Bhadradri District News
-
అపురూపం
కవలలు (ట్విన్స్) ఎక్కడున్నా ప్రత్యేకత ఉంటుంది. రూపంలో ఒకేరకంగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా చూస్తారు. ఒకే రకమైన దుస్తులు, వస్తువులు కొనిపెట్టి అపురూపంగా చూసుకుంటారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉంటే మరికొందరిలో భిన్నంగా ఉంటాయి. బంధువులు, టీచర్లు, ఇరుగుపొరుగు వారు కూడా గుర్తుపట్టలేక తికమకపడుతుంటారు. ప్రపంచంలో మొదటి సారి కవలలు దినోత్సవాన్ని పోలండ్‌లో 1976లో నిర్వహించారు. మోజస్, అరన్విల్కార్స్ కవలలు ఒకే వ్యాధితో బాధపడుతూ ఒకే రోజు (ఫిబ్రవరి 22) మరణించారు. ఈ రోజున ప్రపంచ కవలల దినోత్సవంగా పోలాండ్ ప్రకటించగా పలు దేశాలు అంగీకారం తెలిపాయి. – పాల్వంచరూరల్/కరకగూడెం● ఎక్కడున్నా కవలలకు ప్రత్యేక గుర్తింపు ● ఒకే పోలికలతో పలు సందర్భాల్లో తికమక ● నేడు కవలల దినోత్సవం అభిరుచులు ఒక్కటే.. కుంజ అభిరాం, లక్ష్మణ్పార్థు పాల్వంచ మండలం దంతలబోరు పంచాయతీ గంగాదేవిగుప్ప గ్రామానికి చెందిన కవలలు కుంట అభిరాం, లక్ష్మణ్పార్థు గ్రామంలోనే 4వ తరగతి చదువుతున్నారు. ఇద్దరి ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉంటాయి. ఏదికొన్నా ఇద్దరికీ సమానంగా ఇవ్వాల్సిందే. చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపుతారని తల్లిదండ్రులు భద్రం, వెంకటరమణ తెలిపారు. -
నకిలీ నోట్లు డిపాజిట్ చేసిన వ్యక్తి అరెస్ట్
ఇల్లెందు: ఇల్లెందు ఎస్బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి నకిలీ నోట్లు డిపాజిట్ చేసి దొరికిపోయాడు. సీఐ బి.సత్యనారాయణ కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన పి.మల్లికార్జున్ (మధు) ఈ నెల 6వ తేదీన ఇల్లెందులోని ఆంబజార్ ఏటీఎంలో రూ.500 నోట్లు 10 డిపాజిట్ చేశాడు. అందులో 8 నోట్లు నకిలీవని గుర్తించిన బ్యాంకు అధికారులు ఆ ఏటీఎంలో సోదా చేశారు. సీసీ పుటేజీ, ఇతర ఆధారాలను పరిశీలించి డిపాజిట్ చేసింది మల్లికార్జున్(మధు)గా గుర్తించారు. మెయిన్ బ్రాంచ్ మేనేజర్ ఎల్లం చిన్నంనాయుడు ఫిర్యాదు చేయగా ఎస్ఐ సందీప్‌కుమార్ మల్లికార్జున్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాకు కోడి పందేలకు వెళ్లినప్పుడు అక్కడి నుంచి తెచ్చిన నోట్లు తన ఖాతాలో డిపాజిట్ చేశాడని, అందులో 8 నోట్లు నకిలీవని తేలిందని, చేసి కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించామని సీఐ వివరించారు. 29 మంది బైండోవర్అశ్వారావుపేటరూరల్: అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని శుక్రవారం పోలీసులు స్థానిక తహసీల్దార్ వద్ద బైండోవర్ చేశారు. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏడాది కాలంగా ఇసుక అక్రమంగా రవాణా చేసి, కేసులు నమోదైన 29 మంది ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులను గుర్తించి వారిని స్థానిక తహసీల్ధార్ వనం కృష్ణప్రసాద్ ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. ప్రెజర్ బాంబు పేలి డీఆర్జీ జవాన్‌కు గాయాలుచర్ల: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో ప్రెజర్ బాంబు పేలి డీఆర్జీ జవాన్‌కు తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. నారాయణపూర్ జిల్లాలోని చోటీడోంగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడిమెట్ట, కవ్నార్ ప్రాంతాల్లో డీఆర్జీ బలగాలు కూంబింగ్ చేపట్టాయి. పోలీస్ బలగాలను లక్ష్యంగా చేసుకొని ఆ ప్రాంతంలో మావోయిస్టులు ప్రెజర్ బాంబులను ఏర్పాటు చేశారు. గమనించకుండా డీఆర్జీ జవాన్ ప్రెజర్ బాంబును తొక్కడంతో అది పేలి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చోటీడోంగర్కు తరలించి.. అక్కడ నుంచి నారాయణపూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. యువకుడి ఆత్మహత్యఇల్లెందు: పట్టణంలోని కొత్తకాలనీలో ఓ యువకుడు ఉరి వేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన జక్కుల అరవింద్ (22) తన మేనమామ కుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరి వేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డారు. ఇంతకు ముందు కూడా అతడు పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని, మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ సూర్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పురుగులమందు తాగి వ్యక్తి...పాల్వంచరూరల్: కుమారుడిని మృతిని తట్టుకోలేక మనస్తాపానికి గురైన ఓ తండ్రి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని తోగ్గూడెంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన మొడి యం కృష్ణ (45).. కుమారుడు సాంబయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. శుక్రవారం పొలం వద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. గుర్తించిన ఆయన బంధువలు మహేశ్ పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతిడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. చికిత్స పొందుతున్న బాలిక మృతిఅశ్వారావుపేటరూరల్: కొద్ది రోజుల కిందట విద్యుదాఘాతానికి గురై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక శుక్రవారం మృతి చెందింది. ఎస్ఐ యయాతి రాజు కథనం మేరకు.. మండలంలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన కేతా లాస్య (13) ఈ నెల 16న దుస్తులు ఆరేసేందుకు డాబాపైకి వెళ్లింది. తడి బట్టలను ఆరేస్తున్న క్రమంలో ఇంటిపై నుంచి వెళ్లిన 33 కేవీ విద్యుత్ లైన్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. బాలికను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి హైదారాబాద్ తరలించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ చెప్పారు. బాలిక తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యయాతి రాజు పేర్కొన్నారు. -
ఉపాధ్యాయులు, అధ్యాపకుల వెంటే ఉంటున్నా
ఖమ్మం సహకారనగర్/కొత్తగూడెంఅర్బన్: నిరంతరం ఉపాధ్యాయులు, అధ్యాపకుల వెంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్నానని వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు. ఖమ్మం, కొత్తగూడెంలోని టీఎస్ యూటీఎఫ్ కార్యాలయాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 2019లో ఎమ్మెల్సీగా గెలిచాక సీపీఎస్ రద్దు, పెండింగ్ డీఏలు, ఈ–కుబేర్‌లో పెండింగ్ బిల్లుల విడుదల కోసం ధర్నాల్లో సైతం పాల్గొన్నట్లు చెప్పారు. అలాగే, గురుకులాల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు, కేజీబీవీ ఉపాధ్యాయులకు వేతనం పెంపు, బదిలీలకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్సీగా తనకు కేటాయించిన రూ.9 కోట్ల నిధులను అదనపు తరగతి గదుల నిర్మాణానికి కేటాయించానని వెల్లడించారు. ఈ మేరకు 27న జరగనున్న ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, తద్వారా మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లింపు, హెల్త్ కార్డులు, పదోన్నతులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి పాటుపడతానని తెలిపారు. టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.విజయ్ మాట్లాడగా యూటీఎఫ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, ఏవీ నాగేశ్వరరావు, వెంగళరావుతో పాటు జీవీ నాగమల్లేశ్వరరావు, చావా దుర్గాభవాని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి -
జేసీబీ, ఐదు ట్రాక్టర్లు సీజ్
జూలూరుపాడు: మండలంలోని భేతాళపాడు గ్రామ పంచాయతీ పంతులుతండా గ్రామ సమీపంలోని పెద్దవాగు ఇసుకను అక్రమంగా జేసీబీతో తవ్వి, ఐదు ట్రాక్టర్లతో తరలిస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు. చింతలతండాకు చెందిన భూక్యా రాందాస్ పెద్దవాగులోని ఇసుకను జేసీబీతో తవ్వి, ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న జూలూరుపాడు ఎస్ఐ రవి తన ఘటనా స్థలానికి వెళ్లి పట్టుకున్నారు. వాహనాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించామని, కొత్తగూడెంకు చెందిన జేసీబీ డ్రైవర్ పగడాల వేణు, భేతాళపాడు జీపీ టాక్యాతండాకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు ధరావత్ రాందాస్, నునావత్ భీమా, బానోత్ కస్నా, గుగులోత్ సక్రు, ట్రాక్టర్ యజమానులు బానోత్ లక్ష్మణ్, బానోత్ కస్నా, బానోత్ అనిత, చింతలతండాకు చెందిన భూక్యా రాందాస్‌పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రవి తెలిపారు. తొమ్మిది మందిపై కేసు నమోదు -
ఒత్తిడిని దూరం చేసేందుకే క్రీడాపోటీలు
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కళాశాలల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగుల ఒత్తిడిని దూరం చేసేందుకే విశ్వవిద్యాలయం స్థాయిలో క్రీడాపోటీలను నిర్వహించామని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ ఆల్థాస్ జానయ్య పేర్కొన్నారు. శుక్రవారం అశ్వారావుపేట కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జోన్‌స్థాయి క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై ప్రసంగించారు. వృత్తి రీత్యా ఉండే ఒత్తిడిని తగ్గించేందుకు బోధన సిబ్బందికి ఈ పోటీలను నిర్వహించామని, వారిలోని నైపుణ్యం ప్రదర్శించేందుకు ఇది మంచి వేదికని పేర్కొన్నారు. దేశానికి అన్నం అందించే రైతుకు మరిన్ని సేవలు అందిస్తే ప్రయోజనకరమని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక, జానపద నృత్యాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం క్రీడా, సాహిత్య పోటీల్లో విజేతలకు వైస్ చాన్స్‌లర్ బహుమతులు అందించారు. తర్వాత జిమ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ డాక్టర్ సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, యూనివర్సిటీ అబ్జర్వర్ డాక్టర్ జె.సురేశ్, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్‌కుమార్, డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, జి.గోపాలకృష్ణమూర్తి, శిరీష పాల్గొన్నారు. -
దాడికి పాల్పడిన మహిళకు ఏడాదిన్నర జైలు
కొత్తగూడెంటౌన్: కోర్టులో విచారణకు హాజరైన వ్యక్తిపై దాడికి పాల్పడినందుకు పాల్వంచ వెంకటేశ్వరకాలనీకి చెందిన కొడాలి నర్మదకు ఏడాదిన్నర జైలుశిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధిస్తూ శుక్రవారం కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఎ.సుచరిత తీర్పు చెప్పారు. 2017, ఫిబ్రవరి 28న కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు విచారణలో భాగంగా హాజరైన పాల్వంచ మండలం ఇల్లెందులపాడుకు చెందిన గుగులోత్ మాన్సింగ్ను.. కోర్టు హాల్లో జడ్జి ఎదుట కొడాలి నర్మద బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. ఈ ఘటనపై అప్పటి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.జమలేశ్వరావు, కోర్టు సూపరింటెండెంట్ రషీద్అలీఖాన్ 2017 మార్చిలో కొత్తగూడెం వన్‌టౌన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీట్ ధాఖలు చేయగా.. ఏడుగురు సాక్షులను విచారించి, కొడాలి నర్మదపై నేరం రుజువైనందున జడ్జి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ నాగలక్ష్మి వాదించగా.. నోడల్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్, లైజన్ ఆఫీసర్ అబ్దుల్ ఘని, కోర్టు పీసీ కామేశ్ సహకరించారు. -
రామక్క జాతరకు తరలిన భక్తులు
గుండాల: ఆళ్లపల్లి మండలం పెద్దూరు గ్రామంలో కొమరం వంశీయుల ఇలవేల్పు రెక్కల రామక్క జాతరకు శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం వనదేవతలను గద్దెలపై ప్రతిష్ఠించారు. మహిళలు పూనకాలతో ఊగిపోయారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు చుట్టుపక్క ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ బాధ్యులు అన్నిఏర్పాట్లు చేశారు. దర్శించుకున్న ఎస్పీ రామక్క జాతరకు ఎస్పీ రోహిత్‌రాజు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జాతర ప్రాశస్త్యాన్ని కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, టేకులపల్లి సీఐ సురేశ్, ఆళ్లపల్లి ఎస్ఐ రతీశ్, కొమరం వంశీయులు వెంకటేశ్వర్లు, హనుమంతరావు, సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి రూ.1.20 లక్షల విరాళంఅశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామంలో నిర్మిస్తున్న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణానికి జాలె రామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు, కుమార్తెలు రూ.1.20 లక్షలు విరాళంగా అందించారు. శుక్రవారం ఆలయం ఆవరణలో ఆలయ నిర్మాణ కమిటీ వారికి అందజేశారు. గతంలో సైతం రామిరెడ్డి కుటుంబ సభ్యులు ఆలయ నిర్మాణానికి రూ.80,580 అందజేశారు. ఏసీబీ పేరుతో బెదిరింపు ఫోన్లుఅశ్వాపురం: ఏసీబీ కార్యాలయం అధికారులమంటూ మండలంలోని అధికారులకు శుక్రవారం బెదిరింపు ఫోన్లు వచ్చాయి. ఏసీబీ కార్యాయలం నుంచి మాట్లాడుతున్నామని ఓ వ్యక్తి తహసీల్దార్‌కు ఫోన్‌చేసి ఎంపీడీ ఓ ఫోన్ ఎత్తడం లేదని చెప్పాడు. ఆమె తన ఫోన్ నుంచి ఎంపీడీఓకు ఫోన్ చేయగా ఫోన్ చేసిన వ్యక్తి ఏసీబీ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని తమపై ఫిర్యాదు వచ్చిందని బెదిరించారు. తర్వాత అశ్వాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేశారు. దీంతో అధికారులు సీఐ అశోక్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఫేక్ ఫోన్‌కాల్స్ అని ధ్రువీకరించారు. చోరీ ఘటనపై కేసుములకలపల్లి: మండలంలోని జగన్నాథపురం మెయిన్‌రోడ్డులోని దుకాణంలో చోరీ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాజశేఖర్ కఽథనం మేరకు.. జగన్నాథపురానికి చెందిన వ్యాపారి జయవరపు నరేశ్ మెయిన్ సెంటర్లో ఇల్లు నిర్మించుకొని ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తున్నాడు. నరేశ్ దంపతులు ఈ నెల 15వ తేదీన కుంభమేళాకు వెళ్లారు. మరుసటి రోజు ఇంటి వెనుక తలుపు తాళాలు పగలగొట్టగా పక్కవారు గమనించి నరేశ్‌కు సమాచారం అందించారు. గురువారం కుంభమేళా నుంచి వచ్చి ఇంట్లో పరిశీలించగా రూ.45 వేల విలువ గల బంగారు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పీడీఎస్ బియ్యం స్వాధీనం గోవిందరావుపేట: అక్రమంగా తరలిస్తున్న 323 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ములుగు జిల్లా పస్రా ఎస్సై కమలాకర్ తెలిపారు. పస్రామండలం మొద్దులగూడెం శివారులో శుక్రవారం తనిఖీ చేస్తుండగా లారీలో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. లారీలో రూ.6.47లక్షల విలువైన రేషన్ బియ్యం ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం లచ్చగూడెంకు చెందిన బత్తుల రాజు తరలిస్తున్నట్లు డ్రైవర్ వల్లెపు బంగారి అంగీకరించాడని ఎస్సై తెలిపారు. ఇల్లెందు చుట్టుపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు సేకరించిన బియ్యాన్ని ఎక్కువ ధరకు మహారాష్ట్రలోని నాగపూర్‌లో అమ్ముతున్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఆయిల్‌ఫెడ్ డివిజన్ అధికారిపై వేటుసత్తుపల్లి: సత్తుపల్లి డివిజన్ ఆయిల్‌ఫెడ్ అధికారి బాలకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్‌బాషా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. మండలంలోని రేగళ్లపాడు న ర్సరీలో ఆఫ్‌టైప్(నాటడానికి పనికి రానివి)గా తేలి న 80వేల ఆయిల్‌పామ్ మొక్కలను అనుమతి లే కుండా ధ్వంసం చేయించినట్లు ఆయనపై ఫిర్యాదు లు వచ్చాయి.ఇందుకోసం వెచ్చించిన నిధులు డ్రా చేసినట్లు తెలుస్తుండగా, ఈనెల 9, 10వ తేదీల్లో ఉద్యానశాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఈ మేరకు వారిచ్చిన నివేదిక ఆధారంగా బాలకృష్ణను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కాగా, గతంలోనే నర్సరీ సూపర్వైజర్లు పృధ్వీలాల్, కృష్ణారావును విధుల నుంచి తొలగించిన విషయం విదితమే. -
కోలిండియా స్థాయి అథ్లెటిక్స్ మీట్‌కు సిద్ధం
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శని, ఆదివారాల్లో జరగనున్న కోలిండియా స్థాయి (పురుషులు, మహిళలు) అథ్లెటిక్స్ మీట్‌కు సింగరేణి కార్పొరేట్ ఏరియా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ టోర్నీ 38 ఈవెంట్లలో జరగనుండగా కోలిండియా పరిధిలోని బొగ్గు పరిశ్రమల నుంచి 284 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. సింగరేణి చరిత్రలో కొత్తగూడెంలో కోలిండియా స్థాయి టోర్నీ జరగడం ఇది రెండోసారి. ఈ పోటీలను శనివారం సింగరేణి డైరెక్టర్ సత్యనారాయణరావు ప్రారంభించనుండగా, ఆదివారం సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారని అధికారులు తెలిపారు. కాగా, పోటీల ఏర్పాట్లను జీఎం పర్సనల్(ఐఆర్‌పీఎం) కవితానాయుడు శుక్రవారం సాయంత్రం పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆమె వెంట అధికారులు రాజీవ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, బి.రాజగోపాల్, శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు. -
గణితం, ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించాలి
దుమ్ముగూడెం: గిరిజన విద్యార్థుల్లో గణితం, ఆంగ్ల నైపుణ్యాలు పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఇందుకోసం ఉద్దీపకం వర్క్ బుక్‌లు, వేదిక్ మ్యాథ్స్ పుస్తకాలను వినియోగించాలని తెలిపారు. దుమ్మగూడెం మండలం రామచంద్రునిపేట, రేగుబల్లి–2, ఏజీహెచ్ఎస్లను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ.. 3 నుంచి 5వ తరగతి వరకు చదివే గిరిజన విద్యార్థులు ఇంగ్లిష్, గణితం చదవడం, రాయడంలో వెనుకబడుతున్నందున ప్రాథమికస్థాయి నుంచే తీర్చిదిద్దాలని తెలిపారు. ఉద్దీపకం, వర్క్ బుక్‌లు పంపిణీ చేసినందున వీటి ఆధారంగా బోధిస్తూ విద్యార్థుల్లో భయాన్ని తొలగించాలని సూచించారు. కాగా, రామచంద్రునిపేట ఏజీహెచ్ఎస్ పాఠశాల ఏడో తరగతి విద్యార్థులతో పీఓ కొన్ని లెక్కలు చేయించడమే కాక వారితో పాటు కూర్చుని బోధనను పరిశీలించారు. అనంతరం ఫిజిక్స్, బయాలజీ ల్యాబ్‌లు, రేగుబల్లి–2 ఏజీహెచ్‌ఎస్‌లో విద్యుత్ సరఫరా తీరుపై ఆరా తీశారు. హెచ్ఎంలు బట్టు రాములు, భారతమ్మ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
అకాల వర్షంతో రైతుల ఆందోళన
● ఈదురు గాలులకు నేలవాలిన మొక్కజొన్న ● పలుచోట్ల తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం దమ్మపేట/ములకలపల్లి/టేకులపల్లి/జూలూరుపాడు/చండ్రుగొండ: అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందారు. ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేలవాలింది. కల్లాల్లో ఉన్న మిర్చి రాశులు తడిసిపోతాయేమోనని ఉరుకులు, పరుగులతో పట్టాలు కప్పి పంటను కాపాడుకున్నారు. శుక్రవారం జిల్లాలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈదురుగాలులకు టేకులపల్లి మండలంలో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. మంగలితండాలో లకావత్ సురేష్‌కు చెందిన రెండెకరాలు, లకావత్ దేవాకు చెందిన ఐదు ఎకరాలు, బేతంపూడి, కుంటల్ల తదితర గ్రామాల్లో పలువురి రైతుల మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. దమ్మపేట, జూలూరుపాడు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు గ్రామాల్లో చిరుజల్లులు కురవడంతో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పంటను కాపాడుకునేందుకు నానాతంటాలు పడ్డారు. జూలూరుపాడు మండలంలో కల్లాల్లోని మిర్చి పాక్షికంగా తడిసింది. లైన్‌తండా, చింతలతండా, కరివారిగూడెం, కొమ్ముగూడెం, తవిసిగుట్టతండా, గిద్దలగూడెం, మాచినేనిపేట గ్రామాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. ములకలపల్లి మండలంలో మేఘాలు దట్టంగా అలుముకోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. చండ్రుగొండ మండలంలో అరకొరగా చేతికొచ్చిన మిర్చి పంట అకాలవర్షంతో కొంతమేర దెబ్బతిన్నది. -
కోలిండియా టోర్నీకి సిద్ధం
నేడు, రేపు జరిగే కోలిండియాస్థాయి అథ్లెటిక్స్ మీట్‌కు కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియం ముస్తాబైంది. బడ్జెట్ ఇతర పనులకు మళ్లింపు.. 8లోప్రసాద్ పథకంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.7 కోట్లతో పనులు చేపట్టాల్సి ఉంది. ఆలయ మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ పనులు ప్రారంభమే కాలేదు. దీంతో ప్రసాద్ పథకం నిధులను భద్రాచలం, పర్ణశాలలో మరికొన్ని అభివృద్ధి పనులకు వినియోగించేలా బడ్జెట్ మళ్లింపునకు టూరిజం అధికారులకు నివేదిక అందజేశారు. రూ.4 కోట్లతో పర్ణశాలలో పనులు, ఇతర రూ.3 కోట్లను ప్రస్తుతం చేపడుతున్న నిర్మాణ పనుల్లో పెరిగిన బడ్జెట్‌కు, బోటింగ్ పాయింట్, మోటార్ బోట్ల కొనుగోలు, ఇతర టూరిజం పనులకు సర్దుబాటు చేయాలని విన్నవించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే నిధుల మళ్లింపు జరిగే అవకాశం ఉంది. -
నలభై రోజుల్లో నవమి.. పునాదుల్లోనే పనులు
భద్రాచలంలో నిలిచిన ఓపెన్ షెడ్, డార్మెటరీ నిర్మాణాలు ● కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యంతో ‘ప్రసాద్’ పనుల్లో తీవ్ర జాప్యం ● ఈ ఏడాదైనా శ్రీరామనవమి వేడుకల్లో భక్తులకు ఇక్కట్లు తప్పేనా!భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలకు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఏటా వసతి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, పర్యాటక మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్చువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్(ప్రసాద్) పథకంలో భాగంగా రెండేళ్ల క్రితం డార్మెటరీ హాళ్లు, శాశ్వత షెడ్ తదితర నిర్మాణాలు చేపట్టారు. బ్రహ్సోత్సవాల సమయం సమీపిస్తుండగా, పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. వచ్చే నవమికి కూడా పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి ప్రసాద్ పథకంలో భాగంగా మిథిలా స్టేడియంలో వీఐపీలు, భక్తులు కూర్చుని కల్యాణం వీక్షించేందుకు ఏడాది క్రితం ఓపెన్ షెడ్ నిర్మాణం ప్రారంభించారు. గతేడాది శ్రీరామనవమి తర్వాత పనులు చేపట్టగా, 2024 డిసెంబర్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు పనులు పునాదులను దాటలేదు. ఒకవైపు బేస్మెంట్ వరకు పిల్లర్ల నిర్మాణం జరగ్గా, మరో వైపు పిల్లర్ల నిర్మాణమే జరగలేదు. గడువు ముగియడంతో పనుల తిరిగి ప్రారంభానికి అఽధికారులు కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. కాంట్రాక్టర్ అలసత్వం, అధికారుల పర్యవేక్షణలోపంతో గడువులోగా పనులు పూర్తికాకపోగా, పనులకు తిరిగి అనుమతులు తీసుకోవడంలోనూ అధికారులు జాప్యం చేస్తున్నారు. వచ్చే ఏప్రిల్ 6న మిథిలా స్టేడియంలో శ్రీ సీతారాముల కల్యాణం, 7న పట్టాభిషేక మహోత్సవాలు వైభవోపేతంగా జరగనున్నాయి. వేడుకలకు సుమారు 40 రోజుల గడువు ఉండగా, ఆలోగా పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. కనీసం పునాదుల వరకై నా పిల్లర్లను పూర్తిచేస్తే కల్యాణ వీక్షణానికి ఆటంకం లేకుండా ఉంటుంది. పూర్తికాని డార్మెటరీ నిర్మాణ పనులు ఇక మిథిలా స్టేడియం వెనుక భాగంలో వాహనాల పార్కింగ్‌కు ఉపయోగించే రెండెకరాల స్థలంలో జీ ప్లస్–2 నిర్మాణంలో డార్మెటరీ నిర్మాణ పనులు ప్రారంభించారు. బ్రిడ్జి సెంటర్లోని 1.20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో భక్తుల వసతి కోసం మరో భవనం, పర్ణశాలలో ఇంకో భవన నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ఇవి 2023, మేలో ప్రారంభంకాగా 2024, జూలై 30వ తేదీ నాటికి పూర్తి చేసి అప్పగించాల్సి ఉంది. కానీ ఇంకా పూర్తి చేయలేదు. బ్రిడ్జి సెంటర్లో, పర్ణశాలలోని నిర్మాణ పనులను నిబంధనల మేరకు మరో కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాంట్రాక్టర్ వినతి మేరకు డిసెంబర్ 2024 వరకు గడువు పెంచినా స్టేడియం వెనుక డార్మెటరీ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. కేవలం గ్రౌండ్ లెవల్ మాత్రమే పూర్తి కాగా, ఫస్ట్ ఫ్లోర్‌కు సంబంధించిన పనులు కొంతమేర జరిగాయి. ఏడాదిలో పూర్తి కావాల్సిన నిర్మాణాలు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో రెండేళ్లు గడిచినా పూర్తికాలేదు. గడువు పెంపు కోసం కేంద్ర పర్యాటక శాఖ అధికారులకు దరఖాస్తు చేశారు. వారి నుంచి అనుమతులు రాగానే మళ్లీ పనులు ప్రారంభించి ఈ ఏడాది జూన్, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించటం లేదు. కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాం ప్రసాద్ పథకంలో చేపట్టిన ఓపెన్ షెడ్, డార్మెటరీ హాల్ నిర్మాణాలు గతేడాది డిసెంబర్‌కే పూర్తి కావాల్సి ఉంది. గడువులోగా పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్‌పై తీసుకోవాల్సిన చర్యలతో పాటు మళ్లీ అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. నవమి నాటికి ఓపెన్ షెడ్‌ను పూర్తి చేస్తాం. బ్రిడ్జి సెంటర్లో, పర్ణశాలలో చేపట్టి పనులు వచ్చే జూలైలోగా పూర్తిచేస్తాం. – నిమ్మల రామకృష్ణ, డీఈ, టూరిజం శాఖ -
