జిల్లా వ్యాప్తంగా
బతుకమ్మ వేడుకలు ప్రారంభం
తొలిరోజు ఘనంగా
ఎంగిలిపూల సంబురాలు
కొత్తగూడెంటౌన్: తెలంగాణ సంప్రదాయ వేడుకై న బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆట, పాటలతో పల్లె, పట్టణం సందడిగా మారాయి. వీధులన్నీ బతుకమ్మ పాటలతో మార్మొగాయి. తొమ్మిదిరోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకలు ఆదివారం ఎంగిలపూల బతుకమ్మతో మొదలయ్యాయి. ఆడపడచులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చుకుని సాయంత్రం చౌరస్తాలకు చేరుకున్నారు. బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడారు. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో..., చిత్తూ చిత్తూల బొమ్మ.. శివుడీ ముద్దుల గుమ్మ.., ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మా.. తదితర గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. కొందరు ఇళ్ల ముందు, ఆలయాల్లో సంబురాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. కొత్తగూడెంలో సూపర్‌బజార్, రైటర్‌బస్తీ, పాత కొత్తగూడెం, హనుమాన్ బస్తీ, విద్యానగర్ కాలనీ, హెడ్ ఆఫీస్ ఏరియా, పోస్టాఫీస్ ఏరియా, బస్టాండ్ సెంటర్, మఽధురబస్తీ, రామవరం, రుద్రంపూర్, లక్ష్మీదేవిపల్లి తదితర ప్రాంతాల్లో మహిళలు, చిన్నారులు సంబురాలు నిర్వహించారు. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, అశ్వారావుపేట, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం చెరువులు, వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ప్రసాదం పంపిణీ చేశారు.
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా..