
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెల్త్ బులిటెన్ విడుదల చేయాలంటూ సీపీఐ కార్యకర్తలు నిమ్స్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సాంబశివరావును పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చేర్చి రెండురోజులవుతున్న ఇప్పటివరకు సాంబశివరావు హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదని సీపీఐ నేతలు మండిపడ్డారు. వెంటనే హెల్త్ బులిటెన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కును పోలీసులు పూర్తిగా కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఇది కోరి కోట్లాడీ సాధించుకున్న తెలంగాణ అన్న విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ... నిరసన తెలిపితే పోలీసులు ఉద్యమాన్ని అడ్డుకుంటాం అంటే మరింత ఉదృతం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ నిరసన చేసినా అక్కడ అడ్డుకుంటామని పోలీసులు అనుకుంటే ఎంతమందిని అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెప్పారు.