మావోయిస్టులపై నిఘా ఉంచాలి
గుండాల: ఏజెన్సీలో మావోయిస్టులపై నిఘా ఉంచాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. క్రైమ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలపై నిఘా పెట్టాలని చెప్పారు. వాహనాల తనిఖీలు చేపట్టాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతీ సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, టేకులపల్లి సీఐ సురేష్, ఆళ్లపల్లి ఎస్ఐ రతీష్ పాల్గొన్నారు. మునగ సాగుతో రైతులకు ఆదాయంఅశ్వారావుపేటరూరల్: మునగ పంట సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం వస్తుందని జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని ఆసుపాక గ్రామంలో రైతులు సాగు చేస్తున్న మునగ తోటను ఆయన పరిశీలించి మాట్లాడారు. మునగ పంటను పామాయిల్ తోటల్లో అంతర్ పంటగా సాగు చేసుకోవచ్చని, తద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఈ పంట సాగును మరింత విస్తరించాలని, ఆసక్తి ఉన్న రైతులు ఉపాధి హామీ పథకంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్, ఏఈవోలు రవీంద్ర, షాకీరా భాను, రైతులు పాల్గొన్నారు. పొగాకు గ్రేడింగ్‌లో జాగ్రత్తలు పాటించాలిఅశ్వారావుపేటరూరల్: వర్జీనియా పొగాకు గ్రేడింగ్‌లో జాగ్రత్తలు పాటించాలని జంగారెడ్డిగూడెం(ఏపీ) పొగాకు బోర్డు వేలం కేంద్రం సూపరింటెండెంట్ సురేంద్ర కుమార్ అన్నారు. శుక్రవారం అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న పొగాకు తోటలను ఆయన సందర్శించారు. బ్యారన్ల వద్ద చేస్తున్న పొగాకు గ్రేడింగ్‌ను పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం రైతుల సమావేశంలో మాట్లాడారు. కనీస మద్దతు ధర దక్కాలంటే తోటల సాగు, గ్రేడింగ్‌లో పద్ధతులు పాటించాలని, అధికంగా పురుగుల మందులను వినియోగించవద్దని చెప్పారు. సీనియర్ గ్రేడింగ్ అధికారి ప్రశాంత్, మాజీ పొగాకు బోర్డు మెంబర్ సుంకవల్లి వీరభద్రరావు, వేముల ప్రకాశ్‌రావు, కోడూరి నాగు, సతీష్, బ్రహ్మాజీ, పొగాకు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్లుసూపర్బజార్(కొత్తగూడెం): తాగునీరు రాకపోయినా, పైపుల లీకేజీ ఉన్నా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08744–241950 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే తక్షణమే సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్‌కాల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని మిషన్ భగీరథ ఈఈ తిరుమలేష్‌ను ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో టోల్‌ఫ్రీ నంబర్ 18005994007కు కూడా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. క్విజ్, ఇన్నోవేషన్స్‌పై విద్యార్థులకు పోటీలుకొత్తగూడెంఅర్బన్: జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 9, 10వ తరగతులు, ఇంటర్ విద్యార్థులకు క్విజ్, పోస్టర్, సైన్స్ ఎగ్జిబిషన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.వెంకటేశ్వరచారి, జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎస్.చలపతిరాజులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్లైన్ ద్వారా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నూతన ఆవిష్కరణలు, ఇండియా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ టెక్నాలజీ అనే అంశాలపై మాత్రమే పోస్టర్లు తయారు చేయాలని పేర్కొన్నారు. క్విజ్, పోస్టర్ పోటీలు ఈ నెల 27న పోటీలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం ఆధారం చేసుకుని ఎగ్జిబిట్ మోడల్స్, వర్కింగ్ మోడల్స్, ప్రాజెక్టులు రూపొందించుకోవాలని కోరారు. ప్రాజెక్టులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లోడ్ చేయాలని సూచించారు. విజేతలుగా ఎంపికై నవారు రెండు రోజుల పాటు సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. వివరాల కోసం 040–29560518లో సంప్రదించాలని కోరారు. -
కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
● మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రతపై పరిశీలన ● బూర్గంపాడు ఎస్సీ బాలుర హాస్టల్లో రాత్రి బసబూర్గంపాడు: బూర్గంపాడులోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ అమలు తీరుపై ఆరా తీశారు. స్టోర్ రూమ్‌ను పరిశీలించి సరుకుల నాణ్యత, బియ్యం స్టాక్ రిజిస్టర్ తనిఖీ చేశారు. సరుకులు నాణ్యంగా ఉంటేనే వంట చేయాలని వంట ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. అనంతరం టాయిలెట్స్, బాత్రూమ్స్, కిచెన్ పరిసరాలను పరిశీలించారు. హాస్టల్ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ఇంకుడు గుంతలు తీయించాలని చెప్పారు. మరుగుదొడ్లు ప్రతిరోజు శుభ్రం చేయించాలన్నారు. విద్యార్థులు నిద్రించే బెడ్లను పరిశీలించి, బెడ్స్ అందరికీ సరిపోతున్నాయా...లేకపోతే ఎవరైనా నేలపై పడుకుంటున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాసామర్థ్యాలను పరీక్షించారు. స్టడీ అవర్‌లో విద్యార్థులకు గణితంలో పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. వ్యక్తిత్వ వికాసం, లక్ష్యసాధనపై విద్యార్థులతో చర్చించారు. ఒత్తిడి లేకుండా నిర్భయంగా చదువుకోవాలని, వెనుబడిన సబ్జెక్ట్‌లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, ప్రతీ విద్యార్థి జీవితాన్ని పదో తరగతి ఫలితమే మలుపు తిప్పుతుందన్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. విద్యార్థులతో కలసి భోజనం చేసిన కలెక్టర్ రాత్రి అక్కడే బస చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, హాస్టల్ వార్డెన్, సిబ్బంది ఉన్నారు. భవిత కేంద్రాలతో ఉజ్వల భవిష్యత్ కొత్తగూడెం అర్బన్/పాల్వంచ: దివ్యాంగ బాలల ఉజ్వల భవిష్యత్‌కు భవిత కేంద్రాలు తోడ్పాటునందిస్తున్నాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం రైటర్ బస్తీలోని, పాల్వంచలోని భవిత కేంద్రాలను పరిశీలించి దివ్యాంగ పిల్లలకు కావాల్సిన ఉపకరణాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొత్తగూడెంలో పాత భవనం తొలగించి ఆట స్థలం ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. డీఈఓ ఎం.వెంకటేశ్వరచారి, ఎస్.సైదులు, శ్రీరామ్మూర్తి, శ్రీరామ్, కనకదుర్గ, అరుణ, అనిత పాల్గొన్నారు. -
‘జియోథర్మల్’లో ముందడుగు
● పూర్తిస్థాయి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి నమోదు ● పగిడేరులో దేశంలోనే మొట్టమొదటి ప్లాంట్మణుగూరు టౌన్: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో ముందుడుగు పడింది. మండలంలోని పగిడేరులో బోరు నుంచి వస్తున్న వేడినీటితో జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని కొన్నేళ్ల క్రితం గుర్తించగా 20 కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేశారు. క్లోజ్డ్ లూప్ బైనరీ ఆర్గానిక్ ర్యాంకిన్ సైకిల్(ఓఆర్సీ) టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్‌ను సింగరేణి ఆధ్వర్యాన ఢిల్లీలోని శ్రీరాం ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసర్చ్ బాధ్యులు చేపట్టారు. ఈమేరకు రెండు రోజులుగా ఇక్కడ ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా 20 కిలోవాట్ల పూర్తిస్థాయి సామర్థ్యంతో నమోదైంది. ఇది విజయవంతమైన నేపథ్యాన ఇంకొన్ని పరీక్షలు చేసి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దేశంలోనే తొలి కేంద్రం జియోథర్మల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి కేంద్రప్రభుత్వం 1960 నుంచే ‘హాట్ స్ప్రింగ్స్’ కమిటీ ఏర్పాటు చేసి పరిశోధనలు చేయిస్తోంది. ఈక్రమాన 1992లో హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మణికరణ్ ప్రాంతంలో ఐదు కిలోవాట్ల ప్లాంట్ ఏర్పాటు చేసినా కొండచరియలు విరిగి పడడంతో అది ధ్వంసమైంది. ఆతర్వాత పలు రాష్ట్రాల్లో జియోథర్మల్ కోసం అన్వేషణలు సాగించినా విజయవంతం కాలేదు. చివరకు పగిడేరులో బొగ్గు అన్వేషణకు వేసిన బోర్ నుంచి వేడినీరు ఉబికి వస్తుండడంతో జియోథర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుచేశారు. కాగా, ప్రయోగాత్మకంగా చేపట్టిన ఉత్పత్తి పూర్తిస్థాయిలో నమోదైన నేపథ్యాన దేశంలోనే తొలి ప్లాంట్‌గా నిలవనుంది. -
వట్టిపోతున్న వాగులు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లావ్యాప్తంగా లోకల్ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఆరు నెలలుగా అడ్డూఅదుపు లేకుండా స్థానిక వాగుల నుంచి ఎడాపెడా ఇసుక తోడేస్తోంది. దీంతో వాగుల్లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వాగుల వెంబడి ఏర్పాటు చేసిన చిన్న తరహా ఎత్తిపోతల పథకాలు నిష్ఫలం అయ్యే ప్రమాదం ఉంది. భూగర్భ జలమట్టం కూడా పడిపోయే అవకాశం ఉంది. నిత్యం జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదు అవుతున్నా ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట పడటంలేదు. తెలంగాణ శాండ్ మైనింగ్ రూల్స్ తెలంగాణ ఏర్పడ్డాక ఇసుక తవ్వకాలకు సంబంధించి 2015 జనవరిలో ప్రత్యేక జీఓ జారీ చేశారు. దీని ప్రకారం వాగులు, వంకలు, వర్రెలను కేటగిరీ–1, 2ల కింద పేర్కొన్నారు. కిన్నెరసాని వంటి ఉప నదులు కేటగిరీ–3లో ఉండగా, గోదావరి నది కేటగిరీ–4లో ఉంది. జిల్లాలో ప్రస్తుతం కేటగిరీ–4లో ఉన్న గోదావరిలోనే ఇసుక రీచ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కిన్నెరసానితో సహా ముర్రేడు, పెద్దవాగు, గోధుమ తదితర వాగుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. మండలాల వారీగా ఎక్కడికక్కడ వెలిసిన సరికొత్త ఇసుక మాఫియాలు వాగులు, వంకల్లో రెచ్చిపోతున్నాయి. ఆరంభంలో కేవలం ఎడ్ల బండి ద్వారా స్థానిక అవసరాలు తీర్చారు. కానీ ఆ తర్వాత ఆర్గనైజ్డ్గా సహజ సంపదను లూటీ చేస్తున్నారు. రాత్రయితే చాలు జేసీబీల సాయంతో ఇసుక ఎడాపెడా తోడేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా స్టాక్ పాయింట్‌కు తరలించి అక్కడి నుంచి లారీల ద్వారా బయటి ప్రాంతాలకు ఇసుకను అమ్మేస్తున్నారు. ప్రమాదకర స్థాయిలో.. వాగులు, వంకలు, వర్రెల్లో ఇసుక తవ్వకాలపై నిషేధం ఉన్నా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. అధికారులు వాల్టా చట్టం అమలు చేయడంలేదు. పగలు రాత్రి తేడా లేకుండా కూలీలు, జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో వాగుల్లోని ఇసుక తోడేస్తున్నారు. వారం పది రోజుల వ్యవధిలోనే వాగులు, వర్రెల్లోని ఇసుక మేటలు అదృశ్యమైపోతున్నాయి. వాగు అంచుల్లో ఇసుక తోడటంతో ఇప్పటికే ఒడ్డు కోతకు గురై వందల ఎకరాల వ్యవసాయ భూమి దెబ్బతిన్నది. లోతు ఎక్కువగా తోడటం వల్ల ఇసుక మేటలు కనీస స్థాయిలో లేక భూగర్భ జలాలు తగ్గే ప్రమాదానికి చేరువ అవుతున్నాం. ఫలితంగా వాగుల వెంబడి సాగు నీటికి బోర్లు వేయాల్సి దుస్థితి కూడా దాపురిస్తోంది. ఆఖరికి వంతెన సమీపంలో కూడా ఇసుకను వదిలేయడం లేదు. భారీగా ఇసుక తరలిస్తుండటంతో పలు వంతెనల మనుగడ ప్రమాదంలో పడింది. నిషేధం ఉన్నా వాగుల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జిల్లాలో అమలుకు నోచుకోని వాల్టా చట్టం ఇసుక మాఫియా ధాటికి రూపు కోల్పోతున్న వాగులువాల్టా చట్టానికి తూట్లు వాల్టా చట్టం ప్రకారం ఇసుక మేటల దగ్గర ఉపరితలం నుంచి మూడు మీటర్లలోతు వరకే శాండ్ మైనింగ్ చేయాలి. అంతకు మించి లోతుకు వెళ్తే భూగర్భ జలమట్టం పడిపోతుంది. గట్టు నుంచి వాగు వెడల్పులో నాలుగోవంతు దూరం వదిలి, ఆ తర్వాత నుంచి ఇసుక తీయాలి. లేదంటే వరద వచ్చినప్పుడు గట్టు కోతకు గురై పంటపొలాలను నష్టపోవాల్సి ఉంటుంది. ఇక వాగుల్లో ఉండే వంతెనలకు ఇరువైపులా అర కిలోమీటరు దూరం వరకు ఇసుక తీయొద్దు. ఈ జాగ్రత్త పాటించకపోతే సదరు నిర్మాణాలు కూలిపోయే ప్రమాదముంది. -
‘పీఎంశ్రీ’ స్కూళ్లకు కంప్యూటర్లు
● భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లోని 46 పాఠశాలలకు మంజూరు ● ఉమ్మడి జిల్లాలో ఏడు ఎమ్మార్సీలకు కూడా.. పాల్వంచరూరల్: పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) ఽపథకం కింద ఎంపికై న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సాంకేతిక విద్య అందనుంది. ఇందుకోసం కంప్యూటర్లను కేటాయించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 46 స్కూళ్లకు డెస్క్ టాప్ కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లు మంజూరయ్యాయి. అలాగే, రెండు జిల్లాల్లో ఏడు ఎమ్మార్సీలకు సైతం కంప్యూటర్లు కేటాయించారు. వీటితో విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్య అందుతుందని అధికారులు భావిస్తున్నారు. కాగా, గతంలోనూ పాఠశాలలకు కంప్యూటర్లు కేటాయించినా శిక్షకులను నియమించకపోవడంతో అవి అటకెక్కాయి. ప్రస్తుతం కూడా బోధకులను కేటాయించకపోతే అదే పరిస్థితి ఎదురవుతుందని పలువురు చెబుతున్నారు. పాఠశాలల వివరాలిలా.. పీఎంశ్రీ పథకం ద్వారా ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల బాలికల టీడబ్ల్యూఆర్ఈఐఎస్కు పది కంప్యూటర్లు, ఒక ప్రింటర్, రెండు యూపీఎస్‌లు కేటాయించారు. అలాగే, టేకులపల్లి మండలం కోయగూడెంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, జూలూరుపాడు మండలం పాపకొల్లులోని జెడ్పీహెచ్ఎస్, అన్నపురెడ్డిపల్లిలోని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, చుంచుపల్లి మండలం బాబుక్యాంప్‌లోని హైస్కూల్, కొత్తగూడెం కూలీలైన్ హైస్కూల్, లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురం జెడ్పీహెచ్ఎస్, పాల్వంచలోని బాలుర టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, బాలికల జెడ్పీహెచ్ఎస్, బూర్గంపాడు మండలం సారపాకలోని జెడ్పీహెచ్ఎస్, భద్రాచలంలోని కొర్రాజులగుట్ట జెడ్పీహెచ్ఎస్, ములకలపల్లిలోని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, దమ్మపేటలోని టీడబ్ల్యూఆర్ఈఐఎస్, పినపాక మండలం అల్చిరెడ్డిపల్లిలోని ఆశ్రమ పాఠశాల, దుమ్ముగూడెం మండలం రేగుబల్లిలోని బాలికల ఆశ్రమ పాఠశాలకు కంప్యూటర్లు, ఇతర సామగ్రి మంజూరయ్యాయి. అలాగే, అశ్వాపురం జెడ్పీహెచ్ఎస్, మణుగూరులోని బాలికల టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ, గుండాల మండలంలోని టీడబ్ల్యూఆర్ఈఐఎస్, సుజాతనగర్‌లోని జెడ్పీహెచ్ఎస్, దమ్మపేటలోని జెడ్పీహెచ్ఎస్, దుమ్ముగూడెం మండలం కొత్తపల్లి గిరిజన అశ్రమ పాఠశాలలకు కూడా కేటాయించారు. వీటితో పాటు ఖమ్మం జిల్లాలోని 25 స్కూళ్లకు కంప్యూటర్లు, ప్రింటర్లు, యూపీఎస్‌లు మంజూరయ్యాయి. ఇవి ప్రస్తుతం మండల వనరుల కేంద్రాలకు చేరగా, అక్కడి నుంచి పాఠశాలలకు చేరవేస్తారు. ఇక జిల్లాలోని అళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, కరకగూడెం, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లితో పాటు ఖమ్మం జిల్లాలో ఒక ఎమ్మార్సీకి సైతం ఆరేసి కంప్యూటర్లు, ఒక ప్రింటర్, ఒక యూపీఎస్ మంజూరయ్యాయి. -
‘వీకే –7’ కు త్వరలో అనుమతులు
● బొగ్గు ఉత్పత్తి సాధనకు ఐక్యంగా కృషి చేయాలి ● సంస్థ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేస్తా ● సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియాలోని వీకే –7 బొగ్గు గనికి మార్చి రెండో వారంలో పర్యావరణ అనుమతులు వస్తాయని, ఆ వెంటనే ఓబీ పనులు ప్రారంభిస్తామని సింగరేణి డైరెక్టర్(పీపీ) కె.వెంకటేశ్వర్లు తెలిపారు. డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గురువారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంస్థ నిలదొక్కుకోవాలంటే ఇతర దేశాల వలె తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గు సరఫరా చేయాల్సి ఉందని, అందుకోసం ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. సంస్థ బీఐఎఫ్ఆర్లోకి వెళ్లినప్పుడు నాటి కార్మికులు కష్టపడి పనిచేసి తిరిగి నిలబెట్టారని, ప్రస్తుత కార్మికులో ఆ పటిమ లేదని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడం లక్ష్యం కాగా, కొంత వెనుకంజలో ఉన్నామని, మిగిలిన 40 రోజుల్లో లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంస్థ అభివృద్ధి, వ్యాపార విస్తరణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. వీకే–7తో పాటు జేకే ఓసీ, గోలేటి, రొంపేడు ఓసీల అనుమతుల సాధనే లక్ష్యంగా పని చేస్తానన్నారు. రక్షణ సూత్రాలు పాటిస్తూ, కంపెనీని ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని కార్మికులు, ఉద్యోగులకు సూచించారు. -
నేత్రపర్వం, రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలుచేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళాలుశ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి గురువారం పలువురు భక్తులు విరాళాలు అందచేశారు. ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం వాసి తుపాకుల ఎలగొండ స్వామి – రమాదేవి దంపతులు రూ.లక్ష, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ వాస్తవ్యులు పీ.వీ.కృష్ణమూర్తి – జ్ణానద దంపతులు రూ.1,00,116 అందజేయగా, ఆలయ పర్యవేక్షకులు లింగాల సాయిబాబు, కత్తి శ్రీనివాసులుతో దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చనపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన, హారతి, మంత్రపుష్పం సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ పాల్గొన్నారు 26న రుద్రహోమం.. పెద్దమ్మతల్లి ఆలయంలో ఈనెల 26న రుద్రహోమం నిర్వహించనున్నట్లు ఈఓ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. యాగశాలలో ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగే ఈ హోమంలో పాల్గొన దలిచిన వారు రూ.1,516 చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 6303408458 నంబర్లో సంప్రదించాలని తెలిపారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా కార్యాచరణసూపర్బజార్(కొత్తగూడెం): వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ అందించేలా కార్యాచరణ చేపడుతున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ జి.మహేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీన సర్కిల్ పరిధిలో గరిష్టంగా విద్యుత్ డిమాండ్ 283.7 మెగావాట్లు నమోదైందని తెలిపారు. రాబోయే మూడు నెలల్లో కూడా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని, ఈ మేరకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. లోడ్ పెరిగే ట్రాన్స్ఫార్మర్లను గుర్తించడంతో పాటు కొత్తగా 120 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, 50 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచామని వివరించారు. 33/11 కేవీ సబ్స్టేషన్లలో కొత్తగా ఐదు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, నాలుగింటి సామర్థ్యం పెంచామని తెలిపారు. వినియోగదారులకు ప్రత్యామ్నాయ లైన్ (ఇంటర్ లింకు లైన్) ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా రెండు ఇంటర్ లింకింగ్ లైన్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవసరం మేరకు కొత్త ఫీడర్లను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వేసవికాలంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. -
అపార్ ఐడీ ప్రక్రియ పూర్తి చేయాలి
అశ్వారావుపేటరూరల్: విద్యార్థుల అపార్ ఐడీ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని ప్లానింగ్ కో ఆర్డినేటర్ సతీష్ అన్నారు. జిల్లా అధికారుల బృందం గురువారం అశ్వారావుపేట, తిరుమలకుంట కాలనీ, మామిళ్లవారిగూడెం పాఠశాలలను సందర్శించి, ఆయా పాఠశాలల్లో అపార్ ఐడీ నమోదు వివరాలను పరిశీలించింది. అనంతరం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సతీష్ మాట్లాడుతూ.. అపార్ ఐడీ నమోదును వేగవంతం చేయాలన్నారు. నమోదుపై సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం నారాయణపురం కాంప్లెక్స్‌లో జరిగిన బాలమేళా కార్యక్రమంలో పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమాల్లో జిల్లా బృందం సభ్యులు నాగరాజశేఖర్, సైదులు, ఎంఈఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హరితదళంతో చైతన్యపర్చాలి
మణుగూరు రూరల్ : హరితదళాలతో గ్రామాలను చైతన్యపర్చాలి జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజు అన్నారు. మండల పరిధిలోని సాంబాయిగూడెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న నేచర్ క్యాంప్ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా విద్యార్థులకు పేరంటాల చెరువు, బుగ్గ, బీటీపీఎస్, రామానుజవరం వద్ద గోదావరి నదీ పరివాహకం తదితర ప్రాంతాలను చూపించడంతో పాటు వాటిపై అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్ఓ మాట్లాడుతూ.. ప్రకృతి ఉగ్రరూపాన్ని ప్రపంచంలో ఎవరూ తట్టుకోలేరనడానికి అమెరికా, ఫ్రాన్స్ దేశాలే నిదర్శనమని అన్నారు. అనంతరం స్థానిక పీవీ కాలనీలోని సింగరేణి పాఠశాలను చలపతిరాజు పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్జీఓ రీసోర్స్ పర్సన్ రాజశేఖర్, పాఠశాల హెచ్ఎం ఎం. శ్రీలత, గైడ్ టీచర్ బి. కోటేశ్వరరావు, బి. రామిరెడ్డి, రాము, కె రామారావు, కోటేశ్వరరావు, పరమయ్య పాల్గొన్నారు.డీఎస్ఓ చలపతిరాజు -
రోడ్డు ప్రమాదాలను నివారించండి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో మోటారు వాహనాల వినియోగం పెరుగుతుండగా ప్రమాదాలు సైతం అధికమవుతున్నాయని చెప్పారు. వాహనాలు కండిషన్‌గా లేకపోవడం, అతివేగం, డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ సిగ్నళ్లు పాటించక పోవడమే ఇందుకు కారణమని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించేందుకు పోలీసులు, ఆర్అండ్బీ, వైద్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు. జాతీయ రహదారిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని రవాణా శాఖాధికారులను ఆదేశించారు. ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి మార్చి 5న ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. విద్యార్థులు కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయాలని అర్టీసీ అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద ప్రాథమిక చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో పాటు ఒక ఏఎన్ఎంను అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూ చించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరా చారి, డీఐఈఓ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్ఒ భాస్కర్‌నాయక్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, టేకులపల్లి జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సులోచనారాణి, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ మున్సిపల్ కమిషనర్లు శేషాంజన్‌స్వామి, శ్రీకాంత్, సుజాత పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి పాటిల్ పలుగు, పార పట్టి.. మట్టి తట్ట ఎత్తి.. ఉపాధి కూలీలతో మమేకమైన కలెక్టర్ టేకులపల్లి: మండలంలోని సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రుతండా, కొత్త తండా గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ, ఫారం పాండ్ పనులను కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం పరిశీలించారు. సులానగర్ గ్రామంలో ఉపాధి కూలీలతో మాట్లాడి పని ప్రదేశంలో తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారా.. కూలి గిట్టుబాటు అవుతోందా అని ఆరా తీశారు. అనంతరం వారితో మమేకమై పలుగు, పార పట్టి మట్టి తవ్వారు. తట్టలో ఎత్తుతూ కూలీల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కోయగూడెంలో రైతు పకీర్ సాగు చేస్తున్న మునగ, చంద్రుతండాలో మరో రైతు ధర్మా సాగు చేస్తున్న ఆయిల్‌పామ్‌ను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునగ కాయలతో పాటు ఆకును పొడిచేసి అమ్మొచ్చని, లాభదాయకమైన ఈ పంట పండించి ఆర్థికాభివృద్ధి చెందాలని సూచించారు. ఆయన వెంట డీఎల్పీఓ రమణ, మిషన్ భగీరథ డీఈ పద్మావతి, విద్యుత్ శాఖ డీఈ రంగస్వామి, ఎంపీడీఓ రవీందర్ రావు, ఎంపీఓ గాంధీ, ఏపీఓ కాళంగి శ్రీనివాస్ ఉన్నారు. -
‘ఉపాధి’ని సద్వినియోగం చేసుకోవాలి
చుంచుపల్లి: జాబ్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరు వేసవి కాలంలో ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్డీఓ ఎం.విద్యాచందన అన్నా రు. మండలంలోని నందతండాలో గురువారం ఆమె ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ.. నాలుగు నెలల పాటు గ్రామాల్లో ఈజీఎస్ పనులు ఎక్కువగా జరుగుతాయని, ప్రతి కూలీకి చేతినిండా పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలని సిబ్బందికి సూచించారు. కూ లీల హాజరు, కొలతలు వంటివి కచ్చితంగా పాటించాలన్నారు. ఎండలు పెరుగుతున్నందున పని ప్రదేశంలో నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆమె వెంట ఎంపీడీఓ సుభాషిని, టీఏ నాగరాజు తదితరులు ఉన్నారు.డీఆర్డీఓ విద్యాచందన -
చిన్నారులకు సౌకర్యాలు కల్పించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భానుమతి భద్రాచలంటౌన్: శిశు గృహలోని చిన్నారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. భద్రాచలంలోని శిశుగృహను గురువారం ఆమె సందర్శించారు. చిన్నారులకు అందుతున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్పెషల్ సబ్ జైల్‌ను పరిశీలించి ఖైదీలకు ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. జైలు జీవితం గడిపిన ప్రతీ ఒక్కరు పూర్తి పరివర్తన చెందాలని, విడుదలయ్యాక ప్రశాంత జీవితం గడపాలని సూచించారు. ఆ తర్వాత సరోజిని వృద్ధాశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. 8న లోక్ అదాలత్.. మార్చి 8వ తేదీన నిర్వహించే లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ పడేలా చూడాలని భానుమతి సూచించారు. భద్రాచలం జ్యుడీషియల్ కోర్టు పరిధిలోని పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, న్యాయవాదులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. -
పనులు వేగవంతం చేయాలి
● రైల్వే అధికారులకు ఏడీఎం గోపాలకృష్ణయ్య సూచన ● పలు అభివృద్ధి పనుల తనిఖీ కొత్తగూడెంఅర్బన్: భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్, ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను సౌత్ సెంట్రల్ రైల్వే అడిషనల్ డివిజనల్ మేనేజర్ గోపాలకృష్ణయ్య గురువారం తనిఖీ చేశారు. పనులకు సంబంధించి స్థానిక అధికారులకు కొన్ని సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అన్నారు. స్టేషన్లో తనిఖీ అనంతరం ఏడీఎంతో పాటు సెంట్రల్ రైల్వే డీఆర్‌యూసీసీ మెంబర్ వై.శ్రీనివాస్‌రెడ్డిని పట్టణానికి చెందిన పలువురు కలిసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. బెళగావి ఎక్స్‌ప్రెస్‌తో పాటు కొత్తగూడెం నుంచి డోర్నకల్ వెళ్లే ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని, కొత్తగూడెం కేంద్రంగా రైల్వే జంక్షన్ ఏర్పాటు చేయాలని కోరారు. పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిరిడీ, భద్రాచలం ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని, కొత్తగూడెం – సికింద్రాబాద్ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీలతో పాటు రిజర్వేషన్ బోగీలు ఏర్పాటు చేయాలని కోరారు. రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. -
పోలీసుల అదుపులో సిగరెట్ల దొంగలు?
పాల్వంచ: పట్టణంలోని ఐటీసీ డీలర్ గోడౌన్లో భారీ మొత్తంలో సిగరెట్లను చోరీ చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ చోరీ చేసింది రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. గత జనవరి 4న రాత్రి టీటీటీ కల్యాణ మండపం రోడ్‌లోని ఐటీసీ డీలర్ స్టాక్ పాయింట్లో దొంగలు పడి సుమారు రూ.26 లక్షల విలువైన 24 కాటన్ల సిగరెట్లను అపహరించారు. దీంతో షాపు నిర్వాహకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాల సేకరించారు. కాగా చోరీ చేసిన సిగరెట్లలో రూ.6 లక్షల సరుకును మణుగూరులో ఓ షాపులో, మిగతా సరుకు కొంత హైదరాబాద్‌లో విక్రయించినట్లు సమాచారం. ఆ విక్రయాల ఆధారంగా వచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. గతంలో శాసీ్త్రరోడ్లో ఓ హోల్ సేల్ షాపులో పనిచేసే రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి గుమస్తాగా కొంత కాలం పనిచేశాడు. అడపాదడపా ఐటీసీ గోదాంలో సరుకు తెచ్చేందుకు వెళ్లే అతను మరికొందరితో కలిసి సిగరెట్లు అపహరించి, రాజస్థాన్‌కు పరారైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రాజస్థాన్ వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరికి పలు చోరీల్లో కూడా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా నవభారత్ కాలనీలో పలువురు అధికారుల ఇళ్లలో చోరీకి పాల్పడిన వ్యక్తులు మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తులుగా అనుమానిస్తూ పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజస్థాన్ వ్యక్తులుగా గుర్తింపు -
వనం రాకతో పోటెత్తిన భక్తజనం
●ఘనంగా సాగుతున్న రెక్కల రామక్క జాతర ●జాతరలో పాల్గొన్న ముగ్గురు ఎమ్మెల్యేలుగుండాల: కొమరం వంశీయులు ఇలవేల్పు రెక్కల రామక్క జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. గురువారం ‘వనం’(దేవత) రాకతో భక్తులు పోటెత్తారు. ఆళ్లపల్లి మండలం పెద్దూరు గ్రామంలో కొమరం వంశీయుల ఆధ్వర్యంలో మూడు రోజులుగా జాతర గిరిజన ఆచార సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తున్నారు. మంగళవారం కర్ర దించుట, దేవతకు కుంకుమ పూజతో పాటు, గుడి మేలుకొలుపు జరిపారు. బుధవారం ఒక్కపొద్దుల రెక్కల రామక్క దేవతను గుట్ట నుంచి గర్భగుడికి తీసుకొచ్చారు. గురువారం పాండవుల గుట్ట నుంచి వనదేవతను డప్పువాయిద్యాలతో, గిరిజన నృత్యాలతో తీసుకొచ్చారు. మార్గమధ్యలో ఎదుర్కోలు నిర్వహించారు. రాత్రి దేవతలకు గంగాస్నానం చేయించారు. అనంతరం గద్దెలపై ప్రతిష్ఠించి కల్యాణం జరిపించారు. దీంతో నిండు జాతర మొదలైంది. పూజారులు కొమరం కనకయ్య, సీతయ్య లాలయ్య, రఘుబాబు, రవి, ఆర్తిబిడ్డ కత్తుల సతీష్, వడ్డె ఈసం రామయ్య ప్రత్యేక పూజలు చేశారు. వనం తరలివచ్చే క్రమంలో భక్తులు పూనకాలతో ఊగిపోయారు. కొమ్ము నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క మండలాలతోపాటు ఇతర జిల్లాల నుంచీ భక్తులు తరలివచ్చారు. శుక్రవారం మొక్కుల చెల్లింపు ఉంటుందని, శనివారం తిరిగి దేవతను గుట్టకు చేర్చుతామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవతలను దర్శించుకున్న ఎమ్మెల్యేలు పెద్దూరులో జరుగుతున్న కొమరం వంశీయుల ఇలవేల్పు రెక్కల రామక్క దేవతను గురువారం ఇల్లెందు, పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావులు దర్శించుకున్నారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. గుట్ట నుంచి వనం తీసుకొస్తుండగా ఎమ్మెల్యేలు డోలీ చప్పుళ్లతో చిందు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కొమరం హన్మంతు, మాజీ ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, కొమరం వెంకన్న, రాంబాబు, సతీష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఏఓ..
అశ్వాపురం: పత్తి విక్రయించేందుకు టీఆర్ కోసం వచ్చిన రైతు నుంచి లంచం తీసుకుంటుండగా మండల వ్యవసాయ అధికారి సాయిశంతన్కుమార్ను గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ కథనం ప్రకారం.. మండలానికి చెందిన ఓ రైతు పత్తి అమ్మేందుకు టీఆర్ కోసం ఏఓ వద్దకు వెళ్లగా రూ.30 వేలు డిమాండ్ చేశాడు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచనల ప్రకారం రైతు వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి, ఏఓ సూచనల మేరకు డబ్బులు బ్యాగ్‌లో పెట్టాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు వచ్చి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏఓను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మండల వ్యవసాయ అధికారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్టు డీఎస్పీ తెలిపారు. కాగా ఫిర్యాదుదారుడి పేరు ఏసీబీ అధికారులు వెల్లడించలేదు. ఎవరైనా లంచాలు అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీ వై.రమేష్, సీఐలు శేఖర్, సట్ల రాజు, సిబ్బంది పాల్గొన్నారు. ఏఓపై కుట్ర చేశారని ఆరోపణలు ఏఓపై కుట్ర పన్నారని సామాజిక మాధ్యమాల్లో కొందరు పోస్టులు పెట్టడం గమనార్హం. సీసీఐ కేంద్రంగా జరిగిన నకిలీ టీఆర్‌ల దందాకు సహకరించలేదని కుట్ర పన్ని ఏసీబీ అధికారులకు పట్టించారని, దీనిపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని రాజకీయపార్టీల నాయకులు, రైతులు, స్థానికులు కోరుతున్నారు. రైతు వద్ద రూ.30 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి -
కొరవడిన చిత్తశుద్ధి
గిరిజన అభివృద్ధి.. భద్రాచలం: గిరిజనుల సమస్యలపై చర్చించి, పరిష్కరించడంతో పాటు వారి సంక్షేమానికి చేపట్టాల్సిన ప్రణాళికలు రూపొందించేందుకు ప్రతీ మూడు నెలలకోసారి ఐటీడీఏ పాలక మండలి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఏడాది దాటినా ఈ విషయాన్ని అటు ప్రభుత్వం, ఇటు ఐటీడీఏ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందనే ప్రచారంతో సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలియదు. గిరిజనులపై శీతకన్ను.. గిరిజనులను అభివృద్ధి చేసేందుకే ప్రభుత్వం ఐటీడీఏలను ఏర్పాటుచేసింది. అధికారులు, ఐటీడీఏ పరిధిలోని ప్రజాప్రతినిధులు ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమావేశమై గిరిజనుల సంక్షేమానికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించాలి. కానీ గతేడాది ఫిబ్రవరి 18న సమావేశం నిర్వహించగా, మళ్లీ ఇప్పటివరకు అతీగతీ లేదు. అంతకుముందు సమావేశం 2022 జూలైలో నిర్వహించారు. అంటే 19 నెలల తర్వాత గత ఫిబ్రవరిలో మళ్లీ సమావేశం నిర్వహించారు. దానికి ముందు పరిస్థితి మరీ దారుణం. 2019 ఆగస్టు నుంచి 2022 జూలై వరకు 35 నెలల పాటు అసలు సమావేశమే కాకపోవడం గమనార్హం. ఇలా నెలలు, ఏళ్ల తరబడి జాప్యం చేయడమంటే తమపై ప్రభుత్వం, అధికారులు శీతకన్ను వేయడమేనని గిరిజన సంఘాల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరి కొద్ది రోజుల్లో గ్రామపంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే సమావేశం నిర్వహించి ఏడాది దాటిందని, ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలంటే మరెంత కాలం పడుతుందోనని గిరిజనులు ఎదురుచూస్తున్నారు. గత సమావేశంలో చర్చ సున్నా.. గిరిజన సమస్యలపై చర్చించాల్సిన సమావేశాలు అధికారుల ప్రగతి నివేదికలకు, ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పుకునేందుకే సరిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి 18న జరిగిన పాలకమండలి సమావేశానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. వీరు రాష్ట్ర కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్నా.. ఇక్కడ మాత్రం గిరిజన సమస్యలపై సరైన చర్చ జరగలేదు. కేవలం వారికి అందిస్తున్న పథకాల గురించే మాట్లాడారని, అధికారులు సైతం ప్రగతి నివేదికలకే పరిమితమయ్యారని గిరిజనులు వాపోయారు. సకాలంలో సమావేశాలు నిర్వహించాలి ఐటీడీఏ పాలకమండలి సమావేశాలు ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలి. కానీ ఏడాది దాటినా ఆ ఊసే లేదంటే గిరిజనులపై ప్రభుత్వానికి, అధికారులకు ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. సమావేశం పెట్టినా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఇప్పటికై నా స్పందించి వీలైనంత తొందరగా సమావేశం నిర్వహించడంతో పాటు గిరిజన సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. – ముర్ల రమేష్, కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడుఏడాది దాటినా నిర్వహించని ఐటీడీఏ సమావేశం సమస్యలపై పట్టింపులేని ప్రభుత్వం, అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న గిరిజన సంఘాలు గిరిజనుల భాగస్వామ్యమేది..? ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో తమకూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని గిరిజనులు, ఆయా సంఘాల నాయకులు కోరుతున్నారు. జిల్లాలో కోయ, లంబాడీ, కొండరెడ్డి, నాయకపోడు తదితర జాతుల గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. వీరి తరఫున పలువురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గిరిజనుల సమస్యలు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణపై వారికి సంపూర్ణ అవగాహన ఉంది. కానీ ఐటీడీఏ సమావేశంలో వీరి భాగస్వామ్యం అంతంతమాత్రమే. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గత సమావేశ సమయంలో బీఆర్ఎస్లో ఉన్నారు. దీంతో వేదికపై ఆయనకు స్థానం దక్కలేదు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రముఖ వైద్యుడిగా, ఆదివాసీ ఎమ్మెల్యేగా ఆయనకు ఈ ప్రాంత గిరిజనుల సమస్యలు బాగా తెలుసు. అలాంటి వారికి పాలక మండలిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. -
కుటీర పరిశ్రమలతో స్వయం ఉపాధి
భద్రాచలం: గిరిజన నిరుద్యోగ యువత కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసుకుని స్వయం ఉపాధి పొందడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాదించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఆళ్లపల్లి మండలానికి చెందిన నలుగురు రూ.25లక్షల విలువైన శ్రీ ధనలక్ష్మి ఫ్లైయాష్ బ్రిక్స్ యూనిట్ ను ఏర్పాటుచేసుకోగా రూ.15లక్షల సబ్సిడీ మంజూరైంది. ఈ మేరకు సభ్యులకు సబ్సిడీ చెక్కును గురువారం ఆయన భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఇటుకలు తయారీ, ముడి సరుకుల సేకరణ, మార్కెటింగ్‌పై ఆరా తీశాక మాట్లాడారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తూనే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే స్వయం ఉపాధి లభించడమే కాక ఇంకొందరికి చేయూతనివ్వవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, జేడీఎం హరికృష్ణ, యూనిట్ సభ్యులు సుశీల, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.సమష్టి కృషితో పరిశ్రమల్లో రాణింపు భద్రాచలం: యువతీ, యువకులు సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటుచేసుకుని సమష్టిగా కృషి చేస్తే విజయం సొంతమై జీవితంలో రాణించవచ్చని సీఐఓటీ డైరెక్టర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. భద్రాచలంలోని వైటీసీలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ డిజైన్ ఆధ్వర్యాన ఎంఎస్ఎంఈ యూనిట్ల సభ్యులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ గురువారం ముగిసింది. ఈసందర్భంగా ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ ఎంచుకున్న రంగంపై పూర్తి అధ్యయనం చేశాక పరిశ్రమలు ఏర్పాటుచేయాలని, నాణ్యమైన వస్తువుల తయారీతో పాటుగా మార్కెటింగ్‌పై పట్టు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, సీఐఓటీ శిక్షకుడు విజయ్‌కుమార్, భవిత సెల్ సిబ్బంది మణికుమారి, సమ్మయ్య, దినేష్ పాల్గొన్నారు. ఉత్సాహంగా క్రీడా పోటీలుఅశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కళాశాలలో విశ్వవిద్యాలయ స్థాయిలో బోధన సిబ్బందికి నిర్వహిస్తున్న క్రీడా పోటీలు గురువారం ఉత్సాహంగా సాగాయి. రాష్ట్రంలోని 9 వ్యవసాయ కళాశాలల నుంచి బోధన సిబ్బంది పోటీలకు హాజరయ్యారు. గురువారం రెండో రోజు వాలీబాల్, చెస్, బాల్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షటిల్, క్యారంబోర్డు, క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీలను కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్, ఫ్రొఫెసర్లు డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ శీరిష, డాక్టర్ మధుసూదన్‌రావు పర్యవేక్షించారు. నేడు ఉమ్మడి జిల్లాస్థాయి రెజ్లింగ్ పోటీలు కొత్తగూడెంటౌన్: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి రెజ్లింగ్ పోటీలు శుక్రవారం కొత్తగూడెం రామవరంలోని తెలంగాణ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.కాశీహుస్సేన్ తెలిపారు. అండర్–10, 12, 14, 17 విభాగాల్లో ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఆసక్తి కలిగిన బాలబాలికలు వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో రావాలని సూచించారు. ఖమ్మం, కల్లూరు, మణుగూరు జట్ల విజయం ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న రాజీవ్‌గాంధీ స్మారక క్రికెట్ టోర్నీలో భాగంగా గురువారం నిర్వహించిన మ్యాచ్‌ల్లో ఖమ్మంఅర్బన్, కల్లూరు, మణుగూరు జట్లు ముందంజలో నిలిచాయి. ఖమ్మం అర్బన్ – వైరా జట్ల నడుమ మ్యాచ్‌లో అర్బన్ జట్టు నిర్ణీత ఓవర్లలో 112 పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్‌కు దిగిన వైరా 107 పరుగులే చేయడంతో ఓటమిపాలైంది.కల్లూరు–ముదిగొండ మధ్య మ్యాచ్‌లో ముదిగొండ జట్టు 77పరుగులు చేయగా, కల్లూరు జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘనవిజ యం సాధించింది. అలాగే, మూడో మ్యాచ్‌లో మణుగూరు–సత్తుపల్లి తలపడగా తొలుత బ్యా టింగ్‌కు దిగిన మణుగూరు జట్టు 113 పరుగులకు ఆలౌట్ అయింది. ఆతర్వాత సత్తుపల్లి 106 పరుగులకే ఆలౌట్ కావడంతో మణుగూరుకు విజయం దక్కింది. ఈమేరకు పోటీలను టోర్నీ ఆర్గనైజర్ ఎం.డీ.మతిన్ పర్యవేక్షించారు. -
ముద్దాయికి ఆరు నెలల జైలుశిక్ష
కొత్తగూడెంటౌన్: అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడేనికి చెందిన గుమలాపురం సురేష్‌కు ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ గురువారం కొత్తగూడెం రెండో అదన పు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కె.సాయిశ్రీ తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా... కొత్తగూడెం కూలీలైన్‌కు చెందిన శారదకు పట్టాయిగూడెం గ్రామానికి చెందిన గుమలాపురం సురేష్‌తో వివాహం జరగ్గా, రెండు లక్షల నగదు, ఇంటి స్థలం, బంగారం వరకట్నంగా అందజేశారు. కొంతకాలంపాటు కాపురం సవ్యంగా సాగగా కుమారుడు జన్మించాడు. ఆ తర్వాత సురేష్ నిత్యం మద్యం తాగి కొడుతూ అదనంగా మరో రూ.2లక్షల కట్నం కావాలని వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన శారద భర్త, అతని తండ్రి తండ్రి కృష్ణపై ఫిర్యాదు చేయగా త్రీటౌన్ పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. నలుగురు సాక్షులను విచారించిన జడ్జి సురేష్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. కృష్ణపై నేరం రుజువుకాకపోవడంతో కేసు కొట్టి వేశారు. ఏపీపీఓ విశ్వశాంతి ప్రాసిక్యూషన్ నిర్వహించగా, నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్‌కుమార్, లైజన్ ఆఫీసర్ ఎస్కే అబ్దుల్ ఘని, సిబ్బది బి.శోభన్, బి.రవి సహకరించారు. -
నకిలీ టీఆర్‌లతో దందా
అశ్వాపురం: మండల పరిధిలోని నెల్లిపాకలో సీసీఐ కొనుగోళ్లలో నకిలీ టీఆర్ లతో వ్యాపారులు రైతుల పేర్లతో భారీగా పత్తి అమ్మకాలు సాగించారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి నకిలీ టీఆర్‌లతో సీసీఐలో అమ్మకాలు జరిపి భారీగా సొమ్ము చేసుకున్నారు. నెల్లిపాక సీసీఐ కేంద్రంగా సాగిన ఈ దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశ్వాపురం, బూర్గంపాడు మండలాల్లోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో నకిలీ టీఆర్‌ల వ్యవహారం ఇటీవల విజిలెన్స్ విచారణలో వెలుగుచూసింది. విజిలెన్స్ అధికారులు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారణకు ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నకిలీ టీఆర్‌లను గుర్తించారు. వీటి మంజూరుకు అశ్వాపురం మండలంలో పని చేస్తున్న ఏఈఓ ప్రధాన సూత్రదారిగా, కమీషన్ల కోసం నకిలీ జిరాక్స్‌లతో వ్యాపారులకు ఇష్టానుసారంగా నకిలీ టీఆర్‌లు ఇచ్చారని నిర్ధారించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. త్వరలోనే ఏఈఓపై సస్పెన్షన్ వేటు పడుతుందని భావించారు. ఈ వ్యవహారంలో భద్రాచలం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా టీఆర్ కోసం ఓ రైతు వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటూ అశ్వాపురం మండల వ్యవసాయ అధికారి సాయిశంతన్‌కుమార్ గురువారంఏసీబీ అధికారులకు పట్టుపడ్డారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నెల్లిపాక సీసీఐ కేంద్రంలో నకిలీ టీఆర్‌లపై పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.నెల్లిపాక సీసీఐ కేంద్రంగా రైతుల పేరుతో వ్యాపారుల పత్తి అమ్మకాలు ఇటీవల భద్రాచలం మార్కెట్ కమిటీ కార్యదర్శి సస్పెన్షన్ తాజాగా లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన అశ్వాపురం ఏఓ -
ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మణుగూరు టౌన్: ఓ ఆటో డ్రైవర్ సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగాడు. ఈ సంఘటన ఆలస్యంగా గురువారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని బాపనకుంటకు చెందిన శివ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన భార్యతో మరో వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, వివిధ కారణాలతో తన భార్య దూరంగా ఉంటుందని పేర్కొన్నాడు. పలుమార్లు హెచ్చరించి, ఇద్దరికి దేహశుద్ధి చేసినా మార్పు రావడం లేదంటూ సెల్ఫీ వీడియోలో వివరించాడు. తన చావుకు వారే కారణమంటూ మంగళవారం రాత్రి పురుగుల మందు తాగగా, స్థానికులు గమనించి 100 పడకల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితుడి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం సేకరించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిటేకులపల్లి: రోడ్డు ప్రమాదంలో బుధవారం రాత్రి ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని సులానగర్‌కు చెందిన అజ్మీరా శివ కుమారుడు అశోక్ (34) బుధవారం రాత్రి టేకులపల్లి నుంచి సులానగర్ ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో టేకులపల్లి లారీ ఆఫీస్ వద్ద ముందు వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న బైక్ లారీని ఢీకొట్టింది. దీంతో అశోక్‌కు తీవ్రగాయాలయ్యాయి. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సతీమణి లక్ష్మి, నాయకుడు కోరం సురేందర్ తదితరులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. చికిత్స పొందుతున్న యువకుడు..బూర్గంపాడు: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన సోందె పోస (20) తల్లిదండ్రులు కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో పోస తీవ్ర మనస్తాపానికి గురికాగా మండలంలోని చెరువుసింగారం గ్రామంలో ఉంటున్న అతని బాబాయి తన వద్దకు తీసుకువచ్చాడు. కొంతకాలంగా కూలిపనులకు వెళ్తున్న పోస తల్లిదండ్రులు లేరనే మనోవేదనతో ఈ నెల 7న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగభిక్షం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దమ్మపేటలో మరొకరు..దమ్మపేట : రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మండలంలోని గండుగులపల్లి గ్రామంలో బుధవారం రాత్రి రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని జగ్గారం గ్రామానికి చెందిన మడివి నాగేంద్రబాబు(30), వగ్గెల లక్ష్మణ్, సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడేనికి చెందిన కేతేపల్లి జానకీరామ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. నాగేంద్రబాబును వరంగల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు. -
చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం
అశ్వారావుపేటరూరల్: ఓ చిన్నారి మృతిపై ఆలస్యంగా అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు రాగా, ఖననం చేసిన మృతదేహాన్ని గురువారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్సై టీ యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన నారదాసు రామకృష్ణ, వరలక్ష్మి దంపతులకు నాలుగు నెలల చిన్నారి ఉంది. పాపకు ఈ నెల 5న అశ్వారావుపేటలోని సబ్ సెంటర్లో టీకా వేయించగా, 6న మధ్యాహ్నం మృతి చెందింది. అదే రోజు చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు. బుధవారం రాత్రి తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించినట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
హత్యాయత్నం కేసులో నాలుగేళ ్లు..
కొత్తగూడెంటౌన్: యువతిపై హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2 వేల జరిమానా విధిస్తూ గురువారం కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బత్తుల రామారావు తీర్పు చెప్పారు. వివరాలు ఇలా.. భద్రాచలం రాజంపేటకు చెందిన పోసారపు జాన్‌రాజు బట్టల షాపు నిర్వహిస్తుండగా గుడిమల్ల జగదీష్ న్యూసెన్స్ చేయడంతో మందలించారు. దీంతో జగదీష్ కక్ష పెంచుకుని జాన్ రాజు పెద్ద కూతురు హిందు వర్షిత గొంతు కోసి గాయపర్చాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. ఎనిమిది మంది సాక్షులను విచారించాక గుడిమల్ల జగదీష్‌పై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. సీఐ బి.రమేష్, సిబ్బంది జి. ప్రవీణ్‌కుమార్, ఎం.శ్రీనివాస్, సుఽధీర్‌బాబు సహకరించారు. చెల్లని చెక్కు కేసులో... భద్రాచలంటౌన్: చెల్లని చెక్కు కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శివనాయక్ గురువారం తీర్పు ఇచ్చారు. పట్టణానికి చెందిన రామాలయ ఉద్యోగి శ్రీరంగం నరసింహాచార్యులు చెక్కును హామీగా పెట్టి రాంప్రసాద్ అనే వ్యక్తి నుంచి రూ.2 లక్షలు, పద్మారాణి వద్ద రూ. 2 లక్షలు తీసుకున్నాడు. తీసుకున్న నగదును ఇవ్వకపోవడంతో బాధితులు హామీగా పెట్టిన చెక్కులను బ్యాంకులో వేయగా అవి చెల్లనవిగా తేలింది. బాధితులు కోర్టును ఆశ్రయించగా వాదోపవాదనల అనంతరం న్యాయమూర్తి నిందితునికి ఆరు నెల జైలుతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. -
పోలీసుల అదుపులో సిగరెట్ల దొంగలు?
పాల్వంచ: పట్టణంలోని ఐటీసీ డీలర్ గోడౌన్లో భారీ మొత్తంలో సిగరెట్లను చోరీ చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ చోరీ చేసింది రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. గత జనవరి 4న రాత్రి టీటీటీ కల్యాణ మండపం రోడ్‌లోని ఐటీసీ డీలర్ స్టాక్ పాయింట్లో దొంగలు పడి సుమారు రూ.26 లక్షల విలువైన 24 కాటన్ల సిగరెట్లను అపహరించారు. దీంతో షాపు నిర్వాహకుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం ద్వారా ఆధారాల సేకరించారు. కాగా చోరీ చేసిన సిగరెట్లలో రూ.6 లక్షల సరుకును మణుగూరులో ఓ షాపులో, మిగతా సరుకు కొంత హైదరాబాద్‌లో విక్రయించినట్లు సమాచారం. ఆ విక్రయాల ఆధారంగా వచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. గతంలో శాసీ్త్రరోడ్లో ఓ హోల్ సేల్ షాపులో పనిచేసే రాజస్థాన్‌కు చెందిన వ్యక్తి గుమస్తాగా కొంత కాలం పనిచేశాడు. అడపాదడపా ఐటీసీ గోదాంలో సరుకు తెచ్చేందుకు వెళ్లే అతను మరికొందరితో కలిసి సిగరెట్లు అపహరించి, రాజస్థాన్‌కు పరారైనట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు రాజస్థాన్ వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరికి పలు చోరీల్లో కూడా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా నవభారత్ కాలనీలో పలువురు అధికారుల ఇళ్లలో చోరీకి పాల్పడిన వ్యక్తులు మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తులుగా అనుమానిస్తూ పోలీసులు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాజస్థాన్ వ్యక్తులుగా గుర్తింపు -
మాస్టర్ ప్లాన్ సర్వే పాయింట్ల గుర్తింపు
పాల్వంచ: మున్సిపాలిటీలో జియో మాస్టర్ ప్లాన్ సర్వే పాయింట్లను అధికారులు గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు 34 చోట్ల పాయింట్లను ఎంపిక చేశారు. ఈ ప్రక్రియను గురువారం మున్సిపల్ కమిషనర్ కె.సుజాత పరిశీలించి మాట్లాడారు. త్వరలోనే డ్రోన్ కెమెరాల ద్వారా పట్టణ స్థితిగతులను గుర్తిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో పట్టణ మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందన్నారు. అనంతరం కరకవాగు ఫిల్టర్ బెడ్‌ను పరిశీలించారు. నీటిశుద్ధి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పాత పాల్వంచ చింతల చెర్వు కట్టపై పారిశుద్ధ్య పనులు పరిశీలించి చెరువు పొడువునా వాకర్లకు ఇబ్బందులు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కమిషనర్ వెంట టీపీఓ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. -
హాస్టల్ స్థలాన్ని ఆక్రమిస్తే చర్యలు
కారేపల్లి: కారేపల్లిలో బీసీ బాలుర వసతి గృహం నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించగా, నిధులు కూడా మంజూరయ్యాయి. అయితే, ఈ స్థలంలో ఏర్పాటుచేసిన బోర్డును కొందరు తొలగించడం, అక్కడ గద్దెల నిర్మించడంతో బీసీ సంక్షేమ శాఖ డివిజనల్ అధికారి ఈదయ్య గురువారం పరిశీలించా రు. స్థల ఆక్రమణకు యత్నిస్తే చర్యలు తీసుకుంటా మని తెలిపారు. ఈవిషయమై తహసీల్దార్ సంపత్‌కుమార్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. త్వరలోనే హాస్టల్‌కు కేటాయించిన స్థలానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బైక్ అదుపు తప్పి యువకుడికి గాయాలుదమ్మపేట: అతివేగంతో ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగిన ఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం... గురువారం రాత్రి అన్నపురెడ్డిపల్లి మండలం బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన కొండ్రు రమేష్(27) మందలపల్లి నుంచి సత్తుపల్లి వైపు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో గట్టుగూడెం శివారులో బైక్ అదుపుతప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రమేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 అంబులెన్స్ ద్వారా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం సూపర్‌బజార్(కొత్తగూడెం): అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఇతర అధికారులతో బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గృహ, వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆటో జనరేటర్లు సిద్ధం చేయాలన్నారు. రైతు భరోసా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియకు పార్షియల్ సబ్‌డివిజన్ మార్కింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందని, తహసీల్దార్లు, మండల వ్యవసాయాధికారులు తమ పరిధిలో వ్యవసాయ యోగ్యం కాని భూముల మార్కింగ్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఎంత యూరియా అందుబాటులో ఉంది, ఇంకా ఎంత అవసరమో నివేదికలు అందజేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. రైతు భరోసా ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు అందించాలన్నారు. పోటీలకు రావడమే తొలి విజయంఅశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కళాశాలల్లో శాస్త్రవేత్తలుగా, వివిధ హోదాల్లో ఉన్నవారు క్రీడా పోటీలకు రావడమే తొలి విజయంగా భావించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల మైదానంలో ఏజీ యూనివర్సిటీ పరిధిలోని నాలుగు జోన్ల క్రీడా పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటల్లో పోటీతత్వం ఉండాలని, అప్పడే లక్ష్యం చేరుకుంటామని అన్నారు. క్రీడలతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ క్రీడాలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఇక్కడి పచ్చని వనాలు, పామాయిల్ తోటలు, నర్సరీలు స్వాగతం పలుకుతాయని అన్నారు. ఈనెల 22 వరకు జరిగే ఈ పోటీలకు నాలుగు జోన్ల పరిధిలోని 9 కళాశాలల నుంచి 110 మంది బోధనా సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ డాక్టర్ సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, అబ్జర్వర్ సురేష్, కళాశాల అసోసియేట్ డీన్ హేమంత్ కుమార్, ఎస్.మధుసూధన్ రెడ్డి, శ్రావణ్ కుమార్, శీరిష తదితరులు పాల్గొన్నారు. మునగ సాగు విస్తరించాలి.. మునగ పంట సాగును మరింత విస్తరించేలా కృషి చేయాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పంట సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వాలు అందించే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వనం కృష్ణ ప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ సోయం ప్రసాద్‌రావు పాల్గొన్నారు. విద్యతోనే భవిష్యత్ బాగుంటుందికొత్తగూడెంఅర్బన్: విద్యతోనే భవిష్యత్ బాగుంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఉత్తమ ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. పరీక్షలు సమీపిస్తున్నందున సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని సూచించారు. సందేహాలుంటే ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని చెప్పారు. 100 శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి మేలు చేసే మునగ, కరివేపాకును వంటల్లో వినియోగించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం కొండలరావు, ఎంపీడీఓ చలపతి తదితరులు పాల్గొన్నారు. -
కమనీయం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గ ర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గా వించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సింగరేణి డైరెక్టర్ సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)గా వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆడ్రియాల ప్రాజెక్ట్ జీఎంగా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను ఇటీవల యాజమాన్యం డైరెక్టర్‌గా నియమించింది. ఈ నేపథ్యాన కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించగా జీఎంలు, వివిధ విభాగాల ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అటవీ అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలుసీసీఎఫ్ భీమానాయక్ అశ్వాపురం : అటవీ అధికారులు, సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీసీఎఫ్ ధరావత్ భీమానాయక్ అన్నారు. మండలంలోని వేములూరు, మనుబోతులగూడెం, రేగులగండి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించి అటవీ శాఖ ఆధ్వర్యంలో వేయనున్న ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. మనుబోతులగూడెంలో అటవీ అధికారుల కోసం నిర్మించిన క్వార్టర్లను సందర్శించారు. గ్రామంలో ఇటీవల ఎఫ్ఆర్ఓపై గిరిజనులు దాడి చేసిన విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తేగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మొండికుంట నర్సరీని పరిశీలించారు. ఆయన వెంట డీఎప్‌ఓ కృష్ణాగౌడ్, ఎఫ్డీఓ సయ్యద్ మక్సూద్, రేంజర్ రమేష్ తదితరులు ఉన్నారు. -
పరీక్షలంటే భయం వద్దు
● ఉన్నత విద్యకు ‘పది’ ఫలితాలే పునాది ● తల్లిదండ్రుల నమ్మకాన్ని నిజం చేయాలి ● ఐటీడీఏ పీఓ రాహుల్ అశ్వారావుపేటరూరల్: పదో తరగతి పరీక్షలకు ఇంకా నెల రోజుల సమయం ఉందని, పరీక్షలంటే విద్యార్థుల్లో భయాందోళనలు సహజమని, భయాన్ని వీడాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. బుధవారం అశ్వారావుపేట గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. వార్షిక పరీక్షల్లో పాటించాల్సిన మెళకువలు, జాగ్రత్తలపై సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్ పదో తరగతి మార్కులతోనే ఆధారపడి ఉంటుందని, ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు. ప్రతిరోజూ స్టడీ అవర్స్ నిర్వహించాలని హెచ్ఎం భావ్‌సింగ్‌కు సూచించారు. పాఠశాల భవన మైనర్ రిపేర్లు చేయించాలని ఏఈఈ ప్రసాద్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, ఎస్ఓ ఉదయభాస్కర్, ఏటీడీఓ చంద్రమోహన్, ఎస్సీఆర్పీ రాజబాబు పాల్గొన్నారు. స్వశక్తితో ఎదగాలి.. ములకలపల్లి: నిరుద్యోగులు ఐక్యంగా కుటీర పరిశ్రమలు స్థాపించి స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని పీఓ రాహుల్ సూచించారు. మండలంలోని పాతగంగారంలో ఏర్పాటు చేసిన గిరిజన సాఽధిక బ్రిక్స్ యూనిట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. నలుగురు బృందంగా ఏర్పడి రూ.15 లక్షల సబ్సిడీతో రూ.25 లక్షల వ్యయంతో బ్రిక్స్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. ఇటుకలను మార్కెటింగ్ చేసి, చక్కటి లాభాలు ఆశించాలని సాధిక బ్రిక్ యూనిట్ సభ్యులకు సూచించారు. ఆయన వెంట టీజీబీ మేనేజర్ నరేశ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేశ్ తదితరులు ఉన్నారు. ప్రాథమిక విద్యే పునాది దమ్మపేట : ప్రాథమిక విద్యే చిన్నారుల భవితకు పునాదని పీఓ రాహుల్ అన్నారు. మండలంలోని కొడిసెలగూడెం, అంకంపాలెం పాఠశాలలను బుధవారం ఆయన సందర్శించారు. కొడిసెలగూడెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన, పఠన, రాత సామర్థ్యాలను పరిశీలించి ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వారి పేర్లు కూడా రాయలేని పరిస్థితిలో ఉన్నారని, ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో వేరే వారిని నియమించాలని ఏటీడీఓ చంద్రమోహన్‌ను ఆదేశించారు. పాఠశాలలపై ఎస్సీఆర్పీల పర్యవేక్షణ ఉండాలన్నారు. అంకంపాలెం పాఠశాలలో కెరీర్ గైడెన్స్ చార్ట్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అంతర్గత శక్తి సామర్థ్యాలను గుర్తించి, వాటిని పెంపొందించుకునేలా సరైన తోడ్పాటు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం శారద, వార్డెన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం చెక్‌పోస్ట్ మీదుగా వెళ్లే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్ సిబ్బందికి ఆదేశించారు. పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ వద్ద వాహన తనిఖీలను, చెక్‌పోస్ట్‌ను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకోవాలన్నారు. అంతకుముందు చర్ల మండలం మొగళ్లపల్లి, వీరాపురం, చింతకుంటలో ఇసుక ర్యాంపులను పరిశీలించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా ఎవరైనా ఇసుక అక్రమంగా తరలిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో చర్ల, భద్రాచలం సీఐలు రాజు వర్మ, రమేష్, పాల్వంచ రూరల్ ఎస్ఐ సురేష్, తదితరులు పాల్గొన్నారు. చెక్‌పోస్టు తనిఖీ.. పాల్వంచరూరల్ : మండల పరిధిలోని నాగారం కాలనీ వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను ఎస్పీ రోహిత్‌రాజ్ బుధవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించాక సిబ్బందితో మాట్లాడుతూ.. అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలను పట్టుకుని చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. వాహనాలపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు.చెక్‌పోస్ట్ సిబ్బందికి ఎస్పీ ఆదేశం -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లాకు 12 పతకాలు
కొత్తగూడెంటౌన్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీలో ఈనెల 18న ముగిసిన రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. జిల్లా నుంచి 30 మంది క్రీడాకారులు పాల్గొనగా 12 మంది పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ కె.మహిధర్ బుధవారం వెల్లడించారు. కరకగూడేనికి చెందిన తోలెం శ్రీతేజ హైజంప్ 400 మీటర్ల విభాగంలో రెండు బంగారు పతకాలు, కాచనపల్లికి చెందిన వై.శృతిహాసన్ ట్రైత్‌లాన్‌లో బంగారు పతకం, కొత్తగూడేనికి చెందిన జుర్పుల దీక్షిత్ 100 మీటర్ల విభాగంలో బంగారు పతకం, 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకం, కె.దిలీప్ ట్రైత్‌లాన్‌లో రజత పతకం, డిస్కస్‌త్రోలో టి.చంద్రకళ రజత, జావెలిన్ త్రోలో బి.వేదశ్రీ రజత పతకాలు సాధించారని పేర్కొన్నారు. భద్రాచలానికి చెందిన షేక్ అమ్రీన్ జావెలిన్‌త్రోలో రజత, కాచనపల్లికి చెందిన బి.ప్రసన్ లాంగ్‌జంప్‌లో రజత పతకం, ట్రైత్‌లాన్‌లో ఆర్.వైష్టవి కాంస్య పతకం సాధించారని వివరించారు. క్రీడాకారులను డీవైఎస్ఓ పరంధామరెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు యుగంధర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ అభినందించారు. -
కేసులు త్వరగా పరిష్కరించాలి
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదిర్శి భానుమతి కొత్తగూడెంటౌన్: జాతీయ లోక్ అదాలత్‌తో త్వరితగతిన కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. బుధవారం జిల్లా కోర్టు లైబ్రరీ హాల్లో న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీమా కంపెనీలు తమ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు. మోటార్ వాహన ప్రమాద బాధితుల కేసుల్లో కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. లోక్ అదాలత్‌లో రాజీపడితే కక్షిదారులకు సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటాయన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, న్యాయవాది రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అపార్ ఆన్లైన్ ప్రక్రియ పూర్తిచేయండి
బూర్గంపాడు: విద్యార్థుల అపార్ ఐడీ ఆన్లైన్ ప్రక్రియ త్వరగా పూర్తిచేయాలని డీఈఓ వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని ఉప్పుసాక గిరిజన ఆశ్రమ పాఠశాలను, బూర్గంపాడులోని టీఎస్ఆర్ఎస్(బాలికల)పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఉప్పుసాకలో విద్యార్థుల అపార్ ఐడీ ఆన్లైన్ ప్రక్రియ వెనుకబడి ఉండటాన్ని గుర్తించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా అని ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బూర్గంపాడు టీఎస్ఆర్సీలో విద్యార్థులతో మాట్లాడి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు సతీష్, నాగరాజశేఖర్, సైదులు పాల్గొన్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచాలి అశ్వాపురం: విద్యార్థుల పఠనా సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని మిట్టగూడెం జెడ్పీ పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ బాలమేళా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మిట్టగూడెం కాంప్లెక్స్ పరిధిలోని 15 పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొనగా.. పాఠశాలల వారీగా విద్యార్థులు టీఎల్ఎం నమూనాలు ప్రదర్శించారు. వాటిని పరిశీలించిన డీఈఓ విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఎఫ్ఎల్ఎన్ బాలమేళా కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. మారుమూల ప్రాంత పాఠశాలలు మిగతా మండలాల వారికి ఆదర్శంగా ఉంటడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో ఎఫ్‌ఎల్‌ఎం బాలమేళా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. డీఈఓ వెంకటేశ్వరాచారి -
విత్తు.. వనమైతే!
ఇళ్లలో విరివిగా పండ్ల వినియోగం ● చెత్త బుట్టల్లోకి చేరుతున్న గింజలు ● అడవుల్లో వెదజల్లితే అందరికీ ‘ఫలాలు’ ● వన్యప్రాణులకూ తీరనున్న ఆహార సమస్య ఇళ్లలో పండ్లు తిన్న తర్వాత వాటి గింజలను సేకరించి, అడవుల్లో వేయడం ద్వారా అనేక రకాల పండ్ల మొక్కలు అడవుల్లో మళ్లీ చిగురించే అవకాశం ఉంది. తద్వారా అడవుల్లోని జీవరాశులకు సైతం ఆహార కొరత తీరేందుకు ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా కోతుల వంటివి గ్రామాలపై పడి దాడి చేయకుండా అడవుల్లోనే ఆగిపోయే అవకాశం ఉంటుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంఅగ్ని ప్రమాదాలతో అనర్థం.. అడవుల్లో చెట్లకు కాసే పండ్లను పక్షులు, కోతులు, ఇతర వన్యప్రాణులు తింటాయి. ఈ క్రమంలో ఆయా చెట్ల కాయలు, వాటిలోని గింజలు వేర్వేరు ప్రాంతాల్లో పడుతుంటాయి. ఆ విత్తనాలు భూమిపై పడి వర్షాలు పడగానే తిరిగి మొలకెత్తుతుంటాయి. అయితే అడవుల్లో మానవ సంచారం పెరిగిన తర్వాత తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో అయితే ఈ సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికంగా ఉంది. ఇలా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎండిపోయిన ఆకులకు నిప్పంటుకుని దావానంలా చుట్టు పక్కల ప్రాంతాలకూ మంటలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద చెట్లకు నష్టం కొంతయితే.. అడవిలో నేలపై రాలిపోయిన గింజలు/విత్తనాలు మాడిమసవడం ద్వారా అధిక నష్టం జరుగుతోంది. దీంతో సహజ పద్ధతిలో అడవుల విస్తరణ ఆశించిన మేర పెరగడం లేదు. అటవీ శాఖ నర్సరీల్లో పెంచిన మొక్కలు నాటితేనే అడవులు మనుగడ సాగిస్తున్నాయి. గింజలు కాపాడితే.. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జామ, కీరదోస, పుచ్చకాయ, సపోట, మామిడి, దానిమ్మ, బత్తాయి, రేగు, సీతాఫలం, సంత్రాలు తదితర పండ్లతో పాటు యాపిల్, చెర్రీ, బెర్రీ వంటి పండ్లను విరివిగా కొనుగోలు చేసి తింటుంటాం. పండ్లను తిన్న తర్వాత మిగిలిన గింజలను డస్ట్‌బిన్‌లో పడేసి ఆ తర్వాత మున్సిపల్/పంచాయతీ చెత్త కుండీల్లో వేస్తుంటాం. దీంతో ప్రకృతిలో ఎంతో విలువైన విత్తనాలు వృథా అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పండ్లు తిన్న తర్వాత మిగిలే గింజలను నిల్వ చేసి, వేసవిలో ఎండబెట్టడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించొచ్చు. దృఢంగా పెరుగుతాయి.. సాధారణంగా నర్సరీల్లో అంటు కట్టడం ద్వారా పెంచే మొక్కలంటే విత్తనం ద్వారా అడవిలో మొలకెత్తే చెట్టు బలంగా ఉంటుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. నర్సరీ నుంచి తెచ్చి నాటిన మొక్కకు ట్రీగార్డ్ ఏర్పాటు చేసి, సరిపడా నీరు అందించినప్పుడే అది చెట్టుగా ఎదుగుతుందని, అదే విత్తనం నుంచి వచ్చిన మొక్క అయితే ప్రకృతి అడ్డంకులను ఎదుర్కొని బలంగా పెరుతుందని అంటున్నారు. పదేళ్లుగా ఇదే పని ప్రభుత్వ ఉద్యోగం చేసి విరమణ పొందిన తర్వాత అడవుల పెంపకంపైనే దృష్టి పెట్టాను. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వివిధ గింజలను సేకరించడం, ఎండబెట్టడం.. ఆ తర్వాత వాటిని అడవులు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లడం చేస్తుంటాను. వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు అక్కడా ఇదే పని చేస్తుంటా. ఇటీవల కుంభమేళాకు వెళ్లి అక్కడి ప్రజలకు మన దగ్గర దొరికే పండ్ల గింజలు ఇచ్చి వచ్చా. గత పదేళ్లలో నేను చల్లిన ఎన్నో విత్తనాలు ఆ తర్వాత మొక్కలై ఇప్పుడు చెట్లుగా మారాయి. గింజలను వృథాగా చెత్త బుట్టల్లో వేయొద్దు. కొంత సామాజిక బాధ్యతగా ఎండబెట్టి.. వీలున్నప్పుడు ఖాళీ ప్రదేశాలు, అడవుల్లో వేయండి. – హరినాథ్, ప్రకృతి ప్రేమికుడు ఆ గింజలు అడవుల్లో వేస్తే.. వేసవికాలంలో ఎండబెట్టిన గింజలను రుతుపవనాల సీజన్ ప్రారంభమైన తర్వాత ఇంటి నుంచి వేరే ఊళ్లకు లేదా బయటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు రోడ్ల పక్కన, బంజరు భూముల్లో, అడవుల్లో, ముళ్ల పొదల్లో, చిట్టడవుల దగ్గర జల్లడం ద్వారా ఆయా గింజలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. వంద గింజలు విసరితే కనీసం పది గింజలు మొలకెత్తినా, అందులో ఒకటి మొక్కగా మారి చెట్టయినా ప్రత్యక్షంగా ఆ ప్రాంతానికి, పరోక్షంగా మానవాళికి ఉపయోగకరంగా మారుతుంది. -
బడ్జెట్ కేటాయింపులపై పునరాలోచించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్య, మధ్యతరగతి, పేద ప్రజలకు మేలు చేసేలా కాకుండా కార్పొరేట్ శక్తులు, సంపన్నవర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐ, సీపీఎం, ఎంఎల్ పార్టీల ఆధ్వర్యాన బుధవారం కొత్తగూడెంలో బడ్జెట్‌పై నిరసన తెలిపారు. ఈసందర్భంగా తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కూనంనేని మాట్లాడుతూ రైతులు, కార్మికులకు వ్యతిరేకంగానే కాక విద్య, వైద్య రంగాలను నిర్వీర్యం చేసేలా బడ్జెట్ ఉందని ఆరోపించారు. బడ్జెట్ మార్చాలన్న తమ ప్రధాన డిమాండ్ మేరకు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎస్.కే.సాబీర్‌పాషా, మచ్చ వెంకటేశ్వరరావుతో పాటు వివిధ పార్టీల నాయకులు గౌని నాగేశ్వరరావు, కందగట్ల సురేందర్, పి.సతీష్, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, రత్నకుమారి, ఫహీం, లిక్కి బాలరాజు, కె.బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, భూక్యా రమేష్, కె.లక్ష్మి, ఎన్.రమేష్, అభిమన్యు, నాగకృష్ణ, జె.సీతారామయ్య, ఉమ, అలీముద్దీన్, ఎం.రాజశేఖర్, నక్కా లావణ్య, చంద్రశేఖర్ పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని -
ఇసుక వాహనాలపై పోలీసుల నిఘా
మణుగూరు టౌన్/టేకులపల్లి/పినపాక: జిల్లాలో కొద్ది రోజులుగా పోలీసులు అక్రమ ఇసుక తరలింపుపై నిఘా పెట్టారు. విస్తృతంగా తనిఖీలు చేస్తూ అనుమతిలేని వాహనాలను సీజ్ చేస్తున్నారు. బుధవారం 9 ట్ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. మణుగూరు పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో అక్రమంగా గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను బుధవారం పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు. రామానుజవరం గ్రామం, పట్టణంలోని చినరావిగూడెం ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ఏడు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ సోమ సతీష్ తెలిపారు. టేకులపల్లి మండల పరిధిలోని శంభునిగూడెం ప్రాంతంలో ముర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు టేకులపల్లి ఎస్ఐ పోగుల సురేష్ తెలిపారు. వాహనదారుడు బాణోతు శంకర్‌పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. పినపాకమండలంలోని జానంపేట పంచాయతీ పరిధిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఈ. బయ్యారం ఎస్ఐ రాజకుమార్ తెలిపారు. అక్రమంగా రవాణా చేస్తున్న తొమ్మిది ట్రాక్టర్లు సీజ్ -
భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద భద్రత పెంపు
● ఇటీవల కానిస్టేబుల్‌ను బైక్‌తో ఢీ కొట్టి పారిపోయిన స్మగ్లర్లు ● తనిఖీలు చేస్తున్నా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనివైనం భద్రాచలంఅర్బన్: పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో ఉన్న చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రత పెంచారు. భద్రాచలం మీదుగా జరుగుతున్న గంజాయి, ఇతర ప్రభుత్వ నిషేధిత వస్తువుల రవాణాను అరికట్టేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 15న ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ కానిస్టే బుల్‌ను ఢీకొట్టి పారిపోయారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. రెండు నెలల క్రితం ఇదే విధంగా ఓ ద్విచక్రవాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించిన హెడ్ కానిస్టేబుల్ అనంతయ్యను కూడా ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలో చెక్‌పోస్టు వద్ద భద్రత పెంచారు. అదనంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ షిఫ్ట్‌లో ఓ ఎస్ఐ స్థాయి అధికారి, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ముగ్గురు టీజీపీఎస్పీ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా వీరికి అదనంగా సీఆర్పీఎఫ్ బలగాలను కూడా ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. పోలీసులను ఢీకొట్టి గాయపర్చిన వారిని పట్టుకుని చర్యలు తీసుకోవాలని, అప్పుడే పోలీసులు మనోధైర్యంతో విధులు నిర్వర్తిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు
సత్తుపల్లిరూరల్/దమ్మపేట: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో బుధవారం జరిగింది. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సత్తుపల్లి మండలం చిన్నపాకలగూడేనికి చెందిన కేతేపల్లి జానకీరాం బైక్‌పై పట్వారిగూడెం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తుండగా.. దమ్మపేట మండలం జగ్గారానికి చెందిన మడివి నాగేంద్రబాబు, వగ్గెల లక్ష్మణ్ మరో ద్విచక్రవాహనంపై జగ్గారం వెళ్తున్నారు. మార్గమధ్యలోని గండుగులపల్లిలో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొనగా లక్ష్మణ్, జానకీరాం, నాగేంద్రబాబుకు తీవ్రగాయాలు కావడంతో 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. అయితే, జానకీరాం, లక్ష్మణ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. కాగా, క్షతగాత్రులను 108లో సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చిన సమయాన సిబ్బంది ఒక్కరే ఉండడంతో వారిని లోపలకు తీసుకెళ్లేందుకు 20 నిమిషాలకు పైగా సమయం పట్టింది. అంతసేపు క్షతగాత్రులు అవస్థ పడ్డారు. సిబ్బంది లేక అంబులెన్స్‌లోనే 20 నిమిషాలు -
64 కేజీల గంజాయి స్వాధీనం
మణుగూరు టౌన్: ఒడిశా నుంచి మణుగూరు మీదుగా బెంగళూరుకు కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని బుధవారం ఎకై ్సజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కరమ్‌చంద్ కథనం ప్రకారం.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు నుంచి కేరళకు చెందిన మహ్మద్ జమీర్ కారులో బెంగళూరుకు గంజాయి తరలిస్తున్నాడు. పక్కా సమాచారంతో కొత్తగూడెం ఎకై ్సజ్ టాస్క్ ఫోర్స్, మణుగూరు ఎక్సైజ్ సిబ్బంది సుమారు నాలుగు గంటలపాటు తనిఖీలు చేపట్టారు. మణుగూరు రథంగుట్ట అర్బన్ పార్క్ సమీపంలో అనుమానాస్పద వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేయగా, 64 కేజీల గంజాయి లభ్యమైంది. గంజాయి, కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, కారు విలువ రూ.19.10 లక్షలు ఉంటుందని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో సీఐ రాజిరెడ్డి, ఎస్ఐలు గౌతమ్, కిశోర్‌బాబు, సిబ్బంది హబీబ్ పాషా, వెంకట నారాయణ, సుమంత్, ప్రసన్న, శ్రీను, ఆంజనేయులు, పార్ధసారథి, రమేశ్ పాల్గొన్నారు. గంజాయి పట్టుకున్న బృందాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి, ఖమ్మం డివిజన్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య తదితరులు అభినందించారు. భద్రాచలంలో 17 కేజీలు..భద్రాచలంఅర్బన్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విక్రయించేందుకు రెండు బైక్‌లపై నలుగురు యువకులు 17 కేజీల గంజాయిని ఒడిశా సరిహద్దు నుంచి తీసుకెళ్తుండగా పట్టణంలోని కూనవరం రోడ్డులో బుధవారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నా రు. ఎకై ్సజ్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. గంజాయిని, రెండు సెల్ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు భద్రాచలం ఎకై ్సజ్ సీఐ షేక్ రహీమున్నీసా బేగం తెలిపారు. తనిఖీల్లో ఎస్ఐ అల్లూరి సీతారామరాజు, సిబ్బంది ఆలీం, జమాల్, బాబు, వీరబాబు, లలిత, రాకేష్, కిరణ్ ఉన్నారు. కారు స్వాధీనం, ఒకరి అరెస్ట్ -
అడవుల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రణాళిక
● ఎఫ్డీఓ దామోదర్ రెడ్డి వెల్లడి అశ్వారావుపేటరూరల్: జిల్లాలో అడవుల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని, ఇప్పటిదాకా 500 హెక్టార్లలో పోడు భూములను స్వాధీనం చేసుకున్నట్లు ఎఫ్డీఓ దామోదర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన స్థానిక ఫారెస్టు రేంజ్ కార్యాలయం వద్ద ఉన్న నర్సరీని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అడవుల పునరుద్ధరణ కార్యక్రమానికి ఫారెస్టు నర్సరీల్లో ఐదు లక్షల మొక్కలను పెంచుతున్నామని తెలిపారు. గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం (జీసీపీ)లో మొక్కలు నాటేందుకు అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో 75 హెక్టార్లు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పోడు భూముల్లో 135 హెక్టార్లలో ప్లాంటేషన్ల కోసం వెదురు, టేకుతోపాటు పలు రకాల మొక్కలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అశ్వారావుపేట ఫారెస్టు చెక్‌పోస్టుకు సంబంధించిన స్థలం తమదేనని, అయితే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని తెలిపారు. చెక్‌పోస్టు చుట్టూ ఉన్నవారంతా ఆక్రమణదారులేనని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ రేంజర్ మురళి, సెక్షన్ ఆఫీసర్ కృష్ణమూర్తి, ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు ఉన్నారు. మున్సిపల్ అధికారులపై విచారణఇల్లెందు: ఇల్లెందు మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్ ఉద్యోగ విరమణ వయసుకు మించి రెండు ఏళ్లు అదనంగా విధులు నిర్వహించిన వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టారు. మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ వర్కర్ 60 ఏళ్లు, ట్రాక్టర్ డ్రైవర్ 58 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందుతారు. జి. వెంకటి అనే ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం 58 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందకుండా 60 ఏళ్ల కాలంపాటు పనిచేశాడు. అప్పుటి కమిషనర్ అంజన్‌కుమార్, మేనేజర్ నూరుల్లా, యాకుబ్‌పాషాలు అతని సర్వీస్ బుక్ తనిఖీ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆ ముగ్గురు అధికారులు ఇల్లెందు నుంచి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. తర్వాత వచ్చిన అధికారులు వెంకటికి రావాల్సిన నగదును నిలిపి వేశారు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగా.. కోర్టు తీర్పు మేరకు అతనికి డబ్బులు చెల్లించారు. అదనపు రెండు ఏళ్ల సర్వీస్ కింద రూ. 15 లక్షలకు పైగా చెల్లించారు. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాత ఇల్లెందు మున్సిపాలిటీలో విచారణ చేపట్టారు. రికార్డులు, జీఓలు, సర్వీస్ బుక్‌తోపాటు వెంకటి పని చేసిన కాలం, చెల్లించిన జీతం, ఉద్యోగ విరమణ తర్వాత లభించిన డబ్బుల వివరాలు తనిఖీ చేశారు. ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. బహిర్భూమికి వెళ్లిన వ్యక్తి మృతికొత్తగూడెంటౌన్: పట్టణ పరిధిలోని వేణుగోపాలస్వామి గుడి సమీపంలో అదే ప్రాంతానికి చెందిన దివ్యాంగుడు, ఎలక్ట్రీషియన్ నరసింహా(36) మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో స్థానికులు బుధవారం గుర్తించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... వేణుగోపాల్ నగర్ కాలనీవాసులు ఉదయం మార్కెట్‌కు వెళ్తున్న క్రమంలో దుర్వాసన వస్తుండగా మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నరసింహా మంగళవారం ఉదయం బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. కాగా బహిర్భూమికి వెళ్లి అక్కడే పడిపోయి మృతి చెందాడని భావిస్తున్నారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యజూలూరుపాడు: మానసిక వేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఏఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం.. మండలంలోని కొత్తూరు గ్రామ పంచాయతీ జడలచింతకు చెందిన దబ్బా నరసింహారావు, సత్యావతి దంపతుల కుమారుడు అరవింద్ కుమార్(20) ఇంటర్ వరకు చదువుకున్నాడు. పాపకొల్లుకు చెందిన ఓ ఆర్ఎంపీ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. కొంతకాలంగా ముభావంగా ఉంటూ చనిపోతానంటూ చెబుతుండగా తల్లిదండ్రులు మనోధైర్యం చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం అరవింద్ కుమార్ పురుగుల మందు తాగి ఇంట్లో అపస్మారకస్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు గమనించి కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తండ్రి నరసింహారావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
30 ఏళ్లు దాటినవారికి వైద్య పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: చాపకింద నీరులా వ్యాపిస్తున్న మధుమేహం, రక్తపోటు, కేన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులను కట్టడి చేసేందుకు 30 ఏళ్ల వయసు దాటిన వారిందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధువరన్ తెలిపారు. బుధవారం వైద్య, ఆరోగ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్సీడీ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి మార్చి 31 వరకు రోజులపాటు వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాధి నిర్ధారణ తర్వాత బాధితులకు ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స అందిస్తామని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించాలికొత్తగూడెంఅర్బన్: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంఎచ్ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ నాయక్ వైద్యాధికారులను సూచించారు. బుధవారం కొత్తగూడెం పట్టణ పరిధిలోని రామవరం అర్బన్ హెల్త్ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని చెప్పారు. నేషనల్ హెల్త్ పాలసీలను 100శాతం పూర్తి చేయాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాము, సిబ్బంది ఉన్నారు. రామాలయ మాజీ ప్రధానార్చకుడు మృతిభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు పొడిచేటి జగన్నాఽథాచార్యులు(71) అనారోగ్యంతో మృతి చెందిన విషయం బుధవారం ఆలస్యంగా దేవస్థానం వర్గాలకు తెలిసింది. భక్త రామదాసు శ్రీరంగం నుంచి తీసుకొచ్చిన ఐదు వంశాల్లో పొడిచేటి వంశానికి చెందిన జగన్నాఽథాచార్యులు 1954 జనవరి 1న జన్మించారు. నాలుగున్నర దశాబ్దాల పాటు ఆలయంలో పలు హోదాల్లో పనిచేసిన ఆయన చివరకు ప్రధానార్చకులుగా కొనసాగుతూ 2018 డిసెంబర్ 31న ఉద్యోగ విరమణ చేశారు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యానికి గురైన ఆయన ఇంటి వద్దనే చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందారు. శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవ క్రతువుల్లో ఆయన పలుమార్లు కీలక పాత్ర పోషించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధందుమ్ముగూడెం: మండలంలోని పెద్దఅర్లగూడెం గ్రామానికి చెందిన పాయం ముత్యాలక్క ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో బుధవారం దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సామగ్రి, పట్టాదారు పాస్ బుక్‌లు, ఆధార్‌కార్డులు మంటల్లో కాలిపోయి బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఘటనా స్థలాన్ని ఆర్ఐ నరసింహారావు సందర్శించి వివరాలు సేకరించారు. కాగా, ముత్యాలక్క కుటుంబానికి విజయవాడకు చెందిన పీవీ చారిటబుల్ ట్రస్ట్ బాధ్యుడు కృష్ణారావు తక్షణ సాయంగా ప్రకటించిన రూ.5 వేలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వీరమాచినేని వినీల్ అందజేశారు. నాయకులు కనుబుద్ది దేవా, నటరాజ స్వామి, వాసం రాంకుమార్, కోటేశ్వరరావు పాల్గొన్నారు. మహిళ మెడలో గొలుసులు అపహరణభద్రాచలంఅర్బన్: పట్టణంలోని ఇందిరా మార్కెట్లో ఉన్న ఓ కిరాణా దుకాణం నిర్వహకురాలు సుశీల మెడలో గొలుసులను బుధవారం దుండగులు అపహరించారు. తాగునీటి సీసా కొనుగోలు చేసిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ పే ద్వారా నగదు బదిలీ చేసి, బాటిల్ తీసుకుని వెళ్లే సమయంలో ఆమె మెడలో ఉన్న రూ.6 లక్షల విలువైన రెండు బంగారపు గొలుసులు లాక్కెళ్లారు. బాధితురాలు సుశీల డయల్ 100కు ఫోన్ చేయగా, టౌన్ సీఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా గొలుసులు లాక్కెళ్లినప్పుడు సుశీల మెడకు గాయాలయ్యాయి. సీఐ రమేష్ కేసు నమోదు చేశారు. -
వేళ్లూనుకున్న అవినీతి
ముడుపులు ముట్టజెబితేనే ప్రభుత్వ శాఖల్లో పనులు ● కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్న ప్రజలు ● ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో ఏసీబీకి చిక్కిన 15 మంది ఉద్యోగులుపాల్వంచరూరల్: అటవీశాఖ ఇల్లెందు డివిజన్లో గత మంగళవారం కొమరారం ఎఫ్ఆర్ఓ, ఎఫ్‌బీఓలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటనతో ప్రభుత్వ శాఖల అధికారుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. ముడుపులు ముట్టజెప్పనిదే ఏ ప్రభుత్వ శాఖలోనూ పనులు జరగడం లేదనేందుకు ఈ సంఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు. ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డవారిలో ఎక్కువ మంది భద్రాద్రి జిల్లావారే ఉన్నారు. వారిలోనూ పాల్వంచ ఉద్యోగులు, అధికారులు ఏడుగురు ఉన్నారు. ఏయే శాఖల్లో ఎవరెవరు పట్టుబడ్డారంటే...? ●గతేడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో 15 మంది అధికారులు ఏసీబీకి చిక్కారు. 2024 జనవరి 29న ఖమ్మం టూటౌన్లో రూ. 50వేలు లంచం తీసుకుంటున్న హెడ్‌కానిస్టేబుల్ పి.కోటేశ్వరరావును పట్టుకున్నారు. ●ఏప్రిల్ 18న పాల్వంచ మున్సిపల్ సూపరింటెండెంట్ అక్కిరెడ్డి వెంకటరమణి, ఉద్యోగి ప్రసన్నకుమార్ రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ●భద్రాచలం ఎస్ఐ ఎం.శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు. ●మే 16న అశ్వారావుపేటలో విద్యుత్‌శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ధరావత్ శంకర్ రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ●మే 23న చర్ల డిప్యూటీ తహసీల్దార్ బి.భరణిబాబు రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అదే నెలలో పాల్వంచ పట్టణ ఎస్ఐ బాణాల రాము రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ●ఆగస్టు 21న ఆళ్లపల్లి మండల పంచాయతీ అఽధికారి బత్తిని శ్రీనివాసరావు రూ.15 వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ●సెప్టెంబర్ 18న జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కె.సూర్యనారాయణ రూ.లక్షా 14 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ●పాల్వంచ విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రూ.26 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ●2025 జనవరి 25న ఇల్లెందులో ప్రభుత్వ మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ బి.కృష్ణ, ఆఫీసు సహాయకుడు కొచ్చెర్ల రామకృష్ణ రూ.2వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. జనవరి 27న సత్తుపల్లిలోని మున్సిపల్ ఉద్యోగి ఎన్.వినోద్ రూ.2500 లంచం తీసుకుని దొరికాడు. ●ఫిబ్రవరి 18న కొమరారం ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ ఆర్.ఉదయ్‌కుమార్, బీట్ఆఫీసర్ ఎన్.హరిలాల్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. నేరం రుజువైతే ఉద్యోగం నుంచి తొలగింపు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు అవినీతికి పాల్పడి ఏబీసికి పట్టుబడ్డాక నేరం రుజువైతే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. లంచం పుచ్చుకుంటూ దొరికిన ఉద్యోగులను ఏసీబీ అధికారులు 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరుపరుస్తారు. 40 రోజులు జైలులో ఉండాల్సిందే. బెయిల్ కూడా దొరకదు. కోర్టులో నేరం రుజువైతే ఆరేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అవినీతి ఉద్యోగుల ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుంది. కేసుల నమోదు ఇలా.. ప్రభుత్వ ఉద్యోగులు చట్టప్రకారం చేయాల్సిన పనుల విషయంలో లంచం అడగడం, తీసుకోవడం నేరం. సెక్షన్ 7 ప్రకారం కేసు నమోదు చేస్తారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉంటే సెక్షన్ 13 (1) ప్రకారం చర్యలు తీసుకుంటారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, అవకతవకలకు పాల్పడినా, ప్రజాధనం దుర్వినియోగం చేసినా సెక్షన్ 13(1) అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. అక్రమ ఆస్తుల కూడబెట్టడంలో సహకరించిన స్నేహితులు, బంధువులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. అవినీతి అధికారులను పట్టించే విషయంలో భయపడొద్దు. నిర్భయంగా సమాచారం ఇచ్చి సహకరించాలి. –వై.రమేష్, ఏసీబీ డీఎస్పీ -
గర్భగుడికి చేరుకున్న రెక్కల రామక్క
గుండాల: ఆళ్లపల్లి మండలం పెద్దూరు గ్రామంలో రెక్కల రామక్క జాతర కొనసాగుతోంది. బుధవారం దేవతను గర్భగుడికి తీసుకొచ్చారు. తొలిరోజు మంగళవారం గుడి మెలుగుట, కర్రదించుట, దేవతకు కుంకుమ పూజ తదితర కార్యక్రమాలు ఘనంగా చేశారు. రెండో రోజు బుధవారం ప్రత్యేక పూజలు, డోలి చప్పుళ్ల నడుమ వేల్పులోద్ది గుట్ట నుంచి అమ్మవారిని గర్భగుడికి తీసుకొచ్చారు. ఎదురుకోలు ఉత్సవం జరిపారు. పూజారులు కొమరం కనకయ్య, సీతయ్య, లాలయ్య, రఘుపతి, రవి, ఆర్తి బిడ్డ కత్తుల సతీష్, వడ్డె ఈసం రామయ్య ఆధ్వర్యంలో పూజలు చేశారు. కాగా ఈ జాతర ఐదురోజులపాటు సాగనుంది. గురువారం పాండవుల గుట్టనుంచి వనదేవతను తీసుకొచ్చే ఘటనతో నిండు జాతర మొదలవుతుంది. దేవతలను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. -
ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తాం
చండ్రుగొండ : ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలను బలోపేతం చేస్తామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశ్రమ పాఠశాలల్లో మూడు నెలలుగా చేపడుతున్న ఉద్దీపకం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని తెలిపారు. 3, 4, 5 తరగతుల వారు ఆంగ్లం, గణితంలో పట్టు సాధించేందుకు ఇది ఉపకరిస్తోందన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని హెచ్చరించారు. తొలుత తిప్పనపల్లి గిరిజన సంక్షేమ పాఠశాలను సందర్శించిన పీఓ విద్యార్థులతో మాట్లాడారు. కలెక్టర్ అంటే ఎవరు.. కలెక్టర్ కావాలంటే ఏం చదవాలంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూ సక్రమంగా పాటిస్తున్నారా అని ఆరా తీశారు. వర్షం వస్తే భవనం కురుస్తోందని, మరుగుదొడ్లు భవనానికి దూరంగా ఉన్నాయని, కోతుల బెడద ఉందని ప్రిన్స్‌పాల్ సునీత, విద్యార్థినులు చెప్పగా వెంటనే ఈ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ తదితరులు ఉన్నారు. సూక్ష్మ పరిశ్రమలపై దృష్టి సారించాలిభద్రాచలం: సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలతో జీవనోపాధి కలుగుతుందని, వాటిపై గిరిజనులు దృష్టి సారించాలని పీఓ రాహుల్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ యూనిట్ సభ్యులకు శిక్షణ నిర్వహించగా పీఓ మాట్లాడారు. నిరుద్యోగ యువతకు ఎంఎస్ఎంఈ పథకం ద్వారా చిన్న తరహా పరిశ్రమలను సబ్సిడీ ద్వారా అందిస్తామని తెలిపారు. యూనిట్ సభ్యులు సమష్టిగా పని చేసి నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయాలని సూచించారు. ముడి సరుకును తక్కువ ధరకు కొనుగోలు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని చెప్పారు. ఈ వస్తువులను ట్రైబల్ మ్యూజియం వద్ద విక్రయానికి త్వరలో అనుమతి ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజ్, సీఈఓటీడీ సంస్థ డైరెక్టర్ ఉదయ్‌కుమార్, శిక్షకుడు విజయ్‌కుమార్, జేడీఎం హరికృష్ణ పాల్గొన్నారు మ్యూజియం ఆధునికీకరణ మార్చి నాటికి ట్రైబల్ మ్యూజియం ఆధునికీకరణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని పీఓ తెలిపారు. మ్యూజియం పనుల పరిశీలన అనంతరం మాట్లాడుతూ.. మ్యూజియం సందర్శనకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట ఏటీడీఓ అశోక్‌కుమార్, డీఎస్ఓ ప్రభాకర్‌రావు, డీఈ హరీష్, స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాలరావు, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
స్తంభాద్రి గిరిప్రదక్షిణ.. వైభోగం
● దారి పొడవునా స్వామికి భక్తుల నీరాజనం ● ఆపై నక్షత్ర జ్యోతి దర్శనంఖమ్మంగాంధీచౌక్: అరుణాచలం, యాదగిరిగుట్ట మాదిరిగానే ఖమ్మంకు మూలమైన త్రేతాయుగం నాటి స్వయంభూ దివ్య క్షేత్రం శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. స్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతీనెలా గిరి ప్రదక్షిణ నిర్వహించాలని నిర్ణయించగా మంగళవారం వేలాది మంది భక్తుల నడుమ నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారిని సతీసమేతంగా ఆలయం నుంచి పల్లకీపైకి చేర్చి గుట్ట కిందకు తీసుకొచ్చాక భజనలు, కోలాటాల నడుమ గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. వేలాదిగా హాజరైన భక్తులు నృసింహ నామ స్మరణకు తోడు కీర్తనలు ఆలపిస్తూ పాల్గొన్నారు. స్తంభాద్రి ఘాట్ రోడ్డు గేటు వద్ద ప్రారంభమైన ప్రదక్షిణ ఎన్నెస్పీ రోడ్, కవిత డిగ్రీ అండ్ పీజీ కళాశాల, స్తంభాద్రి మండపం, సరిత క్లినిక్, ఎల్ఐసీ కార్యాలయం మీదుగా తిరిగి గేట్ నుంచి ఘాట్ రోడ్ ద్వారా గుట్టపై ఆలయం వద్దకు చేరింది. ఆతర్వాత ఆలయం పక్కన కొండపై నక్షత్ర జ్యోతిని అర్చకులు వెలిగించారు. ప్రతీనెల స్వాతి నక్షత్రం రోజున సాయంత్రం గిరి ప్రదక్షిణ ఉంటుందని ఆలయ ఈఓ కొత్తూరు జగన్మోహన్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వీరస్వామితో పాటు భక్త మండళ్ల బాధ్యులు, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు. -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యతడీఈఓ వెంకటేశ్వరా చారి మణుగూరు రూరల్ : ప్రకృతిని పరిరక్షించడం అందరి బాధ్యత అని డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి అన్నారు. మండలంలోని సాంబాయిగూడెంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నేచర్ క్యాంప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పులు, ఇతర అంశాలపైనా అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ మేరకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. నేచర్ క్యాంప్ వంటి కార్యక్రమాలతో విద్యార్థులు ప్రకృతి, నీరు, నేల, వాయువులు, మొక్కలు వంటివి పరిశీలించే అవకాశం కలుగుతుందన్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారి ఎస్.చలపతిరాజు, రాష్ట్ర ఎన్జీఓ రిసోర్స్ పర్సన్ రాజశేఖర్ నేచర్ క్యాంప్ గురించి విద్యార్ధులకు వివరించారు. అనంతరం విద్యార్థులకు గ్రీన్ టీ షర్టులు, వాటర్ బాటిళ్లు, టోపీలు, కాటన్ సంచులు, పుస్తకాలు, పెన్నులను పంపిణీ చేశారు. సాంబాయిగూడెం, రామానుజవరం, మణుగూరు, పినపాక, ఏడూళ్లబయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలల విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో మణుగూరు ఎంఈఓ జి.స్వర్జజ్యోతి, జిల్లా ఎఫ్ఏఓ ఎస్.శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం ఎం. శ్రీలత, గైడ్ టీచర్లు వి. కోటేశ్వరరావు, బి.రామిరెడ్డి, కె.రామారావు, టి.కోటేశ్వరరావు, రాము పాల్గొన్నారు. జేవీఆర్ సీహెచ్‌పీని పరిశీలించిన డైరెక్టర్సింగరేణి(కొత్తగూడెం): సత్తుపల్లిలోని జేవీఆర్ సీహెచ్‌పీని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) పీపీ) కె.వెంకటేశ్వర్లు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొగ్గు రవాణా, కోల్ రిసీవింగ్ కాంప్లెక్స్ వద్ద అన్లోడింగ్ సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆ తర్వాత కోల్ ఏరియా, డిశ్చార్జి పాయింట్‌ను కూడా పరిశీలించారు. సీహెచ్‌పీ నుంచి దుమ్ము వెలువడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఏరియా జీఎం శాలేంరాజుతో చర్చించారు. కార్యక్రమంలో అధికారులు సూర్యనారాయణ, కోటిరెడ్డి, రామకృష్ణ, ఆర్.ప్రహ్లాద్, నర్సింహారావు, కె.సోమశేఖర్ పాల్గొన్నారు. -
కేటీపీఎస్ కాల్వలో మొసలి
పాల్వంచరూరల్ : పది రోజుల వ్యవధిలోనే కేటీపీఎస్ కాల్వలో రెండు మొసళ్లు కనిపించడంతో పర్యాటకులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు కూడా మొసళ్లను చూసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పర్యాటక ప్రాంతమైన కిన్నెరసాని జలాశయం నుంచి కేటీపీఎస్ విద్యుత్ కర్మాగారానికి నీరు సరఫరా అయ్యే కాల్వలో మంగళవారం మరో మొసలి కనిపించింది. దాన్ని చూసిన పర్యాటకులు భయపడి అక్కడి నుంచి పరుగెత్తారు. అధికారులు వెంటనే స్పందించి కేటీపీఎస్ కాల్వలో సంచరిస్తున్న మొసలిని పట్టుకుని ఇతర ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. -
ఉపాధి పనుల్లో రక్షణ చర్యలు పాటించాలి
పాల్వంచరూరల్ : రోజురోజుకూ ఎండలు ముదురుతున్నందన ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు రక్షణ చర్యలు పాటించాలని డీఆర్డీఓ విద్యాచందన అన్నారు. మండలంలోని జగన్నాథపురంలో చేపడుతున్న పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. కూలీలు ఉదయమే పనికి రావాలని, ఎండతీవ్రత పెరగకముందే ముగించాలని చెప్పారు. రోజుకు రూ.300 వేతనం వచ్చేలా కొలతల ప్రకారం పని చేయాలన్నారు. ఈజీఎస్ పథకం ద్వారా రైతులు ఫారం పాండ్లు నిర్మించుకోవాలని సూచించారు. పొలాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలంటే ఆయా భూముల రైతుల అనుమతులతో రోడ్డు నిర్మించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్ రెడ్డి, టెక్నికల్ అధికారి రాజు, ఏపీఓ రంగా, శ్రీను, కార్యదర్శులు సాయిరాం, రవికుమార్, ఎఫ్‌ఏలు శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వసతి గృహంలో తనిఖీ.. కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, బీసీ సంక్షేమాధికారి ఇందిర మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికలకు చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నారు. ఆ తర్వాత హాస్టల్లోని మెస్, బాలికల వసతి గదులను పరిశీలించారు. విద్యార్థినులకు హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం బాలికలతో కలిసి భోజనం చేశారు. డీఆర్డీఓ విద్యాచందన -
పర్మిట్లతో పనేంటి ?
దేశవ్యాప్తంగా సరుకుల రవాణాలో లారీలది కీలక పాత్ర. స్టేట్ పర్మిట్, నేషనల్ పర్మిట్ రూపంలో సరుకు రవాణా చేసేందుకు లారీ యజమానులకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది. స్టేట్ పర్మిట్ పొందిన లారీ ఆ రాష్ట్రంలో మాత్రమే సరుకులు రవాణా చేయాల్సి ఉంటుంది. నేషనల్ పర్మిట్ కలిగిన లారీ ఒక రాష్ట్రంలోని సరుకు తీసుకుని మరో రాష్ట్రంలో రవాణా చేయొచ్చు. ఆయా లారీలకు మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాల పరిమితితో ప్రభుత్వం పర్మిట్లు మంజూరు చేస్తుంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంనిబంధన ఉల్లంఘిస్తే నేరమే.. రవాణా శాఖ నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రంలో అనుమతి పొందిన లారీ ఆ రాష్ట్రం దాటి ఇతర ప్రాంతాల్లో లోడింగ్, అన్లోడింగ్ లేదా రవాణా చేస్తూ పట్టుబడితే నేరంగా పరిగణిస్తారు. అలాగే నేషనల్ పర్మిట్ పొందిన లారీ రెండు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా చేయకుండా ఒక రాష్ట్రంలో లోడ్ చేసుకుని అదే రాష్ట్రంలో అన్లోడ్ చేయడం కూడా నేరంగానే పరిగణిస్తారు. ఆర్టీఏ అధికారులు తనిఖీ చేసినప్పుడు ఇలా పట్టుబడిన లారీలకు భారీ మొత్తంలో జరిమానా విధిస్తారు. జిల్లా మీదుగా వందల లారీలు.. భద్రాద్రి జిల్లా ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. ఈ జిల్లా మీదుగా రెండు జాతీయ రహదారులు వెళ్తున్నాయి. వీటితో పాటు సింగరేణి, థర్మల్ పవర్ స్టేషన్లు, నవ లిమిటెడ్, భద్రాచలం పేపర్ బోర్డు, పామాయిల్ పరిశ్రమలూ ఉన్నాయి. దీంతో నేషనల్ పర్మిట్లు పొందిన వందలాది లారీలు జిల్లా మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లో కేంద్ర కార్యాలయాలు ఉన్న పలు కంపెనీలు నేషనల్ పర్మిట్ కలిగిన తమ లారీలను ఈ జిల్లా కేంద్రంగా ఆపరేట్ చేస్తున్నాయి. జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట వద్ద అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఉన్నాయి. ఈ చెక్‌పోస్టుల గుండా వెళ్లే ప్రతీ సరుకు రవాణా వాహనాన్ని ఆపి తనిఖీ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోనే రవాణా.. గోదావరి తీరం వెంట విస్తరించిన ఓ భారీ పరిశ్రమ తన అవసరాల కోసం రవాణా రంగంలో ఉన్న కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానించింది. దేశ వ్యాప్తంగా పేరున్న పలు కంపెనీలు ఈ బిడ్‌లో పాల్గొని టెండర్ దక్కించుకున్నాయి. నాలుగైదు కంపెనీలకు చెందిన సుమారు 150 లారీలు ఈ పరిశ్రమ కేంద్రంగా రవాణా రంగంలో సేవలు అందిస్తున్నాయి. ఇవన్నీ నేషనల్ పర్మిట్ కలిగిన లారీలే. అయితే ఇందులో సుమారు 120 లారీలు నిబంధనలు ఉల్లంఘిస్తూ సదరు పరిశమ్ర ఉత్పత్తులను హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ముఖ్య పట్టణాలకూ రవాణా చేస్తుండడం గమనార్హం. స్థానికులకు నష్టం.. ఇక్కడున్న పరిశ్రమలను నమ్ముకుని అనేక మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని సొంతంగా లారీలు కొనుగోలు చేశారు. బడా కంపెనీలకు చెందిన నేషనల్ పర్మిట్ లారీలు నిబంధనలు అతిక్రమిస్తూ సరుకు రవాణా చేయడంతో జిల్లాకు చెందిన స్థానిక లారీ యజమానులకు రావాల్సిన ట్రాన్స్‌పోర్టు ఆర్డర్లు దారి తప్పుతున్నాయి. దీంతో నెలవారీ కిస్తీలు కట్టడం కూడా కష్టంగా మారిందని స్థానిక లారీ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశంపై వివరణ కోసం జిల్లా రవాణా శాఖ అధికారిని ఫోన్ ద్వారా ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.ట్రాన్స్‌పోర్టు సెక్టార్లో బడా కంపెనీల హవా.. సరుకు రవాణా నిబంధనలు బేఖాతర్ నేషనల్ పర్మిట్ లారీలతో నష్టపోతున్న స్థానికులు చోద్యం చూస్తున్న రవాణా శాఖ కాసులిస్తే సరి..నేషనల్ పర్మిట్ ఉన్న లారీలు జిల్లాలో సరుకు లోడ్ చేసుకుని హైదరాబాద్‌లో అన్లోడ్ చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మరోసారి ఇలాంటి పని చేయకుండా కనీసం మూడు నెలల వరకు స్టేట్ పర్మిట్ తీసుకునేలా చూడడంతో పాటు అదనంగా జరిమానా కూడా విధించాలి. కానీ జిల్లాలో ఉన్న రెండు చెక్‌పోస్టుల్లో ఇలాంటివేమీ జరడగం లేదు. నిబంధనలు ఉల్లంఘనకు ప్రతిఫలంగా లారీకి ఇంత అని రవాణా శాఖ తనిఖీ కేంద్ర సిబ్బంది చేతులను కాసులతో తడిపితే సరిపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పాల్వంచ తనిఖీ కేంద్రంపై లెక్కకు మిక్కిలి ఈ తరహా ఆరోపణలు వస్తున్నాయి. -
లక్ష్య సాధనకు కష్టపడి చదవాలి
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచనకొత్తగూడెంఅర్బన్: పదో తరగతి పరీక్షల్లో ఎన్ని మార్కులొస్తాయని ఆలోచించకుండా కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని అంబేద్కర్ భవన్లో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రేరణ, శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులకు పదో తరగతి అనేది ఒక మెట్టు మాత్రమేనని, అదే ప్రామాణికం కాదని అన్నారు. ఆ తర్వాత ఇంకా అనేక కోర్సులు చదవాల్సి ఉంటుందన్నారు. ఏ తరగతిలో అయినా నిరంతరం కష్టపడితేనే లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెప్పారు. తాను కూడా విద్యార్థి దశలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, పదో తరగతి చదివేటప్పుడు ఇంజనీర్ అవుదామనుకున్నానని, ఆ తర్వాత తన లక్ష్యాన్ని మార్చుకుని పట్టుదలతో చదివి ఐఏఎస్ సాధించానంటూ తన అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. విద్యార్థులు మంచి జీవితం కోసం ప్రేరణ కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలతో పాటు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వసతి గృహాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి నుంచి సమయాన్ని వృథా చేయకుండా బాగా చదివి పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులు, వార్డెన్లకు సూచించారు. అనంతరం విద్యాశాఖ రిసోర్స్ పర్సన్లు సైదులు, నాగరాజశేఖర్, నాగరాజు, విజయ భాస్కర్, శ్యాం చందర్రావు విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో మెళకువలు నేర్పారు. కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూయ, ఏఎస్‌డబ్ల్యూఓలు హనుమంతరావు, సునీత, హెచ్‌డబ్ల్యూఓలు గజ్వేల్ శ్రీనివాస్, పద్మావతి, శశిరేఖ, కౌసల్య, రామనరసయ్య, స్వప్న, కార్యాలయ సిబ్బంది నరసింహారావు, పార్వతి శశికళ, హేమంత్, సాయి పాల్గొన్నారు. నీటి ఎద్దడి లేకుండా చూస్తాంసూపర్బజార్(కొత్తగూడెం): రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చూస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నీటి సమస్య – తీసుకోవాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సాగు, తాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్ష జరుపుతున్నామని చెప్పారు. అర్హులందరికీ రైతు భరోసా అందేలా చర్యలు చేపడుతున్నామని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు అందించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు, మిషన్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నళిని, విద్యుత్ ఎస్ఈ జి.మహేందర్, నీటి పారుదల శాఖ ఈఈ రాంప్రసాద్, పౌరసరఫరాల శాఖల అధికారులు త్రినాధ్‌బాబు, రుక్మిణి, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన్‌స్వామి తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతున్న బస్ క్లీనర్ మృతి
జూలూరుపాడు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన బస్ క్లీనర్ దేశబోయిన శ్రీనివాస్ (56) కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. జూలూరుపాడు ఎస్ఐ బి.రవి కథనం మేరకు.. చుంచుపల్లి మండలం రాంనగర్‌కు చెందిన శ్రీనివాస్ కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్క్లీనర్ (హెల్పర్)గా పనిచేస్తున్నాడు. ఈనెల 13న విద్యార్థులను ఇళ్ల వద్ద దింపేందుకు జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం వచ్చిన శ్రీనివాస్.. బస్‌లో నుంచి విద్యార్థులను దింపుతుండగా టాటా ఏస్ వాహనం వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆయనను కొత్తగూడెం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య రాజకుమారి, కుమార్తె యమున ఉన్నారు. యమున ఫిర్యాదు మేరకు టాటా ఏస్ వాహనం డ్రైవర్ కుర్రం రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి పేర్కొన్నారు. న్యాయం చేయాలని మృతదేహంతో ఆందోళన.. చుంచుపల్లి: శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో పాఠశాల వద్ద ఆందోళన చేసేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రధాన రహదారిపైనే ఆటోలో మృతదేహాన్ని ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. చుంచుపల్లి, జూలూరుపాడు ఎస్ఐలు జోక్యం చేసుకొని ఆందోళన విరమించాలని చెప్పినా కుటుంబ సభ్యులు నిరాకరించారు. న్యాయం చేసే వరకు వెళ్లేది లేదంటూ భీష్మించారు. పాఠశాల యాజమాన్యం స్పందించి మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత పాఠశాల వద్ద కూడా మృతదేహంతో ఆందోళన చేశారు. దీంతో స్థానిక పెద్దలు జోక్యం చేసుకుని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడగా, శ్రీనివాస్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రామాలయ నిర్మాణానికి విరాళాల వెల్లువ
అశ్వాపురం: అశ్వాపురం మండలం మొండికుంటలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎన్ఆర్ఐలు కందిమళ్ల సత్యనారాయణరెడ్డి రూ.25 లక్షలు, జాలె సుధాకర్‌రెడ్డి రూ.10 లక్షలతో పాటు మరికొందరు విరాళాలు ఇచ్చారు. తాజాగా గ్రామానికి చెందిన తిప్పారెడ్డి పిచ్చిరెడ్డి కుమార్తె – అల్లుడు గంగిరెడ్డి శ్రీలత–రాజమోహన్‌రెడ్డి దంపతులు ఆలయంలో ధూపదీప నైవేద్యాల కోసం ఏర్పాటు చేయనున్న మూలనిధికి మంగళవారం రూ.10లక్షలు విరాళంగా అందజేశారు. గతంలో మూడు గర్భాలయాలకు రూ.1.25లక్షల విలువైన సింహద్వారబంధాలు ఇచ్చారు. ఇక మల్లెలమడుగుకు చెందిన చల్లా మధుర–విజయరామరాజు దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేయగా, మేరెడ్డి రామిరెడ్డి–యశోదమ్మ జ్ఞాపకార్థం విగ్రహ ప్రతిష్ఠాపన రోజున 1000 మంది భక్తుల అన్నదానానికి అయ్యే ఖర్చు భరిస్తామని వారి కుమారులు మేరెడ్డి వెంకటరెడ్డి, జనార్దన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, చలపతిరెడ్డి, ఇంద్రసేనారెడ్డి వెల్లడించారు. కాగా, దాతల విరాళాలతో ఆలయ నిర్మాణం చివరి దశకు చేరగా మార్చి 9న విగ్రహ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ – జూలూరుపాడు గ్రామాల మధ్య రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ రవి కథనం మేరకు.. చండ్రుగొండ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన, లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న ఈసం శేఖర్‌బాబు (27) విధుల్లో చేరేందుకు తన బైక్‌పై ఖమ్మం వెళ్తున్నాడు. జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డు దాటిన తరువాత గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో శేఖర్‌బాబు మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఈసం కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవి చెప్పారు. ఇద్దరికి దేహశుద్ధిఅశ్వారావుపేటరూరల్: మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం ఇద్దరికి దేహశుద్ధి చేసి ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వివాహితతో గాండ్లగూడేనికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వివాహిత ఇంటికి వచ్చిన వ్యక్తిని గమనించిన స్థానికులు.. వారిద్దరినీ పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. దీనిపై కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఎస్ఐ యయాతి రాజును వివరణ కోరగా ఘటనపై సమాచారం అందినా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఉద్యోగి నుంచి డబ్బు వసూలుకు పన్నాగం ● మహిళలను వేధించిన కేసు నమోదైందని బెదిరింపులు ఖమ్మంఅర్బన్: సైబర్ మోసాలు రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. అలాంటి ఘటనే సోమవారం వెలుగుచూసింది. ఖమ్మం మమత రోడ్డులో నివాసముండే ఓ వ్యక్తి ఖమ్మం రూరల్ మండలంలోని పంచాయతీరాజ్‌శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు సోమవారం గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ రాగా హిందీ, ఇంగ్లిషు భాషల్లో మాట్లాడిన అవతలి వ్యక్తి బెంగళూరు పోలీసుగా చెప్పుకున్నాడు. సదరు ఉద్యోగి ఫోన్ నుంచి మహిళలకు ఫోన్ చేస్తూ వేధిస్తున్నారని, ఈ విషయమై అందిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైందని చెబుతూ, సెటిల్మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో కంగారు పడిన సదరు ఉద్యోగి తన మిత్రుడు పోలీసు శాఖలో ఉండడంతో సమాచారం ఇచ్చాడు. అయితే, ఇది సైబర్ నేరగాళ్ల పనేనని పోలీసు ఉద్యోగి చెప్పడంతో తనకు వచ్చిన ఫోన్ నంబర్ వివరాలతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
అశ్వారావుపేటరూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను మంగళవారం తెల్లవారుజామున కొత్తగూడెం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అశ్వారావుపేట శివారులో పట్టుకున్నారు. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. మండలంలోని అనంతారం గ్రామ శివారులోని వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎస్బీ పోలీసులు పట్టుకొని పోలీస్‌స్టేషన్ తరలించారు. రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి, డ్రైవర్లు అరవింద్, రాముపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంగం గ్రామంలో ఇసుక ట్రాక్టర్... పాల్వంచరూరల్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని సంగం గ్రామంలో మొర్రేడు వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా మంగళవారం ఎస్ఐ సురేశ్ పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ నాగమళ్ల రవి, యజమాని పాకల వెంకట్రావుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ట్రాక్టర్, జేసీబీ పట్టివేతజూలూరుపాడు: మండలంలోని కరివారిగూడెం సమీపంలోని పెద్దవాగు నుంచి ఇసుకను అక్రమంగా తవ్వి, తరలిస్తున్న జేసీబీ, ట్రాక్టర్‌ను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భూక్యా సక్రాం ఎలాంటి అనుమతి లేకుండా జేఏసీబీతో ఇసుక తవ్వి.. ట్రాక్టర్లో తరలిస్తుండగా పోలీసులు వాహనాలను పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. భూక్యా సక్రాం, ట్రాక్టర్ యజమాని భూక్యా కిషన్, డ్రైవర్ భూక్యా జశ్వంత్, సుజాతనగర్‌కు చెందిన జేసీబీ యజమాని టి.రమేశ్‌తోపాటు రాచబండ్లకోయగూడెంనకు చెందిన జేసీబీ డ్రైవర్ పద్దం హరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవి వెల్లడించారు. -
సాగు భూములు స్వాధీనం
ఇల్లెందురూరల్: మండలంలో సమీకృత గురుకులం నిర్మాణం పేద రైతులకు శాపంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సమీకృత గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇల్లెందులోనూ నిర్మాణానికి అవసరమైన 20 ఎకరాల స్థలం కోసం రెవెన్యూ అధికారులు అన్వేషణ ప్రారంభించారు. పలు చోట్ల భూములు గుర్తించినప్పటికీ అటవీ, రెవె న్యూ శాఖల మధ్య సమన్వయం కుదరలేదు. ఇక సింగరేణి పరిధిలో మినహాయిస్తే ఖాళీగా ప్రభుత్వ స్థలం ఎక్కడా లేదని రెవెన్యూ అధికారులు నిర్ధారించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు లేని ప్రభుత్వ సర్వే నంబర్లు కలిగి ఉన్న సాగు భూములపై కన్నేశారు. జేకేఓసీకి సమీపంలో.. 21 ఇంక్లైన్ భూగర్భ గని ఉపరితలంలో.. మున్సిపాలిటీ డంప్షెడ్డుకు పక్కన దశాబ్దాలుగా గిరిజనేతరుల ఆధీనంలో సాగవుతున్న భూమిని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. గతంలో సాగులో ఉన్న వారికి నేరుగా కాకుండా కార్యాలయం నోటీస్ బోర్డులో, సాగులో ఉన్న వారికి మౌఖికంగా సమాచరం ఇచ్చి వారి వద్ద ఉన్న ఆధారాలు చూపించాలని ఆదేశించారు. తాజాగా మంగళవారం సాగుభూమిలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సమీకృత గురుకులం నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొందని, ఎవరు వచ్చినా చర్యలు తీసుకుంటామని ఫ్లెక్సీలో ఉంది. విషయం తెలుసుకున్న బాధిత 28 మంది రైతులు తహసీల్దార్ రవికుమార్‌ను కలిసి ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేనందున ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ స్పష్టం చేశారు. కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు రైతులు తెలిపారు. -
ఏసీబీ వలలో అటవీ అధికారులు
ఇల్లెందురూరల్ : అటవీ భూముల నుంచి మట్టి తరలించేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఎఫ్ఆర్ఓ, ఎఫ్బీఓ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన ఇల్లెందు మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో పలు గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారడంతో మండలంలోని బోడుతండా, కొమరారం, పోచారం తండా గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ద్వారా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో కలెక్టర్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్కో గ్రామానికి రూ.1.50 లక్షల చొప్పున విడుదల చేశారు. పొలాలకు వెళ్లే రహదారులపై గ్రావెల్ పోసుకోవాలని సూచించారు. దీంతో బోడుతండాకు చెందిన ఓ రైతు ఈ ఏడాది సంక్రాంతి రోజున మట్టి కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కొమురారం ఎఫ్ఆర్ఓ ఉదయ్‌కిరణ్, ఎఫ్బీఓ హరిలాల్ మట్టి తరలింపును అడ్డుకుని జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైతు రూ.15వేలు ముట్టజెప్పి జేసీబీని విడిపించుకున్నాడు. ఆపై మొరం తోలకానికి అనుమతి ఇవ్వాలని అటవీ అధికారులను వేడుకోగా రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. చివరకు బతిమిలాడి రూ.20 వేలు చెల్లించి పనులు ప్రారంభించాడు. అయితే పొలాలకు నీరు పెడుతుండడంతో ఆ దారిలో ట్రాక్టర్ వెళ్లేందుకు వీల్లేక కొన్ని రోజులు పనులు నిలిపివేసి, వారం క్రితం మట్టి తోలుకుంటున్నట్టు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. మిగిలిన రూ.30 వేలు ఇస్తేనే మట్టి తీసుకెళ్లాలని వారు ఖరాఖండిగా చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.30 వేలు తీసుకుని అటవీ రేంజ్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఎఫ్ఆర్ఓ సూచనతో ఎఫ్‌బీఓకు నగదు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎఫ్ఆర్ఓ, ఎఫ్బీఓతీరు మారని అటవీశాఖ.. అవినీతికి పాల్పడి సొంతశాఖ అధికారుల విచారణలో అక్రమాలు వెలుగుచూడటంతో కొందరు అటవీ అధికారులు సస్పెన్షన్లకు గురవుతున్నారు. ఈ తతంగం ఇల్లెందు అటవీ డివిజన్లో వరుసగా చోటుచేసుకుంటోంది. అయినా అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమే అయినా కొందరు అధికారులు ఎంతో కొంత ముట్టజెప్పనిదే పని చేయడం లేదు. తాజాగా కొమరారం ఎఫ్ఆర్ఓ, ఎఫ్బీఓ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడగా.. గత నెలలో మైనారిటీ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిబ్బందికి వేతనం ఇచ్చే విషయంలో రూ.2వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆరు నెలల క్రితం అవినీతికి పాల్పడడంతో అటవీశాఖ ఇల్లెందు డివిజన్ అధికారి కర్నావత్ వెంకన్నను ఏకంగా విధుల నుంచి తొలగించారు. ఇంకా మున్సిపల్, ఇరిగేషన్ శాఖల అదికారులు సైతం ఏసీబీకి చిక్కారు. అటవీశాఖలో సస్పెన్షన్ల పర్వం.. ఏడాది క్రితం జేకే ఓసీ నిర్వాసిత ప్రాంతంలో చోటుచేసుకున్న అక్రమాల ఆరోపణలతో ఇల్లెందు రేంజ్ ధర్మాపురం బీట్ అధికారి చందూలాల్, గుండాల మండలం కాచనపల్లి రేంజ్ పరిధిలోని జగ్గుతండా బీట్ అధికారి హనుమంతు, నారవేప కలప మాయమైన ఆరోపణలతో డీఆర్ఓ బేగం, కాచనపల్లి రేంజ్ పెద్దతోగు బీట్ అధికారి నిర్మల అక్రమాలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురయ్యారు. మూడేళ్ల క్రితం ఇల్లెందు రేంజ్ అధికారి రవికిరణ్, డీఆర్ఓలు సుక్కి, జయరాం, బీట్ అధికారి సైతం సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఇలా పలువురు అధికారులపై వేటు పడుతున్నా.. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు తమ పనితీరును మార్చుకోకపోవడం గమనార్హం. -
ముదిగొండ, తల్లాడ జట్ల గెలుపు
ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాజీవ్‌గాంధీ స్మారక క్రికెట్ టోర్నీలో మంగళవారం ముదిగొండ, తల్లాడ జట్లు విజయం సాధించాయి. ముదిగొండ – ఏన్కూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముదిగొండ 15 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఈ జట్టులో పవన్ 43 బంతులు ఆడి ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏన్కూరు జట్టు విజయానికి సరిపడా పరుగులు చేయకపోవడంతో ముదిగొండ జట్టు గెలుపొందింది. అనంతరం తల్లాడ – జూలూరుపాడు మధ్య మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన తల్లాడ జట్టు 16ఓవర్లలో 121 పరుగులు చేసింది. ఆపై జూలూరుపాడు జట్టు 16ఓవర్లలో 100పరుగులే చేయడంతో ఓటమి పాలైంది. మ్యాచ్‌లను కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తుంబూరు దయాకర్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.క్రిస్టోఫర్‌బాబు, డీవైఎస్ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎం.డీ.మతిన్, కోచ్ ఎం.డీ.గౌస్ ప్రారంభించారు. -
22, 23వ తేదీల్లో కోలిండియా అథ్లెటిక్స్ మీట్
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఈ నెల 22, 23వ తేదీల్లో కోలిండియా స్థాయి(పురుషులు, మహిళలు) అథ్లెటిక్స్ మీట్ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈమేరకు వివరాలను జీఎం పర్సనల్(ఐఆర్‌పీఎం) కవితానాయుడు మంగళవారం నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. కోలిండియా పరిధిలోని 10 బొగ్గు పరిశ్రమల నుంచి దాదాపు 320 మంది క్రీడాకారులు పోటీలకు హాజరుకానున్నారని తెలిపారు. పోటీలను సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ప్రారంభించనుండగా, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. టోర్నీ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణ బాధ్యతలను వివిధ విభాగాల అధికారులకు అప్పగించి, రిఫరీలుగా 26మందిని నియమించామని తెలిపారు. ఈసమావేశంలో వివిధ విభాగాల అధికారులు కె.అజయ్‌కుమార్, రాజేంద్రప్రసాద్, బి.సుశీల్‌కుమార్, టి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.కొత్తగూడెంలో నిర్వహణకు ఏర్పాట్లు -
