గతంలో జలగం – వనమా మధ్య వివాదం
రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసిన కొత్తగూడెం అసెంబ్లీ
అఫిడివిట్‌లో తప్పుడు వివరాలంటూ న్యాయస్థానంలో వ్యాజ్యాలు
తాజాగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేనికి హైకోర్టు నోటీసులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శాసనసభ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులు సమర్పించే అఫిడివిట్‌లో సరైన వివరాలు అందించలేదనే వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేసి సాంబశివరావుకు రాష్ట్ర హై కోర్టు నోటీసులు పంపింది. దీంతో మరోసారి అఫిడవిట్ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
జలగం వర్సెస్ వనమా..
తెలంగాణ అసెంబ్లీకి రెండోసారి 2018లో జరిగిన ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరఫున జలగం వెంకటరావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో జలగంపై వనమా గెలుపొందారు. అయితే నామినేషన్ సందర్భంగా వనమా సరైన వివరాలు సమర్పించలేదంటూ జలగం వెంకటరావు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత 2023 జూన్‌లో వనమా ఎన్నిక చెల్లదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా గుర్తించాలని శాసన సభ కార్యదర్శిని జలగం వెంకటరావు కోరారు. ఇంతలో హై కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
అప్పటి నుంచే రగడ..
జలగం వర్సెస్ వనమా కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఈసారి ఎన్నికల సందర్భంగా నామినేషన్ల అంశంపై అన్ని పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. బీఆర్‌ఎస్ అయితే రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ పత్రాలు నింపేందుకు, సరి చూసుకునేందుకు ప్రత్యేక శిబిరం నిర్వహించింది. ఇక కొత్తగూడెం విషయానికి వస్తే నామినేషన్ దరఖాస్తుల పరిశీలన గరం గరంగా జరిగింది. ఈ స్థానం నుంచి మొత్తం 36 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు, బీఎస్పీ అభ్యర్థి వై. కామేశ్‌తో పాటు మరికొందరు అభ్యర్థులు అఫిడవిట్‌లో సమర్పించిన అంశాలపై మరో అభ్యర్థి జలగం వెంకటరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. కాగా ఇప్పుడు హై కోర్టులో వ్యాజ్యం దాఖలు కావడంతో మరోసారి అఫిడవిట్ అంశంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment