Bhadradri District Latest News
-
మారథాన్ పోటీల్లో తహసీల్దార్ ప్రతిభ
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో ఎన్నికల విభాగం తహసీల్దార్ దారా ప్రసాద్ ఆదివారం ముంబైలో నిర్వహించిన మారథాన్ పోటీల్లో ప్రతిభ చాటారు. 42.195 కి.మీ. దూరాన్ని 5 గంటల 13 నిమిషాల 35 సెకన్లలో పూర్తిచేశారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రసాద్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం అవసరమని అన్నారు. ప్రసాద్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగులు ఆ దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ కూడా ప్రసాద్‌ను అభినందించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రమాదేవి, ఎలక్షన్ సెల్ అధికారులు, ఉద్యోగులు రంగాప్రసాద్, శ్రీనివాసయాదవ్, సాయికృష్ణ, రామకృష్ణ, నవీన్, నజీర్, సంపత్ పాల్గొన్నారు.అభినందించిన కలెక్టర్ పాటిల్ -
రామదాసు మండపంలో రాపత్తు సేవ
భద్రాచలంటౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి సోమవారం రామదాసు మండపంలో రాపత్తు సేవ నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాలు, శ్రీరామ నామస్మరణల నడుమ పల్లకీ సేవగా పురవీధుల్లో ఊరేగింపుగా అంబసత్రానికి తీసుకెళ్లారు. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి నివేదన, హారతి సమర్పించారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ దంపతులు రాపత్తు సేవలో పాల్గొన్నారు. రామయ్యకు ముత్తంగి అలంకరణభద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారు ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి సోమవారం స్వామివారిని ఈ రూపంలో అలంకరించడం ప్రత్యేకత. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో అంతర్గత బదిలీలు..శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పది మంది ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఈఓ రమాదేవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసరెడ్డిని ప్రొటోకాల్, గోశాల పర్యవేక్షులుగా, ఎం.బాలాజీని అన్నదాన ఇన్చార్జ్గా బదిలీ చేశారు. మరో సీనియర్ అసిస్టెంట్ ఎం.కృష్ణస్వామితో పాటు జూనియర్ అసిస్టెంట్లు స్వర్ణకుమారి, రాకేష్, రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఆగారెడ్డి, కుమారి, అటెండర్ గోపాలకృష్ణను ఇతర విభాగాలకు బదిలీ చేశారు. -
సంక్షేమం ఎవరికో..?
జిల్లాలో నేటి నుంచి గ్రామ సభలు ● ఇప్పటికే అర్హుల జాబితాల రూపకల్పన ● ప్రజల సమక్షంలో ప్రదర్శించనున్న అధికారులు ● అవసరమైతే మార్పులు, చేర్పులు.. ● అందరి ఆమోదంతో లబ్ధిదారుల గుర్తింపు చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికకు అధికారులు సన్నద్ధమయ్యారు. అర్హుల జాబితా తయారీకి మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లో అర్హుల జాబితాలు ఎంపిక చేశాక కలెక్టర్ ఆమోదానికి పంపిస్తారు. ప్రజాపాలనలో దరఖాస్తుల ఆధారంగా ఈనెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అర్హుల ముసాయిదా జాబితాలు రూపొందించారు. మంగళవారం నుంచి నిర్వహించే గ్రామ సభల్లో ఈ జాబితాలను ప్రజల సమక్షంలో ప్రకటించి, ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే చేస్తారు. ఈ నాలుగు పథకాలకు ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఉన్నా తిరిగి స్వీకరిస్తారు. 26న శ్రీకారం.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి నాలుగు సంక్షేమ పథకాలను ఈనెల 26న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఈనెల 24 వరకు గ్రామ సభల నిర్వహణకు పక్కా ప్రణాళిక రూపొందించారు. గ్రామ సభల సందర్భంగా లబ్ధిదారుల వివరాల డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని, ఫ్లెక్సీలు, మౌలిక సదుపాయాలు, ఫిర్యాదులు, అర్జీల స్వీకరణ వంటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ‘సంక్షేమం’ ఇలా.. వ్యవసాయ యోగ్యమైన భూములకు పంట పెట్టుబడి సాయం కింద రెండు విడతల్లో కలిపి ఎకరాకు ఏడాదికి రూ.12వేలు రైతు భరోసా పథకం ద్వారా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సాగులో లేని భూములకు ఈ పథకం వర్తించదు. గతంలో జిల్లాలోని 1,84,014 మంది రైతులకు చెందిన 5,09,966 ఎకరాల భూమికి రైతుబంధు ద్వారా సాయం అందించారు. అయితే ప్రస్తుతం సాగు చేస్తున్న భూముల వివరాలను పరిశీలించిన అధికారులు.. ఆ వివరాలను గ్రామసభల్లో ప్రదర్శిస్తారు. ఆ తర్వాత అర్హత గల భూముల వివరాలను వెల్లడిస్తారు. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు రూ. 6వేలు చొప్పున ఏడాదికి రెండు విడతల్లో రూ. 12వేలు అందిస్తారు. ఇందుకు గాను 2023 – 24 సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లిన వారినే అర్హులుగా గుర్తిస్తారు. జిల్లాలో 2.19 లక్షల జాబ్ కార్డులు ఉండగా 4.50 లక్షల మంది పేరు నమోదు చేసుకున్నారు. ఇందులో 73,143 మంది కూలీలు గతేడాది 20 రోజుల పని దినాలు పూర్తి చేయగా, వడ పోసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలో 41,508 మందికి ఈ పథకం వర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో ముఖ్యమైన రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇటీవల చేపట్టిన సర్వే ఆధారంగా అధికారులు రేషన్ కార్డులు లేని పేద కుటుంబాల జాబితాను రూపొందించారు. గ్రామ, వార్డు సభల్లో వీటిని ప్రదర్శించి అర్హులను ఎంపిక చేస్తారు. జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం 42,644 దరఖాస్తులు వచ్చాయి. గ్రామ సభలకు ఏర్పాట్లు చేశాం జిల్లాలో అర్హులైన వారికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే అర్హులను గుర్తించగా నేటి నుంచి జరిగే గ్రామ సభల్లో ముసాయిదా జాబితాలను ప్రజల ముందుంచుతాం. ఆయా సభల్లో చర్చించిన తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. అర్హులైన పేదలకు ఈ పథకాలను అందించడమే లక్ష్యం. గ్రామ సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. – డి.వేణుగోపాల్, అదనపు కలెక్టర్ఇందిరమ్మ ఇళ్లకు 2,79,638 దరఖాస్తులు.. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి జిల్లా వ్యాప్తంగా 2,79,638 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో దారిద్య్రరేఖకు దిగువన ఉండి.. నివాస స్థలం ఉండి కూడా ఇల్లు లేనివారు, పూరిగుడిసెలు, అద్దె ఇళ్లలో ఉంటున్నవారిని అర్హులుగా నిర్ధారించారు. మట్టి గోడలు, పైకప్పు లేని గృహాలతో పాటు వితంతువులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, దరఖాస్తులను పరిశీలించిన సిబ్బంది.. లబ్ధిదారుల ఎంపికకు వారి ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్‌లో నమోదు చేశారు. మండలస్థాయి అధికారులు సూపర్ చెక్ చేశారు. దీని ప్రకారం ముసాయిదా జాబితా సిద్ధం కాగా, గ్రామ సభల్లో చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. -
‘పది’లో ఫలితం దక్కేనా ?
● గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థుల వెనుకబాటు.. ● నేటి నుంచి పాఠశాలల్లో ప్రత్యేక పరీక్షలు ● ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్స్ నిర్వహించే అవకాశంనేటి నుంచి స్పెషల్ టెస్ట్‌లు.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మంగళవారం నుంచి ప్రత్యేక పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం యథావిధిగా తరగతులు నిర్వహించాక మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పరీక్షలు ఏర్పాటు చేశారు. 21న తెలుగు, 22న హిందీ, 23న ఇంగ్లిష్, 24న గణితం, 25న ఫిజికల్ సైన్స్, 27న బయాలజికల్ సైన్స్, 28న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ప్రత్యేక పరీక్షల సమయంలో విద్యార్థులకు స్నాక్స్ అందించగా ప్రస్తుతం వాటికి నిధులు కేటాయించలేదు. దీంతో స్వచ్ఛంద సంస్థల వారెవరైనా సమకూరుస్తారా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కొత్తగూడెంఅర్బన్: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ లోపం, ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె తదితర కారణాలతో పలు పాఠశాలలు, కేజీబీవీల్లో పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మార్చిలో వార్షిక పరీక్షలు జరుగనుండగా సిలబస్ పూర్తి చేసి జనవరి 10 నుంచి సబ్జెక్టుల వారీగా రివిజన్ చేపట్టాల్సి ఉంది. కానీ పలు పాఠశాలల్లో గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఇప్పటివరకు సిలబసే పూర్తి కాలేదు. ఈ ప్రభావం ఫలితాలపై పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది సబ్జెక్టు టీచర్ల కొరత కారణంగా పదో తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధన జరగలేదు. దీంతో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు. ఈ ఏడాది కొత్తగా జిల్లాకు 421 మంది ఉపాధ్యాయులు వచ్చారు. అయితే వారి సేవలను సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు విఫలం చెందారనే ఆరోపణలున్నాయి. పదో తరగతి విద్యార్థులకు నవంబర్ నుంచే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు జరుగుతున్నా కీలకమైన సబ్జెక్టుల్లో వెనుకబడడంతో ఫలితాలు ఎలా ఉంటాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెలలో ప్రీ ఫైనల్ పరీక్షలు.. జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈ ఏడాది 12,484 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరికి మంగళవారం నుంచి ప్రత్యేక పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చిలో వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఇలా వరుస పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు నిపుణులతో ప్రత్యేక తరగతులు బోధించాలని పలువురు సూచిస్తున్నారు. పరీక్ష సమయంలో ఎలా ఉండాలి, ఆహార నియమాలు ఎలా పాటించాలనే విషయాలపై అవగాహన కల్పిస్తే విద్యార్థులకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. ఇంటర్ విద్యార్థులకు ఇప్పటికే ఇలాంటి తరగతులు బోధిస్తుండగా, పదో తరగతి విద్యార్థులకు కూడా చెప్పించాలని కోరుతున్నారు. పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి స్పెషల్ టెస్ట్‌లు జరుగనున్నాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తయింది. పూర్తి కాని పాఠశాలల సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. మంచి ఫలితాలు రాబట్టేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం. – ఎం.వెంకటేశ్వరా చారి, డీఈఓ -
రావికంపాడులో పోడు వివాదం
చండ్రుగొండ : మండలంలోని రావికంపాడు గ్రామశివారు అటవీప్రాంతంలో ఫారెస్టు అధికారులు చేపట్టిన కందకం పనులను గిరిజనులు సోమవారం అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో ఎఫ్డీఓ కోటేశ్వరరావు, ఎస్ఐ శివరామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోడు పట్టాలున్న తమ భూముల మధ్య నుంచి కందకం తీస్తున్నారని పోడు సాగుదారులు పేర్కొంటున్నారు. మ్యాప్ ప్రకారం అటవీ సరిహద్దులోనే కందకం పనులు చేస్తున్నట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం జరిగింది. పోడుపట్టాలున్న భూములను మినహాయించే కందకం తీస్తున్నామని, అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్లాల్సిందిగా ఎఫ్డీఓ కోటేశ్వరరావు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శివరామకృష్ణ హెచ్చరించారు. దీంతో గిరిజనులు వెనక్కుతగ్గారు. చండ్రుగొండ, జూలూరుపాడు, కొత్తగూడెం ఎఫ్ఆర్ఓలు ఎల్ల య్య, ప్రసాదరావు, శ్రీనివాసరావు, ఫారెస్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.కందకం పనులను అడ్డుకున్న గిరిజనులు -
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంటౌన్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా సెంటర్లో ఉచిత శిక్షణ కోసం అర్హులైన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి పి.పరందామరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. 12 నుంచి 18 ఏళ్ల వయసు కలిగి, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న వారే అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల వారు ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, స్పోర్ట్స్, మెడికల్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, విద్యార్హత సర్టిఫికెట్లను దరఖాస్తులకు జత చేయాలని వివరించారు. ఎంపికై న క్రీడాకారులకు ఖేలో ఇండియా సెంటర్ రెసిడెన్షియల్లో ఉచిత శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు. -
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
● మాతాశిశు సంరక్షణ అధికారి చైతన్య మణుగూరు రూరల్ : వైద్యులు, సిబ్బంది నిత్యం సమయపాలన పాటించాలని మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ చైతన్య సూచించారు. మణుగూరు మున్సిపాలిటి పరిధిలోని శివలింగాపురంలో గల మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుపట్టిక, రికార్డులు, ఈడీడీ క్యాలెండర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే పేషంట్లకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. సాధారణ ప్రసవం పొందిన అనిత అనే మహిళతో మాట్లాడి సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. ఆస్పత్రిలో సాధారణ కాన్పులు అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యులు నిశాంత్‌రావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. అన్‌ఫిట్ కార్మికుల వారసులకు నియామక పత్రాలుసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కొంతకాలం పనిచేసి, ఆనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల పిల్లలకు ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలేంరాజు సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గైర్హాజరు లేకుండా పనిచేసి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని, భవిష్యత్‌లో సంస్థ నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో అంకిత బావంతో పనిచేయాలని, అధికారులు సూచించిన రక్షణ సూత్రాలను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం కోటిరెడ్డి, సీనియర్ పీఓ మురళి, యూనియన్ నాయకులు ఎండీ రజాక్, వి.మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు. ఎకరాకు రూ.21లక్షలు ● ‘సీతారామ’ కెనాల్ నిర్వాసితులకు పరిహారం ఏన్కూరు: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా లింక్ కెనాల్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.21 లక్షలు పరిహారం చెల్లించనున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లోని పలువురు రైతుల భూముల్లో కెనాల్ నిర్మాణం చేపట్టారు. అయితే, పరిహారం విషయమై తేల్చకపోవడంతో రైతులు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తున్నారు. ఈనేపథ్యాన ఎకరాకు రూ.21లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులు వైరాలో సోమవారం ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ కెనాల్‌కు భూములకు ఇచ్చిన రైతులను ఎన్నటికీ మరిచిపోమని చెప్పారు. 3.50లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు ఖమ్మంవ్యవసాయం: జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ద్వారా ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు రూ.99 కోట్ల విలువైన 3.50 లక్షల క్వింటళ్ల ధాన్యం కొనుగోలు చేశామని చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు వెల్లడించారు. ఖమ్మంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని 29కేంద్రాల ద్వారా 2.56 లక్షల క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలోని 11కేంద్రాల ద్వారా 94వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా రైతుల వద్ద ధాన్యం ఉంటే డీసీఎంఎస్ కేంద్రాల్లో త్వరగా విక్రయించుకోవాలని సూచించారు. పాలకవర్గ సభ్యులు పరుచూరి రవికుమార్, జక్కుల లక్ష్మయ్య, కుంచపు వెంకటేశ్వర్లు, తోళ్ల కోటయ్య, మారుతి ఎట్టయ్య, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ పాల్గొన్నారు. -
గ్రామసభలను విజయవంతం చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి అమలు చేయనున్న రైతు భఽరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల లబ్ధిదారుల ఎంపికకు మంగళవారం నుంచి ఈనెల 24 వరకు నిర్వహించనున్న గ్రామ సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామసభల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. టెంట్లు, మైక్సెట్లు, తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ సభల నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కల్పించాలని, ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలను వివరించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీఎస్ఓ రుక్మిణి, హౌసింగ్ పీడీ శంకర్, డీఏఓ బాబూరావు, డీపీఓ చంద్రమౌళి, ఏఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. వివాదాస్పద భూముల పరిశీలనచుంచుపల్లి: చుంచుపల్లి తండా బైపాస్ సమీపంలోని ఐటీఐ కాలేజీ దగ్గర వివాదంలో ఉన్న భూములను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సోమవారం పరిశీలించారు. స్థానిక గిరిజనుడు అంగోత్ భాస్కర్ కుటుంబ సభ్యులకు సర్వే నంబర్ 19/1 నుంచి 19/6లో గల 13.26 ఎకరాల భూమి ఉండగా గిరిజనేతరులు కబ్జాకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భాస్కర్ జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తున్న తరుణంలో వ్యవసాయ భూములను పరిశీలించిన కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పత్రాలను పరిశీలించి సమగ్ర నివేదికను నేషనల్ ఎస్టీ కమిషన్‌కు పంపించి గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. ఆయన వెంట చుంచుపల్లి తహసీల్దార్ కృష్ణ తదితరులు ఉన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ఏడు పంచాయతీలను కార్పొరేషన్లో కలపొద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆయా పంచాయతీల ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య మాట్లాడుతూ అర్బన్ స్వభావం లేని ఏడు పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేస్తే వ్యవసాయ కార్మికులు, చిన్న, సన్నకారు రైతులు నష్టపోతారని అన్నారు. ఆయా గ్రామాల్లో సుమారు ఐదు వేల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారని, వారందరికి ఉపాధి పథకం వర్తించదని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అభివృద్ధి చేసేందుకు తమపార్టీ వ్యతిరేకం కాదని అన్నారు. అర్బన్ స్వభావం లేని పల్లె ప్రాంతాలను కార్పొరేషన్లో కలపడం వల్ల పేదలు, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు కున్సోత్ ధర్మ, ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శివరాం ప్రసాద్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు లిక్కి బాలరాజు, కాలంగి హరికృష్ణ, సీఐటీయూ నాయకులు దొడ్డ రవికుమార్, వీర్ల రమేష్, భూక్య రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం, జీఎంపీఎస్, మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు మెరుగైన వసతులు
భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులు వాతావరణం మార్పు వల్ల అనారోగ్యానికి గురి కాకుండా మెరుగైన వసతులు కల్పించి పర్యవేక్షించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం గిరిజన దర్బార్‌లో భాగంగా ఆయన పలువురి దరఖాస్తులు, వినతిపత్రాలు స్వీకరించారు. కాగా, పోడు సమస్య, జీవనోపాధికి వ్యక్తిగత రుణాల, వ్యవసాయ భూములకు విద్యుత్ మోటార్ల మంజూరు, గిరిజన గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, కులాంతర వివాహితులకు ప్రోత్సాహక నగదు మంజూరు తదితర అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు అందాయి. అనంతరం అధికారులతో సమావేశమైన పీఓ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు పథకాలు వర్తించేయాలని సూచించారు. అలాగే, వసతిగృహాలు, గురుకులాల్లోని విద్యార్థుల విషయమై సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, వివిధ శాఖల అధికారులు నాగార్జునరావు, సున్నం రాంబాబు, లక్ష్మీనారాయణ, పవర్ వేణు, రవీంద్రనాథ్, చంద్రశేఖర్, ఉదయ్‌కుమార్, ప్రభాకర్‌రావు, ఆదినారాయణ, అనసూయ, అశోక్‌కుమార్, మణిధర్, నారాయణరావు పాల్గొన్నారు. కొత్త ప్రాజెక్టులకు దరఖాస్తుల స్వీకరణజిల్లాలోని షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల నుంచి కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించనున్నట్లు పీఓ బి.రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు www. ngo.tribal.gov.in పోర్టల్ ద్వారా ఫిబ్రవరి 15 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
నిర్మాణంలో మినీ ‘స్టే’డియం!
●రెండేళ్ల క్రితం జిల్లాకు ఐదు క్రీడా మైదానాలు మంజూరు ●ఇల్లెందు, మణుగూరులో ముందుకు సాగని పనులు ●భద్రాచలం, అశ్వారావుపేటలో ఎట్టకేలకు స్థల సేకరణ పూర్తి ●పాల్వంచలో మాత్రం 90 శాతం మేర పూర్తయిన నిర్మాణ పనులు కొత్తగూడెంటౌన్: మినీ స్టేడియాల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో నియోజకవర్గానికొకటి చొప్పున ప్రభుత్వం ఐదింటిని మంజూరు చేసింది. వీటిలో ఇంకా రెండింటి నిర్మాణ పనులే ప్రారంభంకాలేదు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 2023 మినీ స్టేడియాల నిర్మాణానికి ఉపక్రమించింది. పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, ఆశ్వారావుపేటలలో వీటి ఏర్పాటుకు నిర్ణయించింది. ఒక్కో స్టేడియానికి రూ.2.10 కోట్ల నుంచి రూ.2.60 కోట్ల వరకు కేటాయించింది. ఇల్లెందులో.. ఇల్లెందులో మినీ స్టేడియానికి రూ.2.17 కోట్లు కేటాయించారు. రూ.1.40 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.67.53 లక్షల పనులు చేపట్టాల్సి ఉంది. ఆఫీస్ బిల్డింగ్, ఇండోర్ స్టేడియం రూంలు, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, జిమ్నాస్టిక్స్ రూమ్‌ల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇండోర్ షటిల్ కోర్టు, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ ఫిట్టింగ్, 200 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్, వాలీబాల్, ఖోఖో, ఫుట్ బాల్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్, కాంపౌండ్ వాల్, మెయిన్‌గేట్ పనులు పూర్తి కావాల్సి ఉంది. మణుగూరులో.. పినపాక(మణుగూరు)లో మినీ స్టేడియం కోసం రూ.193.24 లక్షలు కేటాయించారు. ఇప్పటివరకు రూ.118.85 లక్షల పనులు పూర్తి కాగా, రూ.66.32 లక్షల పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆఫీస్ బిల్డింగ్, ఇండోర్ స్టేడియం రూములు, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, జిమ్నాస్టిక్స్ రూమ్స్ పూర్తి కాగా ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ ఫిట్టింగ్, 200 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్, వాలీబాల్, ఫుట్‌బాల్, ఖోఖో కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్, కాంపౌండ్ వాల్, మెయిన్‌గేట్ తదితర నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. భద్రాచలంలో.. భద్రాచలంలో మినీ స్టేడియం నిర్మాణ స్థల సేకరణకు దాదాపు రెండేళ్లకుపైగా సమయం పట్టింది. ఎట్టకేలకు అధికారులు అనువైన స్థలాన్ని గుర్తించి భూ సేకరణ పూర్తి చేశారు. మినీ స్టేడియానికి దాదాపు రూ.2.65 కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచి నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. అశ్వారావుపేటలో.. అశ్వారావుపేటలో మినీ స్టేడియానికి దాదాపు రూ.2.65 కోట్ల బడ్జెట్ కేటాయించారు. మూడేళ్ల నిరీక్షణ తర్వాత అశ్వారావుపేటలో 5.02 ఎకరాల భూమిని అధికారులు కేటాయించారు. నిర్మాణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది.పాల్వంచలో.. పాల్వంచ శ్రీనివాసకాలనీలో రూ.2.10 కోట్లతో మినీ స్టేడియం పనులు చేపట్టారు. ఇప్పటివరకు రూ.1.20 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా రూ.90.12 లక్షల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. మెయిన్ ఇండోర్ స్టేడియం, డీవైఎస్ఓ ఆఫీస్ బిల్డింగ్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్ రూమ్స్, జిమ్నాస్టిక్స్ రూమ్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తయ్యాయి. షటిల్ కోర్టులు, ఫ్లోరింగ్, పుట్‌బాల్ కోర్టు, ఎంట్రీ గేట్ అండ్ నేమ్ బోర్డు, 200 మీటర్ల ట్రాక్, వాలీబాల్, ఖోఖో కోర్టులు, సెప్టిక్ ట్యాంక్, వాటర్‌ట్యాంక్‌లు, ఎలక్ట్రిక్ వైరింగ్ పూర్తి కావాల్సి ఉంది.ప్రణాళికలు తయారు చేశాం ఐదు మినీ స్టేడియాల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. పాల్వంచలో 90 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మరో రెండింటి పనులు చివరి దఽశలో ఉన్నాయి. భద్రాచలం, అశ్వారావుపేటలలో స్థల అడ్డంకులు తొలగిపోయాయి. పనులు ప్రారంభిస్తాం. –పరంధామరెడ్డి, జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి -
ముగ్గురిపై కేసు నమోదు
భద్రాచలంఅర్బన్ : పోలీసులు సోమవారం ముగ్గురిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని రెవెన్యూ కాలనీకి చెందిన ధరణిశివకు బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన వల్లోజి గణేష్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నంగా రూ.4 లక్షల నగదు ఇచ్చారు. వీరికి పాప ఉంది. ధరణిని కొంతకాలంగా ఆమె భర్త గణేష్, మామ శ్రీను, అత్త లక్ష్మి అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. వేధింపులు భరించలేక ఏడాది క్రితం నుంచి ఆమె పుట్టింట్లో ఉంటోంది. కొన్ని రోజుల తర్వాత అక్కడకు వచ్చిన భర్త మళ్లీ వేధిస్తున్నాడు. పాపను చంపేస్తానని బెదిరింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త, అత్తామామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. -
కన్నకూతురునే కడతేర్చబోయాడు..
●ఉరిపెట్టి హత్య చేసేందుకు యత్నించిన తండ్రి ●చనిపోయిందనుకుని వెళ్లిపోయాక మేల్కొని ఇంటికి చేరిన బాలిక ●తల్లి ఫిర్యాదుతో తండ్రిపై కేసు నమోదు టేకులపల్లి : కన్న కూతురునే కడతేర్చబోయాడో తండ్రి. అదృష్టం బాగుండి గంట తర్వాత తేరుకుని ఇంటికి చేరిన బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టేకులపల్లి మండలం సంపత్‌నగర్‌కు చెందిన కొర్సా రవి –లక్ష్మి దంపతులకు 8, 9, 10 ఏళ్ల వయసు గల ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించే ఈ దంపతులు తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో లక్ష్మి రెండేళ్ల పాటు భర్తకు దూరంగా బంధువుల ఇంట్లోనే ఉంది. ఇటీవల గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి రవిని మందలించడంతో పాటు లక్ష్మిని భర్త వద్దకు రావాలని సూచించారు. దీంతో లక్ష్మి తిరిగి రాగా, ఇటీవల మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈనెల 13న మద్యం సేవించిన రవి భార్యపై కోపంతో చిన్నకూతురు సాహిత్యకు చాక్లెట్ కొనిస్తానంటూ ఊరి బయట ఉన్న జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి చెట్టుకు టవల్‌తో ఉరి పెట్టాడు. కనుగుడ్లు బయటకు వచ్చి బాలిక కదలకుండా ఉండడంతో చనిపోయిందనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గంట తర్వాత మేల్కొన్న బాలిక ఇంటికి వచ్చి ఈ విషయం తల్లికి చెప్పింది. దీంతో భార్యతో పాటు గ్రామస్తులంతా రవిని నిలదీశారు. అయినా మార్పు రాకపోవడంతో లక్ష్మి మండలంలోని బోడు పోలీసు స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రవిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు. -
ఆర్టిజన్లను పర్మినెంట్ చేయాల్సిందే..
పాల్వంచ: టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లో పనిచేస్తున్న సుమారు 23వేల మంది ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేసి పర్మినెంట్ చేయాలని టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఎం.ఏ.వజీర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. విద్యుత్ రంగంలోని ఆర్టిజన్లను పర్మినెంట్ చేయాలని డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యాన పాల్వంచలోని స్థానిక కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలను సోమవారం వారు ప్రారంభించి మాట్లాడారు. విద్యార్హత ఆధారంగా స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలని, చట్టప్రకారం ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వారికి ఇంక్రిమెంట్, గ్రేడ్ ప్రమోషన్ ఇవ్వాలన్నారు. కానీ పదేళ్లు దాటినా యాజమాన్యాలు పదోన్నతులు కల్పించకుండా వెట్టిచాకిరీ చేయించుకోవడం సరికాదన్నారు. ఈనెల 24వ తేదీ వరకు కొనసాగే దీక్షలతో స్పందన రాకపోతే ఫిబ్రవరి 3వ తేది నుండి 13వరకు జిల్లా పర్యటనలు, 20న చలో విద్యుత్ సౌధ ముట్టడి నిర్వహిస్తామని వెల్లడించారు. దీక్షలో ఆర్టిజన్ నాయకులు టి.రమేష్, టి.త్రినాధ్, జీ.వీరస్వామి, వి.సాయికిరణ్, బి.మధుకుమార్, కన్నయ్య, సైదులుబాబు, కృష్ణ, రమేష్, శంకర్,యాకయ్య, రమేష్, ప్రవీణ్, సుధాకర్, అబ్దుల్ కరీం, మహేష్, కె.కృష్ణ పాల్గొనగా వివిధ పార్టీలు, ఉద్యోగ సంఘాల నాయకులు ముత్యాల విశ్వనాధం, వీసంశెట్టి పూర్ణచందర్రావు, సాయిబాబా, బానోతు శంకర్, అంకిరెడ్డి నర్సింహారావు, రాధాకృష్ణ, రాము, రాజేంద్ర సంఘీభావం తెలిపారు.కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో రిలే దీక్షలు ప్రారంభం -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
ఇల్లెందు : ఓ ఉపాధ్యాయుడు పాఠశాలలోనే గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఇల్లెందులో సోమవారం చోటుచేసుకుంది. పట్టణంలోని జేబీ ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడు పిల్లి రమేష్ (50) మూడు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఖమ్మంలో నివాసం ఉండే ఆయన సోమవారం ఉదయం పాఠశాలకు బయలుదేరాడు. ఇల్లెందులో బస్సు దిగగానే ఛాతీలో నొప్పి రావడంతో ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ఇంజెక్షన్ చేయించుకుని పాఠశాలకు వెళ్లాడు. గంట తర్వాత మళ్లీ నొప్పి ఎక్కువ కావడంతో సహచర ఉపాధ్యాయులు 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేస్తుండగానే మృతి చెందాడు. మృతుడి భార్య కూడా ఉపాధ్యాయురాలే కాగా, వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇల్లెందు ఎంఈఓ టీవీఆర్‌ఎన్ స్వామి, సహచర ఉపాధ్యాయులు మృతదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్... మంగపేట: అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి ములుగు జిల్లా మంగపేట మండలం మొట్లగూడెం సమీపాన జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముత్యాలమ్మపేటకు చెందిన ప్రశాంత్(25) ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింహాసాగర్‌లో రైతు తాటి సమ్మయ్యకు చెందిన జామాయిల్ కలప తీసుకుని సారపాక ఐటీసీ పీఎస్పీడీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాడు. ఈక్రమాన మొట్లగూడెం సమీపాన ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడగా ప్రశాంత్ ట్రాక్టర్ స్టీరింగ్ మధ్యలో ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ఎస్సై టీవీఆర్.సూరి ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, ప్రశాంత్‌కు తల్లి నాగమణి, సోదరుడు ఉండగా ఆయన తాత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష
కొత్తగూడెంటౌన్: గాయాలకు కారణమైన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తీర్పు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2017లో బందగిరి నగర్‌కు చెందిన పూనెం పాపారావు కుమారుడు సురేష్, అతని స్నేహితుడు లోడిగి బుచ్చిరాములు వెంకటాపురానికి బైక్‌పై వెళ్తూ కరకగూడెం మండలం మద్దెలగూడెం వద్దకింద పడ్డారు. దీంతో సురేష్‌కు బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. బుచ్చి రాములుకు కూడా గాయాలయ్యాయి. కాగా తన కుమారుడు సురేష్ మృతిపై అనుమానం ఉందని పాపారావు కరకగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో నూప రామ్, నూప సతీష్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. విచారణ సమయంలో రామ్ చనిపోవడంతో అతనిపై కేసు కొట్టివేశారు. నూప సతీష్‌పై హత్యా నేరం రుజువు కాలేదు. గాయాలు చేసినట్లు రుజువు కావడంతో రెండేళ్ల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి ప్రాసిక్యూషన్ నిర్వహించారు. సిబ్బంది జి. ప్రవీణ్, ఎన్. వీరబాబు, మాలోతు ఈశ్వర్ సహకరించారు. -
ఇచ్చిన హామీలు అమలుచేయండి
● రిటైర్మెంట్ వయస్సు పెంపు సరికాదు ● ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిఖమ్మంరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 2023 జూలై నుంచి వర్తించేలా పీఆర్సీ వర్తింపచేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి, జలగంనగర్, గొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను సోమవారం సందర్శించిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్యోగులు రిటైర్మెంట్ వయస్సు పెంచాలనే ఆలోచన ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపదని తెలిపారు. ఈ ప్రతిపాదనను విరమించుకుని పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, కేజీబీవీ, యూఆర్ఎస్, ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అమలుచేయడమే కాక పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ రంజాన్, ఎం.నర్సయ్య, నవీన్‌కుమార్, మహేష్, వై.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం
టేకులపల్లి: పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. బేతంపూడిస్టేజీలో సోమవా రం జరిగిన బీఆర్ఎస్ టేకులపల్లి మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియతో కలిసి మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇల్లెందు నియోజకర్గంలోని 138 పంచాయతీల్లో తమ పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఎక్ర్ట్రాలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు, తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న అధికారు ల జాతకాలు పింక్ బుక్‌లో పొందుపరుస్తున్నామని అన్నారు. మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పింక్ బుక్ తెరుస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్ పాలకులు సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని, బెదిరింపులకు పాల్ప డుతున్నారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు. సీతారామ ప్రాజెక్ట్‌ను రోళ్లపాడుకు తెచ్చేందుకు అన్ని మంజూరులు సాధిస్తే నేటి ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల ఇక్కడి రైతులు నష్టపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పరిస్థితి వార్డు మెంబర్‌కు ఎక్కువ, సర్పంచ్‌కు తక్కువలా ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సమస్యలపై సీఎం, మంత్రులతో చర్చించే సీన్ లేదని ఆరోపించారు. వాళ్ల వెంట ఉన్నవారికే కండువాలు కప్పి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులను సమస్యలపై నిలదీయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు దిండిగల రాజేందర్, లక్కినేని సురేందర్‌రావు, మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు, చీమల సత్యనారాయణ, బాలకృష్ణ, రవి, కిషన్, రామ, శివ, పూల్‌సింగ్, రేణుక, బాలాజీ, వస్రాం, కిరణ్, రాజా తదితరులు పాల్గొన్నారు.ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకుంటాం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు -
అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
డీఎస్పీ చంద్రభాను ఇల్లెందురూరల్: అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ చంద్రభాను సూచించారు. మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేని 60 బైక్‌లను, ఆరు ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామ కూడలిలో డీఎస్పీ మాట్లాడుతూ అపరిచితులు గ్రామంలోకి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. గంజాయి మత్తు పదార్థాలు విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రహదారిపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ విధిగా ధరించాలని, వాహనానికి సరైన ధ్రువీకరణ పత్రాలు, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ సమష్టిగా పనిచేయాలికొత్తగూడెంరూరల్: అందరూ సమష్టిగా పనిచేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు కీర్తి తీసుకురావాలని డీఎంహెచ్ఓ ఎల్.భాస్కర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ డైరీని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బాలాజీనాయక్, డాక్టర్ సుందర్, ఎండీ. ఫైజ్ మొహియుద్దిన్, లక్ష్మి, సుదర్శన్, నాగభూషణం, జి.ఉమాదేవి, కృష్ణయ్య, లింగ్యానాయక్, దేవ, హరి, రామచందర్ పాల్గొన్నారు.వేతనాలు విడుదల చేయాలిభద్రాచలంఅర్బన్: భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శానిటేషన్, పేషెంట్ కేర్ సెక్యూరిటీతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని కోరుతూ సోమవారం ఐటీడీఏ పీఓ రాహుల్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. 100 మంది కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని విన్నవించారు. కాగా ప్రస్తుత ఏజెన్సీని రద్దు చేసి, త్వరలోనే కొత్త ఏజెన్సీకి కేటాయిస్తామని, వేతనాలు ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు సీఐటీయూ పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి తెలిపారు. సీఐటీయు నాయకులు నాగరాజు, రమ, వెంకటరమణ, కుమారి, సరిత, మెహబూబ్, రమణ, కుమారి పాల్గొన్నారు. బాల కార్మికుడి గుర్తింపుభద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ మెకానిక్ షెడ్డులో బాల కార్మికుడు పని చేస్తున్నట్లు సోమవారం పోలీసులు గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలను పనికి పంపొద్దని, చదివించాలని సూచించారు. అనంతరం మెకానిక్ షెడ్డు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతఅశ్వారావుపేటరూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. అశ్వారావుపేటకు చెందిన ఓ వ్యక్తి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా గుర్తించిన స్థానికులు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై టి.యయాతి రాజు ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ను పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీంతో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ విచారణ చేపట్టి రూ.5 వేల జరిమానా విధించారు. అటవీ జంతువు మాంసం లభ్యంమణుగూరు టౌన్: మండలంలోని కూనవరం పంచాయతీలో ఓ దుకాణంలో సుమారు మూడు కేజీల దుప్పి మాంసాన్ని అటవీ అధికారులు, సిబ్బంది సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని ఎఫ్డీఓ మక్సూద్ తెలిపారు. మాంసాన్ని ల్యాబ్‌కి పంపి పరీక్షించాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం మధిర: మధిరలో సోమవారం తెల్లవారుజాము న విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక వైరా రోడ్డులోని దేవినేని శ్రీనుకు చెందిన సైకిల్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు మొదలై పక్కనే ఉన్న షేక్ సుభాని చెందిన గాలి మిషన్, అక్బర్‌కు చెందిన బిర్యానీ పాయింట్‌కు వ్యాపించారు. దీంతో మూడు దుకాణాల్లోని రూ.4లక్షల విలువైన సామగ్రి కాలి బూడిదైంది. -
గాడి తప్పుతున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
● చేయి తడిపితే చాలు.. ఎలాగైనా సరే రిజిస్ట్రేషన్లు ● ఒప్పందం కుదరకపోతే మాత్రం ససేమిరా ● శాఖ ఉద్యోగులపై మంత్రి పొంగులేటికి ఫిర్యాదుల వెల్లువసాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొందరు ఉద్యోగుల తీరు గాడి తప్పుతోంది. కొద్ది కాలంగా పలువురు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో శాఖ పరువు వీధికెక్కుతోంది. గత ఐదేళ్లలో పలువురు సబ్ రిజిస్ట్రార్లు, ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు మార్గదర్శకాలు, నిబంధనలు పట్టించుకోకుండా ప్రభుత్వ స్థలాలను కూడా రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ చేయించి.. కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల కూడా అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతుండడంతో మంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల లీలల్లో కొన్ని.. ● గతంలో ఖమ్మం రూరల్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన కరుణ నిబంధనలు, మార్గదర్శకాలను పక్కన పెట్టి అక్రమాలకు పాల్పడినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి ఫిర్యాదులు అందాయి. ఆమె ఏదులాపురం రెవెన్యూ 142వ సర్వే నంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారన్న ఫిర్యాదులపై విచారణ చేపట్టగా నిజమేనని తేలడంతో 2021లో సస్పెన్షన్ వేటు వేశారు. ● మధిరలోని సర్వే నంబర్ 6లో ఉన్న 277.77 చదరపు గజాల ఎకై ్సజ్ శాఖ కార్యాలయ స్థలాన్ని 2021 మే 11న గిఫ్ట్ సెటిల్మెంట్ స్వాధీన దస్తావేజు కింద ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సత్యానందం రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఘటనలో ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి డాక్యుమెంట్‌ను రద్దు చేశారు. ● కూసుమంచిలో నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2022లో కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలా జరిగాయి. అనుమతి లేని వెంచర్ల రిజిస్ట్రేషన్‌కు రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్ అభ్యంతరం చెప్పడంతో రెండు రోజులు ఇన్చార్జ్గా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ కిరణ్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ● సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో నిషేధిత భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇంటి నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనూ డోర్ నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ● భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన వైరా సీనియర్ అసిస్టెంట్ ఖదీర్ అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయన హ యాంలో డబ్బు వసూలు చేసిన వీడియోలు సంచలనంగా మారాయి. ఆయనే ఇల్లెందు ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించినప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి సరెండర్ చేసి ఆ తర్వాత మరో కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. ● వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడేళ్లలో నలుగురు సబ్ రిజిస్ట్రార్లు బదిలీ అయ్యారు. ఇందులో మూడేళ్ల క్రితం సబ్‌రిజిస్ట్రార్ సత్యానందం.. మధిర ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తూ అక్కడి ఎకై ్సజ్ శాఖ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి సస్పెన్షన్‌కు గురయ్యాడు. మరో సబ్ రిజిస్ట్రార్ రాంకుమార్ సర్వే నంబర్లు మార్చి ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడంతో బదిలీ వేటు పడింది. అలాగే, సబ్ రిజిస్ట్రార్ మోహిత్ అలీ రిజిస్ట్రేషన్ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో బదిలీ చేశారు. ఇక్కడే మహిళా సబ్ రిజిస్ట్రార్ ఏన్కూరు మండలంలో గిరిజన భూములు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసి బదిలీకి గురయ్యారు. తాజాగా రామచంద్రయ్య నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసి సస్పెన్షన్‌కు గురవడం గమనార్హం. ఇలా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన నలుగురు సబ్ రిజిస్ట్రార్లపై మూడేళ్ల కాలంలో చర్యలు తీసుకున్నారు. ఆరోపణల వెల్లువ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలో ఆర్ఓ కార్యాలయంతో పాటు ఖమ్మం రూరల్, కూసుమంచి, సత్తుపల్లి, వైరా, కల్లూరు, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, బూర్గంపాడులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటిలోని కొన్ని కార్యాలయాల్లో అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. సబ్ రిజిస్ట్రార్లు, ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు మొదలు డాక్యుమెంట్ రైటర్ల వరకు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. లింక్ డాక్యుమెంట్లు లేని స్థలాలతో పాటు అనుమతి లేని స్థలాలను రిజిస్ట్రేషన్ చేయొద్దనే నిబంధనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల నాలా కన్వర్షన్ లేని భూములకు సైతం అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంలో వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. -
ఇక ఆరు రోజులే..
మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నెల 26 నుంచి చైర్పర్సన్లు, కౌన్సిలర్లు మాజీలు కానున్నారు. మిగిలిన ఐదారు రోజుల్లో కూడా తమ మార్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల సర్వే జరుగుతోంది. సర్వేలో అధికారులతోపాటు వార్డు కౌన్సిలర్లు కూడా ఇంటింటికి వెళ్తున్నారు. ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా కొత్తగూడెం మున్సిపల్ వార్డుల్లోని అన్ని వీధుల్లో కౌన్సిలర్ పేరు, వీధిలోని ఇంటి నంబర్ల సంఖ్యతో బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నారు. – కొత్తగూడెంఅర్బన్ప్రత్యేకాధికారులుగా ఆర్డీఓలు? ఇప్పటికే సర్పంచ్‌లు, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసి పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీతో పాలకవర్గాల పదవీ కాలం ముగియనుండటంతో మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక అధికారుల పాలన సాగే అవకాశం ఉంది. మున్సిపాలిటీలకు ఆర్డీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై ఇంకా స్పష్టత లేదు. అదే మాదిరి మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు ఆలస్యమవుతాయా? వాటితో పాటు ఎన్నికలే నిర్వహిస్తారా? అనే చర్చ సాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. కాగా ఐదేళ్ల పదవీకాలంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. -
సెపరేటు!
ప్రక్షాళన చేసినా..ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ల తీరుపై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగులు మొదలు సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారు. అయినా ఖమ్మం జిల్లాకు కొత్తగా వచ్చిన సబ్ రిజిస్ట్రార్ల తీరు మారడం లేదు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కావాలనే కొన్ని డాక్యుమెంట్లను పక్కన పెడుతున్నారని, గతంలో రిజిస్ట్రేషన్ చేసిన వెంచర్‌లోనే ఇంకొందరు తమ స్థలాల రిజిస్ట్రేషన్‌కు వెళితే పట్టించుకోవడం లేదంటూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు పొంగులేటికి చేరగా.. ఆయన అధికారిణి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఘటనపైనా మంత్రి తీవ్రంగా స్పందించి జిల్లా రిజిస్ట్రార్‌ను మందలించినట్లు సమాచారం. -
చిత్రకూట మండపంలో రాపత్తు సేవ
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో రాపత్తు సేవ నిర్వహించారు. చినజీయర్ మఠం ఆధ్వర్యంలో ఈ వేడుకను కమనీయంగా నిర్వహించారు. పల్లకీలో స్వామివారిని మేళతాళాలు, భజనలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి వేదికపై కొలువుదీర్చారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి హారతిని సమర్పించారు. అనంతరం దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రవచనాలు చేశారు. కాగా ఈ రాపత్తు ఉత్సవాలు సోమవారంతో ముగుస్తుండగా, అనంతరం మూడు రోజులపాటు విలాసోత్సవాలు, 26న విశ్వరూప సేవ జరగనున్నాయి. రామయ్యకు అభిషేకం, సువర్ణ పుష్పార్చన దేవస్థానంలో రామయ్య స్వామి మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. -
శ్రీకనక దుర్గమ్మకు విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మ తల్లికి అర్చకులు ఆదివారం విశేష పూజలు జరిపారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజాది కార్యక్రమాలను ఈఓ ఎన్ రజనీకుమారి పర్యవేక్షించారు. క్రీడలతో నూతనోత్సాహంజిల్లా జడ్జి పాటిల్ వసంత్ కొత్తగూడెంటౌన్: ఆటలతో శారీరక ధృడత్వంతోపాటు నూతనోత్సాహం కలుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. ఆదివారం కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామవరంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. అడ్వకేట్ల జట్టుపై జడ్జి శివనాయక్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి కె.శిరీష, న్యాయవాదులు పలివెల సాంబశివరావు, పోసాని రాధాకృష్ణమూర్తి, అనుబ్రోలు రాంప్రసాదరావు, గాజుల రాంమూర్తి, పాతూరి పాండురంగ విఠల్, అరికల రవికుమార్, రామకృష్ణ, నాగరాజు, దొడ్డ ప్రసాద్, మెండు రాజమల్లు, కాసాని రమేష్, ఎండీ సాధిక్‌పాషా, దొడ్డ సుమంత్, రామిశెట్టి రమేష్, లగడపాటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 24న మంత్రి పొంగులేటి పర్యటనఇల్లెందు: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ నెల 24న ఇల్లెందులో పర్యటించనున్నారు. మోడల్ మార్కెట్లో దుకాణ సముదాయం, డిజిటల్ గ్రంథాలయం, పార్క్‌లో స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం ఇల్లెందు మున్సిపల్ పాలకవర్గం వీడ్కోలు సమావేశంలో పాల్గొనున్నారు. నేటి ప్రజావాణి రద్దుసూపర్బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో సోమవారం(నేడు) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు సర్వేలో జిల్లా యంత్రాంగం నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేయడానికి కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు. మానవత్వం చాటిన ఎమ్మెల్యేదమ్మపేట : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కారులో ఎక్కించుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం మండలంలోని మొద్దులగూడెం గ్రామానికి చెందిన తోకల శ్యామ్ బైక్‌పై అప్పారావుపేట గ్రామానికి వెళ్లి, తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో కొమ్ముగూడెం శివారులో బైక్ అదుపుతప్పి శ్యామ్ కింద పడిపోగా, కాలికి స్వల్పంగా దెబ్బ తగిలింది. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే గమనించి క్షతగాత్రుడిని తన కారులో దమ్మపేట ఆస్పత్రికి తరలించారు. దగ్గరుండి బాధితుడికి వైద్యం అందేలా చూశారు. -
గ్రామసభలకు ఏర్పాట్లు చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): గ్రామసభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల సర్వే గ్రామసభల నిర్వహణపై ఆదివారం రాత్రి అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీఏఓ, డీఎస్ఓ, డీఎం సివిల్, ఎంపీడీఓలు, వ్యవసాయాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 23 వరకు గ్రామసభలు నిర్వహించాలన్నారు. సభలకు హాజరయ్యే ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితా కులగణన సర్వే ఆధారంగా తయారుచేసిందని, ఇది తుది జాబితా కాదని చెప్పారు. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా కొత్త రేషన్‌కార్డులకు, కొత్త సభ్యుల చేర్పునకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇంకా మిగిలిన సర్వే సోమవారంలోగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంటిస్థలం ఉన్న వారి జాబితా, లేనివారి జాబితాలను గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్