మిర్చి రైతులకు కన్నీరే
ధరల పతనంతో దిగాలు ●పెరుగుతున్న కూలీ రేట్లు ●తెగుళ్లతో తగ్గుతున్న దిగుబడులుబూర్గంపాడు: మిర్చి రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. ధరల పతనంతో అప్పులు తీరే మార్గం కనిపించక ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నో ఆశలతో సాగు చేసిన మిర్చిని అమ్ముకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. రోజురోజుకూ పడిపోతున్న ధరలతో రైతులు మరింతగా కుదేలవుతున్నారు. ఓ పక్క సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కూలీలు రేట్లు పెంచారు. పంట అమ్మితే కూలీల డబ్బులు కూడా వచ్చే పరిస్థితులు లేవు. మిర్చి అమ్మకాలకు జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం లేదు. ప్రైవేట్ వ్యాపారులు కల్లాల వద్దకు వచ్చి మిర్చి కొనే పరిస్థితులు లేవు. రైతులు ఖమ్మమో, గుంటూరో, జగ్దల్పూరో తీసుకెళితే అక్కడ వ్యాపారులు అడిగిన కాడికి అమ్మాల్సి వస్తోంది. ప్రస్తుతం మిర్చి అమ్మకుండా కొంతకాలం నిల్వచేసుకుందామన్న కోల్డ్ స్టోరేజీలు లేవు. ఈ పరిస్థితులు మిర్చి రైతులను కలవరపెడుతున్నాయి. 25 వేల ఎకరాల్లో సాగు.. ఈ ఏడాది జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగుచేశారు. గతేడాది 40 వేల ఎకరాల్లో సాగు చేయగా.. నల్ల తామరతో నిలువునా ఎండిపోయాయి. రైతులకు ఎకరాకు ఐదారు క్వింటాళ్ల దిగుబడులు కూడా రాక తీవ్రంగా నష్టపోయారు. గతేడాది మిర్చికి క్వింటాకు రూ.20 వేల వరకు ధర పలికింది. దిగుబడులు పూర్తిగా తగ్గినా కొంతమేర ధర ఉండటంతో పెట్టుబడులు సగం మేర తిరిగి వచ్చాయి. గతేడాది నష్టాలతో ఈ ఏడాది జిల్లాలో మిరపసాగు 15 వేల ఎకరాల వరకు తగ్గింది. గతేడాది అప్పులు, ఈ ఏడాది పెట్టుబడులు తిరిగి వస్తాయనే గంపెడాశలతో రైతులు మిర్చి సాగు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నల్లతామర, తెగుళ్లు రాకుండా మిర్చికి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టారు. రసాయనిక మందులతో పాటు ఎక్కువ రేటు ఉన్న ఆర్గానిక్ మందులు కూడా రైతులు మిరపతోటలపై పిచికారీ చేశారు. మిర్చి తొలి విడత కాపులో నల్లతామర ఆశించకపోవటంతో కొంతమేర దిగుబడులు వచ్చాయి. నెలరోజులుగా నల్లతామర విజృంభిచటంతో దిగుబడులు పడిపోతున్నాయి. ఈ ఏడాది ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశముంది. తొలి, మలి విడత మిర్చి కోతలు అయిన తరువాత రైతులు కల్లాల్లో ఆరబోసి గ్రేడింగ్ చేసిన మిర్చిని అమ్ముకునేందుకు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్నారు. మిర్చికి మార్కెట్లో క్వింటాకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు మాత్రమే ధర పలుకుతోంది. గతంలో వ్యాపారులు కల్లాల వద్దనే మిర్చిని కొనుగోలు చేశారు. ఈ ఏడాది ధర లేకపోవటంతో వ్యాపారులు గ్రామాల వైపు రావటం లేదు. దీంతో రైతులు మిర్చి బస్తాలను లారీలు, వ్యాన్లలో దూర ప్రాంతాల మార్కెట్‌కు తీసుకెళ్లాల్సి వస్తోంది. రేట్లు పెంచిన కూలీలు మిర్చి సాగులో ఈ ఏడాది కూలీ రేట్లు బాగా పెరిగాయి. గతంలో మిర్చి కోసిన మహిళా కూలీలకు రోజుకు రూ.300 చెల్లించేవారు. ఈ ఏడాది కూలి రేటు రూ.350కి పెరిగింది. ఒక క్వింటా మిర్చి కోసేందుకు రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. గ్రేడింగ్, బస్తాల్లో నింపుడు, ట్రాన్స్‌ఫోర్ట్‌కు క్వింటాకు మరో రూ.3 వేల వరకు ఖర్చవుతోంది. క్వింటా మిర్చి రూ.10 వేలకు అమ్మితే ఆ డబ్బులు కూలీలకు, ట్రాన్స్ఫోర్ట్కే సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మిర్చి మార్కెట్ లేకపోవటం కూడా రైతులకు శాపంగా మారింది. ప్రస్తుతం ధరలు లేకపోవటంతో కోల్డ్‌స్టోరేజీలలో నిల్వ చేసుకోవాలన్నా జిల్లాలో కోల్ట్ స్టోరేజీలు లేకపోవటం ఇబ్బందికరంగా మారింది. పత్తి, వరి, అపరాల పంటల మాదిరిగానే ప్రభుత్వం మిర్చికి కూడా మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో మద్దతు ధర లభించనప్పుడు ప్రభుత్వాలే రైతుల నుంచి మిర్చిని కొనుగోలు చేసి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. సగం పెట్టుబడి కూడా రాదు.. గతేడాది మిరపతోట వేస్తే ఎకరానికి రూ.లక్ష నష్టం వచ్చింది. ఆ అప్పులు తీర్చేందుకు ఈ ఏడాది మళ్లీ అప్పు చేసి మిరప తోట వేశాను. ఎకరాకు 10క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ, రేటు క్వింటా రూ.10 వేలకు కూడా అడగటంలేదు. గుంటూరు, ఖమ్మం లేదా జగదల్పూర్ తీసుకుపోవాలంటే లారీ కిరాయి పెట్టుకోవాలి. కనీసం సగం పెట్టుబడి కూడా రాదు. – యారం వెంకటరెడ్డి, రైతు, సంజీవరెడ్డిపాలెం రైతులను ఆదుకోవాలి మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మిర్చికి కనీసం రూ.20 వేలు ధర పలికేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. రైతులు పెట్టిన పెట్టుబడుల్లో సగం కూడా రావటం లేదు. ప్రభుత్వం ఆదుకోకుంటే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులున్నాయి. మిర్చి రైతుల తరఫున పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలకు దిగుతాం. – బత్తుల వెంకటేశ్వర్లు, సీపీఎం మండల కార్యదర్శి -
అధిక ధరలకు విక్రయిస్తున్న షాపులపై కేసులు
పాల్వంచ: పట్టణంలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తున్న దుకాణాలపై జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి మనోహర్ మంగళవారం దాడులు నిర్వహించారు. శాసీ్త్రరోడ్లో ఫ్యాన్సీ, ఇతర దుకాణాల్లో వస్తువులను పరిశీలించారు. ఎమ్మార్పీ లేకుండా సామగ్రి విక్రయిస్తున్నట్లు గుర్తించి రెండు కేసులు నమోదు చేశారు. రెండు నోటీసులు జారీ చేశారు. జరిమానా విధించనున్నట్లు ఆయన తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు పాల్వచరూరల్: దాడికి పాల్పడిన ముగ్గురిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. మండలంలోని నాగారంకాలనీకి చెందిన బోడ వీరన్న, చంటి, దేవి సోమవారం రాత్రి దాడి చేసి గాయపరిచారని బానోతు మంచ్యా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ పేర్కొన్నారు. -
ఇంటి నిర్మాణానికి అడ్డుకట్ట
దుమ్ముగూడెం: మండలంలోని పర్ణశాలలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాన్ని దేవస్థానం అధికారు లు అడ్డుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముత్తి గురుమూర్తి సర్వే నంబర్–1లోని ఐదు సెంట్ల భూమిలో ఇంటి నిర్మాణం చేపడుతుండగా పర్ణశాల దేవస్థా నం అధికారులు.. ఆ స్థలం ఆలయానికి సంబంధించినదని నిర్మాణాన్ని అడ్డుకున్నారు. గురుమూర్తి 2010లో ఆ స్థలాన్ని ఇదే గ్రామానికి చెందిన చాట్ల రామకృష్ణారెడ్డి వద్ద కొన్నానని చెబుతున్నాడు. కాగా దేవస్థానం అధికారులు ఈ స్థ లానికి సంబంధించిన పట్టా చూపించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు ఆర్ఐ నరసింహారావు ఘటనా స్థలానికి చేరుకుని దేవస్థానం అధికారులు చూపించిన ఆధారాలను పరిశీలించి.. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్ద ని సూచించారు. బాధితుడి వద్ద సరైన ఆధారా లు ఉంటే తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించాలని, అప్పటివరకు ఇరు వర్గాల వారు ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని పేర్కొన్నారు. ఈత కొట్టిన ఎమ్మెల్యే..!ఇల్లెందు: పట్టణంలోని లేక్‌వ్యూ పార్క్‌లో నిర్మించిన కొలనులో స్విమ్మింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య ఈత కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ డి.వెంకటేశ్వరరావు, పలువురు కాంగ్రెస్ నేతలు, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. ఖేలో ఇండియా ఆర్చరీ పోటీల్లో ప్రతిభ దమ్మపేట: బెంగళూరులో ఇటీవల నిర్వహించిన ఖేలో ఇండియా సౌత్ జోన్ ఆర్చరీ పోటీల్లో దమ్మపేట మండలం పట్వారిగూడెంనకు చెందిన 9వ తరగతి విద్యార్థిని కనకం లోహితశ్రీ ప్రతిభ కనబరిచి కాంస్య పతకం దక్కించుకుంది. ఆమె రికర్వ్ విభాగలో పతకం గెలుచుకోగా పలువురు అభినందించారు. ప్రస్తుతం లోహితశ్రీ హైదరాబాద్ హకీంపేటలోని ప్రభుత్వ క్రీడా పాఠశాలలో చదువుతోంది.26నుంచి రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు చింతకాని: మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26నుంచి మండలంలోని నేరడలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలు మూడు రోజు ల పాటు జరుగుతాయని నేతాజీ యువజన సంఘం కార్యదర్శి దూసరి గోపాలరావు మంగళవా రం ఒక ప్రకటనలో తెలిపారు. జట్ల బాధ్యులు రూ.500 ఎంట్రీ ఫీజు చెల్లించి ఈనెల 25వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచేవారికి వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30వేలతో పాటు ఎనిమిదో స్థానం వరకు నిలిచే జట్లకు సై తం నగదు బహుమతులు అందజేస్తామని తెలి పారు. వివరాలకు 70939 00119, 93945 71739, 80084 92173 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. సత్యనారాయణపురంలో చోరీచర్ల: మండలంలోని సత్యనారాయణపురంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన ఎన్.రాముకు చెందిన ఇంట్లో ఎవ్వరూ లేని సందర్భంలో దొంగలు చొరబడి బీరువాను ధ్వంసం చేశారు. తలుపులు తెరిచి ఉండడాన్ని ఇంటి పక్కవారు గుర్తించి హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు విషయం చెప్పారు. సీఐ రాజువర్మ, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఏ మేరకు చోరీ జరిగిందనే విషయం కుటుంబ సభ్యులు వస్తే తెలుస్తుందని పోలీసులు చెప్పారు. క్లూస్‌టీం కూడా వచ్చి ఇంటి పరిసరాలను పరిశీలించింది. ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని జ్యూయలరీ దుకాణాల్లో దొంగలు చొరబడి చోరీకి పాల్పడగా అదేరోజు ఈ ఘటన జరిగిందా? తరువాత రోజు జరిగిందా? అనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మిట్టగూడెంలో.. అశ్వాపురం: మండలంలోని మిట్టగూడెం గ్రా మంలో ఒంకోజు బ్రహ్మచారి ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. బ్రహ్మచారి కుటుంబ సభ్యులు సూర్యా పేట జాతరకు వెళ్లగా రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో చొరబడి చోరీ చేశారు. ఏమేమి పోయాయో తెలియాల్సి ఉంది. -
కార్గోతో కాసులు
టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో కార్గో కాసుల పంట పండిస్తోంది. వినియోగదారుల ఆదరణ చూరగొంటోంది.ఒకేసారి అనేక చోట్ల.. 8లోఓవైపు ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్స్ పనిగా ఖాకీల విచారణ కొనసాగుతుండగానే పాల్వంచ పట్టణంలో సెల్ఫోన్లు, బంగారు చైన్లను దోచుకెళ్లే చిల్లర దొంగతనాలు మొదలవడంతో సమస్య జఠిలంగా మారింది. నిన్నా మొన్నటి వరకు టౌన్లలో రెచ్చిపోయిన దొంగలు ఆదివారం రాత్రి ఏజెన్సీ మండలాలపై ప్రతాపం చూపించారు. ములకలపల్లి మండలం జగన్నాథపురంలో ఓ వ్యక్తి ఇంట్లో చోరీ యత్నం జరిగింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే దుమ్ముగూడెం, చర్ల మండలాల్లో జ్యూయలరీ షాపులు లక్ష్యంగా దోపిడీ యత్నాలు జరిగాయి. తాళాలు పగులగొట్టి షాపుల్లోకి వెళ్లేందుకు దొంగలు యత్నించారు. క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగి ఇక్కడ ఆధారాలు సేకరిస్తున్నాయి. -
టేకులపల్లిలో మిర్చి కొనుగోళ్లు
టేకులపల్లి: ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో టేకులపల్లి సబ్ యార్డులో సోమవారం మిర్చి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి జాల నరేందర్, ఇల్లెందు మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి వి.సుచిత్ర మాట్లాడుతూ టేకులపల్లి మండలంలో మిర్చి పంటకు ఆదరణ ఉందన్నారు. ఇక్కడి రైతులు ఖమ్మం, మహబూబాబాద్ తదితర పట్టణాలకు తీసుకెళ్లి మిర్చి విక్రయిస్తే సుమారు రూ.3 వేల వరకు ఖర్చవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా టేకులపల్లిలో కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. తొలిరోజు క్వింటాల్‌కు జెండా పాట రూ.13,300గా నమోదైంది. అత్యల్పంగా రూ.12,100, మోడల్ రేటు రూ.12,500, తాలు మిర్చి ధర రూ. 6500గా నమోదయ్యాయి. తొలిరోజు 145 బస్తాల మిర్చి అమ్మకానికి వచ్చింది. అనంతరం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతులను శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అధికారులు నరేష్కుమార్, వి.శ్రీనివాస్‌రావు, జి.రంజిత్, సీహెచ్ లక్ష్మయ్య, కార్తీక్, మునీర్, శ్రీనివాస్‌రావు, మోహన్‌రావు, హరికృష్ణ, మధు, విజయ, లక్ష్మి, ట్రేడర్లు పాల్గొన్నారు. -
ఉపవాసంతో ఆకలి విలువ తెలుస్తుంది..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఉపవాసాల ద్వారా ఆకలి విలువ తెలుసుకుని పేదవారిని ఆదుకునే గుణం అలవడుతుందని జేఐహెచ్ కేంద్ర కమిటీ సభ్యుడు మౌలానా హమీద్ మహ్మద్‌ఖాన్, ముఫ్తీ మౌలానా ఇస్మాయిల్ అన్నారు. జమాతే ఇస్లామీ హింద్ రుద్రంపూర్, రామవరం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం రామవరంలోని జమా మసీద్‌లో ఇస్తేఖ్బాల్–ఏ–రంజాన్(రంజాన్ మాసానికి స్వాగతం) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసంలో శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వం పెంచి, మానవులందరూ కలిసిమెలిసి జీవించేలా అల్లా దీవించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ యజ్ఞాని, షేక్ అబ్దుల్ బాసిత్, అబ్దల్ సత్తార్, బాబా, అరీఫ్, హఫజుద్దీన్, ఖమర్, జాకీర్, ఆలం, షమీం, పర్వీన్, నష్రా పాల్గొన్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల్లో కొన్ని ఇలా.. ●వారసత్వంగా వచ్చిన భూమిని సోదరుడి కుమారుడు ఆక్రమించాడని, విచారణ జరిపి తనకు ఇప్పించాలని దమ్మపేట మండలం బాలరాజుగూడెం గ్రామానికి చెందిన శ్రీరాముల బుచ్చిబ్రహ్మం ఫిర్యాదు చేశాడు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ దమ్మపేట తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు. ●అనారోగ్యం ప్రజాపాలన గ్రామసభకు హాజరుకాలేదని, దీని వల్ల ఉచిత్ విద్యుత్, గ్యాస్ సబ్సిడీ కోల్పోయానని, తనకు ఆరు గ్యారంటీల పథకం వర్తించేలా చూడాలని కొత్తగూడెం మున్సిపాలిటీ చిట్టిరామవరానికి చెందిన బానోత్ రాములు కోరగా.. చర్యల నిమిత్తం విద్యుత్ శాఖాధికారులకు ఎండార్స్ చేశారు. ●అక్షర టౌన్షిప్ కొత్తగూడెం బ్రాంచిలో తాను డిపాజిట్ చేసిన సొమ్మును ఇప్పించాలని కొత్తగూడేనికి చెందిన ఆకుల నాగేశ్వరరావు ఫిర్యాదు చేయగా, దరఖాస్తును ఎస్పీకి ఎండార్స్ చేశారు. పీఎం ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానంసూపర్బజార్(కొత్తగూడెం): అర్హులైన విద్యార్థులు ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు నెలవారీ భత్యం రూ.5 వేలతోపాటు మరో రూ.6 వేలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్ కాలవ్యవధి 12 నెలలని, 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండి, కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండనివారు అర్హులని వివరించారు. 10, 12, తరగతులు, ఐటీఐ పాలిటెక్నిక్, డిప్లమా, డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండాలని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు https://pminternship.mca.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 12 నుంచి మార్చి 11 వరకు దరఖాస్తు గడువని పేర్కొన్నారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800116090కు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
అధునాతనంగా నిర్మించినా..
కొత్తగూడెంఅర్బన్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించి మూడు నెలలవుతున్నా ఇంకా వినియోగంలోకి రాలేదు. కొత్త భవనంలోకి వెళ్లబోమని పాఠకులు చెబుతుండటంతో పాత భవనంలోనే కొనసాగిస్తున్నారు. పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్లో దశాబ్దాల కాలం నుంచి జిల్లా గ్రంథాలయం కొనసాగుతోంది. ఇక్కడికి జిల్లా కేంద్రంతోపాటు టేకులపల్లి, పాల్వంచ, జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల నుంచి పాఠకులు వస్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో న్యూస్ పేపర్లు, పోటీ పరీక్షల పుస్తకాలను చదువుకుంటారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో పాఠకుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పాఠకుల సౌకర్యం కోసం ఇటీవల బీఆర్ఎస్ కార్యాలయం భవనం పక్కన రూ.1.50 కోట్లతో గ్రంథాలయానికి అధునాతన హంగులతో భవనం నిర్మించారు. గతేడాది నవంబర్ నెలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం నూతన భవనంలోకి పుస్తకాలను తరలిస్తారని అందరూ భావించారు. కానీ పాఠకులు కొత్త భవనంలోకి వెళ్లబోమని తేల్చి చెప్పడంతో గ్రంథాలయ నిర్వాహకులు కూడా చేసేది ఏమి లేక పాత భవనంలోనే జిల్లా గ్రంథాలయాన్ని కొనసాగిస్తున్నారు. సౌకర్యాలకు ప్రతిపాదనలు గ్రంథాలయ కొత్త భవనంలో ఏసీలు, ముందు ప్రాంగణంలో షెడ్లు, మొక్కలు, చెట్లు, గ్రీనరీ లేవు. దీంతో అక్కడికి వెళ్లేందుకు పాఠకులు విముఖత చూపుతున్నారు. రానున్న వేసవి కాలంలో, అందులోనూ కొత్తగూడెంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నూతన భవనంలో ఏసీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉదయం, సాయంత్ర వేళల్లో పాఠకులు చెట్ల కింద కూర్చుని చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు. నూతన భవనం దగ్గర అసలు చెట్లే లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు పాఠకులు ఇష్టపడటంలేదు. దీంతోపాటు భవనం ముందు భాగంలో ఆహ్లాదం కోసం గ్రీనరీ కూడా ఏర్పాటు చేయాలని పాఠకులు కోరుతున్నారు. దీంతో గ్రంథాలయ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపాదనలు సమర్పించాక ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఏసీలు, గ్రీనరీ వంటి ఏర్పాటు సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. లేకపోతే పోస్టాఫీసు సెంటర్లోని పాత భవనంలోనే గ్రంథాలయం కొనసాగించాల్సి వస్తుంది. ప్రస్తుతం గ్రంథాలయానికి ఉదయం, సాయంత్ర వేళ్లల్లో రోజూ 150 మంది వరకు పాఠకులు వస్తున్నారు. నోటిఫికేషన్ల సమయంలో వీరి సంఖ్య 400కు చేరే అవకాశం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే సమయంలోగా నూతన భవనంలో సౌకర్యాలు కల్పిస్తే పాఠకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. నూతన గ్రంథాలయ భవనం వినియోగంలోకి తీసుకొచ్చే విషయమై జిల్లా గ్రంథాలయ సెక్రటరీని వివరణ కోరేందుకు ఫోన్లో సంప్రదించగా.. వారు స్పందించలేదు. వినియోగంలోకిరాని గ్రంథాలయ కొత్త భవనం షెడ్లు, గ్రీనరీ, ఏసీలు లేకపోవడంతో పాఠకుల విముఖత విధిలేక పాత భవనంలోనే లైబ్రరీ కొనసాగిస్తున్న అధికారులు రూ.1.50 కోట్లతో నిర్మించిన భవనం నిరుపయోగమే -
కనకగిరి అడవుల్లో జీవ వైవిధ్యం
ఖమ్మంవన్‌టౌన్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్న కనకగిరి రిజర్వు ఫారెస్ట్ జీవ వైవిధ్యానికి చిరునామాగా మారింది. వన్యప్రాణి నిపుణులు ఆదివారం ఈ అడవిలో 12 గంటల పాటు కాలి నడకన పర్యటించారు. ఈ సందర్భంగా బ్లూ – ఇయర్డ్ కింగ్‌ఫిషర్ (లకుముకిపిట్ట)ను గుర్తించారు. జిల్లాలోని సత్తుపల్లి డివిజన్ తల్లాడ పరిధిలోని కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో చేపట్టిన ఈ వాక్‌లో వృక్షాలు, జంతువులకు సంబంధించిన వైవిధ్యాన్ని కనుగొన్నారు. 12 మంది వన్యప్రాణి నిపుణులు నాలుగు కిలోమీటర్ల అడవిని అన్వేషించి.. 65 పక్షిజాతులు, 5 క్షీరద జాతులు, 5 చేప జాతులను డాక్యుమెంటరీ రూపంలో రికార్డు చేశారు. ఇక మిగిలిన పక్షులలో బ్లాక్–వింగ్డ్ ష్రైక్, రూఫస్ వడ్రంగిపిట్ట, వైట్–రంప్డ్ మునియా, బ్లూ–థ్రోటెడ్ బ్లూ ఫ్లైక్యాచర్, బ్లాక్–రంప్డ్ షామా ఉన్నాయి. ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, వన్యప్రాణుల రకాలు ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామంగా ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైల్డ్ తెలంగాణ నుంచి ప్రదీప్ ప్రాజ్, మీరాకి ఆర్గనైజేషన్ నుంచి నవీన్ బాలా, ఎ.సుజిత్, వి ఊల్ఫ్ ఫౌండేషన్ నుంచి పి.హరికృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్టుబడి పెడితే రెట్టింపవుతుందని టోకరా
● పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించిన బాధితులు ● విచారణ చేపట్టిన పోలీసులు ఖమ్మంఅర్బన్/కారేపల్లి: దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఓ ఆన్లైన్ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు డబ్బు వస్తుందని ఆశ చూపారు. మరో ఇద్దరిని చేర్పిస్తే కమీషన్ రూపంలో డబ్బు వస్తుందని ఊదరగొట్టారు. మధ్యలో గోవా, బ్యాంకాక్ లాంటి ప్రదేశాలకు తీసుకెళ్తామని నమ్మబలికారు. తీరా చూస్తే ఉన్న డబ్బు పోయి మోసపోయామని గుర్తించి, చివరికి పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కారేపల్లిలో ఓ ల్యాబ్ నిర్వాహకుడు రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టగా.. టేకులపల్లికి చెందిన ఉపేందర్, కారేపల్లికి చెందిన రవికుమార్, రామనర్సయ్యతో పాటు మరో పదిమంది ఖమ్మానికి చెందిన ముగ్గురు వ్యక్తుల ద్వారా డిపాజిట్ చేసి, మోసపోయామని పోలీసులను ఆశ్రయించారు. కారేపల్లి ఎస్ఐ ఎన్.రాజారాంను వివరణ కోరగా.. మెటాప్లస్కు సంబంధించిన బాధితులు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ చేపట్టామని చెప్పారు. ఇదే రకంగా మోసపోయిన కొందరు బాధితులు నగర ఏసీపీని కలిసి వివరించినట్లు తెలిసింది. ఏసీపీ సూచన మేరకు కొందరు బాధితులు ఖమ్మంఅర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఐ భానుప్రకాష్‌ను వివరణ కోరగా కొందరు ఫిర్యాదు చేయగా విచారణ చేట్టామని, గోవా ట్రిప్‌నకు కూడా తీసుకెళ్లినట్లు సమాచారం ఉందని, వీటన్నింటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు విషయం తెలుస్తుందని వెల్లడించారు.