కొత్తగూడెం రాజకీయాల్లో మునుగోడు ఎఫెక్ట్ కనిపిస్తోందా? ఈ ఉపఎన్నిక తెలంగాణలో పొత్తు రాజకీయాల్ని సమూలంగా మార్చబోతోందా? జరుగుతున్న పరిణామాలు కొత్తగూడెం గులాబీ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అయితే అక్కడి పాలిటిక్స్ ఎందుకు అంతలా హీటెక్కాయో పరిశీలిస్తే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యునిస్టులకు కంచుకోట. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్‌ఎస్ కూడా బలం పుంజుకుంది. ప్రస్తుతం ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే టికెట్ లభిస్తుందనే ధీమాతో వనమా ఉన్నారు. అయితే ఈసారి టికెట్ తనకే ఇస్తారంటూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంగళరావు ప్రచారం చేసుకుంటున్నారు. గులాబీ పార్టీలోనే ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతుంటే.. తాజాగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వచ్చే ఎన్నికల్లో గూడెం సీటు నాదే అంటున్నారట. దీంతో అధికార పార్టీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది.
గత ఎన్నికల్లో తెలంగాణలో రకరకాల పొత్తులు నడిచాయి. అయితే ఈ సారి ఏడాదిముందే పొత్తుల విషయంలో క్లారిటీ వస్తున్నట్లుగా కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎంలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌తో పొత్తు కొనసాగుతుందని సీపీఐ నాయకులు అంటున్నారు. అలా కుదిరితే సీపీఐ వాళ్లు కోరుకునే సీట్లలో కొత్తగూడెంకు అగ్రప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఇక్కడి నాయకుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తానే కొత్తగూడెంలో పోటీ చేసేదని టీఆర్‌ఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ నాయకుడి ఆర్భాటం, ప్రచారంతో టీఆర్‌ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి.
చదవండి: (అది సక్సెస్ చేస్తే.. వారిరువురికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌కు గ్రీన్‌సిగ్నల్!)
ఇదిలా ఉంటే, వచ్చే ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసేది తానే అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా. ఈమేరకు ఆయన శపథం కూడా చేశారు. టికెట్ కోసం ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, పొత్తుల్లో తెచ్చుకుంటామని కథలు చెప్పినా అంతిమంగా పోటీచేసేది తానేనని ఘంటాపథంగా చెబుతున్నారు వనమా. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ రాదంటూ కొందరు సోషల్ మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు జలగం వెంగళరావు సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. వనమా ఎంత చెబుతున్నా, సీపీఐ ఎంత డిమాండ్ చేసినా చివరి నిమిషంలో టికెట్ తనకే ఇస్తారని జలగం గట్టిగా చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న జలగం నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు మాత్రం హాజరుకావడం లేదు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా పాల్గొనే కార్యక్రమాలవైపు అయితే కన్నెత్తి కూడా చూడటం లేదు. గత ఎన్నికల్లో సీటు తనకు రాకుండా తన్నుకుపోయిన వనమా అంటే జలగంకు కోపం. అందుకే ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం పెరిగింది.
సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే టికెట్ కోసం కొట్టుకుంటుంటే ఈ ఎపిసోడ్‌లోకి సీపీఐ ఎంట్రీ ఇచ్చింది. పొత్తుల్లో భాగంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా 25సీట్లు అడగాలని భావిస్తోంది. అందులో టాప్-3లో కొత్తగూడెం ఉంటుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఇంకా మునుగోడు ఉప ఎన్నిక జరగలేదు. టీఆర్‌ఎస్‌తో పొత్తు ఖరారు కాలేదు. అప్పుడు సీపీఐ అభ్యర్థిగా ప్రకటించుకున్న కూనంనేని సాంబశివరావు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. గులాబీ నేతలేమో సీటు కోసం పోటీపడుతూ శపథాలు చేస్తుంటే.. నేనున్నానంటూ సీపీఐ ఎంట్రీ ఇవ్వడంతో కొత్తగూడెం రాజకీయాలు అప్పుడు హీటెక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment