దతు కోరినప్పుడు ఇదే అంశాన్ని స్పష్టం చేశామని, అందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలిపారు. కార్మికుల డిమాండ్లన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్టీసీతో తమ పార్టీది పేగుబంధమని తెలిపారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకపోతే... నిరవధిక దీక్షకు సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు వి.ఎస్.బోస్, అధ్యక్షుడు బాబు, నాయకులు కె.రాజిరెడ్డి, పద్మాకర్ తదితరులు ప్రసంగించారు. -
మోదీకి వ్యతిరేకంగా నిరసనలు.. 7 వేల మంది సీపీఐ కార్యకర్తల అరెస్టు
సాక్షి, హైదరాబాద్/జైపూర్ (చెన్నూర్): రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన నిర సన కార్యక్రమాల్లో 7 వేల మంది సీపీఐ కార్య కర్తలు, ఏఐటీయూసీ, వివిధ ప్రజా సంఘాల శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. శని వారం తెల్లవారుజాము నుంచే అనేకమందిని గృహనిర్బంధం చేశారు. అలాగే పలువురిని నిరసనల సందర్భంగా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావును రామగుండం వెళ్తుండగా గోదావరిఖనిలో అరెస్టు చేశారు. ఆయనతో పాటు సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు కలవేన శంకర్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి తదితరులను మంచిర్యాల జిల్లా జైపూర్ స్టేషన్‌కు తరలించారు. అలాగే సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జరిగిన నిరసనలో పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సహా పలువురిని అరెస్టు చేసి అబిడ్స్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మను ఇంటి వద్ద అరెస్టు చేశారు. జవహర్‌నగర్‌లో నిరసన చేపట్టిన సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాలమల్లేశ్, ఈసీ ఐఎల్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి వి.ఎస్.బోస్ అరెస్టయ్యారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ శనివారం సీపీఐ చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మఖ్దూంభవన్ నుంచి ర్యాలీగా బయల్దేరిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పోలీ సులు రాష్ట్ర కార్యాలయం లోపలికి వచ్చి కార్యకర్తలు వేసుకుంటున్న నల్ల చొక్కాలను లాక్కోవడం, అరెస్ట్ చేయడం దుర్మార్గమని కె.నారాయణ మండిపడ్డారు. హక్కులను కాలరాశారు: కూనంనేని రాష్ట్రంలో మోదీ పర్యటన రాచరిక పాలనలో రాజు పర్యటనలా సాగిందని, ఆయనను వ్యతిరేకించే వారిని పోలీసులు ముందే నిర్బంధంలోకి తీసుకున్నారని కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రధానిగా మోదీ అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు దాటినా ఇప్పటి వరకు ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. కాగా, తమ నాయకుల అరెస్టుకు నిరసనగా సీపీఐ జిల్లా కమిటీ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జైపూర్ బస్టాండ్ నుంచి పోలీసుస్టేషన్‌కు వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండాపోయిందని, ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీసు రాజ్యమా అని ప్రశ్నించారు. చదవండి: నిమ్స్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి: తమ్మినేని -
‘మోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలపాలు చేసిన ప్రధాని మోదీకి రాష్ట్రానికి వచ్చే నైతిక హక్కు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మోదీకి ఏమాత్రం ఆత్మాభిమానం ఉన్నా, తెలంగాణ పర్యటనను రద్దు చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలుగు ప్రజలను అవమానపర్చేలా వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తక్షణమే తెలంగాణను వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు. ఈ నెల 12న మోదీ రాష్ట్ర పర్యటనను నిరసిస్తూ సింగరేణి జిల్లాల్లో 10వ తేదీ నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపడతా మని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనాసిద్ధమేనని స్పష్టం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ సహా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ ఒక్క హామీనైనా కేంద్రం అమలు చేసిందా అని ప్రశ్నించారు. మోదీకి తెలంగాణ అంటేనే కోప మని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. కేసీఆర్‌పై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపుతున్నారని దుయ్యబట్టారు. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించాలనే కనీస మర్యాద, గౌరవం కూడా ప్రధానికి లేదన్నారు. తెలంగాణ మంత్రులను తన ఆఫీసు చుట్టూ తిప్పించుకుంటు న్నానని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టారు. త్వరలోనే రాజ్‌భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామ న్నారు. గవర్నర్ తమిళిసై గవర్నరా? లేదా బీజేపీ కార్యకర్తనా తేల్చుకోవాలన్నారు. 8 బిల్లుల్లో కొన్ని మంచి బిల్లులు కూడా ఉన్నా యని, ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే వెనక్కి పంపించాలని, కానీ మంత్రులు వచ్చి రాయబారాలు జరిపితేనే, లొంగిపోతేనే ఆమోదిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
కామ్రేడ్.. అసెంబ్లీకి ఎప్పుడు వెళ్దాం? కమ్యూనిస్టు నేతల్లో కొత్త ఉత్సాహం
మునుగోడు ఉప ఎన్నిక ఖమ్మం జిల్లా గులాబీ నేతల చావుకొచ్చింది. మునుగోడులో టీఆర్ఎస్కు వామపక్షాల మద్దతు ఇస్తున్నాయి. ఈ మద్దతు వచ్చే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగబోతోందని మూడు పార్టీల నుంచి సంకేతాలు వచ్చాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ముఖ్యంగా రెండు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాకే చెందినవారు కావడంతో ఆ ఇద్దరూ కూడా అత్యంత ఉత్సాహంగా కనిపిస్తున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావులు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తుతో ఈ జిల్లా నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఉవ్విళ్ళూరుతున్నారని ప్రచారం సాగుతోంది. మునుగోడుతో ముహూర్తం టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు ఒక్కోసారి ఒక్కోలా ఉంటున్నాయి. అయితే మునుగోడులో గులాబీకి ఎర్రపార్టీలు మద్దతు ప్రకటించాయి. మూడు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర కార్యదర్శులు ఖమ్మం జిల్లాలో తమకు బలమున్న సీట్లపై ఖర్చీఫ్ వేసేశారట. ఘన చరిత్ర.. పేలవ వర్తమానం పాతికేళ్ళ నాడు ఒకసారి ఎంపీగా గెలిచిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం 2004లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు 2009లో ఒకసారి కొత్తగూడెం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రస్తుతం రెండు పార్టీలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేదు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల రీత్యా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కచ్చితంగా వామపక్షాలతో కలిసి పోటీ చేస్తుందనేది రాజకీయ వర్గాల్లో గట్టిగా ఉన్న అభిప్రాయం. అందుకు మూడు పార్టీలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికే అందుకు ఉదాహరణ అంటున్నారు. ఈ సారి తగ్గేదేలే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో జనరల్ సీట్లు ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు మాత్రమే. మిగిలినవన్నీ రిజర్వుడు సీట్లే. అగ్రకులాలకు చెందిన నేతలు ఎంతమంది ఉన్నా అక్కడ ఉన్నది మూడు సీట్లు మాత్రమే. ఇప్పటికే ఆ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి నలుగురు సీనియర్ నేతలు పని చేస్తున్నారు. ఇప్పుడు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు పాలేరు, కొత్తగూడెం సీట్లపై ఖర్ఛీఫ్ వేసుకున్నారట. వామపక్షాల అగ్రనేతలు తమ స్థానాల్లో సెటిలైతే తమ పరిస్థితేం కావాలంటూ గులాబీ పార్టీ ఆశావహుల్లో గుబులు మొదలైందట. మునుగోడు ఉప ఎన్నిక తమ సీట్లకు ఎసరు తెచ్చిందని గాబరా పడుతున్నారట ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీనియర్ గులాబీ నేతలు. గెలిచిందే ఒక్కరు, ఆ తర్వాత కారు ఎక్కేశారు ఒకప్పుడు ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట. ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీలంటే అభిమానించేవారు ఉన్నప్పటికీ...రెండు పార్టీల నేతల తీరుతో కాలక్రమంలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క సీటు మాత్రమే సాధించుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ అక్కడ బలంగానే ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి గెలిచిన పాలేరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కారెక్కడంతో జనరల్ సీట్లు మూడు ఇప్పుడు గులాబీ పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. మరోవైపు జిల్లా రాజకీయాల్లో పట్టున్న ఇద్దరు కామ్రేడ్లు కొత్తగూడెం, పాలేరు సీట్లపై ఖర్చీఫ్ వేసుకోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. కర్చీఫ్ మిషన్ 2023 టీఆర్ఎస్కు వామపక్షాలతో పొత్తు కుదిరితే గనుక మిగిలిన సీట్ల సంగతెలా ఉన్నా తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావులు తమకు కావాల్సిన సీట్లపై గట్టిగా ఒత్తిడి తెస్తారని జిల్లాలో టాక్. అదే నిజమైతే గులాబీ శ్రేణులు ఎంతవరకు సహకరిస్తాయో చూడాలి. ఇటీవల ఖమ్మం జిల్లాలో సంభవించిన రాజకీయ పరిణామాలు అటు టీఆర్ఎస్కు, ఇటు సీపీఎంకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఈ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకోగలిగితే పొత్తుల వల్ల ఫలితం ఉంటుందని, కమ్యూనిస్టు పార్టీల నాయకులిద్దరికీ ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్నారు. చదవండి: పదవి అంటే పరారే.! కాంగ్రెస్‌కు ఎందుకీ పరిస్థితి? -
అధికార టీఆర్ఎస్ పార్టీలోనే ముసలం.. కొత్తగూడెం నాదా? నీదా?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి గులాబీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టిక్కెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి సీటు తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు సీటు కోసం పోటీ పడుతుంటే..తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోని సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. కారులో కమ్యూనిస్టులు గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈసారి ఏడాది ముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా పొత్తు కుదిరితే సీపీఐ వారు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, రాష్ట్ర సీపీఐ కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేది అంటూ టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్ళు పరుగులు తీస్తున్నాయి. కర్చీఫ్ వేసేది నేనే.! ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేసేది తానే అంటున్నారు సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ మేరకు ఆయన శపథం కూడా చేశారు. టిక్కెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని ఆశపడినా... అంతిమంగా పోటీ చేసేది తానేనని ఘంటా పథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టిక్కెట్ రాదంటూ కొందరు కావాలనే సోషల్ మీడియాలో దుష్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు వనమా వెంకటేశ్వరరావు. మరో వైపు మాజీ ఎమ్మేల్యే జలగం వెంకట్రావు సైతం టిక్కెట్ మీద ఆశపలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెప్పుకున్నా...సీపీఐ ఎంత డిమాండ్ చేసినా...చివరి నిమిషంలో తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు. పోటీకి మాత్రమే ఆశ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం వెంకట్రావు... నియోజకవర్గంలో జరిగే పార్టీ, ప్రభుత్వ కార్యక్రామాలకు మాత్రం హాజరు కావడంలేదు. పైగా సిటింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొనే కార్యక్రమాలవైపేతే కన్నెత్తి కూడా చూడటంలేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. సిటింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే..ఈ ఏపిసోడ్ లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్ త్రీలో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గులాబీ ముట్టుకుంటే ముళ్లేనా? ఇంకా మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్ఎస్తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడే సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీ పడుతూ శపథాలు చేస్తుంటే.. నేనూ ఉన్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడే హీటెక్కాయి. -
గుండెల్లో రైళ్లు.. ఎవరికి వాళ్లు ఫిక్స్ అయిపోయారు..!
కొత్తగూడెం రాజకీయాల్లో మునుగోడు ఎఫెక్ట్ కనిపిస్తోందా? ఈ ఉపఎన్నిక తెలంగాణలో పొత్తు రాజకీయాల్ని సమూలంగా మార్చబోతోందా? జరుగుతున్న పరిణామాలు కొత్తగూడెం గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అయితే అక్కడి పాలిటిక్స్ ఎందుకు అంతలా హీటెక్కాయో పరిశీలిస్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యునిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి టికెట్ తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతుంటే.. తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈ సారి ఏడాదిముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా కుదిరితే సీపీఐ వాళ్లు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేదని టీఆర్ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. చదవండి: (అది సక్సెస్ చేస్తే.. వారిరువురికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌కు గ్రీన్‌సిగ్నల్!) ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా. ఈమేరకు ఆయన శపథం కూడా చేశారు. టికెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని కథలు చెప్పినా అంతిమంగా పోటీచేసేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదంటూ కొందరు సోషల్ మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు జలగం వెంగళరావు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెబుతున్నా, సీపీఐ ఎంత డిమాండ్ చేసినా చివరి నిమిషంలో టికెట్ తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరుకావడం లేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా పాల్గొనే కార్యక్రమాలవైపు అయితే కన్నెత్తి కూడా చూడటం లేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నుకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే ఈ ఎపిసోడ్‌లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్-3లో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇంకా మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్ఎస్తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడు సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీపడుతూ శపథాలు చేస్తుంటే.. నేనున్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడు హీటెక్కాయి. -
పొలిటికల్ కారిడార్ : కొత్తగూడెం గులాబీకి గుచ్చుకుంటున్న కొడవలి
-
సంజయ్‌కి పాదయాత్ర చేసే అర్హత లేదు
సాక్షి, హైదరాబాద్: పాదయాత్రలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, తెలివి తక్కువగా, రోగ్‌లాగా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు, నాటి సాయుధ పోరాట చర్రితకు, సమాజానికి అన్యాయం చేసిన బీజేపీకి చెందిన బండి సంజయ్‌కు పాదయాత్ర చేసే అర్హత లేదన్నారు. 80 శాతం హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సాయుధ పోరాటయోధులు ఐలమ్మ, దొడ్డి కొమురయ్యలను బీజేపీ నేత ప్రకాశ్‌రెడ్డి కించపరిచే విధంగా మాట్లాడారని, ఇందుకు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారిన గవర్నర్ వ్యవస్థపై ఒక సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగా లిచ్చి న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎంకు తొలి లేఖ రాశారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన మెగా డీఎస్సీలో అర్హులైనవారు తెలంగాణలో దాదాపు 1,500 మంది ఉన్నారని పేర్కొన్నారు. అప్పటి డీఎస్సీలో నష్టపోయిన వీరందరూ 24 ఏళ్లుగా ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారని తెలిపారు. 2016 జనవరి 3న వారికి మానవతా దృక్పథంతో ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తానని సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. వయోపరిమితితో సంబంధం లేకుండా స్పెషల్ కేసు కింద పరిగణించి వీరిని తీసుకుంటామని, అభ్యర్థులెవరూ ఆందోళన చెందవద్దని ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేసీఆర్‌ను కోరారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులందరికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలిచ్చి వారిని ఆదుకొనే దిశగా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఆ ప్రకారం తెలంగాణలోనూ సానుకూలంగా స్పందించి త్వరలో నియామక ప్రక్రియ చేపట్టి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కూనంనేని సీఎంను కోరారు. -
సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శిగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు చెందిన కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఈ నెల 4 నుంచి 7వ తేదీ వరకు జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మూడో మహాసభలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఎన్నుకున్నారు. బుధవారం రాత్రి వరకు కార్యదర్శి ఎన్నికకు సంబంధించిన హైడ్రామా కొనసాగింది. ఇప్పటివరకు రెండు దఫాలు కార్యదర్శిగా కొనసాగిన చాడ వెంకట్‌రెడ్డి కూడా మరోసారి అవకాశం కావాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు నల్లగొండ జిల్లా మునుగోడు మాజీ ఎమ్మెల్యే, ఆపార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి కూడా రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం బరిలో నిలిచారు. దీంతో ముగ్గురు నేతలు పోటీ పడటంతో సభ్యుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ విషయమై బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము రెండున్నర వరకు సభ్యులు తర్జనభర్జన పడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. చివరికి చాడ వెంకటరెడ్డి తప్పుకోగా కూనంనేని, పల్లా మధ్య పోటీ అనివార్యమైంది. దీంతో ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. మహాసభలో ఎన్నికైన రాష్ట్ర సమితి సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. మొత్తం 110 ఓట్లు పోలు కాగా, అందులో కూనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు వచ్చాయి. ఆరు ఓట్లు చెల్లలేదు. దీంతో 14 ఓట్ల మెజారిటీతో కూనంనేని విజయం సాధించారు. కాగా, అంతకుముందు మహాసభ 101 మంది రాష్ట్ర సమితి సభ్యులను, 9 మంది కంట్రోల్ కమిషన్ సభ్యులను ఎన్నుకుంది. సమితి సభ్యుల నుంచి 31 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకుంది. గురువారం నూతన కార్యవర్గం వివరాలను సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజాన్, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెల్లడించారు. కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు చిన్న వయసు నుండే పార్టీలో పనిచేసు్తన్నారని, విశాలాంధ్ర విలేకరిగా, ఖమ్మం జిల్లాలో పార్టీలో వివిధ హోదాలను నిర్వర్తించారని, రాష్ట్ర సహాయ కార్యదర్శిగానూ పనిచేశారని చాడ తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల విధానం ద్వారా పార్టీ కార్యదర్శిగా కూనంనేనిని ఎన్నుకున్నామన్నారు. ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు: కూనంనేని ప్రజాసమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర నూతన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట కార్యక్రమాలను నిర్వహించేలా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇదీ చదవండి: కొత్త పట్టభద్రులకు కొలువులే కొలువులు! -
మహోద్యమానికి మద్దతివ్వండి
నేడు భారతదేశం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతు న్నది. డెబ్బై ఐదు ఏళ్ల భారతదేశ స్వాతంత్య్ర సంస్మరణగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్నాయి. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పేరుతో భారతదేశ స్వావలంబన ఆవిష్కరణకు పూను కున్నట్లుగా చెబుతున్నారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ బదులు ‘ఆత్మనిర్బల్ భారత్’గా మార్చి వేస్తున్నారు. గత 75 ఏళ్ల నుంచి దేశ ప్రజల కష్టంతో, చెమట చుక్కలతో పెద్దల దార్శనికతతో సంపాదించిన ప్రభుత్వరంగ ఆస్తు లను మొత్తాన్నీ అధికారికంగానే అమ్మకానికి పెట్టారు. బహిరంగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ప్రపంచ స్థాయిలోని అన్ని కార్పొరేట్ సంస్థలకు భారతదేశ ప్రభుత్వరంగ సంస్థలను, దేశ సంపదను... ‘ప్రైవేటీకరణ ’, ‘పెట్టుబడుల ఉపసంహరణ’, ‘నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్’ పేరుతో అమ్మకానికి పెడు తున్నారు. ప్రపంచంలో ఎన్ని ఆర్థిక సంక్షోభాలు వచ్చినా ప్రభుత్వ రంగ సంస్థల వల్లనే మనదేశం నిలబడగలిగింది. మోదీ ప్రధాని కాకముందే ప్రపంచంలోని 6వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందనే విషయం మరువరాదు. చేసిన ప్రమాణం ఏమయ్యింది? ‘హై సౌగంధ ముఝే ఇస్ మిట్టీకి, మై దేశ్ నహీ బిక్నా దూంగా’(దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మనివ్వనని దేశమాతపై ప్రమాణం చేసి చెబుతున్నాను) అంటూ నాటకీయ హావభావాలతో మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో అనేకసార్లు అన్నారు. ఈ రోజు అందుకు భిన్నంగా జరుగుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని కొద్దిమంది పారిశ్రామిక వేత్తలకు అతి తక్కువ ధరలతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేస్తున్నారు. స్వాతంత్య్ర తొలిదినాల్లో భారతదేశంలో కేవలం ఐదు ప్రభుత్వరంగ సంస్థలు రూ. 29 కోట్ల మూలధనంతో ఉండేవి. 2019 మార్చి నాటికి ఆ సంస్థల సంఖ్య 348కి చేరింది. వాటి మూలధనం రూ. 31,17,000 కోట్లయింది. ఇవి కేంద్ర ఖజానాకు రూ. 3,76,000 కోట్లు ప్రతి ఏడాదీ ఆదాయం సమకూరుస్తున్నాయి. ఐతే నీతి ఆయోగ్ సిఫార సులకు అనుగుణంగా 2021–22 బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్వహణలో ఉన్న 300 ప్రభుత్వరంగ సంస్థలను కేవలం 24 పరిశ్రమలుగా కుదిస్తామని పార్లమెంట్లో ప్రకటన చేశారు. అలాగే రూ. 40 లక్షల కోట్లకు పైగా ఆస్తులున్న 58 బీమా రంగంలో ఉన్న సంస్థలనూ తెగనమ్మే పనిలో ఉంది కేంద్రం. గత ఐదేళ్లలో ఎల్ఐసీ ఒక్కటే రూ. 28,200 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎల్ఐసీని భారతదేశ బంగారు బాతుగా అభివర్ణిస్తారు. ఈనాడు ఎల్ఐసీని కూడా పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకుల ఆస్తుల విలువ దాదాపు రూ. 40 లక్షల వేల కోట్లు ఉంటుంది. మోదీ ప్రభుత్వం 28 ప్రభుత్వ బ్యాంకులను విలీనాల ద్వారా 12కు కుదించింది. 1921– 22లో బ్యాంకులకు రూ. 1.58 లక్షల కోట్ల నిర్వహణ (ఆపరేటివ్) నికర లాభాలు వచ్చాయి. ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు డివిడెండ్ పేరుతో బ్యాంకులు చెల్లిస్తున్నాయి. అటువంటి కామధేను లాంటి బ్యాంకులలో మరో ఎనిమిదింటిని ప్రైవేటీకరించి, కేవలం 4 ప్రభుత్వ బ్యాంకులకు తగ్గిస్తారు. పేదవాడి గుండె చప్పుడు అయిన రైల్వే పరిశ్రమలో కూడా ప్రైవేటీకరణ ప్రారంభమైంది. నాలుగు రంగాలే వ్యూహాత్మకమా? 2021–22 కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ పథకం ప్రకారం కేవలం నాలుగు రంగాలను వ్యూహాత్మక రంగాలుగా పేర్కొన్నారు. అవి 1). అణు ఇంధనం, స్పేస్ అండ్ డిఫెన్స్, 2). ట్రాన్స్‌పోర్టు అండ్ టెలికమ్యూనికేషన్, 3). పవర్, పెట్రోలియం, కోల్, ఖనిజాలు, 4). బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలు. ఈ నాలుగు రంగాలలో మాత్రమే వ్యూహాత్మకంగా అతి తక్కువ వాటాను అంటే 2 నుంచి 3 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం కలిగి ఉంటుంది. అలాగే బ్రిటీష్ కాలం నుంచి ఉన్న 44 కార్మిక చట్టాలలోని కీలకమైన 29 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి, సమ్మెచేయలేని పరిస్థితులు కల్పిస్తున్నారు. న్యాయ సహాయం కూడా అందని విధంగా చేసి ప్రభుత్వరంగ సంస్థల నుంచి ప్రభుత్వ సర్వీసు సెక్టార్ వరకు అన్ని రంగాలలో కార్మికులను రోడ్లపైకి తెస్తున్నారు. అలాగే 2015– 16లో 8.5గా ఉన్న పీఎఫ్ వడ్డీ రేటును 8.1కు తగ్గించడం జరిగింది. దీని ప్రభావం దేశంలో ఉన్న కోట్లాది మంది పెన్షనర్లపై పడుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ వలన ఇకపైన ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు ఉండవు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులే మిగులుతారు. ప్రైవేటీకరణను గట్టిగా సమర్థించే మాంటెక్ సింగ్ అహ్లూవాలియా సైతం ప్రైవేటీకరణ వలన ఉద్యోగాలు కోల్పోవడం తప్పనిసరిగా జరుగుతుందనిపేర్కొన్నారు. మొత్తంగా దేశంలోని కేవలం ఒక్క శాతం మినహా 140 కోట్ల మంది భవిష్యత్తును పణంగా పెట్టి దేశాన్ని అమ్మకానికి పెట్టిన నరేంద్ర మోదీకీ, ఆయన ప్రభుత్వా నికీ... ఆ అధికారం ఎవరిచ్చారు? (క్లిక్: ఆ ఒప్పందం సఫలం కావాలంటే...) ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని అడ్డు కోకుంటే ఇప్పటికే ఆకలి సూచీ పట్టికలో 116 దేశాల్లో 101 స్థానంలో ఉన్న భారతదేశం మరింత సంక్షోభంలోకి నెట్టివేయబడుతుంది. ఆకలి చావులతో కూడిన కరవు దేశంగా మారే ప్రమాదం ఉన్నది. ఒక్క శాతం మంది చేతిలో 90 శాతం సంపద పేరుకుపోతే అది అభివృద్ధి కాదు. అంతులేని అసమానతల ప్రతీక! ఈ నేపథ్యంలో దేశంలో ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు దేశ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. దేశాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే రైతాంగ తరహా మహా కార్మిక ఉద్యమానికి దేశం సన్నద్ధం కావాలి. (క్లిక్: ఈ విజయం ఎలా సాధ్యమైంది?) - కూనంనేని సాంబశివరావు మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
రాజకీయాలు మారేదెన్నడు?
రాజకీయ సంబంధమైన చీకటి ఘటనలు వెలుగు చూస్తున్న తరుణంలో జనం మదిలో పలు ప్రశ్నలు మెదులుతున్నాయి. నేరమయ రాజకీయాలను నియం త్రించలేమా, సత్యశీల రాజకీయాలు చూడ లేమా అన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉండి సభ్యసమాజం ముక్కుమీద వేలేసుకునే విధంగా వ్యవహరిస్తున్నవారు అధికారం అండతోనే బరితెగిస్తున్నారని విశ్లేషకుల మాట. కొంతమంది ప్రజా ప్రతినిధులు నేరుగా అరాచకాలకు పాల్పడుతుంటే, మరికొన్నిచోట్ల కుటుంబ సభ్యులు లేదా ప్రధాన అనుచరులు అడ్డదారిలో పెత్తనాలను సాగిస్తూ అందినకాడకు పోగేసుకుంటున్నారు. పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులను ఏమీ అనలేని అధికార్లు మిన్నకుండిపోతున్నారు. డబ్బు ఖర్చుచేసి గెలవడం అంతకు పది రెట్లు అడ్డదారిన డబ్బు సంపాదించుకోవడం భారత రాజకీయ పటంలో సాధారణ దృశ్యమైంది. కొందరు రాజకీయనాయకులు సాయం కోరి వచ్చిన మహిళలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనీ ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఆరోపణలు వస్తున్నా పట్టించుకుని పోలీసులు చర్యలు తీసుకోవడం లేదనేది బాగా విని పిస్తున్న విమర్శ. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో జరిగిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనను విమర్శకులు ఇందుకు మంచి ఉదాహరణగా చూపుతున్నారు. శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు అండతో... ఆయన కుమారుడు రాఘవ అనేక అరాచకాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయనపై 12 కేసులు పెడితే... కేవలం రెండు కేసుల్లోనే పోలీసులు చార్జిషీట్ నమోదు చేసి మిగతా కేసుల గురించి పట్టించు కోలేదంటే... రాజకీయ ఒత్తిళ్ళు ఏ స్థాయిలో ఉన్నాయో ఆర్థమవుతుంది. ఎమ్మెల్యే కుమారుని ఆగడాలకు బలైన బాధితుడు రామకృష్ణ సెల్ఫీవీడియో చూసిన జనం ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లనే ప్రభుత్వం చర్యలకు దిగిందని ప్రజలు అనుకుంటున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే కుమారుని అరాచకం నియోజకవర్గం అంతా విస్తరించింది. ఆత్మహత్య చేసుకున్న వారు కొందరైతే, సర్వం పోగొట్టుకొని జీవచ్ఛవాలుగా బతుకుతున్నవారు మరికొందరు. పాల్వంచ ఘటనలో అతడివల్ల ఓ కుటుంబం లోని నలుగురు ఆత్మహత్య చేసుకుంటే అతడిపై సాధారణ క్రిమినల్ సెక్షన్ల కింద కేసు పెట్టడం విడ్డూరం. వనమా రాఘవపై అతడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న భూక్యా జ్యోతి ఫిర్యాదు చేసినప్పుడే పాల్వంచ పోలీసులు స్పందించి ఉంటే రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండేది కాదని ప్రజలు అంటున్నారు. (చదవండి: ప్రగతిభవన్ వర్సెస్ రాజ్‌భవన్?) ప్రజా ఉద్యమాల్లో ఉండి ప్రజల కోసం తపిస్తూ ప్రశ్నించే, పోరాడే... సామాన్య ప్రజలు, కవులు, కళాకారులు, అభ్యుదయ వాదులు, ప్రజాతంత్ర వాదులు, విప్లవ పార్టీల, కమ్యూనిస్టు పార్టీల నాయకులపై యూఏపీఏ (ఉప) లాంటి చట్టాల ద్వారా దేశద్రోహం కేసులు మోపి సంవత్సరాల తరబడి బెయిలు రానివ్వని స్థితిని చూస్తున్నాము. మరోవైపు లైంగిక దాడులు, హత్యలు, కబ్జాలు, సెటిల్మెంట్లు చేస్తున్నవారిపై కొన్ని సందర్భాల్లో అసలు కేసులే నమోదు కావడం లేదు. ఇదంతా రాజకీయాల మహిమేనని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే ముందు ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి. అలాగే సేవాభావం కలిగిన, నీతి మంతులు రాజకీయాల్లోకి రావాలి. అసాంఘిక శక్తులు చట్టసభల్లో ప్రవేశించకుండా కఠిన చట్టాలు రూపొందాలి. (చదవండి: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) - కూనంనేని సాంబశివరావు మాజీ శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
దీక్ష కొనసాగిస్తా: కూనంనేని
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ పరిరక్షణతో పాటు, కార్మికుల న్యాయసమ్మతమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు తన నిరవధిక దీక్ష కొనసాగిస్తానని సీపీఐ సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. సమ్మెపై జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపాలని, వివిధ డిమాండ్లపై సానుకూల నిర్ణయం వెలువడే వరకు తన నిరసన దీక్ష కొనసాగుతుందని ‘సాక్షి’కి తెలిపారు. తన పల్స్రేట్ 53కు పడిపోయిందని, ఆరోగ్యం విషమిస్తోందని డాక్టర్లు హెచ్చరించారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతోనైనా ప్రభుత్వం కదిలి ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే పరిష్కారం సాధ్యం కాదని భావించే విషయాలపై కమిటీని ఏర్పాటుచేసి, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కూనంనేని చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష బుధవారం ఐదో రోజుకు చేరుకుంది. నిమ్స్ ఆసుపత్రిలో కోదండరాం (టీజేఎస్), సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఈటీ నర్సింహ (సీపీఐ), మంద కృష్ణమాదిగ (ఎమ్మార్పీఎస్), వీహెచ్ (కాంగ్రెస్), ఎల్.రమణ (టీటీడీపీ), రావుల చంద్రశేఖరరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కూనంనేనిని పరామర్శించారు.